రాయని కథ

మనసు మూలాలు తరచి చూసే కొత్త శీర్షిక!

శ్రీనగర్ కాలనీలో నా గది కిటికీ చాలా పాతది. చెక్క మీద పెయింట్ పెచ్చులు ఊడిపోయి, దాని బొల్ట్స్ అన్నీ నల్లగా తుప్పు పట్టిపోయి ఉండేవి. తలుపులు కూడా బిరుసెక్కిపోయి పూర్తిగా మూసుకునేవి కావు. పాత అద్దం ఓ అడ్డ గీతతో స్ట్రీట్ లైట్ వెలుతురుని రెండు ముక్కలు చేసి లోపలికి పంపేది. దాని ముందు నిలబడి చూస్తే శ్రీనగర్ కాలనీ అంతా అలాంటి rustic beauty తోనే ఉన్నట్టు ఉండేది. మన కళ్ళ ముందు కనబడే వస్తువులే మన ఆలోచనలకు texture అందిస్తాయి చాలా వరకూ. ఆ కిటికీ దగ్గరే కుర్చీ వేసుకొని నా ఒళ్ళో ఒక అమ్మాయిని కూర్చోబెట్టుకొని ఓ సరదా కధ చెప్పాను ఒకసారి. కధ ముగిసింది, ఆ రోజు ముగిసింది, ఆ అమ్మాయితో కథ కూడా ముగిసింది. కథలు టెంపరరీ, కిటికీలు మాత్రమే శాశ్వతం అన్నట్టు పగటినీ రాత్రినీ నిర్విరామం గా ప్రసారం చేస్తూనే ఉంది ఆ కిటికీ. ఈ కిటికీ కూడా నాలో ఏది కథను పుట్టించడానికి ప్రయత్నిస్తుందనిపించి దాని దృశ్యాల్లోకి వలలు విసిరాను. ఈ కిటికీకి ఏం తెలుసు? మురికి చెక్కలు, చెదల మట్టి, ఊచల్లోంచి పాకి గదిలోకి రావటానికి ప్రయత్నించే తీగలు, ఒక అందమైన అమ్మాయి, కథ రాయడానికి బద్దకించే ఒక రచయిత. వీటితోనే కొన్ని సన్నివేశాలు అల్లి ఇచ్చింది నాకు. వాటితో కథ రాయడానికి బద్దకించి అలా గాలికి వదిలేసాను. లేదా నాకు కథ రాయడం రాక ఈ సాకులు చెబుతున్నానేమో.

ఒక చాలా అందమైన అమ్మాయి ఓ పల్లెటూర్లో కొండ చివర పెంకుటిల్లు బైట కారు దిగుతుంది. చూడటానికి చాలా modern గానూ, చాలా డిగ్నిఫైడ్ గానూ డ్రెస్ చేసుకొని ఉంటుంది. ఆ పాడుబడుతున్న పెంకుటిల్లుకి సరిగ్గా సరిపోయేలా ఉన్న చింపిరి జుట్టుతో పెరట్లో పేపర్ చదువుకుంటూ ఓ యాభయ్యేళ్ళ రచయిత. పెరట్లో అన్నీ మొక్కలు, పాదులు. అందులో కొన్ని ఇంటి మీదకి ఎక్కేసి ఆ నాచు పట్టిన పెంకుల్ని పెనవేసేసుకుంటున్నాయి. ఎప్పుడో కురిసి మాయమైపోయిన వర్షాన్ని ఇంకా అవాహన చేసుకుని ఉన్నట్టు ఓ మబ్బుతనం ఉంది ఇంటిమీద. ఇదివరకూ చాలా పేరున్న పుస్తకాలు రాసేసి ఇప్పుడు మానేసిన ఈ రచయితను ఇంటర్వ్యూ చేయడానికి వస్తుందా పిల్ల. చాలా మాట్లాడుకుంటారు. రచన, కవిత్వం అంతా తొక్కలో వ్యవహారం అంటాడు. తీసి పడేస్తాడు. అసలు ఈ ఇంటర్వ్యూ దండగ అంటాడు. “ఆ పక్కన టౌన్ లో రాత్రిపూట ఎవరో హంతకుడు ఒంటరి ఆడవాళ్ళను రేప్ చేసి చంపుతున్నాడు, దాని అర్ధం ఏంటి? ఏమీ లేదు గాడిద గుడ్డు. ఏది కుదిరితే అది జరుగుతుంది విశ్వంలో. మన అందమైన పదాల అవతల అంతా నిరర్ధక వికృతమే ఉంది” అంటాడు. ఎప్పుడూ అన్నిటినీ తీసిపడేసే మనిషే కానీ ఈ అమ్మాయితో మాట్లాడేప్పుడు ఇంకాస్త అసహనం ప్రదర్శిస్తాడు. జీవితం, ప్రపంచం పట్ల ఇతని చీత్కారాన్ని కూడా చాలా deep insight లాగ తీసుకుంటుందా అమ్మాయి. అలా అని అంగీకరించదు కూడా. ఆ self sufficiency అతని ఇగో కి నచ్చదు. ఇంటర్వ్యూ అయిపోతుంది. ఆమె వెళ్ళిపోతుంది. హమ్మయ్య, ఇంటర్వ్యూ అయిపోయింది, నేను నా ఏకాంత స్వర్గంలో మళ్ళీ ఒక్కణ్ణే మిగిలిపోవచ్చు అన్నట్టు ముఖం పెట్టి ఆమెను సాగానంపుతాడు. అంతా దగ. తర్వాత ఓ రెండు రోజులు కళ్ళు మూసినా తెరిచినా ఆమె రూపమే. నిద్ర రాక సతమతమవుతాడు. ఓ వారం పోయాక వార్తాపత్రికలో ఈ పిల్ల ఆ హంతకుడి చేతిలో చనిపోయినట్టు చదువుతాడు. తన గుమ్మడి పాదుకు పురుగులు పట్టినట్టు గమనించి పురుగుల మందు తెస్తాడు. కానీ ఎందుకో స్ప్రే చేయబుద్ధి కాదు. ఆ పురుగు అలా ఆకుని తినేస్తుంటే ఆ బాధను అలానే దిగమింగుకుంటూ అక్కడే నిలబడిపోతాడు. ఆ రోజు రాత్రి ప్రశాంతంగా పడుకుంటాడు.

చెత్త కధ. అర్ధం పర్ధం లేదు. అందుకే కాబోలు కూర్చొని రాయాలి అనిపించలేదు. ఈ కధ అసలు ఎందుకు రాయాలనుకున్నాను? ఆ అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తున్నంత సేపూ ఆమె చర్మపు మెరుపునే చూస్తూ ఉన్నాడు సత్యర్థి. ఆ అమ్మాయి దగ్గర యవ్వనం ఉంది. అందం ఉంది. ఎందుకో తన దగ్గర ఇప్పుడున్నవీ, ఇదివరకున్నవీ అన్నీ వాటి ముందు దిగదుడుపు అన్న ఆలోచన అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. అభ్యంతరపరచే ఏ ఆలోచననైనా తర్కంతో నరికి పడేసే నేర్పు అతనిది. ఇక్కడ అతనికి వ్యతిరేకంగా నిలిచిన ఈ ఆలోచనకు ఏ తర్కమూ లేదు. అయినా పూర్తి నిస్సహాయుడు. ఈర్ష్య దహించేస్తుంది. ఎందుకని? నాకు తెలీదు. కధ రాయబోయే వాడిగా నాకు అది తెలియాలా? కొంపతీసి ఈ కధలో రచయితకి ప్రేరణ నేనేనా? నేనే ప్రేరణ అయితే ఆ రచయితని హీరోని చేసి, అతని cynicism ని ఒప్పుకోని ఆ అమ్మాయి బైట dog eat dog world లో నిర్దాక్షిణ్యంగా చంపబడ్డందుకు సెలెబ్రేట్ చేసుకునేవాణ్ణి కానీ అతన్ని అంత అల్పుడిగా ఎందుకు చూపిస్తాను?

మే నెలలో రూమ్ మారే హడావుడిలో మరేం పట్టించుకోలేదు. శ్రీనగర్ కాలనీ నుంచి మణికొండ మారాక ఒక రోజుకి ఉండే జనరల్ ఫీల్ లో చాలా మార్పు వచ్చింది. అక్కడి పాత బిల్డింగ్ చుట్టూ ఉండే చెట్లు, కిటికీ ఊచలకి చుట్టుకునే పాదులూ ఇక్కడ లేవు. ఇది కొంచెం నీట్ అపార్ట్మెంట్. నేను ఇంకొన్నాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటే కథ పూర్తయ్యేదేమో. ఈ ముగింపు వదిలేయాలి. మనకి ఇక్కడ సీరియల్ కిల్లర్స్ ఎందుకుంటారు? అది అతకదు. తనను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన ఓ పాతికేళ్ళ అమ్మాయిని ఆసక్తిగా చూసే ఓ యాభైయ్యేళ్ళ రచయిత. అంత వరకూ ఉంచి మిగతాది తీసేయాలి.

సౌమ్యకి ఫోన్ చేస్తే ఇప్పుడు ఆన్సర్ చేస్తుందా? కొంచెం ఇబ్బంది గానే మాట్లాడాలి.

“ఎలా ఉన్నావ్… ఏం చేస్తున్నావ్?”

సాధారణ ప్రశ్నలకు అతి సాధారణ సమాధానాలు.

“రావచ్చు కదా… ఇప్పుడు రూమ్ మారాను”

“హ్మ్మ్… వద్దు లే”

“Yeah, you are right. మళ్ళీ మొదటికొస్తుంది కథ. సరే, ఉంటా. కలుద్దాం ఎప్పుడైనా సరదాగా”

ఈ కధలో అమ్మాయి సౌమ్య నుంచి వచ్చిందా? సౌమ్య అంత తెలివైన అమ్మాయేమీ కాదే. బహుశా ఆమె అంత తెలివైనదైతే బావుండని నేను ఊహించుకొని ఇలా ఆమెను సృష్టించి ఉంటాను. నేను ఆ రచయిత అంత జీనియస్ ని అయ్యుంటే బావుండేదని అనుకొని అతన్ని అలా సృష్టించి ఉంటాను.

శిధిలాల మధ్య నిలబడ్డ ఓ స్థిరమైన మనిషి, తన చుట్టూతా chaos ని పట్టించుకోకుండా నిలబడి ఉండే ఇమేజ్ ఇప్పటి నుండో అలా ఉండిపోయింది మైండ్ లో. అలాంటి హీరో కధ చెప్పాలి అనుకున్నాను. అందుకే ఈ బుర్ర ఎక్కువ రచయితను సృష్టించి ఉంటాను. కానీ ఇతనేం స్థిరమైన మనిషి? ఇతనేం హీరో? ఒక్క ఆడపిల్ల అందానికే గిలగిలా తన్నుకున్నాడు. బహుశా ఆ ఇమేజ్ కి పడుతున్న చెద కాబోలు ఈ కధ. ముందు అనుకున్నప్పుడు ఆమెకు అతను ఇచ్చే సమాధానాలు అన్నీ నా జీవిత సత్యాలు. ఇప్పుడు అవి కేవలం ఆమె చురుకైన ప్రశ్నల్ని డిస్మిస్ చేయడానికి అతను నేర్పుగా వాడుతున్న డొల్ల ఆయుధాలు. ఈ కథ ద్వారా ఏం కావాలి నాకు? ఏమో తెలీదు. కథ పూర్తిగా రాస్తే తెలుస్తుంది కాబోలు. ఆమ్మో.. అది తెలియడం కూడా అంత మంచిది కాదు.

ఈ కొత్త రూమ్ లో వర్షం కూడా దూరంగా పడుతోంది. అంటే వర్షం పడుతున్న భావన ఏ మాత్రం కలగడం లేదు. కిటికీ కేవలం ఇన్ఫర్మేషన్ ని మాత్రమే ఇస్తుంది. ఏకాంతం మరింత చిక్కగా కమ్ముకుంటుంది. కధలో ఆమె అలా చనిపోవాల్సిన అవసరం ఉందా? ఆ గుమ్మడి పాడు మీద గొంగళి పురుగును అతనెందుకు చంపలేదు. అందమైన వాటిని పాడు చేయడానికి విశ్వం దాని పని అది చేస్తూనే ఉందని, గుండె తీసుకోలేనంత అందం కూడా ఛిద్రం చేయబడే, నలగగొట్టబడే, ముడతలు పడే, పురుగులు పట్టే సమయం వస్తుందని ఓ reminder అది. Reminder కాదు, ఓ assurance. అలాంటి assurance ని ఎందుకు తుడిచేస్తాడు?

ఇంత చిన్న మనిషా ఈ మేధావి? ఈ చిన్నతనాన్ని పోరాడటానికే కదా అంత sophistication ని బలంగా కట్టుకున్నాడు చుట్టూ. ఆమె చనిపోయినందుకు బాధ లేదా? ఉందిగా. అంటే మంచోడేనా? ఆ ప్రశ్నకు ఇక్కడ స్థానం లేదు. ఆ గొంగళి పురుగు లాగే అతనూ. దాని వీపు మీద అందమైన పచ్చటి చారలు, బ్రౌన్ రంగు చుక్కలు ఉన్నాయి. అతని బట్టతల మీద ఎండ మెరుస్తుంది.

ఆ రచయితకు మూలం నేనేనేమో అన్న ఆలోచన మాత్రం బాగా ఇబ్బంది పెడుతోంది. నేను కాదులే. ఆ ఇద్దరూ మేమిద్దరమే అనుకుంటే ఆ అమ్మాయిని కనీసం తాకనైనా తాకకుండా నిశ్శబ్ద నరకం అనుభవించే వాడిగా ఎందుకు రాస్తాను? సౌమ్య, నేను రెండు తాచుపాముల్లాగ మంచం మీద కిందా మీదా కొట్లాడినవాళ్ళమే కదా. ఇప్పుడనిపిస్తోంది, ఈ కథ నా మెదడు ఎదో therapeutic పధకం పన్ని రాయడం లేదని. ఏవో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు బుర్రలో అటూ ఇటూ తిరిగినంత మాత్రాన దాని వెనక ఓ జగన్నాటకం ఉందని ఊహించుకోవడం హాస్యాస్పదం. మనసులో ప్రశ్నల్ని మెల్లగా అరల్లో సర్దుకోడానికి ఓ కథ రాస్తే మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరికేస్తాయా? మనసు అంచుల్లో చదును చేయబడని ఎన్నో ముళ్లతుప్పల కోరుకు బండల నేలలు ఉంటాయి. వాటి మీదుగా వీచే వేసవి గాడ్పుల్ని అక్షరాలు కాల్చడానికి వాడి ఏం సాధించాలి? ఈ తొక్కలో కథ నేనేం రాయను. ఇంతగా ప్రశ్నించుకుని నా గురించి నేను చాలా చాలా తెలిసేసుకుని ఏం సాధించాలి? కథ రాస్తున్నప్పుడు సౌమ్య నా పక్కన ఉంది కాబట్టి ఆ అమ్మాయి సస్థానంలో ఆమెనే ఊహించుకున్నాను. అంతే. ఇప్పుడు ఆ visual ని పట్టుకు వేలాడి ఏం సాధించాలి? ఆమె అడిగిన ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేకే కదా టాటా చెప్పి పంపేసాను? Wait a minute… అంటే ఈ కధలో… No.. I am not analyzing that crap anymore.

*

 

స్వరూప్ తోటాడ

1 comment

Leave a Reply to రవికిరన్ తిమ్మిరెడ్డి Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • తెలుగు కాఫ్కానా? బాగుంది katha.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు