వేంసూరు.
మూడురోడ్ల కూడలి.
ఇంటి ముందు రావిచెట్టు, దాని చుట్టూ అరుగు. ఆడుకుంటున్నాను. ఒక వైపు ఊరి బస్టాండు వైపు పొడవాటీ ఖాళీ రోడ్డు. అందులో ఒక తెల్లటి లాల్చీ ధోతీ తో ఒక ఎత్తైన మనిషి చేతిలో బ్యాగుతో నెమ్మదిగా నడిచివస్తున్నాడు. పరిటాల సత్యనారాయణరావు గారి ఇల్లు దాటుతుండగా వచ్చే ఆ ఆయనెవరో అర్థమయింది. చిన్నమామయ్య. సంతోషంతో ఎదురెళ్లానా, అమ్మకు చెబుదామని ఉత్సాహంతో ఇంట్లోకి వెళ్లానా, గుర్తులేదు. ఐదారేళ్ల వయస్సు.
ఇంట్లో మేం కాక, మరెవరైనా ఉండిపోతారంటే, తెలియని ఒక సంబరం. వాళ్లు పట్టుకువచ్చే సంచీల్లో విశేషాలు సరే, వెళ్లేప్పుడు ఇచ్చిపోయే రూపాయీరెండూ సరే, ఉన్నన్ని రోజులూ సుదీర్ఘమధ్యాన్నాలూ, భోజనానంతర రాత్రుళ్లూ, వాటి నిండా ముచ్చట్లూ పొంగిపొర్లుతాయి. వచ్చిన చుట్టాలతో నువ్వు, నీతో వాళ్లూ మాట్లాడనక్కరలేదు. ఇంటిలో మాటల గలగలలు వినిపిస్తుంటే చాలు. ముసుగు కప్పో, కప్పకుండానో, కళ్లుమూసుకోనో మూసుకోకో, ఒక చివరన ముడుచుకు పడుకునే పిల్లల చెవులు ఎంతకీ నిద్రపోవు. పెద్దవాళ్లకు మాటలు ఎక్కువ. చాలా కాలం తరువాత కలసినప్పుడు అవి కుప్పలు తెప్పలు. చుట్టాలు పక్కాలు, వాళ్ల మధ్య కోపాలు అసూయలు స్పర్థలు, ఒక్కొక్కరి లేకితనాలు, దొంగబుద్ధులు అన్నీ ఆ మాటల్లోంచి తుళ్లిపడుతుంటాయి.
వచ్చినంత సేపు ఉండదు సంతోషం. ఎప్పుడు వెళ్లిపోతారోనన్న టెన్షన్. మూకుడు చల్లారనివ్వని, అమ్మకు ఊపిరాడనివ్వని వేడి వేడి అప్పచ్చులు ఆగిపోతాయేమోనని ఆందోళన. చుట్టం వెళ్లిపోకుండా ఆపడానికి చెప్పులు దాచిపెట్టడం గురించి వరంగల్ సీను ఒక పాటలో రాశాడు కానీ, మేమంత చలాకీలమూ చాలూగాళ్లమూ కాదు. అమాయకంగా అమ్మ దగ్గరికి వెళ్లి, ‘మామయ్య ఎప్పుడు వెళ్లిపోతాడే’ అని అడిగేవాళ్లం. ‘అట్ల అడుగొచ్చునా, తప్పుకాదు!?’ అని అమ్మ కోప్పడేది. సంతోషం ఇంకా ఎన్నిరోజులు మిగిలిఉందో తెలుసుకోవడానికే ఆ ప్రశ్న అని తనకి తెలియదా?
చిన్నాన్న, మామయ్య, పెదనాన్న, కజిన్ అక్కలు, అన్నలు, బావలు, వదినలు అందరూ కుటుంబాలకు అనుబంధ సభ్యులే కానీ, పిల్లలకు మాత్రం బంపర్ ఆఫర్లు! చిల్లర కొట్లకు తీసుకెళ్లేది ఎవరు? ఏటి ఒడ్లకు మావిడి తోటలకు తోడొచ్చేది ఎవరు? అమ్మలు నాన్నలు అనుమతించే షికార్లకు సవారీ కట్టేదెవ్వరు? కలగలసిపోయే ఈ కొంచెం కొంచెం పెద్దలు, పెద్ద పెద్ద పెద్దలు తాము విడిదిచేసినన్ని రోజులూ పిల్లల అల్లరిపనులకు అంగరక్షకులుగా ఉంటారు.
ఎండాకాలం సెలవులంటే, రావడమేకాదు, పోవడం కూడా.
శాలి గౌరారం. ఆయమ్మ ఊరు. అక్కడినుంచి చిత్తలూరు. అమ్మమ్మ ఊరు.
ఇత్తడి మరచెంబుల్లో నీళ్లు నింపుకుని, అవీ ఇవీ చిరుతిండ్లు మూటగట్టుకుని, పొద్దున ఎప్పుడో బయలుదేరితే రాత్రి పొద్దుపోయాక కానీ, చేరవలసిన ఊరు చేరము. వేంసూరు నుంచి ఖమ్మం. అక్కడి నుంచి నకిరేకల్లు. తరువాతి రోజల్లో బందరు నుంచో ఏలూరు నుంచో బెజవాడ నుంచో సూర్యాపేట మీదుగా నకిరేకల్లు. ఆర్టీసీ బస్సులు ఇంతవరకే. అక్కడి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం ప్రైవేటు బస్సు. సర్వీస్ బస్సు అంటారు. ఎప్పుడు వస్తుందో ఎప్పటికి వెడుతుందో తెలియదు. ఒక్కోసారి రానేరాదు. అప్పుడిక నకిరేకల్ దుకాణాల ముందు ఖాళీస్థలంలో రాత్రి బస చేయాల్సిందే.
అట్లా ఒక ఎండాకాలం, సాయంత్రం ఆరింటికి చేరాల్సింది నాలుగు గంటల ఆలస్యంగా శాలిగౌరారం చేరాము. బస్సూరాదు, మేమూ రాము అనుకుని వెనక్కివెళ్లిన మా ఆయమ్మ కొడుకు, బస్సు చప్పుడు విని, పరిగెత్తి తిరిగి వచ్చాడు. మమ్మల్ని రిసీవ్ చేసుకుని తీసుకువెడుతూ ఆ సోదరుడు, కిరాణాకొట్టునీ, పాలుపోసే మనిషినీ నిద్రలేపేశాడు. ఆ రాత్రి ఊరు మాకోసం కాసేపు ఆత్రంగా మేలుకొన్నది. ముడుచుకుని నిద్రపోబోయిన మా పెద్దమ్మ ఇల్లు, హృదయం విప్పార్చుకుని విస్తళ్లు వేసింది. వేడి వేడి ఘుమఘుమలను వడ్డించింది.
వెన్నెల రాత్రులో చీకటి రాత్రులో ఏమయితేనేం, ఎండాకాలం ఆరుబయలే, చాపపరుపులే! మట్టికి అంత చేరువగా ఎప్పుడూ ఉండము. మాటల్లో పడతే, పురుగోబూచో మా భయాల నుంచి పారిపోవడమే! అమ్మా, వాళ్ల అక్కయ్యా ఏం మాట్లాడుకుంటారు? పదినిమిషాలలో ఒకరి ప్రపంచాన్ని మరొకరు ఇచ్చిపుచ్చుకుంటారు, ఇద్దరి లోకాన్ని కలియతిరుగుతారు. ఎన్ని ముచ్చట్లు, ఎన్ని నవ్వులు, ఎన్ని కన్నీళ్లు! ఆ ఊసుల ఉయ్యాలలో ఊగి ఊగి పిల్లలం ఎప్పుడో నిద్రలోకి జారిపోతాము. ఆ మగతనిద్రలో ఎన్నెన్ని చరిత్రల చప్పుడు?
బండికట్టుకుని చిత్తలూరు వెడితే, అమ్మ చదువుకున్న సాతానయ్య బడీ, పంచాయతీ ఆఫీసు దగ్గర రేడియో వార్తలూ, సాయంకాలమైతే ఏటి కాల్వల స్నానాలూ, పెద్దలు పవళించిన డొంకదారీ, ఊరుఊరంతా గెంతుతూ తిరగగలిగే స్వేచ్ఛా, ఎంతకీ ముగియని మధ్యాహ్న సమయాలూ, కట్టెల పోయి ముందు కూర్చుని పిల్లలకు కరకరలు వండే అమ్మమ్మా, వేలుపట్టుకుని ఊరంతా చూపించిన చిన్నమ్మా, ఇటూ అటూ అంగలేస్తూ ఆడుకునే షావుకార్ల అరుగులూ, రోజులకు ముక్తాయింపు ఇచ్చే పెద్దల గోష్ఠులూ…ఇప్పుడు జ్ఞాపకంలో మాత్రమే అవి అంత అద్భుతంగా ఉన్నాయో, అవి అప్పుడు జరుగుతున్నప్పుడు కూడా అంత అందంగా ఉన్నాయో, తెలియదు.
పుట్టి పెరగకపోయినా, సొంత ఊరు అయిన వంశగ్రామం భక్తలాపురం, దాని దగ్గర నేలమర్రి, దండుబాటు మీద గుంపుల మాధారం, సూర్యాపేట, మామయ్యలు పంతుళ్ల పనిచేసిన కల్మలచెర్వు, మేళ్ల చెర్వు, రాజాపేట, బొల్లేపల్లి, రామన్నపేట, అటూఇటూ దగ్గరి బంధువులు సంచరించిన నల్లగొండ, హుజూర్‌నగర్, మిర్యాలగూడ..బస్సులు దూరని మూలపల్లెల దగ్గర నుంచి, చిన్నపట్నాలు, జిల్లా కేంద్రాల దాకా నా బాల్యపు వేసవులను వెలిగించాయి. ఒక్కొక్కసారి బతకమ్మ సెలవులను కూడా పండించాయి. ఎవడికి గుర్తున్నాయి, తక్కిన కాలమంతా ఏమి వెలగబెట్టింది? పిండారబోసిన వెన్నెలల డాబా రాత్రులు, ఒకే రాతెండి గిన్నెలో ఆవకాయ కలిపిన సద్దన్నమ్ముద్దల సహపంక్తి భోజనాలు తప్ప- తలచుకుంటే తీపి తగిలే రోజులు మరేమున్నాయి?
అందరికీ అవే అనుబంధాలు, అవే వేసవి గమ్యాలు, ఎండాకాలాన్ని అతిశీతలపరచే ప్రేమలు. మన మనుషులను కలుసుకున్నప్పుడు పండగలు, ఎడబాసినప్పుడు ఏడ్పులు. ఉద్యోగాలు, వృత్తులు, చదువులు మనుషుల్ని విసిరేసినప్పుడు, ఆర్నెల్లకు ఏడాదికి జరిగే రీయూనియన్లు ఈ చుట్టపుచూపులు!
ఇప్పుడు కూడానా?
ఎవరి కోసమైనా ఎదురుచూస్తున్నామా? వెళ్లిపోవద్దని కాళ్లకు అడ్డం పడుతున్నామా? ఎవరింటికైనా అర్థరాత్రివెళ్లి పీట వేసుకుని అన్నం ముందు కూర్చుంటున్నామా? వేళ గాని వేళ అనుకోని అతిథి వచ్చినప్పుడు, గుండె గుమ్మం తెరిచి రమ్మంటున్నామా? వెళ్లడానికి ఏదయినా ఉందా? రావడానికి ఎవరైనా ఉన్నారా?
ఈ ప్రశ్నలు మరీ అన్యాయమైనవి కావచ్చు. కూపస్థ సందేహాలు కావచ్చు. బహుశా, ఇది వ్యసనపు వలపోత కావచ్చు. గడచిన కాలాల పలవరింతలలో సేదతీరడం కావచ్చు. మనుషుల మధ్య ప్రేమలు గతించిన గతమని కుంగిపోవడం కావచ్చు. నా బాల్యపు సంచార స్థలాలన్నీ, ఇప్పుడు అపరిచిత ప్రదేశాలే. ప్రతి ఒక్కరి పరంపరా పట్టణాలకు, నగరాలకే ప్రయాణించింది. ప్రతి ఒక్కరికీ ఆకాశం రద్దుచేయబడింది. ఇరుకు చోటులు, ఉక్కపోతలు ఉచితంగా ఇవ్వబడ్డాయి.
పిల్లలకు మామయ్యలు లేరు, ఉన్నా వాళ్లు పొడవాటి ఖాళీ రోడ్డు మీద తెల్లటి మెరుపుతీగలాగా రావడం లేదు. మామయ్యలకు మేనల్లుళ్ళూ లేరు. చనువుగా చేతిసంచీలోని బహుమతులను వెదుక్కునేవారూ లేరు. అమ్మలూ చిన్నమ్మలూ ఆయమ్మలూ అమ్మమ్మలూ ముచ్చట పెట్టుకుంటుంటే, వినుకుంటూ వినుకుంటూ జారుకునే నిద్రలూ లేవు.
జ్ఞాపకంలోకి నడచి వెడుతున్నప్పుడు చాలా బావుంటుంది. ఆ ఊళ్లు, ఆ మనుషులు, ఆ సంబంధాలు, ఆ ఆనందాలు అట్లా లేనందుకు దుఃఖంగా ఉంటుంది. కానీ, ఏమో, మనకు తెలియని కొత్తబాల్యాలు, కొత్త స్నేహాలు, కొత్త సంబరాలు ఈ కొత్తతరాల మధ్య మొలకెత్తుతున్నాయేమో? వారి మావయ్యలు ఎవరో మనకు తెలియదేమో? వర్తమానంతో తెగిపోయి, గతానికి వేలాడుతున్నామేమో?
ఎందుకంటే, కొందరు అదృష్టవంతులు ఇంకా మిగిలే ఉన్నారు. వారిని పలకరించడానికి పల్లెలూ ఉన్నాయి. పేగుబంధం కింద పొలమో, ఇల్లూవాకిలో ఉన్నవాళ్లున్నారు. పట్టణాలలోని వారికి ఆతిథ్యమివ్వడానికి పల్లెల్లో ఉండిపోయిన చుట్టాలు కొందరున్నారు. నగరాలవేట అవసరం లేని, అవకాశంలేని వారు ఇంకా గ్రామాల్లో మిగిలే ఉన్నారు. పాత గోడలు పలచబడి, కొత్తగోడలు మొలిచిన జనావాసాలలో ఇంకా తడియారని గుండెలున్నాయి. పండక్కీ పబ్బానికీ కలుసుకునే ప్రేమలున్నాయి. గుడులోగోపురాలో జాతరలో ఊరు అప్పడప్పుడు చుట్టపక్కాలతో ఉబ్బిపోతుంది. నగరాల రోడ్లు ఖాళీ అయి, గ్రామం కళకళలాడుతుంది. మట్టిగోడల గుంతరోడ్ల మధ్య ఖరీదైన కార్లు పార్క్ అవుతాయి.
నగరంలోని అనామకత్వం గ్రామంలో ప్రముఖం అవుతుంది. వలసవెళ్లిన అధికారం అప్పుడప్పుడు వెనక్కివచ్చి జూలు దులుపుకుంటుంది. ఓటు మొలిచే చోటును పాడుబెట్టకూడదని పెద్దలు వస్తూనే ఉంటారు. మిగిలిన భూములు అమ్ముకోవడానికి వచ్చినోళ్లు కాకపోతే, (రచయితలు) పల్లెటూళ్ల ఫ్లాష్ బ్యాక్ కథలు ఎందుకు రాస్తారని మధురాంతకం రాజారాం ఒకప్పుడు అన్నారు. అట్లాగే, నేలను గజాల లెక్క కొలిచే పని మీద కొందరు, డబ్బు దాచే చోటు లేక ఆస్తులు కొనుక్కునేందుకు కొందరు ఊళ్లలోకి దిగబడుతూ ఉంటారు. తమను తాము పల్లె నుంచి పెకలించుకోలేని వారు మాత్రం అట్లా బొడ్రాయిలాగా మిగిలిపోతారు.
ఊరు అమాయకత్వాన్ని చాలా కోల్పోయింది.
బస్సు దిగి వీధిలో నడుస్తుంటే, ‘ఎవలింటికి పిలగా’ అని అడిగే వాళ్లు ఇంకా ఉన్నారా?
*
Add comment