వినీల కవితలు మూడు

1

నా పరిమళాన్ని పసిగట్టిందేమో

 

హద్దులు లేని ఆకాశం, నాకు దగ్గరగా వచ్చిన వేళలో…

కదలిక లేని నా శరీరం మేలుకుంది.

దారే తెలియని వర్షపు చినుకు, నా కనురెప్పలను తాకిన క్షణంలో…

నేనే ఎరుగని నా అందం నవ్వుకుంది.

స్పర్శే లేని కురులు, నా బుగ్గని తడిమిన తీరులో…

నన్ను తాకాలని గాలికున్న తపన తెలిసింది.

 

తన సువాసన తనకు తెలియని పువ్వు విచ్చుకున్న సమయం లో…

నా పరిమళాన్ని పసిగట్టిందేమో అనిపించింది.

 

ఏ శబ్దం లేని వెన్నెల రాత్రి, నన్ను అలముకున్న చీకటి లో…

నా ప్రేమను రుచించిన ప్రకృతి ఇక విశ్రాంతి తీసుకుంది.

*

దాహం తీర్చే ఓ నీటి కుండ

 

అంతమయ్యే ఈ సృష్టి ముందు,

అంతులేని నీ వితండ వాదం ఎంత?

 

అఖండమైన ఈ విశ్వం ముందు,

ఇసుక రవ్వంత మన పృథ్వి ఎంత?

 

గర్జించే ఆ ఉరుముల ముందు,

గుడి గంటల సత్తువ ఎంత?

 

గాండ్రించే పెను తుఫాను ముందు,

నువ్వు తలచే నీ దైవం ఎంత?

 

తారలు వెదజిమ్మే ఆ తేజస్సు ముందు,

త్రాసు లోని నీ బంగారం ఎంత?

 

గల్లంతు చేసే ఆ సముద్రపు నీటి ముందు,

పవిత్రమైన నీ తీర్థం ఎంత?

 

భగ్గుమని రగిలే ఆ అడవి మంటల ముందు,

భవ్యమైన నీ మతం ఎంత?

 

దాహం తీర్చే ఓ నీటి కుండ ముందు,

నీ కులం ఎంత, కోపం ఎంత…

*

ఇంకో రెండు నిమిషాలు

 

అందరిలో నీ చేతుల్లో చేయి వెయ్యలేకున్నా,

ఎవరూ లేనప్పుడు నీ చూపుల్లో బందీ అవుతున్నా…

 

గుండెకు హత్తుకుని నువ్వు ఎంత ఇష్టమో వర్ణిస్తున్నా,

ఏమి తెలియనట్లు నటించే నీ ముద్దు ముద్దు ముఖాన్ని చూసి మురిసిపోతున్నా…

 

మాటల్లో చెప్పలేక, పెదాలతో నీ ముఖమంతా తడుముతున్నా,

కాదనలేక నువ్వూ ముసి ముసి గా నవ్వుతున్నావు అని గమనిస్తున్నా…

 

ఇక వెళ్ళాలని సమయం తోస్తున్నా,

నిను నా వెంటే ఉంచుకోవాలని మనసు పడే తపన…

ఇంకో రెండు నిమిషాలు అంటూ,

నా చూపులు నీ నవ్వుని నా గుండెల్లో భద్రపరుస్తున్నాయి…

*

నా పేరు వినీల. మా అమ్మ పెట్టింది ఈ అందమైన పేరు నాకు. ఒక ప్రభుత్వ టీచర్ కూతురిగా బాల్యం అంతా సైన్స్ మీద కుతూహలంతో, ఆర్ట్, కవిత్వం, పుస్తకాల మీద ఆసక్తితో పెరిగాను. ఎం అవుతానో తెలియని ఎన్నో గందరగోళాల తరువాత ఈరోజు ఒక PhD విద్యార్థి గా హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీలో ఉన్నాను. తెలుగు వారు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడుకునే ఈ రోజుల్లో, అభిప్రాయాలు,  భావాలు తెలుగులో ఎంత అందంగా ఉంటాయో అని మురిసిపోయే నేను అప్పుడప్పుడు కవితలు  రాయడం మొదలు పెట్టాను. పుట్టిన క్షణం నుంచి చివరి వరకూ మనకు తోడుగా ఉండేది ప్రకృతి మాత్రమే. అందుకే ఏది రాసినా, ఏది ఆలోచించినా కూడా ఆ ప్రకృతి తో పోల్చడం నాకు ఇష్టం. ఒకరకంగా కవిత్వం మీద ఆసక్తి పెంచిందే ఈ ప్రకృతి. సంతోషం అయినా, బాధ అయినా, మనకు ఎప్పుడూ తోడుగా ఉంటూ ప్రశాంతతను ఇస్తుంది కవిత్వం. మనల్ని మనం తెలుసుకునే అంత లోతుకి తీసుకెళ్తుంది కవిత్వం. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఒక రేసు లాంటి ఈ ఊరుకుల పరుగుల జీవితం లో, మనకంటూ ఒక స్పేస్ చేసుకొని అందులో మన మనసుకు ప్రశాంతతను ఇచ్చే ఏ పనైనా చెయ్యడం నేర్చుకోవాలని నా అభిప్రాయం.

వినీల

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు