లతా ఫల కుచ ద్వయి….    

యిదేళ్ల క్రితం ఆఫీస్ లో పని ముగించుకుని ఇంటికి బయలుదేరేను.  కారు డ్రైవ్ చేస్తూ రేడియోలో వార్తలు వినడం తన దిన చర్య. రోజూ వినే వార్తలే అయినా ఆ రోజు ఒక ప్రకటన నా మనసుకి తగిలింది. అది ఆ నెల అక్టోబర్ నెల కావడం మూలాన, అది బ్రెస్ట్ కాన్సర్ గుర్తించే నెల అని చెప్పి స్త్రీలందరిని తమంతట తామే స్వీయ స్తన పరీక్ష చేసుకోమని హెచ్చరించే ప్రకటన. తాను అడపా తడపా స్వీయ పరీక్ష చేసుకోవడం అలవాటే.  కానీ ఈ వార్త విన్నాక తను ఏదైనా చేయగలనా అని ఆలోచించేను.  తన పిల్లలిద్దరికీ చెప్పొచ్చును కానీ ఇంకా ఏదైనా చెయ్యాలని పదిమందికీ  సభ్యతగా ఎలా చెప్పాలా అని అనుకుంటూ ఇల్లు చేరేను .  ఇంట్లో వంట, భోజనాలు, అంట్లు తోమడం లో పడిపోయేను . రెండు మూడు రోజులు గడిచేయి.  అంతు  చిక్కకపోయినా ఆలోచన ఆగలేదు.

ఈ లోపల పది రోజులలో దసరా నవరాత్రులు మొదలవుతున్నాయని గుర్తువచ్చింది. బొమ్మల కొలువు పెట్టడం సంబరంగా నలుగురినీ పిలవడం తనకి అలవాటు. ఆ వారాంతంలో బొమ్మల పెట్టెలు దింపి, వాటిమీద దుమ్ము దులుపుతున్నప్పుడు ఓ బొమ్మని చూసి “నాభ్యాలవాల  రోమాళి లతా ఫల కుచ ద్వయీ”, అన్న లలితాసహస్రనామంలో ఓ పాదం గుర్తుకి వచ్చింది.  ఆ లలితా అమ్మవారే తన్ని వెన్ను తట్టి చెప్పినట్టుగా ధైర్యం వచ్చింది.  బ్రహ్మాండపురాణంలో లలితోపాఖ్యానములో ఆవిడ స్థనాలని అంత  విశదంగా వర్ణించినప్పుడు తను వాటి గురించి చెప్పడంలో తప్పేమిటి?  పండగేమో ఆదిశక్తి స్వరూపిణి లలితా అమ్మవారి పండగ. బొమ్మల పేరంటం ముఖ్యంగా ఆడవాళ్లు పిల్లలు చేసుకునే పండగ.  తన మనసులో ఉన్న ఆలోచనని అందరితో పంచుకోవడానికి ఇదే  మంచి అవకాశం.  బొట్టు పెట్టి  తాంబూలం ఇస్తూ వచ్చినవారందరికి ఈ విషయం చెప్తే ఓ పదిమందికైనా తెలుస్తుంది కదా అనుకున్నాను . నా  ఆలోచనని భర్తా, పిల్లలకి చెప్పేను .  వాళ్ళు కూడా మంచి ఆలోచన అని దోహదం చేశారు.

ఆలోచనకి కాస్త సమయం పట్టినా అమలు పెట్టడానికి ఆలస్యం ఎందుకు.  వెంటనే తాంబూలం ఇచ్చే కాగితం పొట్లాల మీద ఎర్ర పెన్నుతో బ్రెస్ట్ కాన్సర్ చిహ్నం అయిన “రిబ్బన్ బో “ ని రాసేం  .  పేరంటానికి వచ్చిన వాళ్లందరికీ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేటప్పుడు వాళ్ళకి బ్రెస్ట్ కాన్సర్ గురించి చెప్పి స్వీయ పరీక్షలు తఱచు చేసుకుంటూ ఉండమని చెప్పేను .  కాన్సర్ ప్రాణాంతక రోగం అయినా అన్ని క్యాన్సర్ల లోకి బ్రెస్ట్ కాన్సర్ని అరికట్టడానికి మందులు కనిపెట్టేరు కనక దాన్ని ముందుగా గుర్తుపట్టడం అన్నది కీలకం. ఆ బాధ్యత మనదే కానీ మరెవ్వరిదీ కాదు.  వైద్యుల దగ్గరికి ప్రతి నిత్యం వెళ్లలేం కదా! అందువల్ల మనం పాటించగలిగిన జాగ్రత్తలు మనం చెయ్యాలని హెచ్చరించేను .  కొంత మంది ఇబ్బందిగా చూసేరు, కొంతమంది మంచి సలహా అన్నారు, మరికొంతమంది అమ్మవారి పండుగలో స్త్రీల ఆరోగ్య విషయం మాట్లాడడం సబబుగా ఉందన్నారు.   ఏదైతేనేం, తాను విన్న విషయం పదిమందికి చెప్పాలన్న తన తపన ఫలించింది అని సంతృప్తిగా పండగ గడిపేను  .  ఆ తర్వాత, ప్రతి ఏడాది దసరాల్లో అలాగే చేసే ను.  చెప్పిన విషయమే అయినా మళ్ళీ మళ్ళీ గుర్తు చేయవల్సిన విషయంకదా. నేను మాత్రం అకౌంటింగ్ శాఖ లో పనిచేయడం వల్ల అక్కడ క్వార్టర్లి గోల్స్ లాగా నేను కూడా మూడునెలలు కొకమారు స్వీయ పరీక్ష చేసుకుంటూనే  ఉన్నాను.

అల్లా ఐదేళ్లు గడిచేయి. ఎప్పటిలాగానే ఓ రోజు తాను చేసుకునే స్వీయ పరీక్షలో ఎదో చిన్న కంతి లాంటిది తగలింది.  అనుమానాస్పదంగా మళ్ళీ చూసుకున్నాను . ఈ మాటు ప్రస్ఫుటంగా తగిలింది. తక్షణం వైద్యుల దగ్గరికి వెళ్లడం, రకరకాల పరీక్షలు చెయ్యడం, చివరికి కాన్సర్ అని తేలడం చకచకా జరిగి పోయేయి. కానీ ముందుగా కనుక్కోవడం వలన, కాన్సర్ ఎక్కువ పెరిగి ముదరలేదని, మొదటి దశలో ఉందని ,  ఆ కంతిని శస్త్ర చికిత్సతో తీసేసి ఆ తర్వాత మందులు వేసుకుంటే, ఇప్పటికి పూర్తిగాతగ్గవచ్చని  అన్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు ప్రతి వైద్యుడు నువ్వు చాలా ఆరోగ్యవంతురాలివి నీకు నయమయ్యే సూచనలు బాగా ఉన్నాయి అనడం వింతగా తోచింది.  నిజంగా ఆరోగ్యంగా ఉంటె మీతో ఎందుకు మాట్లాడుతున్నాను అన్నాను .  వారి ఉద్దేశ్యంలో నాకు ఇతర జబ్బులేవీ, అంటే గుండెపోటు ,  రక్తపోటు, మధుమేహం లాంటివి  లేకపోవడం నా అదృష్టమని నేను చేసిన యోగ, తదితర వ్యాయామాలే నన్నురక్షించేయని అంటుంటే  నవ్వొచ్చింది. 

ఆలోచిస్తే మతి పోయినట్టుగా ఉంది.  ఎలా ఇలా జరిగింది. ఇలా జరుగుతుందని ముందు తెలిసినట్టుగా స్వీయ పరీక్షల ప్రచారం చెయ్యాలని ఎందుకు అనిపించిందో ?  నలభై ఏళ్ళు క్రమం తప్పకుండా చేస్తున్న యోగాభ్యాసం, వ్యాయామం వల్ల ఉపయోగం ఏమిటి? ఆరోగ్యానికి మంచిదని ప్రతి రోజు ఆదిత్య హృదయం చదువుకున్నందుకా  ఈ  శిక్ష? నిరంతరం ఆ తల్లిని నమ్ముకుని ప్రతి నిత్యం లలితా సహస్ర నామ పారాయణ చేసినందుకు తల్లి ఇచ్చిన వరమా?  “శ్రీ రామ మమ్ము చేపట్టుకొమ్ము, ఆదుకోరమ్ము ఆరోగ్యమిమ్ము” అన్న రామదాసు కీర్తన పాడుకున్నందుకా ఈ అనారోగ్యం?  జుట్టు రంగులో కెమికల్స్ ఉంటాయని తెల్ల జుట్టుతో ధైర్యంగా తిరిగినందుకు ప్రతిఫలం ఇదా? ఎన్నడూ టాల్కమ్ పవుడర్ వాడనందుకు జరిగిన శాస్తా ఇది?  తాజా కూరగాయాలే వాడి ఎప్పటికప్పుడు వండుకు తిన్నందుకు ఇదా నాకు జరిగిన ఉపకారం?  ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని శ్రమలూ ఎందుకు పడ్డానా ఆని ఆలోచిస్తూ, వచ్చిన జబ్బుకి బాధపడాలో,  తగు సమయానికి గుర్తు పట్టి వైద్య సహాయానికి వెళ్లినందుకు సంతోషపడాలో తెలియని అయోమయంలో పడ్డాను . ఎన్ని చేసినా  కాన్సర్ తప్పించుకోలేకపోయేనుగా అన్నతపన వదలడంలేదు!

ఆలోచనలని కుదుటపరచడానికి ప్రయత్నంచేస్తున్నసమయంలో ఆ తల్లి మీద మనసు నిలిపి ధ్యానం చేస్తుండగా,   “రోగ పర్వత దంభోళి మృత్యు దారు కుఠారికా”  అన్నట్టు రోగాన్ని , మృత్యుభయాన్ని ఛేదిస్తుందని, “జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతి దాయిని” అన్నట్టు జరామరణ తప్తహృదయులకి విశ్రాంతి నిచ్చే  తల్లి ఎదురుగుండా కనిపించింది.    అయిదేళ్ల క్రితం ఏ తల్లి తనని తట్టి లేపిందో అదే తల్లి ఇప్పుడు స్వీయ పరీక్షవల్ల నాకు జరిగిన మహోపకారాన్ని నలుగురికి చెప్పే బాధ్యత నా మీద ఉన్నాదని తన చెయ్యిపట్టి పైకి లాగినట్టయింది.   తను నమ్ముకున్న ఆ తల్లికి , ధైర్య సాహసాలకు మారుపేరయిన తన తల్లికి  వేయి నమస్కారాలు పెట్టేను.  నా మార్గం స్పష్టంగా కనిపించింది. అందుకే ఈ నా అనుభవం మీ ముందుంది.

*****

ఫలశృతి:  వ్రతంచెడ్డా ఫలం దక్కాలన్నట్టు ఈ  కథ చదివిన వారందరూ తప్పకుండా ఎదో ఒక వ్యాయామంతోపాటూ  స్వీయ స్తన పరీక్షలు చేసుకుంటూ, ఎప్పుడైనా అనుమానాస్పదంగా తోచిన వెంటనే వైద్యసహాయం కోరవలసిందిగా మనవి.  స్త్రీ పురుషులిద్దరూ చేసుకోవాలని కూడా చెప్తున్నారు.  అంతేకాకుండా మీకు తెలిసిన వారందరికీ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను .  స్వీయ పరీక్ష చేసుకునే పధ్ధతి ఈ క్రింద లంకెలో తెలుసుకోవచ్చును. ఎనమండుగురిలో ఒక స్త్రీకి, వేయిమందిలో ఒక పురుషుడికి స్తన కాన్సర్ వస్తుందని అంటున్నారు. ఇది అందరి మీద ఉన్నటువంటి సామజిక బాధ్యత.  ఈ  సామాజిక స్పృహకి  అందరూ దోహదం చేయాలి.  ఏకాదశి వ్రతం, అమావాస్యవ్రతం లాగా స్వీయ స్తన పరీక్షావ్రతం తీసుకుని దాన్ని నియమబద్ధంగా చేసుకోవడం వెంటనే మొదలు పెడతారని నమ్ముతున్నాను.  

https://www.mayoclinic.org/tests-procedures/breast-exam/about/pac-20393237

అపర్ణ మునుకుట్ల గునుపూడి

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా మంచి పని చేశారు. అందరికీ అవగాహన కల్పించడం వలన కొంతమందిలో అయినా అవగాహన తీసుకురాగలిగారు. మీ ఆలోచనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను

  • అపర్న గారి రచన ఓ కధగా కాని సలహాగా కాని తీసేసేదికాదు. అధరూ ఆచరించ తగినది. అలా అని కొన్నీ ధనాశ వైద్య శాలలగురిచి తెలుసుకొని పరిక్షలు చెయిచు కోవడమచిది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు