1. పాటగాడా! జీవితం అనే నీ తోటలోకి పాటల సీతాకోకచిలుకలు ఎలా, ఎప్పుడు ప్రవేశించాయి?
జోరుగా చీకటి కురుస్తున్న రాత్రి. వెన్నెల గొడుగు విచ్చుకున్న క్షణం. చెట్లు నిద్రపోతున్నాయి. చెరువు నిద్రపోతుంది. ఇళ్ళు నిద్రపోతున్నాయి. నవారు మంచం, నులక మంచం, పట్టెల మంచం, కర్రల మంచం, పెద్ద మంచం, చిన్న మంచం- వాకిలి వడిలో మంచాల వరుస. మా అమ్మ వొడిలో అమ్మ బిడ్డలం. లాంతర్ల కూరప్పట్ల మధ్య మేము మా బంధువులం. మా ముచ్చట్లు, ముగించుకొని నిద్రపోయేవాళ్ళం. కోడి కూతకు ముందే మా మధ్య కోయిల గొంతు విప్పి కూసేది.
పదిలముగా నీ పంచ చేర్చి కావుమా యెహోవ దేవా”
మాట వినుమ ఒక్కసారి”
కష్టాల బరువును తానోర్వలేడు”
మురికి కాలువల్ని కౌగలించుకోవటం మొదలుపెట్టాను. కాలువల్లో బురద మట్టల్ని, తుమ్మచెట్లు కింద గొర్రెల్ని, చెరువు గట్టున బర్రెల్ని ముట్టుకోవటం, ఆటల్లో, పాటల్లో సహవాసాల్ని ముద్దాడటం మొదలయింది. పేడకళ్ళు తీసే పిల్ల జీతగాడి పాట నన్ను పట్టుకోవటం మొదలయింది. పదేండ్లకి ఒక పాట నా పెదాల్నిదాటింది.”ఉడుకుడుకు దుమ్ముల ఊబ చెక్కల
అద్దం లేదని అలిగెర దోమో
దోమ దొరసానయున్నది
దోమకి తగిలిన విసరదు గాలి
దోమ దొరసానయున్నది”
2. నీ స్వస్థానం ఎక్కడ? బాల్యపు గురుతుల దరువుల గురించి చెప్పు?
మా అమ్మ వూరు మాగల్లు, కృష్ణా జిల్లా. మా నాన్న వూరు రాయపట్నం, ఖమ్మం జిల్లా. అమ్మా నాన్న టీచర్స్. వృత్తిపరమైన బదిలీలు. పర్మినంట్ వూరు లేదు. నేను 21 ఆగస్ట్ 1964న కలకోట గ్రామంలో పుట్టాను. ఐదవ తరగతి వరకు సోమవరంలో పెరిగాను. ఆరు, ఏడు తరగతులు కలకోటలో. ఎనిమిది నుండి పది వరకు సిరిపురంలో. ఇంటర్ మధిరలో. అలా బియస్సీ మొదటి సంవత్సరం వరకు ఖమ్మం జిల్లాలో చదివాను. బిటెక్ హైద్రాబాద్ జెయన్‌టియులో పూర్తిచేశాను.
3. ఏ కులమబ్బీ.. నీదే మతమబ్బీ అని అడిగితే ఏ రాగంలో బదులిస్తావు? “కులం ప్రశ్న” నిన్ను నిన్నుగా గుర్తుచేసి, నీలో తుపానుల్ని సృష్టించిన సందర్భంలో నీ స్వరం ఏ శ్రుతిలో పలికింది?
నలభై అయిదు సంవత్సరాల క్రితం నాకు ఇది ఒక ప్రశ్న కాదు. ఒకే ఒక కత్తి వేటు. మీరేమిటోళ్ళు? తలకాయ కొబ్బరి బోండంలా రెండు చిప్పలుగా పగిలిపోయేది. భయంకరమైన భయం. దాచినా దాగదని తెలిసీ నోట్లో గుడ్డలు కుక్కుకున్నట్టు నా కులాన్ని నాలో కుక్కుకునేవాడిని. నన్ను నేను అవమానించుకొంటూ, నా మనిషి అస్తిత్వాన్ని అనుమానించుకొంటూ, నేను అంటరానివాణ్ణని, నా కులం అంటరానిదని నా గుడ్లల్లో నీళ్ళు కుక్కునేవాడిని. నువ్వు గొడ్డు మాసం తింటావా? డప్పు కొడతావా? మీ ఇంట్లో చెప్పులు కుడతారా? నువ్వు పొట్ట ఎంకడి మనవడివా? ఓహో! నువ్వు ఆ కొత్త పంతులు కొడుకువా?
ఇది తరతరాల అనుభవం. అందరి అంటరానోళ్ళ అవమానం.
ఈ అనుభవం కొన్ని అబద్దాలు, కొన్ని నిజాలు కలిపింది. అంటరాని మాదిగ కులాన్ని “మోడరన్ మతం” చేసి మేము క్రిస్టియన్స్ అని చెప్పించింది. చదువుకొంటే అవమాన భయం పోతుందని, సర్కారు జాబు వస్తే అంటరాని పని పోతుందని, రిజర్వేషన్ పొందాలనుకొని యస్సీ మాదిగ అని రాయించుకున్నాను.
4. ఊహ తెలిసిన తొలినాళ్లలో ఏ పాటలు నిన్నల్లుకుని చెలిమిచేశాయి?
అప్పటి పాటల్ని అవలోకన చేసుకొని ఇప్పుడు చెప్పటం అద్భుతమైన అనుభూతిలా వుంది. పాటని గానం చేయటంలో పద్య నాటక గాయక కళాకారుల శైలి ప్రత్యేకమైనది. ఆ గానంలో విరుపు, సాగతీత ఒక సౌందర్య వయ్యారం. వెంటనే వంటపట్టే యవ్వారం. పాట ఏ పండుగకైనా ప్రత్యేక అలంకరణ. అది వాడ పాటైనా, వూరు పాటైన మైకులో మోగాల్సిందే. అప్పుడు నాకు దాదాపు పదేండ్ల వయస్సు.
“జన గణ మన”- బడిలో అందరిని కలిపే గీతం. పిల్లల తోటలో ప్రతి రోజూ ఉదయం పల్లవించే జాతీయ గీతం.
…
అనేక గొంతులు. అనేక పాటలు. ఆ వయస్సులో ఆ పాటల్లో నాకు కావాల్సింది పదాలు కాదు. ఆ గొంతుల్లో కరిగిపోతున్న గానం. చాక్లెట్ లాంటి గానం. తీపి పుట్టించే రాగం. తెలియకుండానే నాకు నోరూరేది. తెలియకుండానే నేను వాటిని మింగేది.
5. యవ్వనప్రాయంలో ఏ రాజకీయ పథం, ఏ ఉద్యమగానం నిన్ను తనవైపు రారమ్మని పిలిచింది? ఆ ప్రస్థానం ఎన్ని చరణాల పాటగా సాగుతోంది?
“యువతరమా నవతరమా ఇదే అదను కదలిరమ్ము
యువతరమా అలసత్వం వదిలిపెట్టి కదలి రమ్ము
యువతరమా దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే
నిముషమైన వెనుతిరుగక మునుముందుకే సాగి రమ్ము”చెరబండ రాజు ఈ పాటని మారోజు వీరన్నపాడుతుంటే కదలకుండా కూర్చోవటం సాధ్యం కాక పోయేది. నడవకుండా నిలబడటం సాధ్యం కాకపోయేది. గొంతులో గొంతు కలుపుతూ కోరస్‌గా మారిపోవటం అలవాటయింది. మనసులో అట్టడుగున పేరుకుపోయిన అవమానం, అణిచివేత, దుఃఖం, చేతకానితనం ఒక యాక్షన్‌ని కోరుకునేది. ఆ కోరిక పిడియస్‌యులో చేర్పించింది. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు “విద్యార్ధులార! గ్రామాలకి తరలండి” అనే పిడియస్‌యు పిలుపును అందుకొని వేసవి సెలవుల్లో గ్రామాలకి వెళ్ళాను. అదో అధ్భుతమైన అనుభవం. పదిహేను రోజులపాటు ప్రజలతో మాట్లాడటం, వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవటం, వాళ్ల ఇళ్ళల్లో భోజనం చేయటం, స్కూల్స్‌లో లేదా కమ్యూనిటి సెంటర్ అరుగుల మీద లేదా టెంపుల్ బయట పడుకోవటం గొప్ప వ్యక్తిగత, వ్యక్తిత్వ వికాసం. కాలి నడకన ఒక వూరి నుండి మరో వూరు తిరుగుతూ కొన్ని పాటల్ని, తొలి రాజకీయ చైతన్యాన్ని పొందటం జరిగింది. “ఈ దేశంలో పెనుమార్పు జరగాలి, పేదలు అన్ని రకాల దోపిడీల నుండి విముక్తి కావాలి. దానికోసం మనవంతుగా కృషి చేయాలి” అని ఆ చైతన్యం బోధించింది. క్రమంగా విప్లవోద్యమంలో పూర్తికాల కార్యకర్తగా చేరినాను. ఆ విధంగా విద్యార్ధి, విప్లవ సాంస్కృతిక, సాహిత్య ఉద్యమాలలో పాల్గొన్నాను. ఆ సుదీర్ఘ అనుభవం ఎన్నో జీవిత పాఠాల్ని నేర్పింది. అనిర్వచనీయమైన ఆనందాన్ని అందించింది. వ్యక్తిగతంగా ఎంతో పరిణితి సాధించటానికి దోహదపడింది. నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దింది. కుల వర్గ ప్రాంతాలకి అతీతంగా బతకటం నేర్పింది. పేదప్రజల పక్షపతిగా పెంచి పెద్ద చేసింది. బతుకు పట్ల ధైర్యాన్నిచ్చింది. మరణంలో అమరత్వాన్ని చూపింది. కన్నీళ్ళని, కలల్ని కలిపి జీవితాన్ని ప్రేమించటం నేర్పింది.
“ఎండ తడిసి పోలేదు- వాన ఎండిపోయింది
ఎండ వాన మబ్బుల్లో రంగులేడు చిమ్మాయి
నింగి చొట్ట బుగ్గల్లో చిగురించే ముద్దు మీద
మనసు రంగు కనిపిస్తే నాకు జాడ చెప్పండి
మనిషి మట్టి వాసనేస్తే నా జాడ చెప్పండి”.
6. కవి గాయకునిగా నీ తొలి రచన ఏది? పోరుదారిలో ఎన్ని పాటలై పల్లవించావు?
తొలినాళ్ళలో అనేక ఆలోచనలని మనసులో రాసుకోనేవాడిని. అవి నాతో చెప్పకుండానే చెరిగి పోయేవి. కాగితం మీద పెట్టిన వాటిని ఎవరికీ చెప్పకుండానే చింపేసేవాడిని. కాలేజీ చదువుకునే రోజుల్లో ఒకసారి రోడ్డు పక్కన సెక్స్ వర్కర్ దగ్గరికి వెళ్ళాను. కొన్ని నిమిషాల కాలంలోనే ఎన్నో భావోద్వేగాలు. తప్పొప్పుల పాఠాలు. తొలిసారి మనిషి కళ్ళల్లో చందమామల్ని చూసాను. చందమామాల్లో కన్నీటి చుక్కల్ని చూసాను. హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగి కాళ్ళ మీద పడ్డట్టు అనిపించింది. దారిపొడుగునా ఏదో పదం పలుకుతూనే వుంది. కాని కాగితం మీద పెట్టలేదు. ఆ పదం, ఆ ప్రయాణం నాలో అట్టడుగున పేరుకుపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అనుభవం నా మనసుని కెలికింది. అనంతమైన శూన్యం అంచున నిలబడి ఆమె పలకరించినట్టనిపించింది. అప్పుడు ఇలా మొదలైంది ఆ కవిత.
ఎవ్వరూ ఆమెని మనిషిలా భావించరు.
గాజు గోడల్లోంచి ఊరిస్తున్న తీపి ముక్కలానో
బస్ స్టాప్ లో అమ్మబడుతున్న పల్లీ గింజలానో
తిరునాళ్ళలో గిర గిరా తిరుగుతున్నరంగుల రాట్నంలానో”
7. నువ్వే రాతగానివి. నువ్వే గాయకుడివి. డప్పు చేపట్టి ఊరేగే జనగీతాలాపనవీ నువ్వే! అయితే నిన్ను వదలకుండా వెంటాడిన, ఉద్వేగపరిచిన గీతం ఏది?
“చేలన్నీ మా చెమటతో తడిసీ- నేలా బురదల నాటులు నాటి
కళ్ళ ప్రాణముతో ఇల్లు చేరితే- పిల్లలు తింటే తల్లులు పస్తు
ఎన్నాళ్ళీ కాపురాలు ఏ చెరో గిరో పడి చేద్దామన్నా ఎట్లాగీ కాపురాలు”
8. కవివీ, గాయకుడివీ అయినా నువ్వు పరిమితంగా రాశావు. రాసిన కొద్దిలో నీ ప్రత్యేకత కోసం తపించావు. నీ కవిసమయాల సంగతులేంటి? రచనల విషయంలో మితం పాటించడానికి కారణమేంటి?
ఒకవేళ నేను కవిని అనుకుంటే నేను లక్ష్యం లేని కవిని. నాలో నన్ను తొంగి చూసుకుంటూ, నా దుఖాన్ని తుడుచుకుంటూ, నా సౌందర్యాన్ని తడుముకుంటూ, నా శృంగారాన్ని తట్టి లేపుతూ, నా అనుభవ సారాన్ని నా రూపంలో చెక్కుకుంటాను. అది కొన్నిసార్లు కొత్తగా వుంటుంది. మరి కొన్నిసార్లు పాతగా వుంటుంది. కొత్తయినా, పాతైయినా నా లాగే వుంటుంది. ఎందుకంటే అది నా పాట. కవి సమయంలో నా మనసులో నేను నగ్నంగా కూర్చుంటాను. పాడాలనుకోగానే పాట మొదలవుతుంది. పాట పుట్టటానికి నాకు ఒక నిర్దిష్టమైన దారిలేదు. ఒక్కోసారి బాణీ నన్ను పిలుస్తుంది. రాగంలా మొదలై పదాల్ని కలుపుకుంటుంది. కొన్నిసార్లు పదాన్నిపలికి రాగాన్ని అల్లుతుంది. కొన్నిసార్లు చరణం పల్లవిగా పుష్పిస్తుంది. మరికొన్నిసార్లు పల్లవి చరణంగా గుభాళిస్తుంది. కొన్నిసార్లు భావాన్ని చిలికి, భావోద్వేగాన్ని కలుపుకుంటాను. మరికొన్నిసార్లు భావోద్వేగాన్నిబాణీ చేసి భావాన్ని నింపుతాను. చివరికి కాలంతో ఏకాంతంగా గడపి పాటని పూర్తి చేస్తాను. కవిత్వం రాయటానికి కవికి విశ్రాంతి కావాలి. విశ్రాంతి జీవితం లేని కవుల కవిత్వం ఎక్కువగా కనిపించదు. బతుకు దెరువు పరుగుల్లో అనేక కవితలు నా మనసులోనే కన్ను మూశాయి.
9. “నేనే మంచివాణ్ని” అన్న పాట రాసుకున్నావు. ఏ నేపథ్యగీతమది? ఏ థాట్ ప్రాసెస్ నుంచి ఆ పాట పురుడుపోసుకుంది?
కొట్లాటలో ఎప్పుడూ దెబ్బతినే వాడే కేక పెడతాడు. అప్పుడప్పుడు దెబ్బకొట్టే వాడు కేక పెట్టినా ఈ రెండు కేకలు ఒకటి కాదు. విభిన్నమైనవి. కత్తి ఎప్పుడూ నిశ్శబ్దంగానే వుంటుంది. నరకే ముందు, నరికేటప్పుడు, నరికిన తర్వాత కూడా. ఎవడి గొంతు తెగిపోతుందో వాడే కేక పెడతాడు. ఎవడి గుండె పగిలిపోతుందో వాడే కేక పెడతాడు. అది చావు కేక. అది ఆ మనిషికి చెందిన కుటుంబాన్ని, కులాన్ని బలహీన పరుస్తుంది. అలా ఒక తరాన్ని భయపెట్టి చచ్చిపోతుంది. ఇక్కడ ఆ మనిషి అంటరానివాడు. ఆ కులం అంటరాని కులం. కంచికచర్లైనా, చుండూరైనా, మరేదైనా అవమాన గుర్తులే కదా. హత్యాచార హింసలే కదా. అంటరాని ముద్రలే కదా. దేహీ అంటే దానం పొందొచ్చేమో కాని న్యాయం జరగదు కదా. నన్ను నేను అంటరానివాణ్ణిగా అంగీకరించుకున్నంత వరకు నాకు అన్యాయం అర్ధంకాదు. దీని నుంచి బయటపడాలి కదా. మనిషిలా నిలవాలి కదా. కొత్త మనసుతో బతకాలి కదా. కొత్తగా కేక పెట్టాలిగా..
ఓ అమ్మల్లారక్కల్లారా
నేనే మంచి వాణ్ని – నేనే మంచి వాణ్ని
తోలు డప్పుల చెణుకులతో – చెందురమ్మ ఎంట వచ్చి
వెన్నెల మడుగు తడిలోన కలిసి కలిసి చిందు తొక్కే //నేనే మంచి వాణ్ని//”
10. “చూపు సురేష్…” అని పిలిస్తే చాలు- “అన్నా..” అంటూ పలికేవాడివి గతంలో. అసలు ఇంటి పేరుని మరిపించిన ఆ “చూపు” కథ చెప్పు?
పాతికేళ్ళ క్రితం కాత్యాయని, శ్యాం, నేను తరచుగా కలుస్తుండే వాళ్ళం. విప్లవ పార్టీల గురించి, విప్లవోద్యమాల గురించి, అస్తిత్వ ఉద్యమాల గురించి, చనిపోతున్న, చంపబడుతున్న ఉద్యమకారుల గురించి, దళితవాదం, స్త్రీవాదం గురించి, మా గురించి, మా ఆలోచన, ఆవేదన గురించి కలిసినప్పుడల్లా మాట్లాడుకునేవాళ్ళం. మేం ఒక టీం అని ఎప్పుడూ అనుకోలేదుగాని చాలా సార్లు టీంగానే మాట్లాడుకునేవాళ్ళం. ఇతరులతో టీం ప్రతినిధులుగానే మాట్లాడేవాళ్ళం. ఉద్యమ ప్రభావంతో వస్తున్న సాహిత్యం గురించి, సాహిత్య పత్రికల గురించి, వాటి కాంట్రిబ్యూషన్ గురించి, పరిమితుల గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఈ ముచ్చట్ల నుండి అనగనగా ఒక రోజు అంటే 1995 మార్చిలో చూపుని ప్రపంచానికి చూపించాము. కాత్యాయని సంపాదకత్వంలో అనేక సంచికల్ని ప్రచురించాము. తెలంగాణ, జానపదం, కథలు, పీపుల్స్‌వార్‌తో చర్చలు, ఆర్ధిక సంస్కరణలు లాంటివి అనేక విషయాలు. ప్రతి సంచికా ఒక ప్రత్యేకమే. శ్యాం ఉద్యోగం చేసుకుంటూనే ప్రతి సంచికకు, ప్రాముఖ్యతని, సమయాన్ని ఇచ్చేవాడు. ప్రతి సంచిక నవ్యా ప్రింటర్స్ రామకృష్ణారెడ్డి రాయితీ పోగా మిగతాది శ్యాం జేబులోనుంచి ఖర్చుపెట్టేవాళ్ళం. అప్పుడప్పుడు కొంత మంది సన్నిహితులు ఆర్దికంగా సహకరించేది. కొన్ని ప్రజాసంఘాలు, పార్టీలు ఆర్ధిక సహాయాన్ని అందిస్తామన్నా సున్నితంగా తిరస్కరించటం జరిగింది. ఎటువంటి మోహమాటాలు లేకుండా సమకాలీన సాహిత్య, రాజకీయ ధోరణులపై చూపు సూటిగా స్పందించేది. చూపు అనతి కాలంలోనే ఎంతో మంది అభిమాన పాటకుల్ని సంపాదించుకుంది. తాను అభిమానించే ఎంతో మంది రచయితల, కళాకారుల సహకారాన్ని, గౌరవాన్ని పొందింది. ఆ పరంపరలో ఒక చిన్నపాటి సాహిత్య కుటుంబంగా చూపు గుర్తించబడింది. ఆ కుటుంబ సభ్యుల్లో చూపు సురేష్ ఒకడు.11. “లెల్లే సురేష్”గా నీ బృందగాన డప్పుల చిందులు ఎప్పుడు మొదలయ్యాయి? ప్రయాణం ఎక్కడివరకూ సాగింది?
జీవితంలో పాట అంతర్భాగం. అది ఒక వినోదం, ఒక విశ్రాంతి. జీవితంతో పెనవేసుకున్న పాట ఒక బతుకు పెనుగులాట, ఒక ఉద్వేగం, ఉద్యమం, పోరాటం. ప్రకృతి, ప్రాణం, శ్రమ, గానం, తాళంల కలయికే పాట. పాట తత్త్వం సమష్టి తత్త్వం. సమష్టి ఆనందం. సమష్టి ఉత్పత్తి. మానవజాతి చరిత్రలో మారుతున్న కాలానికి, సంస్కృతికి పాట ఒక సాక్ష్యం.
“జీవులెనుబది నాల్గు లక్షల చావు పుట్టుకలిక్కడా, ఎవరెవరు చేసిన పాప కర్మాలనుభవించేదక్కడా”- ఒక హరిదాసుడో, హరిజనుడో పాడుకుంటూ పండగపూట వీధులు తిరుక్కుంటూ అడుక్కుంటాడు.
“పరదేసులమో ప్రియులారా ఇది పురమిది కాదిపుడు నిజముగ పురమిది కాదిపుడు”- ఒక అంటరానోళ్ళ శవం పాడుకుంటూ స్మశానానికి వెళ్ళిపోయేది.
“తాలేల్లె లెల్లీయ్యలో తకతా లెల్లె లెల్లీయ్యలొ”- అంటూ చిందు కళాకారులు ఊళ్ళు తిరుక్కుంటూ అడుక్కునే వాళ్ళు. వంటి మీద రూపాయి అంటించి వన్స్ మోర్ అంటే ఒక రంగస్థల గాయకుడు విసుకు చెందకుండా ఎన్ని సార్లయినా పాడతాడు. నేలమీద రూపాయి పెట్టి ఈలవేస్తే ఒక డప్పు కళాకారుడు తాళం తప్పకుండా కంటిరెప్పలతో ఆ రూపాయిని పైకి తీస్తాడు. మాపటేల్లల్లో మా గూడెంలో యువకులు “అత్తో రంకెరుగని అత్తా, మేనత్తో రంకెరుగనత్తా” అంటూ అర్ధరాత్రి దాటిందాకా పాడుకునే వాళ్ళు. కుట్టే చెప్పుల్ని పక్కన పెట్టి, చెంచులక్ష్మి వేషం కట్టి మా పెద్దనాన్న వీధి బాగోతాలు ఆడేవాడు. ఇలా ఎంతో మంది గాయకులు, కళాకారులు. కాలక్రమంలో వీళ్ళంతా వెళ్లి పోయారు. పాట తాత్విక మజా మారిపోయింది.
పాటని పదునెక్కించే ప్రయత్నం కరువయ్యింది. పాటలు రాజకీయ అవసరాలు తీర్చే సాధనంగా మార్చబడ్డది. ఉద్యమకారులు పాటని తమ ప్రచారగీతానికి కుదించారు. పాట ప్రాముఖ్యత, పాట పాత్ర మరుగునపడ్డాయి. ప్రజలని సమీకరించి కూర్చోబెట్టే పని పాటదయింది. ప్రజలకి సందేశాన్నిచ్చే బాధ్యత ఉపన్యాసానిదయింది.
పాట మాని నీ బ్రతుకు నడక మార్చకే”
12. డర్బన్ సదస్సుకి హాజరైనప్పుడు ఉప్పొంగిన ఆనంద క్షణాలు నీలో పదిలమేనా?
జాత్యహంకారానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించిన అంతర్జాతీయ సదస్సు డర్బన్ సదస్సు. 2001 లో జరిగిన ఈ సదస్సుకు దళిత ఉద్యమనేత పాల్ దివాకర్ నాయకత్వంలో మన దేశం నుండి దాదాపు 250 మంది దళిత మరియి దళిత మద్దతుదారులం వెళ్ళటం జరిగింది. మొట్టమొదటి సారిగా విమానం ఎక్కాను. అది మొట్టమొదటి విదేశీ ప్రయాణం. అదొక అద్భుతమైన అనుభవం. డర్బన్ సదస్సులో దాదాపు 141 దేశాలు పాల్గొన్నాయి. జాతి వివక్ష, ఇంకా జాతి వివక్షలాంటి ఇతర సమస్యలపై అంతర్జాతీయ స్థాయిలో పోరాడటానికి ఒక ప్రయత్నం డర్బన్ సదస్సు. ప్రపంచవ్యాపితంగా అనేక రకాలుగా వివక్షకు గురౌతున్న జాతులు, సమూహాలు, కులాలు ఒకచోట చేరిన సన్నివేశం. సస్సులతో పాటు, పాటలు, దరువులు, డాన్సులు, ముచ్చట్లు, అనుభవాల్ని కలబోసుకోవటం, కన్నీళ్ళని వొత్తుకోవటం, నవ్వుకోవటం, పరస్పరం ఉత్తేజ పర్చుకోవటం, ఫిడల్ కాస్ట్రోని అతి దగ్గరగా చూడటం, ఆయన ఉపన్యాసం వినటం, అదే వేదిక మీద నల్ల జాతి కళాకారులతో కలిసి చిందెయ్యటం మళ్ళీ మళ్ళీ పొందలేని అనుభవం.
13. దళిత్ డ్రమ్ ఆవిర్భావం ఎప్పుడు, ఎలా జరిగింది?
గార్త్ హివిట్ యునైటెడ్ కింగ్డమ్‌లో పాపులర్ గాస్పల్ సింగర్. అనేక దేశాలలో అనేక కమ్యూనిటీల సమస్యలపై ప్రత్యేక పాటలు రాయటం, పాడటం, తద్వారా వాళ్ళ పోరాటాలకి మద్దతు తెలపటం ఆయన ఎంచుకున్న మార్గంలో ఒక భాగం. పాల్ దివాకర్ ఇండియాలో దళిత మానవ హక్కుల నేత. పాల్ ఒకసారి గార్త్‌ని కలిసి మా దళిత సమ్యలపై కూడా ఒక ఆడియో ఆల్బం చేయమని కోరాడు. గార్త్ ఓకే అని మార్చ్ 2001 లో తన బృందంతో ఇండియా వచ్చాడు. గార్త్‌కి ఇక్కడి దళిత విషయాలని వివరించటానికి, అనువదించటానికి పాల్ నన్ను పరిచయం చేసాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక మూడు రాష్ట్రాలు తిరిగి అవసరమైన విషయాన్ని సేకరించాడు. పాటలు రాసుకున్నాడు. లండన్ వెళ్లి రికార్డ్ చేసాడు. ఇందులో ఆయన, ఆయన కూతురు అబితో పాటు, పాల్ ఫీల్డ్స్ అనే మరో గాయకుడు పాడారు. ఈ ఆల్బంలో ప్రముఖ గాయకుడు క్లిఫ్ రిచర్డ్స్ ఒక పాటకి తన గొంతునివ్వటం ప్రత్యేక ఆకర్షణ. అలా “దళిత్ డ్రం” మోగింది. ఈ ఆల్బంకి ఆర్దిక సహాయం చేసిన క్రిస్టియన్ ఎయిడ్ సంస్థ అక్టోబర్, నవంబర్ 2001లో యూకేలో “దళిత్ డ్రం” కాంపైన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. యూకేలో Ellesmere Port, Burnley, Reading, Colchester, Milford Haven, Ayr, Dulwich, Belfast, Nottingham, Milton Kenes మొత్తం పది పట్టణాలలో పది concerts జరిగాయి. professional గా ఏర్పాటు చేసిన ఈ concerts లో గార్త్ , పాల్ ఫీల్డ్స్, అబి, క్లిఫ్ రిచర్డ్స్ పాడే పాటలకి గిటార్ ని follow అవుతూ డప్పు కొట్టటం, modernised abstract theatre technique తో Dalit struggle ని నేను solo గా ప్రదర్శించటం ఓ అద్భుతమైన అనుభవం.
We are lost, a broken people
We are the shadows of the world
We cry for hope
We sing for freedom
We are the shadows of the world
14. మనదైన డప్పుల దరువునీ, దళిత చిందునీ కళారూపంగా ప్రదర్శించాలన్న ఆలోచన నీకెప్పుడు కలిగింది?దళిత సంస్కృతి, దళిత కళారూపాలపై అధ్యయనం చేయాలని, వాటిని ఆధునికీకరించాలని, తద్వారా దళిత జీవితాన్ని ప్రతిభావంతంగా, ప్రభావితంగా ప్రదర్శించాలని కోరిక. ఈ ప్రదర్సన కళాత్మకంగా, విభిన్నంగా వుండాలని, సాంప్రదాయ, ఆధునిక కళా రూపాలతో మేళవించాలని ప్రయత్నం. 1998వ సంవత్సరంలో దళిత నేత పాల్ దివాకర్, కురియన్ కట్టికరన్‌ల నాయకత్వంలో దళిత మానవ హక్కుల ఉద్యమం జాతీయస్థాయిలో ఊపందుకుంది. వివిధ రంగాల్లో వున్న దళిత కార్యకర్తలు, కవులు, కళాకారులు, దళిత మద్దతుదారులు జాతీయ దళిత మానవ హక్కుల ప్రచారోద్యమంలో భాగస్వామ్యం అవుతున్న సందర్భం. ఆ సందర్భం నా ప్రయత్నానికి తొలి వేదిక నిచ్చింది. ఆ వేదిక మీద తొలిసారిగా, నేను నేనుగా, నా డప్పులతో చిందులు తొక్కాను. తద్వారా డప్పు అనే దళిత బహుజన కలెక్టివ్ అండతో చిందుని ఒక కల్చరల్ టీంగా మే 2000న మొదలుపెట్టాను.
తరికిట తరికిట తరికిట తరికిట తరికిట తరికిటతోం! జై భీం!
తోలు డప్పులు- జుం తక, జుం తక
కాలి గజ్జెలు- జుం తక, జుం తక
చిమ్మ చీకటి- జుం తక, జుం తక
నిప్పు రవ్వలు- జుం తక, జుం తక
నలుపు ఎరుపు కలిపి చిందు పేరు పెడితే – జుం తాక్, జుం తాక్
మా అంబేద్కర్.. జై అంబేద్కర్”
Dalit Drum Campaign, United Kingdom, 2001
Asia Social Forum, Hyderabad, India, 2003
Cochin International Film Festival, Kerala, India, 2004
World Social Forum in Porto Alegre, Brazil, (January 2005)
Asian Play Back Theatre Gathering, Singapore, 2005
Frankfurt Book Fair, Germany, 2006
International Conference on Dalit women’s rights, The Netherlands, 2006
Rafto Prize Award Ceremony, Norway, 2007
Dalits in the Global Justice Movement Conference, Kathmandu, Nepal, 2008
Bread for the World 50 years Jubilee Celebrations, 2009
Theatre Global Festival, Germany, 2009
International Playback Theatre Conference, Frankfurt, Germany, 2011
International Playback Theatre Festival, Assisi, Italy, 2011
Playback theatre, Singapore, 2012
Playback theatre gathering Philippines, 2015
Playback theatre leadership, Estonia, 2018
Badboll conference, Germany 2019
16. ఆడియో, వీడియో, మాధ్యమాలలో చేసిన ప్రయోగాలు ఎన్ని? వాటికి ఎలాంటి స్పందన వచ్చింది?
“నేను మందిని, లోకం వాకిళ్ళల్లో ఇరవైయ్యారు వందల లక్షల మందిని. నేను పీడితుణ్ణి, తాడితుణ్ణి.
నేను మందిని, ఈ దేశంలో పదిహేడు వందల లక్షల మందిని. నేను అంటరానివాణ్ణి, వెలివేయబడ్డవాణ్ణి
నేను మందిని, పసందును. ఆంధ్ర ప్రదేశ్ లో డెబ్బై లక్షల మందిని నేను. నేను మాదిగను. కాదు. మహాదిగను”
అంటూ మాదిగలపై ఒక వీడియో చిత్రాన్ని నిర్మించాను.
17. థియేటర్ మాధ్యమంలో నీ ప్రయాణం ఎందాక వొచ్చింది?
దళిత అనుభవాల్ని వస్తువుగా, దళితుల చేత, దళితుల కోసం దళిత కథల్ని నూతనంగా నాటకీకరించాలని, దాని కోసం దళిత థియేటర్‌ని ఎస్టాబ్లిష్ చేయాలని కొంత ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో భాగంగా కుల సమస్యపై “కులం- ఒక హింస, కులం – ఒక దయ్యం, కులం – ఒక వర్గం, కులం – ఒక ముసుగు”- నాలుగు నాటికలని తయారు చేసి ప్రదర్శించాం.
18. నీ పాటల్లో మెలోడి అనే పూలతీగ అల్లిక ఉంటుంది. ఆ సౌకుమార్యపు బాణీతో నీకెందుకంత బలీయమైన బంధం?
మా అమ్మ పాటల్లో వొలికిన కన్నీటి జీరలు నాలో సజీవంగా ప్రవహిస్తూనే వుంటాయి. ఆ ప్రవాహం శ్రావ్యంగా వుంటుంది. బాల్యంతో పాటే మాయమైన మా అమ్మా నాన్న వుమ్మడి ప్రపంచం ఒక గాయంగా మిగిలిపోయింది. ఆ గాయం చేసే గానం శ్రావ్యంగానే వుంటుంది. ఎప్పుడో వీడిపోయిన ప్రేమ ఇప్పుడు చేసే గానం కూడా శ్రావ్యంగానే వుంటుంది. రాలిపోయిన పండు మిగిల్చిన తీయదనంలో మెలోడి చాలా హాంటింగ్‌గా వుంటుంది. జీవిత సంబంధ బాంధవ్యాలు అసంతులనం అయ్యేటప్పుడు కుమిలిపోయే భావోద్వేగాల శ్రుతి శ్రావ్యంగా వుంటుంది. యుద్దం తర్వాత వ్యాపించే నిశ్శబ్దం కూడా శ్రావ్యంగానే వుంటుంది. నాకు silence అంటే చాలా ఇష్టం. Silence sounds melody. నా పాట ఎప్పుడూ నన్ను ప్రేమించాలని, నాతొ స్నేహంగా వుండాలని కోరుకుంటాను. నాతో కలిసి ఉండాలనుకుంటాను. నాకు abstract అంటే చాలా ఇష్టం. Melody is an abstract. అది బాణీలకి, పదాలకి అతీతంగా హృదయాల్ని తాకుతుంది. భావాలకి అతీతంగా మనసుల్ని కలుపుతుంది. అది ఒక నొప్పిని కూడా తీయగా వినిపిస్తుంది.
తోడుగుండి తొవ్వా చూపవే
పువ్వులాంటి నవ్వు – చినుకు లాంటి చూపు
రెండు కళ్ళ మధ్య నిండు మబ్బులు నిలిచిపోయే”
19. కలేకూరి ప్రసాద్‌తో కలిసి పాడిన ఆనాటి స్వరలహరిని గుర్తుచేస్తావా?
ఒక వాక్యం కలేకూరిలా వొళ్ళు విరుచుకుంటుంది. దిగంబర దేహం నా మనసుని నిలబెట్టి మల్లె గజ్జె మల్లె గజ్జె మల్లెల్లో గజ్జెలూ అంటూ పాడుకుంటుంది. “భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాల”- ఒక కాగితం పడవ కవిత్వాన్ని మోసుకుంటూ వొస్తుంది. ఆ కవిత్వంలో కాసిన్ని కన్నీళ్ళు, తడిసిన నవ్వులు, ప్రేమగా, పిచ్చిగా పలకరించాయి.
20. కవీ, విప్లవకారుడు శివసాగర్ ఎలియాస్ సత్యమూర్తిగారితో ఎంతో సన్నిహితంగా మెలిగావు. ఆ రోజులనాటి జ్ఞాపకాల పుటలలో దాగిన పాటలెన్ని?
అది బహుశా జనవరి 1990 అనుకుంటా. తేదీ గుర్తులేదు. హైద్రాబాద్ అంబర్‌పేట రాణాప్రతాప్ హాల్. విరసం 20వ మహాసభల్లో కవి శివసాగర్ ప్రత్యక్షమయ్యాడు అజ్ఞాతం నుండి. పీపుల్స్‌వార్ పార్టీ అగ్రనేత సత్యమూర్తి బయటికి వచ్చాడు. సత్యమూర్తి కంటే శివసాగర్‌కే అభిమానులెక్కువ. అనేక మంది కవులు ఆయన్ని చూడాలని, మాట్లాడాలని, ఆయన కవిత్వం చదువుతుంటే వినాలని అనుకునేవాళ్ళు. నేను కూడా అలానే అనుకున్నాను. సభలకి వెళ్లాను. వేదిక మీద ఉండాల్సిన శివసాగర్ వేదిక కింద వున్నాడు. వెలివేయబడ్డ దళితుడిలా ఒక మూలన కూర్చున్నాడు. విరసం శివసాగర్‌ని, పీపుల్స్‌వార్ పార్టీ సత్యమూర్తిని బహిష్కరించింది. అప్పుడు శివసాగర్ వంటరివాడు కాడు. అభిమానులు, దళిత రచయితలు, విరసంలో కొంత మంది సభ్యులు ఆయనకు అండగా వున్నారు.
శివసాగర్ ని కలిసినాక ఆయన్ని ప్రేమిచాలి లేదా ద్వేషించాలి, మరొకటి కుదరదు. శివసాగర్ కవిత్వాన్ని చదివినాక ఆయన్ని ఆరాధించాలి లేదా ఈర్ష్య పడాలి, మరొకటి కుదరదు.
అప్పుడు పార్సిగుట్టలో మాది రెండు గదుల ఇల్లు. రెండు గదుల్లో ఒకటి వంట గది. మాకు, పక్క వాళ్లకి ఒకటే బాత్ రూమ్. ఇంత చిన్న ఇంట్లో అంత పెద్ద మనిషిని ఎలా ఉంచాలి అని భయపడ్డాను. సార్ భోంచేద్దాం అన్నాను. కడుపులో ఖాళీ లేదని చెప్పి ఖాళీ కడుపుతోనే పడుకున్నాడు. అప్పటికీ కుహూ పుట్టలేదు. శివసాగర్‌తో కలిసి నేను, ఉత్తర, సింబ, ఒక గదిలోనే పడుకున్నాం.
చేపలకూరతో ఇష్టంగా అన్నం తిన్నాడు. ప్యాంటు షర్టు తొడుక్కొని శాలువా భుజంపైన వేసుకున్నాడు. “బాబూ! నన్ను రాంనగర్ లో దించగలవా” అన్నాడు. రాంనగర్‌లో దించాను. “sir! ప్రేమ క్షణాలు – జ్ఞాపకాలు యుగాలు” చూపు పత్రికలో అచ్చు వేస్తాను అన్నాను. “అది నీది- నీ యిష్టం” అని చెయ్యి కలిపాడు.
చివరిసారిగా సత్యమూర్తిని 2005 లో చూసాను. చంద్రశ్రీతో కలిసి ఆయన మాటల్ని, పాటల్ని, స్టుడియోలో రికార్డు చేశాను. “అనగనగా ఒక నేను” పేరుతో శివసాగర్ మాటా పాటని ప్రచురించాను.
17 ఏప్రిల్ 2012 న శివసాగర్ అస్తమించాడు.
21. ఆర్టిస్ మోహన్ అంటే పిచ్చిప్రేమ కదా? ఆ పాటల ప్రేమికుడు నిన్నెంత ప్రేమించాడు? నువ్వెంత ఆయనను గుండెలకి హత్తుకున్నావు? ఆయన కోటలో సాగిన కచ్చేరీల కబుర్లేంటి?
మోహన్‌ని ప్రేమలో పడేయాలంటే ఒక్క పాట చాలు. అలాంటిది ఎన్నో ఏండ్లు, ఎన్నో పొద్దులు, ఎన్నో రాత్రులు, ఎన్నో పాటలు ఆయన దగ్గర పాడి వినిపించానంటే ఆయన్ని ఎలా పడేసానో వూహించుకోవొచ్చు. మోహన్ ముందు నిలబడి పాడుతుంటే వూళ్ళో హరిశ్చంద్ర నాటకం ఆడుతునట్టు వుండేది. వన్ మోర్ అబ్బా, వన్స్ మోర్ అబ్బా! అని అడిగి మరీ పాడించుకునేవాడు.
తాగుదామని వంగి నేను- మూతి పెట్టి పీల్చుతుంటే
నీటి బుగ్గ నిండు జాబిలయ్యి మూతి మీద ముద్దు పెట్టె
ఎవ్వరే ఆడ ఒరిగీ పోయిన వీరుడెవ్వరే బాల
ఆ ముద్దు మోము చూస్తుంటే వీరన్నోలే వున్నడమ్మ”
ఓ! మోహనా…. ఓహో మోహనా
కళ్ళలో కన్నీటి బొమ్మ – నీరు కారి రాలిపోయే
ఒక నింగి వాలింది రెప్పలా
ఓ! మోహనా…. ఓహో మోహనా”
22. కాలం గుండె చప్పుడులో ఆద్వర్యంలో అమరులైన కవిగాయకులకి ఈ మధ్య జనగీతాల లయతో గొప్ప నివాళులు అర్పిస్తున్నావు. ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఇప్పటివరకూ ఈ తరహా కార్యక్రమాలు ఎన్ని జరిగాయి?
మనిషి మరణించేటప్పుడు ఏం చేయాలో అర్ధంకాదు. మనిషి మరణించినాక కూడా ఏంచేయాలో అర్ధంకాదు. మరణించిన మనుషులు జ్ఞప్తికొచ్చినప్పుడు, వాళ్ళ జ్ఞాపకాలు మనసుల్ని తాకుతున్నపుడు ఏంచేయాలో అర్ధంకాదు. మనుషులు దూరమై, మరణించి, శాస్వితంగా ఇక కనిపించరనుకున్నాక, వాళ్ళ జ్ఞాపకాల్ని మనలో బతికించుకోవాలనుకున్నాక, వాళ్ళ మాటలు, వాళ్ళ నవ్వులు, వాళ్ళ కోపతాపాలు.. అలా రకరకాల భావోద్వేగాలు వెంటాడుతున్నప్పుడు వాళ్ళని ఏ రకంగా మర్చిపోవాలో కూడా అర్ధంకాదు.
వాళ్ళు నాగప్పగారి సుందర్రాజు, మద్దెల శాంతయ్య, మద్దూరి నగేష్‌బాబు, గ్యార యాదయ్య, శివసాగర్, చంద్రశ్రీ, కలేకూరి ప్రసాద్, పైడి తెరేష్‌బాబు, బోయి జంగయ్య, బొజ్జా తారకం, గూడా అంజయ్య, చిలకూరి దేవపుత్ర.
23. పల్లవికి పౌరసత్వమేదని, చరణాలకి ద్రువపత్రాలని చూపమనీ రాజ్యం ప్రశ్నిస్తోంది. పాటగానిగా నువ్వెలా స్పందిస్తావు?
“హమ్ దేఖేంగే- హమ్ దేఖేంగే
లాజిమ్ హై కి హమ్ బీ దేఖేంగే
హమ్ దేఖేంగే- హమ్ దేఖేంగే
వో దిన్ కే జిస్ కా వాదా హై- జో లహే అజల్ మే లిఖా హై
హమ్ దేఖేంగే- హమ్ దేఖేంగే- హమ్ దేఖేంగే- హమ్ దేఖేంగే”
– Faiz Ahmed Faiz
చెదరని చిత్రాలు, మారని రాతలు, బతుకు చిధ్రం, బొమ్మల బతుకు, కళ్ళముందు కదలాడుతుంది. ఎవరో వూరు పేరు లేని పేద కళాకారుడు పసుల మేపుకుంటూ పలికించే వేణుగానామృతం వినిపిస్తుంది. తొంభై ఆమళ్ళ నుండి తోలు డప్పులు వినిపిస్తున్నాయి. లెల్లెలో, చిందులో నాతో నడిచిన నా తమ్ముళ్ళు పార్సపు ప్రసాద్, పార్సపు డప్పు శ్రీను, యంగల కుటుంబరావు ఎక్కడ? కాలం గుండెచప్పుడులో సందడిగా వుండే కసుకుర్తి రామలింగం ఏడి? తీరని గొంతుల గానం వెంటాడుతుంది. నా చుట్టూ వున్న మంచి, చెడుల గురించి పాడాను. అంటరానితనం, అన్యాయం గురించి పాడాను. నమ్మకం, ఆశల గురించి పాడాను. గతం, భవిష్యత్‌ల గురించి పాడాను. ఇప్పుడే కాదు, ఎప్పుడూ నిజం ఒక్కటే అన్నది అబద్దం. అనేక నిజాలు గురించి పాడాలి. అనేక క్షణాల గురించి పాడాలి. Everyone has a song and each moment has a song. We live in every moment. I feel it is time to collectively create and sing the “song of the moment”.
ఒరేయ్ సురేస్ చిన్నప్పటి కలకోటని కళ్ళముందు నిలిపావ్ ధన్యవాదాలు.
కానీ ఆరోజుల్లో కులమంటూ ఆలోచించుకోని పసిమనసు సగర్వంగా ఈరోజు విహంగవీక్షణం చేసింది.
విషయాన్ని అంతా వివరంగా చెప్పావ్.
ఏమైనా నీకు మరోసారి ధన్యవాదాలు
దశరద్! ఎంత కాలం అయింది నీ పిలుపు వినక. ఒక్క పిలుపుతో మన ఫ్రెండ్స్ అందరిని గుర్తు చేసావురా. గోపి, శ్రీను, సత్యనారాయణ, యుగంధర్, బ్రహ్మం… అనేక ప్రియమైన క్షణాల్ని గుర్తుచేసావు. Many thanks. Love you.
చాలా బాగుంది. ఒక అవగాహన వుంది. ఉద్వేగం వుంది. వాస్తవం వుంది. వినయం వుంది. దుఃఖం వుంది. జీవితం వుంది. జీవన తత్వం, ఒక దార్శనిక పరిపక్వత వుంది.
ఒక దారిని నమ్మి ఆచరించి పని చేస్తే ఫలితం ఈ సంభాషణ లా ఉంటది.
సంగీతం, సాహిత్యం ఒక భిన్న ప్రపంచాలు అవి వాడజనాల ఆకలిలో పురుడు పోసుకుని ఊరులో ఊరేగుతాయి. వాడ పాట లిల్లాయి గా, ఊరి పాట కచేరిగా పరిణామం చెందుతాయి. ఊరికీ వాడకీ మధ్య తేడా ఇదే. ఈ రెండిటి మధ్య నిర్మించ బడ్డ బలమైన గోడ ను బద్దలు కొట్టి ఆట పాట ఆడితే లిల్లే సురేష్ అవుతాడు.
ఆ తప్పెట దరువులు చిందు గా మారి విరాట్ రూపం తీసుకుంటాయి.
ఎన్నేళ్ళకు ఒక ఆత్మీయ సంభాషణ విన్నాను.
ఇది కేవలం ఒక సంభాషణ కాదు మూడు దశాబ్దాల దళిత విప్లవ సాంస్కృతిక ఉద్యమ శావ.అది కేవలం మీరిద్దరూ మాట్లాడుకున్న యాది కాదు, ఒక తరం తండ్లాట. మా తరానికి వేసిన నిచ్చెన మెట్లు.
అందులో విప్లవం,సాహిత్యం, సాంస్కృతిక అలజడి.సంగీతం, కస్టాలు కన్నీళ్లు కలబోతలు ముప్పిరి గొన్న ఆలోచనల అలజడి రూపాలు.
శివుడు,వీరన్న, పాల్ దివాకర్,మోహన్,కలేకూరి …..దళిత ఉద్యమ దిక్శూచి లాంటి వాళ్ళతో బ్రతికిన క్షణాలకు ఒక అక్షర రూపం. నా కయితే ఉద్వేగం, నిర్వేదం, కోపం ముప్పిరిగొన్నాయి. ఇంత నిండైన జీవితం ఒక చిన్న ఇంటర్వ్యూ లో ఇమడ్చడం సాహసమే. విశ్వవాహిని మీద సిర్రా చిటికెన పుల్ల వేసిన చిందు తన కథను రాయాలి. ఈ తరం కోసం అయినా ఆ విజయాలు, వైఫల్యాలు రాయాలి. అది కేవలం మీ వైయుక్తిక జ్ఞాపకం మాత్రమే మీ చుట్టూ ఆవరించిన ఒక సామూహిక తపన. అది ఒక రూపం తీసుకుంటే నాలుగు దశాబ్దాల దళిత విప్లవ సంగీత కథ లా మిగలాలి ఆ మంచి వార్త త్వరలోనే వింటాను అని ఆశిస్తూ…
మీ నుంచి సర్వాన్ని పిండిన రమేష్ అన్న కృషి చిన్నది కాదు ఇద్దరికీ అభినందనలు…
సురేష్ లెల్లె మాట కూడా పాటె . సురేష్ పాట మొదటి సారి యూటీసీ బెంగళూరు లో విన్న. ఆ తర్వాతే మాట కలిపా. దళిత కళా ప్రపంచాన్ని పరిచయం చేశాడు తన మాటలో, పాటలో , చిందుల్లో. యీ ఇరవయ్యేళ్ళ స్నేహం లో ఎంతో కలిసి నేర్చుకొన్న. ఎవడె ఆడ ఒరిగిపోయిన వీరుడెవ్వడే బాలా … గుండెను పిండిన పాట. థాలెల్లె లెల్లెయలో తక తాళం లెల్లె లెల్లెయలో …గుండెను చిందు వెయించిన పాట. గూటిలోని గువ్వా గుబులోతోనా కూసింది నువ్వా .. విన్న మొదటిసారే మనసులో రాగం నింపిన పాట. నేనే మంచి వాడ్ని … సోఫియా చిన్నపుడు చాలాసార్లు విని… ఏంటి డాడీ ఈ అంకుల్ అంత మంచి వాడ అని అడిగేది.. జవాబు గ దళిత్ థియోలాజికల్ ఆంథ్రోపాలజీ తన భాషలో చెప్పడానికి ప్రయతించే వాడిని. Suresh has been both an inspiration and a resource for me over the last twenty years. All my students in my Dalit theology class were to read Kalyana Rao’s THE UNTOUCHABLE SPRING, and were to watch Suresh’s documentary MAHADIGA. Its a delight hearing (though in a written word) his story afresh in his own words. It is poetry in its perfection.
ఈ సంభాషణ ద్వారా కొన్ని దశాబ్దాల ఙ్ఞాపకాల్లోకి తిరిగి ప్రయాణించటం బావుంది సురేష్ !
ఏదో గొప్ప మార్పు రాబోతోందనీ ,దానిలో అందరం భాగమవుతున్నామనీ ,ఏ సమస్యలయినా పదిమందిమి కలిసి నిలబడగలమనీ నమ్మకాన్నిచ్చిన ఆ రోజులెంత గొప్పవో ఇవాళ బాగా తెలుస్తోంది .
ఇన్ని ఒడిదుడుకుల నడుమ ముందుకు సాగుతున్న మీ సాంస్కృతిక బృందానికి అభినందనలు .
మీ అనుభవాల కలబోతకు చొరవ చూపిన రమేష్ కు,వేదికనిచ్చిన సారంగకూ థాంక్స్ .
దాదాపు 25 సంవత్సరాలుగా సురేష్..లెల్లే సురేష్ గా ఒక పాటగాడు గా తెలుసు. గౌరవప్రదమైన స్నేహంగా. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇంకా లోతుగా తన గురించి తెలుసుకున్నానేమో..మంచి పని చేశావు రమేష్ !
సురేష్ పాటలు తన గొంతు నుండి మాత్రమే వింటే హృదయానికి టాకుతాయి. కొద్దిసేపు ఒక అనిశ్చితి స్థితి లోకి తీసుకెళ్లి, ఎప్పటికి వెంటాడుతాయి.బహుశా: జీవితాన్ని నగ్నంగా చూసి వైరుధ్యాలను ఉన్నాడున్నట్లుగా ఏ మర్మాలు మార్మికాలు లేని ముసుగు వేసుకొని వ్యక్తిత్వం కావచ్చు. చీకట్లో కూచొని ఎదుటి వెలుతురు బావుంది అనో ఇలాగే వుంటుంది అనో అనుకోని ఉండకుండా చీకటిని తరిమికొట్టే చిత్తశుద్ధి ఉండటం కావచ్చు. తనలో నాకు తొలినాటి ఆలోచనా ధోరణి ఇప్పటికి కొత్తగా కనిపిస్తుంది. సురేష్ కు అభినందనలు మనసారా.
సురేష్, నీ ఇంటర్వ్యూ చదువుతుంటే డి ఎచ్ లారెన్స్ పద్యం, ‘పియానో’ గుర్తుకొచ్చింది.
కలకోటలో మీ అమ్మ పాట, గొంతు విన్న రోజులు గుర్తుకొచ్చాయి.
Softly, in the dusk, a woman is singing to me;
Taking me back down the vista of years, till I see
A child sitting under the piano, in the boom of the tingling strings
And pressing the small, poised feet of a mother who smiles as she sings.
….
Down in the flood of remembrance, I weep like a child for the past.
‘జ్ఞాపకాల వరదలో పసిపిల్లాడిలా నేను విలపిస్తాను’…
ఆ అమ్మ – అమ్మే కావచ్చు, ఉద్యమమే కావచ్చు, జ్ఞాపకాలుగా మిగిలిన మిత్రుల స్నేహమే కావచ్చు..
జ్ఞాపకాలను పంచుకున్నందుకు నీకూ, జీవితాన్ని ఆవిష్కరించినందుకు ఒమ్మి రమేష్ బాబుకూ కృతజ్ఞతలు.. ఆవిష్కరించినందుకు ఒమ్మి రమేష్ బాబుకూ కృతజ్ఞతలు..
సురేశ్ … ముప్పై ఏళ్ల జీవితాన్ని మళ్ళీ గుర్తు చేశావ్. బి.ఆర్.సి కంపెనీ అలియాస్ బకెట్ . రేకు. చీపురు, కంపెనీలో మనం తిరిగిన గురుతులు, బోయిన్ పల్లిలో ఊరు నిదర లేవక ముందే మీ ఇంట్లో శివసాగర్ పాట “అమ్మా నను కన్నందుకు విప్లవాభి వందనాలు ” అరుణోదయ రామారావు గుండె గొంతుకలనుండి వచ్చే ఆ పాట, ఎమ్మెస్ రామారావు పాట – “ఈ విశాల విషాద ఏకాంత సౌధంలో.. నిదురించు జహాపనా!” , కుందన్ లాల్ సైగల్ ” సోజా రాజకుమారి సోజా ” , హేమంత్ కుమార్ ” ఆ నీలి గగన్ కె తలే ” పాటలు మన జీవితాలను అనంత దూరాలకు తీసుక పోయేది. “పాడవే పాడవే కోయిలా …”అంటూ అప్పుడు నీవు రాసిన పాట….ఇంకా నా చెవుళ్ళో మారు మ్రోగుతూనే ఉంది.
ఉత్తర మటన్ గురించి చెప్పావ్ కానీ ఉత్తర చేసే కాకర కాయ కారం ఎలా మరవగలను? మరీ అడిగి చేయించుకునే వాడిని!
లెల్లె గ్రూప్ – విమలక్క, జయక్క, గోరెటి వెంకన్న , మల్లెపల్లి లక్షన్న కలసి పాడిన “నీ ఆరు గుర్రాలు , నా యారు గుర్రాలు” పాట, వర్షం తో తడిసి ముద్దయిన నా పెళ్లి రిసెప్షన్లో అందరిలో నూతనోత్సాహం నింపింది. చెప్పుకుంటూ పొతే ఇంకా ఎన్నో మధుర జ్ఞాపకాలు, వాటన్నిటీ మళ్ళీ గుర్తు చేయించిన ఒమ్మి రమేష్ బాబుకి శణార్థులు.
-వేణు నక్షత్రం
అనేక నిజాలు క్షణాల గురించి పడుతూనే ఉండాలి సురేష్. అట్లానే అనేక నిజమైన క్షణాల గురించి రాస్తుండాలి రమేష్ అన్నా !. నాకు చదివే అలవాటు తక్కువ కానీ మొత్తం అక్షరం పొల్లుబోకుండా చదివించారు సురేష్, రమేష్ అన్నలు 🤝🤝🤝
అతనూ – గుండె దరువూ
సమాజం శాంతించడం, మనసు శాంతించడం అనేకానేక మందికి అపురూపం. గొంతు పెగిలి జీవితానుభవం ఒకటి పాటగానో, వచనంగానో వచ్చి చుట్టూ వున్న సమాజాన్ని కడిగి పారెయ్యడం, గుండెల్లో చిన్నపాటి ప్రవాహం ఒకటి కనురెప్పలు దాటి బయటపడటం ఎంత దుస్సాద్యమో కదా! కాని లెల్లే సురేష్ కు ఇది అసాద్యం కాదని ఒమ్మి రమేష్ కూ తెలుసు. అందువల్లనేమో ఇంటర్వ్యూ సులువుగా మరిచిపోలేమన్నట్టు సాగింది. అయినా చిత్రం ఏమంటే సురేష్ సాధించింది ఎంతో ప్రజ్ఞ వుంటే కాని సుసాధ్యం కాదు. మన నేలా, పరాయి గడ్డ అని కాకపోయినా డప్పులో సాగే గుండె లయ, అద్దాని వెనుక కిందకి పడి దొర్లి, ముక్కలయిన మనసు గాయం, వేదన, సకలానుభవాలూ నా ముందూ, నీ ముందూ నిలబడి ఆకుశలమైన ప్రశ్నలు వేసినట్టుంది. నిజానికి ఇంటర్వ్యు చేసిన రమేష్ కి, బయటపడని కన్నీటి విలువ, సారం, రూపం, తెలీకపోదుకదా! సురేష్ ముందడుగులు, వాటి పాట వెనుక చిల్లులు పడ్డ గుండె చప్పుళ్ళూ వినిపించాయి. చెలం, త్రిపురల ఇంటర్వ్యూల వలె పదిలంగా మన దగ్గర వుంచుకోగల ఇంటర్వ్యూ ఇది. Only the best to you both.
– శివాజీ
నీకే కాదు, మాకు తెలియని అనేక విషయాలను నీతో ఒక తాత్విక చింతన తో ఎంతో ఎమోషనల్ గా, పొయెటిక్ గా ఇంటర్వూ లో చెపిపించిన రమేష్ బాబు కి కూడా అభినందనలు. నిజానికి ఇది చాలా చిన్న మాట. నీ కంఠం లాగే నీ ఇంటర్వూ కూడా అన్ని రసాలను ఒలికించింది.
బహుజన గొంతుక మా లెల్లే సురేష్ అన్న గురించి బాహుబలి కంటే గొప్పగా వర్ణించి విశ్లేషణ చేసిన రచయిత రమేష్ బాబు గారికి కళాభివందనం….
నిజంగానే లెల్లే సురేష్ ది జనం గొంతుకే. వివక్షకు గురైన ప్రజల ఆక్రందన వేదన ఆగ్రహ ప్రవాహం. అంతర్జాతీయ, జాతీయ వేదికలపై చిందులేసిన కళా బృందం ఆత్మకథ అది. విద్యార్ధి, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమాలలో చురుకైన పాత్ర వహించిన ఆ మిత్రబృందం నాకు సుపరిచితమే. శ్రావ్యమైన అమ్మ గొంతులో కన్నీటి జీరలను సొంతంచేసుకున్నాడు. అరుణోదయ సాంస్కృతిక సైనికుడయ్యాడు. కవి, గాయకునిగా దళిత సాంస్కృతిక చైతన్య స్రవంతిలో భాగమైనాడు. ఎన్నెన్నో జ్ఞాపకాల దొంతరలను కదిలించాడు. తన విరాట్ స్వరూపాన్ని చదివించాడు. ఆయన పాట మహ ప్రవాహం. కదిలించే స్వభావం వుంది. విరామమెరుగని జీవన గమ్య గమనంలో పాటకు పరిమళం అందించినాడు. పాడు సురేష్! అనేక నిజాల గురించి పాడు. పాడుతూ సాగు. కవి గాయకుని స్వర చరితను ప్రపంచానికి పరిచయం చేసిన ఒమ్మి రమేష్ బాబుకు ధన్యవాదాలు. సారంగకు కృతజ్ఞతలు.
కణ్ కణ్ మని మోగే డప్పు చప్పుళ్ళలో దళిత జీవన సాంస్కృతిక జీవితాన్ని ఆవిష్కరిస్తున్న మిత్రుడు లేల్లె సురేష్ పాటని..మాటని జీవితాన్ని ..నిరంతర పోరాటాన్ని ఆవిష్కరిస్తూ సాగిన ఈ సంభాషణ ఎన్నో విషయాలను గుర్తు చేసింది… ఎన్నో సందర్భాలను మళ్ళీ కళ్ళకు కట్టింది… మన తరంలోనే ఏంతో పోరాట దీక్షతో పనిచేసే కవులు కళాకారులు .. చేసిన పనికి గుర్తిమ్పులేకుండా పోతున్నారు… దోస్త్ లేల్లె సురేష్ హడావిడి లేకుండా పని చేసుకుంటూ పోతాడు.. అట్లాంటి మిత్రుడి తో చేసిన సంభాషణ.. పరిచయం ఎంతో బావుంది… ఈ పని ఒమ్మి రమేష్ బాబు చేయడం సంతోషం … ఇద్దరికీ అభినందనలు
– ఖాజా
సురేష్, మీ ఇంటర్వ్యూ గొప్ప సజీవ చిత్రంలా వుంది. చూపు, లెల్లె కార్యక్రమాలు దగ్గరగా చూశాను. లెల్లె సాంస్కృతిక కార్యక్రమాలలో బుద్దు, బబ్లూ బుడ్డి బుడ్డి డప్పులతో ప్రోగ్రాం కి అదనపు ఉత్సాహాన్ని, వూపునూ ఇచ్చేవాళ్ళు. ఇంకా బుజ్జి, శీను, ఉత్తర అందరూ నల్ల డ్రెస్, నడుముకి ఎర్ర గుడ్డ కట్టుకుని సాంస్కృతిక వీరుల మాదిరి ఉండేవారు. ఆ గొప్ప పాటల డప్పుల చప్పుడు మళ్ళీ ఒక్కసారి చెవుల్లో మారుమోగినట్టు అనిపించింది. అదంతా రాజీలేని ప్రేమతో నిబద్ధత, నిమగ్నతలతో చెయ్యబట్టే తర్వాత మీకు అంత మంచి కాన్వాస్ ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చింది. బహుశా, మిమ్మల్ని హగ్ చేసుకున్న ఆ నల్లతల్లి స్పర్స మీలో మరింత శక్తిని నింపి ఉండొచ్చు.
శివసాగర్, పార్వతిల ప్రేమ కావ్యం ‘ప్రేమ క్షణాలు, జ్ఞాపకాలు యుగాలు’ ఆయన చెబుతుంటే మీరు రాయడం నేను, కాత్యాయని, శ్యాం అన్న దగ్గరుండి చూశాం. అలాగే పార్సీ గుట్ట ఇల్లు, రాం నగర్ ఇల్లు మనందరికీ గొప్ప జ్ఞాపకాలను ఇచ్చాయి. అక్కడి పచ్చడి మెతుకులే పరమాన్నాలు. మీరు తర్వాత దళిత డ్రం ద్వారా చేసిన కార్యక్రమాలను నేను పెద్దగా ఫాలో కాలేదు, కొన్ని మాత్రం తెలుసు. అన్ని దేశాలకు దాన్ని తీసుకెళ్ళినా ఇక్కడ మీకు రావల్సింత గుర్తింపు రాలేదనిపిస్తుంది.
కనీసం ఇప్పటికైనా ఒమ్మి రమేష్ గారి ద్వారా మీ కృషి కొంతమేరకు బైటికొచ్చింది. రమేష్ గారికి, సారంగకి ధన్యవాదాలు. మీకు హృదయపూర్వక అభినందనలు.
Hearty Congratulations to an organic Intellectual of our times Parsapu Suesh Kumar
నేను మహాధిగను …
నేను అదృష్యుడను…
చీకటిలో నాకు నేను తప్ప ఎవ్వరికి కనపడను…
…
వేదానికి సైతం వేదన ఉంది, తను సెప్పినట్టు చేయడం లేదని …
వేదం నిజం …
నీ మేథా నిజం ….
……………….
అంటరాని, అశుద్ద, అపవిత్ర ముద్రల్నివేసారు. అవి మూతికి ముంతల్లా, ముడ్డికి చీపురులా నన్ను అంటి పెట్టుకొనే వుంటాయి. నా డప్పుతో నా అంటరానితనాన్ని చాటింపు వేయించారు…
…
మడిసి ని మనిషి గా చూడలేని మనవత్వపు మరకలు మరిఅంటవు వీరి మరణాంతం వరకు. నిఘాడ గుప్తాలను, అనితరసాధ్యాలనే అందుకుంటున్న ఈ రోజుల్లో మార్పు అనివార్యం. మీ కళ్ల ముందు చూస్తున్నారు. మారింది. మారుతుంది. మరి తీరుతుంది. ఇది తధ్యం…
………………..
కాలం తో గడిపి ఏకాంతంగా పాటను పూర్తి చేస్తాను…
…
కాంత ఎంత కాంతివంతం గా ఉన్నప్పటికీ గడపడానికి ఏకాంతం కావాలి. ఆ కాంతే కాలమైతే కావాల్సింది ఇంకెటి కవికి …
……………
కొన్ని కవితలు, కొన్ని పాటలు చెరిగిపోకుండా, చినిగి పోకుండా నాతో వుంటాయి. అప్పుడప్పుడు పలకరిస్తుంటాయి. బతుకు దెరువు పరుగుల్లో అనేక కవితలు నా మనసులోనే కన్ను మూశాయి…..
…
మనిషికి మనసే తీరని శిక్ష, దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష అని మనసు తెరల మధ్య వ్రేలాడే దొంతరల ను కదిల్చి కరముల మధ్య కలం ఉంచి. కరి మబ్బుల వెనకున్న జడి వాన చినుకుల్లా, బ్రతుకు దెరువు పరుగుల ప్రయసపు ప్రయాణం లో మనసు వెనుక మరుగపడ్డ అనేకానేక కవితా కాగాడాల వెలుగులనందిచండి …
………………
కత్తి ఎప్పుడూ నిశ్శబ్దంగానే వుంటుంది. నరకే ముందు, నరికేటప్పుడు, నరికిన తర్వాత కూడా. ఎవడి గొంతు తెగిపోతుందో వాడే కేక పెడతాడు. ఎవడి గుండె పగిలిపోతుందో వాడే కేక పెడతాడు. అది చావు కేక …
…
పదునైన కత్తి పది తలలకే
పరిమితము, అది మితం …
పదునైన కలం పది తరాలకు
మార్గదర్శకం, ఇది అమితం …
చావు కేక చరిత్రపుటం
బ్రతుకు బాట చరిత్రహితం …
ఇది అక్షర రూపం. మారుతున్న కాలానికి, సంస్కృతికి పాట ఒక సాక్ష్యం.
………………….
మోహన్ గారు ఒక కళా ప్రపంచం.
ఒక నవ్వు నడిచింది నదిలా ..
కళ్ళలో కన్నీటి బొమ్మ – నీరు కారి రాలిపోయే
ఒక నింగి వాలింది రెప్పలా
ఓ! మోహనా…. ఓహో మోహనా”
…
మనం అందరం పుష్పక విమానం గురించి విన్నాం. ఒక మనిషి ఎక్కి కూర్చుంటే ఇంకొక మనిషి కి ఖాళి. అలా వందలు, వేలు, లక్షలు ఇంకా కోట్లు. అలానే ఒక మనిషి గురించి చెప్పాలనంటే ఎన్ని సభలలో మాట్లాడుకున్న, ఎంత అక్షర రూపం దాల్చిన కానీ ఇంకా చెప్పడానికి, రాయడానికి మిగిలివుండే ఒకే ఒక మహామౌనయోగితామృతగిరి …
……………….
నా కులం సగం అబద్దం, సగం నిజం. నా మతం సగం అబద్దం, సగం నిజం. పూర్తి నిజమేమిటంటే నాకు కులం వొద్దు. మతం వొద్దు. నా కన్నతల్లి నాకెంత నిజమో, ఈ భూమి తల్లి నాకంత నిజం. మా అమ్మ కడుపులో పుట్టి పెరిగాను. భూ మాత ఒడిలో బతికి చస్తాను. మా అమ్మ కడుపులో మళ్ళీ కలిసిపోతాను…
…
ఎంత ఎదిగిన, ఎంత ఒదిగిన,
ఎంత చెదిరిన, ఎంత సదిరిన,
ఎడనుంచ్చోచ్చనో అడకే బోతా …
Silence creates Sound.
That sound will be melody and the molecules of Melody is your Life’s Abstract. When the equilibrium meets the endurance, that’s Lelle…
Suresh Lelle:
The Versatile Parasite
బొగ్గుల కుంట సారస్వత పరిషత్ హాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రం రవీంద్ర భారతిలకు సమాంతరంగా ఆర్టిస్ట్ మోహన్ ఆఫీసు
కెజి సత్యమూర్తి ఆఫీసు
లెల్లె సురేష్ ఇల్లు సంగీత సాహిత్య రంగాల నిలయ విధ్వాంసుల కచేరీలుగా భాసిల్లేవి
ఒకసారి చూపు సంచికలతో మోపెడ్ మీద సురేష్ నగర విహారం చేస్తూ సత్యమూర్తి ఆఫీసుకు వచ్చాడు అదే మొదటిసారి అతడ్ని చూడ్డం
అక్కడ తేరేష్ బాబు కవితా గానం చేస్తూ
ఎవడి పాట వాడే పాడుకోవాలి అన్నాడు త్రిపురనేని శ్రీనివాస్
అంటే
అందరం బాగుంది అన్నాం
సురేష్ మాత్రం అంతాబాగుంది గాని శ్రీనివాస్ అన్నది వదిలెయ్ నువ్వు ఏమంటావో అది రాయి అన్నాడు ఎదుటి వాళ్ళ మెప్పు కోసం మెరమెచ్చులకు పోకుండా కుండకు హాని లేకుండా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే సురేష్ నిజాయితీ నాకిష్టం
మట్టి పెళ్ళల కిందనున్న మాదిగను మహాదిగ గా పటేల్ విగ్రహం కంటే ఒక ఇంచ్ ఎక్కువగా దృశ్యకావ్య గౌరవం కట్టబెట్టిన సురేష్ సంకల్ప శుద్ధి మీద నాకు అభిమానం
బుజ్జి గాడి ఉరుముల డప్పు విస్ఫోటనానికి రెచ్చిపోయే అతడి సౌందర్యం మీద జెలసీ
మున్నాను కోల్పోయిన మోహన్ని
పార్వతిని కోల్పోయి వివేకం లేని ఇతరుల మాటల ఈటెలకు గాయపడ్డ శివుడిని పాలతెలుపు మనసుతో
తమ్ముడ్ని కోల్పోయిన కాత్యాయన్ని అదే రూపంతో వోదార్పునిచ్చాడు కలేకూరి ప్రసాదుని సురేషును నాలుగో రౌండ్ లో మోహన్ దగ్గరకు తీసుకుంటే ఎన్టీయార్నీ ఏఎన్నార్ని ఎస్వీ రంగారావు దగ్గరగా పొదువుకున్న గుండమ్మ కధ వాల్పోస్ట్ గుర్తుకొచ్చేది కొయ్యలగూడెం విజయకుమార్ అన్న గొప్ప నటుడు అతడు అంత గొప్పనటుడు అని విశాల ప్రపంచానికి తెలియదు కదా అని బాధపడే వాడిని
కాని లక్ష్మీస్ ఎన్టీయార్ సినిమాలో ఎన్టీయార్ వేషమిచ్చి ఆయనకు ఎనలేని గుర్తింపు తెచ్చాడు వర్మ
సురేష్ కృషిని రమేష్ ఇట్టగా రికార్డు చేశాడు
సౌదా అనంతు కాత్యాయని వొమ్మి నాకు ప్రత్యక్ష ద్రోణులు నేను వాళ్లకు ఏకలవ్యుడ్ని
ఎక్కువ తక్కువలు లేకుండా సున్నితపు త్రాసు సహాయంతో సురేష్ ను రమేష్ పరిచయం చెయ్యడం క్రియావిశేషణం
ఇందులో 70% వరకు కుహూ బుద్దూ ఉత్తర సాక్షిగా నేను ప్రత్యక్ష సాక్షిని
బోనులో నిలబడి చెప్పమన్నా ప్రమాణం అవసరం లేకుండానే చెప్తా
లెల్లె సురేష్ వొమ్మి రమేష్ చేతులను నా చేతుల్లోకి తీసుకొని ముద్దాడుతూ…
జైభీమ్
“పాటగాడా!” అని ఒమ్మి రమేష్ బాబు నన్ను పిలిచినప్పుడు నా నరాలలో పాట కెవ్వుమంది. ఆయన ప్రతి ప్రశ్న పసి పాటలా నా జ్ఞాపకాల్ని ముద్దాడింది. ప్రతి జ్ఞాపకం మనసులో మాట్లాడింది. భయం లేకుండా బహిరంగంగా మాట్లాడించింది. జ్ఞాపకాలకీ , కలలకీ మధ్య సంభందాన్ని, సౌందర్యాన్ని చూపించింది. ఒమ్మితో ఈ సంభాషణ నాకు అద్భుతమైన అనుభవం.
ఒమ్మి రమేష్ అన్నా! నా అనుభవాల మీద నిలబడిన జ్ఞాపకాలు నన్ను చూస్తున్నాయి. జ్ఞాపకాలు నా అస్తిత్వాల గాయాలు. అవి నా అస్తిత్వాల గమ్యాలు కూడా. నా గాయం, నా గమ్యం, నా గానం. నేను వంటరిగా పాడుకునే ప్రతి సారీ నిన్ను గుర్తు చేసుకుంటాను.
Dear Afsar, నా అనుభవాల్ని, అనుబంధాల్ని అక్షరీకరించే అరుదైన అవకాశం కల్పించారు. It is a special moment in my life and something special for my life to further broaden my perspective to act beyond my experience. Thank you once again. నా భావాల్ని, భావోద్వేగాల్ని పాడుకున్నంత స్వేచ్ఛగా పంచుకోటానికి వేదిక నిచ్చిన సారంగ పత్రికకి ప్రత్యేక ధన్యవాదాలు.
నా ప్రియమైన పెద్దలు ఖాదర్ అన్న, తల్జావఝుల శివాజీ గారు, సి. రామ్మోహన్ గారు మరియు నా ప్రియమైన మిత్రులు, దశరథ రావు, గుఱ్ఱం సీతారాములు, దాయం జోసఫ్ ప్రభాకర్, కాత్యాయని, శోభా భట్, సుధాకిరణ్, నక్షత్రం వేణుగోపాల్, మైత్రి శ్రీను, సంధ్య, సాయిచంద్, ఖాజా, చల్లపల్లి స్వరూప రాణి, జి. బిక్షు, యన్ జె విద్యాసాగర్ లు సారంగ ముఖంగా నన్ను హత్తుకున్నారు. వారి ఆత్మీయ అక్షర స్పర్శ “ప్రాణమైనా పోనీ పాట మానకే” అంటూ హృదయాన్ని స్పృశించింది. వీరికి పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఫోను చేసి అభినందించిన అనేక మంది మిత్రులకి వందనాలు.
ఇప్పుడు నా నరాలలో పాట మళ్ళీ కెవ్వు మంటుంది.
“చినుకులల్లో చిందులేసే గాలి చూడరో
గాయపడి ఈల పాటై వెంట పడతదీ” //ప్రాణమైనా పోనీ పాట మానకే//
సురేష్.. నీ పాటల్లాగే మాటలూ నన్ను ఎంతో ఉత్తేజపరిచాయి. సారంగలో ఇంటర్వ్యూకి అంత చోటిచ్చిన సంపాదకులకి నా ధన్యవాదాలు. తృప్తిగా ఉంది. స్పందనలు, అభినందనలు చూశాక మరింత ఉత్సాహం అనిపించింది.. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. “సురేష్ ని ఇంటర్వ్యూ చేయి” అని పురమాయించి.. పదేపదే గుర్తుచేసినవాడు అఫ్సరుడు. ఈ అభినందనల్లో.. ప్రశంసల్లో తన వాటా ఎక్కువే..
సురేష్.. నీ పాటల్లాగే మాటలూ నన్ను ఎంతో ఉత్తేజపరిచాయి. సారంగలో ఇంటర్వ్యూకి అంత చోటిచ్చిన సంపాదకులకి నా ధన్యవాదాలు. తృప్తిగా ఉంది. స్పందనలు, అభినందనలు చూశాక మరింత ఉత్సాహం అనిపించింది.. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. “సురేష్ ని ఇంటర్వ్యూ చేయి” అని పురమాయించి.. పదేపదే గుర్తుచేసినవాడు అఫ్సరుడు. ఈ అభినందనల్లో.. ప్రశంసల్లో తన వాటా ఎక్కువే..
పాటగాడితో ప్రేమ చాలనం
“లెల్లె సురేష్” కేవలం ఒక వ్యక్తి పేరు మాత్రమే కాదు. ఒక కళాత్మక సమూహానికి సింబల్. అతడి ప్రతి కదలిక కళాత్మకంగానే వుంటుంది. పెచ్చులూడిన గదిలో చిరిగిన చాపమీద కూర్చొని, గొడ్డు కారపు మెతుకులు కసిగా కలుపుకొని తింటున్నట్టుంటుంది. గొడ్డలితో మిట్ట మధ్యాహ్నం బీళ్ళల్లో కట్టెలు కొడుతున్నట్టు, కొడవలితో జొన్న కోత కోస్తున్నట్టు వుంటుంది. లెల్లె సురేష్ అర్ధరాత్రి బాగా కాచిన పలకను జూలు విదిలిస్తూ వాయిస్తున్నా, ప్రెస్ క్లబ్ మీటింగ్ లో మాట్లాడుతున్నా, స్టార్ హోటళ్ళలో స్విమ్మింగ్ పూల్ ఒడ్డున కూర్చొని చూస్తున్నా.. అంతా కళాత్మకం. ఎప్పుడూ దేనికోసమో దేవులాడుతున్నట్టూ, పురాతనమైనదేదో పోగొట్టుకున్నట్టూ, ప్రాచీన నాగరికతల్ని అన్వేషిస్తుంటాడు.
పార్సపు సురేష్ మంచి విమర్శకుడు కూడా. అతడి ప్రతి మలుపుని దగ్గరగా చూసినవాడ్ని. కొన్నిసార్లు కోరస్ అయినవాడ్ని. దాదాపు పాతికేళ్ళ జ్ఞాపకాలు. 1997లో అనుకుంటాను. హైదరాబాద్ తెలుగు లలితాకళాతోరణం వేదికగా నేను, నాగప్పగారి సుందర్రాజు కలిసి, రావెల కిషోర్ బాబు, లాలయ్య సహకారంతో “మాదిగ చైతన్యం” పుస్తకావిష్కరణ. వేల మంది జనం. ఆ సభలో సురేష్ జూలు విదిలిస్తూ మాట్లాడిన తీరు అతడిని గుండెలకు హత్తుకునేటట్లు చేసింది. ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటి క్యాంపస్ లో నాకు ఎప్పుడు విసుగు పుట్టినా, సిటీ వెళ్లి సురేష్ ని కలిసేవాడిని. పక్కనే కలేకూరి. ఇక చెప్పేదేముంది. అదొక సాహిత్య సభ. సాంస్కృతిక వేదిక. అసలే అస్తిత్వ ఉద్యమాల కాలం. వీళ్ళిద్దరూ లేకుండా ఆ రోజుల్లో సిటీలో ఏ మీటింగు జరగలేదు. సాయంత్రానికి మోహన్ గారి ఆఫీసు అందరికీ వేదికయ్యేది. అక్కడ చింతలపల్లి అనంతు “రుడాలి” భూపేన్ హజారిక పాటలు, లెల్లె సురేష్ కాటిసీను పద్యాలు పాడుతుంటే, జలపాతంలా సాగే రాగాలకి సాగిలపడే వాణ్ని. అప్పుడప్పుడు గోరటి వెంకన్న ఆట, పాట. తనపని తానూ చేసుకుంటూ మధ్య మధ్యలో మోహన్ గారి చిరునవ్వులు, చిన్న మాటలు. అసలు ఆ రోజులే వేరు. అవి బ్రతికిన క్షణాలు. ఆ రోజుల్లో సురేష్ తో పాటు నేనూ వున్నందుకు కాస్త గర్వంగానే అనుకుంటాను. పార్సపు సురేష్ కాస్త చూపు సురేష్ కావటం, తర్వాత లెల్లె సురేష్ గా స్థిరపడిన క్రమం చాలా గొప్పది. మొత్తంగా ఆ క్రమం పాటతో ముడి పడి వుంది. అందుకే “పాట ఆత్మకథ” అన్నాడు ఒమ్మి రమేష్. అది చదువుతుంటే ఒక కావ్యంలా, ఒక దీర్ఘ కవితలా వుంది. ఒమ్మి రమేష్ ఎంత పోయటిక్ గా ప్రశ్నలడిగాడో అంతే పోయటిక్ గా లెల్లె సురేష్ సంభాషించాడు. ఆ సంభాషణల్లో ఒక వేదన, ఆక్రోశం, ఆక్రందన, ఆర్ద్రత కలగలిసి వున్నాయి.
“నేను 10 వ తరగతి చదివేటప్పుడు మా అమ్మ, మా నాన్న విడిపోయారు. మా పండగ ప్రపంచం మాయమయ్యింది. ఇప్పటికీ ఆ ప్రపంచం కనిపించలేదు. ఇక ఎప్పటికీ కనిపించదు”. ఈ వాక్యాలు చదివేటప్పుడు నాకు కళ్ళు చెమర్చాయి. అక్కడ కాసేపు ఆగాను. తమాయించుకొని కొనసాగించాను. కొంత మంది సామాజిక వేత్తల గురించి మాట్లాడేటప్పుడు ప్రముఖ కవి, రచయిత, వక్త, గాయకుడు అని పడికట్టు పదాలతో నిర్వచిస్తుంటారు. ఈ నిర్వచానాలకు సురేష్ లొంగడు. కొత్త నిర్వచనాలు వెతుకుతాడు. పాట గురించి మాట్లాడుతూ “జీవితంలో పాట అంతర్భాగం. అది ఒక వినోదం, విశ్రాంతి. జీవితంలో పెనవేసుకున్న పాట ఒక బ్రతుకు పెనుగులాట. ఒక ఉద్వేగం, ఉద్యమం, ప్రక్రుతి, ప్రాణం, శ్రమ, గానం, తాళంల కలయికే పాట” అంటాడు. లాక్షణికులు నిర్వచనాలతో వేల పేజీలు రాసిన గ్రంధాలు లైబ్రరీలో భద్రంగా వుంటాయి. వేల పేజీలు రాయనక్కర్లేదు. సురేష్ మాటలకే నరాలు ఉప్పొంగుతాయి. అతడు ఓ వైవిధ్యమైన ప్రజారంజకుడు. థియేటర్ డైరెక్టర్.
“లెల్లె సురేష్ – పాట ఆత్మ కథ” నిర్మించిన తీరు సంభాషణాత్మక శైలిలో నడుస్తుంది. ఇందులో పూర్తి స్థాయి జీవితాన్ని ఆవిష్కరించాడని కాదు, కొన్ని ఘట్టలైనా లోతుల్లోకి దూకి స్వచ్చమైన జ్ఞాపకాలను పట్టుకొచ్చాడు. ప్రతి ఒక్క వాక్యంలో మనం గుర్తు చేసుకోదగ్గవి, గత ఎన్నేళ్ళుగానో చర్చించుకున్నా ఇంకా మిగిలే వుందనిపిస్తుంది. ఒక దళిత జీవితం తాలూకు అనేక కోణాలను స్పృశించాడు సురేష్. అతని సంభాషణలు వింటుంటే మనకు తెలుసులే అన్నట్టు వుంటుంది. మనం సాధారణంగా ఏర్పరుచుకున్న కొన్ని విలువలను కూలదోసేవిగా వుంటాయి. కానీ, అతడు మాట్లాడే కొత్త మాటలవల్ల, కొత్త అర్ధాలు స్పురించి మనకొక ఓదార్పును, నమ్మకాన్ని కలుగజేస్తాడు సురేష్. ఈ ‘పాట ఆత్మకథ’ ఖచ్చితంగా ఒమ్మి రమేష్ చేసిన ఒక కొత్త ప్రయోగం. రాబోయే కాలంలో నాలాంటి ఎంతో మందికి తమ జీవిత శకలాలను ఆవిష్కరించుకునే అవకాశం కలుగుతుంది.
– కళ్యాణ్ కత్తి
Dear Kalyan, many thanks for your association. also thank you for reconnecting me to the days we lived. నీవన్నట్టు అవి బ్రతికిన క్షణాలు. మన జ్ఞాపకాలలో బ్రతుకుతున్న క్షణాలు . Suresh
లెల్లె సురేష్ అన్నతో ప్రయాణించినది చాలా తక్కువ సమయం. ఒక ప్రేక్షకుడిగా నేను ఆయన అభిమానిని. ఆయన గానామృతానికి నేను బానిసిను. ఆ పాటలని మళ్లీ మఌ వింటూ ఉంటాను. అనుకోకుండా `Differently Abled Peoples Collective’ లో Exectutive Member గా అన్నతో కలసి పనిచేయడం గొప్ప అనుభవం. ఈ ఇంటర్వూ చదివాను కానీ అది నాకు పాటలాగే వినబడుతుంది.
Dear Suresh Anna, thank you very much for your comment and love .