చలికాలం. పొద్దున్న ఎనిమిదైనా ఇంకా మంచు కురుస్తోంది. సూర్యుడు ఇంకా పైకి రానే లేదు. స్కూలుకు టైమవుతుందని అమ్మ తొందర తొందరగా టిఫిన్ బాక్స్ సర్దుతోంది. నేను, తమ్ముడు త్వరగా స్కూల్ అంగీ, లాగు తొడుక్కుని, టీవీ చూస్తూ సోఫాలో కూర్చున్నాం. అమ్మ పల్లెంలో అన్నం, పప్పు కలుపుకుని తెచ్చి మాకు తినిపించడం మొదలుపెట్టింది. నా నోట్లో అన్నం ముద్ద పెడుతూ..
“అరేయ్! మీ క్లాస్ రూఫస్‌గాడు ఈరోజు పొద్దున్నే ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వాడి సైకిల్ మీద ఎక్కడికో వెళ్ళిపోయాడంట. వాడి అమ్మానాన్న పొద్దున్న ఆరింటికి మనింటికొచ్చి అడిగి వెళ్లారు” అని మెల్లిగా చెప్పింది.
నోట్లో ఉన్న అన్నం ముద్దని మెల్లిగా నమిలి మింగుతూ “ఎక్కడికి వెళ్ళాడంట మమ్మీ?” అన్నాను ఆశ్చర్యపోయి.
“ఏమోరా? అదేదో నవోదయ కోచింగ్ ఇస్తున్నారంట కదా? దానికి వెళ్తానంటే వాళ్ళమ్మ ఒప్పుకోలేదంట. అందుకని ఎవరికీ చెప్పకుండా క్లాసుకు వెళ్లి, ఇందాకే తిరిగి వచ్చాడంట” అని చెప్పి నా నోట్లో మరో ముద్ద పెట్టింది.
“వాడు చూడు ఐదో క్లాస్ నుంచే చదువు మీద ఎంత పట్టుదలగా ఉన్నాడో! వీళ్లకి ఆ తెలివి ఎప్పుడొస్తుందో ఏమో?” అని లోపల్నుంచి గునిగాడు నాన్న. అది మా అమ్మ చెవిలో పడింది.
ఒక్కసారి బెడ్‌రూమ్ తలుపు వంక చూసి “నువ్వు వీణ్ని కోచింగుకు పంపుతా అంటే ఎందుకెళ్లడు? నా పిల్లలకి సర్దవుతుందో, దగ్గొస్తుందోనని నువ్వే బయటకి పంపవు! ఇంక వీళ్లకి చదువెట్లా వస్తుంది? గువ్వపిట్టల్లాగా ఇంట్లోనే ఉంచుకోమరి” అని కసిరింది.
లోపల నుండి మరో మాట రాలేదు.
కాసేపటికి నాన్న బయటికొచ్చి, తన చేతక్ స్కూటర్ బయటకు తీసి తుడిచాడు. ఈలోపు మా బ్యాగులు, టిఫిన్ బాక్సులున్న బాస్కెట్లూ తీస్కుని బయటికొచ్చాం. మా ఇంటికి యాభై అడుగుల దూరంలోనే రూఫస్‌గాడి ఇల్లు. మేం స్కూటరెక్కి కాస్త దూరం వెళ్ళగానే, వాడు తన సైకిల్ మీద అటువైపు నుండి ఎదురయ్యాడు.
వాడి సైకిల్ భలే ఉంటుంది. నాకు తెలిసి మా టౌన్లోనే అలాంటి చిన్న సైకిల్ ఇంకెవరికీ లేదు. వాళ్ళ నాన్ననడిగి హైదరాబాదు నుంచి తెప్పించుకున్నాడని విన్నాను. నీలం రంగు. పెద్ద విశాలమైన హ్యాండిల్. వింతగా శబ్దం చేసే హారను. పోయిన వేసవి సెలవుల్లో నేను మా మామ దగ్గర సైకిల్ నేర్చుకుని వచ్చాను. అప్పటినుండి రోడ్డుమీద ఏ సైకిల్ కనపడినా కాసేపు చూస్తూ ఉండిపోయేవాన్ని. ఇప్పుడు నా మనసంతా రూఫస్ కొత్తగా తెచ్చుకున్న సైకిల్ మీదకు మళ్లింది.
వాడికి మా స్కూటర్ దగ్గరగా వెళ్ళగానే ఇద్దరం ఒకరి మొహాలు ఒకరం చూస్కుని నవ్వుకున్నాం. అంత దూరం ఊర్లోకి ఒక్కడే వెళ్ళేంత ధైర్యం వీడికి ఎక్కడి నుండి వచ్చిందో అనుకున్నాను. స్కూటర్ మీద వెళ్తున్నా నా మనసంతా వాడి చూట్టూ తిరుగుతూ ఉంది.
ఈ విషయం జరిగిన తర్వాత వాడి పేరు స్కూలంతా పాకింది. అందరూ వాడి గురించే మాట్లాడుకోవడం మొదలెట్టారు. వాళ్లందరి దృష్టిలో హీరో అయిపోయాడు రూఫస్ గాడు.
మా స్కూల్లో ప్రతి క్లాసుకూ రెండు సెక్షన్లు ఉండేవి. ఏ-సెక్షన్ వాళ్ళు చదువులో ముందుంటే, బి-సెక్షన్ వాళ్ళు ఆటల్లో ముందుండేవాళ్ళు. దీన్ని సమానం చేయడానికి ఆ సంవత్సరం కొందరిని అటు ఇటు పంపించారు. అలా రూఫస్ గాడు నేనుండే బి-సెక్షనుకు వచ్చాడు. వాడికి ఇష్టంలేకున్నా సరే మేమంతా కలిసి బలవంతంగా ఒప్పించాం. చేసేదేం లేక వాడు సర్దుకుపోయాడు. వాడిదెప్పుడూ ఫస్ట్ బెంచీ. నాదెప్పుడూ లాస్ట్ బెంచీ. బాగా పొడుగ్గా ఉన్నాను కాబట్టి నా సీటెప్పుడూ అక్కడే!
కొన్ని రోజులకు మెల్లిగా మా మధ్య పరిచయం పెరిగింది. అది స్నేహంగా మారింది. నేను ఏ సబ్జెక్ట్ అయినా హోంవర్క్ నిదానంగా చేస్తాను. మాథమేటిక్స్ అయితే ఇంక అంతే! దానికీ, నాకు మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటుంది. రూఫస్ అలా కాదు. ఒక గంటలో హోంవర్క్ అంతా అయిపోగొట్టి, సైకిలేస్కుని మా ఇంటికి వచ్చేవాడు. అప్పటికి నేనింకా రాస్తూ ఉండేవాన్ని. నా రాత పూర్తయ్యేంతవరకు నా ముందు అలానే కూర్చుని ఎదురుచూసేవాడు. కొన్నిసార్లు నా అవస్థ చూడలేక వాడే లెక్కలు చేసి ఇచ్చేవాడు. ఆ తర్వాత వాడి సైకిల్ మీద చుట్టుపక్కల వీధులన్నీ తిరిగి ఆడుకునేవాళ్లం. నాకు సైకిల్ వచ్చినా డబుల్స్ తొక్కడం రాదు. అందుకని ఎప్పుడూ వాడే నడిపేవాడు. మొహమాటం కొద్దీ సైకిల్ ఇవ్వమని వాణ్నెప్పుడూ అడగలేదు.
ఒక రోజు హోంవర్క్ అయ్యాక, వాడింకా రాలేదని నేనే వాళ్ళ ఇంటికెళ్ళాను. ఇంట్లో వాడొక్కడే కాళ్ళకి స్కేటింగ్ షూస్ వేసుకుని అటూఇటూ తిరుగుతూ టీవీ చూస్తున్నాడు. వాళ్ళది కలర్ టీవీ. మా బ్లాక్ అండ్ వైట్ టీవీలో పన్నెండు ఛానల్స్ మాత్రమే వచ్చేవి. వాళ్ళ టీవీలో యాభైకి పైగా వచ్చేవి. వాడెప్పుడూ ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడు. నేను వాడింట్లో చూసిన మొదటి ఇంగ్లీష్ సినిమా టర్మినేటర్. కాసేపు టీవీ చూసి, వాళ్ళమ్మ రాగానే ఇంట్లో చెప్పేసి బయటకి బయలుదేరాం.
మెల్లిగా సైకిల్ తొక్కుతూ రూఫస్ గాడు “అరేయ్, రోజూ ఇలా తిరుగుతుంటే బోర్ కొడుతుందిరా” అన్నాడు.
“మరేం చేద్దాం?” అన్నాను.
“స్ఫూర్తి వాళ్ళింటికి వెళ్దామా?”
“ఆ పిల్ల ఇంటికి ఇప్పుడు ఎందుకురా?” ఆశ్చర్యపోతూ నోరు తెరిచాను.
“ఎహే పోదాం పద! ఏం కాదు” అంటూ స్ఫూర్తి ఇంటివైపు సైకిల్ తిప్పాడు.
తను మా క్లాసు అమ్మాయి. మా ఇంటికి కొంచెం దూరంలో వాళ్ళ ఇల్లు ఉంటుంది. నేను మా క్లాసు అమ్మాయిల ఇంటికి వెళ్ళడం ఇదే మొదటిసారి. వాళ్ల ఇంటి గేటు ముందు సైకిల్ ఆగింది. ఎవరెళ్ళి గేటు తీయాలి అని మేము కొట్టుకునే లోపలే, స్ఫూర్తి వాళ్ళమ్మ మమ్మల్ని చూసింది.
“ఎవరు కావాలి బాబూ?” అని గట్టిగా అరిచింది.
“సైకిల్ చైన్ ఊడిపోతే పెట్టుకుంటున్నాం ఆంటీ” అని భయపడుతూ చెప్పాను.
“మీరు మా పాప క్లాసే కదా?” అని అడిగింది అనుమానంగా.
“అవును ఆంటీ” అని టక్కున మాట కలిపాడు రూఫస్.
మమ్మల్ని లోపలికి పిలిచింది. మేం ఒకరి మొహాలు ఒకరం చూసుకుంటూ, నవ్వుకుంటూ లోపలికి నడిచాం. స్ఫూర్తి మెల్లిగా బయటికొచ్చి మాకు హాయ్ చెప్పింది. కాసేపు ఆంటీతో మాట్లాడాక ఆటల్లోకి దిగాం. కాసేపు చెస్, ఆ తర్వాత కేరమ్స్. నా మనసంతా బయట నిలబెట్టిన సైకిల్ మీదే ఉంది. అడుగుదాం అనుకుని, అడగలేక మౌనంగా ఉండిపోయా. కాసేపటికి వాళ్ళిద్దరూ లూడో ఆడడం మొదలెట్టారు. దాని గురించి నాకేం తెలీదు.
వాళ్ళు ఏవేవో కొత్త ఆటలు, వీడియో గేమ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. మౌనంగా చూస్తూ, వింటూ, నవ్వుతూ, తలూపుతూ కూర్చోవడమే నా పనైంది. ఇళ్లల్లో కలర్ టీవీలు ఉన్నోళ్లంతా ఇంతేనేమో అనిపించింది. కాసేపు ఓపిక పట్టాను కానీ ఈ కలర్ టీవీ ముచ్చట్లు వినడం ఇక నావల్ల కాలేదు. ధైర్యం చేసి వాడిని సైకిల్ తాళంచెవి అడిగాను.
“ఎందుకురా?” అన్నాడు వాడు.
“మీరు ఆడుతూ వుండండి. నేను అలా రెండు రౌండ్స్ వేసి వస్తాను”
తాళంచెవి ఇవ్వడేమో అనుకున్నా. కానీ ఆటలో మునిగిపోవడం వల్ల వెంటనే జేబులో తాళంచెవి తీసి నా చేతిలో పెట్టాడు. నా మొహం వెలిగిపోయింది.
మొదటిసారి రూఫస్ గాడి సైకిల్ తొక్కుతున్నా. తాళం తీసి, స్టాండ్ పైకి లేపి, సీటు మీద కూర్చున్నా. టర్మినేటర్ సినిమా గుర్తొచ్చింది. పక్కనే ఉన్న చెట్టు కింద గన్ను ఆకారంలో ఉన్న కర్ర కనిపించింది. అది తీస్కుని వెనకాల నా షర్టుకు తగిలించాను. నిజంగా ఆర్నాల్డ్ అయిపోయినంత ఉత్సాహం, ఆత్రుత. ఆలస్యం చేయకుండా తొక్కడం మొదలెట్టాను. గంటసేపు వీధులన్నీ తిరుగుతూనే ఉన్నాను. అలసిపోతున్నా సరే తొక్కడం మాత్రం ఆపలేదు.
అలా ఓ వీధిలో అడుగుపెట్టానో లేదో చైన్ ఊడిపొయింది. నా గుండె హఠాత్తుగా చేతుల్లోకి జారింది. ఆ సైకిలుకు చైన్ ఎలా వెయ్యాలో నాకు తెలియదు. చాలాసేపు దాన్ని సరిచేయడానికి చూశాను కానీ, నావల్ల కాలేదు. భయపడుతూనే స్ఫూర్తి ఇంటివరకు తోసుకుంటూ వచ్చాను. వాడప్పుడే లోపలి నుండి బయటకు వచ్చాడు. నా వంక చూసి, ఏమీ మాట్లాడకుండా ఒక నవ్వు నవ్వి, చైన్ సరిచేశాడు. నన్ను వెనకాల కూర్చోమని చెప్పి సైకిలెక్కాడు. ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ సైకిల్ ఇవ్వడేమో అని చాలా భయపడ్డాను.
ఆ రోజు నుంచి మేం స్ఫూర్తి ఇంటికెళ్ళిన ప్రతిసారి, వాళ్ళు ఇద్దరు లోపల ఆడుకోవడం, నేను సైకిల్ తొక్కడం. వాడికి తెలియకుండా సైకిలును స్పీడ్‌గా పోనిచ్చి సర్రుమని బ్రేక్ వేసి గిర్రుగిర్రుమంటూ నేల మీద రౌండ్లు వేసి విన్యాసాలు చేసేవాన్ని.
ఐదో తరగతి అయిపోయింది. ఎండాకాలం సెలవులు కూడా త్వరగానే అయిపోయినట్టు అనిపించింది. స్కూల్ తెరిచారు. నేను ఆరో తరగతిలోకి వచ్చాను కానీ రూఫస్ గాడు రాలేదు. వాడు అనుకున్నట్టుగానే నవోదయ పరీక్ష పాసయ్యి, సీట్ సంపాదించి అక్కడికి వెళ్ళిపోయాడు.
అప్పుడప్పుడు వాడింటికి వెళ్ళినప్పుడు గోడకు ఆనించి ఉన్న వాడి సైకిల్, స్కేటింగ్ షూస్ కనిపించేవి. వాటిని చూసి నవ్వుకునేవాన్ని. ఆ తర్వాత రూఫస్ నాకు మళ్ళీ కనిపించలేదు. కలిసే అవకాశం కూడా రాలేదు. అప్పుడప్పుడూ వాడి ప్రస్తావన వచ్చేది. వాడేం చేస్తున్నాడో మా ఫ్రెండ్స్ నాకు చెప్పేవాళ్ళు.
చెడ్డీలు పోయి ప్యాంట్లు వచ్చాయి. వినీత్, సూర్యతోపాటు చాలామంది నా స్నేహితులు సైకిల్ కొన్నారు. మా నాన్న భయం మూలంగా చిట్టచివరకు పదో తరగతిలో నేను కూడా సైకిల్ కొనుకున్నా. ఎన్ని సైకిళ్ళు వచ్చినా మా రూఫస్ గాడి టర్మినేటర్ సైకిల్ ముందు ఏదీ పనికిరాదు.
*****
పదిహేనేళ్ల తర్వాత ఓరోజు కోటి ఉమెన్స్ కాలేజీ జంక్షన్ దగ్గర రోడ్డు దాటుతున్నాను. ఎవరో నన్ను పిలిచినట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి చూశాను. సిగ్నల్ దగ్గర ఆగున్న కారులో రూఫస్‌గాడు, వాళ్ళక్క ఉన్నారు. నేను నవ్వుతూ దగ్గరికి వెళ్లి పలకరించాను. కాసేపు మాట్లాడాకా రెడ్ సిగ్నల్ పడింది. నవ్వుతూ, మళ్ళీ కలుద్దాం అని టాటా చెప్పి వెళ్ళిపోయాడు. ఐదో తరగతిలోనే నవోదయ కోచింగ్ కోసం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోయేంత ధైర్యం చేసిన రూఫస్ ఇప్పుడు డాక్టరయ్యాడు.
పాత జ్ఞాపకాలన్నీ నెమరేసుకుంటూ, నాలో నేనే నవ్వుకుంటూ ముందుకు నడిచాను.
*****
నిజంగా జరిగిందే!
* హాయ్ దినేష్! మీ గురించి చెప్పండి.
హాయ్! మాది నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం. నేను పుట్టింది, పెరిగింది అక్కడే. బాసర ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ చేశాను. ఆ తర్వాత రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో మాస్టర్స్ ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ చేశాను.
* ఇది మీ తొలి కథ కదా? కథలు రాయాలన్న ఆలోచన ఎలా మొదలైంది?
చిన్నప్పటి నుంచి రాయడం ఇష్టం. నా ఆలోచనలను పేపర్‌పై పెట్టడం అలవాటు. ఏడాదిన్నర క్రితం ఈ కథ రాశాను. ఎక్కడికీ పంపకుండా అలాగే వదిలేశాను. చివరకు ఇలా బయటికొచ్చింది.
* ఈ కథంతా నోస్టాలజీలా ఉంటుంది. దీని నేపథ్యం చెప్తారా?
ఈ కథంతా నిజంగా నా జీవితంలో జరిగిందే! ఎక్కడా ఏదీ మార్చలేదు. It was my Sweetest Childhood. రూఫస్ ఇప్పటికీ నాకు మంచి మిత్రుడు. నా చిన్నతనంలోని జ్ఞాపకాలను యథాతథంగా ఇందులో ప్రజెంట్ చేశాను. ప్రచురణకు ముందే ఈ కథను రూఫస్‌కి చూపిస్తే చదివి చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాడు.
* మాస్టర్స్ ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ చేశారు కదా? సినిమా రంగంలో మీ ప్రయాణం?
ఫిల్మ్ టెక్నాలజీలో నా స్పెషలైజేషన్ సినిమాటోగ్రఫీ. గతంలో కొన్ని షార్ట్ ఫిల్మ్‌లకు కెమెరామెన్‌గా చేశాను. యాడ్ ఏజెన్సీల కార్పొరేట్ వీడియోలకూ పనిచేశాను. అదే సమయంలో ఫోటోగ్రాఫర్ సరితా దత్తాత్రేయ గారి సహకారంతో రెండేళ్ల పాటు ‘Smile Art Beats’ అనే వెబ్ మ్యాగజైన్ నడిపాను. ప్రపంచంలోని అనేకమంది ప్రముఖ ఫొటోగ్రాఫర్ల ఇంటర్వ్యూలు అందులో ప్రచురించాను. 2018 నుంచి సొంతంగా స్క్రిప్టులు రాయడం మొదలుపెట్టాను. ఆరు నెలల క్రితం Love, Anjali అనే డెమో ఫిల్మ్ తీశాను. ప్రస్తుతం నాలుగు షార్ట్ ఫిలిమ్స్ కలిపి ‘బ్రేకప్ స్టోరీస్’ అనే మినీ ఆంతాలజీ సిరీస్ చేస్తున్నాను.
* సాహిత్యంతో మీ పరిచయం గురించి?
చిన్నప్పుడు పంచతంత్రం కథల్లాంటివి చదివేవాణ్ణి. ఫిల్మ్ స్కూల్‌లో ఉన్నప్పుడు కథారచయిత వెంకట్ శిద్దారెడ్డి మాకు క్లాసులు చెప్పేవారు. నేను డెమో ఫిల్మ్ తీస్తున్న టైంలో ఆయన నాకు మధురాంతకం నరేంద్ర గారు రాసిన ‘మనోధర్మపరాగం’ అనే నవల ఇచ్చారు. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఆ నవల కర్ణాటక సంగీత నేపథ్యంలో సాగడంతో నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత అలెక్స్ హేలీ ‘Roots’, జి.కల్యాణరావు ‘అంటరాని వసంతం’ ఒక్కోటీ చదవడం మొదలుపెట్టాను. అలా సాహిత్యంతో ఏర్పడిన పరిచయం అభిమానంగా మారింది. ప్రస్తుతం నాకోసం ఓ మినీ లైబ్రరీ ఏర్పాటు చేసుకున్నాను.
* మీకు బాగా నచ్చిన రచనలు?
ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు అకిరా కురసొవా ఆత్మకథ ‘Something Like an Autobiography’ నా మీద చాలా ప్రభావం చూపింది. ‘Don’t take Life too Serious’ అన్నది ఆ పుస్తకం నుండి నేర్చుకున్నాను. అందులో ఆయన రాసిన ఒక విషయం చెప్తాను.
కురసొవా పుట్టింది జపాన్‌లో. అక్కడ భూకంపాలు ఎక్కువ. ఆయన చిన్నతనంలో ఒక రాత్రిపూట ఇంటి బయటకు రాగానే భూకంపం వచ్చి చుట్టూ ఉన్న ఇళ్లన్నీ కూలిపోయాయి. జనమంతా బయటికొచ్చి అరుస్తూ పరిగెడుతున్నారు. కురసొవా ఇంటి నుంచి మాత్రం ఆయన అమ్మానాన్న బయటకు రాలేదు. దాంతో తన తల్లిదండ్రులు చనిపోయారని అనుకుని తన ఫ్రెండ్ కుటుంబంతో కలిసి ఉండాలని వాళ్ల దగ్గరకు వెళ్లబోతాడు. కాసేపటికి ఆయన అమ్మానాన్న బయటకు వచ్చారు. ఆ ఒక్క సంఘటనతోనే జీవితాన్ని ఆయనెంత సులభంగా ట్రీట్ చేశారో అర్థమవుతుంది.
తెలుగులో కేశవరెడ్డి నవలలు, బొజ్జా తారకం గారి ‘పంచతంత్రం’ చాలా ఇష్టం. ప్రముఖ కర్ణాటక సంగీత గాయకుడు టి.ఎం.కృష్ణకు నేను అభిమానిని. ఆయన రాసిన ‘Sebastian & Sons: A Brief History of Mrdangam Makers’ పుస్తకం నా మీద చాలా ప్రభావం చూపింది.
* ఇప్పుడే కథలు రాయడం మొదలుపెట్టారు? ముందు ముందు ఎలాంటి రచనలు చేయాలని ఉంది?
సంగీతం, దేవదాసీ వ్యవస్థ నేపథ్యంలో ‘అమృతవర్షిణి’ అనే నవల రాస్తున్నాను. దానికోసం చాలా రీసెర్చ్ చేశాను. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆపేశాను. ఆ నవల పూర్తి చేయాలి. దాంతోపాటు మరిన్ని కథలు, సినిమా రంగానికి సంబంధించిన పుస్తకాలు రాయాలని ఉంది.
*
చాలా బాగా రాసారు భయ్యా. అర్జెంట్ గా ఆ రూఫస్ ని ఒకసారి చూసేయలనిపించెంతగా. బాసర ట్రిపుల్ ఐటీ వాళ్ళకు చాలా మందికి దినేష్ బ్రో ఒక కెమెరామెన్ గా ఇప్పటికే తెలుసు. కానీ ఇలా కథలు కూడా రాయగలడని, ఆ ఆసక్తితోనే ఫిల్మ్ స్కూల్ లో చేరాడని తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.
చదువుతున్నంతసేపూ ఆ రూఫస్ గాడి సైకిల్ వెనుక నేనూ కూర్చుని తిరుగుతూ చూసినట్టుంది కథ. జ్ఞాపకాన్ని అక్షరీకరించే కళ చక్కగా అబ్బినట్టుంది, keep writing!
Great story.
Inspiring…
కథా బాగుంది; పరిచయము బాగుంది. ఇంకా చాలా కథలు, షార్ట్ ఫిల్మ్స్ నుంచి మ్ముందుకు సాగాలని …అభినందనలతో.
Nice story good luck dinesh
చక్కగా రాశారండీ
Very nice story Dinesh.
Good story dinesh. Nostalgic…👍
Nice good luck dinesh best of Lock
కథ బావుంది. ప్రెజెంటేషన్ కూడా బావుంది. కొన్ని అప్పుతచ్చులున్నాయి. కరెక్ట్ చేసివుంటే బావుండేది. “చెడ్డీలు పోయి ప్యాంట్లు వచ్చాయి” అని రాసారు. అది బహుశా “లాగూలు పోయి ప్యాంట్లు వచ్చాయి” అనాలేమో?
ముందుగా రచయితకి శుభాకాంక్షలు
కథ చదువుతున్న క్రమంలో నా బాల్యం నా కనుల ముందు కదలాడింది, మా మిత్రుడు కృష్ణ వాడి సైకిల్ గుర్తుకు వచ్చాయి
ఈ కథ చాలా మంది జీవితంలో ఉన్న బాల్య స్మృతులను తట్టిలేపుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు,
కథకుడు కథని పరిచయం చేసిన తీరు, కథలోని పాత్రల మధ్య సంభాషణలు , భాష చాలా చక్కగా ఉన్నాయి
ఇలానే మరెన్నో కథలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను .
Simply superb
నువ్వు ఐదో తరగతి చదివే రోజుల్లో నేను అదే బడిలో నాలుగో తరగతి చదువుతున్న, తెలుగు మాధ్యమంలో పాఠాలు చదివిన నాకు ఆ ఆంగ్ల మాధ్యమంలో ఏమి బోధపడేది కాదు అందులోనూ ఆంగ్లంలోనే మాట్లాడాలి అనే నియమం వచ్చింది తర్వాత రోజుల్లో… ఆరో తరగతి చదవకుండా నేను ఏడవ తరగతిలో మీ తరగతిలో అడుగు పెట్టినప్పుడు కాస్త భయం బెరుకు ఉండేవి. ఆ తరువాత మెల్లిగా మితో కలిసిపోయినా, ఎన్నో సార్లు నీ వద్ద గణిత శాస్త్రం పుస్తకం తీసుకొని వారం రోజులు నా వద్దే ఉండేది ఎంత వ్రాసిన అది అయిపోయేది కాదు ఆ తర్వాత విజయ్ పుస్తకం ఇలా ఎంత మంది పుస్తకాలు తీసుకున్న అయిపోయేది కాదు. అందుకే కదా మా నాన్న ప్రిన్సిపల్ వద్ద తీసుకెళ్ళి మీరేం చేస్తున్నారు పిల్లవాడు ఇంటివద్ద రాయడానికి ఇచ్చిన పని రాస్తున్నడా లేదా అని నిలదీయటం. అది కాస్త మన తరగతి మొత్తం చూడటం సగానికి పైగా రాయటం లేదని ఆ వచ్చే శనివారం బడిలో అందరి పుస్తకాలు చూసి రాయటం లేదని గుర్తించడం అబ్బో ఇలా ఎన్నో ఉన్నాయి లే…. Dinesh Amgadda….