వాన పడకపోతే బాగుండు

వాన. ఎక్కడ లేని వాన. సంద్యాల నుండి పడ్తానే ఉంది. రాత్రి పదకొండైతాంది. అయినా గూడ ఆగలా. అప్పటికే కరెంటు పొయి చానా సేపయింది. సిమెంటు మిద్దెలన్నీ బానే ఉన్నాయి. మట్టి మిద్దెలు కారతాన్నాయి. ఆడాడ గుమ్మడలు పడి నీళ్ళు కారేది మామూలే. కానీ ఇంటిపైన గెడ్డి మొలిచిన్నింది. పొటుకెత్తుకుంది. ఇళ్ళంతా కారతాంది.

యాడాడ కారతాందో ఆడంతా గిన్నెలు పెడతాంది పార్వతమ్మ. ఇళ్ళంతా కారతాంటే ఎన్ని గిన్నెలని సరిపోతాయి? గిన్నెలు తక్కువొచ్చి బకెట్లు గుడ పెట్టినారు. బియ్యం మూటలు నానకుండా బొంతలు కప్పినారు. వాన పడేకంటే ముందే బయటున్న కట్టెలు తెచ్చి లోపలేసినాడు గణేషు. అవి గూడ నానిపోతే పొద్దన్నే పొయ్యి మండదు. కిరసనాయిల్ స్టవ్ ఉంది గానీ, స్టోర్లో పోసే రెండు లీటర్లు ఎన్ని రోజులని వస్తాది?

అప్పుడప్పుడు ఉరుముతాంది. బడ బడ బడ బండలు పడినే శబ్దం అయితాంది. ఒగ పక్క భయమయితాంది పార్వతమ్మకి, ఇంగో పక్క ఏమైందో చూసి రావల్ల అనిపిస్తాంది. పిల్లోని ఒక్కన్నే వదిలేసి వానలోకి పొయ్యే కన్నా ఇంట్లో ఉండేదే మేలని కుచ్చోయింది.

పన్నెండు దాటింది. వాన ఇంగా జ్యాచ్చీ అయిందేగాని తగ్గలా. బియ్యం మూటల పక్కనే ముడుక్కొని కుచ్చొయినాడు గణేషు. నిద్దరొస్తాంది. నీళ్ళు గిన్నెళ్ళోకి పడ్తాంటే టప్ టప్పని శబ్దమొస్తాంటే నిద్ర పట్టడంలా.

ఆరోజు రాత్రికి క్రికెట్ మ్యాచ్ ఉన్నింది. గణేషు వాళ్ళింట్లో టీ.వీ లేదు. శంకరు వాళ్ళింటికి పోయి చూడల్ల అనుకున్యాడు గణేషు. ఈ వాన రావడంతో అది గూడ జరగలా.

వాన నీళ్ళు పడి నిండినే గిన్నెలు తీస్కపోయి నీళ్ళన్నీ బయట పారబోసి మళ్ళ యాడ గిన్నెలు ఆడే పెడ్తాంది పార్వతమ్మ. గణేషు వైపు చూసింది. బియ్యం మూటలకి ఆనుకుని కుచ్చొయినాడు. పిలిచింది, పలకలేదు. అప్పుటికే నిద్రపొయినాడు. కొంచేపున్యాక పార్వతమ్మ గూడ కుచ్చున్నే సాటే నిద్రపొయింది. పొద్దున లేచేసరికి వానంతా పోయింది. ఇంటి నిండా గిన్నెలే. గిన్నెల నిండా వాన నీళ్ళే. బండలన్నీ బురద.

గణేషు లేచి నీళ్ళకుండ పక్కనే ఉన్న స్కూల్ బ్యాగుని చూసినాడు. భయమేసింది. రాత్రి సామాన్ల మీద కారకుండా కప్పినాడు. బ్యాగ్ పక్కన పెట్టేది మర్సిపొయినాడు. సగానికి నానిపోయింది. తొందరగ బయటికి తీసి బుక్కులన్ని చూస్తాన్నాడు. “సోషల్ టెస్ట్ బుక్కొక్కటి నానకుండ ఉంటే సాలు దేవుడా…” అనుకుని చూసినాడు. సరిగ్గా అన్నిటికంటే ఎక్కువ సోషల్ బుక్కే నానిపోయింది.

అంతలో వాళ్ళమ్మ బయటినుండి “గణేషూ, ఇట్ల సూద్దురా! సూరమ్మత్తోళ్ళ ఇల్లు…” అనుకుంట పిలిచింది. బయటికి పొయి చూస్తే ఇంటి గోడ సగం పడిపోయింది. “రాతిరొచ్చినే శబ్దం ఇదేనా?” అనుకున్యాడు. ఆ రాళ్ళన్నీ దారిలో పడి వాన నీళ్ళు పోయ్యేకి దారి ల్యాక అవన్నీ గణేషు వాళ్ళింటికొచ్చినాయి. అందుకే బ్యాగు తడిసింది.

“బోరింగు కాటికిపోయి నీళ్ళు తెద్దాం పా, ఇళ్ళు కడగళ్ళ గదా?” అని గణేషుని తీస్కోనిపోయింది పార్వతమ్మ.

బోరింగ్ కాటికి పొయ్యేసరికి శంకరున్నాడు.

“ఒలే గణేషూ… రాత్రి మీ వాడు దుమ్ము లేపినాడులే” అన్నాడు గట్టిగా.

“ఏందిరా..?” అనింది పార్వతమ్మ అర్థం కాక.

“ఏందిలే? కిర్కేటా!” అడిగినాడు గణేషు.

“అవులే… మీ వాడు ఆరు బాళ్ళకి ఆరు సిక్సులు. ఎట్ల కొట్టినాడనుకుంటివి?” అంటాన్నాడు శంకరు కళ్ళు పెద్దవి చేస్కుంట.

“నిజంగానారా?” నమ్మలేకపొయినాడు గణేషు.

“నిజంగంటేప్పా… నేనెందుకు అబద్దం చెప్తా? కావల్లంటే బడికి పొయ్యేటప్పుడు చౌడమ్మ గుడి కాడ పేపర్లో చూపిస్తాలే” అని చెప్పేసి నీళ్ళ బిందె తీస్కొనిపొయినాడు.

యువరాజ్ సింగ్ ఆరు బాళ్ళకి ఆరు సిక్సులు కొట్టినాడన్నే మాటతోనే గణేషు మూడంతా మారిపోయింది. ముందు రోజు రాత్రి పడినే కష్టమంతా యాడ పోయిందో!

వాళ్ళమ్మతో కలిసి నీళ్ళ బిందెలు ఇంటికి తీస్కపొయినాడు.

“ఛా… వాన పడకపోతే బాగుండు” అన్యాడు ఇల్లు తుడుసుకుంట.

“అట్ల అనరాదప్పా, మనిల్లు కారిందని వాన రాగూడదు అనుకుంటే ఎట్లా? పంటలు పండల్ల గదా?” అనింది పార్వతమ్మ.

“అవ్… అది గూడ నిజమేమా. అయినా సరే వాన పడకపోతే బాగుంటాండ్య, నిన్నొకటి పడకపొయినా బాగుంటాండ్య” అన్నాడు.

“ఏరా?” పార్వతమ్మ.

“నిన్న కిర్కేటు మ్యాచు ఉన్నింది మా” అని చెప్పి గబ గబా క్లీన్ చేసి సగం నానిన్నే బ్యాగు భుజాలకి తగిలిచ్చుకోని బడికి బయల్దేరినాడు గణేషు.

చౌడమ్మ గుడి కాడికి పొయ్యేసరికి శంకరు చేతిలో న్యూస్ పేపరు పట్టుకోని నిలబడుండాడు.

స్పోర్ట్స్ పేజ్ తీసి న్యూసంతా సదివి బడికి బయల్దేరినారు ఇద్దరూ. బడికి పొయ్యేవరకు “మా వాడు భలే కొట్టినాడు గదురా”, “నేను చూసింటే బాగుంటాండ్యరా”, “ఇంగెవురూ కొట్లేరేమో మా వాని మాదిరి” అనుకుంట చెప్తానే ఉన్నాడు.

ఇల్లు తుడుసుకుంట లేటయింది. స్కూలుకి పొయ్యేతలికే ప్రేయరైపోయింది. సోషల్ పీరియడ్ జరుగుతాంది. భయపడుకుంట “మైకమీన్ సార్?” అన్యారు. లోపలికి రమ్మన్యాడు సారు.

పోయి కుచ్చుంటానే గణేషుని లేపి టెస్ట్ బుక్ తీసి చదవమన్యాడు. ఆ నానిపోయిన టెస్ట్ బుక్ తీసి చదవడం మొదలు పెట్టినాడు గణేషు. పక్కనున్న పిల్లోడు నవ్వినాడు.

“ఎందుకురా నవ్వుతున్నావ్?” అడుగుతాన్నాడు సారు.

“వీని టెస్ట్ బుక్ నానిపోయింది సార్!” అన్నాడు వాడు.

సారొచ్చి టెస్ట్ బుక్ ఎందుకు నానిపోయిందో కూడా అడగకుండా బర్రతో వీపంతా వాయగొట్టినాడు.

ఏడ్సుకుంట కుచ్చొయినాడు గణేషు.

“వాన పడకపోతే బాగుండు” అనుకున్యాడు ఇంగోసారి.

కాకపోతే ఈ సారి క్రికెట్ గురించి కాదు.

***

పది సంవత్సరాల తర్వాత,

హైదరాబాద్,

బేగంపేట్.

సన్నగా మొదలైన వర్షం అప్పుడప్పుడే పెద్దగైతాంది. బాల్కనీలో కుచ్చోని కాఫీ తాగుకుంట “వానెంత బాగుందో” అనుకుంటాన్నాడు గణేషు.

సరిగ్గా గణేషున్న రూముకి కొంచెం దూరంలో ఉన్న చిన్న రూములో వాన నీళ్లు వస్తాంటే ఒక చిన్న పిల్లోడు “వాన పడకపోతే బాగుండు” అనుకుంట కుచ్చొయినాడు.

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

షేక్ మొహమ్మద్ గౌస్

తక్కువ సమయంలో ఎక్కువ రాస్తూ గుర్తింపు పొందిన రచయిత. స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రి. జననం: 1997. బీ.టెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు. తొలికథ 'చిల్డ్రెన్స్ డే' 2020లో వెలువడింది. ఇప్పటివరకూ 30 కథలు రాసి వాటిలో రాయలసీమ యాసలో రాసిన కథలన్నీ కలిపి 'గాజులసంచి' గా వెలువరించారు. శిల్ప ప్రాధాన్యంగా రాయడం సాధన చేస్తున్నారు. ఐటీ రంగంలో ఉద్యోగం. ప్రస్తుత నివాసం: హైదరాబాద్.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు