విధ్వంస జీవిత రాగాలను వినిపించే ‘యక్షగానం’

రామచంద్రం చివరి కోరిక తీరిందా? నాటకం వేసిన తదుపరి ఏమైంది? తెలియాలంటే మనం యక్షగానంలో మునిగి తేలాల్సిందే.

“వస్తా వట్టిదే

పోతా వట్టిదే

ఆశ ఎందుకంటా..?”

ఒకప్పుడు గ్రామాలను ఉర్రూతలూగించి, పల్లె ప్రజలకు ఎంతో వినోదాన్ని పంచిన బుర్రకథ, హరికథ, వీధి బాగోతాలు, యక్షగానాలు, చిరుతల రామాయణం, సాధనా శూరుల ఆట మొదలైన గ్రామీణ జానపద కళలన్నీ ఇవాళ కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ కళాకారులంతా పుట్ట బెదిరినట్లు చెదిరిపోయి చెట్టుకొకరు, పుట్టకొకరుగా అయ్యారు. యక్షగానాలు ఆడే సంచార జాతులన్నీ ఏమయ్యాయో! ఎక్కడా కనిపించడమే లేదు. వాళ్ళ పిల్లలేమయ్యారో! ఇప్పుడేవృత్తులు చేస్తున్నారో! ఎక్కడ స్థిర నివాసమేర్పర్చుకున్నారో! అంతా కాల మహిమ.

డిజిటల్ సముద్రంలో మునిగి తేలుతున్న ఇప్పటి తరాలు జానపద కళలంటే ఏమిటని ప్రశ్నిస్తారు కాబోలు. మూడు దశాబ్దాల కిందటి దాకా  కూడా గ్రామీణ ప్రజలకు వినోదాన్ని, మనోవికాసాన్ని కలిగించినవి జానపద కళలేనంటే ఆశ్చర్యపోతారు కావచ్చు. కాని జీవిత తాత్వికత జానపద కళారూపాల్లోనే దాగి ఉంది. జానపద కళా రూపాలతో ఎంతో సాంస్కృతిక జీవితం ముడిపడి ఉంది. జానపద కళారూపాలన్నీ సామూహిక ప్రదర్శనకు ప్రతీక.  ఏ కళారూపమైనా ఎంతో రసపోషణ గావించి, ఎన్నో జీవితాలను వెలిగిస్తుంది. వీటిలో యక్షగానం కూడా ఒకటి.

ఇక్కడ క్లిక్ చేసి, యక్షగానం కథ చదవండి.

దాసరి రామచంద్రం మేళ్లమంటే బాగోతాలాడడంలో మంచి పేరుండేది. కాని అతడ్ని ఇప్పుడు ఎవరూ కానడం లేదు. రామచంద్రం తమ్ముడు కూడా వయసులో ఉన్నప్పుడు అన్న మేళంలోనే నాటకాలు ఆడేవాడు. కాల్వ పక్కన భూములున్న పటేలు దాసరి రామచంద్రంను పిలిచి కలలో మైసమ్మ తల్లి కన్పించి తనకు గుడి కట్టీయమన్నదని చెప్పిండు. మంచిది పటేలా ఆ పని నాకొదిలి పెట్టుండ్రి నేను చూసుకుంటా అన్నాడు. అనుకున్నట్టుగానే శివరాత్రి ఎల్లినంక రాగి చెట్టు, వేప చెట్టు కల్సి పెరిగిన చెట్టు కింద మూడు రాళ్ళు పెట్టి పసుపు కుంకుమ రాసి మైసమ్మ తల్లిని కొల్వుదీర్చిండ్రు. దాసరి పూలమ్మకు దేవతబూని శిగమచ్చింది. “నెల రోజుల్లో మీ బతుకులు మార్తయి చూడర్రా. నా మహిమేదో చూపిస్తా.” అంటూ ఊగి ఊగి కూలబడింది.

బైండ్లోల్లు జమిడిక వాయించుకుంట మైసమ్మ కథ చెప్పిండ్రు. మైసమ్మ కోరిన వరాలు ఇస్తుందని ప్రచారం జరిగింది. భక్తుల రద్దీ పెరిగింది. వారానికి ఒక్కసారి జాతర మొదలైంది. భక్తుల మొక్కులు, ముడుపులు ఎక్కువయినై. రాను రాను భక్తుల సంఖ్య ఎక్కువవుతుండడంతో గురువారం, ఆదివారం వారానికి రెండు సార్లు జాతర సాగబట్టింది. దుకాండ్లు పెరిగినై, యాటలు తెగుడు, దావత్ లు పెరిగినయి. సారా దుకాండ్లు, వైన్స్ షాపులు పెరిగినాయి. పటేలు భూములకు ధర వచ్చింది.  వ్యాపారం పెరిగింది.

ఓ రోజు జాతర అయిపోయినంక దాసరి రామచంద్రం తన కొడుకులతోని తన అనుభవాలను పంచుకున్నాడు.  చిన్ననాడు నాటకాలు ఆడిన సంగతులు, తాను రాజు వేషం వేసిన విషయం, ఆడపిల్లలు వెంటబడిన విషయం అన్నీ చెప్తున్నాడు.  అన్నీ సరేగని “గింత భూమన్న సంపాదించలేదేందే” అని అడిగిండ్రు.

“అప్పట్లో పూటకెల్లేదే కష్టంగుండేది. ఎప్పడు తిండి దేవులాటేనాయే. భూములేడ సంపాదించపోయిన అయినా భూములున్నా, సొంతిల్లున్నా ఎన్ని కష్టాలురా. ఎక్కడికి పోయినా పానం భూమి మీద, ఇంటి మీదనే గుంజుద్ది. ఆ రెండు లేవనుకో ఇక దేవులాటేముంది. అందుకే వాటి జోలికి పోలేదురా” అన్నాడు.

“నీ కోరికలన్నీ తీరినాయే”

“నాకు నాటకమేసి చచ్చిపోవాలని ఉందిరా.”

“ఇప్పుడు దర్వులొచ్చినోనివి నువ్వొక్కడివే కనపడుతున్నవు…. నీవొక్కనితోని నాటకం వేయటం అయ్యేపనేనా?

రామచంద్రం చివరి కోరిక తీరిందా? నాటకం వేసిన తదుపరి ఏమైంది? తెలియాలంటే మనం యక్షగానంలో మునిగి తేలాల్సిందే.

భాష, శైలి, శిల్పం సరళంగా సాగిపోయే ఈ కథలో ఊరూరా తిరిగి యక్షగానాలు ఆడి పొట్టబోసుకునే యక్షగాన కళాకారుల జీవితంలోని అనేక మలుపుల్ని రచయిత గుండెకు హత్తుకునేలా వర్ణిస్తాడు. అంతరించి పోతున్న యక్షగాన కళను బతికించడానికి ప్రయత్నిస్తూనే కథకుడు చేసిన సమాజ చిత్రణ పాఠకుడిని కలవరపెడుతుంది. సంచార జాతుల జీవితంలోని సంక్షోభం, గ్రామ దేవతలను కొల్వు తీర్చిన తీరు,  యక్షగాన కళ మీది మమకారం, కళాకారుల ధైన్యం మనల్ని వెంటాడుతుంది.

ఉత్పత్తి కులాలవారు, సంచార జాతుల వాళ్ళు కాయకష్టం చేసి పొట్ట పోసుకుంటే, ఆధిపత్య వర్గాలు తెలివి తేటలతోని, రియలెస్టేట్ లో దిగి  సంపాదించడాన్ని, కృత్రిమంగా తమ భూములకు ధరలు వచ్చేలా చేయడాన్ని, ప్రతి విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడాన్ని  రచయిత చెప్పకనే చెప్తాడు. దేవత కూడా ఆధిపత్య మహిళను కాకుండా కింది కులాల స్త్రీలనే పూనడాన్ని కూడా రచయిత ఆలోచింపజేస్తాడు.

కవి కె. శివారెడ్డి అన్నట్లు “యక్షగానం’ కథ యక్షగానం ఆడే దాసరోళ్ల జీవితాలు ఎలా దిగాజారిపోయాయో, కుల వృత్తులు ఎలా ధ్వంసమయ్యాయో ఫలితాలెలా ఉంటాయో విశదీకరిస్తుంది. ప్రపంచీకరణ ఫలితంగా సినిమాలు, టీవీలు, కంప్యూటర్లు ఇతర ఆధునిక సాధనాలు పల్లె జీవితాల్లో ఎలాంటి సంక్షోభాల్ని సృష్టించాయో, అంతిమంగా ఎలా విశాదాంతమౌతాయో చెబుతుంది. ఒక సామాజిక వాస్తవం – ఎంత కఠోరమైందో, ఎంత విచ్చిత్తికి దారి తీస్తుందో, పతనావస్థకు తెస్తుందో చెబుతుంది. దాసరి రామచంద్రం ముగింపు; ఒక విషాదాంత నాటకం. బహుశా ఒదొక ఆధునిక జీవన విషాదం.”

కళ తగ్గిపోయిన ‘యక్షగానం’ ను మన అంతరాల్లోకి దింపిన రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి. రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో సుదీర్ఘకాలం పని చేసి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఇప్పటి దాకా ‘ఊరువాడ బతుకు’, ‘మాయాత్ర’, కథలగూడు’, బయటి గుడిసెలు’, ‘తారుమారు’, ‘యక్షగానం’ లాంటి పుస్తకాలను వెలువరించారు. ఈ కథ మొదట ‘సోపతి’ నవ తెలంగాణ ఆదివారం అనుబంధంలో 2015లో ప్రచురితమైంది.

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • దేవులపల్లి కృష్ణమూర్తి గారి కథలు విభిన్నంగా ఉంటాయి. రచయిత తమ అనుభవాలను తెలంగాణ జీవద్భాషలో మన ముందు పరిచ్చినట్టు ఉంటాయి.వారి కథల్లో రచయిత యొక్క జీవన పరిశీలనను మెచ్చుకోకుండా ఉండలేం. వారి రచనల్లో పాత్రలు, సన్నివేశాలు అనుభవించినట్టు కాకుండా, చూసినట్టు రాస్తారని ఓ విమర్శ ఉంది. అయితే పాఠకులు ఆ విషయాన్ని పట్టించుకోరు. కారణం వారు రాసినవన్నీ యధార్ధ జీవిత అనుభవాలు. కాబట్టి వారి కథలు చదువుతున్నప్పుడు పాఠకులకు జాగ్రత్తలు చెబుతున్నట్టుగా, హెచ్చరిక చేస్తున్నట్టుగా జీవన తాత్వికతతో మేళవించి కథ చెబుతారు.
    కథల్లో నిడివి పరంగా ప్రయోగాన్ని చేశారు. కార్డు కథలు రాశారు. పెద్ద కథలు రాశారు. కథా వస్తువును అడుగు వర్గాల జీవితాలనుండి ఎంపిక చేసుకున్నారు. పరిశీలనతో వారి జీవితాలను చిత్రించారు. సామాజిక, ఆర్ధిక, లైంగిక సంబంధాలను చక్కగా రాశారు. 82 ఏళ్ల రచయిత. 60 ఏళ్ల తరువాత రచనలు చేయడం మొదలు పెట్టారు.
    “జీవిత తాత్వికత జానపద కళారూపాల్లోనే దాగి ఉంది.” యాక్షగానం కథ ద్వారా చెప్పాలనుకున్న రచయిత తాత్వికతను ఒడిసిబట్టి మన ముందుంచిన డా. వెల్డండి శ్రీధర్ గారు విమర్శలో సూదంటు రాయి అని చెప్పటానికి ఈ ఒక్క వాక్యం చాలు. విశ్లేషణ చాలా బాగుంది. అభినందనలు.

  • సమీక్ష అద్భుతంగా ఉంది.. సమీక్షకుడి కి ,యక్షగాన రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి గారికి అభినందనలు

  • దేవులపల్లి సార్ తెలంగాణ జీవితాల్ని చిత్రిక పడుతున్న కథకులు. గుర్తింపు రావాల్సిన కథకులు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు