రెండు చిత్రాలు: కుబేర, 23

 బినామీలుగా చదువు సంధ్యలు లేని బిచ్చగాళ్ళని తీసుకోవాలనుకోవడం తెలివైన పనే! అయితే ఆ బిచ్చగాళ్ళలో ఒక గర్భవతిని పెట్టడం ఎందుకు?

కటి కార్పొరేట్ల దోపిడి గురించి లోతులకి పోకుండా ఉపరితలాన్ని మాత్రమే తాకుతూ కోట్ల బడ్జెట్ తో లక్ష్మి కటాక్షం కోసం తీస్తే, ఇంకొకటి సమాజంలోని సామాజిక, ఆర్ధిక అసమానతలు న్యాయ వ్యవస్థలో ఎలా ప్రతిబింబిస్తున్నాయో చెప్పడం కోసం పైసా పైసా కూడబెట్టుకుని తీశారు. ఒకదానిలో కథానాయకుడికి ముప్పై కోట్ల పారితోషికం ఇస్తే, ఇంకోదానిలో బడ్జెట్ సరిపోక అరకొర నటులే ముఖ్య పాత్రలు పోషించారు.

రెండు వేరు వేరు వస్తువులతో తీసిన సినిమాలకి పోలిక ఏమిటి?  ఈ సినిమాల్లో చర్చించిన సమస్యలు భిన్నమైనవైనా, సమస్య మూలాల శోధనలో రెండవ చిత్రం నిజాయితీ గొప్పది. నిజానికి సమస్యలు వేరైనా మూలం ఒకటే!

నేను అంటున్నది ఈ నెలలో చూసిన రెండు తెలుగు సినిమాల గురించి … కుబేర… 23…

కుబేర సినిమా చూస్తే టాల్  స్టాయ్  కథ ‘హౌ మచ్ ల్యాండ్ డజ్ ఎ మాన్ రిక్వైర్ ‘ గుర్తుకొచ్చింది. లక్ష కోట్లు లంచంగా ఇవ్వగల కుబేరుడు తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించాలని ఎందుకనుకుంటాడు? అసలు మనిషికి ఏమి కావాలి? కూడు,గూడు  లాంటి అవసరాలు తీరితే చాలా? అలా అనుకుంటే మనిషి ప్రస్థానం ఎక్కడో ఆగిపోయిఉండేది.   అమెరికన్ సైకాలజిస్ట్ మాస్ లో చెప్పినట్లు భౌతిక అవసరాలు తీరగానే సేఫ్టీ, ప్రేమ, కీర్తి  లాంటి అవసరాలు ఒక్కొక్కటి ముందుకొస్తాయి.

హౌ మచ్ ఫేమ్ డజ్ ఎ మాన్ నీడ్? ఒక స్థాయి దాటిన తర్వాత మనిషిని ముందుకు నడిపించేది ఈ కీర్తి కండూతే! ప్రపంచంలోనే ధనవంతుడు అనిపించుకోవడం డబ్బుకోసం కాదు. కీర్తి కోసం. జీవితంలో అదిచ్చే కిక్ కోసం. బహుశా అదే మనిషిని తరతరాల పరిణామంలో ఈ దశకు తీసుకొచ్చింది.

కుబేర సినిమాలో బతుకు బతకడం కోసమే అంటుందొక పాత్ర. పరిణామ క్రమంలో ఇంతదూరం వచ్చిన మనిషి ఇప్పుడు కేవలం బతకడం కోసం బతుకుతున్నాడా! బతుకు అందరిదీ ఒకటే అయినా, Maslow’s Hierarchy of Needs లో ఒక్కో మెట్టూ ఎక్కుకుంటూ పోవాలనే తపన కొందరిది. బహుశా వాళ్లే ఈ ప్రపంచ గమనాన్ని శాసించే శక్తిపరులు. ఆ కొద్దిమంది తపనే ఇన్ని ఆవిష్కరణలకు మూలం.

మనిషికి విలువ ఎక్కడినుంచి వస్తుంది? శ్రమ నుంచి … అది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు. దానిలో ఎంత కృషి చేశాడు అనేదే విలువని నిర్ణయించేది.  మనుషులు, వస్తువులు  ఎంత అరుదైనవి అయితే అంత విలువైనవి.

మరి బిచ్చగాడికి విలువ ఎక్కడనుంచి వస్తుంది? అది కూడా  అన్ని అంగాలు బాగుండి అడుక్కోవడాన్నే బతుకుగా భావించిన వాడికి విలువ ఎక్కడనుంచి వస్తుంది? ఒక కళలో…పనిలో …సృజనలో… దేనిలోనూ శ్రమించని వాడికి విలువ ఉంటుందా! మనుషులంతా నిజంగా ఒక్కటేనా!   మనుషులుగా వారిపై  ఎంపతీ ఉంటుందేమో కానీ, లక్షలాది బిచ్చగాళ్లకి వేల కోట్ల డబ్బు పంచిపెట్టాలనే కథానాయకుని ఆశయంపై సింపతీ ఉంటుందా! సగటు మనిషికి జరుగుతున్న అన్యాయం చెప్పాలనుకుంటే బిచ్చగాడిని తీసుకోకూడదు. సగటు మనిషి బిచ్చగాడు కాదు.

బినామీలుగా చదువు సంధ్యలు లేని బిచ్చగాళ్ళని తీసుకోవాలనుకోవడం తెలివైన పనే! అయితే ఆ బిచ్చగాళ్ళలో ఒక గర్భవతిని పెట్టడం ఎందుకు? నిండు గర్భిణిని కడుపుపై తన్నించి ప్రేక్షకుల నుంచి సానుభూతి వర్షం కురిపించే పన్నాగం. ఎందుకు? పెట్టుబడి దారుని దుర్మార్గాన్ని మరింత క్రూరంగా చూపించాలనే ఎత్తుగడ.

అసలు ఈ సినిమాలో చూపించిన పెట్టుబడిదారుడు ఎవడు? నలుగురు హంతకులని పోషిస్తూ బినామీలని అవసరం తీరాక చంపిస్తూ కోట్లు గడించేవాడు! లక్షలాది కోట్లకి ఆధిపతి అయ్యుండీ దేశంలోని వ్యవస్థలని ఆటాడుకోగలిగిన సత్తా ఉండీ ఒక బిచ్చగాడిని ఏమీ చేయలేక తానే బిచ్చగాడిలా మారి చివరికి పెంటకుప్పపై ద్వంద్వ యుద్ధం చేసి హీరో చేతిలో చచ్చేవాడు! ఇదంతా  సామాన్య ప్రేక్షకుడిని సంతృప్తి పరచడానికి తద్వారా కోట్లు కొల్లగొట్టడానికి రచించిన క్లైమాక్స్!

ఒకవేళ సినిమాలో చూపించిన విధంగా బిచ్చగాడు పారిపోయి ఉంటే మన దేశంలో ఏమి జరిగి ఉండేది? అన్ని వ్యవస్థలూ కొన్ని గంటల్లో వాడిని కనిపెట్టి చంపేసి ఉండేవి. ఒకవేళ వాడు తప్పించుకుని ఆ పెట్టుబడిదారు బండారం బయట పెట్టినా, అతని జీవితకాలంలో ఎటువంటి శిక్షకి గురికాకుండా చూసుకోగల న్యాయవ్యవస్థ మనది. నిజానికి ఇదీ సమస్యకి మూలం.

ఒక వ్యక్తి తన కార్పొరేట్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోవడం వల్ల నష్టంలేదు. ఎందుకంటే ఆ డబ్బుని మళ్లీ ఉపాధి సృష్టించే ఏదొక సంస్థ లోనే పెడతాడు. నిజానికి కొన్ని వనరులు ప్రైవేటు రంగంలో అభివృద్ధి చేయడం వల్ల నష్టం లేదు. లక్షల కోట్ల ఆయిల్ ప్రైవేట్ రంగం లో అభివృద్ధి చెందితే ఆ డబ్బు దేశం దాటనంత వరకూ దేశానికి వచ్చిన ప్రమాదం లేదు. మరి మనిషి అంతులేని ఆశవల్ల ప్రమాదం ఎప్పుడు? కాంపిటీషన్ ని హతమార్చి ఎదుగుతున్నప్పుడు! మోనోపోలీ వల్ల వినియోగదారుడు నష్టపోతాడు. అక్కడే ప్రభుత్వం నిరోధించాలి. ప్రభుత్వం, పెట్టుబడి దారుడూ కలిసిపోతే న్యాయవ్యవస్థ రాజ్యాంగం సాయంతో నిరోధించగలిగి ఉండాలి. ప్రభుత్వాలు, న్యాయ వ్యవస్థలు లంచగొండులుగా మారి నిర్వీర్యం అయినప్పుడే ప్రమాదం. నిజమైన ప్రమాదం పెట్టుబడిదారుని అత్యాశ కాదు. దాన్ని నియంత్రించలేని వ్యవస్థలది. దశాబ్దాలు గడిచినా దొరకని న్యాయం వల్ల మాత్రమే నిజమైన ప్రమాదం. కానీ ఈ సినిమాలో ప్రధానమైన ప్రతినాయకుడు కార్పొరేట్. ఒక కార్పొరేట్ కి మానవరూపం ఇచ్చి, వాడిని విలన్ని చేసి హీరో చేత చంపించడం ద్వారా ప్రతీకారం సాధించి, ప్రేక్షకులని సంతృప్తి పరచి లక్ష్మీ దేవిని వశపరచుకోవాలి!

ఒక నియంత్రణ లేని పెట్టుబడిదారునిలో ఉండే అత్యాశని, పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టాలనే అత్యాశతో, తల తోకా లేని కథతో ఎండగట్టాలి! సినిమాలో విలన్ చేసింది కరప్షన్ అయితే, సమస్య మూలాలకు వెళ్లకుండా ప్రేక్షకుల సెంటిమెంట్ తో ఆడుకోవడం ద్వారా సామాజిక సమస్యని మామూలు  ‘పగ,ప్రతీకారం’ కథగా మార్చి,డబ్బులు కొల్లగొట్టాలనుకోవడం,  దానికోసం ముప్పై కోట్ల బిచ్చగాడి పాత్రని  సృష్టించడం కూడా కరప్షనే అవుతుంది.

ఈ దేశంలో అన్ని సమస్యలకీ మూలం, సమాజంలోని వర్గ, సామాజిక అసమానతలు నిష్పక్షపాతంగా ఉండాల్సిన న్యాయవ్యవస్థని కూడా భ్రష్టు పట్టించడం. అందరికీ సమంగా అందాల్సిన న్యాయం అంతస్తులని బట్టి మారిపోవడం.

సరిగ్గా ఇదే అంశాన్ని 23 సినిమా ఎత్తిచూపడానికి ప్రయత్నించింది. శిక్ష నిందితుల మోటివ్ ఆధారంగా ఉండాలి. దొంగతనానికి  వెళ్లిన వాళ్లు ప్రమాదవశాత్తు మరణాలకు కారణం అయితే అది హత్య కాదు. ఉరి తీయాల్సినంత నేరం కాదు. ఒకవేళ అది హత్యే అయితే, కుంభమేళా లోనూ, పుష్కరాల్లోనూ, రాజకీయ నాయకుల,  సినిమా హీరోల ర్యాలీల్లోనూ జరిగే మరణాలు కూడా హత్యలే. అందులో ఎంతమంది శిక్షలు అనుభవిస్తున్నారు?

నిజానికి ఈ సినిమాలో కూడా  కొంత నిజాయితీ లోపం ఉంది. నిజ సంఘటనల ఆధారంగా తీసిన కథకి ‘పూర్తిగా కల్పన’ అని disclaimer ఎందుకు? చుండూరు ఘటనలో ఈవ్ టీజింగ్ జరిగి ఉండొచ్చు. ఆమాత్రానికే కుల దురహంకారంతో హత్యలు జరిగి ఉండొచ్చు. అలాగే బస్సు దహనం కేసులో పారిపోతున్న వారి దగ్గర దొంగతనం జరిగి ఉండొచ్చు. బస్సు నిజంగానే తగలబడి అంతమంది చనిపోయారనే ఎరుక లేక జరిగి ఉండొచ్చు. కేవలం ఈవ్ టీజింగ్ కే చంపడం వెనక కుల దురహంకారం ఉంది. బస్సు తగలబడి ప్రాణాలు పోయినా మోటివ్ హత్య కాదు. ఒకవేళ ప్రాణ నష్టం ఆధారంగా శిక్షలు ఉండాలనుకున్నా పడిన శిక్షల్లో సమానత్వం లేదు. ఈ విషయాన్నే బలంగా సూటిగా చెప్పి ఉండాల్సింది. బహుశా ప్రేక్షకుల సానుభూతి కోల్పోయి చెప్పాలనుకున్న విషయం పక్కదారి పడుతుందనే భయం కావచ్చు. ఇలాంటి విషయంలో దర్శకుడికి కొంత వెసులుబాటు ఇవ్వొచ్చు. ప్రేక్షకుల సానుభూతి కోసం కరప్టెడ్ సన్నివేశాలతో తీసిన కుబేర కంటే ఇదే మెరుగైన ప్రయత్నం.

*****

“సరే! అసలు ఇదంతా ఎందుకు?”

“దిశ సంఘటనలో పోలీసులు చేసిన హత్యల్ని అప్పటి ముఖ్యమంత్రి  అసెంబ్లీ లో సమర్థించడం తప్పు. తెనాలిలో రౌడీ షీటర్లని బహిరంగంగా శిక్షించడం తప్పు. నకిలీ ఎన్కౌంటర్ లలో నక్సలైట్లని చంపడం తప్పు. ప్రతీ చిన్న విషయానికి అరెస్ట్ చేయడం తప్పు. పెట్టుబడిదారులందరినీ దోపిడీ దారులు అనుకోవడం తప్పు. (వారిలో అధికశాతం తమ పెట్టుబడిని కోల్పోయిన వాళ్ళే ఉంటారు ). అసలు ఉత్పత్తి వ్యవస్థ మొత్తం పబ్లిక్ లోనో లేక ప్రైవేట్ లోనో ఉండాలనుకోవడం తప్పు. ఈ ప్రపంచం నీ ఇజాలకి అనుగుణంగా నడుచుకోకపోతే కుమిలిపోవడం, దూషించడం తప్పు. అసలు న్యాయవ్యవస్థ లో సంస్కరణలు తేకుండా దేశమంతా నిజాయితీగా మారాలనుకోవడం తప్పు.”

“నీ గోదారి … ఎక్కడో మొదలెట్టి ఎక్కడో తేలావు “

*

శ్రీధర్ నరుకుర్తి

1 comment

Leave a Reply to reddy Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Sridhar garu -agree with u sir

    Not seen movie —read about it

    Wrong story

    Neti vyavastha lo dabbu— keerthi. Both r

    Important

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు