నాపేరు కంచర్ల శ్రీనివాస్. ఖమ్మంలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ ని. సాహిత్యంపై మక్కువ . సూఫీపేరుతో కవిత్వం రాశాను. లాక్డవున్ టైం నన్ను కథవైపు మళ్లించింది. గోర్కి,చేహోవ్, షోలోహోవ్, ఐత్మతోవ్, మంటొ కథలుచదివాను. ఇవికాక మా ఖమ్మం మితృల కథాసంకలనాలు విరివిగా చదవటం వల్ల నాకు కథ అబ్బింది. అదే సమయంలో ఒక ఆన్లైన్ పత్రిక నిర్వహించిన కథలపోటీలో పాల్గొన్నప్పుడు ద్వితీయ బహుమతొచ్చింది. అది నాలో విశ్వాసం కలిగించింది. తిమ్మాపురం బాలక్రిష్ణారెడ్ది స్మారక కథలపోటీవివరాలు అఫ్సర్ గారి పోస్ట్ ద్వారా తెలిసింది. బాగా టఫ్ కాంపిటీషన్ ఉంటుందని తెలుసు ఐనా ప్రయత్నిద్దామనుకున్నాను. అంశం గురించి చాలాకాలం వెయిట్ చేశాను. లాక్డవున్ కలిగిస్తున్న కష్టాలు సంచార, వలస జీవితాలపై చూపుతున్న ప్రభావంపై కథ రాద్దామనుకున్నాను. అలా ఆలోచిస్తూ వుంటే– నక్కలోళ్లు మనసులోమెదిలారు. జర్నలిస్ట్ గా ఈ సంచార కుటుంబాల దయనీయ జీవనంపై అనేక కథనాలు గతంలో రూపొందిస్తున్నక్రమంలో వాళ్లతో ఇంటర్వ్యూలుచేసిన అనుభవముంది. తాజాసమాచారంకోసం నెల్లూరులోఉన్న నాఫేస్బుక్ మితృల ద్వారా మరింతగా స్థానిక సమాచారం సేకరించాను. అలా ఈ వాస్తవిక వస్తువుపై కథనం అల్లుకున్నాను. వీరి లాక్డవున్ కష్టాలపై పై ఒక యూట్యూబ్ కథనం కూడా నాకు దోహదపడింది. వీటన్నిటినీ సమీకరించుకొని నాశైళిలో కథరాసుకున్నాను.
*
అక్కడదాదాపు వందగుడారాలు ఇరుకిరుకుగా ఓనాలుగైదు ఇల్లున్నాయ్.. పక్కనే ఉన్న రోడ్డుమీద ఏవోశవాలను పడుకోబెట్టినట్టు వాళ్ళఅంగళ్ళు గుడ్డలుకప్పున్నాయ్.. ఆప్రాంతంలో అంతా మహిళలే అధికంగా కనిపిస్తున్నారు.. కనీస నాగరికతలేని వాళ్లను కొత్తవాళ్ళుచూస్తే ఆటవికులేమో అని భ్రమపడతారు.. నల్లగా, జిడ్డుకారుతున్న మురికిముఖాలతో, జుట్టుదువ్వుకోకుండా నెలల తరబడి స్నానాలు చెయ్యకపోవటంవల్ల అపరిశుభ్రంగాఉన్నారు.. ఆకు వక్కలు నమిలే వాళ్లనోళ్లు ఎర్రెర్రగా, గార గారగా ఉన్నాయి కొందరుచంటిపిల్లలను చంకనేసుకున్నారు ఇంకొందరు భుజాలకు సంచులుతగిలిచ్చుకున్నారు డెబ్బయ్ ఎనభై ఏళ్ళ మహిళలూ హాఫ్ లంగాఓణీలు ధరించిఉన్నారు.
సూదులు, పిన్నీసులు మొలతాళ్లు, దువ్వెనలు, ఈరుపాన్లు, పౌడర్లు, తిలకాలు కాటుకలు, బొట్టుబిళ్లలు,కొతుల్ని తరిమే ఉండేళ్ళు తదితర వస్తువులు అమ్ముకొని పొట్టపోసుకుంటారు వాళ్ళు.. కరోనా లాక్డవున్ పేరుతో వాళ్ల అంగళ్ళను బంద్ చేయించి నెలలు దాటుతుండటంతో తీవ్ర తిండియాతనకు అనేక అవస్థలకులోనవుతున్నారు.. అంగళ్ళు తెరిచేందుకు యత్నించినా రోడ్డుమీద కాలుపెట్టినా పోలీసులులాఠీలకు పనిచెబుతుండటంతో వాళ్లపై కోపం ప్రదర్శిస్తున్నారు.
ఉచ్చపోసుకోటానికి పోయినకాడా పోలీసులే …యారగ బోయినకాడా పోలీసులే… పిండాలమీద కాకులువాలినట్టు ఈమొదనట్టపు నాబట్టలు మన బతుకులమీదకొచ్చి వాలారు..బహిర్భూమికోసం రైలు పట్టాలమీదకెళ్ళిన రాగిణిని ఒక మహిళాపోలీసు ఇటు రావొద్దంటూ అడ్దుకోవటంతో తన కోపం చూపుతోంది.. కోటీశ్వరుల ముడ్దిసుట్టున్నట్టు మన గుడారాల సుట్టుముసిరారీల్లు ..యాక్ థూ అని కాండ్రించి ఉమ్మేస్తూ అంది పక్క డేరాలో సుధ.. ఆకాకులు సచ్చినట్టు ఈఖాకీవోళ్ళెన్నడు జస్తరో దేముడా అంటూ దుమ్మెత్తిపోస్తూ శాపనార్దాలు పెడుతోంది జయప్రద.
ఏ..ఏం మాటలు..అట్ల అనగూడదు ఊరుకోండి ..నచ్చచెప్పే యత్నం చేసిండు వాళ్ల కులపెద్ద ఎర్రయ్య్… ఆమాట వినగానే చేతిలో ప్లాస్టిక్ చెంబవతలపారేస్తూ జయప్రద గిరుక్కున అతనివైపు తిరిగి ..వీపుకు అతుక్కుపోతున్న పొట్టబాదుకుంటూ మంట..మా కడుపుమంట సామీ… నువ్వు గుద్దబగలతిన్నదరక్క జెల్సిల్ మాత్రేసుకొని సల్లార్చుకుంటావే అట్టాంటి మంట గాదు…మాకాళ్ళు కదలనివ్వటంలేదన్నమంట మాచెయ్యాడనివ్వటంలేదన్న మంట..మాబొచ్చ్చెల్లో ..ఇగో మాబొచ్చెల్లో మట్టికొడుతున్నారన్న మంట ..సంటిపిల్లలకూ ఇన్ని మెతుకులు సంపాదించుకోనివ్వకుండా అడ్దుపడతన్నారన్న మంట అని ఏడుస్తూగుండెలు బాదుకుంటుండటంతో ఆమె చేతిగాజులు భళ్లున బద్దలవుతున్నాయి.
ఆళ్ళపెళ్లాలగాజులుకూడా ఇట్ల ఎన్నడు బద్దలైతయో మా ఉసురుకొట్టుకుపోతరు దొంగనాయాళ్ళు అంటూ ఆమెను ఓదార్చే యత్నం చేస్తోంది సుధ ఆమెదగ్గరికిఉరికొస్తూ…
వాళ్ళ డూటీవాళ్లు చేస్తన్నరు వాళ్ళూ మనలాంటి పొట్టకూటిగాళ్ళే పెబుత్వం ఏంఆర్డరేస్తే అదిజెయ్యాలె మన ఆవేదన నిజమే, ఆక్రోషం సబబే గానీ అట్లా తిట్టకూడదు వాళ్ళ సెవునపడితే కేసవుద్ది మళ్ళ అదో తలనొప్పి అంటూ వాళ్ళను శాంతపరిచేందుకు చూస్తున్నడు ఎర్రయ్య.. మామూలుగా అయితే కులపెద్ద మాట వాళ్లకు వేదవాక్కు కానీ ఇప్పుడుమాత్రం ఎవరిమాటా వినేస్థితిలోలేని ఆక్రందన వాళ్లది..అందుకే ఎర్రయ్య కూడా మౌనంవహించాడు వాళ్లను అర్థంచేసుకొని..
అమ్మా..ఆకలవుతోంది…అమ్మా ఆకలవుతోందని అంటంటె కథచెపుతూ జోకొడుతున్నావేంది అని చీమిడి ముక్కుతో తల్లికళ్లల్లోకి చూస్తూ అడుగుతోంది ఎనిమిదేళ్ళ నళిణి..తన బుగ్గలమీద కన్నీళ్ల చారికలు నూనెలేని తలజుట్టు అట్టలట్టలుగా విరబోసుకొని చిందరవందరగా ఉంది.. బిడ్డ తనకళ్లల్లోకి చూస్తున్నా తల్లి బిడ్డకళ్ళల్లోకి చూడటంలేదు..ఎటో చూస్తున్నట్టు నటిస్తూ కథ చెపుతోంది తనకు తెలిసిందికొంత అల్లిందికొంత కలిపి..తనఆకలి ఎందుకుతీర్చటం లేదని బిడ్ద అడుగుతున్న ప్రశ్నకు సమాధానం లేక కట్టుకథతో ఆపసిదాన్ని నిద్రపుచ్చాలనుకుంటోది..
ఏంట్రా నీ గన్ను పోలీసోళ్ళు పెరుక్కున్నారా..అయితే నువ్వేటి కాపలా కాస్తావు గన్నొచ్చేదాకా పనిమానెయ్ అన్నాడు రొయ్యలసెరువు ఆసామి..నక్కలోళ్ల రాముడు బతిమాలుతూ ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా కటువుగా కారెక్కివెళ్లిపోయాడతను..
గుడారంలో నెలల చంటిది గుక్కపట్టి ఏడుస్తోంది..ఆ పిల్లతల్లి గుడారాలన్నీ తిరుగుతోంది ఎవరన్నా ఏదన్నా తిండి సాయమో, పిల్లకు పాలసాయమో అవుతారని.. ఎందరినడిగినా ఫలితం లేకపోవటంతో గుడారానికి తిరిగొచ్చి తనరొమ్ముతీసి పిల్లనోట్లో పెట్టటంతో పిల్లవిపరీతమైన సంతోషంతో రొమ్మును నోటికి లంకిచ్చుకుంది..అమ్మకుమాత్రమే తన ఆకలితీర్చే శక్తుందని ఆచంటిదాని నమ్మకం..అమ్మ తనబొజ్జ నింపుతుందని ఆ చిన్నది ఆనందంగా చిట్టి కాళ్ళూపుతూ చీకుతున్నా ఎంతకూ పాలు రాకపోతుండటంతో ఆపిల్లకళ్లల్లో అమ్మఅనే ధైర్యం సడలుతోంది…కుక్కల్ని పందుల్ని పట్టే మొగుడికి మునిసిపాలిటీలనుంచి రావాల్సిన డబ్బురాలేదు.. అక్కడికి పోయి అడుగుదామంటే పోలీసులు పోనివ్వకుండా అడ్దుకుంటుండటంతో చంటిపిల్ల తల్లికి సరైనపోషణలేక ఆమె బిడ్దకుపాలు రావటంలేదు..
ఎవరో దాతలు అన్నం పొట్లాలు పంచేందు తెచ్చారు..ఆకలితో అలమటిస్తున్న ఆప్రాంత జనం గుడారాల్లోనుంచి బిలబిలమంటూ పరుగెత్తొస్తూ ఎగబడుతుండటంతో తోపులాట జరిగి అన్నం ప్యాకెట్లు కిందపడి మెతుకులు మట్టిపాలవుతున్నాయి..లైన్ పాటించండని ఎంత చెపుతున్నా జనం వినిపించుకోకుండా మీదిమీదకు తోసుకొస్తున్నారు లైన్ పాటిస్తే తమకు దొరకేదేమో అని ప్రతిఒక్కరూ అనుకుంటూ ఎగబడుతున్నారు.. పొట్లం దొరికినవాళ్ళూ మరో ప్యాకెట్ కోసం చేతులు చాస్తున్నారు ముగ్గురు నలుగురు పిల్లలు మరో ముగ్గురు నలుగురు పెద్దలుండే గుడారాలకు ఒక్క ప్యాకెట్ ఏ ఒక్క పేగుకూ చాలదు కనుక..లైన్ పాటించకుండా తోసుకొస్తుండటంతో వాళ్ళు తమను అంటుకుంటే కరోనా సోకే ప్రమాదముందని నిర్వాహకులు భయపడుతున్నారు తెచ్చిన ప్యాకెట్లనూ పూర్తిగా పంచకుండానే వెనుతిరుగుతున్నారు..చినిగి మట్టిపాలవుతున్న మెతుకుల్నిచూస్తూ..ఎర్రయ్య భార్య దాలి ఉరే..ఉరే దండం పెడతాను కొంచెం ఆలకించండ్రా..అడవులు కొట్టేయటం వల్ల ఊళ్ళల్లోకో అయ్ వే రోడ్లమీదకో చేరే కోతుల్లా ఏందిరా అన్నం పొట్లాలమీదికిట్లా ఎగబడటం.. కోతుల్ని చూసి దడుసుకున్నట్టే మనల్నిజూసి భయపడిపారిపోతన్నార్రా..ఆనాలుగుమెతుకుల సాయమూదక్కకుండా.. ఆఅన్నం పొట్లంఏగుడారంలో ఏబిడ్ద ఆకలికి అక్కరకొస్తుందో ఎవరికో ఒకరికి దక్కనియ్యండ్రా.. ఎంత కోతులు పట్టేవోళ్లమైనా కుక్కల్ని పట్టేవోళ్ళమైనా…వాటిలా పెవర్తిస్తామా…మన రూపకాలు కోతుల్లా కొండ ముచ్చుల్లా ఎందుకున్నాయో , మన బతుకులు అడివడిగా ఎందుకున్నాయో ఎవరికి అర్థం కావట్లేదు..ఈజనంముందు మనం వాటిలా ప్రవర్తిస్తుంటే మనంమనయ్యలకు కాదు ఆటికి పుట్టామనుకుంటార్రా ..అంటూ చేతులెత్తి దీనంగ వేడుకుంటొంది.
మరుసటి రోజు పోలీస్ వాహనమొస్తున్నట్టు గాలి సమాచారం మోసుకొస్తోంది.. బూట్ల శబ్దాలు లాఠీల గస్తీమోతలు రాత్రినుంచీ కొనసాగుతున్నాయ్..సైరన్ చప్పుడు మరింత దగ్గరవుతోంది.. పికెటింగ్ పోలీస్ డ్యూటీలు మారతాయంతే బిగపట్టిన మన గుడారాల గొంతు మహా అయితే ఒక గంటో రెండుగంటలో ఊపిరిసడలించబడుతుంది బీడీ తాగుతున్న రమేసు డేరాలోనుంచి చూస్తూ విరక్తిగా అనుకున్నాడు..
రెండుగంటలు కర్ఫ్యూ సడలించబడుతుంది మీకు కావాలసిన కిరాణ సరుకులు కూరగాయలు పాలు పండ్లు తదితర నిత్యావసరాలు కొనుక్కోండి…మీఅంగళ్లు మాత్రం తెరిచేందుకు అనుమతిలేదు మైక్ లో పోలీసులు ప్రకటిస్తుండటంతో…హ్మ్మ్..పాలు, పండ్లు, నిత్యావసరాలు.. అని దీర్ఘం తీస్తూ విరక్తిగా అంది గుబాలి అంత మందం మట్టి అలుముకున్న ఆమె ముఖంలోనూ విరక్తి స్పష్టంగా కనిపిస్తోంది….అయి కొనాలంటే మాదగ్గర డబ్బులేడియిరా..అమ్ముడయ్యే బతుకులు మాయి మేమెట్ల కొంటాం..మాఅంగళ్ళ పరదా గుడ్డ తియ్యనియ్యకుండా కుక్కల్ని తరిమినట్టు తరుంతుంటే ఇక మాచేతుల్లో రూపాయెక్కడిది..మీకు పున్నెముంటుంది మాఅంగళ్ళమీద గుడ్డలు కప్పించి తాళ్ళతో బిగదీయించినట్టు మా ఆకలి పేగులమీదా ఒక గుడ్డకప్పిచ్చి అట్టాగే బిగదీయించండంటూ వాపోతోంది.
పోలీస్ పికెట్ సెంటర్ కాడ మనిషికి అయిదు కిలోల రేషన్ బియ్యం పంపిణీ జరుగుతోంది..సాయం పేరుతో ప్రభుత్వం రేషన్ బియ్యం ఇస్తున్నప్పటికీ అన్నమొండుతే సంగటిలా మారుతోందంటూ సావిత్రి తన ఆవేశం గుమ్మరిస్తోంది..బాగుందిబాబు రేపుమాలో ఎవరన్నసస్తే మాపొట్టకోసినా, పంది పొట్ట చీల్చినా దున్నపోతులకడుపు చీరినా ఇయ్యే బియ్యం కానొస్తాయయ్యా..ఎందుకంటే మాకు పంచేయి ఆటికిపోసే బియ్యమే కదయ్యా…కానీ అయ్యా మా ముసలోళ్లకు ఆజంతువులకున్న అరుగుదలశక్తి లేదయ్యా ..అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటొంది.
పోలీసులు రోడ్డుమీద కాపలా ఉన్నా ఎలాగో తప్పిచ్చుకున్నాడు రాముడు..అదో మైదానప్రాంత వామపక్షపార్టీ కార్యాలయం.. లాక్డవున్ ఆంక్షలవల్ల కార్యకర్తలు సానుభూతిపరుల సందడిలేక నిర్మానుష్యంగా ఉంది.. విశాలమైన హాలులో అయ్యా..అన్నలేడుంటారు అనిరాముడిమాట మార్మోగటంతో ఆశ్చర్యపోయాడు ఆపార్టీ జిల్లా నాయకుడు…అతన్నుండి ఏసమాధానమూ రాకపోవటంతో తన ప్రశ్న పునరావృతం చేశాడు రాముడు.. అడవిలో అని నాయకుడు చెప్పగానే మాలాగే అన్నలకూ ఇండ్లు లేవు కదయ్యా అందుకే అడవుల్లో ఉంటారు..అది తెలుసు కానీ ఏఅడవో ఎక్కడుంటారో సెప్పిపున్నెం కట్టుకోండయ్యా అని చేతులు జోడిస్తూ ప్రార్దిస్తుండేసరికి ఇంతకూ వాళ్ళతో నీకేం పని అని చిరునవ్వుతో ప్రశ్నించాడు నాయకుడు.. గన్ను కావాలయ్యా..స్థిరంగా పలికాడు రాముడు.. ఎందుకు అన్నాడు నాయకుడు.. ఓట్లొస్తున్నాయని పోలీసోళ్లు నాగన్నుపెరుక్కున్నారయ్యా.. గన్ను లేకపోతే నానెట్టాబతికేది.. గన్ను సేతిలో ఉంటేనే నన్నెవుళైనా కుంటలకు కాపలాపనిలో పెట్టుకుంటరు సేపలు రొయ్యల కుంటలకు కాపలా ఉంటే ఒచ్చే రొండు నూర్లకు తోడు పిట్టల్ని కొట్టి అమ్మితే ఇంకో రెండునూర్లో మూడు నూర్లో వస్తయ్ ఆట్ని పెట్టి మాపిల్కాయ్ లకు జెల్కాయ్ లకు గెంజి పోసుకుంటం.. నా కుటుంబానికి నాలుగు మెతుకులు సంపాదిచ్చే గన్నును పెరుక్కోటమంటే నా సేతుల్ని ఇరిసేసినట్టే కాదా.. అని ఆర్త్రంగా మాట్లాడుతున్నాడు రాముడు.. అన్నలంటే అర్థం నువ్వనుకునేది కాదు అదో త్యాగం అదో అనిర్వచనీయం అన్నంటే ఆలివ్ గ్రీన్ చిహ్నం కాదు ఆపదానికి అర్దం తెలిసినోళ్లకంటే తెలీనోళ్ళే ఎక్కువలే అన్నాడు నాయకుడు అతన్నోదారుస్తూ.. లీగల్ గా నీసమస్య పరిష్కరించే మార్గం చూద్దాం లే సీఐ తో కానీ, ఆరొయ్యల వ్యాపారితో కానీ మాట్లాడుతాలే రెండురోజులాగిరా అంటూ అతన్ని పంపివేశాడు.
ఒకరోజు ఉదయం మహిళలు పురుషులతో కలిసి తమ అంగళ్ళు తెరిచేందుకు యత్నిస్తుండగా పోలీసులు అడ్దుకోవటంతో మహిళలు తీవ్రంగా ప్రతిధటించారు..ఈసందర్భంగా తోపులాట, వాగ్వాదం తలెత్తింది.. ఇన్నినెలల అసహనం బద్దకు కావటంతో మహిళలు కట్టలుతెంచుకున్న ఆవేశంతో పోలీసులను బూతులుతిడుతూ రోడ్దుపై బైథాయించి ధర్నాకు దిగారు.. ఆవిషయం టీవీల్లో ప్రసారమవుతుండటంతో ఎస్పీ అదేశం మేరకు డీఎస్పీ ఆప్రాంతానికెళ్ళాడు. దుకాణాలు తెరుస్తున్న వాళ్ళను అడ్దుకుంటున్నామన్న కోపంతో మహిళలు బూతులు తిడుతున్నారని వాళ్లను అరెస్ట్ చేసితీసుకెళ్దామని ఎస్ఐ శరత్ అంటుండగా…. డీఎస్పీ స్పందిస్తూ.. అన్నిరోగాలు ఒకే మాత్రతో తగ్గవు శరత్..అన్ని సంఘటనలను ఒకే కోణంలో చూడొద్దు వాళ్ళది ఆవేశం కాదు ఆక్రోశం.. వాళ్ళను చూస్తున్నావుగా నాగరికత తెలియనోళ్ళు.. సంస్కారవంతంగా మాట్లాడకపోవచ్చు.. వాళ్ళ ఆవేదనను భరించాలి పాలుపంచుకోవాలి మనం శతృవులం కాదు వాళ్ల మితృలమన్న నమ్మకం కలిగించాలి.. కొన్నిసార్లు మనం సహనం చూపాలి..ఫ్రెండ్లీ పోలీస్ ఆశయం అదేగా.. ఆదాయాలకోసం రోడ్దెక్కలేకపోతున్నామని కాదు వాళ్ళబాధ.. నిద్రపోటానికి ఫుట్ పాత్ మీదకో, ఫ్లైఓవర్ కిందకో, రైల్వే ఫ్లాట్ ఫారాలమీదకో బస్టాండ్లలోకో అనుమతికి నోచుకోకపోతున్నామన్న బాధ.. కోడి గంప లాంటి గుడారాలు వాళ్లవి.. రోడ్డే కిచెన్ రోడ్డే బాయ్ రూం, ఆరోడ్లే బెడ్ రూంస్.. స్నానాలెరుగని వాళ్ల శరీరాలను చూశావా..రోజుకో ఊరిలో ఊరికో చోటులో మట్టిలో మట్టిగా కలిసిపోయే వాళ్ళ ఒళ్లంతా పొరలు పొరలుగా ఊరూరిమట్టి..ఆపొరల్ని తాకితే వాళ్ళెక్కడెక్కడ సంచార బతుకుగడిపారో ఒకోపొర మాట్లాడుతుంది.. వాళ్ళ మెళ్ళల్లో చూశావుగా పగిలిపోయే పూసలు పనికిరాని దారాలు అవే వాళ్ళ నగలు … వీళ్ళు మార్పుచెందటం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు..కానీ వీళ్ళ ప్రత్యేక సంస్కృతిని ఆచార సంప్రద్యాలను తిరిగి బతికించటం ఎవరికీ చేతకాదు.. మళ్ళీ బతికించే యత్నం కంటే చావకుండా చూడటమే ఉత్తమం కదా..అని వివరిస్తూనే వాళ్ళ ఆందోళణ విరమింపచేశాడు.
సిలికా..పస్తీ.. జాతకమూ..జరిగింది జరగబోయేది ఠక్కున చెబుతుంది సిలికా అంటూ ఆ గుడారాల వెంట అరుపువినవస్తుండటంతో కొందరు ఆసక్తిగా ఆలకిస్తున్నారు.. నోటికి మాస్కు, చేతులకు గ్లౌజులు తొడుక్కొని ఉన్న అతన్ని కొందరు తలలు బయటపెట్టిచూస్తున్నారు..చిన్నపిల్లలు పంజరంలో చిలుకవైపు సంబరంగా చూస్తున్నారు.. ఆకులు నాకేవాడికి మూతులు నాకేవాడన్నట్టు అసలే అంతంత మాత్రపు ఆదాయల బతుకుల జనం గుడారాల వద్ద కొందరు ఇలాంటోళ్ళు యాచకులు తిరుగుతుండటం మామూలే కానీ లాక్డవున్ కాలంలో ఆగొంతు వినపడేసరికి ఆశ్చర్యపోతున్నారు వాళ్లు.. కోయదొర ఎవరెవరు గతంలో జాతకాలపట్ల ఆసక్తిచూపేవారో ఆ గుడారాల ముంగిట ఒక క్షణం ఆగి అరిచి ముందుకు కదులుతున్నాడు.. ఎంత అరిచినా ఎన్ని గుడారాలముందు గొంతు గంప దింపినా ఏ ఒక్కరూ రమ్మని పిలవకపోవటంతో..ఒక గుడారం వద్ద ఆగి ఓ..రంగమ్మ, ఉన్నవా లోపల, సిలిక ఒచ్చింది సిలిక ఎన్నాళ్ళాయె తల్లీ సూసి సిలికెకింత అన్నంపెట్టు పెశ్న అడుగు సెయ్యిజూస్త జాతకం చెప్పుత అని గొంతెత్తి తనదైన యాసలో పేరుపెట్టి పిలిచాడు..ఆపేరు అతను చిలుక ప్రశ్న ద్వారా తెలుసుకున్నది కాదు..గతంలో ఆ గుడారంలోని మహిళ అనేక సార్లు చెయ్యి చూపిచ్చుకుంది కనుక.
ఏం చెయ్యి సూపిచ్చుకుంటంలే కోయ రాజు..సేతుల్లో రూపాయాడక గీతలు దుమ్ముకొట్టుపోయుండాయ్ అరచెయ్యాఇది మట్టి, మట్టి అంటూ తన రెండుఅరచేతుల్ని గట్టిగా నలుపుతుండటంతో మట్టి నుసినుసిగా రాలుతోంది… ఇదుగో సూడు ఇప్పుడు చెప్పు ..మా బతుకుల్నాగంచేసిన ఈమాయదారి కరోనా ఎప్పుడొదులుద్దో చెప్పు.. మమ్మల్ని మరింత అంటరానోళ్ళను చేసి మా ఉసురుపోసుకుంటున్న ఈ కోవిడ్ రాచ్చసిఎప్పుడు సస్తదో చెప్పు..మా గుద్దసుట్టూ ఈపోలీసోళ్ళ పీడ ఎప్పుడొదులొద్దో అదిచెప్పు.. మా అంగళ్ళు ఎప్పుడు తెరుచుకుంటామో అది చెప్పు, మా పిల్లకాయలు జెల్లకాయలనోటికింత ముద్ద ఎప్పుడు తినిపిస్తామో చెప్పు, వాళ్ళు ఆకలి కడుపుతో కాక అన్నం తినే రోజెపుడొస్తుందో అదిచెప్పు.. మేవు అడుక్కునేవోళ్ళమి కాదు కోయరాజు మా బతుకేదో మేం బతుకేదో బతికెవోళ్ళం.. మా వల్లనే కరోనా సుట్టుకుంటదని ఎంత ఎలేశారయ్యా..అంటూ ఆమె ఇంకేవో ప్రశ్నలులు సంధిస్తోంది.
కోయదొర అప్పటికే అక్కడినుంచి కదిలి తలొంచుకొని పోతున్నాడు ఆమె అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చిలుక దగ్గరలేదు.. కొంత దూరం వెళ్ళాక ఏమనుకున్నాడో ఏమో పంజరం తలుపు తెరిచి చిలుకను రెండుచేతుల్లో పట్టుకొని అమాంతం గాల్లోకెగరేశాడు..అదికొరకగా మిగిలిన జామపండును తింటూఆకలి చల్లార్చుకుంటున్నాడు.. ఊహించని విధంగా పైకెగరేశాకచిలుక తనకూ రెక్కలున్నాయని ఆశ్చర్యపోతూ ఆఎత్తుమీదే కొంతసేపు గాలిచుట్టూతిరిగింది.
సమీపంలోని చెట్టుకొమ్మన వాలింది కోయదొర భుజంపైవాలాలని పంజరంలోకి తిరిగిచేరాలని అనుకున్నా..అతనాకలి అవస్థనుచూస్తూ అల్విదా పాడింది.
*
Add comment