లోపలి మనిషికి రెక్కలు: బండారి రాజ్ కుమార్

కవి నేపథ్యం
నా విషయానికొస్తే  అమ్మ (విజయ) అంగన్ వాడీ టీచర్ ,  బాపు(సత్యం) కల్లుగీత కార్మికుడు. అమ్మ   పాడే బాలలగేయాలు, నాయినమ్మ(రామక్క) చెప్పిన జానపద కథలు నన్ను సాహిత్యం వైపుకు నడిపించాయి. చిన్నప్పుడు ఎక్కువగా అప్పటికప్పుడు కథలు అల్లుతూనే చెప్తుండేవాడిని. అమ్మ నేర్పించిన బాలల గేయాల స్ఫూర్తితో ప్రాసకవిత్వం రాసేవాన్ని.
వల్లంపట్ల రాసిన “అక్షరాయుధం” అనే పాటల పుస్తకం నాలో చదవాలనే కోరికను రెట్టింపు చేసింది. 9, 10 తరగతుల్లో వుండగా ఇంద్రసేనారెడ్డి సార్ మాతృదినోత్సవం రోజున కవితల పోటీ పెడితే వరుసగా రెండుసార్లు బహుమతులు అందుకోవడం రాయాలనే ఆసక్తిని పెంచింది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం, ఆర్ధికపరిస్థితులు కవితా వస్తువుల్ని నిర్ణయించేవి. ఇంటర్ లో హస్టల్ జీవితం నాలోని అంతర్ముఖుడిని నాకు కొత్తగా పరిచయం చేసింది. రెండేండ్ల ఉపాధ్యాయ శిక్షణ కాలం నాలోని లోపలి మనిషికి  రెక్కల్ని ప్రసాదించి స్వేచ్ఛగా గాల్లోకి ఎగరేసింది. డిగ్రీలో వుండగా N.S.S యువజనోత్సవాల్లో దేశభక్తి గేయకవితకు ప్రథమ బహుమతి రావడం నాలోని కవిని, సామాజిక అంశాల పట్ల స్పందించే తత్వాన్ని ముందుకు సాగేలా ప్రోత్సహించింది.

“గరికపోస(2010)” పేరుతో మొదటి కవితాసంపుటి తీసుకొచ్చాను. ప్రింటింగ్ ప్రెస్ లకు విజిటింగ్ కార్డ్స్ ఆర్డర్లు తెచ్చివ్వడం, ట్యూషన్లు చెప్పడం, ప్రైవేట్ పాఠశాలల్లో పార్ట్ టైం గా పాఠాలు చెప్పడం,  పాన్ షాప్ పెట్టుకొని నా కాళ్లపై నేను నిలబడడం, కుటుంబ బాధ్యతల్ని పంచుకోవడం మొ॥నవి  జీవితం నేర్పిన పాఠాలు. ఒక వైపు తెలంగాణ మలిదశ ఉద్యమం  సాహిత్యాన్ని పదును పెట్టడం, మరోవైపు రకరకాల మనుషులు, వారి వ్యక్తిత్వాలు అర్థంకావడం, సమాజంతో నిత్యసంఘర్షణ, సర్దుబాట్లు అనివార్యమనే స్థితికి రావడం వ్యక్తిగా నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి దోహదపడింది. “నిప్పుమెరికెలు(2013)” పేరుతో ఉద్యమ కవిత్వ సంపుటిని తీసుకొచ్చాను. 2010 లో గవర్నమెంట్ ఉద్యోగం రావడం నా జీవితంలో ఒక మైలురాయి. ఆర్థికంగా నిలదొక్కుకొని కుటుంబ బాధ్యతల్ని తీసుకోవడం, సామాజిక బాధ్యతల్ని అర్థంచేసుకోవడంలో, సాహిత్యాన్ని సృజించడంలో మరింత పరిధిని విస్తృతపరుచుకున్నట్లు అనిపించింది. తెలంగాణ రాష్ట్ర సాకారం తర్వాత బహుజనుల జీవితాల వెతలు “గోస(2016)” పేరుతో కవిత్వంగా మలిచాను. వ్యక్తిగత జీవితంలోని సమస్యలు, సామాజిక జీవితంలోని సంఘర్షణల మధ్య తీవ్రంగా నలిగి సతమతమైన బతుకు చిత్రాన్ని “వెలుతురు గబ్బిలం(2018)”గా కవిత్వరూపంలో తీసుకొచ్చాను. నా కవిత్వ ప్రయాణానికి దిక్సూచిగా పనిచేసిన వారిలో  ననుమాస స్వామి” ముఖ్యులు. వ్యక్తిగతంగా, కవిత్వపరంగా నన్ను తీర్చిదిద్దే మిత్రులు కేతిరెడ్డి యాకూబ్ రెడ్డి, కాసుల రవికుమార్ , వడ్లకొండ దయాకర్ , ప్రేమ్ కుమార్ చిట్ల, కుమారస్వామి , తర్వాత నా కవిత్వాన్ని తూచి సలహాలు ,సూచనలు అందించిన వారిలో అన్వర్ , పొట్లపల్లి శ్రీనివాసరావు, అంపశయ్య నవీన్ , బన్న అయిలయ్య, సి.నారాయణరెడ్డి, కె.శివారెడ్డి, జూలూరి గౌరీశంకర్ , అమ్మంగి వేణుగోపాల్ ,యాకూబ్ ,దర్భశయనం శ్రీనివాసాచార్య, శిలాలోలిత, శిఖామణి, పర్సా వెంకటేశ్వర్లు, కోవెల సుప్రసన్నాచార్య మొ॥ పేర్కొనవచ్చు.

2016 లో “కవిసంగమం” పరిచయమవడం, 30 వ సిరీస్ లో రెండవతరం కవిగా అవకాశం దొరకడం, అనేక మంది సాహితీ మిత్రుల్ని దగ్గరచేసింది. ప్రస్తుతం “కవిముద్ర” పేరుతో  కవిసంగమంలో మంగళవారం  శీర్షిక రాస్తున్నాను. సృజనాత్మక కవిత్వం రాస్తూనే మరోవైపు నాలోని విమర్శకుడిని తట్టిలేపే ప్రయత్నం చేస్తున్నాను.
ఎక్స్ రే, రాధేయ, రంజని – కుందుర్తి, భారతీయ భాషాపరిషత్ యువపురస్కారం లాంటివి నా సాహిత్యజీవితానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నాయి. కవిత్వం వల్ల అనేకమంది ఆత్మీయుల్ని ఆలింగనం చేసుకొనే భాగ్యం కలిగింది.పల్లె నుంచి ఎదిగి రావడం వల్ల తెలంగాణ పలుకుబడి, నుడికారంపై  సాధన మీద పట్టు దొరికింది. నా యాస నా ప్రాంతాన్ని ప్రతిబింబిస్తుంది. నేనెక్కడి నుంచి వచ్చానో, నా మూలాలేంటో చెబుతుంది. తెలంగాణ జీవద్భాష నన్ను కవిత్వంలో ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈ మట్టి మీద నిలబడి, ఇక్కడి గాలి పీలుస్తూ ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్నాను. నా కవిత్వాన్ని అర్థం చేసుకోవడమంటే  నేను నివసిస్తున్న సమాజపు స్థితిగతుల్ని, సమాజంతో  నాకున్న అవగాహనను అంచనావేయడమే.
తప్పుల్ని సరిదిద్దుకుంటూ  ముందుకు వెళ్లడమే  మిగిలింది. నన్ను భరించే నా జీవన సహచరి (రమ్యశ్రీ), నన్నో ఆటాడిస్తున్న నా తొల్సూరి కొడుకు(హృదయ్ రామ్ సాయి)ని గుర్తుచేసుకుంటూ మీముందు నన్ను నేను పరుచుకునేలా చేసిన అఫ్సర్ గారికి శనార్తులు.
శేషం సున్నా
~
ఎప్పుడన్నా ఆకాశం తలను వంచి మొట్టికాయలేశినవా?
ఎన్నెన్ని దహనసంస్కారాల్ని సూశిందో ..
ఒక్కసారన్నా కాలుతున్న మనిషివాసన మనసు నిండుగా పీల్శిందో..లేదో..ఊపిరి బిగవట్టినప్పుడల్లా నీకెమన్న మర్మం ఎరుకైందా?
ఒంటరి అసంతృప్త గీతంలా ప్రవహిస్తున్నప్పుడో
అవిశిపోతున్న మాటల్ని ఏరుకుంటున్నప్పుడో
నిద్రపట్టని నడిజామురాతిరి మూలుగులతో విసిగిపోతున్నప్పుడో
దుక్కపుమడుగులో నానినాని శీకిపోయిన ప్రేమపాశాలు నిన్నెప్పటికీ బంధించలేవని నిట్టూర్చినప్పుడల్లా ..
బతుకురహస్యమేదన్నా ఒంటబట్టిందా?
ఎన్కకుతిరిగి ఇన్నేండ్ల గతాన్ని మర్రిమర్రిజూశినా అక్కడేం మిగల్లేదని తల్సుకుంటనే పానం దస్సుమంటది. కంటికి రెప్పలా అంటిపెట్టుకుంటనన్న ఆకాశం గవాయిగా నిలబడి,  గుడ్లురిమినప్పుడల్లా పెయి జలదరిత్తనే వుంటది. బతుకు పచ్చగా మొలకెత్తడానికి ఒక్క వానబొట్టయినా సాలని చెవులల్ల గుసగుసలెవలన్న జెప్పిపోయిండ్లా ?
పికిలిపోతున్న గుండె ఆర్తనాదాల్లో వినబడుతూ

చూపులు ఇసురంగనే పగిలిపోయే నీటిఅద్దం ముక్కల్లో కనబడుతూ మనసు కిటికీ తెర్వంగనే ఎగిరిపోయే పిట్టల తలపుల్లో నీకు నువ్వే యాదికొత్తవు. నీకు నువ్వే మిగిలిపోతవు.

*

బండారి రాజ్ కుమార్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు