రెండో ముద్దు

రెండో ముద్దు

ఇంత రాత్రి పూట ఈ బాల్కనీ నుంచి కిందికి చూస్తూ, ఈ రోడ్డు కొత్తగా పడటాన్ని గమనిస్తూ, ఏదో ఒక రాత్రి సరిగ్గా ఈ నిమిషం నువ్వు నా పక్కన ఉండటాన్ని కోరుకుంటాను.

ఒక రోజులో నాకు సంబంధించిన, మనిద్దరం కలిసి ఉన్న పరిస్థితుల్లో నేనెక్కడా లేకున్నా నువ్వు గుర్తుస్తావు. ప్రతి చిన్న దాన్ని నీతో కలుపుకొని ఆలోచిస్తూ వెనక్కి వెళ్లి వస్తాను.

నిన్న నిన్ను కలిసిన తర్వాత ఆటో బుక్ చేసుకున్నానా, అది నువ్వు నిలబడ్డ సందులోంచి, పక్క సందులోకి తిరగ్గానే, నేన్నీకు మెసేజ్ పెడతాను. ఎన్నేళ్లనించి నా జీవితంలో ఉన్నావు నువ్వు! అనిపిస్తుంది.

అంతకుముందు పనిచేసిన ఆఫీసులోకి విజిటర్స్ పాస్ తీసుకొని వెళ్తాను. ఇదే ఆఫీసుకి, “పోయావా?” అని నువ్వు నాకు రోజూ మెసేజ్ పెట్టేదానివి. పదకొండున్నరకి నేను బయటికొచ్చి నీకు కాల్ చేసేవాడ్ని. ఇదంతా అచ్చంగా ఇలాగే జరగదని కూడా నీకు చెప్పుకోవాలనిపిస్తుంది. ఆఫీస్‍లో చెక్ తీసుకొని, పెన్షన్ ఆఫీసు స్టాపు వరకు నడిచి, షేర్ ఆటో ఎక్కి రోడ్ నెంబర్ పన్నెండులో పోతుంటాను.

దార్లో కనిపించే ప్రతిదీ, ఇంతకుముముందు చూసినా, ఇప్పుడు నీకు చెప్పడం కోసం జాగ్రత్తగా దాచుకుంటున్నా. ఒక్కోసారి ఇలా దాచిపెట్టుకున్నవి కొన్ని.. రోజు చివరికి వచ్చేసరికి మర్చిపోతా. ఇంకోసారెప్పుడో గుర్తొచ్చినప్పుడు సరిగ్గా ఇక్కడ ఇది చూశానని చెప్తాను చూడూ… ఆ రోజు నేను ఈ రోడ్ నెంబర్ పన్నెండు ప్రయాణాన్ని మిస్సవుతాను. ఈ జీవితమంతా కేవలం నీకోసం, నీకు చూపించడానికి, నీకు చెప్పడానికి బతుకుతున్నట్టు అనిపిస్తుంది నాకు.

నువ్వు గుర్తొచ్చిన ప్రతిక్షణం నిన్ను ఎదురుగా కూర్చోబెట్టుకొని ఏదన్నా చెప్పాలనుకుంటా. ఆటోలో వెళ్తుంటే, ఒక పూల షాపు దగ్గర, ఒక పెద్దావిడ, చాప మీద పడుకొనే, ఎవరన్నా గిరాకీ వస్తే లేచివ్వడం, లేదా అక్కడే అలాగే ఉండి ఆ గిరాకీ ఇవ్వడం చేస్తోంది.

ఎండాకాలం మధ్యాహ్నాలు అమ్మ ఇలాగే ఉండేది. షాపుకి ఎవరన్నా వస్తారేమోనని పడుకోకపోవడం, వస్తే ఎలా లేవాలా అని ఆలోచించడం.

ఎవడో ఆటాణా కొనడానికి వచ్చి అమ్మను లేపినప్పుడు (ఇది నేను జబ్బుపడి లేవలేని రోజుల్లో ఉన్నప్పుడు) అమ్మ వాడ్ని తిట్టుకుంటుంది. ఇది భలే గమ్మత్తుగా ఉంటుంది, ఆ ఆటాణా గిరాకీ కూడా పోనివ్వకపోవడం. నీతో సహా నాకు తెలిసిన ఆడవాళ్లు ఎవరైనా రోడ్డు మీదకి ఉన్న ఇలాంటి షాపుల్లో, ఒక చాప మీద ఇంత కాన్షియస్ ఫ్రీగా కాస్త ఒరిగి పడుకోగలరా అని ఆలోచిస్తే, నేనిప్పుడు నీకు చెప్పిన ముచ్చట ఎంతా పాతది అనిపిస్తుంది. నువ్వు నాకు అప్పట్నుంచీ పరిచయం అనుకుంటాను.

ఆ పూల షాపు దగ్గర్నే ఆగిన ఆటో అతణ్ని, దుర్గం చెరువుకు ఇరవై రూపాయల లెక్కన బేరమాడి ముగ్గురు ముసలోళ్లు ఎక్కారు. అప్పటికే అందులో ఒకామె ఉంది. నేను డ్రైవర్ పక్క సీటుకొచ్చి కూర్చుంటే, వాళ్లు నలుగురు వెనుక సర్దుకొని కూర్చున్నారు.

అంతకుముందు నుంచీ అందులో ఉన్నామె దిగగానే, ఆ ముగ్గురూ సరిగ్గ సర్దుకున్నారు.

అప్పుడు అందులో ఒకామె అంటుంది – “ఇగ మంచిగ కూసోలే దొరసాని!” అని. అసలేమాత్రం సంబంధం లేకున్నా వీళ్ల మాటల్లో నువ్వు గుర్తొస్తావు. నిన్నలా మోసుకెళ్తూనే ఉంటాను. పని చేసుకుంటాను. తిరిగొస్తాను. తింటాను. రోడ్ల మీద తిరుగుతుంటాను. మనం నడిచే దార్లో నడుస్తాను. మళ్లీ ఆఫీసుకి పోతాను. దార్లో నీకు ఫోన్ చేస్తాను. ఏవేవో కనిపిస్తాయి ఈ దార్లో.

ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడటం లేదని ఏడుస్తాను.

రాత్రి కేఫ్ ఇంటర్వెల్‍కి వెళ్తాను. మనం మొదటిసారి డేట్‍కి వెళ్లిన రోజు నేను అలిగి వెళ్లిపోతానంటే, నువ్వు నా చెయ్యి పట్టుకొని ఆపిన ప్లేసు ఇదేనని గుర్తు తెచ్చుకుంటాను.

ఈ దారంతా నడిచొచ్చి, ఇక్కడ ఇలాగే బెడ్ మీద పడిపోయి, నిన్ను ఇలాంటి రాత్రులెన్నో తల్చుకుని, నీకు చెప్పాలనుకున్న కబుర్లన్నీ దాచిపెట్టుకొని, నీకోసమే, నువ్వు “చెప్పు” అని అడగడం కోసం ఎదురుచూస్తుంటా.

నువ్వు ఇంత రాత్రప్పుడు నిద్రలో ఉంటావని తెలిసి కూడా, ఆ నిద్రలోనే నీకో ముద్దు పెట్టాలనుకుంటా.

నువ్వు ఆ ముద్దుకు భయపడి లేవగానే, ఈ దార్లో నిన్ను వెంటేసుకొని తిరుగుతూ, నువ్వు చూడని ఇంకో విషయాన్నేదో చూపించి నిన్ను మరిపించాలి.

నీకు ఇలా చేస్తున్నట్టు తెలిసినా తెలియనట్టే ఉండాలి.

ఆ తెలియని అమాయకత్వాన్ని నటిస్తావు చూడూ.. అప్పుడు పెట్టే ఆ రెండో ముద్దు..

నేను దగ్గరికి లాక్కుంటే, నువ్వు కళ్లు మూసుకునే ఆ రెండో ముద్దు..

నాకు ఇప్పుడంటే ఇప్పుడే కావాలి.

             *

 

 

వి. మల్లికార్జున్

కొత్త కథకి సరికొత్త వాగ్దానం మల్లికార్జున్. రాసిన ప్రతి వాక్యం భిన్నంగా రాయాలన్న తపన. తను చెప్పాలనుకున్న కథకి ప్రయోగమనే గీటురాయి మీద నిరంతరం పరీక్షించుకునే నూత్న పథికుడు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మల్లీ, కీపీట్ అప్. ప్రేమ కథల్లో విజయం సాధిస్తున్నావు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు