విద్వేష రాజకీయాల వలలో వేగుచుక్క!

విశ్వ బ్రాహ్మణులు అని పిలవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ శూద్రులు అనే క్యాటగిరీ అవమానకరమైనదని అనడమే ఇబ్బంది.

తెలుగు రాష్ట్రాలు కూడా అసహనానికి నెలవు అవుతున్నాయా? ప్రజాస్వామిక విలువలూ ప్రవర్తన నెమ్మదిగా సామాజిక బృందాల నిఘా  నిర్బంధంలోకి వెళ్తున్నాయా? మేధావీ వర్గం ఆలోచనలు, పరిశోధనలు మనోభావాల రాజకీయావేశంలో తగలబడిపోనున్నాయా? ఇలాంటి సందేహాలు సంవేదనలు బుద్ధి జీవులకు తీవ్రమైన కలవరాన్ని కలిగిస్తున్నాయి. డా. వినోదిని “వేగుచుక్కలు” గ్రంథంలోని ఒక అధ్యాయం గురించి విశ్వకర్మ సమాజంలోని ఒక వర్గం వాదనలు, బెదిరింపుల నేపథ్యంలో ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాము.
మనోభావాలు గాయపడ్డాయి అనే వాక్యం లేదా ప్రకటనల ప్రచారం సంఘ్ పరివార్ ప్రాబల్యం పెరుగుతూ వచ్చిన కొద్దీ పెరుగుతూ వచ్చింది. మతం ప్రాతిపదికన సమాజాన్ని చీల్చడానికి మనోభావాలనే అమూర్త భావన బాగా వాడుకోవటం గడిచిన నలభైయేళ్ల నుండి ఎక్కువైంది. సంఘ్ భావాలతో‌ ఏకీభవించని వాళ్ల మాటలు రాతలను ఈ అమూర్త భావనతో అణచివేసే వ్యూహం పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. కొన్ని వర్గాలను ఆకర్షించడానికీ లేదా కొన్ని వర్గాలను ద్వేషించడానికీ మనోభావాలు అనే ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో వాళ్లకు బాగా తెలుసు. దేశ వ్యాప్తంగా సంఘ్ వ్యతిరేక మేధావులను వేధించడానికి ఈ ఎత్తుగడను చాలా కాలంగా అమలు చేస్తూనే వున్నారు. అయితే తెలుగునాట ప్రజాస్వామిక వాతావరణం బలంగా వున్న కాలంలో మేధావుల ఆలోచనలకు, రచనలకు పలుకుబడి వుండేది. కానీ రెండు రాష్ట్రాల అవతరణ తర్వాత ఈ వాతావరణం బాగా మారిపోయింది. ప్రతిఘాత మతవాదుల ప్రాబల్యం పెరుగుతూ వున్న కొద్దీ ఈ వాతావరణం ప్రమాదంలో పడుతుంది. కంచె అయిలయ్య కోమట్ల మీద రాసినప్పుడు ఆర్య వైశ్య సంఘాల బెదిరింపులు, ఆందోళనలు చూసినప్పుడు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు ఎంతోకాలం ప్రజాస్వామిక విలువలకు చర్చలకు అనువుగా వుండలేవని నాకు ఆనాడే అనుమానం కలిగింది. జగద్గురు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురించి డా. వినోదిని రాసిన అద్భుతమైన వ్యాసం విడిగా ఒక పుస్తకంగా ఒక ప్రచురణ సంస్థ వేసి, మార్కెట్‌లోకి తేగానే సంఘ్ పరివార్ లో పని చేసే విశ్వకర్మ వ్యక్తులు వివాదం తయారు చేశారు. మొదట అభ్యంతరం చెపుతూ, క్షమాపణ చెప్పాలని హుకుం జారీ చేసిన వాళ్లు బిజెపి, సంఘ్ పరివార్ సంస్థలతో అనుబంధం వున్నవాళ్లే. వాళ్లు రాజేసిన వివాదం సామాన్య విశ్వకర్మకు చేరాక, ఆ మొదటి వ్యక్తులు నింపాదిగా పక్కకు తప్పుకున్నారు. ఇదేమీ కొత్త వ్యూహం కాదు. చాలా సార్లు మత ఘర్షణలు చెలరేగడానికి ముందు ఇలాంటి వాళ్లే గొడవ మొదలు పెడుతారు. ఏదో ఒక రూమర్ ప్రచారం చేసి, అక్కడ గొడవ తయారు చేసి, తమకు అనుకూలంగా సమాజాన్ని విడగొట్టి పబ్బం గడుపుకోవడం అందరం చూసిన విషయమే. వినోదిని విషయంలో కూడా ఇదే జరిగింది.
మన దేశ సాహిత్యం రెండు విధాలు. ఒకటి సనాతన ధర్మం పేర కులధర్మాన్ని సమర్ధించేది. రెండు, సమానత్వం కోరుతూ కులధర్మాన్ని నిరాకరించేది. సాహిత్యమే కాదు. తత్వ చర్చలు, ధార్మిక ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు, రాజకీయ ఉద్యమాలు, సాంస్కృతిక ఉద్యమాలు అన్నీ ఈ రెండు విధాలుగా రికార్డయ్యాయి. బుద్దుడు, మహావీరుడు మొదలు భక్తి కవులు లేదా సంతు కవుల వరకు, ఆధునిక కాలంలో జరిగిన సాంఘిక, రాజకీయ ఉద్యమాల వరకు సనాతన ధర్మ రక్షణ కోసమో లేదా సమానత్వ స్థాపన కోసమో ఘర్షణ జరుగుతూ వచ్చింది. బ్రాహ్మణీయ వర్గాల నుండి వచ్చిన తాత్వికులు, ధర్మబోధకులు, మత స్థాపకులంతా కుల ధర్మాన్ని సంరక్షించడానికి జీవితాలు అర్పించారు. బహుజన కులాల నుండి వచ్చిన తాత్వికులు, మత స్థాపకులు, సంప్రదాయ ప్రారంభకులు, సామాజిక సంస్కర్తలు, కవిగాయక వైతాళికులు అంతా సనాతన ధర్మం పేర కొనసాగుతున్న కులధర్మాన్ని తిరస్కరించారు.
అలా తెలుగునాట వర్ణ, కుల ధర్మాన్ని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వ్యతిరేకించాడు. యోగి వేమన కుల వ్యవస్థను తిరస్కరించాడు. జ్ఞానం బోధిస్తూ ఈ మహా గురువులు ప్రజలను చైతన్యం చేశారు. ముఖ్యంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి కుల భేదాలు లేవు. ఆయన అన్ని కులాలు, మతాల వ్యక్తులను శిష్యులుగా చేసుకున్నాడు. ఆయన ఒక విప్లవాన్ని మొదలు పెట్టాడు. ఆయన కాలజ్ఞాన తత్వాలు ప్రజల్లో నైతిక వర్తనను పెంచాయి. హెచ్చుతగ్గుల సామాజిక నిర్మాణాన్ని ఆ మహనీయుడు హేతువు ద్వారా ప్రశ్నించాడు. బ్రాహ్మణులు తనను ఆలయ ప్రవేశం చేయొద్దని నివారించినప్పుడు విశ్వకర్మను నేను విప్రులు మీరయా అని ఎద్దేవా చేశాడు.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తను విశ్వకర్మను అని ప్రకటించాడు. విశ్వకర్మలు ఏ కులస్తులు అనేది ఒక తీవ్రమైన చర్చగా మారింది. విశ్వకర్మలు, విశ్వ బ్రాహ్మణులు ఈ రెండు నామవాచకాలు ఏ వర్ణం పరిధిలోకి వస్తాయి? ఇక్కడే వినోదిని మీద దాడి మొదలైంది. విశ్వకర్మలు వర్ణ వ్యవస్థలో శూద్రులనీ, బ్రహ్మంగారు కూడా అదే వర్ణానికి చెందినవాడని ఆమె వ్యాఖ్యానం. బ్రహ్మం గారి సాంఘిక విప్లవాన్ని ఎత్తిపట్టిన ఈ అధ్యాయం నిజానికి కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. విలువైన ఎన్నో విషయాలను లోకానికి, ముఖ్యంగా బ్రహ్మంగారి అభిమాన సమాజాలకు తెలిపింది. అలాంటి వాటిని కనీసం పట్టించుకోకుండా, కేవలం శూద్రుడు అనే పదం గురించి మాత్రమే పట్టించుకొని రగడ తయారు చేశారు.
విశ్వకర్మలు తమ వాదనను ప్రకటించారు. వేదప్రామణ్యాన్ని వాళ్లు తమ వాదనకు సమర్ధనగా తెచ్చుకున్నారు. రుగ్వేదం అనుసరించి విశ్వకర్మ తొలి దేవుడు. ఆయన ముఖం నుండి మను, మయ, తృష్ణ, విశ్వజ్న, దైవజ్న మొదలైన వాళ్లు ఉద్భవించారు. ఇంకా బ్రహ్మర్షులు, మునులు, రుషులు జన్మించారు. వాళ్లే విశ్వ బ్రాహ్మణులుగా ప్రపంచానికి సేవ చేస్తున్నారు. ఇదీ వాళ్ల విశ్వాసం. బ్రాహ్మణులు ప్రజాపతి శిరస్సు నుండి జన్మించడానికి ముందే విశ్వకర్మలు పుట్టి, ప్రపంచాన్ని నిర్మించారనీ, దేవాది దేవతలకు రథాలు, ఆయుధాలు తయారు చేసి ఇచ్చారని రుగ్వేదంలోని శ్లోకాలను కూడా ఉటంకిస్తున్నారు. బ్రాహ్మణుల కన్న మేమే గొప్ప వాళ్లమనీ, వేదాలు, సకల ఆగమన శాస్త్రాలు, స్మృతులు మావేనని వీళ్లు భావిస్తారు. బ్రాహ్మణులు వాటిని దొంగిలించారని కూడా అంటారు. ఇలాంటి వాదన తర్క ప్రమాణానికి నిలబడుతుందా లేదా అనేది ఇక్కడ అనవసరం. వేదాలు అధ్యయనం చేసిన తర్వాత విశ్వకర్మలు చేసిన తిరుగుబాటు ఇది. బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థ మీద ఇలాంటి తిరుగుబాటును మనం చూస్తూనే వున్నాం. ఆదిహిందూ, ఆదిధర్మీ, ఆదికన్నడ, ఆదిద్రావిడ, ఆదిఆంధ్ర ఉద్యమాలన్నీ వేద ప్రామణ్యాన్ని గుర్తిస్తూనో తిరస్కరిస్తూనో వచ్చిన తిరుగుబాటు ఉద్యమాలు. విశ్వ బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులు, నమో శూద్ర వంటి పేర్లు పెట్టుకోవడం ఆత్మగౌరవ పోరాటాల పతాక వ్యక్తీకరణ. ప్రముఖ చరిత్రకారులంతా ఈ ఉద్యమాలను అధ్యయనం చేశారు. బ్రాహ్మణేతర శూద్ర కులాలు చేసిన విప్లవ చర్యగా అభివర్ణించారు. బ్రజ్ రంజన్ మణి తన డీ బ్రాహ్మణైజింగ్ హిస్టరీ లో చాలా వివరంగా ఈ విషయం చర్చించాడు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గురించి కూడా ఆయన ప్రస్తావించారు.
విశ్వకర్మలు తమను శూద్రులు అనొద్దని అంటున్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని శూద్రుడు అనరాదని, అలా రాసి వినోదిని మా మనోభావాలను  దెబ్బ తీసిందని కొంతమంది విశ్వకర్మల ఫిర్యాదు. మమ్మల్ని విశ్వ బ్రాహ్మణులు అనాలని వాళ్ల డిమాండ్. విశ్వ బ్రాహ్మణులు అని పిలవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ శూద్రులు అనే క్యాటగిరీ అవమానకరమైనదని అనడమే ఇబ్బంది. విశ్వకర్మలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కులాలుగా వున్నారు. ప్రభుత్వం కూడా బిసి జాబితాలో స్థానం ఇచ్చి, ఉద్యోగం, విద్యా, స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ కల్పించింది. గ్రామీణ జీవితంలో విశ్వకర్మలు శూద్రులుగా వున్నారు. ఆధిపత్య కులాల చేత పీడనకు దోపిడీకి అవమానాలకు గురవుతున్నారు. శ్రామిక కులాలతో నిత్యం ఉత్పత్తి సంబంధాలు కలిగి వున్నారు. వ్యవసాయ సంబంధాలను, ఉత్పత్తి శక్తులను అభివృద్ధి చేయటంలో కీలక పాత్ర పోషించారు. ఈ వర్గం శూద్రులుగా తమ గుర్తింపును ఒప్పుకుంటున్నారు. అలాగే కొంతమంది ఆధ్యాత్మిక, పౌరోహిత్య రంగాలలో ప్రవేశించి గొప్ప గుర్తింపు పొందడమే కాదు సమాజాన్ని ప్రభావితం చేయగలిగారు. ఈ వర్గం తమను శూద్రులని చెప్పుకోవడానికి సిద్ధంగా లేరు. బ్రాహ్మణులని చెప్పుకోవడం వల్ల లభించే ప్రివిలేజేస్ అనుభవించాలని కోరుకుంటున్నారు. ఇలా కోరటం తప్పు కాదు. కానీ శూద్రులంతా హీనమైన వాళ్లనే వర్ణధర్మ భావనకు బలం చేకూర్చే మనస్తత్వం వ్యక్తం చేయడం అసలు సమస్య.
చారిత్రక వ్యక్తుల గొప్పతనాన్ని, వాళ్ల ప్రభావాన్ని అంచనా వేయడానికి వర్ణ, కుల చట్రం ఉపయోగించాలా? వద్దా? ఎలాంటి మెథడాలజీ ఉపయోగించాలి? ప్రజాస్వామ్య కాలంలో మనం వున్నాం కాబట్టి వర్ణ, కుల విభజనను మనం తిరస్కరించాలి అని ఆచార్య పులికొండ సుబ్బాచారి వాదం. వర్ణ వ్యవస్థను తిరస్కరించిన వీరబ్రహ్మం గారిని శూద్ర వర్ణం అనడం సరికాదనీ, అది ప్రజాస్వామిక కాల స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయం. కాబట్టి వినోదిని శూద్రుడనే మాట రాయకుండా వుంటే బావుండని‌ ఆయన బెంగ. ఇది పలాయన వాదం. మహాత్మా జ్యోతి రావు ఫూలే, సాహూ మహారాజు, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు వర్ణ, కుల వ్యవస్థను నిర్మూలించాలని చెప్పారు. కానీ శూద్ర, అతిశూద్ర, ఆదివాసీ శబ్దాలను ఫూలే ప్రయోగించాడు. డా.అంబేద్కర్ వెనకబడిన కులాలు, అస్పృశ్యులు, అణగారిన వర్గాలని తన రచనలు, వాదనలు, ఉపన్యాసాల్లో చెప్పాడు. ఏ కులం వల్ల హక్కులు అధికారాలు కోల్పోయామో అదే కులం గుర్తింపు ద్వారా సామాజిక న్యాయ చట్టాలను తయారు చేసి, హక్కులు అధికారాలు కల్పించాడు. పీడిత కులాలకు సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, న్యాయం ఇవ్వడమే అసలైన ప్రజాస్వామ్యం. మరి వినోదిని రాత‌ అప్రజాస్వామికం ఎలా అయ్యింది?
చారిత్రక వ్యక్తుల సామాజిక నేపథ్యం చరిత్ర రచనలో ప్రస్తావించక పోవడం వల్ల ఎవరికి లాభం? బహుజన వర్గాలకే ఎక్కువ నష్టం. కందుకూరి కవుల చరిత్ర చూడండి. కవులంతా ఒకే సామాజిక వర్గం వాళ్లు. వర్గ దృక్పథం నుండి రాసిన సాహిత్య చరిత్రలు చూస్తే అందులో ఎక్కడా బహుజన కులాల కవులుండరు. అంతెందుకు, కొయ్యగుర్రం రాసిని నగ్నముని విశ్వకర్మ అనే సంగతి నాకు కవయిత్రి, విమర్శకులు దాసోజు లలిత చెప్తే తప్ప తెలియదు. తెలుగు సాహిత్య క్షేత్రాన్ని ప్రభావితం చేసిన మహాకవి తను. ఆయన సామాజిక నేపథ్యం తెలపడం వల్ల విశ్వకర్మలకు గౌరవమే తప్ప అవమానం లేదు కదా?
ఎంతో సానుకూలంగా బ్రహ్మంగారిని వినోదిని మనకు పరిచయం చేసింది. అందులోని ఒక్క పదాన్ని అసందర్భంగా వేరు చేసి, వివాదం తయారు చేశారు. ఇదే విధంగా దళితులు చేస్తే ఎలా వుంటుంది? ఉదాహరణకు, చిక్కనవుతున్న పాట, ఎరుపెక్కిన పాటలో చాలా మంది విశ్వకర్మ కులాల కవులు దళితులకు మద్దతుగా రాశారు. తమను తాము దళితులుగా ప్రకటించారు. మేము మూలవాసులం, మహాఆదిగలం మమ్మల్ని దళితులు అని సంబోధిస్తారా? మా మనోభావాలను దెబ్బ తీస్తారా? అని ఒక దళితుడు ఫిర్యాదు చేస్తే ఎంత ఎబ్బెట్టుగా వుంటుందో కదా? అలాగే జాంబపురాణం ప్రచురించిన ఆచార్య సుబ్బాచారి ఆదిజాంబవుడిని ఏకవచనంతో సంబోధించాడని, చిందు, డక్కలి, నులక చందయ్య కులాల పేర్లు రాసాడనీ, ఆశ్రిత కులాలు, అస్పృశ్యులు అనడం మా మనోభావాలను గాయపర్చడమని ఫిర్యాదు చేస్తే, వాచకాన్ని, పదాన్ని, దాని అర్థాన్నీ, సందర్భాన్నీ గ్రహించలేని అజ్ఞానులు మీరని తిట్టేవాళ్లు కదా? కాబట్టి పాజిటివ్ గా వినోదిని రాసిన అక్షరాలను వివాదస్పదం చేయడం ఎవరి కోసం? ఏ సంఘ్ పరివార్ ప్రయోజనాల కోసం చేస్తున్నారిది?
విశ్వకర్మ/విశ్వ బ్రాహ్మణ మేధావులు, కవులు చాలామంది వినోదినికి అండగా నిలబడటం ఒక ఊరట. అలా నిలబడిన అందరినీ నేను అభినందిస్తున్నాను. కానీ ప్రతి సామాజిక బృందాలలోకి చొచ్చుకుని వస్తున్న అసహనం, విద్వేషం గురించి మనమంతా జాగ్రత్త తీసుకోవాలి. కనీసం తెలుగు రాష్ట్రాలనైనా విద్వేష రాజకీయాల వలలో పడకుండా కాపాడుకోవాలి. స్వేచ్ఛగా ఆలోచనలను, భావాలను ప్రకటించుకోగలిగే ప్రజాస్వామిక ప్రాదేశికతను నిలబెట్టుకోవడానికి అవసరమైన చింతనలు చేయాలి. ఇది తక్షణ అవసరం.
*

జిలుకర శ్రీనివాస్

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అన్నా, వ్యాసం ఆలోచనాత్మకంగా ఉంది. ప్రస్తుత వాతావరణం మీద జిగుప్సగా కూడా ఉంది.

  • Very realistic analysis. Thank you Srinivas sir.
    Attack on Dr.Vinodhini is a clear strategy of Sangparivar group to polarize Telugu speaking people for their political advantage. Manu dharma and Hindhuvatha is Thier capital to gain the power. They have been successful in splitting the people and implementing same strategy in every state. They supress the vioce with thier might laws .
    Discussion on caste takes us thier loop. Humans are born to humans. This is science. Entering into Manu classification of caste system is hindhu reform moment, Identifying one’s caste is accepting the Manuclassification . Dr.AMBEDKAR’S Kulanirmulna , casteless society is the only solution.
    As long as we are in the loop, RSS and sang parivaar takes advantage of it .

  • మంచి వ్యాసం సీనన్నా… వీర బ్రహ్మేంద్ర స్వామి ని శూద్ర అంటున్నాము అంటే వర్ణాశ్రమ వ్యవస్థకు లెజిటిమసి ఇస్తున్నామా ? అని ఒక విశ్వకర్మ ప్రొఫెసర్ అంటున్నాడు. మరొక పేరు మోసిన కవి అంటున్నాడు .
    మధ్య యుగాలలో పెచ్చురిల్లిన నాటి అసహనం మూలాలు అర్ధం చేసుకోడానికి ఆయన పురాణ ప్రబంధ లోతులను అవలోకనం చేసుకున్నాకే ఆధిపత్య డిస్కోర్సు ను చాలెంజ్ చేసాడు.
    మాదిగ కక్క, దూదేకుల సిద్ద ప్రధాన అనుచరులు చేసుకోవడం మూలంగా కింది కులాల ఐక్యత కు ఒక పునాది వేసిన రాడికల్ పిలాసఫర్ పోతులూరి.

    మహాత్మా పూలే , అంబేద్కర్ ఈ జాతులను ఒక సంఘటిత శక్తుగా మార్చడం కోసం వెనకబడిన సూద్ర అతిసూద్ర సమీకరించడం కోసం బహుజను కులాలను ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ముందుకు తెచ్చిన తరుణం లో ఇలా బిసి ల లో బలమైన శక్తులు ఇటువంటి చర్చ చేయడం బహుజన ఉద్యమానికి నష్టం.
    ఒకటి నిజం వీర శైవం, అచల, లేదా వీర వైష్ణవ ధార కింది సమాజాల దగ్గరకు సంస్కరణ ద్రుష్టి తో వచ్చారా కోల్పోయిన ప్రాభావాన్ని ఆ సమూహాల తో భర్తీ కోసం వచ్చారా లేదా విస్తరణ లో భాగంగా వచ్చారా అనే చర్చ ఇంకా మొదలు కావలసి ఉంది. మధ్య యుగాల లో జరిగిన ఈ కుట్రను ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
    ఇప్పటికయినా ప్రజాస్వామిక వాదులు, కవులు మేధావులు వినోదిని కి సంఘీభావంగా ముందుకు రావాలి. సహనానికి స్వాభిమాన చర్చ లకు నిలయమైన తెలుగు సమాజం లో ఇటువంటి విద్వేష పూరిత తిట్లు దాడులు ప్రజాస్వామిక భావనకు ప్రత్యామ్నాయ ఆలోచనలకు ముప్పు.

  • అద్భుతమైన వివరణాత్మక మైన వ్యాసం.విదేశాల్లో సైతం ప్రభావం చూపిన “”మృచ్చకటికం””సంస్కృత నాటకం రాసిన శూద్రకుడు ఇప్పుడు బ్రతికివుంటే ఎంత బాధ పడేవారో కదా!!
    మంచి వ్యాసం అభినందనలు👌👌👌💐💐💐💐

  • శూద్రులు కాక మరి అగ్రవర్ణ బ్రాహ్మణులా.?వారు అంగీకరిస్తారా? అగ్నికుల క్షత్రియులు , నాయీ బ్రాహ్మణులు అగ్రవర్ణ పేర్లు పెట్టుకుని సాధించిందేమిటి? శూద్రులను చిన్నచూపు చూసే ఆలోచన ఎక్కడిది? వేమన,వీర బ్రహ్మం కులాలకు అతీతంగా కృషి చేశారు కానీ వారు ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ లో వారే కదా.

  • మొదటి పేరాలోని ఈ కింది లైన్లు చదవగానే ఈ మధ్య తమ అభిప్రాయాలని వ్యతిరేకిస్తే చాలు , ‘బ్ర్రాహ్మణ వాది’ , ‘దళిత శత్రువు’ ‘కుల వాది ‘ అని తిట్ల పురాణం లంకించుకొంటున్న ‘ బృందాల ‘ గురించేమో ఈ వ్యాసం అని భ్రమ కలుగింది.
    —-
    “తెలుగు రాష్ట్రాలు కూడా అసహనానికి నెలవు అవుతున్నాయా? ప్రజాస్వామిక విలువలూ ప్రవర్తన నెమ్మదిగా సామాజిక బృందాల నిఘా నిర్బంధంలోకి వెళ్తున్నాయా? మేధావీ వర్గం ఆలోచనలు, పరిశోధనలు మనోభావాల రాజకీయావేశంలో తగలబడిపోనున్నాయా? ”
    —-

    అయినా మీరన్న ఈ క్రింది వాక్యాలు మాత్రం నిజమవ్వాలని ఆశిద్దాము

    —-
    ప్రతి సామాజిక బృందాలలోకి చొచ్చుకుని వస్తున్న అసహనం, విద్వేషం గురించి మనమంతా జాగ్రత్త తీసుకోవాలి. కనీసం తెలుగు రాష్ట్రాలనైనా విద్వేష రాజకీయాల వలలో పడకుండా కాపాడుకోవాలి. స్వేచ్ఛగా ఆలోచనలను, భావాలను ప్రకటించుకోగలిగే ప్రజాస్వామిక ప్రాదేశికతను నిలబెట్టుకోవడానికి అవసరమైన చింతనలు చేయాలి. ఇది తక్షణ అవసరం.
    ——–

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు