రెండూ ప్రశాంతంగా ఉంటాయి. ఒడ్డును ప్రేమించి వెనక్కు తగ్గినట్లు, పిపీలికాలైన మనుషుల్ని చూసీ చూడనట్లు, నీలి ఆకాశంతో స్నేహం చేస్తూ, మేఘాల దృష్టిని ఆకర్షిస్తూ అనంతయానం చేస్తూంటాయి. ఒకటి హిందూ మహాసముద్రం, రెండు దక్షిణ సముద్రం గా పిలిచే పసిఫిక్ మహా సముద్రం. రెండూ స్వచ్చంగా ప్రవహిస్తూ, నేలల్ని వేరు చేస్తూ భూగోళాన్ని ఆవరిస్తాయి. పేర్లూ, సరిహద్దులూ మనం సృష్టించుకున్నాం కాని నీళ్లు కలిసే ఉంటాయి. మనుషులే వేరు. రంగులూ, ఎత్తు పొడవులూ వేర్వేరు కావచ్చు. ఒకరు చిన్ని కళ్లతో, మరొకరు నీలి కళ్లతో, మరొకరు విశాల నేత్రాలతో విప్పారి చూస్తూ రకరకాల సమాజాల మధ్య, రకరకాల ఆలోచనల మధ్య సంఘర్షిస్తూ ఉంటారు. వారి కళ్లల్లో నీలి సముద్రాలు, వారి ఆలోచనల్లో అగాధ సంద్రాలు. కెరటాల్లా పడిలేస్తూ, అలల్లా ఒకో సారి అవధులు లేని ప్రేమను ప్రదర్శిస్తూ, మరో సారి విశృంఖలంగా వెనక్కు నెట్టేస్తూ, ఒకసారి తడిఇసుకను పంపి కాలి వ్రేళ్లను సిగ్గుతో తడిమి, పాదాలను భావావేశంతో తాకి, మరో సారి మీదపడిన మృత్యుపరిష్వంగంలో లాక్కునే మనుషులే వారు. వారెప్పుడూ అనంతాకాశం, అనంత సముద్రాల మధ్య అద్వైతాంధకారంలో…
సెప్టెంబర్ 28, 29 తేదీల్లో అఖిల భారత రచయితల ఉత్సవానికి హాజరై భారత భూభాగంలోని అండమాన్ లో పోర్ట్ బ్లయర్ వద్ద సముద్రాన్ని చూసినప్పుడూ, నవంబర్ 3, 4 తేదీల్లో ఆస్ట్రేలియా ఖండంలోని మెల్ బోర్న్ లో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు వెళ్లి, దక్షిణ సంద్రాన్ని వీక్షించినప్పుడూ రెండు ఆకాశాలూ, రెండు సముద్రాలూ, రెండు సమావేశాలూ నా ఆలోచనలకు వారధిగా నిలిచాయి.
నేను ఉచ్చరించని పదం,
నేను అనుభవించని అనుభూతి,
నీవు లేని ప్రదేశం,
కలిసిపోయాయి
నా హృదయంలో, చీకటిలో..
ఓహ్..
నా ఒంటరి నిట్టూర్పు
కవోష్ణ పొడి గాలిలా
ఎగిసిపడుతోంది
ప్రచండ స్వానంలా..
విషం వెదజల్లే పడగ ఊపిరిలా…
అని చదివిన తమిళ కవి ముత్తమిళ్ విరుంబి నన్ను కనపడిన వెంటనే ఆకర్షించాడు. కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించిన అఖిల భారత రచయితల ఉత్సవంలో ఇది పాల్గొనడం నాకు ఇన్నేళ్లలో నాలుగోసారో, అయిదో సారో కావచ్చు. కాని ప్రతిసారీ కొందరు కవులు, రచయితలు నన్ను తమలో విలీనం చేసుకుంటారు.
చితిమంటల్లో కాలే
శవాన్ని చూసే ఛండాలుడిని
ద్వేషంతో ధగ్గమవుతున్న
నా హృదయపు జ్వాలల్లో
నీ చేతుల్ని వెచ్చపరుచుకునేందు
రా.. లేచిరా…
అని రాసిన ప్రముఖ అస్సామీ కవి జ్ఞాన పూజారీ,
ఆకాశం ఒకోసారి
నా గదిలోకి ప్రవేశించేందుకు
ప్రయత్నించి
విఫలమవుతుంది
…
ఇవాళ ఎవరైనా చంద్రుడిని
కొనవచ్చు ఏదో ఒక ధరకు
విషాదం, సంతాపం
నిండిన వెన్నెల కాంతి
కవితల్లోకి ప్రవేశించదు
ఇప్పుడు రహస్య మాళిగల్లో
అంధకారోత్సవం ప్రకాశిస్తుంది..
అన్న త్రిపుర కవి చంద్రకాంత్ మురా సింగ్.
నా ఊపిరికోసం
సముద్రపు గాలుల ద్వారాన్ని తెరవండి
నా దేహం నేలలోంచి పూలలా
వికసించనీయండి
నేలను తడిపిన నీరు మండి
తొలి వాన చినుకుల్లా మారనీండి…
అని రాసిన ప్రముఖ పంజాబీ కవి సుర్జిత్ పాతర్,
ఈ రోజు భయానక రాత్రి
నీకూ, నాకూ తెలుసు
విడిపోయే రాత్రని
ఈ దీర్ఘకాలం మనమిద్దరమూ
ఘర్షిస్తూనే ఉన్నాం
ఇవాళ మనమిద్దరమూ
కలిసికట్టుగా
చివరి ప్రయాణంలో..
నీ చివరి చుంబనం, నీ చివరి ఆలింగనం
ఎంత చేదుగా….
నీ చరిత్ర శిథిలాల మధ్య
విత్తనం పగిలి ఒకే మొక్క
లేత ఆకై పల్లవించింది..
అని రాసిన మణిపూరి కవయిత్రి అరంబన్ మెంచౌబీ…
ఒక నీలి మేఘం మౌనంగా వచ్చి నా కిటికీ వద్ద ఆగింది.. అని రాసిన అస్సామీ కవయిత్రి తులికా చేతియా యెన్
నేనివాళ నన్ను నేను కలుసుకుని
అల్లకల్లోలమయ్యాను…
నా నిజస్వరూపం ఎంత క్రూరమైనది
ఎంత భయావహమైనది..
అని ఆత్మ సాక్షాత్కారం చేసుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడు మాధవ్ కౌశిక్,
ఇక్కడ ఎవరూ అస్శ్యశ్యులు కారు, ఎవరూ భిక్షుకులూ కారు.. అని అండమాన్ గురించి చెప్పిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రఘువీర చౌదరి ఇలా ఎందరో ఈ సమావేశాల్లో నన్ను హత్తుకున్నారు. భారత దేశంలో ఎక్కడ ఇలాంటి సమావేశాలకు వెళ్లినా చూపులతో, ఆలోచనలతో, హృదయాలతో మమేకం అయ్యేవారు కనపడతారు.
ఆమెను వారు నగ్నంగా ఊరేగించినప్పుడు
ఆమెను వేటాడుతూ,
మంత్రగత్తె అంటూ
ముడతలు పడ్డ ఆమె దేహంలో
పురాతన స్తనాలను
రాళ్లతో గాయపరుస్తున్నప్పుడు
నిశ్చలమైన ఆమె కళ్లు
చుక్కకూడా కాల్చేందుకు
నిరాకరిస్తూ నాపై ఒక్క క్షణం ఆగినప్పుడు
నా పిరికి చూపులను మళ్లించినప్పుడు..
మరిచిపోయానేమో..ఆమె
పొరుగువారి పిల్లలపై చూపిన ప్రేమను
గుర్తురాలేదేమో..మా జేబుల్లో మాంత్రికంగా జొప్పించిన
లేత మామిడి వగరు రుచి
తలపురాలేదేమో..మా అరాచకపు కేశాలపై ఆమె అమరిన
మందారం, దేవగన్నేరు పుష్పాల పరిమళం
జ్ఞాపకం రాలేదేమో.. ఎన్నో సార్లు
మా అమ్మ దెబ్బలనుంచి సకాలంలో కాపాడిన రోజులు…
పల్లెపిల్లలు జబ్బుకు గురయ్యారని,
మూడు ఆవులు, ఒంటి కంటి శునకమూ పోయాయని
ఆమెను వారు ధగ్దం చేస్తుంటే ఊరుకున్నాను
ఆమె అరఎకరమూ స్వాధీనం కోసం
ఆమెను అగ్నికి అధీనం చేశారని తెలిసీ
మౌనంలో మండిపోయాను….
అని రాసిన కవయిత్రి నేహా బన్సల్ అండమాన్ కళా సాంస్కృతిక విభాగం కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారిణి అని తెలిసి ఆశ్చర్యపోయాను.
కేంద్ర సాహిత్య అకాడమీ సమావేశాల్లో ఒకోసారి అధికారుల్లో కవుల్నీ, కవుల్లో అధికారుల్నీ కలుసుకునే అవకాశం లభిస్తుంది. ఒక జర్నలిస్టుగా నాకు రోజంతా రక్తపిపాసులు, నరహంతకులతో కరచాలనం చేసి రాత్రి నాలో నేను కనలిపోతూ..వెన్నెలను కాగితాలపై ఆలోచనలుగా జ్వలింపచేసే అవకాశం ఎప్పుడూ ఉంటుంది..ఇదే విషయం నేను నా ప్రసంగంలో ప్రస్తావించాను..
‘భారత దేశం లో రచన ఎన్ని వేన వేళ్ల క్రితం ప్రారంభమయిందో చెప్పలేం.. దేశ చారిత్రక అవశేషాలు బయటపడుతున్న కొద్దీ, కవితలూ, కథలూ వెల్లువలా తమ ప్రాచీన స్మృతులతో మనను అలరిస్తూనే ఉంటాయి..’అన్నారు సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు తన అండమాన్ ప్రసంగంలో.. ‘మీరు అవునన్నా కాదన్నా భారత దేశం కవితలు, కథల కాణాచి..’ అన్నారాయన. ‘ఆనో భద్రా క్రతవో యంతు విశ్వతః’ అని రుగ్వేదంలో చెప్పినట్లు గొప్ప ఆలోచనలు అన్ని దిక్కుల నుంచి రావాలనే ధ్యేయంగా, దేశ వ్యాప్తంగా ఉన్న మంచిరచయితలందర్నీ ఒకే వేదికపై రప్పించి కొత్త ఆలోచనలు పురుడుపోసుకునేలా చేసేందుకే ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ఇదే మన భారతీయ సంస్కృతి అని శ్రీనివాసరావు అన్నారు.
ఆయనలో ఉన్న ఈ వివేకమే ఇవాల్టి పరిస్థితుల్లో కూడా రచయితల్ని సాహిత్య అకాడమీ ఆకర్షించగలుగుతున్నదని చెప్పక తప్పదు..
ఈ శ్రీనివాసరావుతోనే ఢిల్లీ నుంచి మెల్ బోర్న్ కు ప్రపంచ సాహితీ సదస్సులో హాజరయ్యేందుకు వెళ్లాను. దేశం అత్యంత కీలకమైన రాజకీయ సంధి ఘట్టంలో ఉన్న సమయంలో రెండు రోజులు వేరే దేశం వెళ్లడం సాహసమే.విదేశాల్లో ఒక సాహితీ సదస్సుకు వెళ్లడం ఇదే మొదటిసారి.
అయితే దేశంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలోనూ, ఇతర సాహితీ సంస్థల ఆధ్వర్యంలోనూ జరిగే సాహితీ కార్యక్రమాలకూ, విదేశాల్లో జరిగే సాహితీ కార్యక్రమాలకూ పోల్చడం సరైంది కాదనేది నా అభిప్రాయం.
ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో తెలుగు వారంతా తమ కుటుంబాలతో కలిసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని భారత దేశం నుంచీ, ఇతర దేశాలనుంచీ రచయితల్నీ కళాకారుల్నీ పిలిచి సాహితీ సాంస్కృతిక సదస్సులు ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. అందునా కేవలం సాహితీ సదస్సు నిర్వహించి విజయవంతం చేయడం కూడా కష్టసాధ్యమే. విభిన్నమైన అభిరుచులు, ఆలోచనలూ ఉన్న వారిని ఆ సాహితీ సదస్సుకు రప్పించి కూర్పోబెట్టడం సాధ్యం కాదు..
అయినా రెండు రోజుల పాటు మెల్ బోర్న్ లో జరిగిన ప్రపంచ సాహితీ సదస్సులో సాహిత్యం, కవిత్వం పట్ల అభిమానం ఉన్న వారిని కలుసుకోవడం చాలా ఆనందం వేసింది. తమ పిల్లలు తెలుగు లో చదివేందుకు పాఠశాలలు ఏర్పాటు చేసుకోవడమే కాదు, యువతలో తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి, అభిమానం ఉండడం పెద్ద విషయమే.
బహుశా ఇలాంటి సదస్సులకు సూత్రధారి అయిన హ్యూస్టన్ లోని వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వంగూరి చిట్టెన్ రాజు, ఆయనకు తోడుగా శాయి రాచకొండ, హైదరాబాద్ కు చెందిన వంశీరామరాజు బిన్నమైన సాహితీ సాంస్కృతిక అభిరుచులు కలవారు కావడం, అగ్నికి ఆజ్యం తోడయినట్లు ఆయనకు లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తోడవడం, ఆస్త్రేలియా తెలుగు సంఘ నిర్వాహకులు సతీష్ వరదరాజు, శ్రీని కట్టా, గుళ్లపల్లి, రావు కొంచాడ, సారథి మోటమర్రి తదితరులు నిర్విరామ కృషి చేయడం వల్ల ఈ సదస్సు విజయవంతం అయింది. ఫ్రాన్స్ కు చెందిన తెలుగు పండితుడు డేవిడ్ నెజెల్స్, ఆక్ లాండ్ నుంచి వచ్చిన పద్మ గోవర్ధన మల్లెల, జ్యోతి మల్లి కార్జున రెడ్డి, జగదీశ్వర రెడ్డి, మారిషస్ కు చెందిన సంజీవ నరసింహ అప్పడు, భారతదేశంలో ఉన్నా కలుసుకోని, తరుచూ కలుసుకోలేని ఎస్వీ సత్యనారాయణ, కవి రామాచంద్రమౌళి, ఆకెళ్ల రాఘవేంద్ర, వడ్డేపల్లి కృష్ణ, తెలంగాణ యూనివర్సిటీ తెలుగు విభాగం అధినేత త్రివేణి వంగారి, ప్రభల జానకి, అవధాన శేఖర పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, శాంతి ప్రబోధ, జ్యోతి వల్లభోజు తదితరులను కలుసుకోవడం, మలేషియా బాలుర సాంస్కృతిక కార్యక్రమాలు, పల్లె సీమల ఆధారంగా ఆస్ట్రేలియా దంపతులు, వారి పిల్లలు నిర్వహించిన జనరంజని మూలంగా ఢిల్లీలో కూడా లభించని ఆత్మీయ తెలుగు వాతావరణాన్ని మెల్ బోర్న్ లో చవిచూడగలిగాను. సదస్సులో ఆస్ట్రేలియా వారు రచించిన రచనలతో కూడిన ‘కవితాస్త్రాలయ’, వంగూరి చిట్టెన్ రాజు కట్టుకథలూ కమామీషుతో పాటు పలుకథా సంకలనాలను ఆవిష్కరించారు.
తెలుగు రాష్ట్రాలనుంచి ఇక్కడకు వచ్చిన వారికి అక్కడ మనదేశంలోని అవలక్షణాలు లేని కాలుష్యరహిత నగరాలు, తెలుగువారి మధ్య అనుబంధం, వారి జీవన ప్రమాణాలు చూస్తే మన కంటే బాగానే జీవిస్తున్నారనిపిస్తోంది. కాని కవితాస్త్రాలయలో ఆస్ట్రేలియా తెలుగువారి ఆలోచనలూ మనకు అవగతమవుతాయి. ఇద్దరూ ఒక రకంగా ఉనికికోసం పోరాడుతున్నవారే.
నువ్వెవ్వరని ప్రశ్నిస్తే..
భారతీయత ఉనికి ఉలిక్కిపడుతుంది
అని రాశారు.. షర్మిలా అజిత్..
పది సంవత్సరాల క్రితం
ఆస్ట్రేలియా ఫ్లైట్ టికెట్ కొనేటప్పుడు
డాలర్ ధర పడిపోవాలనుకున్నా..
పది సంవత్సరాల తర్వాత
ఇండియా వెళ్లాలనుకుంటూ
రూపాయి పడిపోవాలనుకున్నా..
అంటాడు రుద్రప్రసాద్ కొట్టు..
ఎక్కడని వెతకను నాన్నా నిన్ను..
పున్నమి చంద్రునిలోనా.. ప్రక్కనున్న ధ్రువతారలోనా..
ఉదయించిన సూర్యునిలోనా…
అని రాశాడు సాయిరాం ఉప్పు.
నువ్వొక పువ్వును తెంపుకొచ్చి
రాతి బొమ్మ కాళ్లపై వేస్తావు
నేనొక పువ్వుని
తన్మయత్వంతో చూసి
వనమాలిని గట్టిగా హత్తుకుంటాను..
అని రాశారు అంజలి.
కవితాస్త్రాలయలో రచనలన్నీ ఇక్కడి తెలుగువారికి భాషపై ఉన్న పట్టును సాహిత్యంపై ఉన్న అభిమానాన్ని తెలియజేస్తాయి.
‘ప్రవాసం ఒక సాహసం.. సుదూర ప్రయాణం ఒక ఉల్లాసం. వలస రావడం ఒక విన్యాసం, కోటి ఆశల పల్లకికి ఎదురు చూడడం, కావల్సిన వాళ్లను వదులుకోవడం, కొత్త బాంధవ్యాలకు బాటవేయడం, ప్రవాసంలో నివాసం ఒక సుందర స్వప్నం..’ అంటారు కవితాస్త్రాలయలో వ్యాస రచయిత మల్లికేశ్వరరావు కొంచాడ.
మన కళ్లలో ఆస్ట్రేలియా తెలుగువారు ఉనికిని కాపాడుతున్నందుకు గౌరవం గోచరిస్తే, వారి కళ్లలో మనకు భారతీయత కోసం అన్వేషణ, అభిమానం కనపడుతుంది.
ఇక ప్రపంచ సాహితీ సదస్సులో ప్రమాణాలున్నాయి, పరిమళాలున్నాయి, పరిచయాలున్నాయి, పరిష్వంగాలున్నాయి, పరస్పర ప్రశంసలున్నాయి, పరివ్రాజక విన్యాసాలున్నాయి, పర్యవేక్షణలున్నాయి, పట్టువిద్యలున్నాయి, పట్టువిడుపులూ ఉన్నాయి.. సమగ్రంగా సాహిత్యం కొంగు చాటునుంచి క్రీగంట చూసి మందహాసం చేయలేదని చెప్పలేం.
వంగూరి చిట్టెంరాజు తన ‘కట్టుకథలు’ లో చెప్పినట్లు వక్తలు మూడు రకాలు. కొందరు భజన వక్తలు, మరికొందరు మైకును చూడగానే మైకం క్రమ్మేవారు, మూడోవక్తలు చరిత్రతో ప్రారంభించి అక్కడే స్తంభించిపోయేవారు.. ఇక్కడా వారు లేరని చెప్పలేం. కొందరిది రాజకీయోపన్యాసం, మరొ కొందరి భావావేశం, ఇంకొందరిది అకడమిక్ పత్ర సమర్పణం.
అయినప్పటికీ త్యాగరాజు సంగీతంలో సాహిత్యం గురించి పద్మ, తెలుగు చలన చిత్రకోశం గురించి ఊటుకూరి సత్యనారాయణ చేసిన పరిశోధన తో పాటు కొన్ని ప్రసంగాలు చెప్పుకోదగ్గవి.
ఆస్ట్రేలియాలోని తెలుగువారు తెలుగు భాషను, సంస్కృతిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రంలో తెలుగు పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతో తక్కువేనని యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వెలిబుచ్చిన ఆవేదనలో అర్థం లేదనలేం.
పోర్ట్ బ్లయర్ లో హిందూ మహా సముద్రతీరం, మెల్ బోర్న్ లో దక్షిణ సముద్ర తీరం రెండూ నాకు నీలి ఆకాశం, నీలి సముద్రం రెండూ ఒకటేనని అనిపించాయి. వాటితో కలిసి నీలి సిరా ప్రవహించడం ఒక చారిత్రక గమనానికి నిదర్శనం.
*
కృష్ణుడూ,
చాలా ఆనందంగా ఉంది మన ఆస్ట్రేలియా పర్యటన విశేషాల విషయాలు చదివి.
మనుషుల కలయికే కవిత్వమని నమ్మే నాకు.. మీ వాక్యాలు ఊపిరినిచ్చినై.
శుభం
రామా చంద్రమౌళి
ధన్యవాదాలు రామచంద్ర మౌళి గారూ