చీకటి పడుతున్న కొద్దీ ప్రాణం బిక్కు బిక్కు మంటూ ఉంది శ్వేతా కు.. తెలీకుండానే ఏ. సి. రూమ్ లో కూడా ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. బయట హాల్ లో టి. వి. శబ్దం ఇంకా వినిపిస్తూ ఉంది. కరోనా వైరస్ ఎక్కడెక్కడ వ్యాపించింది, తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి, లాక్ డౌన్ ఇంకా పొడిగించే అవకాశం ఉందా, అంటూ న్యూస్ యాంకర్ చెప్పుకుంటూ పోవడం బెడ్ రూమ్ లోకి వినిపిస్తూనే ఉంది.
నిన్న ఎలాగోలా తప్పించుకుంది.. తన్నులు తినింది అనుకోండి, అది వేరే విషయం, కనీసం ఆ రాక్షసుడి అహానికి బలి కాకుండా తప్పించుకుంది ఒక్క రాత్రికి.
చాలా మంది అనుకోవచ్చు దానికి దీనికి పెద్ద తేడా ఏంటి అని.. కానీ అతని పక్కలో పడుకోకుండా ఉండడం కోసం ప్రాణం పోయినా పర్లేదు అనిపిస్తుంది శ్వేతా కు.
పక్కనే తన తల్లి భయాందోళనలకు అతీతంగా హాయిగా పడుకుని ఉంది ఆరు నెలల రాగ. చిన్ని ప్రాణం ఊపిరి తీసుకున్నప్పుడల్లా మెల్లిగా కదిలే ఆ బుజ్జి పొట్ట. నిద్రలో ఉన్న బిడ్డ ను గట్టిగా గుండెలకు హత్తుకుంది శ్వేతా. మెల్లిగా కళ్ళు తెరిచి తల్లి మొహానికేసి చూసి ఒక బోసినవ్వు విసిరి మళ్ళీ నిద్రలోకి జారుకుంది రాగ. రాగ మెత్తని వెంట్రుకలలో మొహం దాచుకుంది కాసేపు.. ఆ పసి వాసన కాసేపు మనసుకు హాయిగా అనిపించింది.
ఇంతలో బయట టి. వి ఆగిపోయింది. మెయిన్ డోర్ లాక్ చేసిన చప్పుడు, ఆ వెంటనే స్విచ్ లు ఆపేసిన చప్పుడు. అతని నీడ గది కర్టెన్ మీద పడి, దగ్గరికొస్తున్న కొద్దీ విచిత్రంగా పెద్దదిగా అవుతుంది. దాంతో పాటే శ్వేతా వణుకు కూడా ఎక్కువ అవుతూ ఉంది. పైకి మాత్రం ఏమీ లేనట్టే, పడుకుని ఉన్నట్టే మొహం మీదుగా చెయ్యి పెట్టుకుని నిద్ర నటించసాగింది.
అతను నేరుగా బాత్ రూమ్ లోకి వెళ్ళాడు. అప్పటి దాకా ఉగ్గబట్టుకుని ఉన్న ఊపిరి గట్టిగా తీసుకుంది. బాత్ రూమ్ లో ఫ్లష్ ఐన చప్పుడు. శ్వేతా గుండె వేగం మళ్ళీ పెరిగింది.
ఈ పూటకు దుప్పటి కప్పుకుని అతను అటు తిరిగి పడుకోవాలని వేయి దేవుళ్ళకు మొక్కుకుంది మనసులో. అయినా తన పిచ్చి గానీ, మూటలు మోశాడా, ఏంటి అలసిపోయి పడుకోవడానికి? కనీసం అంతకు ముందు ఆఫీస్ కి వెళ్ళి వచ్చేవాడు. ఆ పది పన్నెండు గంటలు కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకునేది శ్వేతా. కానీ ఈ లాక్ డౌన్ పుణ్యమా అని ఎక్కడికీ కదలట్లేదు ఈ మనిషి. తీరిగ్గా పొద్దు పోయే దాకా పడుకోవడం, తను వంట చేసి పెడితే తినడం, టి. వి. ముందు కూచుని న్యూస్ అని, సినిమాలు అని టైం అంతా వెళ్ళబుచ్చడం. ఇంటి నుండి పని చేయడం కాబట్టి లాప్ టాప్ ముందేసుకుని కూచోవడం.
అతని స్నేహితులు ఫోన్ చేస్తే, జైలు లో ఉన్నట్టుంది అని కంప్లైంట్ చేయడం తన చెవిన పడింది. మరి ఇన్ని ఏళ్లుగా తను ఇంట్లో బందీ గా ఉందే, అది అతనికి కనిపించదా?
పాప ఏడిస్తే ఇంక చిందులు తొక్కడమే! అందుకే పాపను కిక్కురుమననివ్వకుండా ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంది శ్వేతా. చీమ చిటుక్కుమన్నా తప్పంతా శ్వేతా దే అన్నట్టు ప్రవర్తిస్తాడు. వంటలు బాలేవంటూ వంకలు పెడతాడు. పెనం మీది నుండి పొయ్యిలో పడినట్లుంది శ్వేతా పరిస్థితి. గట్టిగా ఊపిరి తీసుకోవడానికి కూడా భయంగా ఉంది.
తన కాళ్ళ దగ్గర పరుపు అతని బరువుకి కొద్దిగా గుంతగా అవ్వడం గమనించగానే శ్వేతా పై ప్రాణాలు పైనే పోయాయి. మెల్లిగా అతని చెయ్యి చీర లో నుండి తన తొడ మీదకి వెళ్ళింది. వెయ్యి పాములు, వెయ్యి జర్రులు ఒక్క సారిగా ఒంటి మీద పాకినట్టు అనిపించింది శ్వేతా కు. అయినా కదలకుండా నిద్ర నటిస్తూనే ఉంది. కానీ ఆ మనిషి రాక్షసత్వానికి తన ఒళ్ళు పడే వికారాన్ని ఎలా ఆపగలదు? శ్వేతా కాళ్ళు దగ్గరగా చేసుకోవడం అతనికి తెలీకుండా పోలేదు. ఒక్క సారిగా ఆమె పైట లాగేసి, తరువాత చెయ్యి కుచ్చిళ్ళ మీదకు పోనిచ్చాడు. ఒక్క ఉదుటున లేచి కూచుంది శ్వేతా. పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టుంది తన పరిస్థితి.
దాదాపుగా బతిమాలింది శ్వేతా, “నాకు కొద్దిగా ఒంట్లో బాలేదు.. టాబ్లెట్ వేసుకున్నా, నిద్రొస్తుంది.” అని. ఏ రోజూ తన మాటకు, ఇష్టానికి, సమ్మతికి విలువివ్వని వాడు, ఈ రోజు ఇస్తాడనుకోవడం మూర్ఖత్వమే. కానీ వింటాడేమో అని ఏదో మూల చిన్న ఆశ.
ఏ మాత్రం లెక్క చేయకుండా తనని వెనక్కి తోసేసి మోటుగా తన మీద పడ్డాడు. పక్కకి తోయడానికి శ్వేతా చేసే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తాను పోరాడే కొద్దీ ఎలాగైనా తన కోరిక తీర్చుకోవాలనే అతని మొండితనం ఎక్కువయింది.
ఈ పెనుగులాట లో పక్కనే గాఢ నిద్రలో ఉన్న రాగ నిద్రలోనే ఏడవటం మొదలు పెట్టింది.
“పాప ఆకలితో ఉన్నట్టుంది. వదులు, ప్లీజ్!” మెల్లిగా బతిమాలింది శ్వేతా. సగం లో ఉన్న అతనికి చిర్రెత్తుకొచ్చింది. “రెండు నిముషాలు ఏడవనీ లే.” నిర్లక్ష్యం గా అన్నాడు అతను.
శ్వేతాకు ఒళ్ళంతా కంపరం పుట్టింది. పాప ఏడుపు ఎక్కువయ్యే సరికి ఎక్కడ లేని నిస్సహాయత పుట్టుకొచ్చింది శ్వేతకు. జబ్బల్లో బలమంతా ప్రయోగించి అతన్ని పక్కకు నెట్టేసింది. మరుక్షణమే శ్వేతా చెంప ఛెళ్ళు మంది. అప్పటికి కళ్ళు పూర్తిగా తెరిచిన రాగ ఒక్క సారిగా ఏడుపు ఆపేసింది. ఏ. సి. శబ్దం మినహాయించి చిక్కటి నిశ్శబ్దం.
అప్పుడతను ఆ చంటి పాప మొహానికేసి చూసి “ఇది పుట్టినప్పటి నుండే నీ నాటకాలు ఎక్కువైపోయాయి.” అంటూ రాగ ని కొట్టబోతూ చెయ్యెత్తాడు. వెంటనే శ్వేతా ఆ చెయ్యిని అలాగే గాల్లో పట్టుకుని “ప్లీజ్, పాపని ఏమీ అనొద్దు. నేను అటు తిరిగి పాప కు పాలిస్తాను. కావాలంటే నువ్వు వెనకకు రా.” అని దీనంగా అంది.
ఏడుస్తున్న రాగను సముదాయించి, పొదివి పట్టుకుని, జాకెట్ హుక్స్ విప్పి పాప నోటికి పాలు అందించింది. చిన్ని నోరు తెరిచి ఆబగా చప్పరించడం మొదలు పెట్టింది రాగ.
క్షణం ఆలస్యం చేయకుండా వెనక నుండి అతను ఆమెను ఛిద్రం చేయడం మొదలు పెట్టాడు.
నిశ్చింతగా పడుకున్న రాగను జోకొడుతూ, పంటి కింద దుఃఖాన్ని అదిమి పెడుతూ, వణికే గొంతు తోనే కూనిరాగం తీయసాగింది.
తన పని పూర్తి చేసుకుని ఎప్పుడో అటు తిరిగి పడుకున్నాడు అతను.
ఎలా తప్పించుకోవాలి? ఎక్కడికెళ్ళాలి? పుట్టింటికి ఎలాగూ తనను రానివ్వరు. పోనీ, ఇంత విషం తాగి ఛస్తే? ఆలోచనలు కంటికి కునుకు రానివ్వడం లేదు. ఒళ్ళంతా జేవురించినట్టు అనిపించింది. ఇంక తన వల్ల కాదు.. చావే మార్గం.. వెంటనే తన ఛాతి నంటిపెట్టుకుని పడుకుని రాగ ఉన్న సంగతి మర్చిపోయి చప్పున లేవబోయింది. తల్లి జుత్తు లోకి వేళ్ళు పోనిచ్చి బుజ్జి చేత్తో పిడికిలి బిగించి పడుకున్న రాగ, శ్వేతాను లేవనివ్వలేదు.
ఆ చిన్ని ప్రాణాన్ని చూడగానే, చావాలన్న ఆలోచన నీరు కారిపోయింది. తన మీద తనకున్న అసహ్యం మీద కూతురి పట్ల ఉన్న ప్రేమ గెలిచింది.
ఇంకా ఇలా ఎన్ని రాత్రులు పోరాడాలో.. అన్న ఆలోచనకే ఒళ్ళు తమలపాకులా వణికిపోయింది. కరోనా విముక్తి కోసం దేశవిదేశాల్లో పెద్ద పోరాటమే జరుగుతూ ఉంది. అతని నుండి విముక్తి కోసం తను పోరాడగలదా? తనకు ఆ ధైర్యం ఉందా? ఇలా ఎన్నాళ్ళు? అన్ని సమాధానం లేని ప్రశ్నల మధ్య.. ఎప్పటికో తెల్లవారు ఝాముకు నిద్రలోకి జారుకుంది శ్వేతా.
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
Chaalaa hrudyamgaa raasaaaru beautiful
I am glad you liked it, thank you, Mr. Venkat!
లాక్ డౌన్ అంటే చాలా మందికి హఠాత్తుగా వచ్చిన సెలవులనే తెలుసు, కానీ ఇలాంటి హింసా ప్రవృత్తి, ఆడవాళ్ళని కేవలం ఒక సంభోగ వస్తువు గా చూసే మగవాళ్ళు భర్తలు గా గల ఆడవాళ్ళ పరిస్థితి ని వారు అనుభవించే మానసిక, శారీరక క్షోభ ను , కూతురి ఆకలి, ఒక పశువు కామాకలిని కూడా ఒకేసారి తీరుస్తూ ఆమె మనసు పడే భావోద్వేగం ఇలా అన్ని భావాలని ఒక్కటంటే ఒక్క రాత్రి లో చాలా హృద్యంగా వర్ణించిన తీరు అభినందనీయం… మీ ఈ చిన్న కథ ఎంతో మంది అబలలు అనుభవిస్తున్న యథా ర్త గాథ…
Thank you so much, Pushyamitra garu!
చిన్న కథలో ఎంత చిక్కగా దృశ్యమానం చేసిన్రో. Hats off andi.