వరవరరావు …ఆరు అక్షరాల అగ్ని కీల!

న్నని చెప్పను?ఎంతని చెప్పను? ఎట్లా చెప్పను?

నేను పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచీ తెలిసిన మనిషి. ఆయన ఎనబై సంవత్సరాల జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాలు నేను పుట్టక ముందే గడిచిపోయాయి. కాని ఆయనతో సంభాషణల్లో, కుటుంబ గాథల్లో, ఆయనే ఆ తొలి జీవితం గురించి చేసిన రచనల్లో, ఉపన్యాసాల్లో ఆ జీవితం గురించి కొంత తెలుస్తున్నది. ఆయన నన్ను పసిపిల్లవాడిగా ఎత్తుకుని ఆడించారేమో, నా మొదటి ఆరేడేళ్లు ఆయనను కేవలం మా అమ్మ తమ్ముడిగా మాత్రమే చూశానేమో గాని, ఆ తర్వాత నుంచి, అంటే యాబై ఏళ్లకు పైగా ఆయన ఆలోచనాచరణల, మాటల, రచనల, పనుల, సలహాల, మందలింపుల, సూచనల, ప్రోత్సాహాల, కోపాల, ఓదార్పుల, అలకల ఛత్రఛాయలోనే పెరిగాను.  ఆయన లేకుండా నేను ఎంతమాత్రమూ లేను. ఆయన లేకుండా నా తరంలో, నా తర్వాతి తరంలో చాల మంది కూడ ఇప్పుడున్నట్టు ఉండేవారు కాదు. అసలు ఆయన లేకుండా తెలంగాణ ఇప్పుడున్న స్థితిలో ఉండేది కాదు. ఆయన గురించీ ఆయన సృజన గురించీ ఇదివరకు రాశాను, మాట్లాడాను గాని ఇవాళ ఆయన ఎక్కడో సుదూరాన ఆస్పత్రిలో, పాలకుల కక్షసాధింపుకు గురవుతూ అంపశయ్య మీద ఉన్నప్పుడు, ఎడతెగని దుఃఖంలో, నిస్సహాయ ఆగ్రహంలో ఆయన గురించి నాకు తెలిసిందంతా చెప్పాలనిపిస్తున్నది. రాయాలనిపిస్తున్నది.

ఆయన ఎనబై సంవత్సరాల జీవితాన్ని మీకు పరిచయం చెయ్యడానికి ఆయనను ఏడు కోణాలలో చూపదలిచాను. ఆయన ఒక సప్తవర్ణాల ఇంద్రధనుస్సు. ఆ ఏడు రంగులూ కలగలిసి ఏకమై సమ్మిళితమై వెలిగిన తెల్లని మెత్తని చిరునవ్వు. ఆ ఏడు కోణాలు – సృజనకర్త, బోధకుడు, సంపాదకుడు, నిర్మాణదక్షుడు, కార్యకర్త, రాజ్య బాధితుడు, మనీషి.

1

పాఠకుడిగా, సృజనకర్తగా, కవిగా, రచయితగా, సాహిత్యజీవిగా వరవరరావు జీవితం చాల చిన్న వయసులోనే ప్రారంభమైంది. కుటుంబ వాతావరణం వల్ల ఏడో, ఎనిమిదో ఏట చదువు, ఆ వెంటనే రాత మొదలయ్యాయి. పదిహేడేళ్ల వయసులో మొట్టమొదటి కవిత, అదీ అప్పటికి కవులందరూ ప్రతిష్ఠాత్మకంగా, గౌరవంగా భావిస్తుండిన, ప్రతి వారమూ ఒక కవిత మాత్రమే అచ్చువేస్తుండిన తెలుగు స్వతంత్రలో అచ్చయింది. ఆ తర్వాత అరవై ఏళ్ల పాటు మనుషులతో కిటకిటలాడే ఇంట్లోనైనా, ఊపిరి సలపనీయని కాలేజి ఉద్యోగంలోనైనా, ఉధృతమైన ఉద్యమాల్లోనైనా, ఎడతెగని ప్రయాణాల్లోనైనా, జైలుజీవితపు ఒంటరితనంలోనైనా చదువూ రాతా లేకుండా ఆయనకు ఒక్క రోజు కూడ గడవలేదు. వెయ్యి పేజీల కవిత్వం, వెయ్యి పేజీల అనువాదాలు, కనీసం ఐదువేల పేజీల వచన రచనలు, రెండు వందల సంచికల ప్రతిష్ఠాత్మక సాహిత్య పత్రిక సంపాదకత్వం, వందల పుస్తకాల సంపాదకత్వం, వేలాది పుస్తకాల అధ్యయనం కలగలిపితే వరవరరావు.

వరంగల్ జిల్లా చిన్నపెండ్యాల లో 1940 నవంబర్ 3న ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వరవరరావు ఐదుగురు అక్కలకూ, నలుగురు అన్నలకూ తమ్ముడిగా ఆఖరివాడు. ఆయన కుటుంబం ఆధునిక రాజకీయ, సాహిత్య భావాలకు పాదు. ఆయన అన్నలు నలుగురూ సాహిత్య ప్రవేశం ఉన్నవాళ్లు. కాళోజీ సోదరులకు, పొట్లపల్లి రామారావుకు, వట్టికోట ఆళ్వారుస్వామికి స్నేహితులు. 1940ల తొలి రోజుల్లోనే గ్రామంలోనూ, సమీప పెద్ద గ్రామమైన ఘనపురం లోనూ గ్రంథాలయాలు, ప్రచురణ సంస్థలు ప్రారంభించినవాళ్లు. అందులో ఇద్దరు క్రియాశీల కాంగ్రెస్ రాజకీయాల్లో ఉండేవాళ్లు. పెదతండ్రి కొడుకు కమ్యూనిస్టు రాజకీయాల్లో ఉండేవాడు. తన తొలి దశకంలో, అప్పుడప్పుడే మనసు మీద ప్రభావాలు పడుతున్న దశలో, ఇంట్లోకి గ్రామ మాల మాదిగలను పిలుచుకువచ్చి, భోజనాలు పెట్టి, ఇంటి నుంచి బహిష్కరణకు గురైన సంస్కరణవాదిగా, ఆ తర్వాత తెలంగాణ రైతాంగ సాయుధపోరాట దళనాయకుడిగా ఎదిగిన పెత్తండ్రి కొడుకు సాహసాలు చూశారు. స్వయంగా తన అన్నలు ఇద్దరు జిల్లా కాంగ్రెస్ నాయకులుగా నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొనడమూ, పోలీసుల, రజాకార్ల దాడులను ఎదుర్కోవడమూ, రజాకార్ల దాడుల నుంచి తప్పించుకోవడానికి పోలీస్ యాక్షన్ కు ముందు కుటుంబం మొత్తం బెజవాడ ప్రవాసం వెళ్లి కొన్ని నెలలు గడపడమూ ఎనిమిది తొమ్మిదేళ్ల పసి మనసు మీద పడిన గాఢమైన ప్రభావాలు. ఎనిమిదో ఏట తండ్రి మరణం, పదో ఏట పెద్దన్న, వదిన, వాళ్ల పాపల మరణాలు తన మీద చెరగని ప్రభావం వేశాయని ఆయనే రాసుకున్నారు.

ఈ ఒత్తిళ్ల వల్ల, సాలార్జంగ్ జాగీర్ గ్రామమైన స్వగ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేకపోవడం వల్ల, గ్రామంలోకి వచ్చిన ప్రైవేటు ఉపాధ్యాయుల దగ్గరే ప్రాథమిక విద్య అరకొరగా సాగింది. కాని నలుగురు అన్నల సాహిత్య, రాజకీయ ప్రభావాలే ఆయనకు ఎనలేని సామాజిక అవగాహనలను అందించాయి. బడిపలుకుల కన్న ముందే పలుకుబడులు తెలిశాయి.

ఐదో తరగతిలో చేరడానికి 1950లో హనుమకొండ చేరి, అక్కడే డిగ్రీ దాకా చదివారు. ఉన్నత పాఠశాలలో, పియుసిలో అందమైన చేతిరాత ఉన్న వ్యక్తిగా, అన్నలు నడుపుతుండిన లిఖిత పత్రికల లేఖకుడయ్యారు. ఆ పత్రికల్లో రచనలు చేయడం ప్రారంభించారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిగా 1957 నవంబర్ లో సోవియట్ యూనియన్ లైకా అనే కుక్కపిల్లను రోదసిలోకి పంపిందన్న వార్త చదివి ‘సోషలిస్టు చంద్రుడు’ అనే కవిత రాసి తెలుగు స్వతంత్రకు పంపించగా అది వెంటనే అచ్చయి, ఆయనకు కవిగా గుర్తింపు తెచ్చింది. బిఎ రెండో సంవత్సరంలోనూ, మూడో సంవత్సరం లోనూ వరుసగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుండిన ఆంధ్రా అభ్యుదయోత్సవాలలో కవిత్వానికి ప్రథమ బహుమతి గెలుచుకున్నారు.

హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1960లో ఎంఎ లో చేరాక కవిత్వంతో పాటు సాహిత్య విమర్శకూడ ప్రారంభించారు. ఎంఎ లో ఖండవల్లి లక్ష్మీరంజనం, దివాకర్ల వెంకటావధాని, బిరుదురాజు రామరాజు వంటి గురువుల దగ్గర తెలుగు భాషా సాహిత్యాలు అధ్యయనం చేశారు. కృష్ణశాస్త్రి, కుందుర్తి, గోపీచంద్, బుచ్చిబాబు, దాశరథి, సి నారాయణరెడ్డి వంటి సాహిత్య దిగ్గజాలతో దగ్గరిగా గడిపారు. ఎంఎ లో ఉన్న రోజుల్లోనే తిరువణ్ణామలై వెళ్లి చలంను, మద్రాసు వెళ్లి శ్రీశ్రీని కలిసి వారికి సన్నిహితులయ్యారు. 1957 నుంచి 1965 వరకు రాసిన కవితలను శ్రీశ్రీ ముందుమాటతో సంపుటంగా తేవాలని ప్రయత్నించి, శ్రీశ్రీ ఆలస్యం వల్ల, ముందుమాట లేకుండానే 1968లో ‘చలినెగళ్లు’ సంపుటంగా తెచ్చినప్పుడు చలానికి అంకితం ఇచ్చారు. ఈ సంపుటంలో వలసానంతర భారతదేశపు తొలిదశాబ్దిలోని యువకుల ఆశలూ కలలూ భావుకత్వమూ అమాయకత్వమూ కనబడతాయి. నెహ్రూ తరహా సామ్యవాద దృక్పథంలో విశ్వాసం, స్థూలమైన ప్రజాస్వామిక, ప్రగతిశీల దృక్పథం, భావుకతతో పాటు అస్పష్టత కూడ కనబడుతుంది. నెహ్రూ, కెనెడీ లు చనిపోయినపుడు వారి మీద కవితలు, మర్లిన్ మన్రో ఆత్మహత్యకు స్పందనగా కవిత, ‘భళ్లున తెల్లవారునింక భయం లేదు’ వంటి ఆశావాద కవితలు ఈ సంపుటంలో కలగలిసి ఉన్నాయి.

ఆ అస్పష్ట దృక్పథం నుంచి, నెహ్రూ సోషలిస్టు భ్రమల నుంచి, శుష్క భావుక ధోరణుల నుంచి శాస్త్రీయ దృక్పథం, హేతువాదం, సమకాలీన సమాజం, ప్రయోగశీలత పునాదిగా సృజన ఆధునిక సాహిత్యవేదిక ప్రారంభించిన 1966 నాటికి ఆయనలో మార్పు ప్రారంభమైంది. సరిగ్గా ఆ సమయానికే ప్రపంచ వ్యాప్తంగా పెల్లుబుకుతున్న కోపోద్రిక్త యువతరపు యుగ స్వభావం నుంచి, ప్రత్యేకంగా చైనా మహత్తర శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం నుంచి, నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల నుంచి ఆయనలోని  సృజనకర్త స్పష్టమైన దృక్పథాన్ని గ్రహించడం ప్రారంభించాడు. 1966-69 ఆయన సాహిత్య జీవితంలో గుణాత్మక మార్పులను సంతరించుకున్న కాలం. ఆ కాలమే ఆయన కవిత్వానికీ, సృజనశక్తికీ పదును పెట్టింది. ఆ తర్వాత 1971లో వెలువడిన జీవనాడి సంపుటం లోని కవితలు ఒకవైపు రాస్తూనే, శ్రీకాకుళ విప్లవోద్యమానికి స్నేహ హస్తాలందిస్తున్నాం అని బహిరంగంగా ప్రకటించిన తిరుగబడు కవితా సంకలనపు (1969) ప్రధాన చోదకశక్తిగా నిలిచారు.

ఆ తర్వాత యాబై సంవత్సరాలలో ఎన్ని వ్యాపకాలలోకి విస్తరించినా ఆయన కవిత్వం రాయడం, నాలుగైదేళ్లకొకటైనా కవితా సంపుటాలు వేయడం మానలేదు. అన్నిటికన్న మిన్నగా కవిగా గుర్తింపునే కోరుకున్నారు. కనీసం వందమంది కవుల సంపుటాలకు ముందుమాటలు రాశారు, అంతకన్న ఎక్కువ కవితా సంపుటాల ఆవిష్కరణ సభల్లో ఆవిష్కర్తగా, ఉపన్యాసకుడిగా పాల్గొన్నారు. ఈ యాబై సంవత్సరాల్లో వరవరరావు కవిత్వం జీవనాడి (1971), ఊరేగింపు (1974), స్వేచ్ఛ (1978), సముద్రం (1983), భవిష్యత్తు చిత్రపటం (1986), ముక్తకంఠం (1990), ఉన్నదేదో ఉన్నట్లు (1996), ఆ రోజులు (1998), దగ్ధమౌతున్న బాగ్దాద్ (2003), మౌనం ఒక యుద్ధనేరం (2003), అంతస్సూత్రం (2006), తెలంగాణ వీరగాథ (2007), పాలపిట్ట పాట (2007), బీజభూమి (2014)సంపుటాలుగా వెలువడింది. తన కవితా ప్రయాణానికి యాబై సంవత్సరాలు నిండిన సందర్భంగా 2007లో ఒక సంపుటపు సమగ్ర కవిత్వం, 2017లో అరవై సంవత్సరాల కవిత్వపు రెండు సంపుటాలు కూడ వెలువడ్డాయి.

ఆయన కవిత్వం భారతీయ భాషలన్నిటిలోకి అనువాదమైంది. హిందీ, మలయాళం, కన్నడం, బెంగాలీలలో పుస్తక రూపంలో కూడ వచ్చింది. జూలై 2020 రెండో వారంలో జైలులో, ఆస్పత్రులలో అనారోగ్యంతో ఉన్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఆయన విడుదల కోసం మొదలైన సంఘీభావ ఉద్యమంలో భాగంగా రెండు రోజుల్లో ఆయన కవితలను ఇటాలియన్, స్పానిష్, స్వీడిష్, జర్మన్, ఐరిష్ వంటి భాషలతో సహా 24 భాషల్లోకి అనువదించి ఆయా భాషల్లో చదివి సోషల్ మీడియా మీద పంచుకున్నారు.

అయితే తనను కొందరు కవిగా గుర్తించడం లేదని, తన రాజకీయాభిప్రాయాలతోనే తనను కవిగానైనా, అకవిగానైనా గుర్తిస్తున్నారని ఆయనకు ఒక విచారం ఉంటూ వచ్చింది. 1985-89 కాలంలో జైలులో ‘వెయ్యి రాత్రుల ఒంటరితనం’ అనుభవిస్తున్నప్పుడు ఈ నొప్పి ఆయనను మరింత బాధించిందని నాకు రాసిన ఒక ఉత్తరంలో అర్థమై, వెంటనే ‘స్వభావమే కవిత్వం’ అని కవిత్వంలో జవాబు రాసి ఆంధ్రజ్యోతిలో అచ్చయి తనకు జైలుకు చేరేలా చూశాను. మరీ ముఖ్యంగా తాను చాల అభిమానించే కవి, తన పుస్తకాలలో ఒక దానికి విపరీతమైన  ప్రశంసతో ముందుమాట కూడ రాసిన కవి, రాజకీయాభిప్రాయాలు మార్చుకొని, అందువల్ల వరవరరావు కవే కాదని, రాజకీయాలనే కవిత్వంగా చలామణీ చేస్తున్నాడని నింద వేయడం ఆయనను చాల బాధించింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎ లో చేరిన తర్వాత, 1960ల తొలిరోజుల నుంచే వరవరరావు సాహిత్య విమర్శ, వచనరచన కూడ ప్రారంభించారు. సినిమాల మహారణ్యంలో చిక్కుబడిపోయిన మహాకవి అని శ్రీశ్రీని ఉద్దేశించి చేకూరి రామారావు రాసిన కవిత తెలుగు స్వతంత్రలో అచ్చయితే, దాని మీద స్పందనగా శ్రీశ్రీ లేకపోతే మాత్రం ఏం, మన బాధ్యత లేదా అని వరవరరావు రాసిన వ్యాసం తెలుగు స్వతంత్రలోనే అచ్చయి ఆయన వచనరచన ప్రారంభమయింది. అప్పటి నుంచి తర్వాతి అరవై సంవత్సరాల్లో పి ఎచ్ డి సిద్ధాంత పత్రం ‘తెలంగాణ విమోచనోద్యమం – తెలుగు నవల: సమాజ సాహిత్య సంబంధాల విశ్లేషణ’ (1983) అనే ప్రామాణిక సాహిత్య విమర్శ తో పాటు ఇతర సాహిత్య విమర్శ పుస్తకాలు ఏడు (ప్రజల మనిషి – ఒక పరిచయం – 1978; కల్లోల కాలానికి కవితా దర్పణం – శ్రీశ్రీ మరొప్రస్థానం టీకా టిప్పణి – 1990; భూమితో మాట్లాడు – కల్పనా సాహిత్య వస్తు విశ్లేషణ – 2005; తెలంగాణ మాండలిక భాష – కాళోజీ – 2007; శ్రీశ్రీ భూమ్యాకాశాలు – 2010; సాహిత్యంలో సమాజ చలనపు ప్రతిఫలనం – 2013; సమరకవి సమయం – 2019), పుస్తక రూపంలో రాకుండా పత్రికల వ్యాసాల రూపంలో, ఇంటర్వ్యూల రూపంలో, ముందుమాటల రూపంలో వెలువడినవి కనీసం మరొక రెండు వేల పేజీలు ఉంటాయి.

సాహిత్య విమర్శ మాత్రమే కాక సామాజిక, రాజకీయ, సాంస్కృతిక విశ్లేషణ, సామాజిక చరిత్ర, ఉద్యమ జ్ఞాపకాలు, సంస్మరణ వ్యాసాలు, వాద వివాదాలు, సంపాదకీయాలు వంటి అనేక రూపాలలో వ్యాస ప్రక్రియలో ఆయన చేసిన అపారమైన కృషి ఇప్పటికి తొమ్మిది పుస్తకాలు వెలువడ్డాయి. (విద్యావిధానం – ఒక పరిశీలన – 1977; సహచరులు – 1989; సృజన సంపాదకీయాలు – 1990; మొదట మనం మానవులం, పౌరులం, ఆ తర్వాతే ఉద్యోగులం – 1991; సెక్యులరిజం – ఒక పరిశీలన – 1990; జైలు రాతలు – 2006; తెలంగాణ వ్యాసాలు – 2007; యహ్ క్యా జగే హై దోస్తో : పరాధీనత – స్వావలంబన – 2013; పోస్ట్ మార్టం – పోస్ట్ ట్రుత్ : దాడిచేస్తే దాగని సత్యాలు – 2017) ఇంకా పుస్తక రూపంలోకి రానివి, డ్జన్లకొద్దీ పత్రికల పుటల్లో మిగిలిపోయినవి రెండు మూడు వేల పేజీలు ఉంటాయి.

వరవరరావు సృజనలో మరొక ప్రధానమైన అంశం అనువాదాలు. సృజన, అరుణతార పత్రికల కోసం ఎక్కువగా, ఇతర పత్రికల కోసం కూడ కొంతవరకు ఆయన ఎన్నో కవితలు, వ్యాసాలు  అనువాదం చేశారు. సికింద్రాబాద్, రాంనగర్ కుట్రకేసుల నిందితుడిగా 1985-89 మధ్య జైలులో ఉన్నప్పుడు సుప్రసిద్ధ కెన్యన్ నవలా రచయిత గూగీ వా థియోంగో రాసిన నవల ది డెవిల్ ఆన్ ది క్రాస్ ను మట్టికాళ్ల మహా రాక్షసి గా, జైలు డైరీ డిటెయిండ్ ను బందీ గా అనువదించారు. వీటిలో మట్టికాళ్ల మహారాక్షసి 1992లో, బందీ 1996లో ప్రచురితమయ్యాయి. భీమా కోరేగాం కేసు నిందితుడిగా పుణె యరవాడ జైలులో గుల్జార్ సస్పెక్టెడ్ పొయెమ్స్ పుస్తకం మొత్తం అనువదించారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ కోరిక మేరకు నజ్రుల్ ఇస్లాం జీవిత చరిత్ర రాస్తూ ఆయన కవితలు యాబై దాకా అనువదించారు.

సాహిత్య సృజనను అలా ఉంచి ఏ భాషా సాహిత్య పఠనానికైనా ఆయన ఎల్లప్పుడూ తలుపులు తెరుచుకుని ఉన్నారు. ఏ కొత్త విషయం పట్లనైనా అపారమైన కుతూహలం ప్రదర్శించే స్వభావంతో అంతకంతకూ ఎక్కువగా చదవాలనీ, తెలుసుకోవాలనీ ఆయన తపన పడుతుంటారు. బైటి జీవితంలో కార్యమగ్నత వల్ల ఎక్కువ సమయం దొరకకపోయినా సమయాన్ని చాల పొదుపుగా పఠనానికీ అధ్యయనానికీ వాడుకునేవారు. భీమా కోరేగాం కేసుకు ముందు ఏడు సంవత్సరాల జైలు జీవితంలోనూ, ప్రస్తుతం దాదాపు రెండు సంవత్సరాల జైలు జీవితంలోనూ ఆయన అధ్యయనం విపరీతంగా సాగింది. మిత్రులు పంపించినవీ, తాను అడిగి తెప్పించుకునేవీ, పత్రికల్లో సమీక్షలు చదివి తాను కావాలని అడిగినవీ వందలాది పుస్తకాలున్నాయి.

ఆయన పుస్తకాల ప్రేమకు రెండు ఉదాహరణలు చెప్పాలి.

నేను ఉస్మానియాలో ఎంఎలో ఉన్నప్పుడు, బహుశా 1983లో ఒకసారి ఆయన హైదరాబాద్ వచ్చారు. ఇద్దరమూ కోఠీ వెళ్లి పుస్తకాల దుకాణాలు తిరుగుతున్నాం. ఆకలవుతున్నది, ఎక్కడైనా ఏమైనా తినడమో, బిస్కట్ తిని చాయ్ తాగడమో చేద్దామనుకుంటున్నాం.ఈలోగా బుక్ సెలక్షన్ సెంటర్ లో డి డి కోసంబి కల్చర్ అండ్ సివిలిజేషన్ ఇన్ ఏన్షియెంట్ ఇండియా కనబడింది. అప్పుడు దాని ధర ఇరవై తొమ్మిది రూపాయలు. మా ఇద్దరి దగ్గరా కలిపితే ముప్పై రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆకలీ చాయ్ అన్నీ మరిచిపోయారు. ఈ పుస్తకం కొనేద్దాం అన్నారు. అది కొని, మిగిలిన రూపాయితో నాలుగు అరటిపళ్లు కొనుక్కొని తిని, ఒక మైలు అవతల ఒక స్నేహితుడి ఆఫీసుకు వెళ్లి ఆయన దగ్గర బస్సు ఛార్జీలు అడుక్కొని క్యాంపస్ కు వెళ్లాం.

అది ముప్పై ఏడేళ్ల కిందటి అనుభవమైతే ఇది సరికొత్తది. జూలై 13న తనను ఆస్పత్రిలో చేర్చారని తెలిసి వెంటనే ముంబాయి బయల్దేరాం. 15న జైలు అధికారుల అనుమతితో జెజె ఆస్పత్రికి వెళ్లి ఆ కంపుకొట్టే వార్డులో ఎవరూ పట్టించుకోకుండా అనాథగా ఉన్న ఆయన దగ్గరికి వెళ్తే మనుషులను గుర్తించే స్థితిలో లేకపోయినా, నా చేతిలో నోట్ బుక్ చూసి, ఏం పుస్తకం తెచ్చినవురా అన్నారు. పుస్తకం కాదు, నోట్ బుక్ అంటే, అయ్యో పుస్తకమేమీ తేలేదా అని నిరాశగా అన్నారు.

2

వరవరరావు వ్యక్తిత్వంలో అనివార్య, అసాధారణ భాగం ఆయనలోని బోధకుడు. బోధన, అధ్యాపనం, వివరణ, విశ్లేషణ ఆయన నిత్య జీవితాచరణలో అవిభాజ్యమైన భాగాలు. ఎదురుగా ఉన్నది ఒక్క మనిషి అయినా లక్షలాది జన సమూహమైనా, ఎదుట ఉన్నవారికి తన ఆలోచనలనూ అవగాహనలనూ అర్థం చేయించడంలో, వారి హృదయాన్నీ మేధనూ ఆకట్టుకోవడంలో ఆయన అనితరసాధ్యమైన ప్రతిభ సాధించారు.

ఆయన వృతి రీత్యా అధ్యాపకుడు. మొట్టమొదట 1962లో పి ఎచ్ డి లో చేరి, కుటుంబ ఆర్థిక పరిస్థితులవల్ల అది కొనసాగించలేక 1964లో సిద్ధిపేట కాలేజిలో తెలుగు అధ్యాపకుడిగా చేరారు. అది శాశ్వత ఉద్యోగం కాకపోవడంతో, 1965లో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన డిపార్ట్ మెంట్ ఆఫ్ ఆడియో విజువల్ పబ్లిసిటీలో పబ్లికేషన్ అసిస్టెంట్ గా చేరారు. కాని తెలుగు సీమకు, తెలుగు అధ్యాపనానికి తిరిగి రావాలనే కోరికతో ఏడు నెలల్లోనే ఆ ఉద్యోగం వదిలి, 1966లో మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా చేరారు. 1968లో వరంగల్ లో చందా కాంతయ్య మెమోరియల్ కాలేజి స్థాపించినప్పుడు అక్కడ చేరిన స్థాపక అధ్యాపకులలో ఆయన ఒకరు. ఆ కాలేజి నుంచే 1998లో పదవీ విరమణ పొందేవరకూ, మధ్యలో జైలు జీవితం మినహా, వేలాది మంది విద్యార్థులకు తెలుగు భాషా సాహిత్యాలు బోధించారు. ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిలలో విద్యార్థులందరికీ రెండో భాషగా తెలుగు తప్పనిసరిగా ఉంటుంది గనుక ఇంటర్మీడియట్ లో అన్ని విభాగాలూ, డిగ్రీలో బిఎ, బి ఎస్సీ, బికాం విద్యార్థులందరికీ కూడ ఆయన తెలుగు బోధించారు.

కళాశాల తరగతి గదిలో యాబై అరవై మందికి, నిర్ణయించిన పాఠ్యాంశాలు బోధించడం ఒక ఎత్తు అయితే, అంతకు మించి ఆయన యాబై సంవత్సరాల పాటు అత్యంత జనాదరణ పొందిన అద్భుతమైన వక్తగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తొలి ఉపన్యాసాలు 1968-69ల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కళాశాలల్లో, విద్యార్థి, ఉద్యోగ సమూహాల్లో, వరంగల్ జిల్లా చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో మొదలయ్యాయి. నక్సల్బరీ, శ్రీకాకుళ విప్లవోద్యమాల ప్రభావంతో ఆయన స్వరం పదును దేరింది. శ్రీశ్రీ షష్టిపూర్తి సభ (ఫిబ్రవరి 1970) నాటికే ఆయన ఒక ముఖ్యమైన వక్తగా ఉన్నారు. విరసం స్థాపన తర్వాత అప్పటి వాతావరణంలో, రాష్ట్రమంతటా విద్యార్థి యువజనుల, సాహిత్యకారుల ఉధృత సంచలనాలలో ఆయన ఒకానొక సమయంలో నెలకు కనీసం పది చోట్ల మాట్లాడే, మాట్లాడలసిన వక్త అయ్యారు. ఎంత తగ్గినా నెలకు నాలుగు ఉపన్యాసాలైనా తప్పనిసరిగా ఇచ్చి ఉంటారు. ఎమర్జెన్సీలోనూ, ఆంధ్రప్రదేశ్ లో ‘ఆట పాట మాట బంద్’ అయి ఆయన జైలులో ఉండవలసి వచ్చిన 1985-89 కాలంలోనూ మినహాయిస్తే, మిగిలిన కాలమంతా రాష్ట్రం నాలుగు చెరగులా ఆయన ఉపన్యసించని పట్టణం లేదు.

ఇటు తెలుగు సీమలో మాత్రమే కాదు, దేశంలోని ప్రధాన పట్టణాలన్నిట్లో ఆయన ఉపన్యసించారు. ఆంధ్రప్రదేశ్ లో రాజ్య హింస గురించి, దమనకాండ గురించి వివరించడానికి రెండు సార్లు అఖిలభారత పర్యటన చేసి డజన్ల కొద్దీ నగరాల్లో సభలు, సమావేశాలు, పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఉపన్యసించారు. ఆరోగ్యం గురించి ఆలోచన లేదు. మండుటెండలూ జడివానలూ వేళ్లు కొంకర్లు తిరిగిపోయే చలీ గంటలకొద్దీ రోజుల కొద్దీ ప్రయాణాలూ ఏవీ ఆయన ఉపన్యాసాలను అడ్డుకోలేకపోయాయి.

విరసంతో పాటు ఎన్నెన్నో విద్యార్థి యువజన సంస్థలు, సాహిత్య, సామాజిక, కార్మిక, రైతాంగ, పౌరహక్కుల సంస్థలు, బుద్ధిజీవుల బృందాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఆయనను ఉపన్యాసాలకు ఆహ్వానించాయి. గ్రామీణ రైతు కూలీలు, భూమి లేని నిరుపేదలు, పట్టణ కార్మికులు, బొగ్గుగని కార్మికులు, విద్యార్థులు, యువజనులు, రచయితలు, విద్యావేత్తలు, మహిళలు, మైనారిటీలు, ఆదివాసులు, దళితులు, న్యాయవాదులు ఆయన ఉపన్యాసం వినని ప్రజా సమూహం లేదు. ఆయన ఉపన్యాసం అంటే ఉవ్విళ్లూరని శ్రోతలు లేరు. పన్నెండు లక్షల మంది శ్రోతలు ఆయన చెప్పేది వినడానికి కూచున్న 1990 రైతుకూలి సంఘం సభ ఉపన్యాసం ఎంత ఉద్వేగంతో, ఎంత వివరంగా, ఎంత చారిత్రక విశ్లేషణతో సాగిందో ఎవరో ఒక పత్రికా విలేఖరి, టివి ఛానల్ విలేఖరి ఏదో ఒక ప్రత్యేక ఘటన సందర్భంలో వచ్చి కూచుంటే కూడ అంతే ఉద్వేగంతో, అంతే వివరంగా బోధించేవారు.

సాహిత్యాన్ని, సమకాలీన సామాజిక రాజకీయ పరిణామాలను, చరిత్రను, విప్లవోద్యమ పరిణామాన్ని, భవిష్యదాశను కలగలిపిన ఆకర్షణీయమైన మేలు కలయిక ఆయన ఉపన్యాసాలు. ఆయన ఉపన్యాసం విని మారనివారు, కదిలిపోనివారు, కనీసం ఆలోచనలో పడనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఉపన్యాస కళకు అత్యవసరమైన వాగ్ధార, తేదీలు స్థలాలు మనుషుల పేర్లు, సందర్భాలు మునివేళ్ల మీద ప్రవాహంలా చెప్పే అపారమైన జ్ఞాపకశక్తి, భాష మీద విపరీతమైన అధికారం, ఉద్వేగభరితమైన కంఠస్వరం ఆయన ఉపన్యాసాలకు అదనపు శక్తినిచ్చేవి.

3

వరవరరావు వ్యక్తిత్వంలో మరొక ప్రధాన కోణం ఆయన పాత్రికేయ వృత్తి. ఆయన కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు ఒక సాహిత్య పత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. కనీసం యాబై సంవత్సరాలు నిరంతరం పత్రికా రచయితగా ఉన్నారు.

పాఠశాల విద్యార్థిగా ఉండగానే అన్నలు నడుపుతుండిన లిఖిత పత్రికలతో సంబంధంలోకి వచ్చిన వరవరరావు ఎంఎ లో ఉండగా హైదరాబాద్ లో ఒక సాహిత్య పత్రిక స్థాపించే ఏర్పాట్లలో భాగమయ్యారు. సెవెన్ స్టార్స్ సిండికేట్ అనే సంస్థ నవత అనే సాహిత్య త్రైమాసిక నడపాలని నిర్ణయించుకుని ఆ సన్నాహాలలో ఆయనను భాగం చేసింది. ఆ పత్రికకు శ్రీశ్రీ గౌరవ సంపాదకుడిగా ఉండాలని, ప్రారంభ సంచికకు రచన ఇవ్వాలని వరవరరావు రాస్తేనే శ్రీశ్రీ అంగీకరించారు, జననం ముదావహం అని రచన ఇచ్చారు. ప్రజాస్వామిక, ఆధునిక దృక్పథం ఉన్న రచనలకే పత్రికలో చోటుండాలని సన్నాహక సమావేశాల్లో నిర్ణయించుకున్నారు. చివరికి పత్రిక తొలి సంచిక వెలువడేటప్పటికి సంపాదకవర్గంలో వరవరరావు పేరు లేదు, సాంప్రదాయిక రచనలు కూడ అచ్చయ్యాయి.

ఆ విఫల ప్రయోగంతో, కవిత్వానికే ప్రత్యేకించి ఒక పత్రిక పెట్టాలని ఆయనలో తపన ప్రారంభమైంది. ఢిల్లీ ఉద్యోగంలో ఉన్నప్పటికీ పత్రిక ఆలోచనలు వదలలేదు. చివరికి ఢిల్లీ వదిలి మహబూబ్ నగర్ ఉద్యోగానికి వస్తున్నప్పుడు రైలు ఎక్కిస్తూ ఒక మిత్రుడు “తెలుగు సాహిత్య పత్రిక నడపడానికే నువ్వున్నావు. అది నీ కర్తవ్యం” అన్నాడంటే అప్పటికి ఆయనలో పత్రిక ఆలోచన ఎంత గాఢంగా ఉండిందో, అది మిత్రులకు కూడ ఎలా అర్థమయిందో తెలుస్తుంది.

అలా జడ్చర్లకు తిరిగి రాగానే కవి బాలగంగాధర్ తిలక్ తో సహా కవిమిత్రులతో చర్చించి ఆధునిక సాహిత్యవేదికగా సృజనను నిర్వహించాలని అనుకుంటుండగానే అకస్మాత్తుగా తిలక్ చనిపోయారు. తిలక్ సంస్మరణ సంచికగా సృజన నవంబర్ 1966లో ప్రారంభమైంది. తనకు ఐదో తరగతి నుంచి ఎంఎ దాకా సహ విద్యార్థిగా ఉన్న తత్వశాస్త్ర విద్యార్థి గంట రామన్న, వేనరె గా సుప్రసిద్ధుడైన కవి, తెలుగు అధ్యాపకుడు వేణుముద్దల నరసింహారెడ్డి, తర్వాతి కాలంలో అంపశయ్య నవీన్ గా సుప్రసిద్ధుడైన అర్థశాస్త్ర అధ్యాపకుడు, వరవరరావు నలుగురూ సాహితీ మిత్రులుగా సృజన ప్రారంభించారు. 1970 దాకా త్రైమాసికగా నడిచిన సృజన ఆ తర్వాత మాసపత్రికగా నడిచింది. ఎమర్జెన్సీలో రెండు సంవత్సరాలు, 1985-89 కాలంలో నాలుగు సంవత్సరాలు మినహాయించి, 1992 మే దాకా నడిచిన సృజన మాసపత్రిక విప్లవోద్యమ సాహిత్య పత్రికగా, ఆధునిక సాహిత్య వేదికగా, వేలాది మంది విద్యార్థి యువజనులను, సాహిత్య కారులకు ప్రేరణనిచ్చిన పత్రికగా చరిత్రలో ఘనమైన స్థానం సంపాదించింది. 1970లలో, 80లలో కవులుగా, రచయితలుగా, ఆలోచనాపరులుగా ఎదిగినవారందరూ సృజన ప్రోత్సాహంతో సామాజిక జీవనంలో ప్రవేశించినవారే. సాహితీమిత్రులు అనే బృందం సమష్టి సహకారంతో సృజన నిర్వహణ బాధ్యత సాగినా అది ప్రధానంగా వరవరరావు ఒంటి చేతి మీదనే నడిచింది. 1973 అక్టోబర్ లో వరవరరావు ఆంతరంగిక భద్రతా చట్టం కింద అరెస్టయినప్పుడు, ఆగిపోకుండా నిర్వహించడం కోసం ఆయన సహచరి హేమలత పేరు మీదికి పత్రిక మారింది. అయినా సృజన రచనల ఎంపికకు, ఆర్థిక నిర్వహణకు, సాహిత్య, రాజకీయ మార్గదర్శకత్వానికి సంపూర్ణ బాధ్యత వరవరరావే వహించారు.

అలాగే, విద్యుల్లత, పిలుపు, అరుణతార, క్రాంతి, రాడికల్ మార్చ్, స్ప్రింగ్ థండర్ వంటి అనేక ప్రత్యామ్నాయ పత్రికలు ఆయన సహకారంతో, సలహాలతో నడిచినవే.

ఇలా స్వయంగా పత్రిక నడపడం, ఇతర ప్రత్యామ్నాయ పత్రికలకు సహకరించడం మాత్రమే కాదు, ఆయనకు పత్రికాప్రపంచంతో ఉన్న సంబంధం మరింత విస్తృతమైనది. ఆయన వ్యాసాలు అచ్చు కాని తెలుగు దినపత్రిక లేదు. ప్రధానమైన సమకాలీన సామాజిక, రాజకీయ, సాహిత్య పరిణామాలన్నిటి మీద ఆయన ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్తాపత్రికకు వ్యాసం రాస్తూనే వచ్చారు. అనేక పత్రికలలో, టివి చానళ్లలో ఆయన ఇంటర్వ్యూలు, అభిప్రాయాలు వెలువడ్డాయి. ఎప్పుడూ ఏ దిన, వారపత్రికలలో ఆయన శీర్షికలు రాయలేదు గాని, శీర్షికా రచయితల కన్న ఎక్కువ వ్యాసాలే వార్తాపత్రికలకు రాశారు.

4

 

మనుషులను, తనతో ఏకీభవించే మనుషులను మాత్రమే కాదు, భిన్నాభిప్రాయాలున్నవాళ్లను కూడ ఆకర్షించే సూదంటురాయి స్వభావమేదో ఆయనకు సహజ లక్షణంగా భాసించింది. అందువల్లనే పదిహేడో ఏట డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిగా కాలేజిలో తెలుగు సాహిత్య సమితి కార్యదర్శి అయినప్పటి నుంచి భీమా కోరేగాం కేసులో అరెస్టయి జైలుకు వెళ్లే దాకా అంటే అరవై ఏళ్ల పాటు ఆయన జీవితమంతా సామూహిక నిర్మాణాలతోనే, నిర్మాణాలలోనే గడిచింది. ఆయన నిర్మాణ దక్షత ఎంతటిదంటే ఒక సంస్థలో భాగం కావడమంటే కేవలం అందరిలో ఒకరైన సభ్యుడు కావడం కాదు, సంస్థా నిర్వాహకుడు కావడం, నిర్వాహక బృందంలో ఒకరు కావడం. 1958లో కాళోజీ రామేశ్వరరావు, నారాయణరావు సోదరుల వంటి లబ్ధప్రతిష్ఠులు ప్రారంభించిన వారం వారం సాహితీ మిత్రుల సమావేశం ‘మిత్రమండలి’కి తొలి కన్వీనర్ గా వరవరరావును ఎంపిక చేశారంటే ఆయనలోని భవిష్యత్ నిర్మాణ దక్షతను కాళోజీ సోదరులు అప్పుడే గుర్తించారన్నమాట. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో అప్పటి స్తబ్దతను చీల్చడంలో తొలి అడుగైన ‘రాత్రి’ కవితాసంకలం తయారీలో, ‘నవత’ పత్రిక సన్నాహాలలో ఆయన పాత్ర కీలకమైనది.

ఇక జడ్చర్ల నుంచి వరంగల్ వెళ్లిన తర్వాత, 1969లో ‘తిరుగబడు’ కవుల బృందానికి ఆయనే నాయకుడు. 1970లో విప్లవ రచయితల సంఘం ఏర్పాటుకు దోహదం చేసిన శక్తులలో తిరుగబడు కవులు ప్రధానం. ఇక విప్లవ రచయితల సంఘం ఆవిర్భావంలో మాత్రమే కాదు, తర్వాత యాబై సంవత్సరాలు దాని నిర్మాణంలో కీలక, చోదకశక్తిగా వరవరరావు ఉన్నారు. 1970 జూలై 4న ఆవిర్భవించినప్పుడు ఏర్పడిన కార్యవర్గంలో సభ్యుడుగా మొదలై కనీసం నలబై సంవత్సరాలు కార్యవర్గ సభ్యులుగా కొనసాగారు. యువనాయకత్వం ఎదిగిరావడానికి సీనియర్లు తప్పుకోవాలని ప్రతిపాదించి, కార్యవర్గం నుంచి తప్పుకున్నారు. కొంతకాలం కార్యదర్శిగా, అరుణతార సంపాదకుడిగా కూడ పని చేశారు. విరసం ప్రచురణలెన్నిటికో మార్గదర్శకత్వం వహించడం మాత్రమే కాక, సృజన ప్రచురణలు స్థాపించి ఎన్నో విలువైన పుస్తకాలు వెలువరించారు. శ్రామికవర్గ ప్రచురణలు వంటి ఎన్నో విప్లవ సాహిత్య ప్రచురణ సంస్థలకు వెన్నుదన్నుగా ఉన్నారు.

జననాట్యమండలి, ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం, భారత చైనా మిత్రమండలి, రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘం, సింగరేణి కార్మిక సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ రైతుకూలి సంఘం మొదలుగా ఈ యాబై సంవత్సరాల్లో విప్లవోద్యమ క్రమంలో తెలుగుసీమలో ఏర్పడిన సంస్థలన్నిటికీ ప్రత్యక్ష, పరోక్ష చోదకశక్తిగా ఆయన ఉన్నారు. 1983లో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి, 1992లో అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక, 2005లో విప్లవ ప్రజాస్వామిక వేదిక వంటి సంస్థల ఏర్పాటు, నాయకత్వం, నిర్వహణ, సైద్ధాంతిక, రాజకీయ సారథ్యం ఆయన జీవితంలో ప్రధాన ఘట్టాలు.

అలాగే 1995 హైకోర్టు తీర్పుతో, పౌరస్పందన వేదిక ప్రయత్నాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవోద్యమంతో చర్చలు జరపడానికి సిద్ధపడినప్పుడు, 2002 లో జరిగిన సన్నాహక చర్చలలోను, 2004 లో జరిగిన చర్చలలోను ఆయన విప్లవోద్యమం తరఫున మధ్యవర్తిగా పాల్గొన్నారు. గత ఇరవై ముప్పై సంవత్సరాలలో ఎన్నో రాజ్యహింస సందర్భాలలో, చట్టబద్ధ పాలనకు విఘాతం ఏర్పడిన సందర్భాలలో న్యాయస్థానాలను ఆశ్రయించారు.

విప్లవోద్యమ సానుభూతిపరుడిగా, విప్లవ సాహిత్యోద్యమ కార్యకర్తగా ఆయన ఎన్నో విమర్శలను కూడ ఎదుర్కొన్నారు. అయినా మొక్కవోని చిత్తశుద్ధితో, మమేకతతో ఆ మార్గానికే నిబద్ధుడై ఉన్నారు. “విప్లవోద్యమంలోని తప్పొప్పులను, వైఫల్య సాఫల్యాలను, జయాపజయాలను, కొందరు అంటున్నట్లు ప్రజాస్వామిక అప్రజాస్వామిక చర్యలను నేను ఔట్ సైడర్ గా అంచనా వేయలేను. వాళ్ల రాజకీయాలతోనే కాదు, వాళ్ల వ్యక్తిత్వాలతో కూడ నేనంత ప్రభావితుణ్నయ్యాను” అని ఆయనే వినమ్రంగా చెప్పుకున్నారు.

5

నిర్మాణాల నాయకులుగా ఉండడమంటే చాల మందికి నిజమైన ఆచరణకు కొద్ది దూరంలో ఉండడంగానే ఉంటుంది. పైస్థాయి విధాన నిర్ణయ విషయాలు తెలియడమే తప్ప కింది స్థాయి రోజువారీ   వ్యవహారాలు తెలియని స్థితి ఉంటుంది. కాని వరవరరావు చైతన్యయుతంగా మానసిక శ్రమకూ శారీరక శ్రమకూ మధ్య, ఆలోచనకూ పనికీ మధ్య, కవిత్వానికీ కార్యకర్తృత్వానికీ మధ్య  విభజన రేఖను రద్దు చేయాలని నిరంతరం ఆలోచించారు. కవిగా, సంపాదకుడిగా గౌరవం అనుభవిస్తూనే కార్యకర్తగా మనుషుల్లో కలిసిపోయారు. 1970 విరసం మొదటి మహాసభల సందర్భంగా ఖమ్మంలో అక్టోబర్ 8న జరిగిన ఊరేగింపులో భాగమైన ఒకానొక వ్యక్తిగా, ఆ ఊరేగింపుకు అద్భుతమైన కవిత్వ వ్యక్తీకరణ ఇచ్చిన కవిగా రెండు పాత్రలనూ ఎలా సమన్వయించారో ‘ఊరేగింపు’ కవిత చూపుతుంది. ఆ తర్వాత యాబై ఏళ్లలో జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ ఆయన విధాన నిర్ణేతగా మాత్రమే కాక ఆ విధానాన్ని అమలు చేసే కార్యకర్తగా కూడ ఉన్నారు.

ఆయన కార్యకర్తృత్వాన్ని నేను దగ్గరి నుంచి చూసిన తొలి సందర్భాల గురించి చెప్పాలి.

మొదటిది, 1973 ఆగస్ట్ 24న వరంగల్ లో అధికధరలకు వ్యతిరేకంగా జరిగిన ఊరేగింపు. అధికధరలకు, ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా విద్యార్థి, ఉద్యోగ, కార్మిక సంఘాలు వెయ్యి స్తంభాల గుడి నుంచి కలెక్టరాఫీసు వరకు ఊరేగింపు తలపెట్టాయి. అప్పుడే ఎనిమిదో తరగతి కోసం హనుమకొండకు వచ్చిన నేను సహజంగానే ఆయనతో పాటు ఊరేగింపుకు వెళ్లాను. ఊరేగింపు వెయ్యి స్తంభాల గుడి నుంచి రెండు ఫర్లాంగులు నడిచి రాగన్నదర్వాజ దగ్గరికి రాగానే కాంగ్రెస్ నాయకులు తమ జెండాలలో ఊరేగింపులో ప్రవేశించారు. ఏ కాంగ్రెస్ ప్రభుత్వమైతే అధికధరలకు కారణమో, అధిక ధరల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నదో ఆ కాంగ్రెస్ పార్టీకి ఈ ఊరేగింపులో పాల్గొనే అర్హత లేదని వరవరరావు వారి మీద ఉద్రేకంగా విరుచుకుపడ్డారు. మాటా మాటా పెరిగింది. ఊరేగింపులో ఉన్న విద్యార్థులు కాంగ్రెస్ జెండాలు లాక్కుని తగులబెట్టి కాంగ్రెస్ కార్యకర్తలను తరిమేశారు. ఆ పరాభవంతో, కసితో కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కూడబలుక్కుని అటూ ఇటూ ఒక ఫర్లాంగు దూరం తప్పించుకోవడానికి వీలు లేకుండా గోడలు ఉండే ఐజి ఆఫీసు, ఆర్ట్స్ కాలేజి ముందుకు రాగానే ఊరేగింపుమీద దారుణంగా లాఠీచార్జి చేశారు. ఎంచుకుని వరవరరావు మీద, మరొక విరసం నాయకుడు అట్లూరి రంగారావు మీద, భుజంగరావు, రవీందర్ అనే ఇద్దరు విద్యార్థి నాయకుల మీద లాఠీలు కురిపించారు. ఆ ఇద్దరు విద్యార్థి నాయకులను వ్యాన్లలోకి తోసి కాజీపేట పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయారు. మరొక ఫర్లాంగు నడిస్తే కలెక్టరాఫీసు. అప్పుడు జిల్లా కలెక్టర్ కాకి మాధవరావు. ఊరేగింపు కలెక్టరాఫీసుకు వెళ్లింది. వంటి మీద నెత్తురు మరకలతో  వరవరరావు, రంగారావు, లాఠీచార్జిలో తలలు పగిలి, పోలీసులు ఎత్తుకుపోయి, ఏమయ్యారో తెలియని ఇద్దరు విద్యార్థులు. ఊరేగింపు నిరసనతో హోరెత్తింది. పాత సుబేదారి మెట్ల మీద నిలబడి వరవరరావు ఊరేగింపును ఉద్దేశించి మాట్లాడారు. కలెక్టర్ తన గది నుంచి బైటికి వచ్చి ఆ మెట్ల మీదనే వరవరరావు పక్కన నిలబడి, పోలీసుల చర్యకు విచారం ప్రకటించి, నిర్బంధితులను వెంటనే విడిపిస్తానని హామీ ఇచ్చారు. కాజీపేట పోలీసులు ఆ ఇద్దరినీ తీసుకువచ్చి వదిలిపెట్టేవరకూ ప్రదర్శకులు అక్కడే బైటాయించారు. ఈ చొరవ, ఉద్రేకం, పట్టుదల వరవరరావు కార్యకర్తృత్వానికి నిదర్శనమే.

రెండో సందర్భం, ఆ తర్వాత మూడు నెలలకు అక్టోబర్ 4-7 తేదీల్లో వరంగల్ లో జరిగిన తొలి విరసం సాహిత్య పాఠశాల. అప్పటికి ఆయనకు ముప్పై మూడేళ్లే గాని అప్పటికే కవిగా, వక్తగా, అధ్యాపకుడిగా, సృజన సంపాదకుడిగా సుప్రసిద్ధుడు. ఆనాడు నెలకొని ఉన్న ఉజ్వలమైన వాతావరణంలో ఆయన ఏ పని చెప్పినా చేయడానికి రీజినల్ ఇంజనీరింగ్ కాలేజి, కాకతీయ మెడికల్ కాలేజి, సికెఎం కాలేజి వంటి కాలేజిల విద్యార్థులు లెక్కలేనంతమంది ఉన్నారు. కాని ప్రతి పనిలోనూ ఆయన భాగం పంచుకున్నారు. ఆ సాహిత్య పాఠశాల నిర్వహించడానికి అద్దెకు తీసుకున్న కాలేజి హఠాత్తుగా సభల ముందురోజు సాయంత్రం ఇవ్వబోమని ప్రకటించింది. మరొక హాలు యాజమాన్యం ఇవ్వడానికి అంగీకరించి గంట సేపట్లో మాట మార్చింది. మరి కొద్ది గంటల్లో మరొక ప్రత్యామ్నాయ స్థలాన్ని వెతికి ఖరారు చేయడం, మూడు రోజుల సాహిత్య పాఠశాల, రెండో రోజు సాయంత్రం హనుమకొండలో బహిరంగ సభ, మూడో రోజు సాయంత్రం ఏడెనిమిది కిమీ ఊరేగింపు (ఊరేగింపు అగ్రభాగాన నడిచిన శ్రీశ్రీ దాన్ని మినీ లాంగ్ మార్చ్ అన్నాడు) తర్వాత వరంగల్ లో బహిరంగ సభ – అన్నీ ఏ లోటూ లేకుండా జయప్రదంగా అన్నిటా తానై నడిపించినది ఆ ముప్పై మూడేళ్ల బక్కపలుచని మనిషి. మాట మాత్రమే తన శక్తి అయిన యువకుడు. రాతతో అప్పటికే ప్రకంపనాలు పుట్టిస్తున్న విప్లవ రచయిత.

ఆ తర్వాత 2018 దాకా అటు మేధావి గానూ ఇటు ఆచరణశీలిగానూ, అటు కవి గానూ ఇటు కార్యకర్తగానూ ఆయన చూపిన స్పందనలను, సమయస్ఫూర్తిని, తిరుగులేని ఆచరణను, రాజీలేని చిత్తశుద్ధిని, చొరవను, పట్టుదలను వందలాది సందర్భాల్లో చూసి ఉంటాను. నేను మాత్రమే కాదు, వేలాది మంది చూసి ఉంటారు.

ఈ క్రమంలోనే ఆయన కార్యకర్తృత్వంలో మరొక అంశమైన విభజన రేఖల చెరిపివేత గురించి కూడ చెప్పాలి. వయసు, కులమతాలు, పరిజ్ఞానం, పెద్దపని-చిన్నపని, మానసిక శ్రమ-శారీరక శ్రమ, బుద్ధిజీవి – ఆచరణశీలి వంటి అన్ని అంతరాలనూ ఆయన చెరిపివేశారు. సృజనలో రాయడం, సంపాదకత్వం వహించడం, రాజకీయ, సాహిత్య మార్గదర్శకత్వం ఇవ్వడం వంటివి చేస్తూనే ప్రెస్ కు వెళ్లి ప్రూఫులు దిద్దడం, ప్యాకింగ్, పోస్టింగ్ పనుల్లో భాగం పంచుకోవడం చేసేవారు. అప్పటి నుంచి ఆ తర్వాత యాబై ఏళ్లకు అరెస్టయ్యే రోజు వరకూ తనకు కావలసిన ఫోటోస్టాట్ కోసం, పోస్టాఫీసు, బ్యాంకు పనుల కోసం కూడ తానే నడిచి వెళ్లేవారు.

6

ఆ అద్భుత, ఆకర్షణీయ సమ్మోహక వ్యక్తిత్వం ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాల వైపు, విప్లవ రాజకీయాల వైపు అశేష ప్రజానీకాన్ని ఆకర్షించడం, ఆ రాజకీయాల ప్రతినిధిగా, వ్యాఖ్యాతగా నిలబడడం రాజ్యానికి కంటగింపయింది. అందుకే ఇంతకు ముందే ప్రస్తావించిన 1973 ఆగస్ట్ లాఠీ దెబ్బల నుంచి ఇవాళ కొవిడ్ దాకా, శరీరంలో సోడియం స్థాయి పడిపోయి మెదడు కణాలు ధ్వంసమవుతూ జ్ఞాపకకశక్తి, భాషా సామర్థ్యం, సంబద్ధత దెబ్బతినేదాకా రాజ్యం ఆయన మీద కత్తికట్టి వేధింపులు, కేసులు, కుట్రకేసులు, జైలు నిర్బంధాలు, హత్యా ప్రయత్నాలు, ఆరోగ్య ధ్వంసాలు, ఉద్యోగ అవరోధాలు, అబద్ధ ప్రచారాలు, వ్యక్తిత్వ హననం వంటి ఎనెన్నో కుట్రలకూ కుతంత్రాలకూ పాల్పడింది.

ఆయన నిర్వహణలో వరంగల్ సాహిత్య పాఠశాల నాలుగు రోజులు అద్భుతంగా జరిగి, విప్లవ సాహిత్యాభిమానులనూ, విప్లవాభిమానులనూ ఉర్రూతలూగించిన వాతావరణం ఇంకా గాలిలో  చెదిరిపోకముందే, పాఠశాల ముగిసిన రెండు రోజులకు మొదటిసారి 1973 అక్టోబర్ 10న హనుమకొండలో అరెస్టు చేసిన నాటి నుంచి 2018 ఏప్రిల్ 28న ఖమ్మంలో అరెస్టు చేసిన దాకా ఆయనను కనీసం పదిహేను సార్లు అరెస్టు చేసి, దాదాపు ఏడు సంవత్సరాల పాటు పోలీసు లాకప్ లోనో, జైలులోనో, జైలులో ఒంటరి సెల్ లోనో నిర్బంధించారు. ఈ నలబై ఐదు సంవత్సరాలలో ఆయన మీద 25 కేసులు మోపి, వేధించినప్పటికీ, పోలీసులు, ప్రాసిక్యూషన్ ఒక్క కేసులో ఒక్క నేరారోపణను కూడ రుజువు చేయలేకపోయారు. పోలీసులు అల్లిన కట్టుకథలను, ప్రాసిక్యూషన్ చేసిన దొంగ వాదనలను రాజ్యాంగ యంత్రంలోనే భాగమైన న్యాయస్థానాలు కూడ నమ్మలేకపోయాయి. ఆయన నిందితుడిగా ఉండిన ఇరవై ఐదు కేసులలో పదమూడు కేసులను సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానాలు కొట్టివేసి, ఆయనను నిర్దోషిగా ప్రకటించాయి. అలాగే మూడు కేసులను న్యాయస్థానాలు విచారణ జరపకుండానే కొట్టివేశాయి. ఇక మిగిలిన తొమ్మిది కేసులను కొంతకాలం విచారణ జరిపిన తర్వాత ప్రాసిక్యూషన్ తానే వెనక్కి తీసుకుని, ఆయన మీద నేరారోపణలను తొలగించింది.

మొట్టమొదటి అరెస్టు ఆంతరంగిక భద్రతా చట్టం (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆక్ట్ – మీసా) కింద జరగగా, కవుల మీద, రచయితల మీద ఇటువంటి నేరారోపణ చెల్లదని డిఫెన్స్ న్యాయవాదులు చేసిన వాదనను అంగీకరించిన హైకోర్టు ఐదు వారాల జైలు నిర్బంధం తర్వాత వారిని విడుదల చేసింది. కాకపోతే, ఈ హైకోర్టు తీర్పులో ఎవరినైనా వారికి నేర చర్యలతో సంబంధం ఉంటే మాత్రమే నిర్బంధించవచ్చునని, కేవలం విశ్వాసాల వల్ల, రచనల వల్ల నిర్బంధించగూడదని ఒక వాక్యం రాశారు. ఆ వాక్యానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ప్రభుత్వం ఒక కొత్త అర్థం కనిపెట్టారు. విప్లవ రచయితల రచనల, ఉపన్యాసాల ప్రేరణతోనే “నేరాలు” జరిగాయని అంటూ తెలంగాణలో అంతకుముందు మూడు నాలుగు సంవత్సరాలలో జరిగిన “నేరాల”న్నిటినీ ఏదో ఒక కవితతో, వ్యాసంతో, ఉపన్యాసంతో, సభతో జోడించారు. ఆ “నేరాల” మీద అప్పటికే స్థానిక కోర్టులలో కేసులు నమోదై విచారణలు జరుగుతున్నప్పటికీ అటువంటి కేసులన్నిటినీ కలిపి, వాటిలో నేరపూరిత కుట్ర, రాజద్రోహం కోణాల మీద విచారణకు సికిందరాబాద్ కుట్రకేసు అని పేరుపెట్టారు. ఆరుగురు విప్లవ రచయితలు, 46 మంది విప్లవకారులు నిందితులుగా ఉన్న ఈ కేసులో కెవి రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, చెరబండరాజు, ఎంటి ఖాన్, ఎం రంగనాథంలతో పాటు వివి కూడ నిందితులుగా ఉన్నారు. ఈకేసులో వివిని 1974 మే 18న అరెస్టు చేశారు. పదకొండు నెలల జైలు నిర్బంధం తర్వాత ఆయన 1975 ఏప్రిల్ 24న బెయిల్ పై విడుదలయ్యారు.

సరిగ్గా రెండు నెలలు తిరగకుండానే దేశం మీద ఇందిరా నియంతృత్వం అమలు చేసిన ఎమర్జెన్సీ చీకటిరాత్రిలో మళ్లీ ఆయనను 1975 జూన్ 26న అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు లక్షమంది బుద్ధిజీవులను ఇలా 21 నెలల పాటు నిర్బంధించి, 1977 మార్చ్ 21న ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత రెండురోజులకు మార్చ్ 23న విడుదల చేశారు. కాని వివిని మాత్రం కరడుగట్టిన నక్సలైటుగా అభివర్ణించి, జైలు బైట మళ్లీ అరెస్టు చేసి, మరొక వారం తర్వాత మాత్రమే విడుదల చేశారు.

ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగానూ, రాష్ట్రంలోనూ సాగిన ప్రజాస్వామిక వెల్లువలో భాగంగా ప్రజాఉద్యమాలు విస్తరించాయి. ప్రజాసంఘాలు బలోపేతమయ్యాయి. అనేక చోట్ల విపరీతంగా సభలు జరిగాయి. 1979లో మందమర్రిలో అటువంటి సభలో వివి మాట్లాడుతుండగా, కరెంట్ తీసివేయించి, వేదిక మీదికి దూసుకువచ్చిన ఒక డిఎస్ పి వివిని వేదిక మీదనే కొట్టాడు. ఆ సమయంలో వరంగల్ రైతాంగ, రాడికల్ విద్యార్థి యువజన ఉద్యమాల మీద అమలయిన ఉక్కుపాదంలో భాగంగా వివి మీద అబద్ధపు కేసుల బనాయింపు మొదలయింది. అలా 1981 నుంచి 1985 సెప్టెంబర్ వరకు, అంటే ఆట పాట మాట బంద్ విధానం మొదలయ్యేవరకు గడిచిన నాలుగు సంవత్సరాల్లో వివి మీద ఎనిమిది కేసులు బనాయించారు. ఈ సందర్భంలోనే మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా కమలాపూర్ లో ఆదివాసి రైతుకూలీ సంఘం సభకు వెళ్తున్న సందర్భంగా గోదావరి ఆవలి ఒడ్డున మహారాష్ట్రలోని సిరొంచలో అరెస్టు చేసి మరొక కేసు కూడ పెట్టారు.

ఈ తొమ్మిది కేసుల్లో ఐదు కేసులను న్యాయస్థానాలు కొట్టివేయగా, మిగిలిన నాలుగు కేసులు విచారణ జరగక ముందే ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంది. అయినా ప్రతి కేసు సందర్భంలోను నిర్బంధంలోకి తీసుకుని ఒక రోజు నుంచి ఒక నెల వరకూ వేరు వేరు వ్యవధుల్లో జైలులో, పోలీసు లాకప్ లో నిర్బంధించారు.

ఇక ఆట పాట మాట బంద్ కాలంలో 1985 సెప్టెంబర్ 3న వరంగల్ లో ప్రధాన రహదారి మీద పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షుడు, పిల్లల వైద్యుడు డా. రామనాథం గారి క్లినిక్ లోకి జొరబడిన పోలీసులు ఆయనను కాల్చిచంపారు. వరవరరావును నరుకుతాం అని ఊరేగింపులు జరిపారు. ఆ స్థితిలో రచించే, జీవించే స్వేచ్ఛ కొరకు బెయిల్ రద్దు చేసుకుంటున్నాను అనే సంచలనాత్మక ప్రకటనతో వివి అప్పటికి పది సంవత్సరాలుగా సికిందరాబాద్ కుట్రకేసులో అనుభవిస్తున్న బెయిల్ ను రద్దు చేసుకుని 1985 డిసెంబర్ 26న జైలుకు వెళ్లారు. సికిందరాబాద్ కుట్రకేసులో నిందితులందరూ నిర్దోషులని న్యాయస్థానం 1989 ఫిబ్రవరిలో తీర్పు ఇవ్వడంతో ఆ బెయిల్ అవసరం పోయింది గాని, అప్పుడు జైల్లో ఉండగానే ఆయన మీద రాంనగర్ కుట్రకేసు అని మరొక కేసు మోపారు. ఆ కేసులో కూడ బెయిల్ తీసుకుని మార్చ్ 21న బైటికి వచ్చారు.

రాంనగర్ లో పీపుల్స్ వార్ అగ్రనాయకుల స్థావరం మీద దాడి చేసి నల్లా ఆదిరెడ్డితో సహా కొందరు విప్లవకారులను అరెస్టు చేసినప్పుడు, అక్కడ దొరికిన పత్రాలలో అనేక నేరాలకు కుట్ర జరిగినట్టు ఆధారాలు దొరికాయని ఆరోపిస్తూ విప్లవకారులను, ప్రజాసంఘాల బాధ్యులను కలిపి తయారు చేసిన కుట్రకేసు అది. పదహారు సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత ఆ కేసులో వివి మీద ఏ ఒక్క నేరారోపణనూ ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని 2003 సెప్టెంబర్ 30న కేసు కొట్టివేశారు.

అప్పటికి బనాయించిన పద్నాలుగు కేసుల్లో ఒక్కటి కూడ రుజువు చేయలేకపోయినందువల్లనో, మరే కారణం వల్లనో గాని దాదాపు పది సంవత్సరాల పాటు మళ్లీ వివి మీద కేసు పెట్టడానికి పోలీసులు సాహసించలేదు. 1999లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ నాయకులు శ్యాం, మహేశ్, మురళి, పశువుల కాపరి లక్ష్మిరాజం బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా సెక్రటేరియట్ ముందు ప్రదర్శన జరిపినప్పుడు అరెస్టు చేసి, సెక్షన్ 144ను ఉల్లంఘించిన కేసు పెట్టారు గాని అది కూడ ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు.

ఇక ప్రభుత్వానికి, విప్లవకారులకు మధ్య చర్చలు విఫలమైన తర్వాత మరొకసారి కేసుల ప్రహసనం ప్రారంభమయింది. చర్చల సందర్భంగా ముదిగుబ్బ సభలో జరిగిన అల్లరి కేసు, విరసం మీద నిషేధం కేసు, చిలకలూరిపేట పోలీసు స్టేషన్ మీద దాడి కేసు, బాలానగర్, అచ్చంపేట, ఒంగోలుల్లో పోలీసుల మీద దాడి కేసు అన్నిట్లోను వివిని నిందితుడిగా చేర్చారు. 1999 కేంద్ర కమిటీ నాయకుల అరెస్టు సందర్భంగా దాచేపల్లిలో జరిగిన సభ మీద కూడ 2005లో కొత్తగా కేసు పెట్టారు. కరీంనగర్ జిల్లా బేగంపేటలో అమరవీరుల స్తూపావిష్కరణ పైన కూడ మంథనిలో కేసు పెట్టారు. ఇలా బనాయించిన ఎనిమిది కేసుల్లో ఏడిటిని విచారణకు ముందే ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఒక కేసును న్యాయస్థానం కొట్టివేసింది.

ఆ తర్వాత 2007లో సందె రాజమౌళి అంత్యక్రియల కేసులో, గంటి ప్రసాదం హత్య సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ప్రదర్శన కేసులో కూడ వివిని నిందితునిగా చూపారు. వీటిలో ఒక కేసును న్యాయస్థానం కొట్టివేయగా, మరొక కేసును ప్రభుత్వమే ఉపసంహరించుకుంది.

ఈ 25 సందర్భాలలోను దొమ్మీ, చట్టవ్యతిరేక గుంపు, విధ్వంసం, దోపిడీ, ప్రభుత్వాధికారులను అడ్డగించడం, హత్యా యత్నం, హత్య, ఆయుధాల సేకరణ, ఆయుధాల ప్రయోగం, పేలుడు పదార్థాల వినియోగం, తీవ్రవాద చర్యలు, చట్టవ్యతిరేక చర్యలు, నేరపూరిత కుట్ర, రాజద్రోహం, ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం, ఆంతరంగిక భద్రతకు ప్రమాదం వంటి ఎన్నో నేరాలు ఆరోపించినప్పటికీ, పోలీసులు, ప్రాసిక్యూషన్ ఒక్క కేసులోనైనా, ఒక్క ఆరోపణనైనా న్యాయస్థానాలలో రుజువు చేయలేకపోయారు. అయితే కేసులన్నిటి నుంచీ నిర్దోషిగా విడుదల అయినప్పటికీ, కేసుల విచారణ సందర్భంగా వివి దాదాపు ఏడు సంవత్సరాలు జైలు నిర్బంధాన్ని అనుభవించి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సుదీర్ఘ జైలు జీవితం, అందులో ఒంటరి తనం, మానసిక ఒత్తిడి, ఆహారం, నిద్ర సక్రమంగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఆయనకు పైల్స్, హైపర్ టెంషన్, ఆసిడిటీ, సైనస్, మైగ్రేన్, ఎడీమా, ప్రొస్టేట్ గ్లాండ్ వంటి సమస్యలు తలెత్తాయి. ఆ ఏడు సంవత్సరాల పాటు ఆయన స్వరం వినిపించకుండా, ప్రజా ఉద్యమాలలో భాగం కాకుండా ఉండవలసి వచ్చింది.

ఇవన్నీ ముగిసిపోయిన తర్వాత, 2018 ఆగస్ట్ 28న ఆయనను అరెస్టు చేసి పుణె పోలీసులు అల్లిన భీమా కోరేగాం హింసాకాండ కేసులో నిందితునిగా చూపారు. సుప్రీం కోర్టు జోక్యంతో అది రెండున్నర నెలల గృహ నిర్బంధంగా మారి, నవంబర్ 18న మళ్లీ అరెస్టు చేసి పుణె లోని యరవాడ జైలులో ఉంచారు. ఈ కేసుకు సాక్ష్యాధారాలుగా చూపినవన్నీ అబద్ధాలని, కూటసృష్టి అని లోకం కోడై కూసినా విచారణ పేరుతో పదహారు నెలల పాటు యరవాడ జైలులో నిర్బంధించారు. బెయిల్ నిరాకరించారు. మహారాష్ట్రలో ప్రభుత్వం మారి, కొత్త ప్రభుత్వం ఈ సాక్ష్యాధారాలు వాస్తవం అవునో కాదో పునర్విచారణ జరపడానికి ప్రయత్నాలు ప్రారంభించగానే కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అధీనంలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి ఈ కేసు బదిలీ చేశారు. వివిని తలోజా జైలుకు బదిలీ చేశారు. ఈలోగా కొవిడ్ వల్ల లాక్ డౌన్ మొదలై ఆయన నాలుగు నెలల పాటు మనుషులు కలవని, న్యాయవాదులు కూడ కలవని, ఉత్తరాలు రాని, చదువుకోవడానికి పత్రికలు, పుస్తకాలు అందని స్థితి ఏర్పడి బహుశా అందువల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించింది.

ఆయన మీద పాలకవర్గ, రాజ్య దుర్మార్గంలో భాగంగా చెప్పుకోవలసిన మరొక అంశం 1979 నుంచి 1985 వరకు, మళ్లీ 1999 నుంచి 2016 వరకు ఆయన తలమీద నిరంతరం వేలాడుతుండిన కత్తి, పాలకవర్గాలు, రాజ్యప్రేరేపిత హంతక ముఠాలు ఆయన మీద జరిపిన హత్యాప్రయత్నాలు. వరంగల్ జిల్లా రైతాంగ ఉద్యమాల నేపథ్యంలో భూస్వామ్య శక్తులు, పోలీసులు, హంతక ముఠాలు కలిసి జన్ను చిన్నాలును హత్య చేసినపటినుంచీ వరవరరావును కూడ హత్య చేస్తామని పథకాలు రచించడం, కాపు కాయడం, ఇంటి మీద గొడ్డళ్లతో దాడి చేయడం వంటి చర్యలు 1979-85 మధ్యకాలంలో చేశారు. 1999లో పురుషోత్తం ను చంపిన నయీం హంతక ముఠా చేత వరవరరావును చంపించడానికి పోలీసులు ఉసిగొల్పారు. ఎన్నోసార్లు నయీం స్వయంగా ఆయనకు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చంపుతానని బెదిరించాడు. ఎన్నో సభల దగ్గర ఆయనను చంపడానికి రెక్కీ చేశారని, చేస్తున్నారని సమాచారం వచ్చింది.

7

ఇప్పటిదాకా చెప్పినది సామాజిక మానవుడు వివి గురించి. ప్రజా మేధావి వివి గురించి. కాని వ్యక్తిగత జీవితంలో ఆయన ఏమిటి?

ఆయన ఒక పసిపాప వంటి మనిషి. ప్రతి కొత్త విషయానికీ కళ్లు విప్పార్చుకుని విపరీతమైన కుతూహలాన్ని ప్రదర్శించే మనిషి. ఒక కొత్త విషయం, కొత్త ఊహ, కొత్త ఆలోచన, కొత్త మాట ఆయన ముఖాన్ని వెలిగిస్తుంది. ఇప్పటికే సుప్రసిద్ధమైన ఆయన చిరునవ్వు ఎప్పుడో ఒకసారి తెచ్చిపెట్టుకున్నది కాదు, అది నిత్యమూ ఆయన ముఖం మీద వెలుగుతుంటుంది. ఆయన ఆసక్తి ఇంకా పెరిగినప్పుడు అది ఎన్నోరెట్లు పెరిగిపోతుంది.

ఆయన స్నేహశీలి, నిరంతరం మంది మధ్యలో ఉండాలనుకునే మనిషి. వరంగల్ కళాశాల రోజుల్లో ప్రతి రోజూ తప్పనిసరిగా కలుసుకుని సాహిత్యమూ స్నేహమూ పంచుకునే పదహారు మంది స్నేహితులుండేవారని, హైదరాబాదు ఉస్మానియా చేరాక ఆ మిత్ర బృందం రెండు మూడు రెట్లు పెరిగిందని ఆయన రాశారు. 2014లో  ఆయన కవితా సంపుటం బీజభూమి వెలువడిన సందర్భంగా ఇంట్లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు తన యవ్వనకాలపు నూట ఒక్క మంది మిత్రులను, ఆ తర్వాతి కాలపు ఉద్యమ సహచరులకు పరిచయం చేయడానికి పిలవాలని ఆయన అన్నారు. సాహిత్య రంగంలోనూ, ఉద్యమాలలోనూ తెలుగుసీమలో, దేశవ్యాప్తంగా ఆయనను సన్నిహితుడిగా భావించే, ఆయన సన్నిహితంగా భావించే స్నేహితులు వేలాదిగా ఉంటారు.

“వరంగల్ లో బిఎ మూడు సంవత్సరాలు, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఎంఎ, రిసర్చ్ నాలుగు సంవత్సరాలు, మొత్తం 1957-64 కాలం స్నేహం, సినిమాలు, సాహిత్యం, ప్రేమల కాలం” అని ఆయనే రాశారు. విద్యార్థి దశలో ఆ స్నేహితులందరికీ ఆయన రాసిన, ఆయనకు స్నేహితులు రాసిన పేజీల కొద్దీ ఉత్తరాలు, చలంకు, తిలక్ కు, మరెందరో సాహితీ మిత్రులకు ఆయన రాసిన ఉత్తరాలు ఆయనలో భావుకత్వానికి, సున్నితత్వానికి, హృదయపూర్వక, అవ్యాజ ప్రేమాభిమానాలకు అద్దం పడతాయి. విద్యార్థి దశలోనూ, జడ్చర్ల కాలేజి రోజుల్లోను, ఒక రకంగా విప్లవోద్యమ ప్రభావంలోకి వచ్చేవరకూ ఆయన విపరీతంగా సినిమాలు చూసేవారు. చార్లీ చాప్లిన్, సత్యజిత్ రే, మృణాళ్ సేన్, రుత్విక్ ఘటక్, గురుదత్, మర్లిన్ మన్రోల అభిమానిగా ఉండేవారు.

అలాగే ఆయన నిత్య ప్రయాణాభిలాషి. ఎప్పుడూ సర్దిపెట్టిన ఒక చిన్న బ్యాగుతో ఆయన నెలకు పది ప్రయాణాలు చేసిన సందర్భాలు కూడ ఉన్నాయి. సభలకు ఉపన్యాసకుడిగానో, సంస్థల పనుల మీదనో, అచ్చుపనుల మీదనో తప్పనిసరిగా చేయవలసిన ప్రయాణాలు మాత్రమే కాక, కొత్త స్థలాలు, ప్రకృతి సౌందర్య స్థలాలు, చారిత్రక స్థలాలు చూడడం ఆయనకు చాల ఆసక్తి.

ఆయన హాస్యప్రియుడు. ఆయన తన మాటల్లోనూ, ఎదుటివారి మాటల నుంచీ హాస్యం, విరుపులు, వ్యంగ్యం పండిస్తుంటారు. ముఖం నిండా నవ్వుతారు. ఎదుటివారు తనను మించినవారైనా, తనతో సమానులైనా, తన శిష్యులైనా, తనను గురువుగా భావించేవారైనా, ఇప్పుడిప్పుడే సాహిత్యంలోకీ, ఉద్యమంలోకి ప్రవేశిస్తున్న నూనూగు మీసాల  యువకులైనా, చివరికి చిన్నారి పిల్లలైనా సరే, దయతో, స్నేహంతో, సమానస్థాయిలో, వారి దగ్గరి నుంచి నేర్చుకోగలిగినదేమైనా ఉందా అనే కుతూహలంతో ఉంటారు. రాజకీయాభిప్రాయాలలో, తాత్విక అభినివేశంలో నూటికి నూరు శాతం కచ్చితంగా, నిక్కచ్చిగా, పదునుగా, రాజీలేకుండా ఉంటూనే అవతలి మనిషిని మనిషయినందువల్ల హృదయపూర్వకంగా గౌరవించాలనీ, ప్రేమించాలనీ, సాదరంగా ఉండాలనీ ఆయన అనుకుంటారు, అంటారు.

ఒక్కమాటలో ఆయన మనీషి. నూతన మానవుడి ప్రాగ్రూపం.

8

కంటికి కనబడిన ముక్కను చూపితే విశాల వినీలాకాశం అర్థమవుతుందా? ఒకానొక తీరాన నిలబడి దిగంతం దాకా చూసినా అనంత పరివ్యాప్త సముద్రం స్ఫురణకు వస్తుందా? ఒకానొక రేవులో దిగి దోసెడు నీళ్లు తీసుకున్నా సుదీర్ఘ నిరంతర జీవనది అవగాహనకు అందుతుందా? ఒకానొక కవిత, ఒకానొక పుస్తకం, ఒకానొక ఉపన్యాసం, ఒకానొక జీవన పార్శ్వం సువిశాల గంభీర వ్యక్తిత్వాన్ని సమగ్రంగా కళ్లకు కడుతుందా? ఆయారంగాల్లో ప్రతి ఒక్కరికీ, అందరికీ ఎంతో కొంత తెలిసిన వరవరరావు సమగ్ర జీవన దృశ్యాన్ని సంపూర్ణంగా పరిచయం చేయడమెట్లా?

బహుముఖ ప్రజ్ఞాశాలి అనే మాట చిన్నబోయేంత విశాలమైన, లోతైన ప్రతిభావంతుడాయన. 1950లలో కళాశాల విద్యార్థిగా అటు అధ్యాపకుల ఇటు సహాధ్యాయుల గాఢమైన అభిమానాన్ని చూరగొన్న నాటి నుంచి ఆ తర్వాత డెబ్బై సంవత్సరాలలో లక్షలాది హృదయాల్లో పదిలమైన ప్రియమైన స్థానం సంపాదించుకున్నవాడాయన. బాలగోపాల్ ఒక్క మాటలో అభివర్ణించినట్టు “ఆయనది సమ్మోహక వ్యక్తిత్వం.” వ్యక్తిగా మహోన్నతుడు, స్నేహితుడిగా, సహచరుడిగా అపార కరుణామయుడు. మూడున్నర దశాబ్దాల అధ్యాపకత్వంలో, ఐదు దశాబ్దాల వక్తృత్వంలో, ఏడు దశాబ్దాల ప్రజా జీవితంలో ఆయన ఆలోచనలనూ, వాదనలనూ, బోధనలనూ, సలహాలనూ అందుకున్నవాళ్లు లక్షల మంది. కవిత్వం, పాట, సాహిత్య విమర్శ, సామాజిక-రాజకీయ విశ్లేషణ, పత్రికారచన, అనువాదం, వక్తృత్వంవంటి అనేకానేక సృజన ప్రక్రియలలో అపారమైన కృషి చేసినవాడాయన. నిరంతర అధ్యయన శీలి, మనుషులను, ప్రాంతాలను, జనజీవన చలనాలను చదవాలని, భాగం కావాలని కోరుకుంటాడు, మనుషుల సమూహాలలో తనను తాను మైమరిచిపోతాడు. హాస్య, వ్యంగ్యాల ప్రేమికుడు. నిరంతర అధ్యయన శీలి. ప్రతి కొత్త విషయాన్నీ పసిపిల్లల కుతూహలంతో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎదుటి మనిషిని ఎన్నడూ వయసుతో, కులమతాలతో, అభిప్రాయాలతో అంచనాకట్టి ఎక్కువ చేయడమో తక్కువ చేయడమో అలవాటు లేనివాడు. మనిషిని మనిషిగా చూస్తాడు. గౌరవిస్తాడు. ప్రేమిస్తాడు. రాజ్యం ఆగ్రహానికి గురై వేధింపులనూ, చెరసాలలనూ, హత్యా ప్రయత్నాలనూ ఎదుర్కొని స్థిరంగా నిలిచిన మనిషి. అవరోధాలను అధిగమించిన సాహసి. కనీసం పదిహేను సంవత్సరాల పాటు రాజ్యపు కిరాయి హంతక ముఠాల కత్తి తల మీద వేలాడుతూ బతికిన మనిషి. మృత్యుంజయుడుగా తన శక్తిసామర్థ్యాలన్నిటినీ జనజీవన పురోగమనానికి మాత్రమే వినియోగించిన మనీషి.

వరవరరావు అనే ఆరు అక్షరాలు, వివి అనే రెండు అక్షరాలు అంతిమంగా సమాజానికి ఇచ్చిన, ఇస్తున్న సందేశం ఏమిటి? ఆరుదశాబ్దాల ప్రజాజీవనంలో, సాహిత్య సృజనలో, వక్తృత్వంలో, కార్యాచరణలో, నిండైన వ్యక్తిత్వంలో ఆయన సమాజానికి నేర్పదలచినదేమిటి?

ఎన్ని అవరోధాలు ఎదురైనా నిలిచి ఎదుర్కొని గెలవాలి. గమ్యం చేరుతామో లేదో తెలియకపోయినా ప్రయాణమే ముఖ్యంగా, జీవిత సమస్తంగా భావించాలి. పోరాట స్ఫూర్తిని, ప్రశ్నించే దృక్పథాన్ని ఏ ఒక్క క్షణం కూడ వదులుకోగూడదు. కాగితం మీది అక్షరానికి, పెదవి నుంచి వెలువడిన మాటకు కట్టుబడి నిబద్ధంగా ఉండాలి, అందుకోసం ప్రాణమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అంటే అక్షరాన్నీ, మాటనూ జాగ్రత్తగా వినియోగించాలి. చరిత్రా, కాలమూ, సమాజమూ, సందర్భమూ కోరినప్పుడు లేచి నిలవడమే, ఆ సవాలును అందుకోవడమే బుద్ధిజీవి బాధ్యత. కాదనే, చేయలేననే మాట రాగూడదు. శక్తి సామర్థ్యాలు ఉన్నా లేకపోయినా సందర్భానికి లేచి నిలవడమే మనిషి సార్థకత.

*

ఎన్. వేణుగోపాల్

16 comments

Leave a Reply to Janardhan Reddy Gajjela Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎంత గొప్ప గా రాశారో… తెలుగుదేశపు అర్థ శతాబ్దపు సాహిత్య, రాజకీయ చరిత్ర ఒక వ్యక్తిత్వాన్ని ఎలా రూపొందించిందో తిరిగి ఆ వ్యక్తిత్వం ఎలా ప్రభావితం చేసిందో ప్రవాహ సదృశ శైలిలో గొప్పగా విశ్లేషించారు.

  • ‘ఆరు అక్షరాల అగ్నికీల’ అయిన మనీషి గురించి ‘అక్షరాలా’ 4D చిత్రణ!

    • వివి గారి వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు …

  • వర వర రావు గారి వ్యక్తిత్వాన్ని సమగ్రం గా చూపారు.ధన్యవాదాలు.

  • నిజమైన మానవుడికి నిండైన స్వరూపం వరవరరావు గారు . సర్వ మానవాళి శ్రేయస్సే లక్ష్యంగా , జీవితాన్ని ఆచరణలో మలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చి, ప్రేరక శక్తిగా 6 దశాబ్దాలు తెలుగు నేలకు ఆప్తుడు ఆయన నిజంగా తెలుగు ప్రజలకు వరవరుడు . ఆయన ఆరోగ్యంతో తెలుగు నేలకు త్వరగా తిరిగి రావాలని లక్షలాది కళ్ళు ఎదురుచూస్తున్నాయి !.

  • సముద్రం అంతటి మహామనిషి గురించి అద్భుతమైన వ్యాసం సర్…ఇదీ హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా వస్తే బాగుంటుంది,

  • వరవర రావు గురించి పరిచయం నేటి తరానికి అందించారు. వరవరరావు గా రి అన్నల పేర్లు పెత్తండ్రి కుమారుడి పేరు ఇవ్వగలరా

    • పెండ్యాల రామానుజరావు, శేషగిరిరావు, చినరాఘవరావు, దామోదర్ రావు అన్నలు. పెత్తండ్రి కొడుకు పెండ్యాల రాఘవరావు. తెలంగాణ సాయుధ పోరాటంలో దళనాయకుడు. 1952 ఎన్నికల్లో వరంగల్ పార్లమెంటు స్థానానికి, రెండు శాసనసభ స్థానాలకు గెలిచి, పార్లమెంటు సభ్యుడుగా ఉన్నారు.

  • వరవరరావు ఒక నిత్యజ్వలిత సమ్మోహనాగ్ని.జీవితకాలమంతా తను నమ్మిన సిద్ధాంతాన్ని విశ్వసించి రాజీలేని ఆచరణాత్మక సాహిత్యంతో మనిషే ఒక ఆయుధమై ప్రజ్వరిల్లిన వ్యక్తి.. ‘ గాంధీ ‘ కన్నా గొప్పవాడు.

    – రామా చంద్రమౌళి

  • వివి కవిత్వాన్ని వ్యక్తిత్వాన్ని చాలా పరిమితంగానే అయినా సమాజం చర్చించింది. సముద్ర స్వరం, వ్యక్తిత్వమే కవిత్వం అనే పుస్తకాలుగా తీసుకు వచ్చింది. కొన్ని వందల వేల కలాలు ఆయన కోసం రాస్తున్నాయి. గళాలు నినదిస్తున్నాయి. హృదయాలు కరిగించే స్వరాలు వినిపిస్తున్నాయి. సర్వత్రా ఆర్తి ప్రతిధ్వనిస్తూ ఉంది. బహుశా ప్రపంచంలో అత్యంత అరుదైన గౌరవం పొందే అందరూ వివి కి స్వేచ్ఛ కల్పించమని అడిగారు. ఈ యాభై ఎండ్లలో ప్రపంచంలో ఎందరి నిర్బంధాల రద్దుకోసం ఆయన పోరాడారో రాశారో మాట్లాడారో…. ఇప్పుడు కోవిడ్, పాలకులు ఒక తీరుగానే వున్నారని, ప్రజలు అంటున్నారు. బాధ పడుతున్నారు. వివి విడుదలై రావాలి. మీ వ్యాసం తో వివి ని ఒకసారి ప్రేమతో చదువుకునే అవకాశం కలిగింది.

  • వి వి నిలువెత్తు వ్యక్తిత్వాన్ని అక్షరాల్లో బొమ్మ కట్టావు వేణూ !
    త్వరలో తన నిండైన నవ్వుతో వి వి మనమధ్య తిరుగాడాలని కోరుకుంటూ ….

  • పేరుకు తగ్గట్టు…శ్రేష్టులలో శ్రేష్టుడు వరవరరావు. ఆయన ప్రభావం…అంటే నక్సల్బరీ ప్రభావం. ఆ ప్రభావంతో విరసం లో చేరిన నాకు తిరుపతి సభల్లొ వివి తన షర్ట్ ఇవ్వడం, ఆ షర్ట్ తో సభల్లో గడపటం మరచిపోలేని గ్యాపకం.నా తొలి కధ పువ్వులకొరడా స్రుజన లో వచ్చింది. స్రుజన నన్ను కధకుణ్ణి చేసింది. నా ప్రత్యామ్నాయం కధాసంపుటికి వివి ముందు మాట రాసేరు
    . 1998లో

    శ్రీకాకుళం లో విరసం సభలయ్యాక, మరునాడు మా ఇంటిలో మాంసాహారం తింటూ…కంచానికి దుమ్ము కొడితే పై లోకానున్న పెద్దలకు వినిపిస్తుందంటారని నవ్వుతూ మూలుగు దుమ్ము కంచానికి కొట్టేరు. నిబధ్దతకు నేటి గుర్తు వి.వి.. వేణూ బాగా రాసేరు.

  • 1975 ప్రపంచ తెలుగు మహసభల సందర్భంగా వివి గారి అరెస్టుని కూడా జోఇంచాల్సింది..

    • 1975 తెలుగు మహాసభల సందర్భంగా వివి అరెస్టు కాలేదు. ఆయన అప్పటికి సికిందరాబాద్ కుట్రకేసు నిందితుడిగా జైలులో ఉన్నారు. తెలుగు మహాసభల తర్వాత రెండు మూడు వారాలకు హైదరాబాదులోనే ఉండాలనే కండిషన్ బెయిల్ మీద విడుదలై, రెండు నెలలు తిరగకుండానే ఎమర్జెన్సీ రావడంతో మళ్లీ అరెస్టయ్యారు. ఆంధ్రప్రదేశ్ చివరి రోజుల్లో తిరుపతిలో జరుగుతున్న తెలుగు మహాసభలకు నిరసన తెలపడానికి వెళ్తుండగా కర్నూలులో రైలు దించి వెనక్కి పంపారు. 2017లో తెలంగాణ ప్రభుత్వం జరిపిన తెలుగు మహాసభల సందర్భంగా అరెస్టయి దాదాపు ఒక రోజంతా పోలీసు స్టేషన్ లో ఉంచారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు