నిడదవోలు మాలతి గారు సృజనాత్మక రచయిత గా, అనువాదకులు గా, విమర్శకులు గా, దాదాపు రెండు తరాలకు పైగా తెలుగు పాఠకులకు సుపరిచితులు. ప్రధానంగా నా వృత్తి భాషా శాస్త్రం అయినా చిన్న నాటనుండీ నాకున్న తెలుగు సాహిత్య అభిరుచి వల్ల నేను ఒక పద్ధతిగా కాక, కలగాపులగం గా తెలుగు ప్రాచీన సాహిత్యం మొదలుకొని అర్వాచీనం వరకూ దాదాపు అన్ని ప్రక్రియల సంబంధమైన రచనలూ కొన్ని కొన్ని చదివానని చెప్పటం స్వోత్కర్ష కోసం కాదు. అయినా మాలతి గారి కథలు నేను చదివింది చాలా తక్కువ. ఇటీవల అమెరికాలో పరిచయం అయిన మాలతి గారి website తూలికా. నెట్ లో అందుబాటు లోకి వచ్చిన ఆమెరాసిన అనేక కథలలో కొన్ని, ఆమె రాసిన రెండే రెండు నవలలు – చాతక పక్షులు, మార్పు చదివాను. వీటితో పాటు ఆమెస్వయంగా చేసిన ఆంగ్ల అనువాదం, అనువాదం పై ఇంగ్లీష్ లో రాసిన వ్యాసం ఇట్లా కొన్ని కొన్ని చదివాను. ఆ సందర్భం లోనే నాలుగు నెలల క్రితం ఆమె తూలిక.నెట్ లో “Topics in Library Science and other articles” అనే విభాగం కింద ఉన్న గ్రంథాలయాల సంబంధిత నాలుగు ముఖ్యమైన వ్యాసాలు చదివాను.
నేను అమెరికాలో ఉన్నప్పుడే మాలతి గారికి రెండు ఉన్నత పురస్కారాలు అందాయి. రెండూ అంతర్జాల పద్ధతిలో కావడం వల్ల వాటిలో పాల్గొనే వినే అవకాశం దొరికింది. ఒకటి కోడూరి ప్రభాకర రెడ్డి గారు ఏర్పాటు చేసి సిరికోనవేదిక గాఇచ్చింది; రెండోది కల్పనారెంటాల గారు తాము ప్రాచీన కవయిత్రి మొల్ల పేరిట ఏర్పరచి మొట్ట మొదట గా మాలతి గారిని ఎంపిక చేసి ఇచ్చిన “ మొల్ల పురస్కారం”. ఈ పురస్కారం సందర్భంగా ఆహ్వానించిన కొందరు సాహితీ వేత్తలతో మాలతి గారి కథలు, నవలలు, అనువాదాలు మొదలైన వాటిపై ఒక విద్యాత్మక సదస్సు వలె ప్రసంగాల కార్యక్రమం నిర్వహించారు. అందులో శ్రోత గా పాల్గొన్న నాకు వాళ్లెవ్వరూ మాలతి గారి గ్రంథాలయ వ్యాసాలు గురించి పరామర్శించక పోవటంతో అవి నేను అప్పటికే చదివి ఉండడం వల్ల వాటి గురించి రాద్దామని నాకు ఏర్పడిన అభిప్రాయం మాలతి గారికి చెప్పాను. సాధారణంగా రాయకుండానే ముందుగా చెప్పటం నా లక్షణం కాదు. కానీ కొంత నోట్స్ రాసి పెట్టుకుని ఉండడం వల్ల తొందరగానే రాసి పంపగలనన్న భావనతో చెప్పేసాను. కానీ హైదరాబాదు తిరిగి వచ్చాక అనుకున్న ప్రకారం వ్యాసం పూర్తి చెయ్యలేక పోయా.
ఈ నేపథ్యం ఎందుకంటే ఎంతో అకడమిక్ గా జరిగిన ఆ సదస్సు తో అనుసంధానం అవ్వాల్సిన ఈ రచనలు కనీసం నేను రాయాలి అనుకుంటూనే ఇంత ఆలస్యం చేశా నన్న విచారం వల్ల.
ఇంతకీ ఈ “Topics in Library Science” అనే విభాగం లోని వ్యాసాలు ఆమె సృజనసాహిత్యానికి పూర్తిగా భిన్నం గా శాస్త్రీయ వ్యాసాలు కావటం నాలో బాగా ఆసక్తిని రేపింది.
ఈ వ్యాసాలు 1967-72 మధ్య ఇంగ్లీష్ లో రాసినవీ, ముద్రిత మైనవీ. ఇవన్నీ మాలతి గారు అమెరికా వెళ్లకముందు, శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం లో లైబ్రేరియన్ ( అసిస్టెంటు) గా పని చేస్తున్న రోజుల్లో రాసినవి. విశ్వ విద్యాలయాలలో పనిచేసే గ్రంథాలయ విద్యాత్మక సిబ్బంది కూడా విశ్వ విద్యాలయ ఇతర శాఖల్లోని బోధనా సిబ్బంది కి సరి సమానులే అయినా చాలా విషయాలలో ఇతర అధ్యాపకుల తో సమానం గా వాళ్ళను పరిగణించే వాళ్లు కాదు.
ఈ Topics in Library Science లో ఉన్న ప్రధాన గ్రంథాలయ సంబంధ వ్యాసాలు నాలుగు. అవి:
- The problem of building library collection (1969)
- The home library (1969)
- Library Education – A point of view
- Indian Librarianship 1972.
వీటిలో ఆమె గ్రంథాలయ వ్యవస్థ పై , విశ్వ విద్యాలయాలలో పరిస్థితులపై, తెలుగు నాట గ్రంథాలయ ఉద్యమాలపై, ఆనాటి ప్రముఖ గ్రంథాలయ ఉద్యమ కారులపై, ప్రప్రథమ గ్రంథాలయాల ఏర్పాటు, నిర్వహణ వంటి అనేక విషయాలపై తన నిష్పాక్షిక , నిర్ద్వంద్వ ఆలోచనలూ, అభిప్రాయాలూ ఆ రోజుల్లోనే వ్యక్తం చేశారు. గ్రంథాల అవసరం, పుస్తకాల సేకరణ విశ్వ విద్యాలయాలలో మూడువిధాలుగా ( కొనడం వల్ల, బహుమానాల ద్వారా, లేదా గ్రంథాలయాల పరస్పర వినిమయాల ద్వారా) జరుగుతుందనీ, కానీ కొనడం లో మాత్రమే లైబ్రేరియన్ కు బాధ్యత ఉంటుందని వివరిస్తూ, దానితో ముడిపడి ఉండే ఆర్థిక ఇబ్బందులు, ఆయా విశ్వ విద్యాలయాలలో ఉన్న కోర్సు లపై, వాటిలోని వివిధ specialization s పై గ్రంథాలయ అధికారికి ( లైబ్రేరియన్) సరియైన అవగాహన ఉంటేనే అవసరమైన పుస్తకాలు/ పాఠ్య పుస్తకాలను కొనడం వీలవుతుందన్నారు. వివిధగ్రంథాల లభ్యత/ అలభ్యత, వివిధ సబ్జెక్టు లకు సరియైన రచయితలు దొరకడం/దొరకక పోవడం, ప్రచురణ కర్తల తో, ఆ ప్రచురణ పునర్ముద్రణ తోనూ కలిగే సాధక బాధకాల వంటి అనేక విషయాలను చర్చించారు. గ్రంథ పట్టికలు, క్లుప్తంగా గ్రంథ వివరాలు ఇచ్చే Bulletin ల అవసరం స్పష్టం చేశారు. అలాగే కొనుగోలు కోసం ప్రచురణ కర్తలు ఇచ్చే డిస్కౌంట్లు ( తగ్గింపులు) ప్రస్తావిస్తూ మార్గరెట్ సాల్ ను ఉదాహరించారు. పుస్తకాలు ,పాఠ్య పుస్తకాలు మాత్రమే కాకుండా పరిశోధక విద్యార్థుల కు అవసరమయ్యే periodicals, journals, seminar/ conference proceedings వంటి అనేక లైబ్రరీ అవసరాలను ఆమె ఎంతో చక్కగా వివారించారు.
కేవలం సమస్యలు మాత్రమే ఎత్తి చూపడం కాక వాటికి పరిష్కారాలను సూచించడం లో ఆమె కృతకృత్యులయ్యారు.
ఒక లైబ్రేరియన్ తను పనిచేసే విశ్వ విద్యాలయం కోసం ఎన్ని కోణాలలో ఆలోచించాలో అన్ని కోణాలను 1969 లోనే ఆమె ఈ వ్యాసం లోవివరించడం ఒక సీరియస్ విద్యావేత్త (academecian) మాత్రమే చేయగలరని ఈ వ్యాసం నిరూపిస్తుంది.
ఈ వ్యాసం ILA Bulletin లో 1969 లో ముద్రిత మయింది ( పుటలు: 43-49).
“The Home Library” (1969) అనే వ్యాసం లో ఇంటింటా స్వంత గ్రంథాలయం అన్న తెలుగు వారి నినాదం లో ఉన్నస్వంత ఇంటి లైబ్రరీ ఏర్పరుచు కోవడ మన్న భావన ఆధునిక కాలం లో ‘ ఇంట్లో డ్రాయింగ్ రూం లో ‘ భాగంగా రూపకల్పన చేయబడిందన్నారు. జ్ఞానాన్ని మౌఖికంగా తరతరాలుగా అందించే సంప్రదాయ భారత దేశంలో ఇది కొత్త ఆలోచన అని చెప్తూ, 18 వ శతాబ్దపు బ్రిటిష్ పాలన ప్రభావంతో ఏర్పడ్డ ఇతర అలవాట్ల వలెనే ఇది కూడా వచ్చి చేరింది అన్నారు.
కలకత్తాలోని నేషనల్ లైబ్రరీ లో ఉన్న ఆశుతోష్ గ్రంథ సంచయమే వైయక్తిక, స్వంత గ్రంథాలయానికి ప్రారంభం లో మంచి కలెక్షన్స్ గా చెప్ప వచ్చునన్నారు.
ఈ సందర్భంగా ఆమె స్వాతంత్య్రం వచ్చాక భారతదేశం లో అక్షరాస్యత 28 %గా నమోదైనప్పటికి నిజంగా చదవ గలవారినిలెక్క వేస్తే ఆ శాతం తగ్గ వచ్చని ఆమె గుర్తించారు. అంటే ఏ కాలం లో నైనా గణాంక పట్టిక లోని వివరాల కన్నా అసలు వివరాలు తక్కువగా ఉండే అవకాశం ఉందనే ఆమె గమనింపు ఇక్కడ మనం గుర్తించాల్సిన అంశం.
అయితే ఈ స్వంత లైబ్రరీ పట్ల ఆసక్తి ఉన్నా , చాలామంది (1) ఇళ్లలో స్థలం లేక కానీ, (2) కొనగల ఆర్థిక స్తోమత లేక కానీ, (3) దేశ భాషలలో చదవ దగ్గ గ్రంథాల కొరత వల్ల గానీ, లేదా (4) ఏవి కొనాలో సరియైన అవగాహన కలిగించే వారు దొరకక కానీ, (5) చదివే ఆసక్తి లేక పోవడం వల్ల గానీ -ఈ స్వంత ఇంటి గ్రంథాలయం సరిగ్గా కొనసాగలేదు అని సరిగ్గా గుర్తించారు. సరిగ్గా ఈ కారణాలే ఇప్పటికీ ఎక్కువగా అనువర్తిస్తాయి.
కేవలం బడి పుస్తకాల వంటివి కాక స్ఫూర్తి నివ్వగల జీవిత చరిత్రలు, సాహిత్య రచనలు, లలితకళలను వివరించే పుస్తకాలు ఇంటి గ్రంథాలయాల్లో ఉండాల్సిన పుస్తకాలుగా ఆమె అభిప్రాయ పడ్డారు.మొత్తం మీద జ్ఞానాభివృద్ధికీ
పఠనం ద్వారా సమాజాన్ని అర్థం చేసుకోగల గ్రంథ సంపాదనను ఆమె ఈ వ్యాసం లో సూచించారు. అంతే కాకుండా మరి కొన్ని ప్రత్యేక సూచనలూ చేశారు. వాటిలో పిల్లలకోసం పుస్తకాలు, పుస్తకాల ధరలపై పన్ను రాయితీ వంటివి కొన్ని ముఖ్యమైనవి. చివరగా ఎంత చిన్నదైనా సరే, ప్రతీ ఇంట్లో గ్రంథాలయం తప్పనిసరి గా ఉండాలని నొక్కి చెప్పారు.
మూడవ వ్యాసం “ Library Education- A Point of View” లో లైబ్రేరియన్ ఉద్యోగాల కోసం వివిధ విద్యా సంస్థ లకు అందించాల్సిన విద్యాత్మక గ్రంథాల కొరతలను మాత్రమే కాక, లైబ్రేరియన్లను చిన్న చూపు చూడటం, వారికి ఇతర విద్యా రంగాలలోని వారికి వలె కాకుండా తక్కువ వేతనాలు ఇవ్వడం వంటి విషయాలను ప్రస్తావించారు. అలాగే ఈ కోర్సు చదివిన వారికి ఉండే ఉద్యోగ అవకాశాలను చర్చిస్తూ, లైబ్రేరియన్ ఉద్యోగాల కోసం శిక్షణ ఇవ్వడం గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆమె రాసిన ఈ కింది వాక్యం చాలా అర్థవంతమైనది. “Just as study of one language is necessary to serve as a medium of communication, the study of library science should have made a common subject to introduce the student to the world of books”. ఈ ఉపమానం బహుశా ఆమెకు మాత్రమే తట్టినట్లు గుర్తించవచ్చు. అంటే అంత లోతు గా ఆలోచించారని తెలుస్తోంది. విద్యావ్యవస్థ లో విద్యార్థులకు కలిగించాల్సిన పుస్తక వినియోగ అవగాహన కోసం చక్కటి సూచనలు ఇచ్చారు( ఉదా: do not dog ear pages = పుటలను ఒక పక్క అంచుకు మడత వేయకండి వంటివి).
అలాగే విద్యార్థులకు పుస్తకాల కేటలాగు ఉపయోగించడం, వాటిని నలగకుండా చూసు కోవడం, లైబ్రరీ కౌంటర్ల లో ప్రవర్తనా తీరు మొదలైన అనేక విషయాల గురించి ఇంటర్మీడియేట్ స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కలిగించే అంశం వారి సిలబస్ లో ఉండాలన్నారు . ఈ కోర్సును ఐచ్ఛిక
అంశం గా ఇంటర్ , బి. ఏ. స్థాయి ల్లో పెట్టాలని ప్రతిపాదించారు. కానీ దురదృష్ట వశాత్తూ ఇవేవీ ఇప్పటికీ అమల్లోకి రాలేదు. పరిస్థితులు ఇంకా దయనీయంగా మారిపోయాయని తెలుగు రాష్ట్రాల పాఠశాల, విశ్వ విద్యాలయాలగురించి ఏ మాత్రం అవగాహన ఉన్న వారికైనా అర్థం అవుతుంది. (“ University News”, Vol. X(8) August 1972. Pp. 16-17).
ఇక చివరి వ్యాసం “Library movemet in Andhra Pradesh”. ఇది 1972 లో ముద్రితమయిన Indian Librarianship ( Essays in honour of S. R. Bhatia) అనే Sat Paul Goyal గారి సంపాదకత్వంలో వెలువడిన గ్రంథం లో ప్రచురింపబడింది ( Pp. 58-61). బ్రిటిష్ పాలన లో ప్రారంభమయిన ఇతర సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాల తో అనుసంధానమై గ్రంథాలయ ఉద్యమం కూడా భారత దేశం లోనూ, ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోనూ ప్రారంభ మయిందన్నారు. దేశం లోని బాంబే, పంజాబ్ వంటి ఇతర రాష్ట్రాలలో వలె కాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఇది ప్రజా ఉద్యమం అని తెలిపారు. సమకాలీన వీరేశ లింగం పంతులు గారి సంఘ సంస్కరణల ఉద్యమం వలె, గిడుగు రామమూర్తి పంతులు వ్యవహార భాషా ఉద్యమం వలెనే ముద్రణా యంత్రాల ప్రారంభం తో ఈ ఉద్యమమూ మొదలయిందని చెప్పవచ్చునన్నారు.
ఈ వ్యాసం లో తెలుగు పుస్తకాల ప్రచురణ 1775 లో ప్రారంభమై, 1852 నాటికి ఎనిమిది ప్రింటింగ్ ప్రెస్ లు మొదలయ్యాయి అంటూ 20 వ శతాబ్దం ప్రారంభం లో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్ర పత్రిక ను ప్రారంభించారు అని వ్యాసం ప్రారంభించిన మాలతి గారు విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి, వేగు చుక్క గ్రంథమాల వంటివి తెలుగు పాఠకులకు వరాల వలె రూపొందాయి అని అన్నారు. అప్పటి నుండి తెలుగు ప్రాంతాలలో అనేక పట్టణాలలో ఎన్నో గ్రంథాలయాలు స్థాపించడం జరిగిందని ప్రతి విషయాన్ని వివరంగా పేర్కొన్నారు. ఏయే వ్యక్తులు, ఏయే సంస్థలు గ్రంథాలయాల ఏర్పాట్లకు కృషి చేశా రో వివరించారు. ఆనాటి చారిత్రక వివరాలు తెలుసుకోవాలంటే తూలిక లో ఈ వ్యాసం పూర్తిగా చదవాల్సిందే.
హైదరాబాదు లో ఆ రోజు ల్లో ఉన్న లైబ్రరీ అసోసియేషన్ 1914 లో సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించిందని, A.P. లైబ్రరీ అసోసియేషన్1920 లో రాత్రి పాఠ శాల ప్రారంభించిందని, కొండా వెంకటప్పయ్య పంతులు కృషి తో రాష్ట్రం లో లైబ్రరీల అభివృద్ధికి అప్పటి ప్రభుత్వం 20, 000 రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. అలాగే ఎక్కడెక్కడ గ్రంథాలయాలు స్థాపించడం జరిగిందో వివరించారు.తెలుగు వారి కోసం జరిగిన గ్రంథాలయ స్థాపనకు సంబంధించిన కృషి తెలుసు కోవా లంటే ఈ వ్యాసంతప్పనిసరిగా పూర్తిగా చదవాల్సి ఉంటుంది. ఆనాటి ఎందరో మహానుభావుల కృషితో తెలుగు నాట అంత మాత్రమైనా గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. కానీ ఈనాడు అనేక లైబ్రరీలు ఆదరణ, పోషణ లేక దయనీయమైన పరిస్థితులలో ఉన్నాయి.
1966 నుండి 1972/73 వరకు శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం లో అకడమిక్ గా లైబ్రేరియన్ గా పనిచేసిన నిడదవోలు మాలతి గారు తన ఉద్యోగ జీవితం లో ఒక అంకిత భావం తో చేసిన కృషి ఈ వ్యాసాలలో మనకు కనిపిస్తుంది. 1967 లో ప్రచురితమైన “Men of Library Science & Libraries in India” ( 1967. సం. Raj K. Khosla ) గ్రంథం లో తనకంటూ స్థానం సంపాదించుకున్న లైబ్రేరియన్ మాలతి గారు ఈ రంగం నుంచి దూరమవడం తెలుగు వారి దురదృష్ట మని ఈ వ్యాసాలు చదివితే మనకు అర్థం అవుతుంది. ఆమె ఈ రంగాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో ఈ నాలుగు వ్యాసాలు నిరూపిస్తాయి.
ఈ వ్యాసాలు లైబ్రరీ సైన్స్ పాఠ్య ప్రణాళికల్లో పరామర్శ ( రిఫరెన్స్) గా చేర్చారో లేదో తెలియదు. కానీ లైబ్రరీ సైన్స్ చదివే ప్రతి విద్యార్థి, ఇతర రంగాలలోని ఇతర పరిశోధక విద్యార్థులు తప్పక చదవవలసిన వ్యాసాలివి. అంతే కాదు, తెలుగు గ్రంథాలయ ప్రారంభ వికాసాలు తెలుసుకో గోరే ప్రతి తెలుగు పాఠకులకూ ఇవి అవశ్యం చదవ దగ్గ వ్యాసాలు. సుమారు అయిదు దశాబ్దాల క్రితం రాసిన ఈ వ్యాసాలు ఇప్పటికీ రిఫరెన్స్ గా పనికి వచ్చేలా రాసిన మాలతి గారు అభినందనీయులు.
*
[…] డా. ఉషా దేవిగారికి మనఃపూర్వకధన్యవాదాలతో సారంగలో ప్రచురింపబడిన ఆ సమీక్షకి లింకు ఇక్కడ ఇస్తున్నానుhttps://magazine.saarangabooks.com/%e0%b0%b2%e0%b1%88%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b0%b0%e0%b1%80-%…6.14.2023 […]
ధన్యవాదాలు రచయిత్రి ఉషా దేవిగారికీ, సారంగ సంపాదకులకూ.
Very informative and thought-provoking essay by Madam Usha Devi. Regards to Madam Malathi Garu.
Thank you
[…] సారంగలో ప్రచురించిన వ్యాసానికి లింకు ఇక్కడ […]