1
మిగుళ్ళు
కొన్ని అధ్యాయాల తరువాత
దూరాల సెగ సోకి
భగ్గున మండి ఆవిరైపోయి
క్షణం వెలిగిన చీకటి ఛాయ
ఆ కర్పూరకళికది!
తలపు – తెలివి
స్పృహ – స్మరణ
అన్నీ ఒకే ఒక్క బిందువు మీద నిలబడి
నీ ద్వారా లోకాన్ని
లేదా లోకం మొత్తంలో నిన్ను మాత్రం చూడగల
నిరంతర తాపసి ఈ ఆయువు!
కాలాన్నో, నిన్నో నిందించలేని జ్ఞానం
ఏకాంతంగా కూడా దుఃఖించలేని దైన్యం
ఒకటి రెండుగా విడిపడేటప్పటి నొప్పే తప్ప
ఏదీ మిగలదు ఒక నాటికి!
ఇప్పుడిక మొద్దుబారి
దారి పక్కన నిస్త్రాణపడి
వచ్చే పోయే పొద్దులకు
సాక్షీభూతంగా
మిగులు జీవితమంతా
ఇలాగే ఒక్క ఆశ, ఒక్క ఎదురు చూపుగా… !
2
నిర్లిప్త నదము
గులక రాయంత జ్ఞాపకం
ఎవరు విసిరి వెళ్తారో గానీ,
గుండెలో నివురుగప్పిన ఉప్పెన రేగుతుంది.
స్తంభించిన కాలం ఒడ్డున
దిగులో, దుఃఖమో ప్రవహిస్తుంది
జ్ఞాపకాల ఉధృతికి
గుండె ఖాళీ అవుతుంది
రాత్రి ఎడారవుతుంది
దూరం నవ్వుతుంది
ఆశ తలదించుకుంటుంది.
ఒక తీపి కల కోసం
ఒక దీపపు సంజ్ఞ కోసం
ప్రాణం ఇంకా వెనక్కే చూస్తుంటుంది!
కానరాని కళ్ళ మీది నుంచి
తిప్పుకోలేని చూపులు
అందని అరచేతుల్ని
విడువలేని మునివేళ్ళు
అడుగు తీసి అడుగు పడని
దూరప్రయాణమే ఇప్పుడు ఇది!
అరువు తెచ్చుకున్న దృష్టి మసకబారి,
లోకం నుంచి నడక తప్పిపోతుంది
ఎక్కడెక్కడ తిరుగుతానో
ఎక్కడెక్కడ ఆగిపోతానో
ఏ తీరానికి కొట్టుకుపోయి
ఎట్లా తేరుకుంటానో!
అడగని ప్రశ్నలు
ఈ దారి మీద మరోసారి పరచిన ముళ్ళు
తెలుసు,
ఈసారి కూడా ప్రాణం మీదికి వస్తుంది కానీ ప్రాణం పోదని!
*
చిత్రం: స్రవంతి చతుర్వేదుల
బాగున్నాయి
Well written