గుండెల్లో జల్లు కురిపించే మెరుపుకి
ఆ కొసన నీ కళ్లు
ఈ కొసన నా కళ్లు
ఈ సందర్భం ఇంక రాకపోవచ్చు!
అయినా నేనొస్తాను
కిటికీలోంచి
నిన్ను పలకరించే వానలో
చిన్ని తుంపరనై
లేదా
నిన్నో కన్నీటిబొట్టుగా
మార్చివేసి
అందులో కొలువుండే
అక్షరాన్నై..
తెరిచే ఉంచు..
రెండు కిటికీలూ
- అద్వైతం
నాలో పొంగుతున్న
నదీ తీరాన
నువ్వు నడిచొస్తుంటే
ఆ అలలు
నీ పాదాల్ని
స్పృశిస్తుంటే
బయటెక్కడో నిన్ను వెతికిన
ఇన్నేళ్ళ నా అమాయకత్వానికి
మౌనంగా నవ్వుకుంటాను!
- నది – నావ
రెండుగా చీల్చాలనుకునే
నావ ప్రయత్నానికి
ముసిముసిగా నవ్వుకుంటూ
నావ వెనకే ఏకమౌతూ
నది!
- వాడని పువ్వు
ఆకాశంలో తారల్లా
ఆమెజడలో మెరిసి
పొద్దుటికి వాడిపోయే
పూలని చూస్తే
చెప్పలేనంత దిగులు
రాత్రిని వెలిగించిన
పూల పరిమళం మాత్రం
ఎన్నటికీ వాడని జ్ఞాపకం!
- గుండెలో నక్షత్రాలు
ఆమెని నేను
ఆరాధించాను
నా క్షణాలన్నిటినీ
పువ్వులుగా మార్చి
ఆ పాదాల చెంత
అర్పించాను
ఒక్కొక్క నక్శత్రాన్నే వెలిగించి
మనసులోని
ఒక్కో అగాధపు రహస్యాన్నీ చెప్పింది
తెల్లవారు ఝామున అడవిలో
ఆకుల మీంచి జారే మంచు బొట్టుని
నాగుండెలో నింపింది
విశ్వమంతా ఒద్దికగా
అందులో ఒదిగిపోయింది
కాసేపటికి ఆమె కూడా
ఆ మంచు బొట్టులోకి
వెళ్ళిపోయింది
ఇప్పుడు నక్షత్రాలన్నీ
నా గుండెల్లోనే!
*
How beautiful.. how beautiful 💐🙏
Subbu mark poems.
Excellent…
As always Beautiful!