సౌభాగ్యకుమార్ మిశ్ర గారు ప్రసిద్ధ ఒడియా కవి. వారు సాహిత్య అకాడెమీ పురస్కారస్వీకర్త. వారు 1980-85ల మధ్యలో రాసిన 52 కవితలను “ద్వా సుపర్ణా” అనే పేరుతో (ఎంత ఔచిత్యం ఉన్న పేరు!) సంకలించి తెచ్చారు. వేలూరి వేంకటేశ్వరరావుగారు వెనిగళ్ళ బాలకృష్ణా రావు గారి సహాయంతో దీన్ని అనుసృజించి మనకు అందిస్తున్నారు. ఈ కవితాసంపుటి గురించీ మాట్లాడే ముందు దీని శీర్షిక గురించి కొంచెం చెప్పాలి.
ద్వా సుపర్ణా. అంటే రెండు పక్షులు. ఈ రెండు పక్షుల ప్రస్తావన ఋగ్వేదంలో ఉంది (అన్నీ వేదాల్లో ఉన్నాయిష! అంటే అన్నీ వేదాల్లోంచీ వచ్చినవే, ఋగ్వేదమే తదనంతర తత్త్వాలకూ పురాణాలకూ మాతృక.)
ముండకోపనిషత్తు ఆ ఋగ్వేదమంత్రాన్ని విడమర్చి ఇలా చెపుతోంది.
ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే
తయోరన్యః పిప్పలం స్వాద్వత్త్యనశ్నన్నన్యో అభిచాకశీతి (ముండకోపనిషత్, 3.1.1)
ఈ ముండకమంత్రానికి శ్రీ విద్యాప్రకాశానందగిరిస్వామివారి ఉపనిషద్రత్నాకరంలో అనువాదమూ భాష్యమూ ఇలా ఉన్నాయి.
“(జీవుడు, ఆత్మ అను) రెండు పక్షులు మంచి గమనమును కలవియు, ఎల్లప్పుడు కలసియుండినవియు మిత్రత్వముతో కూడియున్నవియు అయియున్నవి. అవి రెండును ఒకే వృక్షమును (శరీరమును) ఆశ్రయించుకొని కలసిమెలసి యున్నవి. వానిలో ఒకటి (జీవుడు) అజ్ఞానము వలన రుచికరముగతోచు కర్మఫలమును భుజించుచున్నది. మరియొకటి (ఆత్మ) ఏమియు భుజించక సాక్షిభూతముగా చూచుచున్నది.”
(ముండకోపనిషత్తులోని) తరువాతి మంత్రంలోనూ శరీరమందు ప్రవేశించిన జీవుడు మోహమంది దుఃఖపడుతున్నాడనీ పరమాత్మ ఎరుక వలనే దుఃఖరహితుడౌతాడనే అర్థముంది.
2
లేత నీరెండని తలపించే ఈ కవిత్వమంతటా పఠితలను కట్టిపడేసేవీ పట్టికుదిపేవీ అయిన విషయాలు చాలానే ఉన్నాయి. పునరావృతమై అనివార్యమైన మృత్యువు తద్ద్వారా లభ్యమయ్యే నిర్వాణమూనూ మొదట చెప్పుకోదగ్గవి. అంటే ఈ కవితల్లో తత్త్వం మాత్రమే ఉందనికాదు. కవికి తెలిసిన ప్రపంచమే ఉంది. కవికి అనుభవంలోకొచ్చిన సంగతులే ఉన్నాయి. కవి దర్శించీ స్పందించీ ప్రతిఫలిస్తున్న అనుభూతులే ఉన్నాయి. అయితే చాలా కవితల్లో మృత్యుధ్యాస, ముక్తికాంక్ష తటిల్లతల్లా మెరిసి మాయమౌతాయి. అన్నిటికీ సాక్షి జగచ్చక్షువైన కర్మసాక్షి (చాలా కవితల్లో సూర్యుడి ప్రస్తావన ఉంది).
మొదటి కవిత (తెల్లపిట్ట నల్లపిట్ట) వ్యతిరేకస్వభావాలు కలిగినవీ ద్వంద్వాతీతమైనవీ అయిన రెండుపిట్టల గురించే అయితే రెండో కవితలోనే “మా అంతిమ స్వప్నం ఒక మృత్యువు” (తలుపు, పేజీ 15) అని తేల్చారు మిశ్ర గారు. సగానికి సగం కవితల్లో ఈ విషయం పఠితలకు వెంటనే స్ఫురించేదే.
ఇంకా కింది కవితాశకలాలు చూడండి:
“ఏదో అమరత్వం సిద్ధిస్తుందన్న తలపు
కలవరపెడుతున్నదేమో ఎవరికెరుక
ఇంకా ఎక్కువసేపు బ్రతికుండటం
తనకిష్టం లేదని చెపుతున్నాడు
………………………….
కవి మరణం సహజం
చెట్టు నుండి పండు రాలినట్టు” (ఇరాన్, పేజీ 31)
“ఒక ముద్ద తిని పడుకుంటాను ముక్తి కోరుతూ
ఇంకా చాలా సమయం ఉంది ముక్తికి
నిద్రలో కూడా లేదు విముక్తి” (తోటమాలి పాట, పేజీ 51)
“గుర్తుంచుకో
ఒకసారి బయటపడితే ఇహ తిరిగి రావడం లేదు” (శబ్దభేదం, పేజీ 71)
“నా కోసం ఎదురుచూస్తారు అర్ధరాత్రి వరకూ
స్మశానంలో వేపచెట్టు మీద,
వాళ్ళు నా అనేక మరణాల ప్రేతాత్మలు” (అజ్ఞాతయాత్ర, పేజీ 93)
“మనం ఇక్కడికి రావటంలో కారణం
కారులో ఉండిపోయింది
తాళంచెవులు తీసుకొని డ్రైవరు పారిపోయాడు” (తప్తపాణిలో పిక్నిక్, పేజీ 97)
“నువ్వు తప్ప మరి ఏ దేవతలు తెలుసు నీకు
ఆఖరికి నిన్ను నువ్వు చంపేసుకో (ఫొటోగ్రాఫ్, పేజీ 125)
పై కవితాశకలాల్లో ఏదీ ఈ మృత్యుధ్యాసతో మొదలూ అవదు, ఆఖరూ అవదు. ఈ భువిలో బహుశా మృత్యువే ఆద్యంతరహితమైనదని వీరి నమ్మికేమో!
“నిజంగా నోరు మూసుకోలేడు
ఆఖరికి గట్టిగా ఛీత్కరించి
అదృశ్యమౌతాడు, మహాశూన్యంలోకి
……………………….
కానీ అతడు మరచిపోయాడు,
తన తప్పు ఎక్కడ దాచిపెట్టాడో
ఏ మట్టికుండలోనో ఏ చెట్టు మొదట్లోనో
తండ్రి అస్థికలు రెండు దాచినట్టుగా.” (అపార్థం, పేజీ 105)
ఈ అపార్థం కవితలో మాత్రం చివరకు మిగిలేదేమిటొ చివరే చెప్పారు మిశ్రగారు.
అనేకానేక అనుభవాల సంమిశ్రమమైన జీవితం సంధించే ప్రశ్నలకు మిశ్రగారు తెలివిగా చమత్కారంగా జవాబులు చెబుతారు. మిశ్రగారి కవిత్వంలో సంగీతం ఎంత శబ్దాశ్రితమో నేను చెప్పలేనుగానీ (నేను ఒడియా మూలం చదవలేదు కనుక) బాగా భావాశ్రితం. కవిత హృదయంలో సుళ్ళు తిరుగుతుంది, ఏవో రహస్యార్థాల రాళ్ళే అక్కడ తిన్నగా పడినట్టు.
మిశ్రగారికి కవులందరికీమల్లే అహల్యన్నా శకుంతలన్నా సానుభూతి. అహల్యాశకుంతలలను అనాదిగా కవులు పునర్దర్శించీ కొత్త నిర్వచనాలిస్తూనే వస్తున్నారు. కొత్త కోణాలు కనిపెడుతున్నారు.
వీరి అహల్య చివరిగా తనను శపించిన భర్త గౌతముని శాపపు నిరర్థకతని నిర్వేదంగా తలుచుకొని ఇలా అంటుంది:
“ఎవరికి తెలుసు? ఏ పాద స్పర్శతో
నేను అశోకవృక్షంలా చిగురిస్తానో,
కానీ తను మాత్రం ఇక ఉండరు,
ఆశ్రమం ఖాళీగా పడి ఉంటుంది
వారి సహజ స్వభావం లాగా, వారి శాపంలాగా.” (అహల్య, పేజీ 143)
అశోకవృక్షమని ఉంది. సీతని రావణుడుంచినదీ అశోకవనంలోనే. మళ్ళీ ఎడబాటు జ్ఞాపకమే.
వీరి శకుంతలకు కావల్సింది కేవలం భర్త ఉంగరమే.
మిశ్రగారి కవితలన్నిటినీ నేనీ నాలుగుమాటల్లో స్పృశించలేదు. చివరి కవిత చివరి భాగం చూడండి:
“ఏ పక్షి అరుపు విని పరుగెత్తానో కాని
అనిపిస్తోంది ఈ పక్షి ఆ పక్షి కాదు” (పక్షి, పేజీ 255)
సంపూర్ణం మిశ్రగారి కవిత్వం. వీరి కవిత్వం గురించీ ఎంత చెప్పినా ఇంకా కొంత మిగిలే ఉంటుంది. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే!
3
వేలూరి గారు మిశ్రగారి సన్నిహితులు. వారిరువురి స్నేహం వేలూరిగారు లోగడ కటకంలో ఉద్యోగం చేసేటప్పటిది. బహుశా 1960ల నాటిది. అనువాదం పొల్లుపోకుండా ఉంది. తెలుగువారికి మిశ్రగారి “అవ్యయ” ను అనుసృజించి ఇచ్చిన వీరే ఈ “ద్వా సుపర్ణా”ను కూడా తెనిగించి ఇచ్చారు. వేలూరి గారికి తెలుగులోకం ఎంతో ఋణపడి ఉంది. ఆ ఋణం మనం తీర్చుకోలేనిది. దేవతలు నమస్కారానికి వశీభూతులని వేదవాక్కు. కనుక వేలూరి వేంకటేశ్వరరావుగారికి నమస్కారం పెడతాను.
——
For copies:
Visalandhra Publishing House
Vijayawada and its Branches in AP
Navachetana Publishing House
Hyd., and its branches in Telangana.
Navodaya Book House,
Kachiguda, Hyd.
e-book: www.kinige.com
నమస్కారంలు!సర్.రెండు పక్షులుజీవితం, అనువాదం బాగుంది, మలాంటివారికి,అనువాదం ద్వారా,చదివే అవకాశం, కల్పించిన, మీకుధన్యవాదాలు..
Thanks Padma garu.
<strongఅపురూపమైన ఆధ్యాత్మిక పరిమళాన్ని సంతరించికొన్న కావ్యానువాదానికి అంతే సురభిళమైన సమీక్షను వ్రాశారు. మీరిచ్చిన ఉదాహరణలన్నీ సత్వరాధ్యయనం పట్ల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి!
Thanks for your kind appreciation, sir.
-Vasu-
ఆర్యా,
ముణ్డకోపనిషత్తులోని ‘‘ద్వా సుపర్ణా’’ అనే ఈ మంత్రంలోని ఆత్మ, పరమాత్మల ద్వైతాన్ని అద్వైతపరంగా ఎలా చెప్పగలం? విశిష్టాద్వైతం ప్రకారం చెట్టు ప్రకృతి, ఆత్మ, పరమాత్మలు రెండూరెండు పక్షులు. ఈ త్రికాన్ని అద్వైతం ఎలా చూస్తుంిది? మీకు తెలిస్తే పంచుకోగలరు.
The following interpretation was given me by Sri Suraparaju Radhakrishna Murthy garu.
ఈ ముండక మంత్రం మూడును రెండు చేసి చెబుతున్నది.
( “ద్వా”,” ద్వౌ”కు వైదికరూపం. ‘ద్వౌ సుపర్ణౌ సయుజౌ సఖాయౌ’ అని అర్థం చేసుకేవలె. )
ఉపనిషత్తులలో చెట్టు ఉపమానంగా గ్రహించడంలో ఆశ్చర్యం లేదు.
అడవులను ఆశ్రమాలుగా ఆశ్రయాలుగా చేసుకున్న ఋషులకు కన్ను తెరిస్తే కనిపించేవి చెట్లే కదా!
“న్యగ్రోధోదుంబర” వృక్షాలు తరచు మంత్రాలలో కనిపిస్తాయి. వేళ్ళు పైకి పాకి, కొమ్మలు కిందికి వేలాడే అశ్వత్థవృక్షం కఠంలోను గీతలోను ప్రసిద్ధమే.
ఇక ఈ ముండకమంత్రవిషయం. ఒక చెట్టు,ఆ చెట్టుమీద రెండు పిట్టలు. రెండు పిట్టలలో ఒకటి జీవాత్మ(విజ్ఞానాత్మ),మరొకటి ఈశ్వరుడు (పరమాత్మ).
రెంటికీ ఆశ్రయం చెట్టు. అంటే చెట్టు జీవుని శరీరానికి, ఈశ్వరుని జగత్తుకు, అంటే సర్వసృష్టికి, కూడా సంకేతం.
(మూడవది, ఈశ్వరుని శరీరమైన జగత్తు, కూడా చెప్పినట్టే కదా.) ఈ రెండు పిట్టలు అన్యోన్యంగా ఉంటాయి.
అన్యోన్యమంటే, ఎప్పుడూ కలిసే ఉంటాయి.విడదీయలేనంతగా కలిసి ఉంటాయి.
అంటే ఈశ్వరచైతన్యం వినా జీవుడికి జీవత్వం లేదు. జీవుడు వినా ఈశ్వరుడికి భోజనం లేదు. ( భోక్తృత్వం లేదు.)
సమస్తసృష్టిలోని సర్వప్రాణుల భోజనమే ఆయన భోజనం. అనుభవమే ఆయన అనుభవం.
(‘భుజ్’ అంటే తినడం మాత్రమే కాదు.అన్ని యింద్రియాలద్వారా గ్రహించే సర్వము ఆహారమే.
అంటే ప్రాణుల సర్వేంద్రియవ్యాపారాలు సర్వానుభవాలు ఆయనవే, పారాణులద్వారా. అంటే, వాస్తవంలో ఈశ్వరుడు భోక్త కాడు.
సర్వ ప్రాణులకు, వారి కర్మానుగుణంగా, భోజనం కల్పించేవాడు ఈశ్వరుడు, కర్మఫలప్రదాత. బిడ్డలు తింటుంటే ఊరక చూస్తూఉంటాడు.
ఇద్దర పిల్లలు, ఒకడు కోటీశ్వరుడు.మరొకడు కూలివాడు. ఇద్దరూ బిడ్డలే. ఎవరి తిండి వాడు తింటాడు. తండ్రి చూస్తూ ఉంటాడు.
(‘అభిచాకశీతి’) సాక్షిమాత్రుడు.జీవుడు తన శరీరంలో పరిమితమై అనుభవిస్తాడు.
ఈశ్వరుడు సమస్తసృష్టిని వ్యాపించి సర్వప్రాణులహృదయాలలో (‘ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి’.గీత.)
ఉండి వాటిద్వారా అనుభవిస్తాడు.అంటే, అనుభవం ఆయనదికాదు, ఆయన ఎవరెవరి హృదయాలలో ఉన్నాడో వారిది ఆ కష్టము సుఖము
పుణ్యము పాపము. అదే చెబుతున్నది, ఈ మంత్రం. ‘తయోరన్య: పిప్పలం స్వాద్వత్తి’.
ఒక పిట్ట, జీవుడు, ఆ సంసారవృక్షం యిచ్చే రుచికరమైన (స్వాదు)ఫలాలను తింటున్నది.అన్ని ఫలాలూ స్వాదుగానే ఉంటాయా?
కొన్ని చేదుగా ఉండవా? ఉండవనే అంటున్నది మంత్రం. చేదుపండుకూడా
స్వాదుగా ఉండడమే సంసారలక్షణం. ఈ చేదు స్వాదు వద్దు , అనగలిగిన వైరాగ్యం కలిగితే యిక సంసారమేముంది?
కనుక కష్టమైనా యిష్టమే అంటున్నాం కాని, సుఖదు:ఖరూపమైన ద్వంద్వంనుండి ముక్తిని కోరుకోడం లేనంతకాలం, ‘స్వాద్వత్తి.’
సంసారం రుచిగానే ఉంటుంది, సారవంతంగానే అనిపిస్తుంది. ఇది ఒక పిట్ట విషయం. రెండవది, ఈశ్వరుడు. ఆయనది ‘అనశనం’.
(అనశ్నన్నన్యోభిచాకశీతి.)తినడు, జీవుడు తింటూఉంటే ఊరకే చూస్తూ ఉంటాడు. తిని తిని ఎప్పటికైనా తిండిమీద విరక్తి కలిగి,
పక్కనే తినకుండా ఊరకే చూస్తూ ఉన్న నా వైపు చూడకపోతాడా, అని. చూసినప్పుడు తెలుస్తుంది,
ఆ రెండవ పక్షి అంత చిదానందంగా ఎలా ఉండగలుగుతున్నదో. అనశనంలో ఉంది ఆ చిదానందరహస్యం.
ఇంద్రియసుఖాలవెంట పడక, తనలో తాను రమించగలిగితే తాను ఈశ్వరుడే. అది తెలుసుకొన్నప్పుడు, ప్రతిబింబం బింబంలో కలిసిపోతుంది.
అంటే తాను ప్రతిబింబమేనని తెలుసుకొంటుంది. అంటే తాను, తన సుఖదు:ఖాలు వాస్తవంకాదు.
ఈ శరీరమనే కర్మాగారం, కర్మక్షేత్రం,సుఖదు:ఖాలకాశ్రయం. అంటే కర్మఫలాలను అనుభవించడానికి ఈ శరీరం అవసరం.
కర్మలు కర్మఫలాలు లేనపుడు శరీరంతో పని లేదు. నిజమే, జీవుడికి శరీరంతో పని లేదు. ఈశ్వరుడికి? ఆయన శరీరం, జగత్తు, ఉంటుంది.
అంటే, ఈశ్వరుడికి ముక్తి లేదా? అది వేరే ప్రశ్న.
Hope the above helps.
-Vasu-
@@ఇంద్రియసుఖాలవెంట పడక, తనలో తాను రమించగలిగితే తాను ఈశ్వరుడే. అది తెలుసుకొన్నప్పుడు, ప్రతిబింబం బింబంలో కలిసిపోతుంది.
అంటే తాను ప్రతిబింబమేనని తెలుసుకొంటుంది. అంటే తాను, తన సుఖదు:ఖాలు వాస్తవంకాదు. @@ ఈ వ్యాక్యం పై వరకూ నాకు విభేదమేమీ లేదండి. ఐతే, అక్కడనుడే కీలకం. ప్రతిబింబమూ తినదు, బింబమూ తినదు. ఉనికిలో వున్నదే తింటుంది. కర్మలు ఎవరు చేసారు? ఆ వాసనలు ఎవరికి అంటుకున్నాయి? ఆ అంటుకున్న జీవులు (జీవుడు ఒకడు కాదు, అనంతం) ఆదిలో ఎలా వున్నారు? అదే ఆదిలో వున్న పరమాత్మ ఎలా వున్నాడు? అద్వైతం ఎలా కుదురుతుంది? జీవుడు అనాది, దేవుడు అనాది, ప్రకృతి అనాది అని భగవద్గీతలో భగవానుడు చెప్పాడు కదా. మూడూ వేరు వేరు అస్తిత్వాలైనప్పుడు అద్వైతం ఎలా కుదురుతుంది. ఈ కర్మవాసనల కండిషనింగ్ పూర్తిగా లుప్తమైతే జీవుడు పరమాత్మతో సమానమైన స్థితికి చేరతాడు. అంటే, కర్మబంధం పూర్తిగా తొలగుతుంది. ఇక్కడ వున్నది ప్రతిదీ సత్యమే. అంటే, ప్రయోజనం, ప్రభావం కలిగించేదేదైనా సత్యమే, కల కూడ సత్యమే అన్న రామానుజులవారి భావనను మీరు ఏ విధంగా చూస్తారు? కర్మవాసనలు లుప్తమయ్యాక మీరు చెప్పినట్లుగా జీవుడికి శరీరంతో పనిలేదు.
ఇండియాఫ్యాక్ట్స్ అనే జాలగూటి పత్రిక సంపాదకుడు నితిన్ శ్రీధర్ మరొక విధమైన భాష్యం చెప్పారు…. ఇలా ఇంతకుముందెన్నడూ నేను చదవలేదు… https://vairaagya.wordpress.com/2014/12/04/two-birds-on-a-tree-dwa-suparna-mantra-mundakopanishad/
మంచి పరిచయం
Thanks Desa Raju
-Vasu-
వాసు గారు ఏ పుస్తకాన్నైనా ఎంత శ్రద్ధగా చదువుతారో ఈ సమీక్ష చదివితే అర్థమవుతుంది.ముండకోపనిషత్తులోని
ద్వా సుపర్ణా అనే ప్రయోగాన్ని వివరిస్తూ ఈ పుస్తకానికి సహసంబంధాన్ని ఏర్పరచడం న్యాయపతిగారి నిశిత పరిశీలన దృష్టికి వారి విస్తృత జ్ఞాన వైశాల్యానికి మచ్చు తునక.ఈ ఎత్తుగడ సమీక్షకు కలికి తురాయ.మిశ్రా గారి కవితలలో ,కవి’తలలో’ మెదిలే మృత్యుస్పృహను వేలూరి వేంకటేశ్వర రావుగారి అనువాద కవితలలోనుండి ఉటంకిస్తూ సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఒడియా కవిని పరిచయం చేయడం చాలా బాగుంది.త్రిమూర్తులు మూలికలు, అను వాదకులు,సమీక్షకులకు అభినందనలు
Thanks a lot Rammohan garu.
-Vasu-