లోలోకి

1
రోజు లాగే
కాలపు ముఖం మీద నవ్వు లేదు

లోపల నదులెండి పోయాయి కదా?

2
కనీసం నటించడం కూడా రావడం లేదు ఇప్పుడు
లోకానికి

లోపల తోటలు విరబూస్తే కదా

3
అవును
కోప తాపాలే  మిగులుతాయి
క్షణాలను ఖడ్గాల్లా మారుస్తాయి

సంయవనాన్ని గుండెలు కోల్పోయాక..

4
కోరికలు మాత్రమే ప్రకటిస్తుంది
మనసు

సరుకులే జీవితాన్ని తూస్తున్న
బజారులో

5
రెప్పల కింద తడి మాయమైపోయింది
గాలికి

ఆరు రుతువుల అల్లారు ముద్దులు లేవు
ప్రచండంగా ఎండ పరుచుకుంది
భూతలాన

6
చేజేతులా
చేజార్చుకుంది
ప్రేమ
మనిషి ని

యుధ్ధం
తప్ప చేసుకోడానికి
ఇంకే కార్యాలూ లేవు

7
తన లోలోకి
దిగుతూనే ఉన్నాడు
మానవుడు

తనకి తాను
దొరికితే కదా…

8
తన సహజ రంగు వెలిసిపోయిన
నింగి కింద

భూమి మరణశయ్య గా
మిగిలింది

మానవత
క్షతగాత్ర దేహం

9
ఆలింగనాల
రుతువు రావాలిపుడు

గట్టిగా హత్తుకునే
గుండెల తడి గనులు కావాలిపుడు

కలుసుకోవడం
కలలు పంచుకోవడం
కరువైంది కదా..

*

మహమూద్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు