కొత్త దారి వైపు అమెరికా రచయితలు

రెణ్ణల్లక్రితం సాయిబ్రహ్మానందం గారితో పిచ్చాపాటీ మాట్లాడుతుంటే ‘అసలు ఎందుకు చేసానంటే కాలిఫోర్నియా వస్తున్నారా ఈమెయిల్ చూసుకున్నారా’ అని అడిగారు. ‘ఏదో రచయితల సమావేశమని చూశానండి’ అంటే, ‘అదే అదే మీరూ రండి వీలైతే’ అన్నారు. మరి రచయితల సమావేశం అంటే కేవలం రచయితలే వస్తే బాగుంటుంది కదా అన్నాను తటపటాయిస్తూ. ‘మీరు రాస్తుంటారుగా అవీ ఇవీ. ఫర్వాలేదు బావుంటుంది రండి’ అన్నారు.

చంద్రగారు వెళుతున్నానని చెప్పారు. సురేశ్ కూడా వస్తానన్నాక నాకు, అనంత్ కు ధైర్యం వచ్చింది. సరేనని తరలి వెళ్ళాం.

రెండురోజులూ భాషాసారస్వతాల సమాలోచనం, స్నేహితులతో కాలక్షేపం, ఇంతకుముందు కలవని సాహితీప్రియులను కలవడం, పైగా వేమూరి వేలూరి జెజ్జాల గార్ల వంటి జ్ఞాన వృద్ధుల సాంగత్యం, వీటితో చాలా త్వరగా గడిచిపోయాయి.

వేదికమీద మాట్లాడేవారు కూర్చునివినే వారు వేరు వేరు అన్నట్టు కాకుండా అనేక ప్రక్రియలపై – మామూలుగా ఉండే కథ, కవిత్వం వంటివే కాకుండా పత్రికలు, ప్రచురణలు, విమర్శ, అనువాదాలు, మొదలైన వాటి మీద – ఒక పానల్ కొన్ని ప్రశ్నలను తీసుకుని చర్చకు తెర తీయడం, మిగతా వారిలో చాలామంది చర్చలో పాల్గొనటం ఇలా కొత్తగా సాగింది సభ.

సాంఘిక మాధ్యమాలు, సైన్స్ ఫిక్షన్, అస్తిత్వ వాదాలు, సాంకేతిక నిఘంటువు, సదస్సుల నిర్వహణ, మొదలైన రకరకాల అంశాలు చర్చల్లోకి వచ్చాయి. వాదోపవాదాలు వాడిగా కొన్నిసార్లు వేడిగా జరిగాయి.

వచన కవిత్వానికి ఛందోపరిజ్ఞానం అవసరమా, కవిత్వం ముఖ్యంగా ఇప్పటి వచనకవిత్వం జనంలోకి వెళ్లాలంటే ఏం చేయాలి, పాఠకుల స్థాయిని పెంచాలా లేక జనం అభిరుచులకు తగ్గట్టుగా రాయాలా, మంచి కవితల గురించి కవులే పరిచయం చేస్తే, దీనికి యూట్యూబ్ వంటి పరికరాలని వాడటం మొదలైన ప్రశ్నలు కవిత్వం గురించి వచ్చిన వాటిలో కొన్ని.

వచ్చినవారిలో కథకులు ఎక్కువగానే ఉండటంవల్ల కథాసాహిత్యం మీద చర్చలు విస్తారంగానే జరిగాయి. శిల్పం మీద దృష్టి పెట్టడం, ముఖ్యంగా ఎన్నారై సాహిత్యంలో ఒకే మూసలో సాగే నమూనా కథలు , కనీస శాస్త్రీయ అవగాహన లేని పాఠకుల కోసం సైన్స్ ఫిక్షన్ రాయటం, సస్పెన్స్ కథలకు బొమ్మలు వేసేవాళ్ళు విషయం ముందే తెలిసిపోయేలా బొమ్మలు వేయటం, సంపాదకుల బాధ్యతలు బాధలు, సంపాదకులు ఉండడం వల్ల ప్రయోజనాలు, వారు లేని అంతర్జాల వేదికలు, ఇలా ఎన్నో విషయాల మీద.

కనీసం ఆరు వెబ్ పత్రికల సంపాదకులు ఈ సమావేశంలో ఉండటం వారి మధ్య జరిగిన ఆసక్తికరమైన చర్చ అరుదుగా సమకూడే ఒక విశేషం. అలాగే (కథల్లో కవిత్వంలో) భాషలో బూతులు వాడటం అవసరమా, ఏ సందర్భాల్లో అది సమంజసం, అన్న విషయాల నుంచి నృత్యనాటికలు వ్రాసేవారు పాటించ వలసిన జాగ్రత్తలవరకూ విభిన్నంగా చర్చలు జరిగాయి.

అసలు కంటే కొసరు ముద్దు అన్నట్టు సభ అనంతరం స్థానిక మిత్రుల ఇళ్లల్లో కాఫీలు, అర్ధరాత్రి వరకు కబుర్లు, ప్రొద్దున్నే ఉప్మాపొంగళ్ళు, వేలూరి వేమూరి గార్లలో ఎవరు పెద్ద అన్న పోటీ, అందులో అనూహ్యంగా వేమూరి గారు గెలవడం, వచ్చే సంవత్సరం సదస్సు డాలస్ లో నిర్వహించాలని డాలసేతరులందరూ మూకుమ్మడిగా నిర్ణయించడం, ఈ రెంటిలో ఎనభయ్యేళ్ళ వేలూరిగారు ఎక్కడలేని ఉత్సాహం తో పాల్గొనడం ఇవన్నీ గొప్ప అనుభవాలు.

పోతే, క్లాసికల్ కవిత్వానికి మరికొంత జాగా దొరికుంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఈ సదస్సునుండి లేక ఈ సమూహంనుండి నికరంగా ఏమైనా డెలివరబుల్స్ తయారైతే బాగుండు అని అందరికీ అనిపించింది. వీటి మీద అభిప్రాయాలు చాలానే వచ్చినా ఏకాభిప్రాయం కుదరలేదు. వచ్చే సమావేశాల్లో ఈ విషయాలమీద మరింత శ్రద్ధపెడితే బాగుటుంది.

మొత్తంమీద రచయితల కోసం, రచయితలు ఏర్పాటుచేసిన ఈ సదస్సు బాగా విజయవంతమైందనే చెప్పాలి. ఊరికే కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదామనుకున్న మిత్రులు కూడా రెండురోజులూ చివరికంటా ఉండి పాల్గొనటం కానవచ్చింది.

ఇటువంటి చక్కని ప్రయత్నానికి తెర తీసినందుకు, నిర్వాహకులకు, ముఖ్యగా బ్రహ్మానందంగారికి అలాగే కల్పన, అఫ్సర్, చంద్ర గార్లకు కృతజ్ఞతలు, అభినందనలు.

*

చంద్రహాస్ మద్దుకూరి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు