రెక్కలు చాచిన రాత్రి

ప్రత్యామ్నాయ చారిత్రక కథ. సుధాకర్ ఉణుదుర్తి & జైదీప్ ఉణుదుర్తి కలిసి రాసిన కథ.

1
బంగాళాఖాతంలో వాయుగుండం; రెండురోజుల్నించీ వర్షం విశాఖపట్నాన్నిఎడతెరిపి లేకుండా మొత్తేస్తోంది.
అర్ధరాత్రి దాటింది. మహారాణిపేటలో ఉన్న ఆ బంగళా ముందు నల్లటి మెర్సిడీస్ కారు ఆగింది. ఆర్మీ రెయిన్ కోటువేసుకున్న ఒక వ్యక్తికారు దిగి, గబగబా నడిచి వెళ్లి, బంగళా తలుపు తట్టాడు. తాను వింటూన్న బీబీసీ రేడియో ప్రసారాన్ని హడావుడిగా కట్టేసి, లేచి వెళ్లి, తలుపు తీశాడు ఆ అరవై ఏళ్ల వ్యక్తి – ‘ఇంత రాత్రప్పుడు ఎవరై ఉంటారా?’ అనుకుంటూ. ఎదురుగా కనిపించిన ఆఫీసర్నిచూసి ఆశ్చర్యపోయాడు.
“డాక్టర్ రామన్! మీరు నాతో రావాలి,” అన్నాడా ఆఫీసర్.
“రేప్పొద్దున్న రండి మాట్లాడుకుందాం,” అంటూ తలుపు మూసెయ్యబోయాడు రామన్. అతని గొంతులో చిరాకు. నిద్ర ముంచుకొస్తోంది.
“ఇప్పుడే, ఈ క్షణంలోనే రావాలి, ఒక ముఖ్యమైన మీటింగుకి,” ఆర్మీ మేజర్ దృఢంగా అన్నాడు – ఆ విషయంలో చర్చకి తావులేదన్నట్లు.
“ఏమిటిదంతా? ఎక్కడికి వెళ్లాలి? ఎప్పుడు తిరిగి వస్తాం? నా భార్యకైనా చెప్పాలి కదా! అయినా విషయం ఏమిటో చెప్పకుండా మీటింగుకి రమ్మనడంలో అర్థం లేదు.”
ఆ అధికారి స్వరం తగ్గించి, “సుప్రీం కమాండర్ మీతో మాట్లాడాలన్నారు. ఈ సంగతి మీ సతీమణికి కూడా తెలియనక్కర్లేదు”.
అప్పుడు రామన్ గమనించాడు. రెయిన్ కోటు ఖాకీదైనా లోపలి యూనిఫాం నల్ల రంగులో ఉంది. కాలర్ మీద పులి తలకాయ బొమ్మ – అటూ ఇటూ వజ్రాయుధాల చిహ్నాలు. మరోమార్గం లేదని రామన్ కి అర్థం అయిపోయింది.
“బట్టలు మార్చుకోవాలి, కూర్చోండి,” అన్నాడు, వరండాలో ఉన్న పేము కుర్చీలవైపు చూపిస్తూ.
“ఫరవాలేదు. మీరు త్వరగా రండి,” అన్నాడు మేజర్, సిగరెట్టు వెలిగిస్తూ.
***
కారులో కూర్చోగానే, “మీ భార్యకి ఏం చెప్పారు?” అనడిగాడు మేజర్.
“లేబోరేటరీ నుంచి కబురొచ్చిందని చెప్పాను,”
” దాస్ ఇస్ట్ గూట్!”
‘మనవాళ్లు జర్మన్ భాష వాడడం పెరిగిపోతోంది – అవసరం ఉన్నా లేకపోయినా’ అనుకున్నాడు రామన్.
ఉన్నట్టుండి వర్షం పెద్దదైంది. కారు అద్దాల వెంట చినుకులు ధారలు కడుతూ, ఐమూలగా క్రిందికి సాగుతున్నాయి. లోపల వెచ్చగా ఉందిగానీ బయట రొజ్జగాలి వీస్తూనే ఉందని చెట్లకొమ్మల కదలిక చెబుతోంది.
‘మరో రెండు రోజులు వర్షాలు తప్పవు’. రామన్ ఆలోచనలు సాగిపోతున్నాయి
‘చిన్న ధూళికణం చాలు, కొన్ని నీటి అణువులను ఒక చోట చేర్చడానికి, అవి నీటిబిందువుల పరిమాణానికి చేరుకోగానే రాలిపడడానికి. ఈనాటి తుపాను ఎప్పుడు, ఎక్కడ మొదలైందో? ఎవరు చెప్పగలరు?’
కారు బీచి రోడ్డు మీదుగా వెళుతోంది.
దూరంగా లంగరు దించిన భారీ యుద్ధనౌక విరజిమ్ముతూన్న దీపాల కాంతి. మెరుపు మెరిసింది. ఆ నౌకకు ఉండే విశిష్ట నిర్మాణం – ఎత్తైన దాని టవర్, డెక్ అంతటా అడవిపంది ముళ్లల్లా పొడుచుకొచ్చిన శతఘ్నులు – క్షణమాత్రంగా కనిపించి మాయమయ్యాయి. అంతలోనే దిక్కులను ఏకంచేస్తూ ఉరుము. ఆరోజు సాయంత్రం యూనివర్సిటీ నుండి వస్తూన్నప్పుడు కూడా దాన్ని చూశాడు.
“అది జర్మన్ యుద్ధనౌక ‘స్కార్న్ హార్స్ట్’ కదా?” అని మేజర్ని అడిగాడు.
అతడేమీ అనలేదు.
‘స్కార్న్ హార్స్ట్’ ఇక్కడికెందుకు వచ్చి ఉంటుంది?’ రామన్ కి అంతుపట్టలేదు.
నిద్రపోయే సమయంలో లాక్కొచ్చారు. కళ్లు మంట పెడుతున్నాయి.
ఈ మధ్యంతా నిద్ర సరిపోవడంలేదు. పడుకోవడం ఆలస్యం అవుతోంది. ఎప్పటిలాగానే ఆ దినాన కూడా భోజనాలయ్యాక బీబీసీ, బెర్లిన్, సోవియట్ రేడియోల వార్తా ప్రసారాలు విన్నాడు. కనీసం రెండు మూడు భిన్న కేంద్రాల ప్రసారాలు వింటే తప్ప వాస్తవాలు తెలియడంలేదు. ఎవరి ప్రచారాలు వాళ్లవి. దీనికి తోడు రోజుకో పుకారు. నిజాలు ఆ మధ్యలో ఎక్కడో సంచరిస్తూంటాయి. వాటిని పట్టుకోవడం, వెలికి తీయడం రోజురోజుకీ అసాధ్యం అవుతోంది. వార్తలలోని వాస్తవాలను కనుగొనడం మరో శాస్త్రీయ పరిశోధనాంశంగా మారింది.
ఆరోజున కూడా భోజనాలు చేసేటప్పుడు రామన్ ని అతని భార్య అడిగింది – “మన చంద్రా సంగతి ఏమైనా తెలిసిందా?” అని.
చంద్రశేఖర్ యువ భౌతిక శాస్త్రవేత్త. రామన్ కి దగ్గర బంధువు. అమెరికాలో నక్షత్రాలు క్షీణదశకు చేరుకొనే క్రమంపై పరిశోధనలు చేస్తున్నాడు. నెల్లాళ్ల క్రిందట మాయమయ్యాడు.
***
దారి పొడుగునా జర్మన్ మిలిటరీ వారి ‘టట్రా’ ట్రక్కులు బారుతీరి ఉన్నాయి. వాటిల్లో అతిశీతల ఇంధనాన్ని తరలించే టాంకర్ ట్రక్కులు ఉండడం రామన్ ఆసక్తిని పెంచింది.
కారు ఆగింది. ఆర్మీ వాళ్ల చెక్ పోస్టులాగా ఉంది.
“మీరొక్కసారి కారు దిగాలి. తనిఖీ చేస్తారు,” అన్నాడు మేజర్.
రామన్ కి చిరాకొచ్చింది. దిగక తప్పలేదు.
“భద్రతా జాగ్రత్తలు ఎక్కువయ్యాయి. సుప్రీం కమాండర్ ఊళ్లో ఉన్న విషయం ఎవరికీ తెలియకూడదు. కమ్యూనిస్టు విద్రోహుల దాడులు ఉధృతం అయ్యాయి. ఎప్పుడు, ఎక్కడ దాడి చేస్తారో తెలుసుకోవడం రోజురోజుకీ కష్టం అయిపోతోంది,” అంటూ సంజాయషీ ఇచ్చాడు మేజర్.
“మొదట మీ గూఢచార వ్యవస్థని మెరుగు పరచుకోండి. రోజంతా కవాతులు చెయ్యడం, సెల్యూట్లు కొట్టడం కాదు,” అన్నాడు రామన్, కారు దిగుతూ. అతనికి ఇరిటేషన్ ఎక్కువవుతోంది.
మేజర్ని చూడగానే “హెయిల్ స్వస్తికా!” అంటూ సెల్యూట్ చేశారు కాపలా కాస్తూన్న సైనికులు.
మేజర్ కూడా “హెయిల్ స్వస్తికా!” అని బదులిచ్చాడు. కారు ముందుకి ఉరికింది.
నాలుగేళ్ల క్రితం హిట్లర్ గుండె పోటుతో మరణించాక జర్మన్లు ‘హెయిల్ హిట్లర్’ మానుకున్నారు. మనవాళ్లు ఒకప్పుడు ‘జై హింద్’ అనేవారు; ‘హెయిల్ స్వస్తికా’ అంటున్నారు. పద్ధతులు మారిపోతున్నాయి – అనుకున్నాడు రామన్.
సుప్రీం కమాండర్ని ఇంతకు ముందు రెండు సార్లు కలుసుకున్నాడతడు.
మొదటిసారి – మూడు నాలుగేళ్ల క్రిందట – అంటే దక్షిణ భారతదేశం జర్మన్ల ఆధీనంలోకి వచ్చిన కొత్తలో – ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన కాన్వొకేషన్ లో. ఆ తరువాత పబ్లిక్ ఫంక్షన్లలో పెద్ద నాయకులు కనిపించడం తగ్గిపోయింది.
పెద్ద భవనం ముందు పోర్టికోలో కారు ఆగింది. మెట్లెక్కి లోపలికి వెళ్లారు. విద్యుద్దీపాల కాంతికి రామన్ కళ్లు అలవాటు పడడానికి ఓ నిమిషం పట్టింది. కోటు జేబులు తడుముకున్నాడు. కళ్లజోడు ఇంట్లో మర్చిపోయాడు. అతడు నిత్యం ధరించే తలపాగా లేకుండా హడావుడిగా రావడం అతనికి ఇబ్బందిగా అనిపించింది.
“మీరిలా సోఫా మీద కూర్చోండి,” అని రామన్ తో అని, హాలుకి ఒక చివర రిసెప్షన్ లో టెలిఫోన్లు ముందుపెట్టుకొని కూర్చున్న యువతి వైపుగా నడిచాడు మేజర్. ఆమె జాపనీస్ అయి ఉంటుంది అనుకున్నాడు రామన్.
వారిద్దరి మధ్యా ఏవో మంతనాలు సాగుతూండగా రామన్ పరిసరాలను పరిశీలించసాగాడు.
అది వలసకాలం నాటి ఆఫీసర్ల క్లబ్బు. పదేళ్ల క్రితం వరకూ భారతీయులకూ, కుక్కలకూ ప్రవేశం ఉండేదికాదు. హాలులో వ్రేలాడే దీపాల గుత్తులు. బాగా మెరుగుపెట్టిన పాతకాలపు ఫర్నిచర్. బర్మాటేకు తాపిన గోడలు. గోడలమీద నాయకుల చిత్రాలు. అన్నిటికన్నా ఎత్తుగా – చేతులు కట్టుకొని బుద్ధిమంతుడిలా నిల్చున్న అడాల్ఫ్ హిట్లర్. దాని క్రిందనే – రెండువైపులా ఫీల్డ్ మార్షల్ హెర్మన్ గోరింగ్, రైక్స్ మార్షల్ రుడాల్ఫ్ హెస్ ల చిత్రాలు, వాటి క్రింద రెండు పెద్ద స్వస్తికా జెండాలు. ఆ గోడపై ఒకచోట వెలిసిపోయినట్లుగా ఒక చతుస్రాకారపు మచ్చ అగుపడుతోంది. అక్కడ కింగ్ జార్జ్ చిత్తరువు ఉండేదా?… కేజీఎచ్ పేరుని కూడా కైజర్ ది గ్రేట్ హాస్పిటల్ గా మార్చేసారు కొత్త పాలకులు.
మాస్కో పతనంతో జర్మనీ, జపాన్లు బ్రిటిష్ ఇండియాలో వాటాకోసం పట్టుబట్టాయి. దక్షిణాది రాష్ట్రాలు జర్మన్ల ఆధీనంలోకి వచ్చాయి. బర్మాలోంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన జపాన్ – బెంగాల్, ఈశాన్య ప్రాంతాలను వొదులుకోవడానికి నిరాకరించింది. ఇండియా మూడు ముక్కలైంది.
‘టైమెంతయి ఉంటుంది చెప్మా?’ అనుకున్నాడు. చూసుకుంటే వాచీ పెట్టుకోవడం కూడా మర్చిపోయాడు.
రామన్ కి కుడివైపున మరో సోఫాలో కూర్చున్న వ్యక్తి పొడుగ్గా, నిటారుగా, కండలు తిరిగి, కమేండోలా ఉన్నాడుగానీ శాస్త్రవేత్తలాగా లేనే లేడు. అతన్ని టైము అడుగుదామనుకుంటూనే అక్కడ ఉన్న గోడ గడియారాల వైపు చూశాడు. అవి ఐదు నగరాల్లోని సమయాలను సూచిస్తున్నవి – అవి వరుసగా – టోక్యో, కలకత్తా, మెడ్రాస్, రోమ్, బెర్లిన్. మెడ్రాస్ సమయం ఒంటిగంటకు ఇంకా పది నిముషాలు ఉందని తెలియజేస్తోంది.
యుద్ధానికి ముందు రోజుల్లో – బ్రిటిష్ ఇండియా ఒకే దేశంగా ఉన్నప్పుడు – దిల్లీ, లండన్ లలో సమయాన్ని చూపించే గడియారాలు మాత్రమే ఉండేవని గుర్తుచేసుకున్నాడు రామన్. ‘ఇప్పుడు భారత కాలమానం అంటే మూడు భిన్న కాలాలు. అంతా గందరగోళం. అందుకే అంటారు – కాల మహిమను ఎవరూ ఊహించలేరు,’ అనుకున్నాడు.
కమేండోలాగా ఉన్న వ్యక్తి లేచి వచ్చి, “మీరు డాక్టర్ రామన్ కదా?… నా పేరు రాజన్,” అంటూ కరచాలనం చేశాడు.
“మీరు శాస్త్రవేత్తా?” అని రామన్ అడిగాడు, అనుమానంగా.
“కాదు. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, ఆర్మీ నుంచి డెప్యుటేషన్ మీద వచ్చాను – ఈ ప్రాజెక్టు కోసం. మీతో కొంచెం మాట్లాడాలి – చంద్రశేఖర్ గురించి,” అన్నాడు.
రాజన్ అనే ఈ వ్యక్తి గూఢచార వ్యవస్థలో పనిచేస్తున్నాడని రామన్ గ్రహించాడు. అది అతని అసలు పేరో, కాదో?
“అలాగే. మావాడు సేఫ్ గా ఉన్నాడు కదా?”
“మాకు తెలిసి సేఫ్ గానే ఉన్నాడు…” అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడుగానీ మేజర్ వాళ్లను సమీపించడంతో ఆగిపోయాడు.
ఒక ఫైలు తెరిచి రామన్ చేతిలోపెట్టి, “అయ్యా, మీరిక్కడ ఒక చిన్న సంతకం పారెయ్యండి,” అన్నాడు, మేజర్.
పై పేజీమీద ‘టాప్ సీక్రెట్’ అని, దాని క్రిందనే జర్మన్ భాషలో, ఫ్రాక్టుర్ అక్షరాలలో – ‘అనుమతి లేకుండా వెల్లడి చేస్తే మరణదండన’ అని వ్రాసి ఉంది. రామన్ కి కొంచెం జర్మన్ వచ్చును. సైన్సు విద్యార్థులు జర్మన్ నేర్చుకోవడమూ, ఆర్ట్స్ చదివే వాళ్లు ఫ్రెంచి భాషలో ప్రవేశం కలిగి ఉండడం సంయుక్త బ్రిటిష్ ఇండియాలో ఆనవాయితీగా ఉండేది.
మారు మాట్లాడకుండా సంతకం చేశాడు.
“మరో ఐదు నిమిషాలలో మీరు మీటింగులో జాయిన్ అవుతారు,” అన్నాడు మేజర్.
“మీటింగులో ఎవరెవరున్నారు? అయినా దేనిగురించి ఈ అర్ధరాత్రి మీటింగు?”
“నాకూ తెలీదు. మిమ్మల్ని ఒంటిగంటలోగా ఇక్కడికి తీసుకొచ్చి అప్పజెప్పడమే నా పని,”
“నన్ను ఇంటికి ఎవరు దిగబెడతారు?” అన్నాడు రామన్ అదుర్దాగా.
“అదిగో, ఆ అమ్మాయికి చెప్పండి. ఏర్పాట్లు చేస్తుంది. ఆమెకు ఇంగ్లీషు వచ్చు. మీటింగు ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. నేనింక ఇక్కడ ఉండకూడదు. బయలుదేరుతాను,” అంటూ లేచాడు మేజర్.
మరి కాసేపట్లో ఆ జాపనీస్ యువతి, తియ్యని గొంతుతో –
“డాక్టర్ రామన్ సాన్! యు మే న్ నౌ జాయిన్ ది మీటింగ్,” అంది.
మెషీన్ గన్లు పట్టుకున్న సెంట్రీలు నగిషీలు చెక్కిన పెద్ద చెక్క తలుపులు తెరిచారు.
పొడుగాటి టేబిలు. అటూ ఇటూ జపాన్, జర్మన్ బృందాలు. టేబిలు కొసన కూర్చున్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్. అతని ముఖం ఎప్పటిలాగానే లోలోపలి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలిస్తూ వెలిగిపోతూన్నది. రామన్ ని చూడగానే, లేచి నిలబడి, ఆప్యాయంగా పలకరించి, కరచాలనం చేశాడు.
“మీరు ఈ మీటింగు కోసం విలువైన మీ సమయాన్ని వెచ్చించడం మాకు సంతోషంగా ఉంది,” అన్నాడు.
“నాకు వేరే ఛాయిస్ ఉందని నేను అనుకోలేదు,” అన్నాడు రామన్.
రామన్ మాటల్ని జోక్ గా భావించి, నేతాజీ పెద్దగా నవ్వాడు. విషయం అర్థం కాకపోయినా మిగతావాళ్ల ముఖాల్లో కూడా నవ్వులు వికసించాయి. నేతాజీ స్వయంగా లేచి రామన్ కి స్వాగతం చెప్పడం చూసి అంతా లేచి నిల్చున్నారు; నేతాజీకి ఎడమవైపున ఉన్న వరుసలో తొలి స్థానంలో కూర్చున్న ఒక వ్యక్తి తప్ప. అతడు తన పల్చటి కళ్లజోడు ఫ్రేము లోంచి రామన్ని ఎగాదిగా చూస్తున్నాడు. అతని మొహంలో ఏ భావనా లేదు.
రామన్ అతన్ని గుర్తుపట్టాడు.
‘ఇదేదో చాలా ముఖ్యమైన మీటింగు అయి ఉంటుంది, సందేహం లేదు’ అనుకున్నాడు, నేతాజీకి కుడివైపు ఉన్న వరసలోని మొదటి కుర్చీలో కూర్చుంటూ.
నేతాజీ, రామన్ని అక్కడున్నవాళ్లకి సగౌరవంగా పరిచయం చేశాదు –
“ఈయన డాక్టర్ సీ.వీ. రామన్. అత్యున్నత శ్రేణికి చెందిన భారతీయ భౌతికశాస్త్రవేత్త. నొబెల్ బహుమతి గ్రహీత. ఆయన పరిశోధనలకు ప్రపంచమంతటా గుర్తింపు లభించింది. గతంలో కూడా అనేక సందర్భాలలో మా ప్రభుత్వం డాక్టర్ రామన్ గారిని సంప్రదించింది. వారిచ్చిన అమూల్యమైన సలహాలను తీసుకుంది. ఈ ప్రాజెక్టులో భారతీయ బృందానికి ఆయన నాయకుడిగా వ్యవరిస్తారు. డాక్టర్ సత్యేంద్రనాథ్ బోస్ రేపు వస్తున్నారు. ఈ మీటింగు ముగిసాక మిగతా సభ్యులను రామనే ఎంచుకుంటారు. ఆయనకి అవసరమైన నిధుల్నీ, వనరుల్నీ అందజేస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాను,”
“ఎట్టోర్ మేజొరానా ఎక్కడ? ఇటాలియన్ బృందం రాలేదా?” అని ప్రశ్నించాడు, హిమ్లర్ ప్రక్కన ఒక కుర్చీని ఖాళీగా వదిలి రెండో చోట కూర్చున్న వ్యక్తి. అతన్ని రామన్ గుర్తుపట్టాడు; జర్మన్ అణుశాస్త్రవేత్త హైసెన్ బర్గ్.
నేతాజీ, “నిన్ననే ఊళ్లోకి వచ్చారు. లంచిలో రొయ్యలు తిన్నారు. వాళ్లెవరికీ అవి పడలేదు. వాంతులు, విరేచనాలు పట్టుకున్నాయి. డాక్టర్లు ట్రీట్ చేస్తున్నారు. రేపటి సమావేశంలో పాల్గొంటారు. ఇక్కడున్న జర్మన్, జాపనీస్ బృందాల సభ్యులు మరి కాసేపట్లో ఎవరికివారే తమ పరిచయాలను చెప్పుకుంటారు. అయితే ముందుగా నేటి ప్రత్యేక అతిథి, ఆహ్వానితుడూ అయిన రైక్స్ మార్షల్ హైనిరిక్ హిమ్లర్ ని, ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను,” అంటూ ముగించాడు నేతాజీ. అందరూ చప్పట్లు కొట్టారు.
ఆ సభలో జరుగుతూన్న సంభాషణలను దుబాసీలు చకచకా అనువదిస్తున్నారు. స్టెనోలు ప్రతీ మాటనీ శ్రద్ధగా షార్ట్ హేండ్ లో వ్రాసుకుంటున్నారు. వాళ్లంతా చాకుల్లాంటి ఆడపిల్లలే. హిమ్లర్ లేచి నిలబడి మాట్లాడడం మొదలుపెట్టాడు –
“ప్రసిద్ధికెక్కిన భారతదేశానికి రావడం నాకిదే మొదటిసారి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టుని సమీక్షించడానికి నేను రావాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కోడ్ నేమ్ – ‘నాఖ్ట్ ఫ్లూగెల్’. ఇంగ్లీషులో ‘నైట్ వింగ్’. మీకు దీని నేపథ్యం చెప్పాలి. మీ అందరికీ తెలుసు, బోల్షెవిక్కులతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఓటమి తప్పదని తెలిసి కూడా వాళ్లు మూర్ఖంగా పోరాడుతూనే ఉన్నారు. యూరల్ పర్వతశ్రేణి వెనక్కి పారిపోయిన సోవియట్ రెడార్మీ నేడు గెరిల్లా యుద్ధం చేసే స్థాయికి దిగజారింది. సైబీరియన్ గ్యాస్ వారికి ప్రధానమైన ఇంధనంగా మారింది. చలిని తట్టుకోవడానికీ, విద్యుత్తుని ఉత్పత్తి చేసుకోవడానికీ, పరిశ్రమలు నడపడానికీ గ్యాస్ నిధులు వారికి ఉపయోగపడుతున్నాయి. కొత్త ఆయుధాలను నిర్మించే ప్రయత్నాలు, పరిశోధనలు చేస్తున్నట్లు మాకు సమాచారం అందింది. ప్రవాసంలో ఉన్న సోవియట్ ప్రభుత్వం బలపడేలోగా బోల్షెవిక్కులని కోలుకోలేని విధంగా దెబ్బతీయడానికై ‘అద్భుత ఆయుధం’ (వండర్ వాఫెన్) ప్రయోగించడానికి రైక్ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపున – గ్రేట్ బ్రిటన్ తో సంధి చేసుకున్నట్లుగానే అమెరికాతో కూడా ఒప్పందం కుదుర్చుకొని, సోవియట్ యూనియన్ కి అందుతూన్న సహాయ సహకారాలని పూర్తిగా నిలుపుజేసే ప్రయత్నం త్వరలోనే విజయవంతం కాబోతున్నది. ఇంకెంతో కాలం బోల్షెవిక్కులు ఒంటరి పోరాటం చెయ్యలేరు. శత్రువుల కదలికపై నిఘా పెట్టడానికీ, వాళ్ల స్థావరాలను నిర్మూలించడానికీ ‘అద్భుత ఆయుధం’ తన పేరుకి తగ్గట్టుగా పనిచేస్తుంది. అత్యుత్తమ స్థాయికి చెందిన జర్మన్, ఇటాలియన్ శాస్త్ర పరిఙ్ఞానం జాపనీయ శాస్త్రవేత్తలతో చేతులు కలిపేందుకు మధ్యస్థంగా ఉన్న భారతదేశమే సానుకూలమైన గడ్డ అవుతుంది. ఈ ఆలోచనతోనే ఈ ప్రాజెక్టుని ఇక్కడ నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.”
అంతటా చప్పట్లు. హిమ్లర్ తన ప్రసంగాన్ని కొనసాగించాడు.
“మనందరి లక్ష్యం ఒక్కటే. బోల్షెవిజానికి సమాధి కట్టాలి. అందుకు మీరంతా రాత్రింబవళ్లు పనిచెయ్యాలి. ఒక కొత్త అంతరిక్షశాస్త్రాన్ని ఆవిష్కరించాలి. మనమంతా ఆర్యులం. ఉత్తమ జాతికి చెందిన వాళ్లం. రష్యన్లు, స్లావ్ లు అధమజాతి మానవులు; నీగ్రోలు, యూదులు, జిప్సీల కోవకే చెందుతారు. మనుష్యులు ఎన్నటికీ సమానంకారనీ, పుట్టుకతోనే హెచ్చుతగ్గులుంటాయనే గొప్ప సత్యాన్ని ఇక్కడి పూర్వీకులు తెలుసుకున్నారు. అందుకే నేను ప్రాచీన భారతీయ వారసత్వానికి అభిమానిని. ఆ మాటకొస్తే నా జేబులో ఎల్లప్పుడూ…”
హిమ్లర్ మాట్లాడుతున్నప్పుడు నేతాజీ మొహం కోపంతో ఎర్రగా మారడాన్ని రామన్ గమనిస్తూనే ఉన్నాడు. నేతాజీ అరచేతితో టేబిల్ మీద కొట్టి,
“ఇక్కడ రాజకీయ ఉపన్యాసాలు వద్దు. సైన్సుకే పరిమితం అవుదాం,” అన్నాడు, జర్మన్ లో.
నేతాజీ ముందున్న మైక్ ఆన్ లో ఉంది. దాంతో అతని మాటలు అందరికీ వినబడిపోయాయి.
హిమ్లర్ విషపునవ్వు నవ్వి,
“ఇక్కడికొచ్చిన హేమాహేమీలైన శాస్త్రవేత్తలకు సైన్సు పాఠాలు బోధించడానికి నేను రాలేదు. ఈ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికే వచ్చాను. మీకు కావాల్సిన అన్ని వనరులనూ అందజేస్తాం అని థర్ద్ రైక్ తరఫున హామీ ఇవ్వడానికి వచ్చాను. జర్మన్ బృందానికి నాయకుడైన వెర్న్ హెర్ వోన్ బ్రౌన్ గురించి ఇక్కడున్నవాళ్లలో చాలామందికి తెలుసు గనక చాలా క్లుప్తంగా పరిచయం చేసి ముగిస్తాను. వోన్ బ్రౌన్ చేసిన పరిశోధనలు, నిర్వహించిన ప్రయోగాలు – వీటి మూలంగానే ద్రవరూపంలో ఉండే అతిశీతల ఇంధనాన్ని వినియోగిస్తూ, సుదూర ప్రాంతాలకు ప్రయాణించగల రాకెట్ల రూపకల్పన, నిర్మాణం సాధ్యపడింది. శత్రు మూకలను గడగడలాడించిన ఏ-4 రాకెట్ల ప్రయోగం వోన్ బ్రౌన్, అతని బృందం చేసిన కృషి ఫలితమే. వాటినే మన శత్రువులు వీ-2 రాకెట్లు అని పిలుస్తారని మనకు తెలుసు. అయితే ఇటీవలి కాలంలో ఆ రాకెట్ల రూపకల్పనలో అనేకమైన కొత్త అంశాలను వోన్ బ్రౌన్ బృందం జోడించింది. మీరంతా కొత్తగా రూపొందించిన రాకెట్ ప్రయోగాన్ని చూస్తారు. ఆ ఏర్పాట్లలో అతడు తలమునకలుగా ఉన్నాడు. ఇదిగో, ఇప్పుడే మీ ముందుకి వస్తున్నాడు…”
చేతులకు అంటుకున్న గ్రీసుని తుడుచుకుంటూ, ఓవరాల్స్ ధరించి ఉన్న వోన్ బ్రౌన్ లోపలికి వచ్చి హిమ్లర్ ప్రక్కనే కూర్చున్నాడు. అంతా మళ్లీ చప్పట్లు కొట్టారు.
“వ్యూహ రీత్యా ఈ ‘నైట్ వింగ్’ ప్రాజెక్టు అత్యంత కీలకమైనది. దాని విజయం కోసం అన్ని వనరులు, ఏర్పాట్లు చేస్తామని మరోసారి హామీ ఇస్తున్నాను. అయితే సత్వర ఫలితాలు కావాలి. తగిన ఫలితాలు రాకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని ముందుగానే హెచ్చరిస్తున్నాను,” ఇక్కడ హిమ్లర్, స్టెనో వైపు తిరిగి,
“ఈ వాక్యాలను సరిగ్గా నమోదు చేసుకో,” అని కూర్చున్నాడు.
రామన్ మదిలో ఒక సారూప్యం మెదిలింది – ‘మేకతోలు కప్పుకున్న తోడేలు’.
ప్రక్కన, మరో టేబిలు మీద తెల్లటి కోట్లు, తలపాగాలు ధరించిన స్టూవర్డ్ లు చడీ చప్పుడూ చెయ్యకుండా ప్లేట్లు, కత్తులు, కటార్లు, సాండ్విచ్ లు, కేకులు, పళ్లు సర్దుతున్నారు. కాఫీ వాసన హాలంతా అలుముకుంది. ఈమధ్య కాలంలో నాణ్యమైన కాఫీ, పళ్లూ అందుబాటులో లేకుండాపోయాయి. అన్నీ సైన్యానికే సరఫరా అవుతున్నాయి.
‘వెళ్లేటప్పుడు నాలుగు ఆపిల్సూ, కమలాలూ తీసుకుపోవాలి, భార్య సంతోషిస్తుంది,’ అనుకున్నాడు రామన్.
జర్మన్ బృందానికి నాయకుడైన వెర్నెర్ వోన్ బ్రౌన్ లేచి తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు.
“ఈ రోజు ఒక చారిత్రక దినం. మనమంతా అంతరిక్ష శాస్త్రానికి శ్రీకారం చుడుతున్నాం. డాక్టర్ రామన్ మనతో వచ్చి చేరడం ఒక శుభ సూచకం. దక్షిణ భారత దేశానికి ఈ ప్రాజెక్టులో ఒక ప్రముఖ స్థానం ఉన్నది. రాకెట్లను ప్రయోగించి కక్షలో సమర్థవంతంగా ప్రవేశపెట్టాలంటే, వాటి ప్రయోగం భూమధ్య రేఖకు చేరువలోనే జరగాలి. భూభ్రమణం మూలంగా ఏర్పడే రేఖావేగం (లీనియర్ వెలాసిటీ) ధృవాలవద్ద శూన్యంగానూ, భూమధ్యరేఖవద్ద అత్యధికంగానూ ఉంటుందని మనకు తెలుసు. రేఖావేగాన్ని జోడించుకున్న రాకెట్, ఒడిసెలతో రువ్వినట్లుగా కక్షలోకి దూసుకుపోతుంది. మిత్ర దేశాలైన జర్మనీ, ఇటలీ, జపాన్, దక్షిణ భారత దేశాల్లో కేవలం ఈ దేశానికే భూమధ్య రేఖకు సమీపంగా ఉండే వెసులుబాటు ఉంది…”. ఈ విధంగా సాగిపోయింది అతని ప్రసంగం.
‘నైట్ వింగ్’ ప్రాజెక్టుని ఇండియా కు తరలించడం వెనుక హిమ్లర్ చెప్పిన రాజకీయ కారణాలు కాకుండా శాస్త్రబద్ధమైన మూలాలు ఉన్నాయని రామన్ గ్రహించాడు.
వాన్ బ్రౌన్ ప్రసంగం పూర్తి కాగానే బోస్,
“ఇక మీదట శాస్త్రవేత్తలు ఈ సమావేశాన్ని కొనసాగిస్తారు. మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు. మీపై చరిత్ర ఉంచిన కర్తవ్యాన్ని నెరవేరుస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది,” అని ప్రకటించాడు. హిమ్లర్ని వెంటబెట్టుకొని బయటకు నడిచాడు. అంతా లేచి నిలబడ్డారు.
సమావేశాన్ని నిర్వహించే బాధ్యతని తీసుకున్న వాన్ బ్రౌన్, “ఇప్పుడు కాసేపు కాఫీ బ్రేక్,” అన్నాడు.
2
బ్రేక్ లో రామన్ సౌతిండియన్ ఫిల్టర్ కాఫీ కావాలని అడిగాడు. ఐదు నిమిషాలు ఆగాక ఒక బట్లర్ ఆయన కోరిన కాఫీని అందజేశాడు. కప్పు అందుకొని వాన్ బ్రౌన్ వైపుగా నడిచాడు రామన్.
వోన్ బ్రౌన్ – రామన్ తో, “మీరు ఈ ప్రాజెక్టులోకి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది,” అంటూ కరచాలనం చేసాడు.
వాళ్లిద్దరి చుట్టూ మరి కొంతమంది శాస్త్రవేత్తలు గుమిగూడారు.
“…నేను ఏమంటున్నాంటే – జియో స్టేషనరీ ఆర్బిట్ లో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టినప్పుడు అది మనకు కావల్సిన చోట స్థిరంగా ఉంటుంది,” అంటూ వోన్ బ్రౌన్ టేబిల్ పైనుంచి ఒక ఆపిల్ నీ, ఒక ద్రాక్ష పండునీ తీసుకున్నాడు. ఒక చేత్తో ఆపిల్ ని నెమ్మదిగా తిప్పుతూ రెండవ చేత్తో పట్టుకున్న ద్రాక్షపండుని కాస్త ఎడంగా పెట్టి తిప్పాడు.
“అంటే ఉపగ్రహం కూడా భూమి తన చుట్టూ తాను తిరిగే వేగంతోనే తిరుగుతూ, సాపేక్షికంగా ఒకే నిర్దిష్ట స్థానంపై కొనసాగుతుంది. నిజానికి దీన్ని మొట్టమొదట ప్రతిపాదించినది ఆర్థర్ సీ. క్లార్క్ అనే యువ సైన్స్-ఫిక్షన్ రచయిత,” అన్నాడు వోన్ బ్రౌన్ నవ్వుతూ.
“సైన్స్-ఫిక్షన్ రచయితా?” రామన్ ఆశ్చర్యపోయాడు.
“అవును. దేన్నయినా ఊహించగలిగితే చాలు, టెక్నాలజీ ద్వారా దాన్ని సృష్టించగల యుగంలో ఉన్నాం మనం. జియో స్టేషనరీ ఆర్బిట్ సాధ్యమేనని మా అంచనాలు తెలిపాయి. అతితక్కువ ఇంధనంతో ఉపగ్రహాన్ని ఆ కక్షలో ప్రవేశపెట్టేందుకు భూమధ్య రేఖకు దగ్గరనుండే రాకెట్ ప్రయోగం జరగాలి. అందుకే ఇండియాకు ఈ ప్రాజెక్టులో కీలక స్థానం,”
“అది నాకు అర్థం అయిందిలేగానీ మీ జర్మన్ టీం ఎన్నాళ్లుగా ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తోంది?” రామన్ అడిగాడు.
“గత రెండేళ్లుగా. నిజానికి మేము ఇండియా రావడం ఇది రెండో సారి. మొదటిసారి వచ్చినప్పుడు ఉపగ్రహ రాకెట్ ప్రయోగానికి మెడ్రాస్ దగ్గర ఉన్న శ్రీహరికోట అనే ప్రదేశం అనుకున్నాంగానీ, చిత్తడి నేల, దోమలూను. మలేరియా ప్రాంతం. మరో ఊరును ఎన్నుకున్నాం,”
“ఎక్కడ?”
“ఇక్కడికి దగ్గరలోనే ఉన్న గంగవరం అనే కోస్తాగ్రామం. ట్రాకింగ్ సెంటర్ విశాఖపట్నంలో ఉంటుంది,”
“ఇటాలియన్లు కూడా మీతో రెండేళ్లుగా పనిచేస్తున్నారా?”
“ఓ యెస్,” వోన్ బ్రౌన్ గొంతులో గర్వం.
“అంటే మాకే ఆఖర్న చెప్పారన్న మాట,” రామన్ స్వరంలో అలక.
“అబ్బే, మిమ్మల్ని దూరం పెట్టాలని కాదు. జాపనీస్ టీం కూడా ఇప్పుడే ఈ ప్రాజెక్టులో చేరింది. అవసరం మేరకే సమాచారం పంచుకోమని హిమ్లర్ ఆదేశం,” అని సర్దిచెప్పాడు వోన్ బ్రౌన్.
కాఫీ విరామం ముగియబోతోంది. అంతలో రాజన్ హడావుడిగా వచ్చి, రామన్ తో –
“ఒక్కసారిలా నాతో రండి. మనం విడిగా ఓ ఐదు నిమిషాలు మాట్లాడుకోవాలి,” అని ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ నాలుగు కుర్చీలూ, ఒక చిన్న టేబిలూ ఉన్నాయిగానీ, నిల్చొనే మాట్లాడుకున్నారు. ఇద్దరి చేతుల్లోనూ కాఫీ కప్పులు.
కోటు జేబులోంచి ఒక ఫొటోతీసి రామన్ కి అందజేసాడు రాజన్.
దాంట్లో చంద్రా, ఐన్ స్టైన్, ఇంకా కొంతమంది ఉన్నారు.
“అలాస్కాలోని ఏంఖరేజిలో జరిగిన కాంఫరెన్స్ లో తీసినది. ఆ సమావేశం పూర్తి కాగానే ఐన్ స్టైన్ వెంట, సోవియట్ల సహకారంతో, ఫిషింగ్ బోట్లో బేరింగ్ జలసంధి దాటుకొని సైబీరియా వెళ్లిపోయాడు మీవాడు”.
కాసేపు మౌనంగా ఉన్నాక రామన్ –
“ఇప్పుడేం చెయ్యమంటారు?” అని అడిగాడు.
“మీరతన్ని ఏదో ఒక మిష మీద ఇక్కడికి రప్పిస్తే మిగతాది మేము చూసుకుంటాం. అతని సేవలు ఈ ప్రాజెక్టుకి అవసరం,” అన్నాడు రాజన్.
“రప్పించడం – అంటే? అయినా చంద్రా అక్కడున్నాడని సోవియట్ అధికారులెవరూ ఒప్పుకోరు కదా?”
“పది రోజుల క్రితం ‘ప్రావ్దా’లో వచ్చింది,” అంటూ మడతపెట్టిన ‘ప్రావ్దా’ కాపీని తన కోటు జేబులోంచి తీసి అందజేసాడు.
రాజన్ చూపించిన పేజీలో ఒక గ్రూప్ ఫొటో కనిపించింది. రామన్ కి రష్యన్ రాదు.
“’సోవియట్ ప్రభుత్వానికి సహకరిస్తూన్న అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం’ అనే శీర్షికతో వచ్చిన ఈ గ్రూప్ ఫొటోలో మీవాడు కూడా ఉన్నాడు – ఇదిగో చూడండి,” అన్నాడు రాజన్.
ఐన్ స్టీన్, క్లాస్ ఫ్యూక్స్ ల సరసనఉన్న చంద్రాని గుర్తుపట్టాడు రామన్. ‘ఎప్పుడూ లేనిది, గెడ్డం పెంచాడు,’ అనుకున్నాడు.
“స్విట్జర్లాండ్ లోని సోవియట్ రాయబార కార్యాలయానికి ఉత్తరం రాయండి. అతని తల్లి ఆరోగ్యం బాగోలేదనీ, ఒక్కసారి వచ్చి, చూసి పొమ్మనీ రాయండి,”
“అతన్ని రానిస్తారా?”
“రెడ్ క్రాస్ ద్వారా ఏర్పాటు చేద్దాం. ఇక్కడికి రాగానే – సోవియట్ ఏజెంట్లు బలవంతంగా తనని ఎత్తుకు పోయారని ప్రెస్ స్టేట్మెంటు ఇప్పిద్దాం,”
“ఇదంతా గందరగోళంగా ఉంది,”
“మీరా ఉత్తరం రాయండి. మిగతాది మేము చూసుకుంటాం.”
“నేను ఉత్తరం రాసినంత మాత్రాన సోవియట్ అధికారులు స్పందిస్తారా?”
“తప్పకుండా స్పందిస్తారు. మీకున్న పేరు ప్రఖ్యాతులు అట్లాంటివి,”
‘వీడు నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నాడు’ అనుకుంటూ, “సరే, అలాగే చేద్దాం,” అన్నాడు రామన్.
“మరొక్క విషయం. చంద్రాని తొందరగా రప్పించకపోతే అతని ప్రాణాలకే ముప్పు,” రాజన్ హెచ్చరించాడు.
“ఎవరినుంచి?” – రామన్ గొంతులో ఆందోళన.
“నక్కజిత్తుల బోల్షెవిక్కుల్ని నమ్మలేం. సోవియట్ ప్రభుత్వంతో సహకరించేవాళ్లని నాజీలు మాత్రం విడిచిపెడతారా?”
ఈ రాజన్ సామాన్యుడు కాదనీ, తన మెడమీద కత్తి పెడుతున్నాడని రామన్ కి అర్థం అయింది.
“అవును. ప్రత్యర్థులను మట్టుపెట్టడంలో నాజీలను మించినవాళ్లు లేరు. లక్షల సంఖ్యలో యూదుల్ని హతమార్చడం వెనుక హిమ్లర్ హస్తం ఉందని విన్నాను. నిజమేనా?”
రాజన్ ఉలిక్కిపడి చూశాడు. “ఎక్కడ విన్నారు?” అని అడిగాడు, రామన్ కళ్లల్లోకి నిశితంగా చూస్తూ.
“సోవియట్ రేడియో…” రామన్ గొంతులో సవాలు ధ్వనించింది.
“మీరు సోవియట్ రేడియో చేసే ప్రచారాలని నమ్ముతారా? మీకు తెలిసే ఉంటుంది, వాటిని వినకూడదని నిషేధాఙ్ఞలున్నాయి. స్టాలిన్ ఎంతమందిని చంపించాడో మీరు కనీసం అంచనా కట్టగలరా?” అన్నాడు రాజన్ కటువుగా.
రామన్ కి సమాధానం దొరికిపోయింది.
“సైబీరియాలో ఏమవుతోంది?” అని రామన్ అడిగాడు.
“మాస్కో పతనమయ్యేముందు సోవియట్ సైనికులు, పౌరులు అసంఖ్యాకమైన ఫాక్టరీలను పూర్తిగా ఊడదీసి, రైళ్లల్లో ఎక్కించి సైబీరియా పట్టుకుపోయారు. అక్కడ వాటిని మళ్లీ నిర్మించుకున్నారు. ఆ విధంగా తరలించిన వాటిల్లో ఎన్నో కళాఖండాలు, వాళ్లకు ప్రియమైన వస్తువులూ ఉన్నాయి; లెనిన్ శరీరం కూడా ఉన్నది. మాస్కో యూనివర్సిటీ అక్కడే ఎక్కడో పనిచేస్తున్నదని ప్రవాస ప్రభుత్వం చెబుతోంది,”
“ఇవన్నీ అందరికీ తెలిసినవే,” అన్నాడు రామన్, అసహనంగా.
రాజన్ గొంతు తగ్గించి –
“ఎవరికీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి. ‘వెయ్యి సూర్యులు’ అనే టాప్ సీక్రెట్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నారని మన గూఢచారుల ద్వారా తెలిసింది. యురేనియంని శుద్ధి చేసేందుకు బ్రహ్మాండమైన సెంట్రిఫ్యూజ్ లను నిర్మిస్తున్నట్లుగా మాకు సమాచారం అందింది. చూడడానికవి గ్యాస్ పైపులైన్ల లాగానే ఉంటాయి. ఐన్ స్టైన్ తమ ప్రధాన సలహాదారుడిగా, డాక్టర్ విటాలీ ఖ్లోపిన్ నాయకత్వంలో ఉన్న సోవియట్ శాస్త్రవేత్తల బృందానికి ఓపెన్ హైమెర్ తో సత్సంబంధాలు కొనసాగుతున్నాయని మాకు తెలిసింది. మీకిచ్చిన ప్రాజెక్ట్ బ్రీఫ్ లో వివరాలుంటాయి. సోవియట్ మిలిటరీ వారి రేడియో సంకేతాలను కొన్నిటిని ఛేదించగలిగాం. వాటిల్లో – ‘సిటీ-40’, ‘ప్రాజెక్ట్-1’, ‘లేబోరేటరీ-2’ ఇటువంటి మాటలే ఉన్నాయి. అవెక్కడున్నాయో, అక్కడ ఏమి జరుగుతోందో అంతుచిక్కడం లేదు,”
“గూఢచార విమానాలను పంపి తెలుసుకోవచ్చుకదా?”
“అబ్బే! అవి అంత దూరం ఎగరలేవు. మాస్కో మన చేతిలో ఉందని చెప్పుకోవడమేగానీ గెరిల్లాల దాడుల మూలంగా విమానాశ్రయాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. గెరిల్లాలకి స్థానికుల తోడ్పాటు ఉంది,”
“ఉంటుంది మరి”
“‘నైట్ వింగ్’ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం, సోవియట్ మిలిటరీ పరిశోధనలపై నిఘా పెట్టడం, వాటిని అంతం చెయ్యడమే. ఇంకా చెప్పాలంటే తక్షణ లక్ష్యం ‘సిటీ-40’ ని గుర్తించడం, ధ్వంసం చెయ్యడం,” అన్నాడు, రాజన్.
రాజన్ అన్నదాంట్లో ‘వెయ్యి సూర్యులు’ అనే మాట రామన్ కి ఆసక్తి కలిగించింది.
ఇద్దరూ మళ్లీ హాలులోకి నడిచారు. అప్పటికే అక్కడ ఒక వైపున మిలిటరీవారి ఫొటోగ్రాఫర్లు, ఫిల్మింగ్ క్రూ గుమిగూడి ఉన్నారు.
మరి కాసేపట్లో వోన్ బ్రౌన్, “మిత్రులారా! ఇప్పుడు మీరు అంతరిక్ష శాస్త్రానికి దారిచూపే వీ-టూ రాకెట్ ప్రయోగాన్ని చూస్తారు,” అని అన్నప్పుడు శాస్త్రవేత్తలందరినీ ఒక ఉత్తేజం ఆవహించింది. వోన్ బ్రౌన్ వదనంలో మాత్రం విసుగుదల, అలసట కనిపించాయి.
‘వీ-టూ రాకెట్ టెక్నాలజీని ‘నైట్ వింగ్’ ప్రాజెక్ట్ కోసం వినియోగించే ప్రయత్నంలో జర్మన్లు ఉన్నారు. బహుశా వీటిని జర్మన్ నౌకా దళానికి చెందిన ఓడ ‘స్కార్న్ హార్స్ట్’లో ఇక్కడికి తరలించి ఉంటారు. తమ ప్రతిభను చాటుకోవడం – ఈ డ్రామా అంతా. దీని వెనుక హిమ్లర్ హస్తం ఉండేఉంటుంది, సందేహం లేదు – అనుకున్నాడు రామన్. జర్మన్ల ప్రణాళికనీ, దాన్ని అమలుచెయ్యడంలో వారి సామర్థ్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు.
వోన్ బ్రౌన్ కి అభినందనలు తెలియజేసినప్పుడు, అతడు –
“ఈ ప్రయోగం చాలాసార్లు చేశాంగానీ ప్రతీ సారీ కొత్త ఫీచర్లు చేరుతూ ఉంటాయి – డిజైన్లో,” అన్నాడు.
అంతా క్లబ్బు ఆవరణనుండి బయటకు నడిచారు. శాస్త్రవేత్తల వెంట ఫొటోగ్రాఫర్లు, కేమెరాలు.
***
తుపాను తన దారిని మళ్లించుకున్నట్లుగా ఉంది. వర్షం వెలిసింది. మేఘాలు తొలగిపోయాయి. ఆకాశం నిర్మలంగా ఉంది. తెల్లవారబోతోంది. అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. జీబుగా పెరిగిన చెట్ల నుంచి పక్షుల సందడి. దూరంగా ఊదా రంగులో సముద్రం; బంగారు కిరీటాలు ధరించిన కెరటాల తెల్లటి నురుగు; వాటి కేరింతల సవ్వడి. దూరంగా యారాడ కొండ.
పొగగొట్టం నుంచి పల్చటి నీలం రంగు పొగని వదులుతూ జర్మన్ యుద్ధనౌక ‘స్కార్న్ హార్స్ట్’ లంగరు దించి ఉన్నది. నిర్దయగా ఎక్కుపెట్టి ఉన్న దాని శతఘ్నులు ప్రకృతి ప్రసాదించిన ప్రశాంతతను ఛేదిస్తూ – యుద్ధ భయాన్ని రేపుతున్నవి.
శాస్త్రవేత్తలంతా క్లబ్బుకి దగ్గరలోనే ఉన్న ఊటగెడ్డకి చేరువలో ఎర్రమట్టి దిబ్బల వద్దకు చేరుకున్నారు.
“ఎన్ని మార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేవి – సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు – ఏమంటారు?” వోన్ బ్రౌన్ రామన్ని ప్రశ్నించాడు. అతనిలోని విసుగుదల, అలసట మాయమయ్యాయి.
“అవును. ముఖ్యంగా మా ఉష్ణదేశాలలో,”
“విచిత్రం ఏమిటంటే – ‘సూర్యుడు ఉదయించి ఏడు నిమిషాలు గడిచిపోయాకనే మనకు సూర్యోదయం అగుపడుతుంది. ఫోటాన్లు భూమిని చేరుకొనేందుకు సమయం పడుతుంది,”
“మనకు కనిపించేదొకటి, నిజంగా జరుగుతున్నది మరొకటీ,” అన్నాడు రామన్.
ఇద్దరూ నవ్వుకున్నారు.
“ఈ ఎర్రమట్టి దిబ్బల్ని చూస్తూంటే అంగారకగ్రహ ఉపరితలం ఇలాగే ఉంటుందేమో అనిపిస్తోంది కదూ?” అన్నాడు వోన్ బ్రౌన్ ఉత్సాహంగా.
“అవును, అవి ఈ ప్రాంతపు ప్రత్యేకతల్లో ఒకటి…మీరన్నట్లు భవిష్యత్తులో మనుష్యులు ప్రయోగించే ఉపగ్రహాలు ఇతర గ్రహాలను చేరుకుంటాయేమో? ఎవరు చెప్పగలరు?” అంటూ వోన్ బ్రౌన్ ఉత్సాహానికి రామన్ తన ఆశాభావాన్ని జోడించాడు.
“భవిష్యత్తులో అంతరిక్ష శాస్త్రం సాధించగల విజయాలను ఊహించడం కూడా అసాధ్యం,” అన్నాడు వోన్ బ్రౌన్ – సాలోచనగా.
అది అతనికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయం. ఆ అంశంపై అతడు కొన్ని సైన్స్-ఫిక్షన్ రచనలుకూడా చేసి ఉన్నాడని రామన్ తో సహా చాలామంది శాస్త్రవేత్తలకు తెలుసు.
పబ్లిక్ ఎడ్రస్ సిస్టం లో వోన్ బ్రౌన్ కి పిలుపు వచ్చింది.
“లాంచింగ్ కి టైమవుతోంది” అని అతడు రామన్ వద్ద సెలవు తీసుకున్నాడు.
దూరంగా పచ్చని ఉదయపుటెండలో మిలిటరీ ట్రక్కుపై అమర్చిన వీ-టూ రాకెట్, అతిశీతల ఇంధనాన్ని నింపుకుంటూ ప్రయోగానికి సంసిద్ధం అవుతోంది. తేమగాలి పొగలుకక్కుతోంది. అందరికీ బైనాక్యులర్స్ ఇచ్చారు. మరి కాసేపట్లో బోస్, హిమ్లర్ లు అక్కడికి చేరుకున్నారు.
“మీతో కొంచెం మాట్లాడాలి,” అంటూ నేతాజీ రామన్ ఉన్నచోటికి వచ్చాడు. ఇద్దరూ గుంపుకి దూరంగా నడిచారు.
హిమ్లర్ తన దేశపు శాస్త్రవేత్తలతో ఉత్సాహంగా సంభాషిస్తున్నాడు.
“డాక్టర్ రామన్! నిర్మొహమాటంగా మీ అభిప్రాయం చెప్పండి. రెండు మూడేళ్లలో ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టడం సాధ్యమేనంటారా?” అన్నాడు, బోస్.
“చెప్పడం కష్టం. చాలా అడ్డంకుల్ని అధిగమించాలి. రాకెట్ ఇంధనం విషయంలోనే ఇంకా అంగీకారం రాలేదు. ఉపగ్రహం, డేటాని భూతలానికి ఎలా పంపుతుందో ఎవరికీ తెలీదు. కేమెరాల్ని కంట్రోల్ చేసే విధానంపై స్పష్టత లేదు. ఇలా చాలా ఉన్నాయి. ఐదేళ్లల్లో సాధ్యపడవచ్చు. ఇది పూర్తిగా కొత్త శాస్త్రం,” రామన్ వివరించాడు.
“నాకూ అలానే అనిపించింది…నాకు ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టు సమాచారం తెలియజేస్తూండాలి,”
నేతాజీ పట్టుబట్టి ఆఖరి నిమిషంలో తనను ప్రాజెక్ట్ టీంలో చేర్పించాడని రామన్ కి అర్థం అయింది.
“అలాగే…మీతో ఒక మాట చెప్పాలి. మిలిటరీ వ్యవహారాల్లో నాకంత ఆసక్తి లేదుగానీ, ఉపగ్రహాలతో చాలా ప్రజోపయోగకరమైన పనులు సాధించవచ్చు. వాతావరణాన్ని మానిటర్ చెయ్యడానికీ, కమ్యూనికేషన్ వ్యవస్థని నెలకొల్పడానికీ వినియోగించవచ్చని నాకనిపించింది,”
“పరిశోధనలన్నీ మొదట సైనికావసరాలకోసమే జరుగుతాయి. ఆ తరవాతే పౌరుల ప్రసక్తి,” అన్నాడు నేతాజీ.
రామన్ నిట్టూర్చాడు. “మీరన్నది నిజం,” అన్నాడు.
సైరన్ మ్రోగింది; జర్మన్ సైనికాధికారులు, శాస్త్రవేత్తలు మెరుగుపరచిన వీ-టూ రాకెట్ ను ప్రయోగించారు. చెవులు చిల్లులుపడేలా శబ్దంచేస్తూ రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. మరి కొద్ది సెకెండ్లలోనే తూర్పు వైపుకి తన దిశను మార్చుకొని బంగాళాఖాతంపైకి మళ్లింది.
“జర్మన్ నేవల్ షిప్పులు రాకెట్ ని రేడార్లలో గమనిస్తున్నాయి” అన్నాడు బోస్.
ఆ క్షణంలో రామన్ కి ఒక్కసారిగా అంతా అర్థం అయిపోయింది.
‘గత్యంతరం లేక రష్యన్లు అణ్వాస్త్ర పరిశోధనపై దృష్టి పెట్టారు. సంప్రదాయ యుద్ధరీతిలో పై పట్టు సాధించిన జర్మన్లు అంతరిక్షశాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నారు. చంద్రాని క్రిందటిసారి కలిసినప్పుడు అణు ప్రతిక్రియలపై చాలాసేపు చర్చ జరిగింది. ‘అణ్వాస్త్రాలు యుద్ధగతిని పూర్తిగా మార్చివెయ్యగలవు’ అన్నాడు చంద్రా.
సోవియట్ల విజయం తప్పదని నేతాజీ భావిస్తున్నాడా? మూడుముక్కలైన భారతదేశాన్ని ఏకం చెయ్యడం తన లక్ష్యం అని ఇటీవల చేసిన రేడియో ప్రసంగపు ఆంతర్యం ఏమై ఉంటుంది? ఆధునిక శాస్త్రీయ పరిశోధనలపై భారతీయుల పట్టుని పెంచుకోవాలని చూస్తున్నాడా? జర్మన్లను పక్కనపెట్టి, సమాంతరంగా అణ్వస్త్ర పరిశోధనలకు ఉపక్రమిస్తున్నాడా? చంద్రాని రప్పించే ప్రయత్నం వెనుక ఉన్న గుట్టు ఇదేనా?… రామన్ ఇక ఉండబట్టలేక –
“సోవియట్ అణుప్రాజెక్టుకి ‘వెయ్యి సూర్యులు’ అని పేరుపెట్టడం కాకతాళీయం కాదని నాకనిపిస్తోంది. భారతీయ తత్వశాస్త్రంతో ఓపెన్ హైమర్ కి బాగా లోతైన పరిచయం ఉంది,” అన్నాడు.
“రహస్య పరిశోధనలకు అంత సులభంగా అర్థం అయిపోయే పేరుని ఎందుకు పెట్టుకుంటారు?” బోస్ అనుమానం ప్రకటించాడు.
“అది ఒక హెచ్చరిక, లేదా సంకేతం కావచ్చు. దాని మూలాలు భగవద్గీతలో ఉన్నాయి,”
“మీకా శ్లోకం గుర్తుందా?” అని రామన్ మొహంలోకి పరిశీలనగా చూశాడు బోస్.
‘‘’దివి సూర్య సహస్రస్య భవేత్ యుగ పద్ ఉత్థిదా, యది భాహ్ సదృశీ సా స్యద్భాసస్తస్య మహాత్మానాహ్’ (వెయ్యి సూర్యులు ఒకే సారి ఉదయించినట్లయితే, అప్పుడు సంభవించే మహాకాంతి వంటిది విశ్వరూపం) అని గుర్తు…ఈ రోజున మనం చూసింది మరో బ్రహ్మాస్త్రం. కురుక్షేత్ర యుద్ధం ముగిసేముందు అర్జునుడు, అశ్వత్థామ – ఇద్దరూ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధపడ్డారు,”
నేతాజీ నవ్వి, “అవును. నారదుడూ, వ్యాసుడూ వాళ్లని అడ్డుకున్నారు. ఈనాడు అటువంటి మహా ఋషులెవరూ నాకు కానరావడం లేదు. బహుశా మనమే ఆ పాత్రను పోషించాలేమో?” అన్నాడు, గుంభనంగా. ఇద్దరూ మౌనం వహించారు.
బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని రాకెట్ విజయవంతంగా ఛేదించిందని ఒక మహిళా అనౌన్సర్, లౌడ్ స్పీకర్లో ప్రకటించింది. అంతటా కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి.
“మీ రిపోర్టులకోసం చూస్తూంటాను. వాటిని రాజన్ కి అందజేయండి. నాకు చేరుతాయి,” అనేసి – హిమ్లర్ కి అభినందనలు తెలిపేందుకు పెద్దపెద్ద అంగలువేస్తూ జర్మన్ బృందం వైపుగా నడువనారంభించాడు బోస్. రామన్ అక్కడే ఉండిపోయాడు.
ఎప్పుడూ చిటచిటలాడుతూ ఉండే హిమ్లర్ ఆనందం పట్టలేకపోతున్నాడు. అతని విషపునవ్వు ఎర్రమట్టి దిబ్బల నడుమ ప్రతిధ్వనిస్తోంది.
ఆ సమయంలో రామన్ కళ్లకి హిమ్లర్ కప్పుకున్న మేకతోలుని కూడా విసర్జించి నిర్భయంగా సంచరిస్తూన్న తోడేలు లాగా, అతనితో కరచాలనం చేసేందుకు చేతిని చాచిన నేతాజీ – పులిమీద స్వారీ చేస్తూన్న యోధుడిలాగా అగుపించారు.
‘నేతాజీ చేస్తున్నది దుస్సాహసమా? వీరోచితకృత్యమా? రాబోయే కాలమే నిర్ణయిస్తుంది – ఆలోగా మానవజాతి అంతం కాకుండా ఉంటే,’ అనుకున్నాడు రామన్.
బాగా పొద్దెక్కింది. రాకెట్, తాను వెళ్లిన దారిలో వెండి గొలుసు వంటి పొగను గుర్తుగా వదిలిపెట్టింది. ఆ పొగకూడా గాలికి నెమ్మదిగా చెదిరిపోతోంది.
oOo

ఉణుదుర్తి సుధాకర్

19 comments

Leave a Reply to సి.యస్.రాంబాబు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇటువంటి కధనం తెలుగు లో నేను చదివిన గుర్తు లేదు. అంతర్జాతీయ చరిత్రకి కల్పనని జోడించిన అద్భుతమైన కధనం. మన పాఠకులు దీనిని ఎంతవరకు ఆహ్వానిస్తారు, ఆస్వాదిస్తారో చూడాలి.

    • ధన్యవాదాలు, మిత్రమా! పాఠకుల స్పందన ఉత్సాహకరంగా ఉంది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను!

  • ఆల్టర్నేట్ హిస్టరీ అనేది సైఫీ లో ఒక ప్రక్రియ .Man on the high castle ఫిలిప్ డిక్ రాసిన నవల ,టివీ సిరీస్ లో రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆమెరికాని జర్మనీ , జపాన్ ఆక్రమించుకుని పరిపాలన చేయడం , అమెరికన్ రెసిస్టెన్స్ ఇతివృత్తం . బావుంటుంది.
    నేను రాసిన సమాంతరం అనే పెద్ద కథ లో సమాంతర విశ్వం లో మరొక కమ్యూనిస్టు లు పాలించే భారతదేశం వున్నట్లు అక్కడ నుంచి వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఇక్కడ నియంతని హత్య చేసి పారి పోవడం అతనిని అతని లానే ఈ ప్రపంచంలో వున్న సుబ్రావ్ అనే ఆఫీసర్ వెంబడించం ఇతివృత్తం గా రాశాను.సమాంతర విశ్వాలు కూడా సైఫీ లో ఉపశాఖలు.అర్థం కాలేదని విమర్శలు ఎదుర్కొన్నాను.కానీ ఇవీ ఎన్నో ఆంగ్ల సైఫీ లో ఆమోదం పొందినా యి.
    మీ కథ మంచి ప్రయత్నం . బావుంది.బోస్ ,జర్మనీ గెలిస్తే మనం అంతా జర్మన్ భాష మాట్లాడే వాళ్ళమేమో.సందేహం లేదు.చరిత్రలో గెలిచి న వాడిదే సంస్కృతి , రాజ్యం.
    ఇలాంటి కథలు వల్ల ఆ అవగాహన వస్తుంది.తెలుగులో ఇలాంటి ప్రయోగాలు జరగాలి అనే నా ఆశ.

    • ధన్యవాదాలు, మధు చిత్తర్వుగారూ!

      మీ నుండి ఈ స్పందన వచ్చిందంటే మా తొలి ప్రయోగం విజయవంతం అయిందనే భావిస్తున్నాము.

      అవును, తెలుగు సాహిత్యంలో కొత్త పోకడలు అవసరం.

      కొత్తని ప్రోత్సహిస్తూన్న ‘సారంగ’ సంపాదకులకు కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలి!

  • ఉత్కంఠతో సాగిన కథ.
    కథను నడపటమెలాగో సుధాకర్ గారికి బాగా తెలుసు

    • థాంక్స్, రాంబాబుగారూ!

      విషయం, విధానం ఏవైనప్పటికీ చదింపజేసే లక్షణం ప్రధానం అని మా ఇద్దరి నమ్మిక.

      అది లేకపోతే కథే లేదు!

    • థాంక్స్, రాంబాబుగారూ!

      విషయం, విధానం ఏవైనప్పటికీ చదివింపజేసే లక్షణం ప్రధానం అని మా ఇద్దరి నమ్మిక.

      అది లేకపోతే కథే లేదు!

  • చరిత్రలో అట్లా కాక మరోలా జరిగితే ఎలా ఉంటుంది? అన్న ప్రశ్న తరచు వింటూంటాము. అనేక ‘మరోలాలు’ జరిగితే బహుశా ఇలా ఉంటుంది. తెలుగు ఫిక్షన్ కి ఇది కొత్త కిటికి. బావుంది.

    • ప్రత్యామ్నాయ చరిత్రను సృజనాత్మక సాహిత్యంలో శోధించడం పాశ్చాత్య సాహిత్యంలో కొంత కాలంగా నడుస్తున్నది.

      వాస్తవాలను ఊహాగానాలతో నమ్మశక్యంగా మేళవించగలిగితే, అది ముందుకి వెళుతుంది.

      చరిత్రలాగానే ప్రత్యామ్నాయ నిర్మాణాలుకూడా మనకు పాఠాలు నేర్పగలవు.

      ధన్యవాదాలు!

  • నాకు చాలా నచ్చింది. ఉత్సాహంగా అనిపించింది. ‌ హిమ్లరు విశాపట్నం లో ఏంతినేవాడో ఏంటో! యారాడ బీచ్ లో నార్మండీ. కానీ బోస్ !!!! అయ్యో. ఎలా?

    • అవును, ఏం తినేవాడో!?

      వివరాలలోనే దెయ్యం దాగి ఉంటుంది మరి! ధన్యవాదాలు!!

  • As complemented over phone well written scientific fiction. I am particularly happy Yaradakonda is there in this story.

    • అవును. సముద్రతీరం లేకపోతే విశాఖ లేదు. యారాడకొండ లేకపోతే విశాఖ సముద్రతీరం లేదు.
      ధన్యవాదాలు, మిత్రమా!

  • హిస్టరీని జోడిస్తూ రాసిన సైన్స్ ఫిక్షన్ కధ ” రెక్కలు చాచిన రాత్రి ” గొప్పగా ఉంది, అభినందనలు ఉణుదుర్తి సుధాకర్ గారు & జైదీప్. ( ఇందులో సింహభాగం క్రెడిట్ జైదీప్ కు చెందుతుంది అని త్రిపుర గారి వీరాభిమానుల ప్రఘాడ విశ్వాశం ).

    యుద్ధరీతిపై పట్టు సాధించే సైనికావసరాల కోసం జర్మన్లు అంతరిక్షశాస్త్రాన్ని ఆశ్రయించి… వీ-టూ రాకెట్ ప్రయోగంతో అణ్వస్త్ర ఆయుధాలని శత్రుస్థావరాలపైకి సంధించటం ధ్యేయంగా పెట్టుకున్న నాజీ హిమ్లర్ ఒకవైపు … ప్రజోపయోగకరమైన పనుల కోసం రాకెట్ ప్రయోగంతో ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టి వాతావరణాన్ని మానిటర్ చెయ్యడం, కమ్యూనికేషన్ వ్యవస్థని నెలకొల్పడం… గురించి డాక్టర్ సీ.వీ. రామన్ తో చర్చించిన నేతాజీ బోస్ మరోవైపు… అలాస్కాలో జరిగిన కాంఫరెన్స్ తర్వాత సైబీరియా వెళ్లి సోవియట్ శాస్త్రవేత్తల బృందానికి ‘వెయ్యి సూర్యులు’ అనే టాప్ సీక్రెట్ అణ్వస్త్రాల ప్రాజెక్ట్ లో సాయం చేస్తున్న రామన్ గారి మేనల్లుడు నోబెల్ చంద్రా ప్రస్థావన…

    అతితక్కువ ఇంధనంతో ఉపగ్రహాన్ని ఆ కక్షలో ప్రవేశపెట్టేందుకు ఉపగ్రహ రాకెట్ ప్రయోగానికి భూమధ్య రేఖకు దగ్గర మెడ్రాస్ దగ్గర ఉన్న శ్రీహరికోట అనువైన ప్రదేశం… యుధ్ధ ఆయుధాలు మోసుకెళ్లే రాకెట్ ప్రయోగానికి ఒఢిస్సా తీరం లోని బాలాసూర్ అనువైన ప్రదేశం… యీ నిర్ణయాల కీలక శాస్త్రవేత్త పేరు ప్రస్థావనకు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది.

    బంగాళాఖాతంలోకి వచ్చే వాయుగుండాలన్నీ అండమాన్ లేదూ కూసింత ముందుకుపోయి కార్ నికోబార్ ద్వీపాల వద్దే మొదలవుతాయని శాస్త్రవేత్తలు చెపుతారు.

  • కథ చాలా బాగుంది, అది దేశచరిత్రను, సైన్సుని, సయింటిస్టులని, వాటి కోసం పాటు పడిన నాయకులని .. పరిచయం చేసింది.

    • ధన్యవాదాలు, భరత్ గారూ!
      మీరన్నది నిజం. కథలో పేర్కొన్న శాస్త్రవేత్తలంతా వాస్తవంగా ఆకాలానికి చెందిన వారే. వారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొనే పాఠకులు గూగుల్ సహకారం తీసుకోవాలని మా కోరిక.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు