‘లేపాక్షి’ పై లోతైన పరిశోధన

  విజయ నగర రాజుల పాలనను చరిత్రకారులు స్వర్ణయుగంగా పేర్కొంటారు. వీరి పాలనలో సాంస్కృతిక, సాహిత్య రంగాలతో పాటు శిల్పకళా రంగాలు కూడా సమున్నత స్థానాన్ని సంతరించుకున్నాయి. ముఖ్యంగా విజయ నగర పాలకులైన శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుత దేవరాయలు అనుసరించిన మతధర్మం, పరమత సహనాల వల్ల రాజ్యమంతట అనేక దేవాలయాలు, మసీదులు, జైనాలయాలు వెలసాయని డొమింగో పేస్‌, న్యూనిజ్‌లు తమ రచనల్లో పేర్కొన్నారు. వీరు సేకరించి పంపిన సమాచారం ఆధారంగానే ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా విజయనగర రాజుల చరిత్ర ఫ్రెంచ్‌ భాషలో ‘క్రానిక్స్‌ దస్‌ రైజ్‌ డి బిస్‌నగ పేరుతో పుస్తకంగా ప్రచురించబడిరది. తరువాత ఆ పుస్తకం ఆంగ్ల, తెలుగు భాషల్లోకి ‘ఎ ఫర్‌ గాటన్‌ ఎంఫైర్‌ ` విజయనగర్‌’, ‘ఎ ఫర్‌ గాటన్‌ ఎంఫైర్‌’లుగా అనువాదమైనది. ఈ పుస్తకంలో విజయనగర రాజుల చరిత్రను, ఆనాటి సాంఘిక, సాంస్కృతిక, చిత్రకళా వైభవాలను గురించి పొందుపరచినప్పటికీ కొన్ని అపోహలను కూడా పొందుపరిచారని చరిత్ర పరిశోధకులు పేర్కొంటున్నారు. అటువంటి అపోహలను కొన్నింటినైనా పాఠక హృదయాల నుండి రూపుమాపడంలో ‘లేపాక్షి’పుస్తకం తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పవచ్చు.

ఉదాహరణకు చూసినట్లయితే శ్రీకృష్ణదేవరాయల అనంతరం రాజ్యాభిషిక్తుడైన అచ్యుత దేవరాయల గురించి పోర్చుగీసు వర్తకుడైన న్యూనిజ్‌ రాసిన కథనాన్ని పరిశీలిస్తే. అచ్యుత దేవరాయలు ఒక విలాస పురుషుడని, అతని పాలన ఏమంత గొప్పగా సాగలేదని, భార్యాలోలుడై 500 మందిని వివాహం చేసుకొని అంత:పురంలోనే వుంటూ ప్రజల బాగోగులను పట్టించుకునే వాడు కాదని, యుద్ధాలకు భయపడి పిరికి పంద చర్యగా దండెత్తి వచ్చిన రాజులతో సంధి కుదుర్చుకొని అనేక ప్రాంతాలను వాళ్ళకు కట్టబెట్టాడని న్యూనిజ్‌ తన రచనల్లో అచ్యుత దేవరాయల వ్యక్తిత్వాన్ని గురించి ఎంతో హీనంగా చిత్రించాడు.

కానీ లేపాక్షి పుస్తకంలో దక్షిణభారత దేశమంతటా అచ్యుతదేవరాయలు వేయించిన సుమారు 1000కి పైగా శాసనాలు(కేవలం ఒక్క తిరుమల తిరుపతులోనే 250కి పైగా శాసనాలున్నాయని గమనించాలి), వాటిలో అచ్యుత దేవరాయలు పాటించిన మత సహనం, జైనులు, ముస్లీంలకు ఆయన చేసిన దానధర్మాలు వాటికి గుర్తుగా వేయించిన దానశాసనాలను పరిశీలిస్తే న్యూనిజ్‌ అచ్యుత దేవరాయల వ్యక్తిత్వాన్ని వక్రించాడని సుస్పష్టంగా అర్థమైతుంది. ముఖ్యంగా ‘లేపాక్షి’ ఆలయ నిర్మాణానికి అచ్యుత దేవరాయలు అందించిన సహాయ సహకారాల గురించి, విరూపణ్ణ కోరిక ప్రకారం హంపీ విరూపాక్ష స్వామి సన్నిధికి చలివెందుల గ్రామాన్ని దానం చేస్తూ గ్రామ సమీపంలోని పెద్ద బండరాయిపై వేయించిన చలివెందుల శాసనాన్ని గురించి రచయిత వివరించిన తీరును పరిశీలిస్తే అచ్యుత దేవరాయల ఉన్నత వ్యక్తిత్వం సరికొత్త పంథాలో మనకు దర్శనమిస్తుంది. అచ్యుత దేవరాయలు పాలనా విషయంలో శ్రీకృష్ణదేవరాయల్ని అనుసరించాడని ఆయన వేయించిన శాసనాలు, నిర్మించిన దేవాలయాలు, అందులోని శిల్పకళా విశేషాలను బట్టి తెలియవస్తాయి. విజయ నగర రాజుల పాలనా విశేషాలకు ఆధారాలుగా శాసనాల, నాణాలతో పాటు శాసనాలు వేయించిన సంవత్సరాలు,తారీఖులను ప్రస్తావించడం మైనాస్వామి పరిశోధనా నిబ్దతకు నిదర్శనం.

తైలవర్ణచిత్రాలు

భారతదేశంలో క్రీ.పూ 2వ శతాబ్దంలో ప్రారంభమైన తైలవర్ణ చిత్ర సంస్కృతి తిరిగి విజయనగర రాజుల పాలనలో తన పూర్వవైభవాన్ని సంతరించుకుందని చెప్పవచ్చు. అందుకు నిదర్శనమే హంపీ విరూపాక్ష స్వామి దేవాలయంలోని మహామండపంపై కప్పుపై చిత్రించబడి ఉన్న రామాయణ, మహాభారత దృశ్యమాలికలు. అంతేకాదు ‘లేపాక్షి’ ఆలయంలోని వీరభద్రుని వర్ణచిత్రం, మనునీతి చోళరాజు ధర్మగాథ, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, ద్రౌపదీ స్వయంవర ఘట్టం, కిరాతార్జునుల యుద్దగాథా, ప్రపంచంలోనే మరెక్కడా కనిపించని విధంగా వస్త్రభూషణాలంకారుడై బిక్షాటన చేస్తున్నట్లు దర్శనమిచ్చే బిక్షాటన మూర్తి సుందర రూపం వంటి అనేక గాథాల్ని గురించి ఎంతో హృద్యంగా మైనాస్వామి ఈ పుస్తకంలో ప్రస్తావించారు. సింధూ నాగరికతలో ప్రారంభమైన విగ్రహారాధన సంస్కృతి గుప్త, పల్లవ, హోయసలుల పాలనలో అభివృద్ధి చెంది, విజయనగర రాజుల పాలనలో వైభవోన్నతిని చవిచూసిందంటూ వివరించిన తీరును పరిశీలిస్తే మైనా స్వామి చరిత్ర పరిశోధనల పట్లగల అభినివేశం ప్రతిపదోక్తమౌతుంది. గుడుల నిర్మాణం, శిల్పసంపద, శిల్పనిర్మాణ రీతులు వంటి అంశాలను గురించి తెలియజేయడంలో ‘లేపాక్షి’ పుస్తకం చరిత్ర పరిశోధనల్లో మరో మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. సాంస్కృతిక,సాహిత్య, చిత్రకళా రంగాలతో పాటు ఆలయ నిర్మాణరంగంలోను విజయనగర రాజుల పాలన సువర్ణాధ్యాయమనే చెప్పుకోవాలి.

కాలగర్భంలో కలసిపోవడానికి సిద్దంగా ఉన్న చలివెందుల శాసనం, కదిరి శాసనం, మేరెడ్డిపల్లి శాసనం వంటి అనేక శాసనాలను గుర్తించి వాటి గొప్పతనాన్ని, సంరక్షించుకోవలసిన బాధ్యతను అటు ప్రభుత్వానికి, ఇటు చరిత్ర పరిశోధకులకు తెలియజేసిన ఘనత మైనాస్వామి కి దక్కుతుంది. ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం వెనుకా కొన్ని దశాబ్దాల కృషి, కొన్ని శతాబ్దాల చరిత్ర తొణికిసలాడుతుందని చెప్పడంలో సత్యదూరమైన అంశమేమిలేదు.

ఈ పుస్తకంలోని ప్రతి అక్షరంలోనూ చరిత్ర పరిశోధన పట్ల మైనాస్వామికున్న నిబద్ధత తేటతెల్లమైతుందని చెప్పడంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు.

*

 

మళ్ళా పెంచల ప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు