రైతు కన్నీటి ఉప్పదనం

ఇది రైతుకు ఆత్మస్ధయిర్యాన్నిచ్చే కవిత్వం.

రైతెప్పుడూ ఓడిపోలేదు. రైతెప్పుడూ గెలవలేదు కూడా. గెలుపో ఓటమో తెలియని చిక్కుముడిలో చిక్కుకున్న రైతు గురించి రాయాలంటే కవికి ఏం తెలియాలి. రాలిన కంకుల డొల్ల చప్పుడు తెలియాలి. చినుకు కోసం చాచిన నాలుక మీద కురిసిన ఎండ నిప్పులవాన గురించి తెలియాలి. పంట ధరకు కన్నం వేసిన పాలకుల దొంగనవ్వు రూపం తెలియాలి. విత్తుముందో చెట్టుముందో తేల్చే కుతర్కం కాక చెమట చుక్క రుద్రతాండవ జన్మరహస్యం తెలియాలి. అవన్నీ పులికొండ సుబ్బాచారికి తెలుసు. అందుకే అవన్నీ కలిపి రైతు మహాభారతం సృష్టించగలిగారు.

రైతు నశించాలి. రైతు భూస్థాపితం కావాలి. రైతు మరణించాలి…. అనాదిగా అనేకానేక వ్యవస్థల క్రూర నినాదాలివి. అందుకు అనుగుణంగానే ఒక సందర్భంలో పెత్తందారులు, మరొక వేళ చేపలచెరువులు, ఇంకొక కాలంలో రియల్ ఎస్టేట్లు, మరో సమయంలో ఎమ్మెన్సీలు, మరింకొక సీజన్ లో నకిలీ క్రిమిసంహారకాలు, కృత్రిమ హరిత బలవర్ధకాలు వ్యవహరిస్తూ తమ తమ కర్తవ్య నిర్వహణ చేస్తూనే వున్నాయి. రైతును మరణానికీ జీవనానికీ నడుమ జీవచ్చవం గా మిగిల్చే దుర్మార్గాన్ని విజయవంతంగా ఆ వ్యవస్థలు అమలుపెడుతూనే వున్నాయి. కరిమబ్బుల మారువేషాలను చూసి ఆశతో పచ్చా పచ్చని బతుకులను పొలాలలో పారబోసుకున్న రైతు చెమట కన్నీరును అర్థంచేసుకోకుండా రైతును కవిత్వీకరించడం కష్టం. రైతు భుజం మీది నాగలి చారికలు అతని రాచరిక హోదాను ఎరుకపరుస్తాయన్న నానుడి కాస్తా అవి కేవలం గాయాలేనని తేల్చిన కాలపు వేదనను అక్షరీకరించడం గుండె కింద తడి తెలిసిన కవికి మాత్రమే సాధ్యం. ఏరువాక సాగడంలో గొప్ప శ్రమానుభూతి ఉన్నా, దుక్కిదున్నడంలో  గొర్రు సాగడంలో పంట నూర్చడంలో మహా రసానందం ఉన్నా ఈ గణాంకపు  శేషం మాత్రం నిండు సున్నాయే. చివరకు మిగిలేది గుండె పట్టని విషాదమే. ఆ రసానంద ఘడియల్లోనూ ఆ విషాద క్షణాలలోనూ రైతుకు నైతికంగా అండగా నిలబడింది కవులే. వరికంకి కులుకులను కవీత్వీకరించినా, కళ్లాలు కన్నీరుపెట్టిన కఱకు దృశ్యాన్ని కళ్ళకు కట్టినా సాహిత్యకారులే. ఇప్పుడు మన పులికొండ సుబ్బాచారి కూడా అదే చేసారు. ఎంతో అద్బుతంగా చేసారు.

మహాభారతం అంటేనే బొంకు, కుళ్ళు, కుత్సితం, కుట్ర, రణ విషాదం. మహా భారతం అంటేనే అంతులేని నాటకీయత. మహాభారతం అంటే యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్క్వచిత్.  ఇందులో ఉన్నది అంతటా ఉంది, ఇందులో లేనిది ఎక్కడా లేదు అని అర్దం..  కనుక రైతు శ్రమయానాన్ని పులికొండవారు మహాభారతంతో పోల్చి రైతు మహాభారతం అని శీర్షిక నిచ్చారు. కేవలం శీర్షికనిచ్చి వదిలేయలేదు, పర్వాల విభజన సంఖ్యలోనూ, పర్వాల శీర్షికల విషయంలోనూ, శీర్షికలకు అనుగుణమైన అంతస్సారంలోనూ మహాభారత స్థాయి నాణ్యతను నింపారు. ఈ రైతు మహాభారతం కూడా అంతే. ఇందులో ఉన్నది ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది ఎక్కడా లేదు.

నిజానికి సాహిత్యకారులకు రైతు ఎప్పుడూ అత్యంత ప్రియమైన ఇతివృత్తమే. వానమామలై జగన్నాధాచార్యులు  మొదలుకుని గుంటూరు శేషేంద్ర శర్మ వరకూ ఏటుకూరి వెంకటనర్సయ్య క్షేత్రలక్ష్మి నుంచి దువ్వూరి రామిరెడ్డి క్రుషీవలుడు వరకూ శ్రమవేదం ఎప్పుడూ కవననాదమే. అయితే కథాత్మక రూపంలో వచన దీర్ఘ కవితను చెప్పిన కవుల సంఖ్య చాలా తక్కువ. కథగా కవనగానం చేయడం ఒక మంచి ప్రక్రియ. అయితే అదంత సులభమైందేమీ కాదు. దుక్కి దున్నడం మొదలు పంట నూర్చేవరకూ ఎంత కష్టం ఉందో కధాత్మక కవనం వినిపించడం వెనుక కూడా అంతే కష్టం ఉంది. ఇప్పుడు సుబ్బాచారి రైతు మహాభారతం పేరిట చేసిన ఆ ప్రయత్నం విజయవంతం. ఈ కథలో కష్టమూ పోరాటమూ గెలుపోటములూ విశ్వాస వికాసాలే పాత్రలు.

ఒక ఆశాభావంతో మొదలై ఎత్తుపల్లాల గమనంతో ఎండు నేలను పంట చేనుగా మార్చి పోరాటానికి నడుం బిగించీ గెలిచి ఓడి ఓడి గెలిచి ఆస్వాదించీ దుఖ్కపడీ చివరకు విజయంతో గింజఫలాన్నిహత్తుకున్న కొన్ని కోట్ల మంది రైతుల జీవన యానం ఈ రైతు మహాభారతం. ఆదిమరైతు ఆక్రుతి, శ్రమజీవి విశ్వాసాల దైవత్వాలు, రైతే కవిగా అవతరించిన క్షణం, విత్తనం మూట ఉత్సవ విగ్రహమైన మధురోహలు, మోసమే మొలకెత్తిన ధాన్యపు రాశై నిరాశై నిలిచిన కన్నీళ్లు, నగలూ నేలా పొలమూ పుట్రా తాకట్టుగా మిగిలిన విషాదమూ, ప్రకృతీ, చట్టసభలూ, శాసనాలూ చుట్టుముట్టిన పద్మవ్యూహపు అభిమన్యుడి ధీశక్తీ, దుఖ్కంలోంచి పుట్టిన పోరాటపు సెగలు నిప్పులు చిమ్మి విజయంగా అవతరించిన సానుకూల ముగింపూ….ఒక పర్వపు ముగింపు తరవాతి పర్వపు ఆరంభమై ముక్త పర్వగ్రస్త నిర్మాణ సౌరభంగా మహాభారత పర్వాలై రైతు కావ్యం ఆవిష్కృతమయాయి.

ఈ కావ్యంలో రైతు చుట్టూ పరుచుకున్న సౌందర్య వర్ణన ఉంది. రైతు లోపల పిగిలే వేదనకు కవితా రూపం ఉంది. రైతును దోచుకునే వర్గాల దౌర్జన్య ఖండన ఉంది. రైతుకు పోరాటం తప్ప మరో మార్గం లేదనే హెచ్చరిక ఉంది. ఆ పోరాటం విజయవంతమయి తీరుతుందన్న వెన్నుతట్టు కూడా ఉంది. ఇవన్నీ కలగలిసి కావ్యానికి ఒక సమగ్రత నిచ్చాయి. ఒక నిండుదనాన్నిచ్చాయి. కేవలం విషయాన్ని ముడిసరుకుగా చెప్పుకుంటూ పోవడమే కాక ‘ఓ స్వతంత్ర భారతమా ఒక రోజు సెలవు పెడతావా నీ వెన్నెముకను ఆర్దోపెడిక్ హాస్పిటల్ లో చూపించాలి’ అని కవిత్వంగా మార్చడంలో అదీ వ్యంగ్యంగా ఒక విసురు విసరడంలో కవి తన సామర్ద్యాన్ని చూపారు. ‘ఉత్తర చూసి ఎత్తర గంప’ ‘అశ్వని కురిస్తే అంతా నష్టం’ ‘ఆరుద్ర ఉరిమితే ఆరువానలు పాడు’ అని రైతే కాళిదాసైన సాహిత్య వ్యవసాయాన్నీ కవి గొప్పగా కావ్యీకరించారు. సాగు సంబంధిత పదబందాలనూ, సాహిత్య అనుబంధ ప్రతీకలనూ రంగరించి కవి రైతుకు నైతిక జవజీవాలనిచ్చే ప్రయత్నం సమగ్రంగా సాగించారు.

రైతు గురించి చాలా మంది ఆధునిక కవులు కేవలం కన్నీళ్లు పెట్టి సాధ్యమైనంత అతిగా ఉపమానాలు ఉపమేయాలను గుమ్మరించి గంపలకొద్దీ సానుభూతిని నింపి వహ్వా అనిపించుకునే ప్రయత్నమే చేసారు. సాగులోని శ్రమ సౌందర్యాన్నీ, వ్యవసాయంలోని ఘర్మజల భారాన్నీ, రైతుకు ఇవ్వాల్సిన కూసింత నమ్మకాన్నీ, వ్యవసాయదారుడు విప్లవించడానికి అందించాల్సిన ఆయుధాలనూ సమపాళ్లలో కలిపిన కావ్యాన్ని సుబ్బాచారి అందించారు. ఇటీవలి ఢిల్లీ రైతు ఉద్యమం నేపధ్యంలో అక్కడక్కడా ఒకటీ అరా కవితలైతే వచ్చాయి కానీ రైతు గురించి ఆందోళన వ్యక్తం చేసిన  దీర్ఘ కావ్యం మాత్రం కచ్చితంగా ఇదొక్కటే. అందుకు సుబ్బాచారిని అభినందించి తీరాలి. నిజానికి రైతును మించిన శిల్పి లేడు. ప్రతి మొక్కనూ శ్రద్దగా చెక్కి ధాన్యశిల్పంగా మార్చగల శక్తి అతనిది మాత్రమే. నిజానికి రైతును మించిన చిత్రకారుడు లేడు. ప్రతి రంగునూ చిక్కని పచ్చదనంగా మార్చగల కుంచె అనే హలధారుడతడు. నిజానికి రైతును మించిన కవి లేడు. ప్రతి గింజకూ ప్రతీకల ఊపిరులూది పదచిత్రాల ప్రాణం పోసి కవిత్వంగా మార్చగల కళాకారుడతడు.

అల్పాహారం కెఫెటేరియాలో, అన్నం ముద్ద రెస్టారెంట్ లో పుట్టుకొస్తుందని భ్రమించే తరానికి పూర్వం ఏనాడో రైతు శ్రమలో మమేకమైన పులికొండ సుబ్బాచారికి కళారహస్యం తెలుసు. రైతు కన్నీటి ఉప్పదనం తెలుసు. కనుకనే భారతీయ రైతు భారతం కొంచెం నీరై కొంచెం నిప్పై రగిలింది.

ఇది రైతు ఓటమి పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత్వం. ఇది రైతు గెలుపును బలంగా ఆకాంక్షించిన కవిత్వం. ఇది రైతు నశించకూడదనీ, రైతు భూస్ధాపితం కాకూడదనీ, రైతు మరణించకూడదనీ కోరుకుంటున్న కవిత్వం. ఇది రైతుకు ఆత్మస్ధయిర్యాన్నిచ్చే కవిత్వం.

*

ప్రసేన్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రైతు భారతం లోని అన్ని కోణాలను చక్కగా విశద పరిచారు.

  • ఏ జానర్ పాఠకులైన రైతు గురించి సాహిత్యంలో చదువుకోవడం ఎల్లప్పుడు ఇష్ట పడతారు.

    ఆధునిక ప్రక్రియలో రైతు భారతాన్ని ఇచ్చిన
    పులికొండ సుబ్బాచారి గారికి కృతజ్ఞతలతో

    ఒక రైతు బిడ్డ.

  • ప్రసేన్ గారి విశ్లేషణ చదివాక, ఇక ‘రైతు భారతం’ చదివి తీరాల్సిందేనని నిర్ణయించుకున్నాను.
    మంచి పుస్తకాన్ని పరిచయం చేసిన ప్రసేన్ గారికి నమస్సులు.
    ‘రైతు భారతం’ రాసిన పులికొండ సుబ్బాచారి గారికి అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు