లైలా మజ్ను-4

4

భళ్ళున తూర్పు తెల్లారె!

పసిడి వెలుగుల ఉదయరవి

వెండి మెరుపుల తారల్ని

పట్టెను తాను గ్రహణమై!

 

దిగ్గున లేచాడు మజ్నూ!

ఏకాంతంలో లైలా!

బయల్దేరాడు మళ్ళీ

వంపులు తిరిగే దారి!

 

నడుస్తుంటే కలిగింది

గుండెను తొలిచే బాధ అది;

పెదవిపై కదలాడింది

ఏదో విషాదగీతం.

 

సున్నితంగా తన మనసు

విప్పి చెప్పే పాట అది;

తనకేదో ఇష్టమైనది,

ఎక్కడిదో ఆ పాట!

 

ఏదో భ్రమలో తాను

చూడగలిగాడు ఆమెను

ఉదయపవనవీచికలా

మబ్బులు మూయని కాంతిగా!

 

పోషణలేక కృశించిపోయి

అలసటతో కుంగిన మనసుకు

వికసించిన ఎర్రగులాబీ

తానై తోచెను లైలా!

 

లెక్కలేనివి ఎన్నో వెతలు!

వేగివేగి వేసారు తనకు

బాధ తీర్చి సేద తేర్చే

దేవదూత తాననిపించె.

 

కాలిపోతూ రాలిపోయే

వత్తిలా తానుండగా

చల్లని ఆ చేతుల్లో

ఉపశమించే తాపమంతా!

 

గాలిలోన తేలిపోతూ

నేలకు దిగెను నెలికురులామెకు;

వాటిపైన ప్రేమతోటి

తన కురులేమో జడలు కట్టెను!

 

గడిచిపోతున్నాయి రోజులు

శోష తప్పగా దుఃఖంలో!

గుండెలోని బాధలన్నీ

శ్రావ్యమైన పాటలాయె!

 

*

 

తన బాధెరిగిన స్నేహితులు

ఎట్లయ్యావని వగచారు;

ఆగని ఉన్మత్తాలాపన

ఇంకానా అని బెదిరారు.

 

రాత్రుల్లోన వీచేగాలి

నిండిపోతుంది దుఃఖంలో,

గాలికి తోడు రేగిపోయే

జ్వాలవంటిది విచారం!

 

పూర్వం తనకు తెలివికలిగిన

మస్తిష్కానికి తెలిసేలా

కలతచెందిన మనసును కాస్త

ఊరటగొలిపి చూశారు.

 

తల్లడిల్లింది తండ్రి మనసు

కొడుకు వెతలను తీర్చాలని;

మంచిమాట తెలిసొచ్చేలా

చెప్పి చూశాడు ఎన్నెన్నో.

 

పెద్దలమాట చద్దిమూట

సద్గతులే కలిగిస్తుంది,

ప్రేమే ఒకపరి కలిగిందా

ఎక్కడి మంచి? ఎక్కడి మాట?

 

ఏడ్వసాగాడు మజ్నూ!

వినడు పాపమా తండ్రి మాట!

ప్రేమతో కందిన మనసు

మంచిచెడ్డలు చూస్తుందా?.

 

కన్నతండ్రి హతాశుడై

పట్టరాని ఆరాటంతో

పరదాతీసి హరంలోనికి

వెళ్ళిపోయి నిలుచున్నాడు.

 

పిచ్చివాడి కంటినీరు

తుడిచేదెలాగ తానంటూ

ఇంటిలోపలి ఆడవారిని

దిక్కుతోచక అడిగాడు.

 

పున్నమచంద్రుడంటి బిడ్డడు!

తెలివితేటల వెలుగుజిలుగులు

ఇంత చప్పునారిపోయెనే!

ఎలా జరిగింది యిలాగ?

 

చిన్నాపెద్దా అనకుండా

ఇంటిలోని వారందరికీ

నాలుక చివర వెంటనే

ఆడిందల్లా ఒకే మాట!

 

“వాడి గతి యింక నిశ్చయం!

వాడి కళ్ళు చూసేశాయి

వాడి ప్రేమను చూరగొని

మనసునేలే మహారాణిని!

 

“ఎదురులేనంత శక్తితో

జయించుకుంది సౌందర్యం!

మనవాడి గుండె ఇక బందీ

ఆ అరబ్బుపిల్ల గుప్పిట్లో!

 

“ఇప్పుడేం చేస్తావు నువ్వు?

రక్తం ఓడే ప్రేమికుడికి

ఏ ఉపశమనం కలిగిస్తావు?

చావు తప్పదు వాడికి!

 

“వాడి కోరిక తీర్చడం తప్ప

ఏముందిపుడు చేయడానికి?

తండ్రిగా అది నీ కర్తవ్యం

పెద్ద మనసుతో సాయం చెయ్!

 

“ప్రేమబంధాన వారిద్దరిని

ఒకటైపోనీ ఎప్పటికీ!

అది ఒకటే మరి యిప్పుడు

వాడి కలతను తీర్చగలిగేది!”

 

మంత్రంలా పనిచేయవా

స్త్రీలు పలికే వచనాలు?

రేయిని పగలు చేయవా?

వెలుగు నింపవా చీకట్లో?

 

బతుకు దుర్భరమైపోతే

మందు పూయవా గాయంపై?

మనసు చెల్లాచెదురైనపుడు

తీవ్రమైన జ్వరం మాన్చవా?

 

వారి పలుకుల సముదాయింపుకు

నెమ్మదించింది తండ్రి మనసు;

పరిపరివిధాల పోతూవున్న

ఆలోచనలు శాంతించాయి.

 

ఏంచెయ్యాలో జరూరుగా

నిశ్చయించాడు వెంటనే!

అంగరక్షకులనంపించి

గుర్రం సిద్ధం చేయించాడు.

 

అందరొకచోటికొస్తూనే

గుర్రం ముందుకు దూకింది;

అమ్మాయింటికి బయలుదేరి

సాగిపోయాడు వేగంగా!

 

చేరాడో లేదో అక్కడ

వాకబు మొదలైపోయింది:

“మిత్రులా మీరు శత్రువులా?

ఏమా పని మీకిక్కడ?

 

“మీరే పనిమీదొచ్చినా

ముందు చెప్పాలి నాకు!

అనుమతి పొందిన మిత్రుడే

గవిని దాటుకు రాగలడు!”

 

గుమ్మంలోనే ఎదురయ్యింది

సైదుమ్రీకి ఆటంకం!

అహం దెబ్బతిన్నా కూడా

శాంతంగానే పలికాడు:

 

“స్నేహం కోరి నేనొచ్చాను!

ఇంక మనకే గొడవలు వద్దు!”

అలాగన్నాక ఇంకా తాను

అమ్మాయితండ్రికి చెప్పాడు:

 

“పెళ్ళి విందుకు వేళయ్యింది!

దాహంగొన్న హృదయంతోటి

నా కుమారుడు కనుగొన్నాడు

నీ యింటి సెలయేటి జాలు!

 

“స్వచ్ఛమైన మంచినీరు

పచ్చికలో ప్రవహించింది;

అందులో ప్రతి నీటి తుంపర

స్పటికంలా మెరిసిపోతుంది!

 

“కావాలి తనకా సెలయేరు!

ఎంత శక్తిసంపదలున్నా

కీర్తిప్రతిష్ఠలెన్నున్నా

సిగ్గుతో తలవంచాను!

 

“తన కోరిక కొరమాలిందని

తెలిసీ తన భవితవ్యాన్ని

తాహతులేనివారితోనే

ముడిపెడుతున్నా దిగొచ్చి!

 

“మా వంశం గొప్పలు దేనికి?

తెలిసిందేగా అందరికీ!

జాలిపడనా? రోషపోనా?

ఏమైనా నాది పైచేయి!

 

“నా సంపద, నా ఆయుధాలు-

చాలివి ఎడారి యుద్ధానికి!

కానీ నువ్వొక బేహారివి,

వ్యాపారులకు పెద్దవి!

 

“నీ అంగడి చూసి వచ్చాను,

ధర ఎంతో చెప్పు మరి?

కొనడానికి నే సిద్ధం!

ఒక్కమాటతో ముగించు!

 

“తెలివైనవాడివే అయితే

సలహా యిస్తాను పాటించు!

పెద్ద ధరకే అమ్ముకో,

ఎంత కోరినా యిస్తాను!”

 

లైలీ తండ్రి కంఠంలో

కాఠిన్యం పొడసూపినా

అదుపు చేసుకుంటూనే

మృదువుగా యిలాగన్నాడు:

 

“నిర్ణయించేది మనమేనా

వివాహాలతో కలయిక?

శక్తిసంపదలిచ్చేది,

సత్యమైనది స్వర్గం!

 

“మనం చేసే తర్కమంతా

న్యాయమనిపించినా పైకి

లోన దాగి వుంటుంది

అంతు తెలియని పొరపాటు!

 

“బలవంతపు మైత్రీబంధం

బెడిసిందంటే ఒకవేళ

తెచ్చిపెడుతుంది రణం,

నేరుగా దారి గోరీకి!

 

“తనకు తానుగా ఉన్మాదం

నేరం కాదు, పాపం అంటదు!

అయినాగాని పిచ్చివాడితో

చేరేదెవరు శత్రువుతో?

 

“పిచ్చివాడుగా నీ కొడుకు?

ముందువెళ్ళి నయం చెయ్యి!

స్వర్గం ఎదుట కూలబడు!

ప్రార్థన చేసి అర్థించు!

 

“అంతులేని అంధకారం

వాడి మెదడులో వున్నదాక

కుదరని సంబంధం తెచ్చి

నన్నింకా విసిగించకు!

 

“నా రత్నం వెల కట్టలేనిది!

మోసాలు బెదిరింపులతో

కొనలేరెవరూ తెలుసుకో!

ఇకనైనా తెలివి తెచ్చుకో!

 

“చెప్పాగా నా ఉద్దేశం,

ఈ సమావేశం సమాప్తం!

గుర్తుంచుకో అది నువ్వు,

ఇబ్బంది పెట్టకు నన్నింకా!”

 

నరాలు తెగిపోతున్నట్టు

కందిపోయింది మొహమంతా!

ఎన్నడెరుగడా ఎకసెక్కెం,

మర్యాద మంటగలిసింది!

 

అనుచరులవైపు తిరిగాడు;

క్రోధంతో సైదుమ్రీ చెంపలు

భగభగ మండసాగాయి!

గుండె రగిలిపోయింది!

 

ఎదురు మాట్లాడలేకపోయి

వెనుదిరిగి తన యింటివైపుకు

అవమానభారం మోస్తూ

ఆగకుండా సాగిపోయాడు.

 

*

 

ఉన్మాదంతో గతులు తప్పి

మతిపోగొట్టుకున్న వాడికి

ఆప్యాయతతో నయంచేయను

మందెక్కడ దొరుకుతుంది?

 

ఏ మాయ పనిచేస్తుంది

విరిగిన మనసు అతకడానికి?

హస్తవాసిగల నైపుణ్యం

ఎవ్వరిదని పనికొస్తుంది?

 

భూతవైద్యుల విద్యలతో

పరీక్షలే చేయించారు;

మంత్రతంత్ర వశీకరణలు

వధువుపై ప్రయోగించారు.

 

స్వర్గలోకం కరిగిపోయి

తండ్రిమనసు శాంతించేలా

కరుణతోటి వరమివ్వాలని

ఎన్నో దారులు వెతికారు.

 

వమ్మైపోయాయన్నీ!

అందరు చేరి మరి యింక

పలకసాగారు విధిలేక

దయతో సాంత్వన వచనాలు:

 

వినకపోయినా ససేమిరా,

తానెంతగ కంటగించినా

దీవెనలన్నీ ఫలించాలి,

మనసు మెత్తగా కరగాలి!

 

“వేరే ప్రేయసి వుంది చూడు,

రాజుల వంశం తనది;

రూపంలోన సాటిలేనిది,

లావణ్యాన దీటే లేరు!

 

“అన్ని వగలూ నయగారాలు,

అచ్చరకాంతల అందాలు

మది దోచే తన చూపులకు

కనుసన్నల్లో కరిగిపోవా!

 

“మహిమతో కళ ఉట్టిపడేటి

దేవతామూర్తిలా వుంటుంది;

రాచపుట్టుక సైతం తనకు

తక్కువేమో అనిపిస్తుంది!

 

“తేనెలూరే లేతపెదవులు

మణులుగా ప్రకాశిస్తాయి,

పాలూతేనె కలగలిసే

తియ్యందనాలొలికిస్తాయి!

 

“తన పలుకే లలితగీతమై

జాలువారు సంగీతంలా

వసంతశోభకు మెరుగుదిద్ది

సుగంధాలనొలికిస్తుంది!

 

“వంటినిండా బంగారు నగలు,

వజ్రాలు, వైఢూర్యాలు!

ప్రేమికుడి కలలో వెలుగది,

స్వచ్ఛమైనదా ప్రకాశం!

 

“ఇంతటి కానుక ఇంటనున్నా

ఎందుకు నీకీ వెతుకులాట?

తేలికపాటి అందం కోరి

పొరుగింట దేనికి చూస్తావు?

 

“పనికిమాలిన ఆలోచనలు

ఇప్పటికైనా మానుకో!

వివేకంతో మదిలోనుంచి

లైలీనింక తరిమేసెయ్!”

 

అంతరించాయి ఆశలని

గ్రహించాడు తను మజ్నూ!

అతి చక్కని ఆ వికాసమే

తుడిచిపెట్టుకుపోయింది!

 

తన తండ్రి, తన స్నేహితులు

సంధానకర్తలై దయతో

మెలగకపోగా నడిమధ్యన

తామే అడ్డుగ నిలిచారు!

 

ఒకే ఒక్క ఆశాకిరణం

ఏదైతే ప్రసరిస్తూనే

శాంతిస్తుందో తన మస్తిష్కం

ఆ వెలుగే అరబీ యువతి!

 

రెండు చేతులా గుండెల్ని

బాదుకున్నాడు మజ్నూ!

వంటిమీదున్న దుస్తులను

చింపి ముక్కలు చేశాడు!

 

కసిగా ఆ బంధనాలను

నేలకు విసిరి కొట్టాడు!

చీకటి నిండిన దారి వెంట

అడివిలోకి పరిగెత్తాడు!

 

వెక్కివెక్కి ఏడ్చాడక్కడ,

తనకు తానే ఒంటరిగా!

ఎవరికీ కానరాకుండా

బిగ్గరగా రోదించాడు!

 

కళ్ళల్లోన కన్నీరాయె,

గుండెలోన ఆరని జ్వాల!

పెదవులపైన ఒకటే పేరు,

ఆ పేరే తన లైలా!

 

‘లైలీ!’ ‘లైలీ!’ – ఆ పేరే

మారుమోగింది చుట్టుపక్కల!

వినిపిస్తూ వుండిపోయింది

ఆగకుండా అలాగే!

 

వంటిపైన ఒకటే వస్త్రం

తీర్థయాత్రికుడి లాగా!

వట్టివి కాళ్ళు, బోసిదా తల

నిర్లక్ష్యంగా తిరుగుతాడు!

 

అయినా తన మెదడుకేదైన

లీలగా గుర్తుకొస్తేను

గొణుగుతుంటాడు తానేదో

ప్రేమ నిండిన బాధతోటి!

 

ఆమె పేరే ఎప్పటికీ

నాలుక చివరే వుంటుంది!

పొదలలోన అడివిలోపల

‘లైలీ’ ‘లైలీ’ శబ్దాలు!

 

ఎడారిలో ఏకాకి బతుకు,

మనసు నిండా విచారమే!

వంటినిండా దుమ్మూధూళి,

పాడైపోయె ముఖవర్ఛస్సు!

 

అలవిమీరిన దుఃఖంలో

అలసిపోయాడు తాను;

విసిగి వేసారి నడవలేక

కూర్చున్నాడు ఒకచోట!

 

“స్నేహితులకు దూరమయ్యాను!”

ఏడుస్తూనే అరిచాడు,

“ఇంటికి వెళ్ళే దారంతా

గాఢాంధకారం నాకింక!

 

“కానీ, లైలీ, నీ పక్కన

నేనే వుండి వుంటే

ఈ దీన ప్రేమికుడే

ఎన్ని దీవెనలందేవాడు!

 

“బంధువులంతా నన్నిపుడు

తలిస్తే సిగ్గుపడతారు!

మిత్రులే నా పేరు వింటే

ఉలిక్కిపడిపోతున్నారు!

 

నా చేతిలో వుండేది

ఓ నిండైన మధుపాత్ర!

నేల కూలింది చేజారి

పగిలి ముక్కలైపోయింది!

 

సుఖభోగాలను చవిచూస్తూ

వదలక నిత్యం సంబరాలు

జీవితంలో దుఃఖమనేది

ఏమనేదే తెలియదు మీకు!

 

దేనికీ కలత లేకుండా

నిమ్మళమైన మనసులు మీవి!

మీకేం తెలుసు పగిలే గుండె

ఎలా వుంటుంది తాననేది!

 

*

 

పూర్తిగా అలిసి నెమ్మదిగా

నేలకు జారిపోయాడు!

కన్నీరింకని దుఃఖంలో

అక్కడే పడి కనిపించాడు!

 

ఎటుపోయాడో తానంటూ

వెతకడానికి వెళ్ళినవారు

వేలాడిపోయే యువకుడిని

సున్నితంగా చేర్చారిల్లు!

 

కన్నతండ్రి సైదుమ్రీతో

బంధువులందరు గుమిగూడి

అతడి దుఃఖమే తమదిగా

కుమిలిపోతూ ఏడ్చారు!

 

అందరు చేరి గొడవగా

పసితనం నుంచీ తాను

ఎలా పెద్దవాడైనాడో

జ్ఞాపకాలు నెమరేశారు.

 

కుర్రవాడుగ తానున్నపుడు

ఎంత తెలివిగ వుండేవాడు!

కళ్ళముందరే తమకిప్పుడు

ఆశలే కుప్పకూలాయి!

 

మక్కాలో పవిత్ర కాబా

నయం చేయునని తలపోసి

మందగించిన తెలివితేటలు

మరలి రావాలని కోరారు.

 

మానవజాతిని దీవించే

వరమే తానక్కడున్నది!

భూమికే దివ్య తేజస్సు,

తేజస్సది స్వర్గానికి!

 

మహా ప్రవక్త ప్రార్థించిన చోటు

మహా పవిత్రం కాబా!

జమ్ జమ్ జలముంటుందక్కడ

రక్షకు సాయం చేస్తుంది!

 

యాత్రకివి అనువైన రోజులు;

వ్యాపారస్తులు, రాజులు,

ఫకీరులందరు కలగలిసి

చేరుకుంటారు ఒకేచోటు!

 

ప్రమాణాలనే చేస్తారు,

కుర్బానీలు యిస్తారు;

దివ్యమైన స్థలంలో

వేలకువేల జనమొస్తారు.

 

అంతటి పెద్ద ఆశయంతో

ఒంటెలు పూన్చి గవిని దగ్గర

యాత్రకు తాను సిద్ధమై

వేచివున్నాడు సైదుమ్రీ!

 

ఒంటెల మెడల గలగలలాడు

గంటలు వేలాడ దీశారు!

మూపురాలకు అంబారీలు,

కుచ్చులతోటి అలంకరణలు!

 

పాడెమీద పడుకోబెట్టిన

శోషతప్పిన మజ్నూ

ఏది జరిగినా పట్టనట్టు

దీనంగా పడివున్నాడు!

 

గట్టిగా బలమైన ఒంటెలు!

బిడారు ముందుకు కదిలింది;

కుదుపులతోటి అదుర్లకు

అతని వళ్ళు నిమరసాగారు.

 

త్వరలోనే ఎడారి దాటి

కళ్ళముందర ఉజ్వలంగా

మక్కా మినార్లు ఎత్తుగా

ప్రకాశించడం చూశారు.

 

బంగారు కానుకలతో

కుర్బానీలు, ప్రార్థనలు;

పాప క్షమాపణలర్థించి

పొందగలిగేదక్కడ!

 

సర్వశక్తివంతమైన

దైవగృహంలోకి వెళ్ళి

కన్నతండ్రి తాను యిలా

ప్రార్థన చేయసాగాడు:

 

“నన్నూ నావారినందర్ని

స్వర్గం కరుణించాలి!

నా కన్నబిడ్డను రక్షించి

స్వర్గమే దయచూపాలి!

 

“నా కుమారుడి మదిలోనుంచి

ఉన్మాదం చెరిపివేయాలి!

రక్షించాలి రక్షించాలి

ప్రేమపాతకం నుంచి!”

 

అది చూశాడు మజ్నూ!

దారితప్పి తిరిగేవాడే

అయినాగాని తండ్రిని చూసి

చిరునవ్వులు చిందించాడు!

 

ప్రేమ సత్యం! ప్రేమ పవిత్రం!

అది నిరూపించడానికే

అంకితం తన జీవితం అని

తెలియజేశాడు స్పష్టంగా:

 

“సౌందర్యజాలంలోన

బందీయే నా హృదయం!

నా ప్రేమకు మరణం లేదు,

ఎప్పటికీ అది నశించిపోదు!

 

“వేరవనా నానుంచి నేను?

ఎవరికోసమైతే నేను

ఊపిరి పీలుస్తున్నానో

ఆమెకు దూరం కాలేను!

 

“స్వచ్ఛమైనది నా ప్రేమ!

సత్యమైనది నా ప్రేమ!

మిత్రులైనవారెవరైనా

వదులుకోమని అనగలరా?

 

“కాలిపోతే మాత్రమేమిటి

వత్తిలాగ నేను యిలా?

మిగిలిపోతే మాత్రమేమిటి

నీడలాగ నేను యిలా?

 

“స్వేచ్ఛనిండిన గుండెను చూసి

అసూయ లేదు నాకేమీ!

అయినా నాకు ప్రేమంటే

గుండెకు వేసే సంకెల!”

 

స్వర్గం నుంచి జాలువారే

పవిత్రప్రేమకు దీవెనలు!

వ్యామోహాలే అపవిత్రం,

ప్రేమకు మచ్చ తెస్తాయి!

 

నిలకడ లేని హృదయంతో

ఎప్పటికప్పుడు మారిపోయి

చాపల్యాన పుట్టిన ప్రేమ

ప్రేమేకాదు తానసలు.

 

దివ్యమైన సత్యంగా

శాశ్వతంగా వెలిగేది,

మజ్నూ ప్రేమ ఎప్పటికీ

ఇలలోని ప్రేమ కాదది.

 

అగ్నిజ్వాలలు పుట్టేది

నేలపైనే అయినా

ప్రేరణ మాత్రం ఎప్పుడూ

స్వర్గం నుంచే వస్తుంది.

 

*

 

 

 

 

నిశ్శబ్దంగా రోదిస్తూ

తెలుసుకున్నాడు ముసలి తండ్రి-

తను పడిన పాట్లన్నీ

వృధా ప్రయాసలయినాయి!

 

కాలిపోయే ప్రేమహృదయం

మక్కా సైతం ఆర్పలేదు,

తండ్రి గుండె తరుక్కుపోతే

ఒక్క చిన్న ఓదార్పు లేదు!

(నాలుగో ఆశ్వాసం సమాప్తం)

 -ఇంకా వుంది

దాదా హయాత్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు