రాగో అడిగేవుంటుంది, “చివరికి మీరేమవుతారని”

రాజ్యం ఆమెను చంపి ఏదో సాదించానని ఆనందపడటానికి ఇప్పుడు రాగో నామవాచకం కాదు, సర్వనామం. పంజరాలను పగలగొట్టిన చిలుకమ్మల సైన్యం. రాగోల రాజ్యం కోసం సాగుతున్న దండకారణ్య రణం.

రాగో. ఆమె ఒక అడవి బిడ్డ. దాదాపు ఇరవై ఎనిమిది ఏండ్ల క్రితం విప్లవ రయియిత సాధన రాసిన నవల (“రాగో”)లోవీరవనితగా తెలుగు సాహిత్య ప్రపంచంలోకి వచ్చింది. ప్రజా ఉద్యమాలలో ఎందరికో స్ఫూర్తినిచ్చింది. విముక్తి మార్గాన్ని చూపింది. అదే క్రమంలో కొందరు మేధావుల మెదళ్ళలో “కొత్త” ప్రశ్నలు మొలకెత్తిచ్చింది. సమాజ పరివర్తనకు, మానవ వ్రవృత్తికి ఉండే చారిత్రక సంబంధాల విషయంలో గందరగోళపడి “రాగో ఎమవుతుంది?” అని ప్రశ్నించిన మేధావులకు రాగో ఎర్ర సైన్యమై విస్తరిస్తుంది, సాంఘిక కట్టుబాట్ల “చీకటి దారి నుండి తప్పుకోని తనకు నచ్చినట్లు చేతనయినట్లు” విప్లవకారినిగా బతుకుతుంది, తాను విముక్తి కావడమే కాదు తనలాంటి అభాగ్యులందరిని విముక్తి చేసే పనిలో భాగమవుతుందని సమాధానం చెప్పింది. ఆ పట్టుదలతోనే రాగో తాను నమ్మిన విప్లవ మార్గంలోనె నడిచింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఎందరో రాగోలను తయారుచేసింది. 1988 నుండి (మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం) రాగో తన విప్లవ పథంలో జైని అయ్యింది, సృజనక్క అయ్యింది, చిన్నక్క అయ్యింది.  చివరికి రాజ్యం “సమాధాన్” పేరుతో కొనసాగిస్తున్న హత్యాకాండలో (గడ్చిరోలి జిల్లాలో మే 2, 2020న) అమరురాలై వేగుచుక్కయ్యింది.

అసలు ఎవరీ రాగో?

ఆమె మాడియా గోండి తెగకు చెందిన ఒక ఆదివాసి మహిళ. “రాగో” అంటే గోండి భాషలో “రామచిలక” అని అర్థం. పంజరంలో చిలక మాదిరిగానే ఆదివాసి సమాజ పితృస్వామ్యానికి బంధీ అయ్యింది రాగో. మైదాన సమాజంలో సంస్కృతి, సాంప్రదాయాల పేరిట మహిళలపై అణిచివేత, హింస కొనసాగినట్లే ఆదివాసి సమాజంలో కూడా వివిధ రివాజుల పేరిట అదే కొనసాగుతుంది. వాటిని ఎదిరిస్తే “రివాజుల నెదిరించిన ఆడదని” తెగ పెద్దలు కన్నెర్ర చేస్తరు. అటువంటి పరిస్థితుల్లోరాగోకు తన మేనబావతో పెండ్లి నిశ్చయం చేస్తరు ఇరువైపుల పెద్దలు. కాని రాగోకి తన బావంటే చిన్నప్పటినిండే ఇష్టం ఉండదు. ఇక అతన్ని పెండ్లి చేసుకోవడం ఊహించుకోలేకపోయింది. కాని అతనితో పెండ్లి ఇష్టం లేదని ఎవ్వరికి చెప్పుకోలేకపోయింది. ఎందుకంటే అసలు ఆమెకు ఇష్టముందా, లేదా అని ఎవ్వరు అడగలేదు. అడగకపోయినా చెబుదామంటే తన మాట వినేవాళ్ళు, మనస్సును అర్థం చేసుకువాళ్ళు ఎవ్వరు లేరు.

నిజానికి రాగోకి వయొసొచ్చినప్పటి నుండి తను ఇష్టపడే మనిషి ఒకతను ఉన్నాడు. కాని అతనికి అదివరకే పెళ్ళి అయిపోయి తన భార్యతోనే కాపురం చేస్తున్నాడు. కాకపోతే తనను ఇష్టపడుతున్న రాగోతో చేనుల్లో చెలకల్లో కలుస్తుండేవాడు. అయితే మేనబావతో రాగో పెళ్ళికి అందరు సిద్దమవుతుంటే ఇక చేసేది లేక ఆమె తను మనసిచ్చినోడి ఇంటికి పోతుంది. ఎందుకంటే వారి తెగలో బహుభార్యత్వం తప్పేమి కాదు కాబట్టి. అంతేకాదు “నచ్చని మగాడిని కట్టుకొని జీవితమంతా బాధలనుభవించే బదులు నచ్చినవాడితో లేచిపోవడం గొట్టోల్లలో (గోండులలో) ఆనవాయితీగా వస్తున్నదే. అడ్డుకోవాలనే పెద్ద మనుషుల కంట పడకుండా గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతుంటాయి ఈ లేచిపోవడాలు.” రాగో అదే పని చేద్దామనుకుంటుంది. తను మనసిచ్చిన వాడితో ఎక్కడికైనా “లేచిపోయి” అంతా సద్దుమణిగిన తర్వాత వద్దమానుకుంటుంది. కాని ఆ పని వెంటనే చేయడానికి అతనికి అంత ధైర్యం లేదు. నాలుగు రోజులు ఆగి ఆలోచిద్దామని అంటాడు. ఆలోపే రాగో కోసం ఆమే తండ్రి, మామ, బావ, చిన్నాన, ఇతర బంధువులు ఊర్లో ఉన్న ప్రతి ఇంట్లోను వెతుకుతారు. చివరికి రాగో వాళ్ళకు చిక్కి విపరీతమైన దెబ్బలు తింటుంది. ఇంటికి ఈడ్చుకొచ్చి రాగోని గదిలో వేసి బేడెం వేస్తారు. స్వేచ్ఛను వెతుక్కుంటూ పోయిన రాగో “మళ్ళీ పంజరంలో చిలుక” అవుతుంది.

మళ్ళీ పెళ్ళి ఏర్పాట్లు మొదలవుతాయు. ఎలాగైనా తన బతుకు తన ఇష్టంగా బతకాలనుకోని మళ్ళీ ఇంటి నుండి తప్పిచ్చుకుంటుంది. కాలిబాటనే ఎవ్వరి కంట పడకుండా ఆ ఊరు దాటి పక్క ఊర్లో ఉన్న తన చిన్ననాటి స్నేయితురాలు ఇంటికి పోతుంది. ఆత్మాభిమానం కల్గిన రాగో అక్కడ కూడా ఉండలేక దొరికిన దగ్గర తింటూ ఊరు మార్చి ఊరు తిరుగుతూ అడవంతా తన సొంతం చేసుకుంటుంది. అలా తిరుగుతున్న రాగోని మొఖం మీదనే “కేర్దే” (భర్తను వదిలి మరో సంబంధం కోసం వెతుకుతున్న ఆడది) అని అందరు పిలుస్తుంటే భరించలేకపోయింది. కాని “రేపెదో ఒక రోజు కోరుకున్న తీరుగా బతుకొచ్చు” అనే ఒకే ఒక ఆశతో రోజులు గడుపుతుంది.

కాలిబాటనే ఎవ్వరి కంట పడకుండా ఆ ఊరు దాటి పక్క ఊర్లో ఉన్న తన చిన్ననాటి స్నేయితురాలు ఇంటికి పోతుంది. ఆత్మాభిమానం కల్గిన రాగో అక్కడ కూడా ఉండలేక దొరికిన దగ్గర తింటూ ఊరు మార్చి ఊరు తిరుగుతూ అడవంతా తన సొంతం చేసుకుంటుంది. అలా తిరుగుతున్న రాగోని మొఖం మీదనే “కేర్దే” (భర్తను వదిలి మరో సంబంధం కోసం వెతుకుతున్న ఆడది) అని అందరు పిలుస్తుంటే భరించలేకపోయింది. కాని “రేపెదో ఒక రోజు కోరుకున్న తీరుగా బతుకొచ్చు” అనే ఒకేఒక ఆశతో రోజులు గడుపుతుంది.

అలా కొన్ని రోజులు గడిచిపోగా, ఒక రోజు అనుకోకుండ తన మామ, తనను పెండ్లి చేసుకోవడం కోసం ఉర్రూతలూగుతున్న బావ కంట పడుతుంది. వాళ్ళని చూసి అడవిలోకి పరుగు తీస్తుంది రాగో. జంతువులనే పరిగెత్తి కొట్టే వాళ్ళకు రాగోని పట్టుకోవడం పెద్ద కష్టమేమి కాదు. ఆమెను చావ బాది, రెక్కలు వెనక్కి విరిచికట్టి ఊరిదాక ఈడ్చుకొస్తారు. ఊర్లో పంచాయితీ పెడుతారు. అందరూ తలా ఒక మాట అనడమే కాదు, వాళ్ళు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా కమిలిపోయి పచ్చి పుండులా మారుతుంది. అయినా రాగోని మళ్ళీ పెళ్ళికి సిద్ధం చేస్తారు. ఈసారి బలవంతపు పెళ్ళి కాబట్టి “చీకటి పడగానే అమ్మలక్కలు తలంటి పోసి గదిలోకి తోస్తారు. ఆ రోజున పెళ్ళి అంటే అదే.” ఊరివాళ్ళకు తిండి పెడుతారు. కల్లు పోస్తారు. దానితో పెళ్ళి తంతు అయిపోయినట్లె.అందరూ పెళ్ళి పనులు చూసుకుంటుంటే రాగో మళ్ళీ ఎలా తప్పించుకోగలని తీవ్రంగా ఆలోచిస్తుంది. ఆడవాళ్ళు తనకు తలంటి పోస్తుంటే “ఒంటికి పోతానిని” చెట్లచాటుకు పోయి అక్కడి నుండి మళ్ళీ అడవిలోకి పరుగుతీస్తుంది.  ఎక్కడ ఆగకుండ వాగులు, ఎత్తులు, పల్లాలు దాటి చాలా దూరం పరిగెత్తుతుంది. బాగా అలసిపోతుంది. చీకటి పడటంతో మద్ది చెట్టు మానుకు కూలబడిపోయి అట్లే కునుకు తీస్తుంది. ఇంకా మసక చీకటి వుండగానే  వినపడే కూలుతున్న బండ రాళ్ళ శబ్ధానికి, తుపాకుల మోతకు ఉలిక్కి పడిలేసి చూసేసరికి తనవైపుకు ఒక గుంపుగా కొందరు రావడం గమనిస్తుంది. మళ్ళీ తనను పట్టుకోవడానికే వస్తున్నారేమోనని భయపడిపోతుంది. కాని వచ్చేవాళ్ళు తనను దాటి పోతుండటంతో వాళ్ళతో పాటుగా పరిగెత్తుతుంది. ఆ తుపాకి శబ్ధాలకు దూరంగ పోయేసరికి తెల్లగా తెల్లారిపోతుంది. తమతో వచ్చిన ఈ కొత్తావిడ ఎవ్వరని విచారించాక రాగో వాళ్ళలో ఒక ఆదివాసి మహిళతో కల్సిన స్నేహంతో వాళ్ళ ఊరికి పోతుంది. అన్నలు ఇచ్చిన జిల్లా బంద్ ను విజయవంతం చేయడానికి రోడ్డు మీద చెట్లు నరికి వేసి, పెద్ద పెద్ద రాళ్ళు పెట్టడానికి ఆ ఆదివాసి గుంపు వచ్చినట్లు ఎంతో ఉత్సాహంతో రాగోకు చెబుతుంది ఆ మహిళ. అక్కడే మొదటిసారి అన్నల గురించి, అక్కల గురించి వింటుంది. ఆ తర్వాత వాళ్ళ మీటింగులకు పోతుంది.

ఒక మీటింగ్ లో ఒక ఆదివాసి దళ సభ్యురాలు మాడియా మహిళల ఇక్కట్ల గురించి పాట పాడుతుంది. ఆ పాట:

మీ పొల్లు చెప్పుతాం

మీ బాధ చెప్పుతాం

పంజరంలో చిలుక లెక్క

నీ బతుకు చేసిరక్కా

నీ సుట్టు రివాజులల్లి

నీ కాళ్ళు విరిచిరక్కా

నీ హక్కు, నీ బతుకు

లిమ్మ రుతుల గుమ్మడి

వింటానికి రావే అక్క

లిమ్మ రుతుల గుమ్మడి

….        ….

ఇలా సాగే పాటలో తన జీవితమే చూసుకుంటుంది రాగో. అంతమంది మగాల ముందు ఆ అక్క పాట పాడటం, దానికి ఆ మగాళ్ళు ఏమి అనకుండా వుండటం అదేదో తెలియని ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఆశ్చర్యపోతుంది.

ఆ మీటింగ్ తర్వాత “అందరూ అటెన్షన్ లో నిలబడి పిడికిలెత్తి గొంతు కలిపి అంతర్జాతీయ గీతం పాడుతున్నారు. ఆ పాట, ఆ తీరు తెలవని రాగో వారిలోనే నిలబడి వుంది. తనకు తెలియకుండానే చేయి మాత్రం పైకెత్తింది.”  అదేరోజు “దళం గూర్చి ఏమీ తెలియని రాగో దళం వెంట నడుస్తుంది. దళం ఎటుపోతుందో తెలియని రాగో దళంతో నడుస్తుంది.” అలా మొదలయిన రాగో దళ జీవితంలో వయుక్తిమనుకున్న ఎన్నో సమస్యలు ఎంత వ్యవస్థీకృతంగా ఉన్నాయో అర్థం చేసుకుంటుంది. మొత్తం వ్యవస్థ మారనంత వరకు ఈ వ్యక్తి బాధలు పోవనే అవగాహనకు వస్తుంది. రాగో ఆ విప్లవ పార్టీ లో  సభ్యత్వం పొందుతుంది. ఆ రాజకీయాలతోనే కొనసాగుతుంది. ఇక్కడే ఆ నవల ఆగిపోతుంది కాని నిజ జీవితంలో రాగో పాత్రకు ప్రేరణ అయిన విప్లవకారిని మూడు దశాబ్దాలకు పైగా విప్లవోద్యమంలో నడిచింది.

విప్లవోద్యమం ఆదివాసి మహిళల జీవితాలలో ఎలాంటి మార్పు తెస్తుందో అని చెప్పడానికి  కేవలం ఒక రాగో జీవితమే కాదు. రాగోలాంటి ఎందరో జీవితాలు చెబుతాయి. మరో ఆదివాసి మహిళ మైనా చెప్పినట్లు: “నేను ఒక ఆదివాసి మహిళను. నాకు లోకజ్ణానం తెలిసినప్పటినుండి ఆదివాసి స్త్రీ గా మాడియా కట్టుబాట్లతో అణచబడ్డ స్త్రీని. మా మాడియా స్త్రీలపై అణిచివేత కొనసాగుతున్నదని అడివన్నలు వివరించే వరకు అర్థం కాలేదు… మా ఊర్లకు అన్నలు రావడం పెరిగి మా రేంజి జిల్లా అంతా మహిళల ఆలోచనల్లో చాలా మార్పులు వచ్చినవి. మేము దళాల్లోని అన్నల-అక్కల ఆలోచనలలో పాలు పంచుకోవడం అవసరం అని గుర్తించాము…మా లోకమే మారింది. 2,3 సంవత్సరముల క్రింద పొలం, ఇల్లు, మొగుడు, పిల్లలు తప్ప మరో ధ్యాస లేదంటే నమ్మరు. ఇప్పుడు అట్లా కాదు. ఇరాక్ సద్దాం సంగతి నుండి ఐ. ఎం.ఫ్ అప్పులిచ్చేటోని దోపిడి మొదలు పెడితే సారా పోరాటం వరకు ఊరూరా తిరిగి సభలు, సమావేశాలు చేయడం వరకు మాకు నేడు కావాలి. ఇట్ల చెప్పితే చాలనే వుంది. ఏం చెప్పిన పాత ఊరు కాదు. పాతమందిమి కాదు. కొత్త ఆలోచనలు – పోరు మాట, పోరు పాట – మా బాటగా మెదడులో మసులుతుంటాయి.” (అరుణతార, మార్చ్ 1994, పే. 20-22) ఇది పాతిక సంవత్సరాల కిందటి మాట.

“రాగో” నవల మొదట సృజన పత్రికలో పది సంచికలలో (మే 1991 నుండి ఏప్రిల్-మే 1992 వరకు) సీరియల్ గా వచ్చింది. తర్వాత 1993లో సృజన ప్రచురణలుగా పూర్తి నవలగా వచ్చింది. ఈ నవల తెలుగు మేధోసమాజంలో పెద్ద చర్చకు తెర లేపింది. ఏమి తెలువని రాగో తమ వ్యక్తిగత సమస్యల నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంటే ఆమెకు దొరికిన ఒకేఒక మార్గం విప్లవోద్యమం. కాని ఆ ఉద్యమ అంతిమ లక్ష్యాలతో రాగోకు సమ్మతి వుందా? అసలు ఆమెకు ఆ రాజకీయాలు అర్థమవుతాయా? రాగో ఎక్కడికిపోతుంది? ఏమయిపోతుంది? రాగోనే కాదు ఆమె అక్కలు, చెల్లెళ్ళు ఏమయిపోతారు? ఈ ప్రశ్నలతో మొదలయ్యి ఒక క్వాంటం జంప్ తీసుకోని కమ్యూనిష్టు విప్లవాలు ఎందుకు విఫలమయినాయి? మార్క్సిస్టులు మానవ వ్రవృత్తిని సరిగ్గా అర్థం చేసుకోలేదని దాని మూలంగానే ఈ వైఫల్యాలని, అయినా వాళ్ళు చరిత్ర నుండి ఇంకా ఏమి నేర్చుకోవడం లేదని, అన్ని సమస్యలకు విప్లవమే సమాధానం  చెబుతుందనే భ్రమల్లో ఉన్నారని  పశ్నలు, పిర్యాదులు చేశారు.

కొత్త ఆలోచనలు తప్పకుండా చేయాల్సిందె. నిజాయితీగా అడగాల్సిన ప్రశ్నలు అడగాల్సిందే. ఈ ప్రశ్నలు మొదటిసారిగా విన్నప్పుడు అడిగేవాళ్ళ మేధస్సును చూసి ఆశ్చర్యం అనిపించింది. కాని ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ ప్రశ్నలు కొత్తవైనట్లు, అవేవో ఈ మేధావుల ఆలోచనలనుండే పుట్టుకొచ్చినట్లు చూసిన తెలుగు మేధోజమాజాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా అనువాద ప్రశ్నలే. అప్పటికే ఈ ప్రశ్నలు బయటి ప్రపంచంలో (ముఖ్యంగా యూరప్ లో) అనేక మార్క్సిస్టులు, మార్క్సిష్టేతరులు వేసి వున్నారు. పెద్ద చర్చ జరిగివుంది. సరే ఆ చర్చలోకి పోవడం ఇది సందర్భం కాదు కాని “రాగో ఏమవుతంది” అని జాలిగా అడిగిన ప్రశ్నకు రాగో జీవితమే సమాధానం చెప్పింది. మార్క్సిజం మొత్తాన్ని ఒంటపట్టించుకోని ఉద్యమాలలోకి వెళ్ళే అవకాశం రాగోకి లేదు. ఆ ఉద్యమంలోకి పోయిన తర్వాత ఆమె ఏమి నేర్చుకోలేదనో, నేర్చుకునే శక్తి లేదనో, ఆ ఉద్యమ అంతిమ లక్ష్యాలను అర్థం చేసుకోలేదనో అనుకుంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది. విప్లవాన్ని ఏకశిలదృశ్యంగా చూసేవాళ్ళకు అందులో నెత్తుర్లు, తుపాకులు, మందుపాతరలే కనబడుతాయి తప్ప అందులో పరివర్తనం చెందుతున్న జీవితాలు, మానవ ప్రవృత్తులు, చరిత్ర గతి అర్థం కాదు. విప్లవంలో భాగమయ్యే అనేక భావోద్వేగాలను తడిమి చూడలేని ఇరుకుతనంతో దానిని ముక్కలు ముక్కలుగా అర్థం చేసుకోవడం విప్లవానికే కాదు, మొత్తం సమాజానికే ఆరోగ్యకరం కాదు.

రాజ్యం ఆమెను చంపి ఏదో సాదించానని ఆనందపడటానికి ఇప్పుడు రాగో నామవాచకం కాదు, సర్వనామం. పంజరాలను పగలగొట్టిన చిలుకమ్మల సైన్యం. రాగోల రాజ్యం కోసం సాగుతున్న దండకారణ్య రణం.

రాగో మీద, ఆమె భాగమైనా ఉద్యమం మీద ఎన్ని ప్రశ్నలైనా వేయవచ్చు. అవి ఆ రాగోలను, ఆ ఉద్యమాన్ని మరింత విశాలమే చేస్తాయి. అదే క్రమంలో పెట్రేగి పోతున్న హిందుత్వ ఫాసిస్టు సందర్భంలో, ముక్కలుచెక్కలై పోతూ సమాజాన్ని తలకిందులుగా చూసే రాజకీయాలను రాగో కూడా ఒక ప్రశ్న అడిగేవుంటది. అది, మీరేమయిపోతారని. బహుశా, సరైన సమాధానం వెతుక్కోకపోతే ఆగమయిపోతామేమో. ఆలోచిద్దాం.

*

అశోక్ కుంబము

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అనువాద ప్రశ్నలే అన్నారు కదా.బాలగోపాల్ పెరు ఎత్తకుండానే బాలగోపాల్ ను ఉద్దేశించి అన్నారా? మరయితే పశ్చిమ దేశాలలో ఏ ప్రశ్నలను లేవనెత్తారు? ఎవరు లేవనెత్తారు? ఆ ప్రశ్నలకు వచ్చిన జవాబులు ఏమిటి? ఆ జవాబులు ఇక ప్రశ్నలకు తావు ఇవ్వనంత స్థాయిలో ఉన్నాయా?
    కాస్త ఆ ప్రశ్నలను, ఆ జవాబులను సోర్స్ తో సహా ఇస్తే చదువుదామని ఉంది.

    • ముందుగా, కామెంట్లు పెట్టిన మిత్రులందరికి వందనాలు.

      మాధవరావు గారు,

      “రాగో” సందర్భంలో, ఆ తర్వాత జరిగిన చర్చల్లో బాలగోపాల్ గారిదే ప్రధానమైన వాయిస్ కాబట్టి నేను రాసిన “మేధావుల్లో” వారు కూడా ఉండటం చాలా సహజమైన విషయమే. మీరు అడిగినవన్నీ ప్రశ్న-జవాబు ఫార్మాట్ లో చెప్పడం సరైన పద్దతి కాదు. అందుకే మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే పుస్తకాలు, అకడెమిక్ ఆర్టికల్స్ వందల్లో ఉన్నాయి. నాకు అందుబాటులో ఉన్నవి, నేను చదివిన వాటిలో కొన్ని మాత్రమే ఇక్కడ పొందుపరుస్తున్నాను. (ఇందులో ఏవైనా మీకు అందుబాటులో లేకపోతె ఇక్కడ మీ ఈమైల్ అడ్రస్ పెడితే మీకు తప్పక పంపుతాను).

      Laclau, Ernesto & Mouffe, Chantal. 1985. Hegemony and Socialist Strategy: Towards a Radical Democratic Politics. New York: Verso.

      Geras, Norman. 1983. Marx and Human Nature. London: Verso.

      Sayers, Sean. 1998. Marxism and Human Nature. New York: Routledge.

      Althusser, Louis. 2006. For Marx. New York: Verso.

      Ozselcuk, Ceren & Madra, N Yahya. 2005. Psychoanalysis and Marxism: From Capitalist-All to Communist Non-All. Psychoanalysis, Culture & Society. 10. 79-97.

      Diskin, Jonathan & Sandler, Blair. 1993. Essentialism and the Economy in the Post-Marxist Imaginary: Reopening the Sutures, Rethinking Marxism: A Journal of Economics, Culture & Society, 6:3, 28-48.

      Callari, Antonio. 1991. Economic Subjects and the Shape of Politics. Review of Radical Political Economics, 23: 1 & 2, 201-207,

      Byron, Chris. 2016. Essence and Alienation: Marx’s Theory of Human Nature. Science & Society. 80:3, 375-394.

      Howarth, David. 1991. Reflections on Ernesto Laclau’s new reflections on the revolution of our time , Politikon: South African Journal of Political Studies, 19:1, 120-133.

      Wood, Meiksins Ellen. 1986. The Retreat from Class: A New “True” Socialism. New York: Verso.

      చివరిగా ఒక్క మాట: ఖాళీలు పూరించి పరిపూర్ణం చేయడం, “ప్రశ్నలకు తావులేనంత” జవాబులు వెతకడం చలనంలో వుండే సమాజ పరివర్తనకు సంబంధించిన సిద్దాంతాలలో అయ్యే పనికాదు. నా వరకు అది మార్క్సిస్ట్ ఆలోచనా పద్దతే కాదు. ఖాళీలు పూరించాలంటూ మొదలుబెట్టి Post-Marxist లుగా, Post-Modern Marxist లుగా రూపాంతరం చెంది చివరికి Anti-Marxist లుగా మారి వర్గమెక్కడ? వర్గపోరాట అవసరమేంటి అనే ప్రశ్నలు వేసిన వారు ఎందరో. ఇది కేవలం బాలగోపాల్ గారిని ఉద్దేశించి రాస్తున్నది కాదు. ఆ క్రమంలో వారు మొదటి వారు కారు, చివరి వారు కూడా కాదు.

      • Sorry, for some reason, my name was messed up.

  • అశోక్ కంబం గారూ !

    ముందుగా రాగో అక్కకి లాల్ సలాం.

    యీ వ్యాసం రాసిన మీకు ఒందనాలు. ( మేము కొన్నాళ్లు ప్రకాశం జిల్లా కింద వచ్చే మార్కాపురం, బేస్తవారపేట పక్కనుండే కంబం ఊర్లో ఉన్నాము. మీ ఇంటిపేరు కంబం అని అనుకుంటున్నా ).

    హక్కుల సూరీడు బాలగోపాల్ ( మానవ హక్కుల ఉద్యమనేత డాక్టర్‌ కె. బాలగోపాల్ ) గారు వేసిన మౌలిక ప్రశ్నలు అనువాద ప్రశ్నలే అనకండి. ప్రపంచం నాలుగు చెరుగుల నుండి సామ్యవాద సిద్ధాంతాలు, ఉద్యమాలు ఎదుర్కొన్న ఎత్తుపల్లాల అనుభవాలను తీసుకున్నట్లే… ప్రశ్నించే గళాలనూ ఆహ్వానించాలి, గౌరవించాలి కదన్నా. వామపక్ష ఉద్యమానికి తన మేధోసంపత్తితో బాలగోపాల్ గారు చేసిన సేవలు గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. మేధావుల నుండి అట్టడుగు వర్గం దాకా ఉద్యమ గమనం, గమ్యానికి దూరమవుతున్నట్లున్న తీరు తెన్నుల పట్ల వ్యక్తపరుస్తున్న ప్రశ్నలను స్వాగతించాలి, వాటికి తగు సమాధానం చెప్పేరీతిలో ఉండాలి కదన్నా.

  • ” విప్లవాన్ని ఏకశిలదృశ్యంగా చూసేవాళ్ళకు అందులో నెత్తుర్లు, తుపాకులు, మందుపాతరలే కనబడుతాయి తప్ప అందులో పరివర్తనం చెందుతున్న జీవితాలు, మానవ ప్రవృత్తులు, చరిత్ర గతి అర్థం కాదు ” అన్నారు అశోక్ కుంబం గారూ. నిజమే. కానీ యీ ఉద్యమంతో మమేకం అవ్వాల్సిన ఎన్నో భిన్న అస్తిత్వాలుగా, భిన్న స్వరాలుగా… దళిత, స్త్రీవాద… ముస్లిం మైనారిటీ వర్గాలుగా రూపొందాయి. రూపొందినా పర్వాలా… కానీ అవన్నీ వామపక్ష ఉద్యమానికి తమ సానుభూతిని, మద్దతుని ఇచ్చేలా చూసుకోవాలి కదన్నా

  • ʹ రాగో ఏమవుతుంది? ʹ – పాణి

    http://virasam.org/article.php?పగె=1384

    ʹదళం గూర్చి ఏమీ తెలియని రాగో దళం వెంట నడుస్తుంది. దళం ఎటు పోతుందో తెలియని రాగో దళంతో నడుస్తుంది…ʹ రాగో చివరికి ఏమవుతుంది? ఎప్పటికైనా తను వెళ్లే దారి గురించి తెలుసుకుంటుందా? లేక అలాగే పోతుందా? నడక ఆపేస్తుందా?

    ఇంతకూ రాగో ఏమైంది?

    ఆదివాసీ విప్లవ నాయకురాలు ఆర్క చైతు అలియాస్ సృజన మే 2వ తేదీ జరిగిన ఎన్‌కౌంటర్లో అమరురాలైంది. గడ్చిరోలి జిల్లాలోని ఏటాపల్లె దగ్గర సినట్టి అటవీ ప్రాంతంలో చనిపోయిన చైతుకు 48 ఏళ్లు. ఆమెది అదే జిల్లా భామ్రాఘడ్ తాలూకా, లహిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపనార్ గ్రామం.

    ప్రముఖ విప్లవ రచయిత సాధన రాసిన రాగో నవలలోని ప్రధాన పాత్ర ఈమెనే అని తెలిసిన వాళ్లు అంటున్నారు. లేదా ఆ నవలకు ఆమెనే ప్రేరణ కావచ్చు.

    రాగో ఏమవుతుందనే ప్రశ్నకు ఆమె మరణంలోనే సమాధానం లేదనుకుంటాను. ఆమె జీవితంలో ఉంది. అట్లాగే నిన్నటితో ముగిసిన ఆమె ఆచరణ ఆమె ఒక్కరిదే కాదు. విప్లవం చేయగల వర్గానిది. లేదా చైతన్యవంతమైన మానవులది. ఆ రకంగా రాగో ఏమవుతుందనే ప్రశ్నకు ఆమె మరణం తర్వాత కూడా కొనసాగే విప్లవాచరణలో సమాధానం ఉంది.

    రాగో అమరురాలైందనే వార్త తెలియగానే చాలా మందికి బాలగోపాల్ గుర్తుకు వచ్చి ఉంటారు. 1993లో సృజన ప్రచురణగా రాగో నవల అచ్చయింది. అప్పుడు దాని కోసం ఆయన ఒక ముందుమాట రాశారు. అయితే ఆయనే చెప్పినట్లు రచయిత అభిప్రాయాలతో పూర్తిగా విభేదించేలా ఉన్నందు వల్ల అది అరుణతారలో విడిగా అచ్చయింది. అదే ʹమనిషి చరిత్ర మార్క్సిజంʹ అనే వ్యాసం.

    ఇప్పుడు రాగో అమరత్వం ముందు అందరూ తలవంచి నిలబడాలి. మార్క్సిస్టేతర ధోరణులు ఏ రూపంలో ఉన్నా ధైర్యంగా తలపడాలి. వర్గపోరాటాన్ని సమున్నతంగా ఎత్తిపట్టాలి. దేనికంటే పితృస్వామ్య అణచివేతను, కుటుంబ పీడనను, లైంగిక శ్రమ విభజనను వర్గపోరాటం ద్వారా రద్దు చేయలేం అనే ఫెమినిస్టుల వాదనను రాగో తిప్పి కొట్టింది.

    దండకారణ్య ఆదివాసీ అమ్మాయిల దగ్గరికి వెళ్లి ʹవిప్లవంలోకి ఎందుకు వచ్చారుʹ అని అడగండి.

    ʹస్వేచ్ఛ కోసంʹ అని అంటారు.

    దేనినుంచి స్వేచ్ఛ? తరతరాల పితృస్వామ్య బంధనాల నుంచి. సాంఘిక కట్టుబాట్లు నుంచి. ఈ స్వేచ్ఛ అంత మాత్రమేనా? కానే కాదు. అంతిమంగా అది మానవ ఊహాశక్తి. మానవ క్రియాశీలత. తద్వారా చరిత్రతో మనిషికి ఉండే సంబంధం. రాగో దాన్ని నిజం చేసింది. భారతదేశంలో మరే రాజకీయ పార్టీలో లేనంత మంది మహిళలు ఇవాళ మావోయిస్టు పార్టీలోనే ఉన్నారు.

    రాగో వాళ్ల ప్రతినిధి. వాళ్ల నాయకురాలు. వాళ్ల నేస్తం. విప్లవమే అత్యుద్భుతమైన మానవ వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుందని రాగోల గురించి తెలుసుకున్న వాళ్లకు నమ్మకం కలుగుతుంది.

    అంతా అయిపోయిందని నిట్టూర్పులు విడిచేవాళ్లు, అన్నీ ప్రశ్నలే అని పాండిత్యాన్ని ప్రదర్శించేవాళ్లూ, తలుపుచాటున నక్కి రాళ్లు విసిరేవాళ్లు, జీవితంలో ఒక్కసారైనా పడక కుర్చీలోంచి లేచి బైటి ప్రపంచంలోకి రాకుండా మహిళా విముక్తి ఎలా అని తర్జనభర్జనకు గురయ్యేవాళ్లు.. ఎందరో ఉన్న ఈ వర్తమాన ప్రపంచంలో మనకు రాగో గడించిన అనుభవం, జ్ఞానం, ఆచరణ ఉన్నాయి. అలాంటి వేలాది లక్షలాది రాగోల సంసిద్ధత ఉన్నది.

    దాన్ని ఎత్తిపట్టడమే రాగోకు నివాళి.

  • “Only with quite a small number can one propose or expect serious inclination for, and understanding of, endeavours which go beyond the mere amelioration of conditions of labour”
    First, the Marxist practice is predominantly political, and is directed towards the conquest of political power and attributes, and gives importance almost solely to the trade union movement, as a direct form of the class struggle of theworkers”
    జర్మన్ సోషల్ డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు బెర్న్ స్టెన్ పై రెండు ప్రతిపాదనాలను 1899 లో చేసాడు.

  • కార్ల్ మార్స్క్ & ఏంగిల్స్ లకు మిత్రుడు, స్వయంగా ఓ మార్క్సిస్ట్ సిధ్ధాంతి, జర్మన్ సోషల్ డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు అయిన ఎడ్వర్డ్ బెర్న్ స్టెన్1899 లో చేసిన రెండు ప్రతిపాదనాలను 1) Socialism could be achieved by peaceful means and 2) Socialism would be achieved by Capitalism, not by Capitalism’s destruction గురించి చెప్పిన విద్యాసాగర్ గారికి ధన్యవాదాలు. బెర్న్ స్టెన్ ప్రతిపాదనల గురించిన మరిన్ని వివరాలు :

    Eduard Bernstein, a German social-democratic Marxist theorist and a member of the Social Democratic Party (SPD), held close association to Karl Marx and Friedrich Engels… but he saw flaws in Marxist thinking and began to criticize views held by Marxism when he investigated and challenged the Marxist materialist theory of history. He rejected significant parts of Marxist theory that were based upon Hegelian metaphysics* and rejected the Hegelian dialectical** perspective.

    Bernstein distinguished between early and mature Marxism. The former, exemplified by Marx and Engels’s 1848 The Communist Manifesto, he opposed for what he regarded as its violent Blanquist tendencies (which holds that socialist revolution should be carried out by a relatively small group of highly organised and secretive conspirators) embracing the latter, holding that socialism could be achieved by peaceful means through incremental legislative reforms in democratic societies.

    Bernstein was principally concerned with refuting Karl Marx’s predictions about the imminent and inevitable demise of capitalism and Marx’s consequent laissez-faire policy which opposed ameliorative social interventions before the demise. He noted that while the centralisation of capitalist industry was significant, it was not becoming wholescale and that the ownership of capital was becoming more and not less diffuse.

    Bernstein claimed that Marx was mistaken in identifying the revolutionary potential of workers, in predicting their increasing misery and the eventual collapse of capitalism by a proletarian revolution. Bernstein observed that the conditions of the working classes are improving, not worsening and the desire or need for revolution is weakening – something he claimed that Marx himself had acknowledged as a possibility.

    Bernstein remained very much a socialist, albeit an unorthodox one as he believed that socialism would be achieved by capitalism, not by capitalism’s destruction (as rights were gradually won by workers, their cause for grievance would be diminished and consequently, so too would the motivation for revolution). During the intra-party debates about his ideas, Bernstein explained that for him the final goal of socialism was nothing; progress toward that goal was everything.

    He warned that a violent proletarian revolution as in France in 1848 produced only reactionary successes that undermined workers’ interests. Therefore, he rejected revolution and instead insisted the best strategy was patiently building up a durable social movement working for continuous nonviolent incremental change.

    Bernstein argued that Marxian socialists should set their “revolutionary” hopes aside, and pursue a more practical, piecemeal movement towards a socialist state within a parliamentary democratic context.

    Bernstein desired for socialism through peaceful means (socialism coming through democratic means and incremental legislation. Some say this is Marxism in its mature form.

    ( * Metaphysics is the branch of philosophy that examines the fundamental nature of reality, including the relationship between mind and matter, between substance and attribute, and between potentiality and actuality.

    ** Hegelian dialectic, usually presented in a threefold manner comprising three dialectical stages of development: a thesis, giving rise to its reaction; an antithesis, which contradicts or negates the thesis; and the tension between the two being resolved by means of a synthesis. )

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు