రుణానంద లహరి కబుర్లు: ఆడియో

‘ముళ్ళపూడి వెంకట రమణ సాహిత్యం పై  ఎమ్వీయల్ సమగ్ర పరిశోధన’  “కానుక” నించీ  “ఋణానందలహరి”   అన్న అధ్యాయం  ఆడియో ఇది.

చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊళ్ళో, పొలం గట్టు మీద కూచుని, కానుక  చదవడం ఒక మంచి జ్ఞాపకం మాత్రమే కాదు.  నాన్నారు  ఎమ్వీయల్ గారి  అందమయిన విశ్లేషణ,  రమణ గారి విన్యాసాలు  అర్ధం అవడానికీ, తెలుగు భాష అంటే ఇష్టం ఏర్పడడానికీ పునాది  వేసింది.   ఆ ఋణం  ఒకింత తీర్చుకునే ప్రయత్నమే ఈ ‘ఋణానందలహరి’  ఆడియో.

కానుక  1973 వ సంవత్సరంలో  నవోదయా   ప్రచురణగా వచ్చింది. నలభై ఏళ్ళ  ఒక తెలుగు రచయిత సాహిత్యంపైన,  ముప్ఫయి ఏళ్ల మరో తెలుగు రచయిత  ‘ సమగ్ర సాహిత్య పరిశోధన’ చేయటం  అరుదయిన + అందమయిన  సంగతి.

అప్పట్లో, ఈ కానుకలో, కొన్ని మార్పులు చేస్తే – థీసిస్ గా  తీసుకుని డాక్టరేట్ ఇస్తామని ఒక యూనివర్సిటీ వారు అన్నారట. విశ్వ విద్యాలయాలు –  రొటీన్ ఫార్మాట్ లోంచీ  బయటపడి  కొత్త రక్తాన్ని  ఎక్కించుకోవాలని నమ్మే ఎమ్వీయల్ గారు  తన రచన మార్చడానికి ఇష్టపడలేదు. డాక్టరేట్  లేకపోయినా  పరవాలేదు అనుకున్నారు.

ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ఆరుద్ర గారి మాటల్లో  –

“ఎమ్వీయల్ విద్యార్థి దశలో  ఏరికోరి సాహిత్యాన్నే అభ్యసించాడు. ఇప్పుడు అధ్యాపకుడై సాహిత్యాన్ని బోధిస్తున్నాడు. సర్వ సాధారణంగా  మన కళాశాలల్లోని  ఉపన్యాసకులు మొక్కుబడికి, పొట్టకూటికి ప్రాచీన సాహిత్యంలోని  గోరంత ప్రాశస్త్యాన్ని కొండంత చేసి పాఠాలు చెప్పటమే రివాజు. వాటి మీద పరిశోధనలు చేసి కొట్టిన పిండినే గోనెల్లో పోసి డాక్టరేట్ సంపాదించుకుని, మర్నాడా విషయాలు విస్మరించడం  కూడా రివాజే. అయితే ఎమ్వీయల్ అలాంటి వాడు కాదు. నేటి సజీవ సాహిత్యంపై అభిమానం, ఈనాటి ప్రముఖ రచయితలతో సాన్నిహిత్యం, అధునాతన ఉద్యమాల పట్ల ఉత్సాహం, నవీన ప్రక్రియల పట్ల జిజ్ఞాస అతనికి మెండుగా ఉన్నాయి. అందుకే ఈనాటి వచన రచనలో సరికొత్త విప్లవాన్ని తెచ్చిన రమణ సాహిత్యం పై తన దృష్టిని కేంద్రీకరించాడు. సమగ్ర పరిశోధనకు పూనుకున్నాడు.

ముళ్ళపూడి భాయీ జాన్సన్ కి 

ఎమ్వీయల్  సెబాస్వెల్ ”

– అన్నారు ఆరుద్ర, కానుకని బాస్వెల్ రచన  శామ్యూల్ జాన్సన్ బయోగ్రఫీ తో పోలుస్తూ .. . సెబాస్ + వెల్  అన్న ప్రయోగం చేస్తూ !!

పుస్తకంగా రాసిన ఈ రచన, ఆడియో ఫార్మాట్  లోకి సంపూర్ణంగా ఒదగదన్నది తెలిసిన విషయమే. కానీ  ఆడియోగా చేస్తే, తెలుగు అంతగా చదవని  కొత్త తరం బుడుగులు  విని, భాష మీద మోజు పెంచుకుంటారేమో అన్న ఆలోచన ముందుకు నెట్టింది .

ఈ  ఆడియో లో తప్పులుంటే -చదివిన నావీ, మీకు నచ్చితే – ఆ క్రెడిట్  రమణ గారిదీ, రాసిన నాన్నారిదీనూ !!

రమణ గారికి జన్మదిన శుభాకాంక్షలతో …

ఫోటో లో – శ్రీ యుతులురమణ , ఎమ్వీయల్ ,  బాపు, బీవీఎస్ రామారావు గార్లు .

రామ్ ప్రసాద్ ఎంవీయస్

3 comments

Leave a Reply to Padmapv Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కానుక, నాకు, బహుమతి గా, vachina, మొదటి పుస్తకం. అప్పట్లో, MVL. బ్రదర్ ni, మేము ఈజీవితం. లో మర్చిపోలేను !

  • నేను చదివినది అంతా అంతర్ధ్వని లా వినిపించింది మీ ఆడియో ద్వారా. మళ్లీ మళ్లీ ఎంజాయ్ చేసేది ఇది. చదవటం చేతకాని కొత్త తరం ఇది విని చదవటం నేర్చుకునే స్తారేమో నని నా ” అవమానం” బుడుగు భాష లో!! అలా అయితే మంచి ప్రయత్నం మీది . ధన్యవాదాలు రామ్ ప్రసాద్ గారూ!

  • రచన పత్రిక లో వచ్చిన ఎమ్వీయల్ గారి ఈ అద్భుతాన్ని నేను , ఒకసారి తెలుగు వారి సమ్మేళనం, మీరట్ లో ఇష్టంగా చదివి వినిపించా. అంత ఇష్టం నాకు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు