“అరె, నేను ఏమన్నానండీ. అంత సీరియస్ అవుతారెందుకు?” సుజిత్ తేలిగ్గా నవ్వబోయాడు.
“చెప్పానుకదా, నన్ను పేరుతోనే ప్రస్తావించండి. అంతే.” మల్లిక గొంతులోని తీవ్రతకి సుజిత్ కూడా అంతే తీవ్రంగా అన్నాడు.
“మేడమ్, మనం చిన్నప్పుడు భాష నేర్చుకుంటూ నామవాచకాలు, సర్వనామాలు అంటూ నేర్చుకున్నాం. ప్రతిసారీ పేరు చెప్పక్కర్లేకుండా సర్వనామాల్ని వాడతాం. నేను అదే చేసాను ఇప్పుడు. అందులో అంత తప్పు ఏముంది?’
“తప్పొప్పుల గురించి నేను మాట్లాడటం లేదు. నా విషయం వచ్చినప్పుడు మాత్రం ఆవిడ, ఆమె అంటూ చెప్పకండి. మొదట్లోనే ఈ విషయం ఆఫీసులో అందరికీ చెప్పాను.” మరింక మాట్లాడేదేం లేదన్నట్టు తన సీట్లో కూర్చుంది మల్లిక.
ఆఫీసులో అందరం లంచ్ రూం లోంచి వస్తుంటే జరిగిందా సంభాషణ. మల్లిక అందరితో స్నేహంగా ఉంటుంది. కానీ ఎవరూ మాట్లాడేందుకు సమయం, సందర్భం కాదిది.
సుజిత్ ముఖం రంగులు మారిపోయింది. రహస్యం ఏదీ లేనట్టు నిర్భయంగా సుజిత్ పక్క వాళ్లతో మాట్లాడుతున్నాడు.
“నేను అంత కాని మాట ఏమన్నానని. ఆడవాళ్లని ఆమె అనో, ఆవిడ అనో అంటాం. పేరుతోనే పిలవాలని ఈవిడ కండిషన్ ఏమిటో. పైగా ఇంగ్లీషులో చక్కగా ‘దె’ అని వాడకం ఉంది, తెలుసుగా అంటుంది. ఈవిడ చదివిందండీ కాన్వెంట్ చదువులు. మాకు తెలుగూ రాదు, ఇంగ్లీషు అసలే రాదు. అసలైనా నాకు అర్థం కాదు, పెద్ద విషయమేదో ఉందన్నట్టుంది. మీకెవరికైనా అర్థమైందా?” సీరియస్ గా ఉన్న వాతావరణంలో అతని మాటల్లోని ధ్వనికి శబ్దం లేకుండా నవ్వులు కనిపించాయి అందరి ముఖాల్లోనూ. అందరూ మల్లిక వైపు యథాలాపంగా చూసినట్టే చూసి తల తిప్పుకుంటున్నారు.
సుజిత్ ఆఫీసులో అందరికీ అడిగినా అడక్కపోయినా సాయం చేసేందుకు ముందుకొస్తాడు. అతనికున్న ముక్కుమీద కోపం మాత్రం చుట్టూ ఉన్నవాళ్లని ఇబ్బందుల్లో పెడుతుంటుంది. ఒక్కసారిగా మూడ్ మారిపోయే సుజిత్ ఇన్నేళ్లుగా చూస్తున్న నాకే కొత్తగా అనిపిస్తాడు. మల్లికతో అందరికంటే స్నేహంగా మసులుతాడు, అంతలోనే ఇలా మాట్లాడాడంటే నమ్మశక్యం కాదు.
మల్లిక మాత్రం కంప్యూటర్లో తలదూర్చి సీరియస్ గా పని చేసుకుంది. ఒక గంట ముందుగానే పర్మిషన్ తీసుకుని వెళ్లిపోయింది. తను ఇన్నేళ్లూ పనిచేసిన అర్బన్ బ్రాంచీలలో ఇలాటి తలనొప్పి ఎప్పుడూ ఎదురవలేదేమో. చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్తున్నా మనుషుల ధోరణి మారకపోవటంతో ఈ రోజు బర్స్ట్ అయి ఉంటుంది. చేరిన మొదట్లోనే తనను పేరుతో మాత్రమే పిలవమని చెప్పింది. ఆ కండిషన్ కొత్తగా అనిపించినా ఎవరూ ఏమీ అనుకోలేదు. ఎప్పుడూ ట్రౌజర్స్, టాప్స్ తోనే కనిపిస్తుంది. అనవసరంగా బిడియపడటం లాటివి తనలో అస్సలు కనిపించదు. ఇన్నేళ్లూ పెద్దపెద్ద సిటీల్లో చేసి వచ్చింది, అందుకని కాస్త భిన్నంగా ఉంటుందని అనుకున్నారు. అందరితో కలిసిపోయే మల్లిక పట్ల ఎవరికీ వ్యతిరేకత కలగలేదు.
సుజిత్ కూడా ఎప్పటికంటే ముందుగానే ఆఫీసు వదిలాడు.
***
రాత్రి భోజనాల దగ్గర ఎప్పటిలా అమ్మతో పాటు అందరం కూర్చున్నాం. సాయంకాలం మనుకి, తనకి మధ్య జరిగిన విషయాన్ని అమ్మ కదిపింది.
అమ్మ మాటలకి సాయంకాలం జరిగినదంతా చక్కగా దృశ్యమానమయ్యేలా చెప్పాడు మను.
‘నానమ్మా! నువ్వు రేసిస్ట్” మనోజ్ హోం వర్క్ ముగించి ఆటలకి బయలు దేరుతున్నవాడల్లా వంటింటి వైపు నుంచి వినబడుతున్న మాటలకి పరుగెత్తుకొచ్చాడు.
అమ్మ కి ఒక్క నిముషం ఏమీ అర్థం కాలేదు.
“రేసిస్ట్ ఏమిట్రా?” అంది.
ఆవిడ మరీ చదువుకోనిదేం కాదు. రోజూ న్యూస్ పేపర్ చదువుతుంది. చిన్నప్పుడు హైస్కూల్ లో చరిత్ర పాఠాలు చదువుకుంది. జాతుల మధ్య యుద్ధాల గురించి చదువుకుంది. ఇంతకీ తనంత కూడని మాట ఏమందని మనవడు అంత మాట అనేసాడు ఆవిడకి అర్థం కాలేదు.
వీధి గుమ్మంలోంచి స్నేహితుడి కేక విని “వచ్చాక చెప్తాను నానమ్మా.” అంటూ క్రికెట్ బ్యాట్ పట్టుకుని బయటకు పరుగెత్తాడు.
పెరట్లో ముగ్గేస్తున్న మంగతో ఇందాక చెప్పిన మాటనే మళ్లీ చెప్పింది,
“నీ కూతురికి మొన్న చూసిన ఆ పొట్టి పిల్లాడి సంబంధం ఖాయం చేసెయ్యండి. నీ కూతురే ఓ పిసరు పొడుగుందేమో అంటున్నావు. ఇది మాత్రం నల్లని నలుపు కాదూ. ఏడాదిగా చూస్తున్నావు, ఒక్క సంబంధం కుదరలేదు. ఈ పిల్లాడు పొట్టి అయితే ఏం, మిగిలిన వాళ్లల్లాగా పిల్ల రంగు గురించి నస పెట్టలేదు. శుభ్రంగా సంపాదించుకుంటున్నాడు, బుద్ధిమంతుడంటున్నావు. పిల్ల పది ప్యాసై రెడీమేడ్ ఫ్యాక్టరీలో పని చేస్తోందని ఇష్టపడుతున్నాడంటున్నావ్.”
‘’అయితే నువ్వు నానమ్మని రేసిస్ట్ అన్నావా?’’ మను సమాధానం కోసం చూసాను.
“అవును నాన్నా, ఎవరి గురించైనా అలా తక్కువ చేసినట్టు మాట్లాడితే అది రేసిజం అవుతుందని మా టీచర్ చెప్పారు. పొట్టి, పొడుగు, నలుపు, తెలుపు, లావు, సన్నం అంటూ ఎదుటి వాళ్లల్లో కనిపించే శారీరక లక్షణాల్నో, మరేవైనా విషయాల్నో గురించి అలా ఎత్తిచూపి మాట్లాడకూడదని, అది నేరమని చెప్పారు.”
“అలా పొట్టిపిల్ల అనో, నల్ల పిల్లాడనో అన్నంత మాత్రాన రేసిస్ట్ లు అయిపోరురా.”
“అవుతారు నాన్నా. కావాలంటే మా భవాని టీచర్ని అడుగు. ఆ పదానికి చాలా చాలా అర్థం ఉందని చెప్పారు.” టీచర్ మాటల్ని సమర్థిస్తూ మళ్లీ గట్టిగా చెప్పాడు.
“అయితే మాటలకి ఇలాటి తీవ్రమైన అర్థాలు కనిపెడుతున్నారన్నమాట.” మను తో ఇలా అన్నాను కానీ, సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో వోక్ కల్చర్ గురించి వింటూనే ఉన్నాను.
“ఏమోనర్రా, వాడన్న మాట నాకు అర్థం కాలేదు. రేస్ అంటే జాతి అని, ఒక జాతిని కించపరిచేట్టు మరో జాతి వాళ్లు ప్రవర్తించటం నేరం అని తెలుసు. అలాటి వాళ్లని రేసిస్ట్ అంటారనుకుంటాను. ఇప్పుడు రేసిస్ట్ అంటే అర్థం మారిపోయిందేమిటి?”
నిన్న కాక మొన్న జార్జ్ ఫ్లాయిడ్ మరణాన్ని, ఆ దురదృష్టవంతుడి ఆఖరి క్షణాల్ని వార్తల్లో, వీడియోల్లో చూసింది. జాతి, రంగు, మతం, ప్రాంతం భేదాలు లేకుండా వెల్లువెత్తిన చైతన్యంతో ప్రపంచమంతా నిరసించటాన్ని చూసింది.
ఆవిడ తరం వాళ్లు రేసిజం ఒక్క జాతుల మధ్య వైరం గురించే అనుకోవటంలో తప్పులేదు. వాళ్ల కాలానికి మనుషుల మధ్య వ్యత్యాసాల పట్ల అవహేళనలూ, ఆక్షేపణలూ లేవని కాదు. కానీ ఇలాటి వ్యతిరేకతలు తెలియవు. ఎన్ని శతాబ్దాల క్రితంది జాతి విద్వేషం! ఈ కాలానికీ గాఢంగా ఎలా మనగలుగుతోంది?
“నానమ్మా, ఇందాక నిన్ను అలా అన్నందుకు కారణం చెపుతానన్నాను కదా. దానికి తగినట్టే సాయంకాలం క్రికెట్ ఆడుతుంటే ఇద్దరు గొడవపడ్డారు. ఓడిపోయిన టీంలో శ్రావణ్ గెలిచిన టీంలో వాళ్లని చాలా అవమానకరంగా మాట్లాడాడు. “మీకు చదువులు రావులేరా. కనీసం ఆటలన్నా ఆడుకుని బతకొచ్చులే” అన్నాడు. వాళ్లకి కోపం వచ్చి, వాళ్లూ పిచ్చిగా మాట్లాడారు. ఒకరిని ఒకరు కులం పేరుతో, మతం పేరుతో తిట్టుకున్నారు. అందరం స్నేహితులమే. ఈరోజు మాత్రం చాలా గొడవ అయిపోయింది.
రేసిస్ట్ అన్న పదం వివక్షపూరితంగా మాట్లాడిన ఎవరికైనా వర్తిస్తుంది నానమ్మా. నువ్వు అంబేద్కర్ గురించి చదువుకుని ఉంటావు. ఆయన కులం, మతం పేరుతో జరిగే వివక్ష మీద ఎంత పోరాటం చేసారు! ఇప్పటికీ అవన్నీ ఎక్కువగా ఉన్నాయి. అందుకే మళ్లీ మళ్లీ ఎక్కడ ఎటువంటి వివక్ష ఎదురైనా పోరాడవలసిందే. అదే మా భవాని టీచర్ చెప్పారు.”
మను వివరణకి అమ్మ నవ్వేసింది.
“బాగా చెప్పేవురా. కానీ నేను వాళ్ల రంగునో, ఎత్తునో వెక్కిరించట్లేదు. సలహా అడిగిందని మంగ చెప్పిన ఆనవాళ్లని బట్టి చెప్పాను.”
“అవునమ్మా, ఇప్పుడు ప్రతి విషయానికి అది చిన్నదైనా, పెద్దదైనా పోరాట దారి పడుతున్నారు. అసలు ఒక విషయం చిన్నదో పెద్దదో నిర్ణయించటం కూడా ప్రశ్నే. వ్యక్తుల మధ్య ప్రేమ, పరస్పర గౌరవం లేకపోవటం వల్లనే మరింత సెన్సిటివ్ అయిపోతున్నారు.
గతంలో జరిగిన పోరాటాలు భవిష్యత్తు తరాలకు పూర్తి భద్రతను కల్పించ లేవు. కాలం, మనుషులు మారినా సంకుచితత్వాలు ఎప్పుడూ ఉంటాయి. కొన్ని పోరాటాలు, కొన్ని విప్లవాలు, కొన్ని త్యాగాలు, కొంతకాలం కారుచిచ్చులా నడిచే చైతన్యం అంతలోనే కనుమరుగై పోతుంది. అదంతా మరుపులోకి జారిపోతూ, ఆ మంట పూర్తిగా ఆరినట్టనిపించినా, అంతలోనే మరో కోణంలో మరో రకమైన హింస, విద్వేషం! దీన్ని నిత్యాగ్నిహోత్రంలా రగిల్చే శక్తులు ఎప్పుడూ అన్ని సమాజాల్లోనూ ఉంటూనే ఉన్నాయి. అందుకని వాటిని అంతే తీవ్రంగా ఎదుర్కోవాలన్నదే ఇప్పటి వాదన.”
అమ్మ శ్రద్ధగా వింది. మనుకి నా మాటల సారాంశం అర్థమయ్యేఉంటుంది.
అలవాటుగా రాత్రి భోజనాలు ముగించాక పాత హిందీ సినిమా పాటల్ని విశ్లేషిస్తూ అన్నూకపూర్ అందిస్తున్న ‘’గోల్డెన్ ఇరా” ముందు కూర్చున్నా మనసు మాత్రం ఇక్కడ లేదు.
వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాటిని మౌనంగా సర్దుకుపోయే వాళ్లున్నా వాళ్లూ ఎప్పుడో ఒకసారి బయటపడతారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే తలనొప్పులు వేరెవరో పరిష్కరించేవి కావని, తాముగానే చెక్ పెట్టాలన్నది తెలిసినా దానికోసం రోజూ ఘర్షణ ఎవరు పడతారు?
ఎన్నేళ్ల క్రితమో రాష్ట్రం కాని రాష్ట్రంలో కొత్తగా స్కూల్ లో చేరిన తనని కనీసం పేరైనా అడగకుండానే “మదరాసీ” అంటూ సంబోధించేవారు క్లాసులో తోటిపిల్లలు. మేం మదరాసీలు కాదు, దక్షిణాదిన మదరాసు కాకుండా ఇంకా రాష్ట్రాలున్నాయంటే ఎవరూ వినేవారే కాదు. దశాబ్దాల క్రితం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని గురించి, అస్తిత్వాన్ని గురించి దేశానికి చెప్పిన ఎన్టీఆర్ గురించి కూడా తెలియనట్టు ప్రవర్తిస్తే ఏం చెప్పాలి? స్కూల్ నుంచి వచ్చి తను రోజూ గొడవ పెడుతుంటే అమ్మ మాత్రం,
“చిన్నా, మదరాసీ అంటే అదేం తప్పు మాట కాదు. దానికోసం నువ్వు రోజూ అందరితో తగవులు పెట్టుకుంటే ఎలా? వాళ్లకి విసుగెత్తి మానేస్తారులే” అంటూ చెప్పే మాటలు తనకి రుచించక అమ్మతోనూ తగవు పడేవాడు.
“వాళ్లకి తెలియని విషయం ఒకటి ఉందని చెప్పినప్పుడు వినకపోతే ఎలా? నాకు ఒక పేరు ఉంది కదా. కనీసం అలా పిలవాలన్న ఇంగితం లేకపోతే నేను ఊర్కోలేను.”
అమ్మ తమ చిన్నప్పుడు స్నేహితురాళ్లందరూ ఎంత సఖ్యంగా ఉన్నా ఏవో తుంటరి పేర్లతో అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు వేళాకోళాలు చేస్తుండేవారని, ఆ విషయం తెల్లారేసరికి మర్చిపోయి అందరూ కలిసిమెలిసి ఆడుకునేవారని చెప్పి ఓదార్చేది. అప్పట్లో స్వంత ఊరు విడిచి బయట ప్రాంతాలకి వెళ్లి జీవించాల్సిన అవసరం ఉండేది కాదు.
ఎవరో ఎక్కడినుంచో వచ్చి లాభపడుతున్నారేమో అన్న దుగ్ధ, కొత్తగా వచ్చిన వ్యక్తుల పట్ల అపనమ్మకం వారిని ఎప్పుడూ ఆమడ దూరం పెడుతూనే ఉంటోంది.
గేమ్స్ పీరియడ్ లోనూ, కల్చరల్ ఆక్టివిటీస్ పీరియడ్ లోనూ తనని విడిగా చూస్తుండేవారు. “మీ మదరాసీలకి ఎటూ మాకంటే మార్కులు ఎక్కువే వస్తాయి. ఇక్కడ కూడా మాకు పోటీ వస్తే ఎలా” అంటూ ఏ పోటీల్లో పేరిచ్చినా తనతో గొడవ పెట్టుకునేవాళ్లు. టీచర్లు కూడా అదేదో తమాషా విషయంలా తేలిగ్గా తీసుకునేవారు. తన ఉక్రోషం వాళ్లూ అర్థం చేసుకునేవారు కాదు. బహుశా వాళ్లకీ తను బయట నుంచి వచ్చిన వ్యక్తిగా ఎక్కడో ఒక వ్యతిరేకత ఉండేదేమో.
దాదాపు ఆరునెలల తన పోరాటం వాళ్లంతా తనని అర్థం చేసుకుందుకు సాయపడి వాళ్లని మంచి మిత్రుల్ని చేసి, అందమైన జ్ఞాపకాల్ని మిగిల్చింది.
ఇదంతా పోరాట ఫలితమే అంటే అమ్మ కాదంది. వాళ్లే క్రమంగా దగ్గరయ్యారని, తను రోజూ చేసిన రభస అనవసరమనీ చెప్పింది. ఇదంతా నేను మర్చిపోలేదు. ఇప్పటి పిల్లల ఆలోచనలు తెలుసుకుందుకే మనుతో సంభాషణ పొడిగించాను.
తొమ్మిదోక్లాసు చదువుతున్న మను చక్కగా చెప్పాడు. ఇప్పుడున్నకాలమాన పరిస్థితుల్లో ప్రపంచం మరింత నిర్దయగా తయారైంది. మనుషుల మధ్య నమ్మకం మాయమై, ఒకరికొకరు ఏమీకాని వాళ్ళైపోతున్న ఈ కాలానికి ప్రతి మాట, ప్రతి వ్యక్తీకరణ, ప్రతి చూపు మరేవోవో అర్థాల్నిస్తోంది. హక్కుల కోసం మళ్లీ మళ్లీ పోరాటాలు చెయ్యవలసిందే. భవాని టీచర్ తన స్టూడెంట్స్ కి సరైన మార్గదర్శకత్వం ఇస్తోంది.
రాత్రి పదయింది. ఎవరికి వాళ్లు నిద్రలకి ఉపక్రమిస్తున్నారు. ఫోన్ మోగింది. సుజిత్!
“అశోక్…” అతను ఆగాడు. నాకర్థమవుతోంది అతనిలోని ఘర్షణ.
“చెప్పు” అన్నాను.
“సారీ, చాలా లేట్ గా చేసాను. కానీ ఇప్పుడే మాట్లాడాలి.”
“ఫరవాలేదు. చెప్పు.”
“నా పెద్ద కొడుకు ఫోన్ చేసాడు. వాడు ఈ రోజు నాకిచ్చిన షాక్ చిన్నది కాదు… సుజిత్ చెపుతూనే ఉన్నాడు…టి.వి. కట్టేసి అతన్ని విన్నాను.
సుజిత్ కొడుకు ముంబై లో చదువుకుందుకు వెళ్లి ఇంకా ఆరునెలలు కాలేదు. వాడు ఎలాటి స్నేహాలకి దిగుతాడో అని సుజిత్, అతని భార్య కూడా బెంగ పెట్టుకున్నారు. సీనియర్లు ర్యాగింగ్ పేరుతో చిన్నచిన్న ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు చాలా సహాయం చేస్తున్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు ప్రతి సారి ఫోన్ చేసినప్పుడు తన సీనియర్ ప్రీతి చాలా ఆప్తురాలైందని కొడుకు చెప్తూంటే అది ఏ ప్రేమ వ్యవహారంలోకి దిగుతుందో, చదువు నిర్లక్ష్యం చేస్తాడేమోనని సుజిత్ కొడుకుని గట్టిగానే హెచ్చరిస్తున్నాడట.
ఈ రోజు ఆఫీసులో జరిగిన విషయం తో సుజిత్ మూడ్ బావులేదు. కొడుకు ఫోన్ లో మాట్లాడుతుంటే ప్రీతి గురించిన ప్రస్తావన వచ్చేసరికి సుజిత్ ఊర్కోలేదు. తీవ్రంగా మాట్లాడబోతే, అవతల నుంచి సావధానంగా కొడుకు జవాబు ఇచ్చాడట,
“నాన్నా, ప్రీతి లెస్బియన్. ఆమె దగ్గరి స్నేహితులందరికీ తెలుసు. నువ్వు అనవసరంగా ఖంగారు పడకు” అన్నాడట. కొడుకు మాటలకి సుజిత్ లో సాయంత్రం నుంచి సలుపుతున్న అపరాధభావం ఇంకా పెరిగిపోయింది. ఆఖరుగా,
“అశోక్, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కళ్లు తెరుచుకు చూస్తున్నా ఎందుకు అర్థం చేసుకోలేకపోయాను. రేపే మల్లికని క్షమాపణ అడగాలనుంది. కానీ రేపు, ఎల్లుండి సెలవులు.” సుజిత్ ఆవేశం, తొందరపాటు నాకు అలవాటే. ఇప్పుడు వెంటనే క్షమాపణ అంటాడు.
“సోమవారం చెపుదువుగాని. నువ్వన్నట్టు మనం అర్థం చేసుకోవలసినది చాలా ఉంది. ప్రపంచమంతా ఒక కుగ్రామం అనుకుంటున్నా పరిస్థితులు, అవసరాలు మనిషిని నిలబడనివ్వట్లేదు. స్థిరత్వాన్ని ఏర్పరచుకోకముందే ఒక చోటు నుంచి ఒక చోటుకి తోసుకెళ్తున్నాయి. అదంతా ఎటువైపు నుంచి ఏ రూపంలో వస్తుందో తెలియదు. దీని గురించి హెచ్చరించి అలర్ట్ చేసే వాళ్లూ లేరు. ఉన్నా లక్ష్య పెట్టేవాళ్లూ లేరు. అనుక్షణం మారే పరిస్థితుల్ని అంచనా వేసేందుకు ఒక్క ఆధారమైనా అందదు. దానితో వ్యక్తిగతంగానూ, సమాజపరంగానూ తడబాట్లు తప్పట్లేదు. జీవితాల్లో ఇంత వేగం ఎవరు మాత్రం కోరుకుంటారు? ఇదంతా అభద్రతనిస్తోంది.
మల్లిక కొత్తగా జాయినైనప్పుడు తను అడక్కుండానే అద్దెకు ఇల్లు వెతికిపెట్టావు. ఆలోచనలు పెట్టుకోకు మరి. సోమవారం కలుద్దాం.”
***
సోమవారం ఆఫీసులో వాతావరణం కాస్త సీరియస్ గా ఉంది. అందరూ మౌనంగా పనులు చేసుకున్నారు. మల్లిక లీవ్ లో ఉంది.
సుజిత్ తన బైక్ సర్వీసింగ్ కి ఇచ్చానని, సాయంకాలం నాతో బయలుదేరాడు. ట్రాఫిక్ దాటుకుంటూ మెల్లిగా డ్రైవ్ చేస్తున్నాను. సిగ్నల్ దగ్గర కాలం కదలనట్టుంటుంది. ఆగిన వాహనాల చుట్టూ రకరకాల వస్తువుల్ని అమ్ముతున్న వాళ్లంతా కమ్ముకున్నారు. పొద్దుట్నుంచీ సాయంత్రం వరకూ ట్రాఫిక్కి అడ్డం పడి పరుగులు పెడుతూ వీళ్లు చేసే బ్రతుకు పోరాటం ఎంత కఠినం!
ఒక్కో కారునీ తడుతూ చేతిలో ఉన్న నోట్లని చూపిస్తోంది ఆమె. కార్లలో ఉన్నవాళ్లు కొందరు విండోగ్లాసు దించి ఆమె చేతిలో ఎంతోకొంత పెడుతున్నారు. మళ్లీ మరో కారు దగ్గరకి వెళ్తున్న ఆమె వెనుక చప్పట్లు చరుస్తూ మరికొందరు నేస్తాలు. స్పందించని వాళ్లతో నవ్వుతూనే వాదనకి దిగుతున్నారు.
“ఎక్కడైనా చాయ్ తాగుదాం” అన్నాడు సుజిత్.
కారు బయటకు చూస్తున్న నాకు అప్రయత్నంగా టి.వి. లో చూసే ఒక చాయ్ కంపెనీ ప్రకటన కళ్లముందుకొచ్చింది. ఇలాటి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వర్షంలో తడుస్తూనే ఆగిఉన్న కారులోని ఒకరిని నవ్వుతూ పలకరించి, ఉచితంగా “చాయ్” ని అందించే వ్యక్తి కళ్లముందు కదిలింది. ప్రపంచంలోని మనుషులందరి కంటే తాము భిన్నం కాదని, అందరితో సగౌరవంగా మమేకమవాలన్న తమ ఆశ అర్థం చేసుకొమ్మనే వారి తపన చుట్టూ ఉన్న లోకం అర్థం చేసుకుంటోందా?
ప్రపంచంలోని వైరుధ్యాలని చూస్తూ, అబ్బురపడుతూ కూడా ఈ విషయం ఎందుకు తెలుసుకోరు.
“ఒక హిజ్రా ఆత్మ కథ” లో “రేవతి” నా తలపుల్లోకి వస్తూనే ఉంటుంది.
“ఇంటికి వెళ్దాం, అమ్మ మంచి కాఫీ ఇస్తుంది. నిన్ను చూసి సంతోషపడుతుంది” అన్నాను. అభ్యంతరం చెప్పలేదు.
నేనన్నట్టుగానే అమ్మ సుజిత్ ని సంతోషంగా ఆహ్వానించింది.
అతను మొన్నటి సంఘటన పట్ల నిజంగా అప్సెట్ అయ్యాడని తెలుస్తోంది. సుజిత్ ఒకరిని నొప్పించే వ్యక్తి కాడు. కోపంలో నోరు జారాడన్నది అతనికీ నొప్పి కలిగిస్తోంది.
వ్యక్తుల మధ్య సరైన అవగాహన ఉంటే నొప్పించగరా? ఇలాటి నొప్పిని ఎవరైనా ఎంతవరకు ఓర్చుకోవాలి? ఎదుటివారి సహనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ఈ ధోరణుల్ని ఎంత వరకు సాగనివ్వాలి? వీటి మధ్య సున్నితమైన గీతను ఎవరు నిర్ణయిస్తారు?
పొద్దున్నే వెళ్లి పలకరించాలనుకున్నానని చెపుతున్న అతని కళ్లల్లో నిజాయితీ స్పష్టంగా కనిపించింది.
“చూడు, ఆవిడ కొత్తగా వచ్చినప్పుడు ఎంత సాయం చేసాను. అయినా అంత రూడ్ గా మాట్లాడింది. నేనన్న మాటల్లో తప్పేముంది? ఎందుకలా మాట్లాడింది?!” అంతలోనే మళ్లీ మొదలు పెట్టాడు తప్పొప్పుల గొడవ.
“మల్లిక ఆఫీసులో జాయినైన రోజే హెచ్. ఆర్. కి చెప్పింది తనని ఎలా పిలవాలనుకుంటుందో. అది తెలిసీ నువ్వు ఇన్నాళ్లైనా పద్ధతి మార్చుకోలేదు. పైగా అనవసరపు మాటలు మాట్లాడావు. ఇప్పుడూ “ఆవిడ” అనే సంబోధిస్తున్నావు.” నవ్వుతూనే చెప్పాను. సుజిత్ ఆలోచనలో పడ్డాడు.
“మనం నాలుగైదేళ్లుగా వోక్ కల్చర్ అనే మాట వింటున్నాం. మనలో కంటికి కనిపించేవే కాకుండా ఇంకా ఎన్నో వైరుధ్యాలుంటాయన్నది నిజం. ఎవరి హక్కుల కోసం వాళ్లు నోరు విప్పవలసిందే కదా సుజిత్. మల్లిక ప్రత్యేకమైన వ్యక్తి అని చెపుతావు. హక్కును కాపాడుకునే తన ప్రయత్నాన్ని మనం సమర్థించకపోతే ఎలా? మళ్లీ మళ్లీ చెప్పిందంటే మనం అర్థం చేసుకోవలసింది ఉందని తోచట్లేదా? మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ని మనం మర్చిపోలేదు. ఇప్పుడు, దాదాపు వంద సంవత్సరాల తర్వాత మనందరం ఆ ధోరణి అదే గడ్డ మీద చూసాం. అందుకే మన మెదళ్లలోకి ఇంకే వరకూ పదే పదే చెపుతూనే ఉండాలి. అదే న్యాయం.”
నా మాటలకి సుజిత్ చురుక్కున చూసాడు. ఏదో తోచినట్టు ఆలోచనలో పడ్డాడు.
కాలికి దెబ్బలతో ఇంట్లోకొచ్చాడు మను. ఎవరి మీదో కోపంగా ఉన్నాడు. చేతిలో బ్యాట్ గది మూల పెట్టేసి, “హాయ్ అంకుల్” అంటూ సుజిత్ ని పలకరించి లోపలికి వెళ్లాడు.
అమ్మ వాడిని కాళ్లు చేతులు కడుక్కు రమ్మని పురమాయించి, వచ్చినవాడిని కూర్చోబెట్టి బుజ్జగిస్తోంది “ఏమైందంటూ”.
“నానమ్మా, ఆ సంతోష్ గాడు లేడూ, ఆ జైంట్ సైజుగాడు. వాడి మూలంగా నాకు ఇంత దెబ్బ తగిలింది.” వాడి గొంతులో ఉక్రోషం, గాయం తాలూకు బాధ.
దెబ్బలని మెత్తని బట్టతో తుడిచి, మందురాస్తూ అమ్మ వాడిని మాటల్లో పెట్టింది.
వాళ్ల మాటలు ముందు గదిలో మాకు సన్నగా వినిపిస్తున్నాయి.
వెళ్తానంటూ లేచిన సుజిత్ అమ్మకి చెప్పి వెళ్లేందుకు లోపలికి నడిచాడు. వెనుకే నేను,
“ఏరా? మరి జైంట్ సైజు గాడు అంటే రేసిజమా కాదా?” అంటోంది అమ్మ మనుతో.
మను తడబడ్డాడు. “అంటే…వాడు…” మాటలకోసం వెతుక్కుంటూ,
“అసలు వాడి వల్లే ఇంతంత దెబ్బలు తగిలాయి తెల్సా?” అన్నాడు ఓటమి ఒప్పుకోలేక.
“నువ్వు నీ జాగ్రత్తలో లేవు కనుకే దెబ్బలు తగిలాయి. వాడిని ఎప్పుడూ నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావు కదూ. ఈ రోజు కోపంతో అలా మాట్లాడుతున్నావు.”
మను నానమ్మకి సారీ చెపుతున్నాడు,
“అలా ఎప్పుడూ ఎవర్నీ అనను నానమ్మా.”
***
చిత్రం: రాజశేఖర్ చంద్రం
ఓక్ కల్చర్ గురించి పాఠకులకు పరిచయం,అవగాహన కలిగించి ఆలోచింపజేసేలా ఉంది కథ.అభినందనలు.
యంసీఆర్ శేషు
Very interesting. Good story.
Good story! It’s making us think about the changing world, and the basic need to respect one another with dignity.
కథానిక ఆలోచింప చేసేదిగా ఉంది. అయినా చిన్న, పెద్ద, ఆడ, మగ, కులం, మతం లేకుండా వ్యక్తులు పరస్పరం గౌరవించుకునే సమాజం కావాలి. సామాజిక శాస్త్రాల ఉపాధ్యాయుల పాత్ర ని కూడా భవాని టీచర్ గురించి ప్రస్తావన తేవడం ద్వారా తెలియజేశారు. ధన్యవాదములు
Very nice story touching very sensitive point with human values.
Everybody will experience in day to day life.
Good Story