ఆనందాచారి కవిగా రచయితగా లోకానికి తెలిసిన పేరు.కుంచె పట్టిన బొమ్మలు దిద్దిన చిత్రకారుడిగా ఈపూట చిత్రకళకి సంబంధించిన ఎన్నెన్నో విషయాల్ని,సామాజిక ఆర్ధిక రాజకీయ అంశాల్ని ముచ్చటించారు.రంగుల విశాలతని,కుంచె లోతుని బొమ్మల బాధ్యతని,తన గురువుని,చిత్రాల దారిని ప్రయాణాన్ని హాయిగా చెప్పారు.వలసకూలీల వేదన్ని పాడింది.కరోనా భారతాన్ని గీసింది.చూడండి..ఈ చిత్రకారుడి చిత్తశుద్దిలోకి….చింతనలోకి..
1.ఇటీవల ముఖ్యంగా కరోనా విద్వoస కాలంలో మీరు యఫ్బిలో పోస్ట్ చేస్తున్న చిత్రాలకు వొస్తున్న స్పందన పట్ల ఎలా ఉన్నారు?
నిజంగా నేనూహించని స్పందన ఉంది.కవిత్వంపై వొచ్చిన స్పందనకంటే చిత్రాలకే స్పందన ఎక్కువ ఉంది.కవిత్వం చదివి దాని భావాన్ని పట్టుకోగలిగితేనే దాన్ని ఆస్వాదించగలుగుతారు.కానీ,చిత్రం వెంటనే భావాన్ని చెప్పేస్తుంది.త్వరగా చేరువవుతారు.రంగులుకూడా ప్రభావితం చేస్తాయి.రెండు తెలుగు రాష్రాల్లో చాలామంది చిత్రాల్ని ఆదరించారు.కవులు బాగా స్పందించారు.సాధారణంగా కవిత్వానికి బొమ్మలు వేస్తారు.కానీ నా చిత్రాలకు వసకూలీలపై కవిత్వాన్ని రాశారు.వాళ్ళ బాధలో సహానుభూతి చెందటం ఒక సంతృప్తి.
2.కవిగా,రచయితగా తెలంగాణ సాహితిని భుజానికి ఎత్తుకున్న వారిలా మాత్రమే మీరు అందరికి తెలుసు.కానీ ఇప్పుడు మీలో అద్భుతమైన చిత్రకారుడున్నాడని తెలిసింది.ఇంతటి అద్భుత చిత్రకళ మీలో రూపుదిద్దుకోవడానికి గల నేపధ్యం చెప్పగలరా?
అద్భుతమైన చిత్రకారుడనని నేను అనుకోవడం లేదు.బొమ్మలు గీయగలను అంతే.నా పన్నెండవ యేడు నుండే బొమ్మలు గీస్తున్నాను.హైస్కూల్కి వొచ్చాక భకావుల్లాఖాన్ అనే డ్రాయింగ్ టీచర్ పరిచయంతో నాలో ఆసక్తి ఇంకా పెరిగింది.రోజుకు పది పదిహేను గంటలు అలా వేస్తూ ఉండేవాడిని.టీనేజీలో కమర్షయల్ ఆర్టిస్ట్ గా పనిచేశాను.చదువు ఆగిపోయింది.సంపాదన మొదలయింది.కొన్నేళ్ళకి మళ్ళీ చదువు ప్రారంభించాను.రష్యన్ ఆర్ట్ మ్యాగజైన్ సెవెంటీస్ లొనే తెప్పించాను.డ్రాయింగ్,లోయర్ హయ్యర్,టి.టి.సి.పరిక్షలన్నీ పాసయ్యాను.యం.ఏ.బీ.యాడ్ చేసాను.కానీ నాప్రవృత్తి నాకు జీవనోపాదినిచ్చింది.డ్రాయింగ్ టీచర్ గా సెలెక్ట్ అయి ఉద్యోగంలోకి వొచ్చాను.ఆ తరువాత తెలుగు ఉపాధ్యాయుడిగా పదోన్నతి పొందాను.1999 నుండి సాహిత్యకార్యకలాపాల్లోకి వొచ్చిన తరువాత కూడా నేను బొమ్మలు వేస్తానని ఎవరికి తెలియదు.నేనూ వేయలేదు కూడా.సాంస్కృతిక ఉద్యమంలోకి వొచ్చాక అక్షరదీపం పత్రికకు చిత్రకారుడిగా పనిచేశాను.అక్కడే ప్రముఖ రచయిత కౌముది,పొట్లూరి,జగన్మోహన చారి, హరీష్ ,కాళ్ళ గారి పరిచయం నన్ను ఎంతగానో ప్రాభావితం చేసింది.అప్పుడే మిత్రుడు సీతారాం కవిత్వం కన్నా నీ బొమ్మలే బలంగా ఉంటాయి.నువ్వు బొమ్మలే వేయి ఆనందు అన్నాడు.బ్రెజిల్ విద్యావేత్త ఫాలోప్రీరీ పెడగోగి ఆఫ్ అప్రెస్డ్ లోని అంశాల ఆధారంగా నలబై ఏడు చిత్రాలు గీశాను.j.d.బెర్నాల్ చరిత్రలో సైన్స్ కి సంబంధించి బొమ్మలు వేసాను.
3.పాబ్లో పికాసో “painting is another way of keeping a diary”అన్నారు కదా.. మీరు పెయింటింగ్ ని ఎలా నిర్వచిస్తారు?
పెయింటింగ్ను నిర్వచించేంత గొప్పవాడ్ని కాదుగాని.పికాసో అన్నారు కాబట్టి గయోర్ణిక చిత్రం నన్ను బాగా inspire చేసింది.ఒక యుద్ధానంతర సమాజం,యుద్ధ సందర్భ సమాజం ఎలా ఉంటుందో ఆయన క్యూబిజం శైలిలో చిత్రించాడు.ఆయనొక కమ్మునిస్ట్ కూడా.సమాజాన్ని అందులోని మానవ ఉద్వేగాల్నిEffective గా చిత్రించే రేఖల రంగుల కళ పెయింటింగ్.ఏ చిత్రమైనా ప్రజల్లో అనుభూతి కలిగించాలి.ఆనందాన్ని ఇవ్వాలి.సమాజంలో ఆనందం లేనప్పుడు,దుఃఖం ఉన్నప్పుడు,ఆ దుఃఖంలో చిత్రం సహానుభూతి చెందాలి.నాకోసమూ కన్నీరోలికే వారున్నారనే ఓదార్పుని ఇవ్వాలి.అప్పుడే ఏ కళకయిన సార్ధకత.
4.ఏదయినా పెయింటింగ్ వేస్తున్నప్పుడు లేదా వేయాలనుకున్నప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది?
ఏ అంశంపైన పేయింటింగ్ వేయాలనుకుంటున్నానో ఆయా అంశాల దృశ్యం నాకళ్ళముందు ప్రదర్శితమౌతుంటుoది.ఆ దృశ్యాల ఆవరణమే నామదిలో కధలాడుతుంటుంది.ఆయా సంఘటనల్లోని మనుషుల మానసిక స్థితిలోకి వెళ్లిపోతాను. నా గీత నా మనసుని అనుసరిస్తుంది.అంతే.ఎవరిబాధనో వేయటంగా నేను అనుకోను.వాళ్ల బాధ నా బాధగా మారినప్పుడే చిత్రం అద్దబడుతుంది.
5.రాతకు సంబంధించిన ఏ ప్రక్రియాలోనైన ఒక వాక్యాన్నో పదబంధాన్నో మళ్ళీ తిరగరాసుకునే అవకాశం ఉంటుంది.మరి చిత్రకళ లో ఒకసారి వేశాక మళ్ళీ మార్చడం వంటిది ఏమైనా ఉంటుoదా?
కవిత్వమైన చిత్రమైన హృదయంతో కొనసాగే కళా నైపుణ్యం.ఎడిటింగ్ సవరణలు ఉంటాయి.కాకపోతే కవిత్వంలో లా కాదు.ఒక పెయింటింగ్ వేయాలనుకున్నప్పుడు మనసులోనే అనేక మార్పులు జరుగుతాయి.sketch వేస్తున్నప్పుడూ కొత్త ఆలోచనలతో కూడిన మార్పులు జరుగుతాయి.కానీ పెయింటింగ్ వేయటం పూర్తి అయ్యాక మార్పులు చేయటం వీలుకాదు.కుదరదు.
6.చిత్రకళలో అంశాన్ని ఎలా ఎంచుకుంటారు?శీర్షికల్ని ఎలా పెడతారు?
అంశం ముందు హృదయాన్ని తాకాలి.బయట కూడా చర్చకు దారితీసి ఉండాలి.ముఖ్యంగా మానవీయతకు విఘాతం కలిగించేది ఎంత చిన్నదయినా ఎంచుకుంటాను.చిత్రం గీసాకే శీర్షిక.thought provoking గా శీర్షిక ఉండాలనే చూస్తాను.
7.ఒక పెయింటింగ్ ఎంత సమయం తీసుకుంటారు?ఎంత వేసినా పూర్తికాని పెయింటింగ్స్ ఏమైనా ఉన్నాయా?’ఆకలి’ అనీ,’the state’మీరు వేసిన పాయింటింగ్స్ ఇప్పటి పరిస్థితిని clear గా వెల్లడిస్తున్నాయి.మీకు ప్రేరణ ఎవరు?
ఒక్కో పెయింటింగ్ కి ఐదారు గంటల సమయం పడుతుంది.పెయింటింగ్ కోసం చేసే ఆలోచనకు చాలా సమయం తీసుకుంటాను.ఆయిల్ పేయింట్ ఐతే మూడు నాలుగురోజులు తీసుకుంటాను.నేను వేసిన పెయింటింగ్స్ కంటే నామదిలో ఉన్నవే ఎక్కువ.అసలు ఏ పెయింటింగ్ పూర్తికాదు. నేను వేసిన ప్రతి పెయింటింగ్ లో సరిదిద్దవల్చింది కనబడుతూనే ఉంటాయి.వాస్తవానికి ఆ టైటిల్స్ లో పెయింటింగ్స్ వేయడానికి మార్క్సిస్ట్ ఫిలాసఫీ నాకు ప్రేరణ.అయితే పెయింటింగ్స్ కి సంబంధించి కాళ్ళ గారి బొమ్మలు కూడా నాకు ప్రేరణగా నిలిచాయి.ముఖ్యంగా బెంగాల్ కి సంబంధించిన చిత్రకారుడు
చిత్త ప్రసాద్ నన్ను ఎక్కువగా ప్రభావితం చేసాడు.ఆయన గీసిన తెలంగాణ సాయుధపోరాట చిత్రాల శైలిలో ఇక్కడి వ్యవసాయ కార్మిక పోరాట చిత్రాలను చిత్రించాను.
8.లక్ష్మణ్ ఏలే, కాళ్ళ,అక్బర్ ఇంకా చాలామంది తెలుగు సమాజపు చిత్రకారుల్లో మిమ్మల్ని ప్రేరేపించిన ఆర్టిస్ట్ ఎవరు?అందుకు కారణం ఏమయి ఉంటుంది?
కాళ్ళ గారితో చర్చల్లో చాలా సమయాన్ని గడిపేవాడ్ని.ఆయనదీ మార్క్సిస్ట్ దృక్పధమే.గొప్ప చిత్రకారుడు.ఆయన్ని మనం గుర్తించలేక పోయాము.అక్బర్ అత్యంత ఆధునికుడు.తనకంటూ ఒక శైలిని సృష్టించుకున్నాడు.ఆయన చిత్రాలన్నా ఇష్టమే.
9.I think all your painting are political ones ఒక సమాజాన్ని దాని దుఃఖాన్ని వ్యక్తికరిస్తుంది మీబ్రెష్హు. అసలు ఒక ఆర్టిస్టుకి సమాజంపట్ల బాధ్యత ఉండాలంటారా?
Everything is political. పొలిటికల్ అనగానే రాజకీయ పార్టీల ఎన్నికల పదవుల దృశ్యాల్ని చూస్తాం మనం.కానీ అది కాదు.ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి కోణాన్నిసామాజిక రాజికీయార్థిక అధ్యయనాలే ఇస్తాయి.అంటే దృక్ఫదానికి సంబంధించినది రాజకీయ పరమైనదే.అందుకే శ్రీశ్రీ అన్నారుకదా నువ్వో మంచి ఆర్టిస్ట్ వి అవ్వాలంటే ముందు కమ్మునిస్ట్ వి కావాలని.ప్రతి సంఘ జీవి బాధ్యత వహించాలి.ఒక్కొక్కడికోసం అందరు. అందరికోసం ఒక్కడు.ఇదే అసలైన సమాజం.
10.కవి,రచయిత,చిత్రకారుడు వీటిల్లో మీభావ ప్రకటనకు అనుకూలంగా వుండే కళ ఏది?
చిత్రకారుడిగానే నా భావాల్ని చెప్పగలుగుతాను.కవిత్వం రచన ద్వితీయమైనవే.చిత్రకారుడిగా ఇది నా మొదటి ఇంటర్వ్యూ.పెద్దన్న ద్వారా ఇది జరగటం సంతోషం.అఫ్సర్ దీనికి అవకాశం కల్పించటం ఎంతో ఆనందకరం.
*
గత ఇరవై సంవత్సరాలుగా ఆనందాచారిగారు నాకు పరిచయం. సాహితీ స్రవంతి మమ్మల్ని కలిపింది. చిత్రాలు గీస్తారని తెలుసు కానీ, వారిలోని అసలైన చిత్రకారుడ్ని కరోనా వలన చూడగలిగాను. గత కొద్ది రోజులు వారు గీస్తూ వచ్చిన చిత్రాలు “అద్భుతమైన కళాఖండాలు” అనడంలో అతిశయోక్తి లేదు. ఒక్కొక్క చిత్రం అనేక కవితల్ని గాథల్ని సృష్టించింది. నిజమే వాళ్ళ బాధ తన బాథగా ఫీలైనప్పుడే చిత్రకారుడి కుంచైనా, కవి కలమైనా బలంగా చెప్పగలుగుతుంది. ఆనందాచారిగారికి అభినందనలు. కవిగా, కాలమిస్టుగా, చిత్రకారుడిగా తన ప్రగతిశీల మైన భావాలతో సమాజ చైతన్యానికి తన కృషిని కొనసాగించాలని కోరుకుంటూ.
చాలా విషయాలను ఈ ఇంటర్వూ నాకు నేర్పింది. ఓ చిత్రం లోతైన ఓ కవిత లాంటిదని, సరళంగా సాగిపోయే ఓ కథ లాంటిదని, ఆలోచనలను రేకెత్తించే ఓ వ్యాసం లాంటిదని – ఇంకా చాలా విషయాలు అర్థం చేయించిన ఇంటర్వూ ఇది. ఆనందాచారి, పెద్దన్న- ఇరువురికీ ధన్యవాదాలు.
ఆనందాచారీ గారిని ఇంటర్వ్యూ కోసం మాట్లాడటం…ఒక మంచి అనుభవం.గొప్ప చిత్రకారుడు తను అని బోధపడటమే కాకుండా అంతకు మించి మంచి మనిషిగా తోచారు..నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్ సర్…
ఆనందాచారి గారి చిత్రాలు ఎందరినో కదిలించాయి… కవిత్వాన్ని సృజింపచేశాయి. చారి గారు ఒకవైపు సాహిత్య రంగం (తెలంగాణ సాహితి) భాద్యతలతో పాటు కొత్త వచ్చిన నవతెలంగాణ భాద్యతలను నిర్వహిస్తునే…. మరోవైపు రాజకీయ సామాజిక ఆర్థిక విషయాలపై స్పందిస్తూ చక్కని చిత్రాలు గీశారు. ఆ చిత్రాల వెనకున్న శ్రమను, ఆలోచనలను సారంగ ద్వారా ప్రపంచానికి తెలిసింది. పెద్దన్నకు , అఫ్సర్ సార్ కు ధన్యవాదాలు.
Anandacharygaru Meeku Abhinandanalu
Mee nundi marenno chithralu , Kavithalu
Ravalani korukuntoo..
Laxminarasaiah B
చాలా బాగుంది.,👌👌🙏🙏🙏🌷