పుస్తకం
దాహం వేసినప్పుడు
కుండలో నుంచి కాసిన్ని
నీళ్లు ఒంపుకున్నట్లు
వీధిలో చే పంపు దగ్గర
దోసిలి నిండా నీళ్లు పట్టుకుని
గొంతుకలోకి నింపుకున్నట్లు
ఊరి చివరి గిలకల బావిలో
బిందె వేసి అన్ని
నీళ్ళు తోడుకున్నట్లు
అక్షరాల ఆకలేసినప్పుడు,
వాక్యం పై బెంగేసినప్పుడు
పుస్తకాన్ని అందుకోండి
గతం నుంచి భవిష్యత్తుకు రహదారి! రాచరికం నుంచి విప్లవం వరకు బాటసారి!
వేల, లక్షల, కోట్ల మస్తిష్కాల
ఆలోచనల ప్రవాహం!
రేఖాగణితానికి అందని
మనుషుల లోతులను
ప్రతిఫలించే నిలువుటద్దం!!
సాగర మధనం నుంచి
అమృతం పుట్టినట్లు
ఎన్ని కోటానుకోట్ల విస్ఫోటనాలు
జరిగాయో!!
ఆకలేసినప్పుడల్లా
గుప్పెడు అక్షరాలను గుండెల్లో పోసుకోండి
కొత్త జీవం చిగురేస్తుంది.
*
మిట్ట మధ్యాహ్నం
ఓ శీతా కాలపు
మిట్ట మధ్యాహ్నం
ఘనీభవించిన నది ఒడ్డున
ఎండిన పైన్ చెట్టు నీడలో
రెండు ఆత్మలు
తలుపులు బార్లా తెరిచి
తరచి తరచి చూసుకుంటున్నాయి
చూపులతో తడిమి మాట్లాడుకుంటున్నాయి
గుండె లోతుల్లోకి దూకి
ఉబికి వస్తున్న ఉచ్ఛ్వాసల్లో
ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి
కూలిన భవన శిథిలాల కింద
నలిగిన చేయి ఎవరిదో
తొంగిచూస్తోంది
భుజాలమీద సిపాయిలను మోస్తూ
వార్ ట్యాంకర్ నిశ్శబ్దంగా నడిచిపోతోంది పొగచూరిన నగరం
అద్దం ముందు నిలబడి
భళ్ళున ముక్కలయ్యింది
రాజుకున్న నిప్పులో ఆ రెండు ఆత్మలు
జంటగా భస్మమయ్యాయి
*
Add comment