ఈరోజు ఉదయం నుంచీ నాకు రాధిక బాగా గుర్తుకు వస్తూంది. చిన్నప్పటి నుంచీ పక్క పక్క ఇళ్లేమో, పైగా ఇద్దరికీ నెలల తేడా మాత్రమే కావడంతో, ఇద్దరం కలిసే పెరిగేము. తన సంగతులే కాదు, దాని వస్తువులు కూడా ఎప్పటికప్పుడు నాతో పంచుకునేదా పిచ్చిది! ఇద్దరం ఎంత అల్లరి చేసేవాళ్లమని! దాన్ని రౌడీ అనీ , నన్ను కేడీ అనీ స్కూల్లో మా స్నేహితురాళ్లందరూ ముద్దుగా నిక్ నేమ్స్ పెట్టేసేరు.
పదో క్లాసులో ఉన్నప్పుడు లెక్కల పరీక్ష కి నేను టెన్షన్ పడుతూంటే , మంచి మనసులు సినిమాలోని ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే’ పాట ఎస్పీబీ బాగా పాడేడని, జానకి వర్షను వేస్టు అని ఆర్గుమెంట్ మొదలెట్టింది. ఏం కాదు జానకి ముందు ఎస్పీబీ ఆఫ్ట్రాల్ అని నేను వాదిస్తూ, దాదాపు జుట్టూ జుట్టూ పీక్కునే లెవెల్ కి వెళ్లిన తర్వాత చెప్పింది …’లెక్కల పరీక్షనువ్వు బాగానే ప్రిపేర్ అయ్యేవు.. పరీక్ష ముందు ..ముఖ్యంగా లెక్కల పరీక్ష ముందు కూల్ గా ఉండకపోతే ..లెక్క తప్పేస్తుంది’ అనేసెళ్లి పడుకుంది. అది చెప్పింది నిజమే ..దాని లెక్క తప్పలేదు ! ఇద్దరికీ నూటికి నూరు మార్కులు వచ్చేయి!
ఇంటర్లో ఉన్నప్పుడు చెప్పింది ..’ఒసే.. మన ఇంగ్లీష్ లెక్చరర్ మోహనరావు మాటిమాటికీ నాతో మాట కలపడానికి ప్రయత్నిస్తున్నాడే ‘ అని. ‘నాకు తెలుసు ..నేను గమనించేను’ అన్నాను.
‘కాదే బాబూ .. నిన్న ల్యాబ్ నుంచి వస్తూంటే అడ్డంగా వచ్చి చెప్పేడు
..నాకు ఇష్టమైతే మా ఇంట్లో మాట్లాడతాడట.. ఇష్టం లేదంటే ఉరేసుకుని చచ్చిపోతాడట ..భయమేస్తూందే’ అంటూ కళ్ళల్లో నీళ్లు!
‘నీ మొహం ..ఈ మాత్రం దానికి భయం ఎందుకు? చస్తాను అని అంటున్నాడు అంటే చాలా ధైర్యం ఉండాలి ..వాడి ధైర్యం ఏమిటో చూపిస్తాను ‘ అని ఆ రోజు సాయంత్రం కాలేజి అయ్యాక, ఆ మోహనరావు స్కూటర్ తీస్తూంటే దూరం నుంచి ఓ కంకర్రాయి విసిరేను..అది అతని ముక్కు మీద తగిలింది ..గట్టిగా గోల పెడుతూ అటూ ఇటూ చూసేడు కానీ చెట్టుకొమ్మల్లో దాక్కున్న నేను వాడికి కనపడలేదు. కొంతకాలం పాటు ముక్కుకి ఆపరేషన్ అని లీవులో తిరిగేడు. ఆ తర్వాత కాలేజీ కి వచ్చిన అతన్ని రాధిక,
‘సర్ ..ఇన్ని రోజులు మీరు కాలేజి కి రాకపోయేసరికి మీరు పోయేరేమో అనుకున్నాను ..బతికే ఉన్నారా ?’ అని అడిగేసరికి, మళ్ళీ దాన్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు అతను!
ఆ తర్వాత ఇద్దరం కలిసి ‘తెలుగు వారి హక్కు బీటెక్కు’ అని కలిసి నినదించి, మంచి ర్యాంకులు తెచ్చుకుని కాలేజీలో చేరిపోయేము. నేను ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే, తాను కంప్యూటర్స్ తీసుకుంది. ఫైనలియర్ లో ప్రణవ్ అని వాళ్ళ క్లాసుమేట్ తో ప్రేమలో పడింది. మా ఇంట్లో నా వెనకాల ఇంకా ఇద్దరు చెల్లెళ్లు, పైగా నేను ఉద్యోగం లో చేరడం మా ఇంటికి చాలా అవసరం కావడంతో , నాకు ఎప్పుడూ ప్రేమ/పెళ్లి ధ్యాస లేదు.
ప్రణవ్ సంగతి నాతో తానే చెప్పింది. చాలా సంతోషం అనిపించింది నాకు. ఎందుకంటే, చాలా మంది అబ్బాయిల్లా కాదు.. జీవితం అంటే ఓ ఫోకస్ ఉన్న మనిషి! పైగా రాధిక వాళ్ళ కాస్ట్ కావడంతో, ఇంట్లో కూడా పెద్ద ఇబ్బంది ఉండదు అని చెప్పేను దానికి. ఫైనలియర్లో క్యాంపస్ సెలెక్షన్ లో ఉద్యోగం రాగానే, తన లైఫ్ పార్టనర్ సెలెక్షన్ గురించి కూడా ఇంట్లో చెప్పేసింది. పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే, ఇద్దరి ఇళ్లలో పెళ్ళికి ఒప్పుకున్నారు !
ఉద్యోగం లో చేరిన ఏడాదిన్నర కి ప్రణవ్ తో రాధిక పెళ్లి జరిగింది! వాళ్ళ ఇద్దరి మధ్య సంగతులు, సరదాలు, గొడవలు అన్నీ ఎప్పటికప్పుడు చెప్పేస్తూండేది, అప్పటికీ చాలా సార్లు చెప్పేను ‘కొంచెం ఎదగవే బాబూ .. ప్రతీదీ నాకు చెప్పక్కర్లేదు ‘ అని, అయినా ‘నీకు చెప్పకపోతే నాకు మనసులో ఏదో గ్యాప్ ఉన్నట్లు ఫీలింగ్ ఉంటుందే’ అని నా మాటలు కొట్టిపడేసింది.
అది ప్రెగ్నన్సీ తో ఉన్నప్పుడు చెప్పింది, ‘సరదాగా మనిద్దరం కాలేజ్ రోజుల్లోలా.. క్లాస్ ఎగ్గొట్టి సినిమా కి వెళ్లినట్టు, ఆఫీస్ ఎగ్గొట్టి చట్నీస్ లో లంచ్ కి వెళ్లి, అట్నుంచి సినిమా చూసి, బుద్ధిగా ఎవరింటికి వాళ్ళు పోదాం’ , నాకు భలేగా నచ్చిందా ఐడియా!
ఆ రోజు, దాని కబుర్లలో చాలా వరకూ ప్రణవ్ గురించే చెబుతూ ఉంది. అంతా విని ‘చాలా అదృష్టవంతురాలివి నువ్వు ‘ అన్నాను. ‘నిజమే బాబూ.. ఇవాళ ఉదయం, నా డెలివరీ గురించి మాట్లాడుతూ, ‘నీ డెలివరీ మంచిగా జరగాలి.. నీకు ఏమైనా అయ్యిందంటే, నువ్వు పోయిన వారం లోపే నీ దగ్గిరకి వచ్చేస్తాను ‘ అంటూ ఏడ్చేసేడు .. చాలా సెంటిమెంటల్ తను..’ అని రాధిక అంది!
మా ఇద్దరి మధ్యా ఈ సంభాషణ జరిగి ఏడాది కావొస్తూంది..తను వెళ్ళిపోయి పది నెలలు!
అసలు ఇవాళ తను ఎందుకు గుర్తుకు వచ్చిందో చెప్పలేదు కదూ ..ఇవాళ ఉదయాన్నే ప్రణవ్ మా ఇంటికి వచ్చేడు , ‘మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను’ అంటూ !
*
మీ కథలో ఆఖరి పేరా కోసమే చదువుతాను
ఎప్పుడూ ఆర్థత తడియారకుండా ఉండటం
గ్రేట్
ఎప్పుడూ ఇలానే రాస్తూ మా అందరినీ
అలరిస్తూ ఉండాలి
కీపిట్ అప్ 👌👍👏