వలస కార్మికుల సుదీర్ఘ కాలినడకల పయనం..

పౌర సమూహాల పోరు-2

మార్చ్ 18న మా డబ్ల్యుటివో జెఎసి సభ్యుల చొరవతో రామంతపూర్ లోని మాంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ లో భౌతిక దూరం పాటిస్తూ హైదరాబాద్ లో పనిచేసే కొన్ని సంఘాల ప్రతినిధులు ఒక పదిమందితో ఒక సమావేశం జరిగింది. కోవిద్ వైరస్ కట్టడిలో ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించీ చర్చించి ఈ విషయంలో ఒక విస్తృతమైన కార్యాచరణ అవసరమని, ఇంకా అనేక సంస్థలను ఈ కార్యక్రమంలోకి భాగస్వామ్యులను చేయాలని నిర్ణయించారు.

కోవిద్ వైరస్ ప్రభావం వల్ల భౌతిక దూరం పాటించాల్సి వచ్చే పరిస్థితుల్లో, తక్షణం ఉపాధి పరంగా, ఆరోగ్య పరంగా ప్రభావితమయ్యే కొన్ని వర్గాలైన…గృహ కార్మికులు, ట్రాన్స్ జెండర్లు, నిరాశ్రయులు, ఆరోగ్య, పారిశుద్ధ్య కార్మికులు, వ్యవసాయ శ్రామికులు, పట్టణ వలస కార్మికులు, వీధి వ్యాపారులు, వికలాంగులు…మొదలైనవారికి రెండునెలలకు సరిపడా ఆహార ధాన్యాలను ప్రభుత్వం అందించాలని, ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయాలని, కరోనా వైరస్ సోకినవారు కోలుకోవటానికి మానసికపరమైన మద్దతు అవసరమని, అందుకోసం కౌన్సిలర్స్ ని నియమించాలని, ప్రజలకు ఈ ఆరోగ్య పరమైన అవగాహన కల్పించడంలో, పరిస్థితిని కలిసికట్టుగా ఎదుర్కోవటంలో స్వచ్చంద సంస్థలుగా ప్రభుత్వంతో కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం కలుపుకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ ఒక సమగ్రమైన మెమొరాండం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించడం జరిగింది. అప్పటికే యాక్షన్ ఎయిడ్ లాంటి సంస్థలు వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రతలపై తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ బాషలలో పోస్టర్లు వేసి పంపిణీ చేసే పనిని ప్రారంభించాయి.

 కోవిద్-19 లాక్ డౌన్ అడ్వకసి గ్రూప్:

తెలంగాణ ప్రభుత్వం బంద్ ప్రకటించిన వారం రోజులకు, ముందు ఒకరోజు జనతా కర్ఫ్యూ అన్న కేంద్ర ప్రభుత్వం రెండురోజులు తిరిగేసరికి, మార్చ్ 24 నుంచీ దేశమంతా లాక్ డౌన్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక అప్పటినుంచీ పరిస్థితులు వేగంగా మారటం మొదలయ్యాయి. రోజుకో సవాలు ఎదురవుతూ వచ్చింది. ఊహించని ఈ పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోవటానికి హైదరాబాద్లో మరింత విశాల ప్రాతిపదిక మీద ప్రజాస్వామ్య భావసారూప్యత వున్న వివిధ వ్యక్తుల, సంస్థల, సమూహాల ప్రతినిధులతో ఏర్పడినదే అడ్వకసి కోవిద్-19 లాక్ డౌన్ గ్రూప్. ప్రత్యక్షంగా ఎవరూ కలుసుకునే అవకాశం లేదు. అంతా ఫోన్ల మీదే సంప్రదింపులు. వాట్సప్ గ్రూప్ ద్వారానే చర్చలు. నగరం నలువైపులా వున్న మిత్రులే కాక, ఇతర నగరాల్లో, విదేశాల్లో వుంటున్న మిత్రులు కూడా దీనిలో భాగస్వామ్యులయ్యారు.

రకరకాల పనులను చర్చించుకుంటూ, వివిధ స్థాయిల్లో, రూపాల్లో అందరూ పనిచేయటం ప్రారంభించారు. మళ్లీ పని, అవసరాన్ని బట్టి, సమన్వయం కోసం చిన్న చిన్న ఫోకస్ గ్రూప్స్ ఏర్పడటం, అనుకున్న పనిని పూర్తి చేయటం, పెద్ద గ్రూప్లో వాటికి సంబంధించిన వివరాలను పంచుకోవడం జరిగేది.

ఇందులో, డబ్ల్యుటివో జెఎసి, మానవహక్కుల వేదిక, రైతు స్వరాజ్య వేదిక, కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్, అమూమత్ సొసైటీ, అమన్ వేదిక, నిరాశ్రయ శ్రామిక్ సంఘటన, దళిత్ విమెన్ కలెక్టివ్, హైదరాబాద్ ముస్లిం విమెన్ ఫోరం, అన్వేషి, ఐ ఫర్ ఫార్మర్స్, ఐ విల్ గోఅవుట్, తెలంగాణా గృహకార్మికుల సంఘం, ఛత్రి, బస్తీవాసుల వేదిక, మాంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్, తెలంగాణా డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్, ప్రేమమార్గ్, సఫా సొసైటీ, యుగాంతర్, భూమిక ఉమెన్స్ కలెక్టివ్, అంకురం, నేషనల్ వర్కర్స్ మూవ్మెంట్, తెలంగాణా హిజ్రా-ఇంటర్ సెక్స్-ట్రాన్స్ జెండర్ సమితి, మహిళా రైతుల హక్కుల వేదిక(మకాం),యాక్షన్ ఎయిడ్, ఇండియన్ నెట్వర్క్ అఫ్ బేసిక్ ఇన్కమ్, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, కోవా, పివోడబ్ల్యు, హెల్ప్ హైదరాబాద్, టిస్, ఎన్ఏపిఎం, హైదరాబాద్ అర్బన్ లాబ్స్, గ్రామ్య, వాసన్, దస్తకార్ ఆంధ్ర, దళిత్ బహుజన్ ఫోరం, తెలంగాణ విద్యావంతుల వేదిక, ప్రేమ ఆనంద స్పిరిచ్యువల్ సొసైటీ, వరల్డ్ విజన్ ఎమ్విఎఫ్, యాక్సెస్ ఫౌండేషన్ వంటి సంస్థలతో పాటు ఇంకా అనేక సంస్థలు ఈ కృషిలో భాగమయ్యాయి. సి. వనజ, పద్మజ షా, మాలిని సుబ్రమణ్యం, అయేషా మిన్హజ్, మసూద్, అనిత రెగో, రాధిక దేశాయ్, జస్వీన్ జైరత్, అంజు ఖేమని, వివి జ్యోతి, రమణమూర్తి, ఐజాజ్, షహనాజ్, సురేష్ ఘట్టమనేని, ఉదయ్, విషి, వాఘీష్, సంధ్యా కన్నెగంటి… ఇంకా అనేకమంది వ్యక్తులుగా భాగమయ్యారు. ఇంత విస్తృతమైన స్థాయిలో వివిధ నేపథ్యాలనుంచీ అనేకమంది ఒకే వేదిక మీదకు వచ్చి కలిసిపనిచేయటం అనేది ప్రతి ఒక్కరికీ కూడా ఎంతో విలువైన అనుభవం . బహుశా ఏ విశ్వవిద్యాలయాల్లోనూ, మేనేజ్మెంట్ కాలేజీల్లోనూ, కోర్సుల్లోనూ నేర్చుకోలేని అంశాలు ఇవి.

అన్నపూర్ణ క్యాంటీన్ లను తెరిపించడం:

లాక్ డౌన్ వల్ల అన్నీ మూతపడటంతో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన ప్రజలకు ఆహారం ఎలా అన్న ప్రశ్న ముందుగా ఎదురైంది. హోటళ్ళతో సహా అన్నివ్యాపార సంస్థలను మూసేసి, రోడ్ల మీద పోలీసు కాపలా పెట్టడంతో నగరం నలుమూలలా అనేకమంది ఆహారం లేక ఇబ్బందులు పడటం మా దృష్టికి రావటం మొదలైంది. ఈ సమస్యపై ఎంతోమంది వ్యక్తులు, సంస్థలు, సంఘాలు అపూర్వంగా మానవీయంగా స్పందించారు. ఎక్కడికక్కడ స్థానికంగా స్వచ్చందంగా ఆహారం వండి రోడ్డు మీద వున్నవాళ్ళకు అందించడం మొదలు పెట్టారు. ఎన్నో సంస్థలు పేద ప్రజలకు, వలస కార్మికులకు రేషన్ కిట్స్ అందించటానికి సన్నాహాలు చేశాయి.

ఈ అడ్వకసి గ్రూప్ నుంచీ హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం నడిపే అన్నపూర్ణ క్యాంటీన్లు ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయో, ఎన్ని ప్రాంతాల్లో వీటి అవసరం వుంటుందో ఒక్కరోజులో పరిశోధించి జిహెచ్ఎంసి కమీషనర్ కి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మెమొరాండం ఇచ్చాం. ఈ ఒత్తిడితో లాక్ డౌన్ ప్రకటించిన వారం రోజుల తర్వాత అన్నపూర్ణ క్యాంటీన్లు అన్నిటిని తెరవడమే కాక మరికొన్ని అదనంగా కూడా ప్రభుత్వం ప్రారంభించింది.

మొదలైన వలస కార్మికుల సుదీర్ఘ కాలినడకల పయనం:

వాణిజ్య కార్యక్రమాలు ఆగిపోవటంతో ఎక్కడికక్కడ తిండి, రేషన్ లేక ఇబ్బందులు పాలవుతారని ఊహించగలిగాము కానీ, కాలినడకనైనా సరే వందల కిలోమీటర్ల దూరంలోని స్వంత ఊర్లకు వెళ్లటానికి ప్రయత్నిస్తారని ముందు అస్సలు ఊహించలేకపోయాము. అలాంటి సంక్లిష్ట పరిస్థితిలో నగరంలో భవన నిర్మాణ కార్మికులుగా విశాఖపట్టణం , శ్రీకాకుళం జిల్లాల నుంచీ వచ్చి బంజారాహిల్స్ గుడిసెల్లో వుంటున్న దాదాపు వందమందికి పైగా వున్న ఆదివాసీ సమూహం ఆహారం లేకుండా పడుతున్న ఇబ్బందుల గురించి అనకాపల్లి మిత్రుడు అజయ్ కుమార్ సమాచారం అందించారు. అమెరికాలో ఉంటున్న మల్లిక్ వెంటనే ఈ గ్రూప్ కోసం సహాయం చేయటానికి ఒక వాట్సప్ గ్రూప్ పెట్టడంతో సమన్వయం సులభం అయింది.

నేను, రమేష్ వారి దగ్గరకు ప్రత్యక్షంగా వెళ్లి విషయం కనుక్కుని తక్షణం ఖలీదా పర్వీన్ ద్వారా ఆహారం అందించాము. వండిన ఆహారం కన్నా సరుకులు ఇస్తే బాగుంటుంది అన్న వారి కోరిక మేరకు సఫా ఫౌండేషన్ నుంచీ రుబీనా కొంత రేషన్ అందచేసింది. ఇంకా వివిధ వ్యక్తులు, సంస్థల సహకారంతో ఇంకో పదిహేను రోజులకు సరిపడా రేషన్ సమకూర్చాము. అయితే, పదిహేను రోజులు అనుకున్న బంద్ కేంద్ర ప్రభుత్వ లాక్ డౌన్ నిర్ణయంతో ఏప్రిల్ 16 వరకూ పొడిగించడంతో ఈ సమూహంలోని కొంతమంది మార్చ్ 23 అర్ధరాత్రి కాలినడకన తమ ఊర్లకు బయలుదేరారు. మేము ఉలిక్కిపడిన, ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చిన సందర్భం ఇది. మాకు చెబితే వద్దంటామని, దాదాపు నకిరేకల్ వెళ్ళేవరకూ వాళ్లు మాకు ఎవ్వరికీ సమాచారం ఇవ్వలేదు. ఇక అక్కడి నుంచీ వారు వారి వూరి చేరేవరకూ దారిలోవున్న మిత్రులకు సమాచారం అందిస్తూ వారికి ఆహారం, మంచి నీరు, ఇతర అవసరాలు తీర్చేబాధ్యత తీసుకున్నాం. అలా నడక మొదలెట్టిన వారు నాలుగైదు రోజుల తర్వాత తమ స్వంత వూరు చేరేవరకూ, దారిలో వారికేమన్నా అవుతుందేమో, పోలీసులు కొడతారేమో, ఆపేస్తే ఎలా అనే భయం మాకు లోపల్లోపల అలా పెరుగుతూనే పోయింది. ఈ సమాచారం అందించిన క్షణం నుంచీ రంగంలోకి దిగిన వివిధ పట్టణాల జర్నలిస్టు మిత్రుల సహకారం లేకుండా వారిని క్షేమంగా వారి ఊరు చేర్చగలిగి వుండేవాళ్ళం కాదు. అలా మొదలైన ఆ సమూహపు ప్రస్తానం వివిధ గ్రూపులుగా మే 20 వ తారీకు వరకూ అంచెలంచెలుగా సాగి, మొత్తానికి అందరూ వారి ఊర్లు చేరుకోగలిగారు. అత్యంత బాధ కలిగించిన విషయమేమంటే చివరి 12మంది బృందం తప్పించి మిగిలిన అందరూ కూడా కాలినడకన దగ్గరదగ్గర 700 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళటం!

మరోపక్క, నగరంలో వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లో చిక్కుపడిపోయిన ఇతర రాష్ట్రాల కార్మికులు తమ స్వరాష్ట్రాలకు కాలినడకన వెళ్ళటం మాకు కనిపిస్తూనే వుంది. అలా నెత్తి మీద బరువులతో, చిన్నచిన్న పిల్లల్ని పట్టుకుని వారు రోడ్ల మీద నడుస్తూ వుంటే ఏమీ చేయలేని నిస్సహాయత మెలిపెట్టేసేది. పైగా, మేము వుండేది రెండు జాతీయ రహదారులను కలిపే అతిపెద్ద కూడలి ఆరాంఘర్ పక్కనే అవటంతో ప్రతిరోజూ కొన్నివేలమంది నడుస్తూ వెళ్ళటాన్నిప్రత్యక్షంగా చూస్తూ ఉండాల్సి వచ్చేది. మా కూడలికి సమీపంలో తక్షణం మొదటిరోజునే స్పందించినవారు అలీ భాయి అనే సామాన్య కార్మికుడు. ఆ వెంటనే షహనాజ్, ఐజాజ్ దంపతులు. వెనువెంటనే సయ్యద్ కాజిమ్ హష్మి, రిషివర్ధన్లు. మరొక్క రోజు తిరిగేసరికి ఆ సెంటర్లో ఆహారం పంచేవారి సంఖ్య పెరిగింది. ఉదయం నుంచీ రాత్రి పోద్దుపోయేవరకూ నిరంతరం ఎవరో ఒకరు ఆహారం పంచుతూనే వుండేవారు. ఎంతమంది దాతలు వచ్చి పంచినా గానీ సరిపోయేది కాదు. సొంత ఊర్లకు పయనమయిన ప్రజలు అలా ఒక ప్రవాహంలా వస్తూనే వుండేవారు. ముందు ఒక వెయ్యి మందితో మొదలు పెట్టిన హష్మి రెండో రోజు నుంచే మూడువేలమందికి వండించి పెట్టడం మొదలుపెట్టారు. ఒక వ్యాపారవేత్త అయిన ఈయన తన కంపనీ తరఫు నుంచీ, తాను నివసించే అపార్ట్ మెంట్ లోని స్నేహితుల సహాయంతో దాదాపు నెలరోజులపాటు నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఆ నెలరోజులు అక్కడొక సంరంభమే. మేమూ అక్కడికి సమీపంలోనే ఉంటాము కాబట్టి వీలున్నప్పుడల్లా ఆ పనిలో మేమూ పాలు పంచుకునేవాళ్ళం. ఎక్కడ, ఎవరికి అవసరముందని చెప్పినా గానీ వెంటనే అక్కడికి ఆయన వాలంటీర్లు వెళ్లి ఆహారం ఇచ్చి వచ్చేవారు.

ఇంత బాధ్యత తీసుకోవటానికి ఏమిటి ప్రేరణ అని అడిగితే, “కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా అలా అంతమంది, మన చుట్టూ మనకోసం పనిచేసే మనుషులు అలా నడిచివెళ్లటం ఏంతో బాధగా అనిపించింది. పని నడవకపోయినా గానీ మనకు ఇళ్ళల్లో కూర్చునివుండే సౌకర్యం వుంది. కానీ , వారికి చాలా అభద్రత వుంది. అన్ని సమస్యలూ మనం తీర్చలేకపోవచ్చు. కనీసం ఒకపూట తినడానికి తిండి పెట్టి నీళ్లు ఇవ్వగలిగినా చాలనిపించింది” అని చెప్పారు. అలానే, షహనాజ్, ఐజాజ్ ఇద్దరూ రంజాన్ పండుగ వరకూ తమ ఆహార పంపిణీని అవసరమైన చోట క్రమం తప్పకుండా చేశారు. ఇంకా, నగరంలోని నలుమూలల అనేకమంది పౌరులు మతాల కతీతంగా అపూర్వంగా స్పందించారు. రోజుల తరబడి ఆహారాన్ని అందించారు, ఇంకా అందిస్తున్నారు. వీరందరి కృషి అసామాన్యం. నిజానికి ప్రజలు స్పందించకుండా వుండివుంటే హైదరాబాద్ చుట్టుపట్ల రహదారులమీద మనం ఊహించలేనన్ని ఆకలిచావుల్ని చూడాల్సి వచ్చేది. ఈ స్పందనను చెప్పటానికి మాటలు సరిపోవు. వలస కార్మికులకి, పేద ప్రజలకి తమ చేయూతను అందించిన ప్రతివక్కరికీ పేరుపేరునా వందనాలు. కేరళ నుంచీ ఉత్తర ప్రదేశ్ వెళ్లటానికి రోజులతరబడి ప్రయాణం చేసి వచ్చిన ఒక యువకుడు “ఇంత అపురూపమైన ఆతిథ్యాన్ని అందించిన హైదరాబాద్ ప్రజల్ని మేము మర్చిపోలేం, ఇన్ని రోజుల ప్రయాణ బడలిక కూడా ఏమీ బాధపెట్టడంలేదు, మేమయితే ఇలా చేయలేం, మీకందరికీ నమస్తే” అని పదే పదే చెప్పి వెళ్లాడు.

నిజానికి ఇలాంటి సందర్భంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు చేయగలిగేది చాలా ఎక్కువ వుంటుంది. ముఖ్యంగా అధికార పక్షం నాయకులు. సీతక్క లాంటి ప్రతిపక్ష నాయకురాలు కొండాకోనలు పట్టుకుని, కాలినడకన ఆదివాసీ గూడాలకు వెళ్లి రేషన్ అందించినట్లు చూశాం. కానీ, ఒకరిద్దరు తప్పించి అధికారపక్ష సభ్యులెవరూ ఈ అంశాన్ని బాధ్యతగా తీసుకున్నట్లు అనిపించలేదు. పైగా, కొంతమంది రాజకీయ నాయకులు స్వచ్చంద సంస్థలు చేస్తున్న కృషిని తమ ఖాతాలోకి వేసుకోవటానికి ప్రయత్నించిన సంఘటనలు ప్రత్యక్షంగా చూశాం. అది రేషన్ అయినా, రవాణా సపోర్ట్ అయినా గానీ! తన ఇంటికి కూతవేటు దూరంలోనే నివసించే వలస కార్మికుల పరిస్థితిని ఒక అధికారపక్ష ఎమెల్యే దృష్టికి తీసుకువెళ్లినాగానీ అది తన నియోజకవర్గ పరిధి కాదని అంటే, ఇన్ని లెక్కలు ఇంత విపత్కర పరిస్థితిలో అవసరమా అని ఆశ్చర్యపోవటమే మా వంతు అయింది.

(ఇంకా వుంది)

సజయ. కె

6 comments

Leave a Reply to Shirin Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గౌరవనీయులైన జయ గారు,
    హైదరాబాద్ ప్రజల అసామాన్య ఆతిథ్యం గురుంచిన మీ వ్యాసాలు అద్వితీయం. తెలంగాణ ప్రజల పెద్దమనసును గురుంచి విన్నాం గాని నేడు ఇంత విపత్కర పరిస్థితులలో వారందరు స్పందించిన తీరు అసామాన్యం. దైవం మానుష రూపేణా అని ఆర్యోక్తి, కానీ ఈనాడు నిజ జీవితం లో ఆ వాక్యం సత్యమని నిరూపితమైంది. మీరు అందరు ధన్యులు. ఇదొక పవిత్ర యజ్ఞం గా నిర్వహించారు. అభినందనలు.

    షిరిన్

  • Sajaya గారు,
    పౌర సముహా ల పోరు చాలా బాగా చిత్రీ క రిస్తున్నారు.మా సంస్థ భాగ స్వామ్యం ఉన్నప్పటికీ ,నేను అందరి లాగా పూర్తి స్థాయి లో పని చేయలేదు .
    మన మిత్రులు వాళ్ళ నైపుణ్యాలు ఎట్లా వినియోగించారు,ఎంత మానసిక, బౌతి క స్ట్రెస్ అంభవించారో చూసాను. చాలా అద్వితీయమైన మానవ విలువలు,సంకల్పం ప్రదర్శించారు.
    ఇదంతా మీరు బాగా రికార్డ్ చేస్తున్నారు.
    పాల్గొన్న వాళ్లంతా ,వాళ్ళ వాళ్ళ అంభవాలు కూడా రాస్తే బాగుంటుంది.
    *జీవన్ కుమార్

  • మహత్తర
    మైన పనిని చేశారు.మాటలలో వర్ణిచలేను.
    ఫలితమాంచని ఆరాధనఅంటే నే సేవ.
    పనిలో మీరంత భాగస్వాములు
    కావడం, వలస కార్మికుల ను గమ్యం చేర్చటం వారి .
    అదృష్టం

  • మీ కృషి వలస కార్కికులకు చాలా సహాయ పడింది

  • గొప్ప సహాయం చేసిన మీ బృందానికి జేజేలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు