మా నాన్న గురించి మాట్లాడాలంటే నాకు ఎక్కడ మొదలు పెట్టాలో తెలీదు. చాలా రాయాలనిపిస్తుంది. కానీ ఏం రాయాలా అని సతమతమవుతూ ఉంటాను. ఇదో చిన్న ప్రయత్నం మాత్రమే! ఈ మూడు కోణాలు ఆయన వ్యక్తిత్వంలో నేను చూసినవీ!
మా నాన్నది నిజాయితీ, భోళాతనం కలగలసిన ప్రేమ హృదయం. కొంతమందికే మనసులోది చెప్పుకుని, కష్టపెట్టుకుని, బాధపడే మనసు ఆయనది. ఎవరు ఎలా ఏమి అనుకున్నా నేనేం పట్టించుకోను అని మనసుకు చెప్పుకుంటూనే బాధ పడిన నాన్న, ఊరికే భగ్గుమని మండిపడి తిట్టేసే నాన్న, ఓ పట్టాన దేనికి తృప్తి పడని నాన్న, అతి మెత్తని పదాల పొందికని మనసు పొరల్లో దాచుకుని అనుభూతి కైవారాలు పాటల రూపంలో నిశ్శబ్దం గా అందించిన నాన్న, ఎటువంటి నొప్పినీ తట్టుకోలేక, ఎన్నో ఒంటి నొప్పుల్ని ఎంతో కాలం భరించి, భరించీ అలసిపోయిన నాన్న — ఆధునిక, ప్రగతిశీల, పురోగామిగా ఉండాలని తన జీవన ప్రస్థానం మొదలుపెట్టారు. ఎన్నో మజిలీలు, ఎంతో మంది మనుషులు ఆయన్ని మార్చారు. జీవితం నేర్పించిన పాఠాలు అటువంటివి.
1
నాకు ఎప్పుడు ఆయనతో ఫోటోలు తీయించుకోవడం భలే ఇష్టంగా ఉండేది. చిన్నప్పుడు నాన్న దగ్గర ఓ కెమెరా ఉండేది– మెడలో వేళ్ళాడేసుకుని, అందులోకి చూస్తూ ఫోటోలు తీసే పధ్ధతి. తెలుపు నలుపు ఫోటోలు. ఆదివారాల్లో ఎండెక్కిన తర్వాత, కృష్ణలంక (విజయవాడ) ఇంట్లో మామిడి చెట్టు కింద ఫోటోలు తియ్యడం, నేను పోజులు పెట్టి తీయించుకోవడం బాగా గుర్తు. మా కృష్ణుడు చిన్నవాడు. గడపలు దాటుతూ పారాడుతుండగా తీసిన ఫోటోలు కడిగించిన తర్వాత ముచ్చటగా నవ్వు ముఖంతో నాన్న చూడడం– బాగా గుర్తు.
2
మా నాన్న, అమ్మ, ఎప్పుడూ ఇన్ని మార్కులు వచ్చాయేమిటి అని అడిగిన పాపాన పోలేదు. తిట్టిన జ్ఞాపకం లేదు. ఎప్పుడూ కొంచెం ఎక్కువ సీరియస్ గానే ఉండే నేను– ఎందుకో ఒక తిక్క వేషం వెయ్యాలనిపించి — పదో తరగతి రిసల్ట్స్ వచ్చిన రోజున — గేటు తెరుచుకుని న్యూస్ పేపరు తో లోపలి వచ్చి — ఆత్రుత గా ఎదురొచ్చిన నాన్నకి అడ్డంగా తల ఆడించి — బిక్క మొహం నటించాను. ఆయన మొహం ఒక్కసారి వెలవెల బోయింది. వెంటనే కంగారుగా ఫస్ట్ క్లాసు వచ్చిందని చెప్పాను. ఒక్కసారి బీపీ వచ్చినట్టు అయ్యి కంగారుగా కూర్చున్నారు. ఆ తర్వాత అలాంటి పిచ్చి వేషం నేను జన్మలో మళ్ళీ వెయ్యలేదు. మేము ఫెయిల్ అవ్వడం అనే ఆలోచన ఆయన తట్టుకోలేక పోయేవారు– తాను ఎన్ని సార్లు తప్పినా!
3
మా నాన్న చిన్నపాటి ఆడియెన్స్ ముందు చక్కగా తలత్ మహమూద్ పాట “జల్తె హైన్ జిస్కె లిఏ..” పాడడం బాగా గుర్తు. ఆయన ఒళ్ళో కూర్చోడం, జుట్టు పీకుతూ ఆడడం బాగా చిన్నప్పటి మాట. ఆయన చైతన్యం, ఆలోచన ధోరణి, పటిమ, ధారణ ఇవన్నీ ఎటువంటి పరిస్థితుల్లోను జారిపోయేవి కావు. ఇంట్లో ఎటువంటి పనులూ పెద్దగా అందుకోక పోయినా, తన లైబ్రరీ పుస్తకాలు, వాటి మంచి చెడ్డలూ చూస్తూ, వాటి మధ్య ఉండడం ఆయనకు ఇష్టంగా ఉండేది.
అమ్మ నాన్న ఇద్దరూ ఉద్యోగాలు చేసే వారు. ఇంటి ఖర్చులు, PF లోన్లు– అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర మా చిన్నప్పుడు చాలానే చర్చలు జరిగేవి. నాన్నకి డబ్బు జాగ్రత్త పెద్దగా తెలీదు. అవి ఉండేవి కూడా కాదు. ఎప్పుడైనా నాలుగు డబ్బులు చేతిలో కనిపించగానే హుషారు పడిపోయేవారు. అమ్మ అన్ని దాచిపెట్టి, కూడపెట్టేది. రేపు ఏదైనా అవసరం వస్తే ఎలా అని అక్కడా ఇక్కడా దాచేది.
మా నాన్నకి నిలకడ గా కొన్ని విషయాలు అర్ధం చేసుకుని వ్యూహాత్మకంగా ఉండాలి అనే తెలివితేటలు లేవు. జీవితంలో మారిపోయే విషయాల పట్ల జిజ్ఞాస తప్ప!
తన ఆవేశం తన జీవన లాలసకి అవసరం అని బహుశా గట్టిగా నమ్మేవారు. తర్వాత మొత్తం విషయం ఒక కొలిక్కి వచ్చింతర్వాత, వెనక్కి తిరిగి చూసుకుని నొచ్చుకునేవారు. మగవాళ్లందరికీ ఇది సహజంగానే దొరికే ఇన్సెంటివ్. ఎప్పుడు ఏ ఉద్వేగం వస్తే దానికి లొంగిపోవడమే! ఇదే ఆయనకు తెలిసిన నిజాయితీ!. మా అమ్మకి అలా కుదిరేది కాదు. అన్నీ అలా మొహం మీద చూపించేస్తే మీ వాళ్ళు, మా వాళ్ళు ఎలా వస్తారు? పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? అనేది. దౌత్యనీతి తో, కార్య దక్షత తో పనులు కానించేది. ఇవన్నీ ఎన్నో ప్రత్యక్ష సాక్షి గా చూసాను. నాకు ఒకోసారి మా అమ్మ అస్సలు నచ్చేది కాదు. నాన్నే నిజాయితీ పరుడు, సూటిగా ఉండేవాడు. పితలాటకం ఉండేది కాదు అని అనిపించేది. కానీ, అలా నడవ్వు అని ఉద్యోగాలు చేస్తూ, ఆఫీసు రాజకీయాలు చూస్తూ, పరాయి వాళ్ళకి పని చేసి పెట్టే క్రమం లో అర్ధం చేసుకున్నాను. దౌత్యం, చతురత చాలా వంతెనలకు మూల స్తంభాలు. అవి లేకపోతే, వాతావరణం భరించేదిగా ఉండదు. కొంత మందికే ఆ నైపుణ్యం ఉంటుంది. అందులో మా నాన్నజీరో.
అప్పు తీసుకుంటే ఇచ్చిన వాడిని గొప్పగా భావించేవారు. మా అమ్మ నవ్వేది. “వాడు ఇచ్చింది అప్పే! ఈ వెర్రి మనిషి ఏదో డబ్బు ఊరికే ఇచ్చినట్టు ఆనంద పడిపోతున్నారు.”
మా నాన్న మిగిలిన వాళ్ళతో పోల్చుకోకుండా ఎంతో తక్కువ జీతాలకి ఉద్యోగం చేశారు. ఆయనకి ఫైనాన్సియల్ అడ్వైజర్ ఉండి, అన్ని చెప్పి, తన శక్తి యుక్తులకు సరిఅయిన విలువ కడితే బాగుండేది అని అనిపించేది.
నేను ఆయన కూతుర్నే కాబట్టి కొన్ని విషయాల్లో విసుక్కునే దాన్ని, మళ్ళీ బాధ పడేదాన్ని. నేను ఏదైనా బాగా రాసినా, పబ్లిష్ చేసినా పొంగిపోయేవారు.
“నీకు ఎక్కడ్నించో ఆధ్యాత్మిక వాసన, ఆలోచన వచ్చాయి. పూర్వజన్మ సుకృతం ఉంటేగాని అది రాదు. నువ్వు ఎలా నమ్ముతావో, అలాగే ఉండు, ఒక పధ్ధతి పెట్టుకుని. ఈ ఆలోచన నీకు కలగడమే అదృష్టం–” అంటూ నా నమ్మకాలకి చిన్న ప్రోత్సాహం ఇచ్చారు. ఇప్పుడు ఏదైనా ఫోను చేసి అడుగుదామంటే లేరే అని బెంగ.
అందరు చాలా ట్రెడిషనలిస్ట్ అని భావించే మా నాన్న ఎంత ఉదారవాదో, ఎంత స్వేచ్చావాదో నాకు తెలుసు. కానీ కొన్ని చట్రాలు ఆయన్ని బంధించే ఉంచాయి.
ఇంకా నయం.
లేదంటే ఇంకా ఎన్ని కష్టాలు పడేవారో, పిచ్చి నాన్న!
*
సారంగలో వివిధ సందర్భాల్లో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
చాలా బాగుంది కిరణ్ గారు. ఆ చట్రాలేమిటో చెబితే ఇంకా బాగుండేది
మంచి పరిచయం
చాలా బాగా నాన్న గురించి చెప్తూ చెప్తూ చెప్పాల్సింది చాలా వుంది అనే భావన పాఠకులకు తెప్పించి
చటుక్కున ముగించినట్లుగా వుంది కిరణ్మయీ.తరువాయి భాగంగా మళ్ళా రాయు.