రాణి -రాణ్యము!

ఆగష్ట్ నెల పదిహేడవ తేదీన భార్గవి గారి పుట్టిన రోజు

నేకానేక తెలుగు  నవలలు , కథలు, సినిమాలు  కలిసి  లేడీ డాక్టర్ అనగగానే కలిగే మన  ఊహకు ఒక పటం కట్టాయి.     తెల్ల కోటు ధరించిన సన్నని , నాజూకైనా  బాపు బొమ్మ ఒకటి విలాసంగా స్టెతస్కోప్ ని కుడి చేత్తో తిప్పుకుంటూ, ఎడమ చేతికి ధరించి ఉన్న బంగారుపూత  గడియారంలోని  నిలయంలో సమయం చూసుకుంటూ స్టెయిర్ కేస్ దిగి నడుస్తూ   . తన కన్సల్టింగ్ రూము బయట వేచి ఉన్న రోగులని  నుండి హూందాగా అభినందనలను అందుకుంటూ “ఇపుడు ఎలా ఉంది రంగమ్మా” అని అప్యాయంగా పలకరించి , ఖళ్ళున ఖళ్ళున దగ్గుతున్న రాజయ్య ని ” ఎన్ని సార్లు చెప్పినా ఆ వెధవ చుట్ట మానవు కదా! ఇలా అయితే నువ్విక వైద్యానికి నాదగ్గరికి రావద్దు పెద్దయ్యా ” అని కోపం నటిస్తూ , అరగంట నుండి తన రాక కోసం ఎదురు చూస్తున్న  ఆబాల గోపాల సకల జనులకు తగు మాత్రా స్థాయిలో   పలకరిస్తూ , ప్రేమిస్తూ,యోగ క్షేమాలు విచారిస్తూ…. నాలుగైదు ఆరుగంటల సమయాన్ని  చలాగ్గా  చిటిక వేసినంతన్నట్టుగా,  ముంగురు కూడా కదలకుండా   వేయి నొక్క వైద్యాలు  ముగించేసి తదుపరి ఆలిండియా రేడియోలోని  సుశీల గొంతు అరువేసుకుని  ’”ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది” అని పాట పాడుతూ వెనక్కి  మరలీ స్టెయిర్ కేస్ మీదుగా మేడమీదికి వెళ్ళి  పోయి మళ్ళీ సాయంత్రం కాగానే షరా మామూలుగా చెంగు చెంగున  మెట్లూ, గెంతులూ అవీ  దిగి రావడం. అలా చూసీ చూసీ సృష్టిలో కెల్లా హాయైనది  డాక్టరు గారి జీవితమేనోయ్ అని అపార్థం చేసుకునే  నా బ్రతుకు బస్టాండ్ లోకి ఒకరోజు  పామర్రు ఆనే  బస్సు  వచ్చి ఆగింది.

గఫార్ సెంటర్ నడిబొడ్డున ఉన్న అది అవడానికి  రెండంతస్తులు భవనం కావచ్చు, ఇన్ని పడకల ఆసుపత్రి అని దానికి  పేరు ఉండవచ్చు,    పామర్రు గ్రామ ప్రజలకు  ఆరోగ్యం కలిగించే వైద్యాలయం కావచ్చును. నిజానికి అది ఒక రాణ్యము. రాజ్యాలు మాత్రమే ఉండే ఈ  లోకంలో అత్యంత అరుదైన  , అంత సులువుగా  ఏర్పడలేని ప్రపంచంలో   ఒక స్త్రీ  సాధించిన రాణ్యమది. దారెంట తలదించుకుని  పోయే ఎవరో  దానయ్య మనిషి  మెడలో రాజుగారి  ఏనుగు రాల్చిన పట్టపు దండ పెట్టిన భిక్ష కాదు ఈ రాణ్యము, అలా ఆయాచితంగా సాధించినది కాదు ఈ రాణిత్వము. పుట్టి బుద్దెరిగిన నాటినుండి అనేక మదపుటేనుగుల  జారినుండి తప్పించుని వాటి దంతాలు వంచి. వీలైతే వాటిని  విరగదీసి మరీ సాగిస్తున్నదీ ఆ అమ్మ  ఈ రాణ్యమును.

చాలా మందికి రకరకాల  విధాలుగా తెలిసిన  ఈ మనిషిని మీరు విఏకే రంగారావు గారి “ఆలాపన” పబ్లిషర్ అనుకోవచ్చు,  టాగోర్  గీతాంజలి అనువాదకురాలు అని కూడా పిలుచుకోవచ్చు, సంగీతాన్ని శ్వాసగా ధరించి అటూ ఇటూ పాటలు వెదజల్లే  పొడుగు ముక్కు తెల్ల కోకిలలా వినవచ్చు,  పుస్తకాల వరుసల  మధ్య కూర్చుని  తలవంచుకుని కళ్ళద్దాల నుంచి తొంగి చూస్తూ అక్షరాలను, వాక్యాలను, పేరాలు పేరాలుగా, పేజీలుగా, గ్రంధాలుగా  నమిలేసే పుస్తకాల పురుగుగా కూడా తలచవచ్చు. తను  కొందరికి స్త్రీ వ్యాధి నిపుణురాలు, మరెంతోమందికి ఒక ఫోన్  కాల్ దూరంలో పలికే సాహితీ, శారీరక సమస్యల  సలహాదారు, అడగ్గానే ఇలా పాటలు పాడేసే సంగీత లక్ష్మీ, ఇంకొంత మంది దృష్టిలో  వడ్డించిన విస్తరి  అనే జీవితం లో వెండి కంచం పెట్టుకుని బంగారు స్పూన్, పోర్క్ పట్టుకుని భోజనం చేసే అదృష్టవంతురాలు. మీ సంగతి ఏమో, నేనయితే కనీసం ఆమెను అంతే అనుకునేవాడిని.

కాసింత కాసింతగా ఆవిడని దగ్గరగా చేరి  చూసిచూసీ తెలుసుకున్నది పైన చెప్పుకున్నదేదీ కాదూ, ఈవిడ ఏ మహారాణినో, మలికా బేగం సాహెబానో   కాదు కదా!  ఒక్కోసారీ మామూలు దాసి పని చేసుకునే ఒక యమ్మ తన  అలుపు లో తీర్చుకునేంత కూడా సౌఖ్యం ఇంచుక కూడా  దొరికించుకో లేని దీనురాలు కదా ఈ అభాగ్యురాలు   అనిపించేది.

డాక్టర్ అని హోదా తెచ్చుకున్నా, పరమ గొడ్డు చాకిరీ మా అమ్మది.  తన రోజులో   ఒక్క పూట భోజనం కూడా ఎవరో ఒక అవసరార్థ పేషంట్ చేసే   ఫోన్ కాల్  అంతరాయం లేకుండా తినింది లేదు. ఒక్క రాతిరి  నిదురకూడా, ఇదిగో  ప్రాణం మీదికి వచ్చిందంటూ ఒకటో , రెండో  మూడో ఫోన్లు  వచ్చి నిద్రాభంగం  చేయకుండా తన  కన్ను మీదికి నల్లని రాతిరి ఇంత నిద్ర  మత్తుని చల్లిందీ లేదూ. మా అమ్మ  అందమైన పూల  కళ్ల చుట్టూ ఈరోజు  ప్రిస్కిప్షన్ రాతల మాదిరి చేరినవన్నీ ఆ బాధాతప్త రోగులు సంతకాలుగా  చేరిన నిద్రాభంగాలే . ఊరికే వైద్యమూ- చికిత్సా అని మాత్రమే   అనుకుని  జీవితాన్ని నడుచుకుని అలా ఉండి నిలుపుకున్నది కాదు నా తల్లి రాణ్యము. ఆమె తన  రాణ్యానికి రాణిమాత్రమే కాదూ. మంత్రీ. సేనాధిపతి, కావలి భటురాలు, చివరాఖరన ఎంత కనా కష్టపు  చిట్టచివరి స్థానపు చాకిరి అనేది ఒకటి ఉంటుందే , అది  కూడా ఆవిడదే.

అమ్మ చదువుకున్నది ఎంబీబీయస్ మాత్రమే , అందులోనూ ఎనస్తీషియా స్పెషలైజేషన్ . ఎంబీబీయస్   చదివిన వాళ్ళకు ఆపరేషన్లు అవీ పెద్దగా నేర్పించరట.  అమ్మకేమో  ఇంకా పెద్దగా  చదువుకోవాలని, చాలా  పెద్ద సర్జన్ కావాలని కోరిక. డబ్బు లేని అనగనగా అనే  కాలమొకటి అమ్మ కోరికని తీరనివ్వలేదు, అమ్మని చదువుకోనివ్వలేదు. నాకు వైద్య వృత్తి భాష తెలీదు . నేను చిత్రకారుడ్ని నాది బొమ్మల భాష. బొమ్మల భాషలో అమ్మవంటి వాళ్ళని  అర్జెంటినాలో  అల్బెర్టో బ్రెసియా  అంటారు, స్పెయిన్లో అయితే  కార్లోస్ గిమినేజ్ అంటారు, తెలుగు బొమ్మల్లో బాపు అంటారు. పని మీద ప్రేమతో , కాంక్షతో, శ్రద్దతో,తీవ్రమైన ఆకలితో అమ్మ సర్జరీ నేర్చుకున్నది . పట్టు బట్టి బోలెడన్ని శస్త్ర చికిత్సల్ని కత్తెరతో లోంగ దీసింది. సంగీతం సాహిత్యం అనేవి అమ్మకు అయిదో ప్రాణం అనుకుంటారు చాలామంది. అబ్బే! మీకు తెలీదు , ఆవిడకు ఉన్న ఒకే ఒక ప్రాణం వైద్యం.   మీరు ఆవిడ  అమీర్ ఖాన్, అలీ అక్బర్ ఖాన్, కీషోరి అమోంకర్, నిఖిల్ బెనర్జీ, గంగూబాయ్ హంగల్, కేశర్ బాయ్ కేర్కర్ ల గురించి అడిగితే చాలూ!  ప్రాణధార గొంతునంతా నింపుకుని   తన్మయత్వంగా చెబుతుంది అనుకుంటారు . అలా కాదు,  అమ్మ వైద్యాల గురించి . చాలెంజింగ్ సర్జరీల గురించి, చికిత్సా పద్దతుల గురించి ఒకసారి ఆవిడని అడిగి చూడండి. ఇక నాయనమ్మలు చేప్పే కథలు కూడా ఈ అమ్మ చుట్టూ చేరి “ఊ”లు కొడుతూ ఆవిడ చెప్పే కబుర్లు వినాలి. అమ్మ ఆసక్తి . ఆశక్తి  చాలా భాగం వైద్యమే.

అలా ఆ విధంగా జ్వరాలు, జలుబులు, వాంతులూ, విరోచనాలు, కాన్పులూ, గర్భాలు, స్కానింగులు, అపరేషన్లు, గట్రా గట్రా  చేసేసి, గబగబా మందులు రాసేసి  హమ్మయ్యానయ్యా.  అని  అనుకుంటే మాత్రమే  ఆరోజుకు ముగుస్తున్నది కాదు తన  జీవితం. ప్రతి రోజూ తను  ఏ ఏ వైద్యాలు చేస్తున్నదో వాటి తాలూకు వివరాలు, విపరీతాలు అన్నిటినీ తూచా తప్పకుండా రికార్డ్ చేసి ఆ రికార్డును  ఘనత వహించిన  గవుర్నమెంటు వారి పంచాయితీ సముఖానికి ఒక రిపోర్ట్, మరియూ  డిస్టిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసులుం గారికి  మరో  కాపీ క్రమం తప్పకుండా హాజరు వ్రాసే వంటి అనేక దినసరి వృత్తి  సమచారాన్ని  పేజీల నిండా నింపే   మా అమ్మ తిలక్ వ్రాయని కవితలో    అయినాపురం కోటేశ్వరరావు అనే ఆడక్లర్కు కూడా. ఒక  క్లర్కు గారి జీవితంలో డాక్టర్ గా  వైద్యం చేసే బాధ్యతలు నిర్వహించవలసిన అవసరం లేదు కానీ  ఈ  డాక్టర్ గారు  మాత్రం క్లర్క్ గారి కుర్చీలో కూచుని ఆ ఈ రోగుల  చిట్టా పద్దుల  ఆవర్జాని అను నిత్యం ప్రభుత్వానికి అప్పగించాల్సిందే. ఆ విధంగా మా అమ్మది కనాకష్ట దమ్మిడీ గిట్టుబాటులేని   గుమాస్తా  బ్రతుకు కూడా.

“తల్లీ!  నీ దయవలన నా  బిడ్డ, దాని కడుపులోని బిడ్డా  బ్రతికి నిలబడింది , నువ్వు చల్లగా ఉండాలి  మాయమ్మ”  అని దీవించిన  ఒక తల్లి  దీవన తాలూకు పరిమళం గాలిలో ఆవిరి కాక ముందే , మరో మనిషి వచ్చి ఎదురుగా నిలబడతాడు. ” మా మరదలుని మీ క్లినిక్ లో చేర్పించినాను మేడమ్, కొంచెం జాగ్రతగా చూసుకోండి. మొన్న వుయ్యూరు లో  ఒక ఆస్పత్రిలో పెద్ద గొడవ జరిగి ఆ డాక్టర్ కాలు విరగొట్టిన సంగతి మీకు తెలిసే ఉంటుంది, అది మా వాళ్ళ పనే, మీరు జాగ్రత్త మనిషే అనుకోండి అయినా మా జాగ్రత్త కూడా మీకు చెప్పాలిగా ” అని ఒక వంకర నవ్విన మనిషి మొహాన్ని గుర్తు పెట్టుకుని వారి తాలూకు రోగికి  ఏమని వైద్యం చేసేది, ఎలా చేసేది?  వంకర నవ్వు నవ్వే మామూలు మనిషులే కాదు. పెద్ద పెద్ద ఆసుపత్రుల  నిండా ఏమేమీసౌకర్యాలు ఉన్నాయో అవే ఇక్కడా కల్పించి పెట్టాలని గొంతెమ్మ డిమాండ్ లు చేసి మా అమ్మ వంటి వారం రోజులకు  కేవలం రెండు వందల రూపాయల కన్సల్టేషన్ తీసుకునే చిన్న డాక్టరమ్మను కూడా  ఎర్రగా బెదిరించే ప్రభుత్వాల జడుపు కూడా ఆవిడకు పుష్కలంగా ఉంది. అన్నిటికే అమ్మ దగ్గర ఉన్నది ఒకటే మంత్రం  అది సహనం-శాంతి.(శాంతి అంటే మా అమ్మా క్లోజెస్ట్ దొస్తానా, అదంతా ఇంకో కథ)

ఇంతా చూసిచూసీ, వినివినీ  ఏమిటమ్మా ఇదంతా అనంటే, ఇది కాకపోతే మరొకటి  అని – ఆసుపత్రి రిసెప్షన్ హాల్, కన్సల్టింగ్ రూం , ఔట్ పేషంట్ విభాగము, ఇన్ పేషంట్ గదుల వెనుక కుళ్ళు కంపు కొట్టే కొన్ని  చీకటినెత్తుటి  కథల గురించి కూడా  చెబుతుంది. అసలే మాత్రం మామూలు జనానికి అందని కథలు అవి.  ఆ కథల్లో శరీరాల్లోకి మందుని  వాడి పాడేసిన సిరంజీల కథలుంటాయి, మెడిసన్  గుంజి ఖాళీ చేసిన బాటిళ్ల గాథలుంటాయి ,శరీరంలో మూల మూలన  పాకిన రోగాన్ని కత్తిరించి పారేసిన మాంసఖండాల, నెత్తురు మరకల, చీము జిగటల సంఘటనలు, వాటినన్నిటినీ ఒకచోట చేర్చి  నింపాల్సిన ప్రత్యేకమైన పాలిథిన్ బ్యాగులు గురించి కథలున్నాయి. కుళ్ళు కంపుకొట్టే ఆ  కశ్మలాల కు ముక్కుబద్దలయ్యే వాసన  కథలు ఉంటాయి, వాటిని సమయానికి తరలించకపోతే, ఆ తరలించాల్సిన మనుషులు రాకపోతే ఆ పైన  కళ్ళు తిరిగి పడి  పోయేంత కథలు ఉన్నాయి. ఆ నింపి పెట్టే కవరులకే కాదూ అపరేషను థియేటర్ లో వాడుకునే సర్జరీ  పరికరాలను వేడి చేయడానికి కొనే  గ్యాసుకు కూడా ఒక కథ ఉంది.  వంట గ్యాసు ధర పెరిగిందహో అని గావుకేకల వార్తలు పెట్టే వార్తా పత్రికల వార్తలకందనిది ఈ సర్జికల్ గ్యాసు కథ.. ఒకటా రెండా?  చరిత్రకు పట్టని ఇట్లాంటి  కథల గురించి నువ్వు  రాయవచ్చు కదా అమ్మా అనడగామనుకో అప్పుడే , ఆపరేషన్ థియేటర్ సీలింగ్ పై నేరలు విచ్చి పైనుండి నీళ్ళు లీక్ అవుతున్న సమస్యకు  తాపీ మేస్త్రీ హుశేన్ గారితో మాట్లాడాల్సిన అవసరం గుర్తుకు వస్తుంది. అదీకాకపోతే ఆక్సిజన్  కొరత, అదయిపోగానే జనరేటర్ పనిచేయక మొరాయించడం గురించి ఎవరో ఒక  నర్సు వచ్చి గుర్తు చేస్తారు.దానిని రిపేరికీ పంపవలసింది కూడా అమ్మే.  థర్మా మీటర్, స్కానింగ్ మిషన్, స్టెతస్కోప్, స్కల్పెల్ మాత్రమే కాదూ, మందుల అంగడి స్టాకు, నీళ్ళని ట్యాంకులోకి ఎక్కీంచలేక పోతున్న మోటార్ అసమర్థత, సమయానికి డ్యూటీకే రాని నర్సుల సంజాయిషీలు, జనరేటర్ లో నిండుకున్న  డీజలు, అమెరికాలో అబ్బాయికి పంపవలసిన ఊరగాయలు, రాత్రిళ్ళు ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును తనే అసలు ఓనరునని , తన కారుని తను తీసుకు వెళ్ళిపోతానని అంటూ గొడవ పెట్టే  ఒక పిచ్చాయన రెగ్యులర్ విజిట్స్, ఆయన రాని రోజుల్లో మేడం గారికి పర్సనల్ బాడి గార్డ్ నంటూ కత్తి పట్టుకు తిరిగే ఇంకో పిచ్చిమనిషి, ఇంకా హాస్పిటల్ బోర్డ్ పైన వెలగడానికి మొరాయించిన  ట్యూబు లైట్ల మార్పిడి , లైబ్రరీల పుస్తకాల వరసల సర్దుకోవడాలు,కొత్త పుస్తకాల పేజీ మేకప్పులు, ఉన్న పుస్తకాల చెల్లుబాటు…. ఇన్ని పనులా??  ఒక మనిషే కదా?  రెండే కదా  కళ్ళు, కాళ్ళు , చేతులు, చెవులు, ఎంత చక్కనిదయినా షార్పు సూది దయినా ఒక్క ముక్కే కదా? వీటన్నిటినీ కలుపుకుంటూ సాగే మనస్సు ఒక్కటే కదా?  అలసిపోదా, అలసటలేదా అని అడగాలనిపిస్తుంది. లేదా అనడుగుతే  ఊరికే గలగల మని నవ్వుతుంది. నవ్వు వెనకాల ఉన్న అలసటను, వేదనను, దిగాలును. ఒంటరితనాన్ని ఎవరికి పంచదు.  స్నేహాలు, ప్రేమలు, బంధుత్వాలు, మమకారాలు వట్టిమాటలని అమ్మకు తెలుసు. వాటిని ఉన్నవాటిని ఉన్నట్టుగా  గౌరవిస్తుంది అంతే!  తను ఎవరికయినా చేయగలిగినంత ఏదయినా ఉంటే చేస్తుంది. తను మాత్రం తననే నమ్ముతుంది. మిగతా వారికల్లా ఒక నవ్వవుతుంది, ఒక పాటవుతుంది, ఒక ఆసరా మాటవుతుంది.

చావలి బంగారమ్మ  గారు తన కవిత్వంలో  అంటారు కదా ” పరమేశ్వరుని గూర్చి ప్రస్తుతించుటకేను పదిజన్మ లెత్తవలెనా? లేకతని పదిలముగ జూడవలెనా? పదిలముగ జూచిన పదిజన్మ లేలను ఇది తెలియుదాకేగద జన్మమును ఇలలో తానెత్తుచుంటి”

అలాగా, ఇది ప్రస్తుతించుటమేమీ కాదూ, ఊరికే చెప్పుకోవటం.  మా అమ్మ గురించి ఏమని  చెప్పను? ఎన్ని సార్లయినా  ఏమని చెప్పగలను? కిందటి జన్మలో ఏం చెప్పానో? రాబోయే జన్మలలో ఏం చెప్పబోతానో?

పి.ఎస్: అమ్మకు ఈ ఆగష్ట్ నెల పదిహేడవ తేదీన పుట్టిన రోజు. ఎన్నో పుట్టిన రోజని ఆడుగుతున్నారా? పదిహేడవ పుట్టిన రోజు. ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం ఆగష్ట్ పదిహేడున ఆవిడకు పదిహేడేళ్ళు నిండుతాయి. ఏమిటలా అనా మీ ప్రశ్న? దానికీ ఒక కథ ఉందిగా. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక జన్మలో  చెబుతాగా.

ఇట్లు

ఒక అన్వర్. సన్ ఆఫ్ ఒకే ఒక భార్గవి.

 

అన్వర్

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Anwar ఎంత బాగా వ్రాసారు భార్గవి గారి గురించి. మీ వంటి బిడ్డ ఉన్న ఆమె, ఆమె వంటి అమ్మను కన్నా మీరు కూడా అదృష్టవంతులు.

  • భావాన్ని నిండుగా ఆస్వాదిస్తూ వినిపించే పాటగా, వీ.ఏ.కే. గారితో ఆలాపన చేయించిన సంగీత సాహిత్య పిపాసి గానే తెలిసిన రొంపిచర్ల భార్గవి గారి వ్యక్తిత్వాన్ని ఎంత గొప్పగా ఆవిష్కరించారు అన్వర్ గారూ.. హాపీ బర్త్ డే డాక్టరమ్మా!

  • అన్వర్, బొమ్మ గీసినట్లు భార్గవిగారి బొమ్మను మనసును ఆహ్లాదపరిచె రంగులతొ అందంగా, నిలువెత్తుగా , బాహ్యసౌందర్యాన్నేకాదు, అంతఃసౌందర్యాన్ని నీలి నీలి ఇకాశంలా చిత్రించేశారు. FB లొ భార్గవిగారి పోస్ట్ లను క్రమంగా చదివే ఆమె అభిమానురాలిని అంతే నేను. ఆమె గురించి ఇదే చిత్రమె. వారు రాసే పోస్టు లు, వైద్యం గురించి కావచ్చు, సంగీతం గురించి,రాగాల గురించి ఏది తీసుకున్న చాలా లోతైన జ్ఞానం బింబించేది. మీ పోస్టు తొ మరీ స్పష్టమైన రూపం! నేటి సమాజంలో అపురూపమైన వారు మీరు.ఎందరికో జీవంపోసే మీరు ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నూరేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుతూ.పుట్టినలరోజు శుభాకాంక్షలు.

  • వావ్ ,సార్థక జన్మురాలు భార్గవి .నిజమే ,ఈ కోణంనుండి ఎప్పుడూ ఆలోచించలేదు .అంత relaxed గా ఎలా కనిపిస్తారో ఎల్ల వేళలా !

  • ఇంత గొప్పగా అక్షరం అక్షరాల్ని ప్రేమని నింపి రాయగల దైవమిచ్చిన పుత్రుడు అన్వర్ కాక మరెవరు? హృదయాన్ని నింపుకొని జీవితాంతం ఆహారం లేకపోయినా బతికేయొచ్చు.మంచితల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.మామంచి కొడుకు అన్వరఫీకి అభినందనలు

  • అన్వర్ థాంక్యూ .జీవితంలో ఇలాంటి కష్టాలు పడే నాలాంటి డాక్టరమ్మలు చాలామంది వుంటారు అయితే వారికి అన్వర్ లాంటి ప్రేమించే కొడుకు వుండే అదృష్టం ,అవకాశం వుంటాయని అనుకోను.అదే నా గర్వకారణం.నువ్వు రాసిందంతా చదివాక నా పుట్టిన రోజుని జాతీయ పండుగ దినంగా ప్రకటిస్తారేమోనని భయంగా వుంది సుమా!జీతే రహో
    .

  • అన్వర్ థాంక్యూ .జీవితంలో ఇలాంటి కష్టాలు పడే నాలాంటి డాక్టరమ్మలు చాలామంది వుంటారు అయితే వారికి అన్వర్ లాంటి ప్రేమించే కొడుకు వుండే అదృష్టం ,అవకాశం వుంటాయని అనుకోను.అదే నా గర్వకారణం.నువ్వు రాసిందంతా చదివాక నా పుట్టిన రోజుని జాతీయ పండుగ దినంగా ప్రకటిస్తారేమోనని భయంగా వుంది సుమా!జీతే రహో
    .

  • ఒక భార్గవి గురించి ఆమె వరపుత్రుడు ( వర్ అనాలో, అన్ వర్ అనాలో తెలీడం లేదు) గీసిన పోర్ట్రైట్ అద్భుతంగా ఉంది!

    ఏ పిల్లవాడికైనా వాళ్లమ్మ అతిలోక సుందరే. ఇతను గీసిన చిత్రం చూస్తే ఆ అలౌకిక సౌందర్యం చూసేవాళ్లంతా అవాక్కయేలా సుస్పష్టమవడమే విచిత్రం!

    ఒకే ఒక అన్వర్ మాత్రమే ఒకే ఒక భార్గవి గురించి ఇలా రా/గీయగలడంటే ఒప్పుకోక తప్పదు మరి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు