రాచకొండ అండాదండా….

మదిర స్మృతులు-2 (శ్రీ రావి శాస్త్రి జయంతి జూలై 30)

విశాఖపట్నం కాలేజీ చదువుకి వెళ్లాను. అప్పుడు నాకింకా చిన్నతనం. తెల్లనివన్నీ విస్కీలనీ, నల్లనివి కూడా విస్కీలనీ నమ్మే అమాయకత్వం నాది. అమ్మాయిల అధరాలు, పయోధరాలు చూడ్డం తప్ప తెలియని కుచాగ్రబుద్ధిని. వారి జఘన సౌందర్యమే సర్వం అనుకునే అభం శుభం తెలియని పిరుదాంకితుణ్ని.

ఆయన్ని చూడక ముందు రాచకొండ విశ్వనాథశాస్త్రి గారంటే బిళ్ల గోచీ పంచె కట్టుకుని, మెళ్లో రుద్రాక్షలు వేసుకుని, నుదుట నామాలు పెట్టుకుని, ముక్కు పొడుం పీలుస్తూ బాగా శోత్రీకంగా వుంటారనుకునేవాణ్ని. కానీ చూసేక ఆయన అలా లేరు. ట్రౌజర్లో ఫుల్ హాండ్స్ షర్ట్ టక్ చేసుకుని హాలీవుడ్ హీరోలా వున్నారు. మాటలో యెక్కడా చాదస్తం లేదు. విశాఖ యాసలో తెలుగు విలాసంగా మాట్లాడుతున్నారు. ఆ టైములో యిండియాకి చైనాకి యుద్ధం జరిగింది. ఇండియా వోడిపోయింది. అప్పుడు శాస్త్రి గారు వారి మిత్రుడు సరసభాషి అయిన సంకు పాపారావు గారన్నది చెప్పారు- ‘అసలు మనోల్లకి యుద్దాలేటండీ- యుద్దాలంటే మనోల్లు గజబలము, గుర్రబ్బలము, కాలి బలము యేసుకు బయల్దేరతారు. వార్ పీల్డులోకి యెంటరవగానే పురుపురోమని యిజయ బాకా పూరిత్తారు. దాంతో గజబలం బెదిరి పోయి మన కాలి బలాన్నే మట్సేస్తది. సివరికి యుద్దము ఆపి వేయ బడును. దేశము అమ్మి వేయ బడును. మనాల్లకి యుద్దాలేటండీ-’ అని.

శాస్త్రి గారి పరిచయం తర్వాత నాకు చుట్టూ వున్న సమాజం గురించి తెలియ సాగింది. అన్యాయాలకు బలై పోయే పేద ప్రజల గురించి, అక్రమాలతో యెదిగే యెందరో శ్రీమంతుల గురించి యెన్నో వివరాలు బోధ పడ్డాయి. పద్యాల్లో శార్దూలాలూ. మత్తేభాలూ వున్నట్టే మనుషుల్లో గోముఖ వ్యాఘ్రాలు కూడా వుంటారని శాస్త్రి గారు చెప్పేవారు.

అప్పట్లో విశాఖ రచయితల సంఘం – ‘విరసం’ లో గొప్ప రచయితలు యెంతో మంది వుండే వారు. ప్రతి నెలా సమావేశాలు జరిగేవి. ఒక సారి భీమిలిలో, ఒక సారి అనకాపల్లి లైబ్రరీలో, మరో సారి లాసెన్స్ బేలో పిక్నిక్స్ లా గడిచేవి. అందరికీ చుక్కానిలా వుండి ప్రతీ సమావేశంలోనూ అంతా పాలు పంచుకునేలా వుత్తేజ పూరితమైన టాపిక్స్ యిస్తూ రచయితల మెదళ్లకు పదును పెట్టేవారు.

ఒక సారి అందరికీ – నేనుందుకు రాస్తున్నాను- అనే టాపిక్ యిచ్చారు. అంతా రాసుకొచ్చి చదివారు. రచయితల మేధాశక్తిని పెంచడానికి ఆ వ్యాసాలు యీ నాటికీ వుపయోగిస్తాయంటే అతిశయోక్తి కాదు.

తన వ్యాసంలో రాచకొండ వారు – రచనాశక్తి లేక కల్పనాశక్తి ప్రతి మానవుడిలోనూ వుంటుందని నేను తలుస్తున్నాను. అది రకరకాల రూపాల్లో బైట పడవచ్చు. ఆ శక్తే కాని మానవుడికి లేక పోయినట్టయితే ఈ సంఘం, ఈ నాగరికత, ఈ పురోగమనం ఏదీ వుండదనీ, మనకీ పశువులకీ మధ్య తేడా వుండక పోననీ నేను అనుకుంటాను. ఊహా, కల్పనా ఉండ బట్టి మానవుడు అంకెలు, అక్షరాలు, ఇళ్లు, మేడలు, మరలు, మందలు, దీపాలు, పంకాలు, పాటలు, పుస్తకాలు, దయ్యాలు, దేవతలు అన్నింటినీ కనిపెట్ట గలిగేడని నేను భావిస్తాను.

రచయిత ప్రతి వాడూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించ వలిసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికి హానీ, చెడ్డకు సహాయం చెయ్యకూడని నేను భావిస్తాను – అని చెప్పేరు. ఇంకా చాలా విషయాలు చాలా సూటిగా ఘాటుగా రచయితకు వుపకార యత్నంగా చెప్పారు.

శాస్త్రి గారి గురించి కొంచెం రాయడం కష్టం. ఆయన కొంచెం రాసినా అది అందరూ దాచుకునే యిష్టం.

కథకు, నవలకూ తేడా ఏంటి సార్ అని నేనొకసారి అడిగితే – ‘కొంత వరకు రాసి ఆపేస్తే కథ, అలా రాసుకుంటూ పోతే నవల’ అని అతి సూక్ష్మంగా ఆలోచనా భిక్ష పెట్టారు.

వైజాగ్ వదిలేశాక ఆయన్ని చాలా మిస్ అయ్యాను. ఒక సారి హాలిడేకి యిండియా వెళ్లినప్పుడు కలిశాను. మిత్రులందరి యోగక్షేమాలు మాట్లాడుకున్నాం. ‘విరసం సెక్రటరీ యిప్పుడు కూడా శ్రీ యం.జి.కె.మూర్తి గారేనా లేక విరమించారా?’ అని అడిగితే – ‘లేదు. విరమించలేదు. అయనే ఇంకా రమిస్తున్నారు’ అని బదులు చెప్పారు.

గొప్ప రచయితలంతా బాగా రాస్తారు. తను బాగా రాసి, యెంతో మంది చేత బాగా రాయించి గొప్ప రచయితల్ని చేసిన స్ఫూర్తి దాత శ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రి. ఆయన్ని మిస్సయితే కన్నీళ్లు కారవా మరి.

*

డాక్టర్. కె. వివేకానందమూర్తి

14 comments

Leave a Reply to Dr Vivek Kadiyala Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రచయిత ప్రతి వాడూ తాను రాస్తున్నది ఏ మంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకి ఉపకారం చేస్తుందో అని ఆలోచించ వలిసిన అవసరం వుందని నేను తలుస్తాను. మంచికి హానీ, చెడ్డకు సహాయం చెయ్యకూడని నేను భావిస్తాను – అని చెప్పేరు.
    నిజంగా అక్షర సత్యం కదండీ.

    మీ అనుభవాలు, అప్పటి జ్ఞాపకాలు మాతో పంచుకోవడం చాలా బాగుంది sir.. 👌👌

    • Thank you Kiranvibhavari garu. It’s a pleasure to receive such nice feedback from a promising writer like you.

  • చాలా బాగుంది వ్యాసం. హాస్యం చింిదింది. రాచకొండ వారు మంచి హాస్య ప్రియులు అని తెలుసు. ఆయనని తలుచుకుంటూ రాసిన మీ వ్యాసం అంతే బాగుంది.

  • రా. వి. శాస్త్రి గారి గురించి బాగా, చక్కగా, వివరంగా చెప్పారు.
    నాకు మంచి మిత్రులుగా పరిచయం, మూన్నాళ్ళ ముచ్చటగా గడిచి పోయింది. మళ్ళీ కలవడం కుదరలేదు.
    కలుస్తా పై లోకంలో తప్పకుండా

      • ఎందరో రచయితలు ప్రభావితం చేస్తారు.ఆ ప్రభావం రచనా ప్రయోజనంలోనూ,శైలిలోనూ,అభిప్రాయాలలోనూ ఎలా అక్షరీకరించబడుతుంది అన్నదాన్ని మీరు హాస్యశైలిలో స్పష్టం చేయడం సమకాలీన రచయితలకు రచనల నుండి,రచయితల నుండి ఏ అంశాలను స్వీకరించాలో తెలుసుకునేలా చేస్తుంది.రచయిత అనుభవంలో రచనలకు మించిన అంశాలే ఉంటాయి.చాలా చక్కగా రాసారు వివేకానందమూర్తిగారు.గంభీర విషయాలను సైతం మీ హాస్యంతో .
        పాఠకులకు ఆహ్లాదం కలిగించేలా రాయడం మీ విభిన్నత.ఇదే శైలి ‘సినీ భేతాళకథల్లో’ కూడా ప్రస్ఫటమవుతుంది.

      • Thank you Rachana Srungavarapu garu. It’s really nice to hear such nice words from an experienced Editor like you madam.

      • Thank you Rachana Srungavarapu garu. It’s an encouraging response from an experienced Editor like you madam.

  • నీ సున్నిత హాస్య ధోరణిలో శాస్త్రి గారి గురించి రాసిన మాటలన్నీ మనసుకి ఆహ్లాదాన్ని కలిగించాయి. మళ్లీ మళ్లీ చదివాను.గొప్పగా వుంది బ్రదర్.ఇంకా ఇంకా ఎన్నో టాపిక్ లని పికప్ చేసుకుని నిత్యమూ రాస్తూ వుంటే నాలాంటి నీ ఫాన్స్ అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించిన వాడి వవుతావు.వాడి తగ్గని నీ నిబ్బుకి అబ్బురపడుతూ…దివాకర్.

    • Thank you Diwakar for your encouraging message. Hope you are active as always and you have a great pen too.

  • మా వంటి పిల్లలకి జ్ఞాన బోధవంటి రచన గురువుగారు మీ వ్యాసం. నిజంగా శాస్త్రిగారు అన్నట్టుగా “రాస్తున్నది ఏ మంచికి హానీ చేస్తుందో ఏ చెడుకు ఉపకారం చేస్తుందో” ఆలోచించుకోవాలి. అందునా ఈ కాలంలో కవిత్వం కూడా వ్యాపార వస్తువుగా మారిపోయింది. అందరమూ శాస్త్రిగారి వంటి వారిలో మునిగి శుద్ది కావలసిన అవసరం ఉంది…..
    ధన్యవాదాలు మీకు…🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు