ఆ రిసార్ట్ చిన్న చిన్న కార్పొరేట్ సంస్థలు తమ సిబ్బందిని ఆహ్లాదం కోసం తీసుకువెళ్లే విహార స్థలాల లాంటిది. అది నగరంలో ఉన్నా లేనట్టే. కొత్తగా వెలుస్తున్న శివారు ప్రాంతాల నుంచి అరగంట డ్రైవ్ చేస్తే అక్కడికి చేరవచ్చు. అదేమీ పెద్ద విలాసవంతమైనది కాదు. కాకపోతే దాని ప్రకటనలన్నిటిలోనూ అది విలాసవంతమైనదనే ఉంటుంది. అయితే అటువంటి రిసార్టులన్నీ ఉన్నట్టుగానే అది విశాలమైనది. అందులో ఆటలకూ కార్యక్రమాలకూ ఎన్నో ఖాళీ స్థలాలున్నాయి. అందులో ఒక ఆరుబయలు బార్ కూడా ఉంది. ఆ రిసార్ట్ లో బందీలుగా ఉన్న చట్టసభ సభ్యులలో ఎక్కువమంది రోజంతా అక్కడే గడుపుతున్నారు.
ఆ చట్టసభ సభ్యులను కొందరు “గుర్తు తెలియని వ్యక్తులు” కిడ్నాప్ చేసి నిర్బంధించారని రాజధానిలోని అత్యంత నమ్మకమైన పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయింది. ఆ ఎఫ్ఐఆర్ లోని ఆరోపణే ఆ రిసార్ట్ మీద దాడి చేయడానికి సాకు. “వారిని బందీలుగా పట్టుకుని, ఒక రహస్య స్థలంలో చట్టవ్యతిరేక నిర్బంధంలో ఉంచారని సమాచారం అందింది,” అని ఫిర్యాదులో రాశారు.
ఒకవైపు ఆ ఎఫ్ఐఆర్ రాస్తుండగా, మరొకవైపు కిడ్నాప్ కు గురైన బాధితులు రిసార్ట్ లోని ఈత కొలనులో సంతోషంగా జలకాలాడుతున్న దృశ్యాలను టీవీ ఛానళ్లు ప్రసారం చేస్తున్నాయి గాని చట్టానికి తెలిసిందే సరైనది గదా.
ఆ ఎఫ్ఐఆర్ ఇతర పోలీసు స్టేషన్లకు అందకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. స్వయంగా కమిషనర్ (పాత జయేష్ భాయికి ఇష్టుడైన కమిషనర్ కాదు, కొత్త కమిషనర్) స్వయంగా బృందంతోపాటు కదిలి వెళ్లగా పది పోలీసు వ్యాన్లు సరిహద్దు దాటి పొరుగు రాష్ట్రంలోకి వెళ్లాయి. ఆ బృందమంతా అర్ధరాత్రి బయల్దేరింది. ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు వేరు వేరు మార్గాల్లో ప్రయాణించింది. తెల్లవారే సమయానికి వాళ్లందరూ రిసార్ట్ గేట్ల దగ్గర ఉన్నారు.
ఎఫ్ఐఆర్ లో కొందరి పేర్లున్నాయి గాని ప్రత్యేకంగా ఆ వ్యక్తులు అక్కడ ఉన్నారా లేరా అని వెతికే మర్యాదలు పాటించడానికి సమయం లేదు. ఇవాళ్టి లక్ష్యం ఏమంటే పారిపోయినవాళ్లలో సగం మందిని వెనక్కి తీసుకురావడం అంతే. ప్రత్యేకంగా ఎవరిని తీసుకు వస్తున్నాము అనే పట్టింపు ఏమీ లేదు. వాళ్లు ఒకసారి జయేష్ భాయి ఉచ్చు లోంచి బైట పడ్డారంటే, ఇక వారిని ఒప్పించడం అంత కష్టం కాదు.
కమిషనర్ మొత్తం వ్యవహారాన్ని పకడ్బందీగా రచించాడు. రిసార్ట్ ముందర కాపలా జవాన్ల వంతు మారే సమయం ఇంకా కొన్ని గంటలే ఉంది. కాని సెంట్రీలుగా, గేటు కాపలాగా ఉన్న చాలా మంది పోలీసు జవాన్లు కాసేపైనా నిద్ర పోదామని అప్పటికే ఇళ్లకు వెళ్లిపోయారు. బందీలుగా ఉన్న చట్టసభ సభ్యులకు కాపలా కాయడం వాళ్ల సాధారణ ఉద్యోగంలో భాగమేమీ కాదు. పాస్ పోర్టు ధృవీకరణలు, సాక్షులుగా కోర్టుల్లో హాజరు వేయించుకోవడం, బెయిల్ తీసుకుని దొరకకుండా పోయినవాళ్ల ఆచూకీ కనిపెట్టడం, ఫిర్యాదులు రాయడం వంటి ఎన్నెన్నో పనులు ఉంటాయి. రిసార్ట్ దగ్గర కాపలా కాశాక మళ్లీ ఆ పనులన్నీ కూడా చేయవలసి ఉంటుంది. ఇక ఆ సమయానికి రిసార్ట్ దగ్గర మిగిలిన కొందరు, వాళ్ల షిఫ్ట్ అప్పుడే ముగియబోతుందని, ఎలా వెళ్లిపోవాలా అని చూస్తున్నారు. లేదా దాడిని పట్టించుకోలేదు. వాళ్లలో కొందరు తాము చేస్తున్నది తప్పుడు పని అని కూడా అనుకుంటూ ఉంటారు. మొత్తం మీద దాడి చేస్తున్నవాళ్లు అక్కడి పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకోవడం చాలా సులభంగా జరిగిపోయింది. లేదా బ్రహ్మాండంగా జరిగిందనాలి. స్వయంగా కమిషనరే మైకులో ఆదేశాలు ఇస్తూ ఉంటే, వచ్చిన దాడి బృందంలో ప్రతి ఒక్కరూ లాఠీలతో, కాచుకోవడానికి పట్టుకున్న డాళ్లతో యుద్ధ సన్నద్ధంగా సాయుధంగా ఉంటే, అక్కడి కాపలా జవాన్లు చేతులెత్తేసి, ఇళ్లకు వెళ్లిపోయారు.
చట్టసభ సభ్యులను ఒక్కొక్క గదిలో ఇద్దరి చొప్పున పెట్టారు. వాళ్లలో చాలా సీనియర్లకు మాత్రమే ఒకరికి ఒక గది ఇచ్చారు. మొదట రిసార్ట్ సిబ్బంది అక్షర క్రమంలో ఇద్దరిద్దరికి ఒక్కొక్క గది కేటాయించారు గాని, రెండో రోజుకల్లా ప్రతి ఒక్కరూ తనకు నచ్చిన మరొకరితో జత కలిశారు. కొందరికి రాత్రంతా తాగుతూ కూచోవడం ఇష్టం. కొందరికి పొద్దున్నే నడకకు వెళ్లడం ఇష్టం. ఒక జంటయితే, బస్సు ఎక్కగానే ఒకరితో ఒకరు కళ్లు కలుపుకున్నారు, త్వరలోనే ప్రేమికులైపోయారు. మరో ఇద్దరు సన్నిహితం కావడానికి ప్రయత్నించారు గాని దురదృష్టవశాత్తూ మొహమాటాల వల్ల దగ్గర కాలేకపోయారు.
ఆ భవనంలోని మూడు అంతస్తుల్లో వారందరూ ఉన్నారు. మూడో అంతస్తులో కొన్ని విలాసవంతమైన ఉన్నతస్థాయి గదులున్నాయి. వాటిని జయేష్ భాయి, ఆయన సిబ్బంది తీసుకున్నారు. కింద ఉన్న రెండు అంతస్తుల్లోనూ బందీల సమూహమంతా ఉంది.
దాడి బృందం ఆ రెండు అంతస్తుల మీదనే గురి పెట్టింది. ఆ రెండు అంతస్తులకూ పొడవాటి నడవాలున్నాయి. ఆ నడవా చివర పచ్చిక మైదానం లోకి దారి తీస్తుంది. అక్కడ కమిషనర్ నిలబడ్డాడు. ఒక సంగీత సమ్మేళనంలో దర్శకుడు ప్రవర్తించినట్టుగా ఆయన ప్రవర్తించాడు. ఇద్దరు మనుషులను, ఒక్కొక్కరినీ ఒక్కొక్క అంతస్తుకు పంపించారు. వాళ్ల చేతుల్లో తలుపులు పగులగొట్టే సాధనాలున్నాయి. అవి పైన పట్టుకోవడానికి వీలుగా ఉన్న బలమైన లోహపు దూలాలు. వాటిని బలంగా తాళాలకు గుద్దితే తాళాలు విడిపోయి వచ్చేస్తాయి.
కమిషనర్ తన చేతి గడియారం చూసుకున్నాడు. మెల్లగా తన చేతులు రెండూ పైకి లేపాడు, అంతే మెల్లగా కిందికి దించాడు. అలా కమిషనర్ సైగ చేయగానే, తలుపులు పగులగొట్టేవాళ్లు తమ పని ప్రారంభించారు. మొదటి అంతస్తులో 101 నంబర్ గది, రెండో అంతస్తులో 201 నంబర్ గది మొట్టమొదట పడిపోయాయి. ఆ తర్వాత 102, 202, ఆ తర్వాత అలా సాగుతూ పోయింది. ఒక్కొక్క తలుపు పడిపోవడానికి దాదాపు పది సెకన్లు పట్టింది. ఆ దూలాన్ని చాలా దూరం వెనక్కి లాగడం, ఒక్క కుదుపుతో తాళం మీద గుద్దడం, ఆ తర్వాత మళ్లీ అదే పని, మరి కొన్ని సెకన్లు, మరొక తలుపు.
మూడో అంతస్తులో పని ఇంకా సులభం. కొద్ది మంది నిశ్శబ్దంగా ఆ అంతస్తు ఎక్కి, తలుపు బైటి నుంచి పెట్టి తాళాలు వేసేశారు.
మొదటి నిమిషం అయిపోయే సరికి 106, 206 కూడా పడిపోయాయి. ప్రతి గది లోకీ నలుగురేసి మనుషులు వెళ్లాలని కమిషనర్ ఆదేశించాడు. ఇద్దరి చేతుల్లో పాస్టిక్ తాళ్లతో, నలుగురు మనుషులు గదిలోకి దూసుకు పోయారు. వెళ్లడం వెళ్లడమే అక్కడ నిద్రలో ఉన్న, శబ్దాలకు హఠాత్తుగా మేలుకొని కంగారు పడుతున్న, భయపడుతున్న లక్ష్యాలను పట్టుకుని ఇద్దరి మణికట్లూ కలిపి ఆ ప్లాస్టిక్ తాడుతో కట్టేయడం. దానితో కంగారు పడ్డవాళ్లు మాత్రమే కాదు, సంతోష పడ్డవాళ్లూ ఉన్నారు. తమను విడిపోకుండా కట్టేసినందుకు ప్రేమికుల జంట సంతోష పడింది. మామూలుగానైతే చాలా శక్తిమంతులైన ఆ చట్టసభ సభ్యుల నుంచి ఎటువంటి ప్రతిఘటనా ఎదురు కాలేదు.
107లో ఒక్కరే ఉన్నారు. ఆయనతో పాటు ఉన్న మరొకరు రాత్రి బైటికి వెళ్లి తిరిగిరాలేదు. ఉన్న ఒక్కరూ చప్పుళ్లు విని, ఏం జరుగుతున్నదో, తన నిద్రకు ఎవరు ఎందుకు భంగం కలిగిస్తున్నారో తెలుసుకుందామని తలుపు దగ్గరికి నడిచాడు. ఆయన తలుపు తెరవడమూ, అదే సమయానికి తాళం పగులగొట్టి వెనక్కి వెళ్లిన ఇనుప దూలం మళ్లీ ముందుకు దూసుకు రావడమూ ఒక్కసారే జరిగాయి. ఆ ఇనుప రాక్షసికి తన వేగాన్ని అర్థవంతంగా తగ్గించుకునే అవకాశమే లేకపోయింది. అటువైపు చట్టసభ సభ్యుడేమో ఎంతమాత్రం జాగ్రత్తగా లేడు. ఆ దూలం నేరుగా వచ్చి ఆయన తొడల మధ్య గుద్దేసింది. మర్మావయవాల మెత్తని కండలను బలంగా గుద్దుకుంది. పెండ్యూలమ్ లాగా అటూ ఇటూ కదులుతున్న ఆ దూలం గుద్దుకున్న స్థలం కీలక ప్రాంతం నుంచి ఒక అంగుళమో ఇంకా తక్కువో పక్కకు జరిగింది. కాని ఆయనకు మాత్రం మరోప్రపంచపు అంచుల్లోకి చేరినట్టనిపించింది. ఆ తేలికపాటి ఆఘాతమే యుద్ధ మేఘాల మధ్య పిడుగుపాటు అయింది. శిరస్త్రాణాలూ, సకల ఆయుధాలూ ధరించిన సైనికులు, రణగొణ ధ్వని, ఎటు చూసినా గందరగోళం, దేహశుద్ధికి గురవుతున్న సహచరుల దృశ్యాలు, వాటన్నిటికీ తోడు ఈ ప్రాణాంతకమైన గుద్దు – ఆ మనిషికి తలకు మించినవైపోయాయి. ఆయనిక బిగ్గరగా శోకాలు పెట్టి ఏడవసాగాడు.
మూడో అంతస్తులో ఉన్నవారికి కింద ఏదో జరగరానిది జరుగుతున్నట్టు అప్పుడే తెలిసింది. జయేష్ భాయి మామూలుగా గాఢ నిద్రలో ఉండడు. లేచి తలుపు దగ్గరికి పరుగెత్తాడు. తీయడానికి ప్రయత్నిస్తే అది బైట గొళ్లెం పెట్టి ఉంది. దాన్ని టకటకలాడించాడు గాని ఏమీ లాభం లేకపోయింది. ఆయనతో పాటు ఆ గదిలోనే ఉన్న కొడుకు తలుపు మీద నాలుగైదు తన్నులు తన్నాడు గాని, అవి కూడా దాన్ని ఏమీ కదల్చలేకపోయాయి. అవతలి నుంచి, ఆ తలుపు గొళ్లాలు పెట్టినవాళ్లు, “ఇక ఆపండి,” అని హెచ్చరించారు. అది కేవలం వాళ్లను తలుపు తెరిచే ప్రయత్నం నుంచి నిరుత్సాహ పరచడానికి మాత్రమే కాదు, వాళ్లకు తలుపు ఒక్కటే అవరోధం కాదని, తలుపు అవతల ఉన్నారని తెలియజేయడానికి కూడా. కాసేపు మూడో అంతస్తు నిశ్శబ్దంగా ఉండిపోయింది.
కింద, 180 సెకన్లు పూర్తయ్యేప్పటికి, కమిషనర్ సంతృప్తి పడ్డాడు. తగినంత మంది బందీలు దొరికారు. తలుపులు పగులగొట్టేవాళ్లు కూడా అలసిపోయారు. వేగం కాస్త తగ్గింది. చేతులు కలిపి కట్టేసిన బందీలకు కాపలా కాయడానికి ఇంకా ఎక్కువ మంది కావాలి.
110, 209 గదులు కూడా ఖాళీ చేయించాక మొత్తం ముప్పై ఒక్క మందిని పట్టుకున్నారు. కమిషనర్ తన ఈల తీసి చాలాసేపు ఏకబిగిన ఊదాడు. అందరినీ బైటికి వచ్చేయమని పిలుపు ఇచ్చాడు. నాలుగు వ్యాన్లను గేటు దగ్గర వెనక్కి తిప్పి పెట్టారు. సరిగ్గా వాటి వెనుక వైపు రిసెప్షన్ కు ఎదురుగా ఉండేట్టు ఉన్నాయవి. బందీలందరినీ నడిపించి వ్యాన్లలో కుక్కారు. వాళ్లలో కాస్త లావుగా ఉన్న నలుగురైదుగురిని ముందుగా వ్యాన్ లోకి తోశారు. కాని వాళ్లు లోపలికి సరిగ్గా ఎక్కలేక తూలి, లోపల పడిపోయారు. దానితో వాళ్లను లోపలికి ఎక్కించే కార్యక్రమం మందకొడిగా సాగింది. కమిషనర్ తన హాండ్ మైక్ లో మళ్లీ ఒకసారి పదునుగా ఆదేశాలిచ్చేసరికి మళ్లీ వేగం పుంజుకుంది. వరుసగా నిలబెట్టిన వాళ్లను లోపలికి ఎక్కిస్తుంటే, వాళ్లు పడిపోయిన సహచరుల మీది నుంచే వ్యాన్ లోపలికి ఎక్కారు.
జయేష్ భాయి విధేయులలో ఒకరు తమ నాయకుడు బందీలలో లేడని గుర్తించాడు. తన చేతికి కట్టిన కట్లు విప్పుకుని ప్రతిఘటిద్దామని మొదట ప్రయత్నించాడు. కాని ఆ ప్రయత్నంలో ప్లాస్టిక్ తాడు ఆయన మణికట్టును కోసేసింది. తాను టాయిలెట్ కు వెళ్లాలని చెప్పి కాస్త ఆలస్యం చేయడానికి ప్రయత్నించాడు గాని ఆయన కోరికను ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయానికి జయేష్ భాయి బాల్కనీలోకి వచ్చాడు. అక్కడి నుంచి కాస్త ముందుకు వంగి చూస్తే, పచ్చికలో కొంతభాగమూ, అక్కడ జరుగుతున్న వ్యవహారమూ కనబడింది. ఆయన పోలీసుల మీద అరవడం మొదలుపెట్టాడు.
“వెధవల్లారా! మీ పని చెపుతానుండండి. ఇంతకు ఇంతా అనుభవించకపోరు! ఇప్పటికిప్పుడు మీ పని ఆపకపోతే తర్వాత నా తడాఖా చూస్తారు!”
కమిషనర్ తన హాండ్ మైక్ నోటి దగ్గర పెట్టుకున్నాడు. జయేష్ భాయిని నోరు ముయ్యమని అరిచాడు. మాట్లాడకుండా గదిలోకి వెళ్లమన్నాడు. అలా వాళ్లిద్దరూ ఒకరి మాట మరొకరు వినకుండా అరుచుకుంటుంటే అక్కడా గందరగోళం వ్యాపించింది.
ఆ విధేయుడికి సందేశమేదీ సరిగ్గా వినిపించలేదు గాని తన యజమాని గొంతు వినడమే తనకొక సూచన అనుకున్నాడు. పరుగెత్తడానికి ప్రయత్నం మొదలు పెట్టాడు. అటువంటి పరిమాణం ఉన్న మనుషుల విషయంలో పరుగెత్తడం అంటే అంబాడడం అనే అర్థం. ఆయన తనను దాటి పోవడానికి ప్రయత్నిస్తున్నాడని చూసిన ఒక కానిస్టేబుల్ తన కాలు ముందుకు జరిపి దాటిపోతున్న మనిషి వెనుక కాలు పట్టుకున్నాడు. ఆయన ముఖం మీద బోర్లా పడబోయాడు గాని మణికట్టుకు కట్టి ఉన్న ప్లాస్టిక్ తాడు పడిపోకుండా కాపాడింది.
ఆ దృశ్యం చూసి ఇద్దరు ముగ్గురు కానిస్టేబుళ్లు నవ్వారు. కాని ఆ నవ్వులే ఆ మనిషి ప్రతిఘటనా నిశ్చయాన్ని దృఢపరిచాయి. లేచి నిలబడి మెల్లగా నడవడం మొదలు పెట్టాడు. వెనక్కి వంగి, కాళ్లు ఈడుస్తూ, పోలీసులు తనను తీసుకుపోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఆలస్యం చెయ్యదలిచాడు. ఆయనను తోస్తున్నవాళ్లు యువకులు, ఆయన కంటె బలవంతులు. ఇంతకన్నా బలిష్టమైన, కరుడుగట్టిన శాల్తీలను కూడా లోబరచుకున్న వాళ్లు. ఆయనకు తోసుకుపోవడం వాళ్లకు కష్టం కాలేదు.
రిసెప్షన్ దగ్గరికి చేరి, వ్యాన్లను చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతున్నదో ఆయనకు అర్థమయింది. తాను ఏమి చేయగలనా అని ఆలోచించాడు. తన సహచర చట్టసభ సభ్యులందరినీ లోపలికి ఎక్కిస్తున్నారు, ఎక్కమంటున్నారు, తోస్తున్నారు. వ్యాన్ తలుపు దగ్గర ఇద్దరు జవాన్లు రెండు పక్కలా నిలబడ్డారు. ఆయనకు ముందు ఉన్న బందీని ఒక జవాను వ్యాన్ మెట్లు ఎక్కించి తలుపులోకి తోస్తుండగా, ఈ విధేయుడు హఠాత్తుగా వంగి వ్యాన్ కింద దూరాడు. ముందరి వ్యక్తిని తోయడంలో మునిగి ఉన్న జవాన్లు కంగారు పడి కిందికి చూశారు. ఆ మనిషి వ్యాన్ మెట్లకిందికి ఎందుకు దూరాడో మొదట వాళ్లకు అర్థం కాలేదు. ఆయన నడుమూ ఆ పై భాగమూ బైటికి కనబడడం లేదు.
వెనుక నుంచి తోస్తున్నారు గనుక వరుస ముందుకే సాగుతున్నది. వరుసలోని ప్రతి వ్యక్తి కాళ్లూ కింద పడి ఉన్న విధేయుడి పాదాలను తంతున్నాయి. అది అదునుగా తీసుకుని ఆయన ఇంకా ముందుకు పాకాడు. చివరికి వ్యాన్ ఇరుసు కిందికి చేరాడు. వ్యాన్ కింది భాగంలో ఉన్న రాడ్లూ స్ప్రింగులూ వంటి చల్లని భాగాలను ఏది దొరికితే దాన్ని పట్టుకున్నాడు. అలా వ్యాన్ కింది భాగంలో ఎవరూ బైటికి లాగలేనట్టుగా ముడి వేసుకున్నాడు.
ఆ పక్షి ఎగిరిపోయిందని, లేదా తనను తాను పంజరంలో పెట్టుకుందని గుర్తించిన జవాన్లు, దీన్ని ఎట్లా పరిష్కరించాలా అని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారిలో ఒకరు అనుకోకుండానే డ్రైవర్ దగ్గరికి పరుగెత్తి వ్యాన్ ను కదిలించవద్దనీ, వ్యాన్ కింద చిక్కుకున్న మనిషి బైటికి వచ్చేదాకా వ్యాన్ అట్లాగే ఉంచాలనీ చెప్పాడు.
డ్రైవర్ అలా నేరుగా వచ్చిన ఆదేశాలను లెక్క చేయలేదు గాని కుతూహలం కొద్దీ తన సీట్లోంచి కిందికి దూకి, వ్యాన్ కింద ఇరుక్కుపోయిన మనిషిని చూడడానికి వంగాడు. త్వరలోనే అక్కడ ఒక సర్కస్ మొదలయింది. ఛాతీ మీద, మోచేతుల మీద, తొడల మీద ప్రత్యేక రక్షణ ఉడుపులతో ఉబ్బిపోయిన ఆ జవాన్లకు వ్యాన్ కిందికి పోవడం గాని, వ్యాన్ కిందికి పోగలిగినా అక్కడ కదలడం గాని అసాధ్యం. వ్యాన్ కిందికి దూరుదామని ప్రయత్నించినవాళ్లను ఆ మనిషి ఎడా పెడా తంతుంటే వాళ్ల ముఖాలమీద ఆ తన్నుల దెబ్బలు తగులుతున్నాయి. తమ లాఠీలతో పొడిచి ఆయనను బైటికి లాగాలని ప్రయత్నించారు గాని ఆయన ఇంకా గట్టిగా ఉడుం పట్టు పట్టుకుని ఉండిపోయాడు. లాఠీ కొస గనుక అనుకున్న లక్ష్యాన్ని తగిలితే తిట్లూ, దుర్భాషలూ, అప్పుడప్పుడు బాధతో అరుపులూ పెడబొబ్బలూ మొదలు పెట్టాడు.
ఆయనను అక్కడి నుంచి కదిలించడం కష్టమని కొద్ది నిమిషాల్లో స్పష్టమైపోయింది. దాడి చేస్తున్నవాళ్ల కన్నా ఎక్కువ దృఢ నిశ్చయమూ, సమయమూ ఆ మనిషి దగ్గర ఉన్నాయి. లోపల అంతా సక్రమంగా ఉందో లేదో చివరిసారి చూసి కమిషనర్ బైటికి వచ్చాడు. బైట జరుగుతున్న గందరగోళం చూసి, ఏమి చేయడం సాధ్యమో ఆయన గబగబా అంచనా వేశాడు. ఒకటి, వ్యాన్ ను కాస్త ముందుకు కదిల్చి, ఆ మనిషి భయంతో బైటికి వస్తాడేమో చూడడం. కమిషనర్ డ్రైవర్ ను కోప్పడి, అతను బైటి నుంచి తన సీట్లోకి ఒక్క దూకు దూకేలా చూశాడు. మిగిలిన వాహనాలన్నీ నిండిపోయాయి, ఇక కదలడమే తరువాయి అనుకున్నప్పుడు, అప్పటికి తన సీట్లోకి చేరిన ఆ వ్యాన్ డ్రైవర్ తాళపు చెవి లేదని గుర్తించాడు. లోపల ఎక్కడన్నా పెట్టి ఉంటానా? చుట్టూ చూశాడు. జేబులన్నీ తడిమి తడిమి చూసుకున్నాడు. బహుశా అది బైట పడి ఉంటుంది. డ్రైవర్ మళ్లీ దిగి అంతకు ముందు వెళ్లిన దగ్గరికి వెళ్లి చూశాడు. నిజంగానే, తాళపు చెవి తన చొక్కా జేబు లోంచి జారి వ్యాన్ చక్రం దగ్గర పడి ఉంది. అలసిపోయినట్టుగా ఆ తాళపు చెవి తీసుకోవడానికి ప్రయత్నించాడు. కాని ఏం జరిగిందో చురుగ్గా గుర్తించిన బందీ గబుక్కున ముందుకు సాగి తాళపు చెవి చేజిక్కించుకున్నాడు. వెంటనే ఆ తాళపు చెవిని నోట్లో వేసుకున్నాడు. మళ్లీ తన కోటలోకి వెళ్లి బిగించిన పళ్లతో తన ధిక్కార స్వరాన్ని వినిపించడం మొదలు పెట్టాడు.
ఆగిపోయిన వ్యాన్ లోపల ఆరుగురూ, వ్యాన్ కింద ఒకరూ ఉన్నారు. వాళ్లందరికీ ఇప్పుడీ నాటకంలో ప్రధాన పాత్రలు దొరికాయి. ఇప్పటికే వెళ్లిపోవలసిన సమయం వచ్చేసిందని అంచనా వేసిన కమిషనర్ లోపల ఉన్న ఆరుగురినీ చివరిగా వేచి చూస్తున్న వ్యాన్ లోకి బదిలీ చేయమన్నాడు. కాని అప్పటికి ధైర్యం తెచ్చుకున్న ఆ ఆరుగురూ తమ శరీరాల్ని తలుపుకు అడ్డంగా పెట్టి బైటికి రావడానికి నిరాకరించారు. వ్యాన్ తలుపు ఇరుకుగా ఉంది గనుక ఒక్కొక్కరిని మాత్రమే బైటికి తీసుకురావడం వీలవుతుంది. వ్యాన్ చుట్టూరా గట్టి జాలీ ఉంది గనుక లోపల ఉన్నవాళ్ల మీద దాడి చేయడానికో, బైటికి వచ్చేలా చేయడానికో కుదరదు. అలా ఒకటిన్నర నిమిషం గడిచాక, కమిషనర్ ఇక వీళ్ల కోసం సమయం వృథా చేయవద్దనుకున్నాడు. చివరి ఈల ఊదాడు. నాటకం అయిపోయిందని సూచన అది. మిగిలిన జవానులందరినీ చివరి వ్యాన్ లో ఎక్కమని తన కారులో వెళ్లిపోయాడు.
అవును, ఆగిపోయిన వ్యానూ, దానిలోని మనుషులూ అలాగే ఉండిపోయారు. అయినా మొత్తం మీద కమిషనర్ కు సంతృప్తిగానే ఉంది. అందుకు కారణమూ ఉంది. మొత్తం చర్య హింస లేకుండా మృదువుగా జరిగిపోయింది. అంతకన్నా ముఖ్యంగా ఇచ్చిన సమయంలోపల జరిగిపోయింది. ఇదంతా ఇట్లాగే సవ్యంగా సాగిపోతే, కొన్ని గంటల్లో వీళ్లందరూ రాజధానీ నగరపు రక్షణలోకి చేరిపోతారు. ప్రమంకా ఇచ్చిన నంబర్ కు “కార్యం జయం” అని పొడిగా మెసేజి పంపించాడు. హెల్మెట్ తీసేసి, తన సీటును వెనక్కి తోశాడు.
**
తమ రిసార్ట్ మీద దురాక్రమణ జరిగిందని రిసార్ట్ యాజమాన్యం గుర్తించే సమయానికి, జయేష్ భాయి బైటికి వచ్చాడు. ఆగిపోయిన వ్యాన్ లో మిగిలిపోయిన ఆరుగురూ బైటికి వచ్చి, ఆయన గది ముందుకు వెళ్లి, తలుపు తెరిచారు. ఏమి జరిగిందో తమ యజమానికి చెప్పారు.
ఆ ఆరుగురూ ఆగ్రహంతో, ఆందోళనతో (ఒకవేళ ఆ వ్యాన్లు మళ్లీ వస్తాయేమో అనే ఆందోళనతో) ఉన్నారు. కాని దాని కన్నా ముఖ్యంగా వాళ్లలో ఒకలాంటి విజయగర్వం కూడా ఉంది. నిర్లిప్త ప్రేక్షకులకు ఈ ఘటనల క్రమమంతా అసాధారణమైనదని అనిపించవచ్చు గాని, అందులో పాల్గొంటున్నవారికి మాత్రం తాము ప్రతిఘటించగలిగామన్నదే చాలా ముఖ్యమైన విషయం అని అనిపించిది.
జయేష్ భాయి అక్కడే మొదలు పెట్టాడు. వ్యాన్ యుద్ధంలో నాయకుడూ విజేతా అయిన ఏడో వ్యక్తిని ఇతరుల భుజాల మీద ఎక్కించి, కిడ్నాప్ కాకుండా మిగిలిపోయిన వాళ్ల హర్షధ్వానాల మధ్య ఊరేగించాడు. గబగబా లెక్క పెడితే, తమకు జరిగిన నష్టం వాస్తవమైనదేనని అర్థమయింది. అయితే అంతకన్నా ఘోరం జరిగే అవకాశం తప్పిపోయింది. వెంటనే రోడ్డెక్కి దీన్ని పెద్ద సమస్యగా మార్చడానికి తగిన క్షణం ఇదే అని జయేష్ భాయికి అర్థమయింది. వెంటనే రిసార్టుకు రమ్మని మీడియాకు కబురు పంపాడు.
ఏడుగురు యోధులను ముందు వరుసలో కూచోబెట్టారు. వాళ్ల దుస్తులు ఎట్లా ఉన్నవి అట్లాగే ఉంచుకొమ్మన్నారు. విజేతను కిడ్నాప్ చేయడానికి మాత్రమే కాదు, హింసించడానికీ, చంపేయడానికీ జరిగిన ప్రయత్నానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వీరోచిత పోరాటానికి గుర్తుగా ఆయన పైజమా కొసలు కనబడుతున్నాయి. తన మీది నుంచి వ్యాన్ నడిపించి ఉండేవాళ్లే, కొద్దిలో తప్పించుకున్నాడు. అది కేవలం అదృష్టం. తనను ఉద్దేశపూర్వకంగా తొక్కి చంపడానికి ఆ రాక్షస వాహనం తన మీది నుంచి కదులుతుంటే జాకీ చాన్ లాంటి సమర్థతతో తాను పక్కకు దొర్లాడు.
అలాగే వంతెన మీద ఆగిపోయిన ఆరుగురు వీరయోధులను ఒక్కొక్కరినీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ప్రతి ఒక్కరూ ఈ గణతంత్ర రాజ్యాన్ని కాపాడడానికి, దాన్ని ఇతరులు హస్తగతం చేసుకోకుండా అడ్డుకోవడానికి తాము తమ శరీరాలను, తమ కండలను ఎలా పణంగా పెట్టారో వివరించారు.
అయితే ఈ వీరోచిత సాహసంలో పాలు పంచుకునే అవకాశం జయేష్ భాయికి దక్కలేదు. అయినా తనకూ తన శత్రువుకూ జరిగిన మహా యుద్ధం గురించి అత్యంత వివరమైన వర్ణనలను ఆయన తయారు చేయగలిగాడు. ఆ శత్రువును ఆయన తొక్కేయగలిగాడు. తప్పనిసరిగా విజయం సాధిస్తాడు.
“మీరు చెపుతున్న శత్రువు ఎవరు?” మీడియా సహజంగానే, సకారణంగానే ప్రశ్నించింది.
“ఇంకెవరు? ఆమెనే… ఆ… ఆ… దురాక్రమణదారు. ఆ మంత్రగత్తెనే. ఆ పసరిక పామే!” అని అరిచాడాయన, ఆగ్రహంతో వళ్లంతా వణికిపోతుండగా. ఆయన బుగ్గలు ఎర్రని ఎరుపుకు తిరిగాయి. ఆయన చెవులైతే కోపంతో మండిపోతున్నాయి. ఆయన కళ్లు మృగం కళ్లలా మారాయి.
ఆమె ఇప్పుడున్న స్థానంలో కొనసాగి, ఆ మహత్తర కార్యాలయాన్ని అపవిత్రం చేయకుండా కాపాడడమే తన లక్ష్యం. కలిసి వచ్చిన పరిస్థితులను దుర్వినియోగం చేస్తూ ఆమె తన అశుద్ధపు కార్యక్రమాన్ని అమలు చేయదలచుకున్నది. దాన్ని ఎంతమాత్రమూ అనుమతించగూడదు. తప్పనిసరిగా ప్రజలు లేచి నిలుస్తారు. ఆమెను అడ్డుకుంటారు. అరాచకత్వానికీ, భీతావహానికీ వ్యతిరేకంగా జాతిని కాపాడడానికి పుట్టుకువచ్చిన నాయకుడిగా తనను చూసి ఇతరులు భయపడడం ఊరికే జరగలేదు. తాను సాధించిన ఆ ఘనత ఎంత సాధికారికమైనదో ఆమెకు తాను చూపుతాడు. ఈ యుద్ధాన్ని రాజధానికి తీసుకువెళతాడు.
ఈ మొత్తం వ్యవహారంలో, జయేష్ భాయి తన మద్దతులో కొంత భాగాన్ని, భౌతికంగానే కోల్పోయాడనే వాస్తవం కనబడకుండా పోయింది. కచ్చితంగా ఆయన దగ్గర ఉన్నవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడైతే వ్యవహార సరళి తనకు అనుకూలంగా ఉన్నట్టు కనబడుతున్నది గాని, మీరాను అధిగమించాలంటే తప్పనిసరిగా కొంత భౌతిక విజయమూ కావాలి, సంఖ్యాబలమూ కావాలి. ఆయన ఇక రాజధానికి పాదయాత్ర ప్రారంభించాడు. తన గౌరవ ప్రతిష్ఠలను పణంగా పెట్టాడు. ఫలితం ఏమవుతుందో ఎంతమాత్రమూ లెక్కలేకుండా పోయింది. ఆయన కోరుకున్నది భీకర ఘర్షణ మాత్రమే.
**
ఈ వ్యవహారాన్ని టెలివిజన్ తెర మీద చూసి ఉన్నట్టయితే మీరా కంపించిపోయేది. తనకు వ్యతిరేకంగా, ముఖ్యంగా తాను చేసిన సమర్థనీయమైన పనికి వ్యతిరేకంగా అంత తీవ్రమైన భావోద్వేగాలు చెలరేగడం, తప్పనిసరిగా ఆమెను తనను తానే ప్రశ్నించుకునేలా చేసేది. మేనేజర్ ఆ విషయం ఊహించినట్టున్నాడు. “మాల్ ఎత్తేయడం” జరిగిందని సమాచారం రాగానే, ఆయన మీరాతో అనుకున్న ప్రధానమైన పని జరిగిందని, మీడియాలో కాస్త అల్లరి జరగవచ్చునని, కాని ఆమె దాన్ని పట్టించుకోనక్కరలేదని ముందు జాగ్రత్త చెప్పాడు. ఎట్లాగైనా టెలివిజన్ చూద్దామని మీరా అనుకోనూ లేదు. కనుక ఆ అతి ముఖ్యమైన సందర్భం ఆమె నుంచి తప్పుకుపోయింది.
ఏమి జరగవచ్చునో మేనేజర్ ఆమెకు చెప్పాడు. “ఆయనకు చాలా ఆగ్రహం కలుగుతుంది. వ్యక్తిగతంగా మీ మీద దాడికి దిగుతాడు, కనీసం మాటల్లో.”
మీరా ఆయన వైపు చూసింది.
“ఆయన ఏమైనా చేయగలుగుతాడని కాదనుకోండి. విపరీతమైన కోపం వస్తుంది కాబట్టి తప్పనిసరిగా అది ఆయన తప్పులు చేయడానికే దారి తీస్తుంది. దానితో మన అవకాశాలు మెరుగు పడతాయి.”
అప్పటికీ మీరా మాట్లాడలేదు. ఇంకా ఏమన్నా చెపుతాడని ఎదురుచూసింది.
“మనకు మద్దతు కోసం, కనీసం ఈ విషయం మీదనైనా, ఇతరులను సంప్రదించడానికి ఇది మంచి తరుణం.”
మీరాకు అర్థమయింది. “అంటే, స్వామీజీ అనా మీ ఉద్దేశం?”
“అవును. ఇటువంటి ఘర్షణ వాతావరణం ముంచుకొస్తున్నప్పుడు తాను కేవలం ప్రేక్షకుడిగా ఉండడం సాధ్యం కాదని ఆయనకు కూడా అర్థమయ్యే ఉంటుంది.”
“ముంచుకొస్తున్నప్పుడా, ఇప్పటికే ముంచుకు రాలేదా?”
“ఓహ్, అవునవును. నేననేది మనం చట్టాన్ని సవరించడానికి చేయబోయే పని గురించి. అది భవిష్యత్తనుకోండి.”
“భవిష్యత్తా?”
“ఈలోగా మీరు చక్కదిద్దవలసిన ఇతర విషయాలున్నాయి గదా? కాదా? అది ఒక్క చట్టం గురించి మాత్రమే కాదు.”
“అది ఒక్క చట్టం సవరించడానికి పరిమితమైనా నాకు మంచిదే.”
“అవును, కాని ఈ చట్టం, ఆ మాటకొస్తే ఏ చట్టమైనా, అధికారంలో, పదవిలో ఉన్నవారు రాసే, రాయగలిగే, తిరిగి రాయగలిగే కొన్ని పదాల సమూహం మాత్రమే.”
మీరా స్పందించలేదు. కాని ఆయన ఏమంటున్నాడో గ్రహించింది.
“మనం సృష్టించినదాన్ని కాపాడడానికి, పెంచి పోషించడానికి, అది ఎదిగేలా చూడడానికి, అది తరిగిపోకుండా అడ్డు పడడానికి, మనం ఆ చుట్టుపక్కలనే ఉండవలసి ఉంటుంది,” అన్నాడు మేనేజర్.
“నేను అటువంటి మనిషిని కాను. దీంట్లో కొనసాగాలనే కోరిక ఉన్నప్పటికీ, ఆ పని చేసే శక్తి ఉన్నదాన్ని కాను. నా గురించి తెలిసినవాళ్లందరూ అదే మాట అంటారు. అసలు నేను ఇంతదూరం రావడమే వాళ్లకు దుర్భరంగా కనిపిస్తుంది,” అంది మీరా.
ఆ తర్వాత ఆమె నిశ్శబ్దంగా మారింది. లోలోపల ఏదో ఆలోచించుకుంటోంది. దీని గురించి జాయ్ ఏమనుకుంటుంది, ఆదివాసి సముదాయం ఏమనుకుంటుంది? ఫలితాలు రాలేదని, క్షేత్రంలో మార్పులు తేలేకపోయానని అసంతృప్తితో అసలు పనే వదిలి పోయిన దూ బోయ్ అయినా సరే – ఏమనుకుంటాడు? జవాబు కోసం ఆమె తల బద్దలు కొట్టుకోనక్కరలేదు. జవాబు ఆమెకు తెలుసు. తాను ఇప్పటికి చేస్తున్న పనుల గురించి మాత్రమే కాదు, అవే పనులు మరింత ఎక్కువగా చేయబోతున్నానని తెలిసి ఆయనైతే దిగ్భ్రాంతి పడతాడు, సానుకూల పద్ధతిలో కాదు.
మేనేజర్ తల ఊపాడు. ఆమె మథనం ఆయనకు అర్థమయింది. ఇక్కడ వ్యవహారం మౌలికమైనది. ఆయన నుంచి దాగేది కాదు. “మనం ప్రేమించేవాళ్లు, మనను ప్రేమించేవాళ్లు మన గురించి మంచిగా అనుకోవడం చాలా ముఖ్యం,” అన్నాడు.
ఆయన అక్కడితో ఆపడనీ, మరేదో అంటాడనీ మీరాకు తెలుసు. “కాని?” అంది.
“కాని, మనం నిర్ణయాత్మకమైన యుద్ధాలలో గెలవబోతున్నప్పుడు తీసుకునే చర్యలను అంచనా కట్టవలసింది ఆ పునాది మీద కాదు. సరి అయిన పని చేయడం, మన పనులవల్ల ఇతరులను గాయపరచడం రెండూ ఒకటి కాదు. మరీ ముఖ్యంగా ఆ పనులు వాళ్లను లక్ష్యంగా చేసుకున్నవి కానప్పుడు. మీ లక్ష్యం వ్యవస్థలోపల ఏమి చేయడమా అనేదే. మీరు ఎటువంటి విచికిత్సలో ఉన్నారో గుర్తించే బాధ్యత మిమ్మల్ని ప్రేమించే వాళ్లదే. మీరు వాళ్లను గాయపరచడానికి ఆ పని చేయడం లేదు. నిజానికి వాళ్లను కాపాడడానికే మీరాపని చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్లు ఏమి కోరుకుంటున్నారో సరిగ్గా అది సాధించడానికే మీరు ఆ పని చేస్తున్నారు. ఏదో ఒక కార్యాచరణకు దిగాలనే మీ ఈ కొత్త కోరిక వల్ల మొదట వాళ్లు గాయపడతారేమో అనే విచారాన్ని వదిలేయండి. మిమ్మల్ని మీరు వాడుకోవడం ద్వారా, ఏదో ఒక అర్థవంతమైనది సాధించడం కోసం బహుశా మీ నియమాలనూ విలువలనూ ప్రమాణాలనూ త్యాగం చేస్తున్నాననే విచారం వదులుకోండి. నిజానికి మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునేవాళ్లెవరైనా ఈ పనికి మిమ్మల్ని ఆరాధించాలి, గౌరవించాలి. ఒకవేళ దీనిద్వారా మీరు వాళ్లను గాయపరిచినా, కాలం గడిచేకొద్దీ వాళ్లకే అర్థమై వెనక్కి తిరిగి వస్తారు.”
ఆయనకు అవతలి వైపు ఆలోచనను ఎంత హేతుబద్ధంగా, ఎంత స్పష్టంగా వివరించే శక్తి ఉందంటే, ఆమె ఆయన మాటలను కాదనలేకపోయింది. ఆ దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఆయన పెట్టిన వాదనను అంగీకరించలేని, ఇబ్బంది పడే భాగమేదో తన అంతరాంతరాల్లో ఉన్నప్పటికీ, ఆ వాదనలో తర్కమో బలమో లేనందువల్ల కాదు. ఆయన ఈ ప్రపంచం ఎట్లా ఉన్నదో యథాతథంగా వర్ణిస్తున్నాడు. అది ఎట్లా ఉండాలో, లేదా ఎట్లా ఉండాలని ఊహిస్తున్నామో అట్లా లేదు. అది చిక్కు ముడులతో ఉంది, గందరగోళంగా ఉంది. దాన్ని అర్థం చేసుకోగలిగే చట్రం ఏదన్నా ఉందంటే, అది అధికార చట్రమే, మార్పును తీసుకురాగల శక్తి ఉన్న చట్రమే. దానికి మరొక పక్క నీతి ఉంది. కాని ఆ నీతి అనేది ఏదో అమూర్తమైన విషయం. ఆ అమూర్తమైన విషయం ఎవరినైనా వెచ్చగా ఉంచగలుగుతుందేమో, తన ఆలోచనలూ ఆచరణలూ సరిగ్గా ఉన్నాయని ఆత్మతృప్తి పడేలా చేస్తుందేమో, కాని వాస్తవ ప్రపంచంలో అది అసమర్థమైన పనిముట్టు.
ఈ రెండిటినీ, అంటే నైతికతనూ అధికారాన్నీ సమ్మిళితం చేయడమనే భావన చాలా ఆకర్షణీయమైనది. చాలామంది అధికారంలో ఉన్న వ్యక్తులు తమ గురించి తాము ఆ రెంటినీ కలగలిపామనే అనుకుంటారు. ఎవరూ చెడ్డవాళ్లుగా, అనైతికమైనవాళ్లుగా కనబడడానికి ఇష్టపడరు. చివరికి ఇతరులకు హానికరమైన పనులు చేసేవాళ్లు కూడా హేతుబద్ధంగా, ఇంకా చెప్పాలంటే వివేకవంతంగా ఉన్నామనే చూపుకోదలచుకుంటారు. ఎవరిని వాళ్లు సమర్థించుకోవాలి గదా, కనీసం అద్దం ముందరైనా.
“స్వామీజీతో నేనేం మాట్లాడాలి?”
“ఆయనను కలవదలచుకున్నానని చెప్పండి. ఆయన ఇంటి దగ్గర. దానికి ఆయన కాదనలేడు. మీరే ఆయన ఇంటికి వెళ్లి కలుస్తున్నారంటే, ఆయన అనుచరులలో ఆయన పట్ల గౌరవం మరింత పెరుగుతుంది. మీవరకు వస్తే, మీరు ఏదో పని మీద వెళ్లలేదనీ, ఆధ్యాత్మిక వ్యక్తిగా ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్లాననీ చెప్పుకోవచ్చు. అదేమీ గౌరవానికి భంగం కాదు.”
ఆయన ప్రతి విషయమూ స్పష్టంగా ఆలోచించి పెట్టుకున్నాడు.
ఆమె మేనేజర్ చెప్పినట్టు చేసింది. స్వామీజీని జయేష్ భాయికి వ్యతిరేక వేదిక మీదికి తీసుకురావచ్చునా చూడడం అసలు ఉద్దేశం. ఆ తర్వాత ఆయనకు కావలసింది ఇవ్వవచ్చు. ఒకవేళ ఇప్పుడే జయేష్ భాయికి వ్యతిరేకత ప్రకటించలేనంటే, ఆయనకు కావలసింది ఇప్పుడే ఇవ్వవచ్చు. ఆయన ఏమి కోరుకుంటూ ఉండవచ్చు అని అడిగింది మీరా.
“సహజంగానే మనం ఆయననే అడగాలి. మీరు ఎవరో, మీరు ఏం కోరుకుంటున్నారో ఆయనకు తెలుసు. ప్రతి ఒక్కరికీ తెలుసు. అదేమీ అభ్యంతరకరమైనది కాదు. దానికి ప్రతిఫలంగా ఏదైనా కోరుకుంటే ఆయన ఆ మాట స్పష్టంగా చెప్పాలి.”
ఈ మార్గం ఏమీ గందరగోళంగా కనిపించలేదు. దీని సంగతి ఆ రోజే కాసేపటి తర్వాత చూద్దామనుకున్నారు. అప్పుడే మేనేజర్ ఫోన్ నిశ్శబ్దంగా హెచ్చరించింది. ఆయన దాని వైపు చూశాడు. కిడ్నాప్ అయిన వారినీ, పోలీసులనూ తీసుకు వస్తున్న వ్యాన్లు అప్పుడే రాష్ట్ర సరిహద్దులు దాటాయి. ఆయన మీరాకు ఆ వార్త చెప్పాడు.
“వాళ్లు ఎక్కడికి వెళతారు? మనం వాళ్లతో ఏమి చేయవలసి ఉంటుంది?”
“మీరు వాళ్లతో ఒకటి రెండు మాటలు మాట్లాడితే బాగుంటుందనుకోండి. కాని మొదట, వాళ్లు తమ కుటుంబాలను కలవనివ్వండి.”
అందుకు ఏర్పాట్లు పోలీసు శిక్షణా శిబిరంలో చేశారు. వ్యాన్లు నేరుగా శిక్షణా శిబిరంలోకి చేరాయి. వాళ్లను ఎత్తుకురావడం చట్టబద్ధమే అనిపించడానికి, లోపల ఉన్నవాళ్లమీద ఇప్పటికే ఉన్న కేసులు బైటికి తీశారు. రెండు మూడు సందర్భాలలో ఊహాత్మక నేరాలు ఆరోపించారు.
మేనేజర్ ముందే పథకం రచించినట్టుగా బందీల కుటుంబాలు అప్పటికే అక్కడికి చేరాయి. సంతోషదాయకమైన పునర్మిలనం జరిగింది. భార్యలూ పిల్లలూ వాళ్లను కౌగిలించుకున్నారు. కొన్ని కన్నీళ్లు జాలువారాయి. ఒక విచిత్రమైన సన్నివేశంలో ఒక స్త్రీ తన భర్త మీద చెయ్యి చేసుకుంది. ఏదో తెలియని కారణం. తర్వాత వాళ్లిద్దరూ కలిసిపోయారు. వాళ్లందరినీ గుంపుగా ఒక పెద్ద గదిలోకి పంపించారు. అక్కడ మేనేజర్ వాళ్లకోసం ఎదురు చూస్తున్నాడు.
ఆయన వాళ్లందరికీ జరిగినదీ, జరగనున్నదీ వివరించాడు: “పెద్దాయన వెళ్ళిపోయారు. జయేష్ భాయికి సంఖ్యా బలం ఆధిక్యత లేదు. స్వామీజీకి కూడా అంతే. ఎట్లాగూ మనకు ఇప్పుడు నాయకులొకరు ఉన్నారు. ఆమెకు మనకు నాయకత్వం వహించడానికి సాధికారత ఉంది. ఆమెకు వ్యతిరేకంగా ఎటువంటి పని చేసినా అది పార్టీకి వ్యతిరేకంగా, పెద్దాయన వారసత్వానికి వ్యతిరేకంగా, జాతికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో, ద్రోహంతో సమానం.”
ఇది కాస్త తిప్పి చెప్పిన మాట గాని, మొత్తంగానే అందులో వివాదం ఏమీ లేదు. ఆరోపణ, లేదా భారం వాళ్లను అపహరించుకుపోయిన వ్యక్తి మీది నుంచి, అపహరణకు గురైన వాళ్ల మీదకే వచ్చింది. వాళ్లలో కొందరు తలలూపారు. ఇద్దరు ముగ్గురు తమ ముఖ కవళికల ద్వారా ధిక్కారాన్ని ప్రదర్శించబోయారు. కాని వాళ్లు కూడా ఇక్కడ వీరత్వం ప్రదర్శించడం వల్ల ఉపయోగం లేదనీ, ఆగ్రహం ద్వారా సాధించబోయేదేమీ ఉండదనీ నిర్ణయించుకున్నారు. నిజం చెప్పాలంటే, జయేష్ భాయి ఇక్కడి సమాచారానికి చాలా విలువ ఇస్తాడు. ఆ సమాచారం సంపాదించాలన్నా ఈ గుంపుతో కలిసి ఉండడమే మేలు.
వాళ్ల మనోస్థితి ఎలా ఉందో చూడడానికి మేనేజర్ ఆ గదిలో ఉన్నవాళ్లందరి ముఖాల్లోకీ కలయజూశాడు. తన మాటలు కొనసాగించాడు.
“మీ అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాం. ప్రభుత్వాధికారం ఎవరి చేతుల్లో ఉన్నదో వాళ్లే మీ అవసరాలు చూడగలరని మీకు తెలుసు. జయేష్ భాయి చేతుల్లో ఇప్పుడు మంత్రిత్వ శాఖ కూడా లేదు. ఆయనకు ఎటువంటి అధికారమూ లేదు. ఎవరి మీదా ఆయన అజమాయిషీ లేదు. ఆయన గురించి మీరేమీ భయపడనవసరం లేదు. లేదా ఇంకెవరికీ భయపడనవసరం లేదు. మీ అందరినీ ఇక్కడికి తీసుకు రావడంలో, ఇక్కడ ఉంచడంలో నిర్బంధం ఏమీ లేదు. మీరు సురక్షితంగా ఉన్నచోట మీతో మాట్లాడాలని మాత్రమే మేమనుకున్నది.”
అది వ్యంగ్యమా, నిజమా తెలియదు గాని, ఆయన కొనసాగించాడు. “ప్రస్తుతానికి, రేపు సభలో జరగనున్న ఒక కీలకమైన వోటింగ్ సందర్భంలో సభలో మీ హాజరు ఉండాలని మేం కోరుతున్నాం. ఆ కారణం వల్ల, రేపు అది జరిగేవరకూ మీరు ఇక్కడే ఉండాలని మేం కోరుతున్నాం. అది అయిపోగానే, ఎవరికి ఏం కావాలో మనం చర్చించుకోవచ్చు.”
ఆయన అక్కడ ఆపేశాడు. అక్కడ బాధ్యుడుగా ఉన్న అధికారికి కుటుంబాలన్నిటికీ భోజనాలు ఏర్పాటు చెయ్యమనీ, భోజనాలయ్యాక వారందరినీ జాగ్రత్తగా ఇళ్లకు తీసుకు వెళ్లమనీ, చట్టసభ సభ్యులను మాత్రం బారక్స్ లో నిర్బంధించమనీ ఆదేశం ఇచ్చాడు.
ఆయన ప్రమంకాకు తిరిగి వచ్చి ఏమి జరిగిందో మీరాకు వివరించాడు. ఇప్పుడు సంఖ్యాబలం సరిపోయేట్టే ఉంది. పరిస్థితి మెరుగ్గా ఉంది. ఇక వాళ్లిద్దరూ స్వామీజీ దగ్గరకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు.
**
వాహనశ్రేణిని రమ్మని పిలిచారని విని ఆయేషా ఆశ్చర్యపోయింది. ఏం జరుగుతున్నదో తెలుసుకొమ్మని ప్రభుకు చెప్పింది. ప్రభు తిరిగి వచ్చి, భద్రతా సిబ్బంది నుంచి తాను తెలుసుకున్న వివరం, వాహనశ్రేణి గమ్యం, చెప్పాడు.
“వాళ్లు, ఆ దగుల్బాజీ దగ్గరికి, స్వామీజీ ఇంటికి, వెళ్తున్నారట,” అన్నాడు ప్రభు.
“ఎందుకు?”
“నా బొంద. నాకేం తెలుసు. బహుశా ఆ బిల్లుకు మద్దతు అడగడానికి కావచ్చు.”
ఇంకా ఎక్కువ వివరాలేమన్నా తెలుస్తాయా అని ఇద్దరూ బైటికి వచ్చారు. ప్రధాన నడవాలో ఎస్కార్ట్ జవాన్ల మధ్య మీరా బైటికి వెళ్తున్నది. కొన్ని అడుగుల వెనుక మేనేజర్ నడుస్తున్నాడు. మీరా కళ్లు ఆయేషా కళ్లతో కలిశాయి, ఆమె చిరునవ్వు నవ్వింది గాని ముందుకే నడిచింది. ఇక చేయడానికేమీ లేక, ఆయేషా, ప్రభు వెనక్కి వచ్చేశారు.
అతిథుల కోసం ఎదురుచూస్తూ స్వామీజీ వాకిట్లోనే నిలబడి ఉన్నాడు. ఎస్కార్ట్ సిబ్బందిలో అత్యధికులను ప్రధాన సింహద్వారం అవతలే ఆగిపొమ్మన్నారు. రెండు మూడు కార్లు మాత్రమే లోపలికి వెళ్లాయి. వాటిలో చివరి కారులో మీరా ఉంది. ఇదంతా కూడా బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. దీని ద్వారా ఆమె అధికారాన్నీ, పదవినీ సింహద్వారం అవతల వదిలేసి, కేవలం వ్యక్తిగా స్వామీజీ దగ్గరకు వస్తున్నదనే సందేశం ఇవ్వడం ఉద్దేశం.
ఈ కలయిక కోసం చేసిన ప్రతిపాదనను స్వామీజీ ఆనందంగా స్వీకరిస్తాడని మేనేజర్ చెప్పిన మాటను నిజం చేస్తూ స్వామీజీ ముఖం మీద సంతోషం తొణికిసలాడుతున్నది. స్వామీజీ వ్యాపార భాగస్వామి కూడా అక్కడే ఉన్నాడు, ఆయనకు కొద్ది వెనుకగా. మీరాకు పరిచయం చేశారు. మీరా కరచాలనం చేయడానికి చెయ్యి ముందుకు చాచింది. కాని ఆయన రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తూ గౌరవంగా ముందుకు వంగాడు. మీరా కూడా అలాంటి భంగిమనే ప్రయత్నించింది. కొద్దిగా వంగి, అలవాటు లేని పద్ధతిలో, స్వామీజీ ఆశీర్వాదాలు కోరింది. ఆయన ఆమెను ఆపి, ఆమె చేతులు పట్టుకుని, తన అరచేతులతో ఆమె అరచేతులను మూశాడు.
ముందుగానే ఒక చిన్న మీడియా బృందాన్ని పిలిపించి పెట్టారు. ఈ పరస్పర గౌరవాదరాలను చిత్రీకరించారు. తర్వాత, ఒకరికొకరు చిరునవ్వులు పంచుకున్నారు. ఒకటి రెండు పరామర్శ మాటలు మాట్లాడుకున్నారు. ఏమి మాట్లాడుకున్నారో కెమెరాలకు తెలియలేదు. ఆ చిన్న బృందం లోపలికి వెళ్లిపోయింది.
అక్కడ ఒక సింహాసనపు గది ఉంది. స్వామీజీ సందర్శకులకు దర్శనం ఇవ్వదలచుకున్నప్పుడు ఆ గదినే వాడుతాడు. కాని ఆయన ఇప్పుడు మాత్రం మీరాను ఆ గదికి తీసుకు వెళ్లలేదు. మరొక పెద్ద హాలులోకి తీసుకు వెళ్లాడు. అక్కడ కుర్చీలలో హెచ్చు తగ్గులు లేవు. మీరా తనంతట తానే ఒక కుర్చీలో కూచుంది. మేనేజర్ కూడా కూచున్నాడు. స్వామీజీ వాళ్ల ఎదురుగా సోఫాలో సరిగ్గా మధ్యన కూచుని వాళ్లవైపు చూపులు సారించాడు. వ్యాపార భాగస్వామి ఒక పక్కన మౌనంగా కూచున్నాడు. ఏదో మతపరమైన తంతులో భాగమైన మిఠాయిల పళ్లెం, స్టీలు లోటాల్లో నీళ్లు అందరి దగ్గరికీ వచ్చాయి.
ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా వ్యవహరించాలో మేనేజర్ కు తెలుసు. అందువల్లనే స్వామీజీ కూడా ఆయననే మొదలు పెట్టనిచ్చాడు.
“మీరాజీ మీ ఆశీర్వాదాల కోసం వచ్చారు. ఆమెకు ఉన్న కర్తవ్యాల భారంలో, ప్రాధాన్యతల్లో, ముఖ్యమైన ఆధ్యాత్మిక పెద్దలందరినీ కలిసి ఆశీర్వాదాలు తీసుకోవడం మంచిదని నేను సలహా ఇచ్చాను,” అన్నాడు మేనేజర్.
అది అబద్ధమని అక్కడ అందరికీ తెలుసు. కాని అవతలివాళ్లు వేరు వేరు ఊహలు చేసే అవకాశం ఇవ్వడం ఎప్పుడైనా మంచిది.
“నేనెప్పుడూ ఆమెకు అందుబాటులోనే ఉంటాను. ఆమె చేస్తున్న మంచి పనులకు నా మద్దతు ఎల్లవేళలా ఉంటుంది,” అన్నాడు సన్యాసి, చాలా జాగ్రత్తగా.
ఇక తాను మాట్లాడవలసి ఉంటుందని మీరాకు అనిపించింది. “స్వామీజీ, నేను మీకు మరొక విషయం కూడా చెప్పాలి. మన జాతిని బలోపేతం చేసే దిశలో తొలి అడుగుగా నేను ఒక ముఖ్యమైన బిల్లు ప్రవేశపెట్టబోతున్నాను.”
“అలాగా. జాతిని బలోపేతం చేయడం సదా అభిలషణీయం. ఆ దిశలో ఏ కార్యక్రమం జరిగినా నా మద్దతు ఉంటుంది. సహజంగానే.”
“నేను మీ నుంచి ఆశించేది అదే స్వామీజీ. నా ప్రయత్నమేమంటే పేద ప్రజల, బడుగు జీవుల భూమిని తీసుకుని, ధనవంతులకు కానుకగా ఇవ్వడానికి ప్రభుత్వానికి అధికారమిచ్చే ఒక చట్టం ఉంది. దాన్ని మార్చాలని అనుకుంటున్నాను. అలా భూమి పొందిన ధనవంతులు ఆ నేలను, వృక్షాలను, జల సంపదను దుర్వినియోగం చేస్తున్నారు. ఆ నేలనూ వృక్షాలనూ జలాన్నీ అక్కడి ప్రజలు దేవతలుగా కొలుస్తున్నారు.”
స్వామీజీ తలాడించాడు. “మీరు చేస్తున్న కృషి, గతంలో మీరు చేసిన కృషి అంతా నాకు విదితమే.”
అప్పుడు మేనేజర్ కల్పించుకున్నాడు. “స్వామీజీ, ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టినప్పుడు మరొక కోణం కూడా వ్యక్తం కావచ్చు. ప్రతిపాదిస్తున్న మార్పులను వ్యతిరేకించే వాదనలో కూడా హేతుబద్ధమైన అంశ ఉందేమోనని పైకి చూడడానికి అనిపించే అవకాశం ఉంది. మరి ఆ బిల్లు సాఫీగా సాగిపోయేట్టు చూడడం చాలా ముఖ్యం.”
స్వామీజీ తల ఊపాడు.
మేనేజర్ కొనసాగించాడు. “మాకు సంఖ్యాబలం ఉన్నదని మీరు ఈ పాటికే విని ఉంటారు. కాని ఈ విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం ఉన్నదని చూపడం మా ఉద్దేశం. కనీసం వీలయినంత ఐక్యత సాధించాలని.”
“వర్తమాన వ్యవహారాలు ఎలా సాగుతున్నాయో నేను తెలుసుకుంటూ ఉండనని మీకు తెలిసే ఉంటుంది. నా ఆసక్తులు భిన్నమైనవి. మీకు సంఖ్యాబలం ఉందనే నేను నమ్ముతున్నాను. నాకు తెలిసినవారిని ప్రభావితం చేయడానికి నాకు వీలయినంత చేస్తాను. కాని బహుశా ఆ బిల్లు ముసాయిదాను చూస్తే, మనకు ఎక్కడెక్కడ ఏకీభావం ఉన్నదో అంగీకారానికి రావచ్చు. మీరు బిల్లు ముసాయిదా ప్రతిని తనకు పంపండి,” అని స్వామీజీ తన వ్యాపార భాగస్వామి వైపు చూపాడు.
అది చర్చలో ముందుకు పోవడానికి ఒక మార్గం. మీరా, మేనేజర్ కోరుకున్న ప్రాథమిక ఫలితం ఇదే. వారితో బేరసారాలు జరపడానికి తాను సిద్ధంగానే ఉన్నానని స్వామీజీ చెప్పినట్టే. ఇక ముందుకు వెళితే తేల్చవలసింది ఏమిటి, ఎవరికి, ఎంత అనేవి మాత్రమే.
తర్వాత వాళ్లు ఇతర విషయాల్లోకి వెళ్లారు. మీరాకు మత వ్యవహారాల మీద ఆసక్తి ఏమీ లేదు. కాని తన చిరాకును ప్రదర్శించగూడదనే మర్యాద ఉంది. ఆమె ఎక్కువభాగం మౌనంగా చిరునవ్వు నవ్వుతూ వింటూ కూచుంది. మేనేజర్ కు విషయం అర్థమై, తాము సెలవు తీసుకోవడానికి అనుమతించమని స్వామీజీని అడిగాడు.
సరిగ్గా వాళ్లు కారులోకి ఎక్కబోయే ముందు, స్వామీజీ మీరా వైపు తిరిగి, “ఓహ్, నేను మీకొక కానుక ఇవ్వాలి,” అన్నాడు.
మీరా ఆగింది.
“ఆయన, ఆ జడ్జి, నా భక్తుడు.”
మీరాకు మొట్టమొదట ఏమీ అర్థం కాలేదు. మేనేజర్ కు కూడా అది జాయ్ కేసుకు సంబంధించినది అయి ఉంటుందా అని అనుమానం కలిగింది. దాన్ని కూడా బేరసారాల అవకాశంగా వాడుకుంటారా అని ఆందోళన కలిగింది.
“మీరు ఫోన్ చేసి, ఇవాళ వస్తామని చెప్పినప్పుడు, నా వ్యాపార భాగస్వామి గుర్తు చేశాడు. ఆ జడ్జి నాకు తెలుసునని. నేను ఆయనకు ఫోన్ చేశాను.” ఆ క్షణం నుంచి ఏమి రాబట్టాలా అని స్వామీజీ ప్రయత్నిస్తున్నాడు. కాని మీరా అటువంటి రకం కాదు. ఇక ఆయన నేరుగా విషయంలోకి వచ్చాడు. “మొత్తం వ్యవహారాన్ని తప్పుల తడకగా తయారు చేసినట్టున్నారు. సరే, కేసయితే నడవక తప్పదు. కాని ప్రభుత్వం కేసు పెట్టిన పద్ధతిలోని అవకతవకల వల్ల, బెయిల్ ఇవ్వడం సాధ్యమవుతుంది. నిజానికి, ఆయన ఇప్పటికే వాళ్లను విడుదల చెయ్యమని ఉత్తర్వులు జైలుకు పంపేశాడు. పాప రేపు బైటికి వస్తుంది,” అన్నాడు. ఆ ఉత్తర్వుల ప్రతి ఒకదాన్ని చేతిలో పట్టుకుని చూపెడుతూ.
మీరా ఆ కాగితం తీసుకుంది. (జాయ్ ను విడిపించింది నిజంగా తానే అని ప్రదర్శించడానికే ఆ ఉత్తర్వు కాగితాన్ని స్వామీజీ చూపాడని మేనేజర్ ఆ తర్వాత మీరాతో అన్నాడు. నిజంగా ఆ విడుదల జరిగినప్పుడు అది సాధించింది తామే అని ఇతరులెందరో చెప్పుకున్నారు).
మీరా కాస్త వంగి స్వామీజీకి ధన్యవాదాలు చెప్పింది. అప్పుడిక ప్రతిఫలంగా తాము ఏమి ఇవ్వగలము అని అడిగే బాధ్యత మేనేజర్ మీదనే పడింది.
స్వామీజీ మృదువుగా, సహజంగా చిరునవ్వు నవ్వాడు. “ఇందుకు ప్రతిఫలమేమీ అక్కరలేదు. మన అమ్మాయి ఇల్లు చేరుతుండడం మనందరికీ సంతోషం,” అన్నాడు.
*
Add comment