తాబేలు నడకలు – 2

మా పని పూర్తి చెయ్యడానికి డెడ్ లైన్స్ ముంచుకొస్తున్నాయి. చల్లగా ఉండే బెంగుళూరులో మకాం వేసింది కమిషన్. ఒక నెలంతా అన్ని లెక్కలూ సరిచూసుకోవడానికి సరిపోయింది. అన్ని ప్రతిపాదనలనూ చర్చించింది. ఆ క్రమంలో కమిషన్ లో రాజకీయ ప్రతినిధి మోహన్ లాల్ గౌతమ్ కు ఆర్థిక సంఘం ప్రతిపాదనలు నచ్చడం లేదని తేటతెల్లమైంది. కాని ఆయన తన ఆలోచనలను ఇతర సభ్యులకు చెప్పి ఒప్పించలేకపోయారు. వారికి అంగీకారమయ్యేలా వాదించలేకపోయారు. కమిషన్ లో అభిప్రాయభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఆయన డిసెంట్ నోట్ ఇస్తారని అనుకున్నాం.

ఢిల్లీకి వచ్చాక గౌతమ్ గారి సెక్రటరీ వచ్చి ఆయన నన్ను పిలుస్తున్నారని చెప్పారు. నేను ఆయన ఆఫీసుకు వెళ్లాను. ఎప్పట్లాగా ఆయన మర్యాదగా, స్నేహపూర్వకంగా ఉన్నారు. టీ, బిస్కెట్లు అయ్యాక ఆయన తాను డిసెంట్ నోట్ రాయాలనుకుంటున్నానని, దాన్ని నన్ను రాయమని అడిగారు.

అది కొంచెం కష్టమైన పనే. నేను ఆర్థిక సంఘంలో ఉద్యోగం చేస్తున్నానంటే నాకు బాస్ దాని మెంబర్ సెక్రటరీ. నేనేది చేసినా ఆయన ఆధ్వర్యంలో జరగాలి. కమిషన్ లో మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి వ్యతిరేకంగా డిసెంట్ నోట్ నేను రాశానని తెలిస్తే అస్సలు బాగుండదు. అది నా కెరియర్ ను నాశనం చెయ్యవచ్చు. ఇదంతా నేను గౌతమ్ గారికి విడమరిచి చెప్పాను. ఆయన కూడా అవునంటూ అంగీకరించారు, తర్వాత ఆ నోట్ తానే స్వయంగా సిద్ధం చేశారు. అది కమిషన్ రిపోర్టుకు అనుబంధంగా చేర్చారు. ఆయన విచక్షణ వల్ల నేనొక ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి బయటపడ్డాను.

ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగియకముందే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సభ్యులంతా ఎవరిళ్లకు వారు చేరుకున్నారు. నా విషయంలో తార్లోక్ సింగ్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు. నేను ప్లానింగ్ కమిషన్ లో ఉద్యోగిగా చేరిపోయాను. ఫైనాన్స్ కమిషన్ లో లాగే ఇక్కడ కూడా నాకు ఆర్థికపరమైన వెసులుబాటు లభించింది.

ప్లానింగ్ కమిషన్ మొదట్లో ఒక కన్సల్టింగ్ సంస్థగా కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి సంస్థగా ఆవిర్భవించింది. అనతి కాలంలోనే నాటకీయ ఫక్కీలో పెద్దగా ఎదిగింది. ఆ ఎదుగుదల ఒక పద్ధతిగా జరిగింది కాదు. ఎప్పటికప్పుడు మారుతున్న ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా సాగింది. కమిషన్ ఉద్యోగులు దాని గురించి ఓ సరదా కథను ప్రచారంలోకి తీసుకొచ్చారు. అది ఒకరి నుంచి ఒకరికి నోటి మాటగా పాకిపోయింది.

అనగనగా దేశానికి ఈశాన్య ప్రదేశంలో ఒక రాజ్యం. దాని రాజధాని గంగానది ఒడ్డున ఉన్నది. రాజు మంచివాడు, ప్రజలకు ఆయనంటే అభిమానం. వారి మద్దతు సంపూర్ణంగా ఉంది. అంతా బాగుంది. కాని ఎంత మంచి రాజ్యంలోనైనా దైనందిన జీవనం కష్టమయ్యే వర్గాలు కొన్ని ఉంటాయి. అటువంటివారిలో ఒక జ్యోతిష్కుడు ఉన్నాడు. ఒకరోజు అతను ఏ సంపాదనా లేక ఉత్తి చేతులతో ఇంటికి వెళ్లాడు. ఆనాడు వారింట్లో పొయ్యిలో పిల్లి లేవలేదు. ఆయనా కూతురూ కలిసి ఆలోచించారు, ఏం చెయ్యాలని. దీన్నే మా ఉద్యోగులు ‘యోజన భవన్ ’లో ‘కాంటెప్లేటివ్ థాట్’ అని సరదాగా అనేవారు.

సరే, ఆ పండితుడు మర్నాడుదయం రాజదర్శనం కావాలని వెళ్లాడు. రాజుగారి దగ్గర తన వంతు వచ్చినప్పుడు రహస్యం చెబుతున్నట్టుగా లోగొంతుకతో ‘మహారాజా నేను మన రాజ్య జాతకం వేశాను. కొంచెం గడ్డుకాలం కనిపిస్తోంది’ అని చెప్పాడు.

‘ఏమిటి దానికి పరిహారం’ అడిగాడు మహారాజు.

‘ఉన్నది మహారాజా, గంగానది ఒడ్డున కూర్చుని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఫలానా జపం చేస్తే అంతా సర్దుకుంటుంది. అటువంటి పండితులను తమరు నియమించాలి…’ అని విన్నవించాడు.

‘మరెవరో ఎందుకు, మీరే చెయ్యండి’ అంటూ అప్పటికప్పుడు రాజు అతన్ని జపానికి నియోగించాడు. పండితుడు నది ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చుని జపం మొదలుపెట్టాడు. పారితోషికం ఖజానా నుంచి వచ్చేది.

కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ విషయం ఒకరినుంచి ఒకరికి చేరింది. ‘అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్టుగా భుక్తికి లోపమున్న పండితులంతా రాజును కలిసి అటువంటి కథలే చెప్పి జపం ఉద్యోగాలు సంపాదించుకున్నారు. క్రమంగా గంగానది ఒడ్డున జ్యోతిష్కులు నిండిపోయారు. తర్వాత ఆ కథ ఏ కంచికి చేరిందో తెలియదుగాని, ప్లానింగ్ కమిషన్ కథ మాత్రం అదేనని వినిపించేది.

దానికి తగ్గట్టే ప్లానింగ్ కమిషన్ లో ఆర్థికవేత్తలు కిటకిటలాడుతూ కనిపించేవారు. ఎక్కువమంది అమెరికా, బ్రిటన్లలో చదువుకున్నవారు, దానికి తగ్గట్టే వారికి ఇండియా కన్న, ఆ దేశాల గురించే బాగా తెలుసు. వారంతా చేరి కమిషన్ సామ్రాజ్యాన్ని విస్తరించారు. కొత్త రోగాలకు కొత్త వైద్యాల్ని సూచిస్తూ ఉండేవారు.

సోవియెట్ యూనియన్ తర్వాత ప్లానింగ్ విభాగంలో అతిపెద్ద బ్యూరాక్రసీ మనదే. మన తర్వాత పాకిస్తాన్ ప్లానింగ్ కమిషన్ ఏర్పాటు చేసింది కాని అది విదేశీ సాయం మీద ఆధారపడింది. దాని మొదటి ప్రణాళిక హార్వర్డ్ యూనివర్సిటీ బృందం రూపొందించింది. ఆ ప్రయత్నమే పునాదిగా హార్వర్డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ ఏర్పడింది.

కమిషన్ లో అనేక విభాగాలుండేవి. ఎకనామిక్, ఇండస్ట్రీ, ట్రేడ్ మొదలైనవి. వీటితోపాటే మరో రెండు సంస్థలు అటానమస్ గా పనిచేసేవి. ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ ఆర్గనైజేషన్ ఒకటి. ఇది అయిపోయిన ప్రోగ్రాముల విశ్లేషణకు ఉద్దేశించినది. అప్పట్లో అభివృద్ధిపథంలో పయనిస్తున్న పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ కూడా దీనికిందికే వచ్చేవి. కమిటీ ఆన్ ప్లాన్ ప్రాజెక్ట్స్ మరొకటి. 1952 బడ్జెట్ ప్రసంగం వీటికి ఊపిరులూదింది. ఈ రెండు సంస్థలకు ప్రజాజీవితంలో ఉన్న సమూహాల నుంచి వ్యక్తుల సాయం అవసరమయ్యేది. అప్పుడే రివ్యూ ఒక విశాల దృక్పథం నుంచి జరుగుతుందని భావించేవారు. ఈ రెండు సంస్థల వెనక ఉన్న ఆలోచన వినూత్నమైనది, మార్గదర్శకమైనది.

కాలక్రమంలో కమిటీ ఆన్ ప్లాన్ ప్రాజెక్ట్స్ (సి.ఒ.పి.పి.) తన ప్రారంభ లక్ష్యాల నుంచి దూరంగా జరిగిపోయి, పంచాయతీరాజ్ వంటి సంస్థల అభివృద్ధిమీద దృష్టిపెట్టడం మొదలుపెట్టింది. 1960ల మధ్యనాటికి అది అనేక కార్యక్రమాల కలగూరగంపగా తయారైంది. దీన్ని ఒక అవకాశంగా మలచుకున్నారు తార్లోక్ సింగ్. ఆయన ప్లానింగ్ కమిషన్ ప్రారంభమైనప్పటి నుంచి ఒక సివిల్ సర్వెంట్ గా పనిచేస్తున్నారు. ఆ అనుభవంతో ఆయన సిఓపిపిని రెండు భాగాలుగా విభజించారు. ఒకటి మేనేజ్ మెంట్, రెండోది డెవలప్ మెంట్ అడ్మినిస్ట్రేషన్. మొదటిది కార్పొరేట్ అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టేది. ఇందులో అమెరికన్ నిపుణులుండేవారు. రెండోది ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి పెట్టేది. ఇదిగో ఈ రెండో దానిలో నా ఉద్యోగం. అప్పటికి అందులో నేనుగాక మరో ఇద్దరు ఉద్యోగులుండేవారు. మేం ఒక బృందం, మా డివిజన్ కు ఓ చీఫ్ ఉండేవారు. కాని అది కేవలం పాలనాసౌలభ్యం కోసమే. మేమంతా తార్లోక్ సింగ్ పర్యవేక్షణలోనే పనిచేసేవాళ్లం.

తార్లోక్ సింగ్ గారిది నిఖార్సైన పెద్దమనిషి తరహా. పెద్దవారే కాదు, తనకన్న చిన్నవారు వచ్చినా, తన సీట్లోంచి లేచి నిల్చుని పలకరించే ఉన్నతాధికారి ప్రభుత్వ వ్యవస్థలో బహుశా ఆయన ఒక్కరేనేమో. పదిమందిలో ఎప్పుడూ ఎవర్నీ తిట్టేవారు కాదు. ఒక్కక్కర్నీ పిలిచి నిర్మాణాత్మక సూచనలు చేసేవారు. స్వలాభం అన్నమాటే లేదు. ఎంతసేపూ కమిషన్ కు, తన సహోద్యోగులకు మేలు చెయ్యాలని తప్ప. ఆయన కోర్ అకడమిక్ వ్యక్తి. నిశితమైన పరిజ్ఞానం, విస్తృతమైన అధ్యయనం ఆయన సొంతం.

ఆ సమయంలో విదేశాల నుంచి అతిథులు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, ప్రభుత్వేతర సంస్థలు, ఎయిడ్ ఇచ్చే సంస్థల ప్రతినిధులు ఎంతోమంది ఆయన ఆహ్వానం మేరకు వచ్చేవారు. మేధావులు, పండితులు ఏం కోరుతున్నారో, వారి ఆలోచనలు సాకారం కావడానికి ఆయన ఎంత దూరమైనా వెళ్లేవారు. వారు అడిగిన సమాచారం ఇవ్వడానికి, వారి ఆలోచన విస్తృతం కావడానికి సహకరించేవారు. దానికి ప్రతిఫలంగా ఆయన ఇక్కడ వారిని అక్కడకు పంపడానికి, స్కాలర్ షిప్పులు, స్టడీ టూర్లు వంటివాటికి తగిన ఏర్పాట్లు కావాలని మాత్రమే అడిగేవారు. ఆయన చొరవ వల్లనే ఆనాడు ఎంతోమంది అధికారులు అమెరికాలోని ఐవీ లీగ్ యూనివర్సిటీలకు వెళ్లగలిగారు.

తార్లోక్ సింగ్ రోజులో ఎక్కువసేపు – దాదాపు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పది దాటేవరకూ పనిచేస్తూనే ఉండేవారు. రాత్రి భోజనం ఇంటి నుంచి వచ్చేది, దాన్ని ఆయన ఆఫీసులోనే తినేసేవారు. తనతో పనిచేసేవారు కూడా అదే తరహాలో పనిచెయ్యాలని కోరుకునేవారు. కొందరు అధికారులు అలా చెయ్యలేక, సాయంత్రం ఆట సినిమాకు వెళ్లి మళ్లీ ఆఫీసుకు వచ్చేసేవారు, వాళ్లను చూసి పొద్దుపోయేవరకూ పనిలో ఉన్నారనుకుని ఆయన సంతోషించేవారు. ఒక శ్రేయోభిలాషిగా ఎంత మేలు చేసినప్పటికీ కొందరు మాత్రం ఆయన పట్ల కృతజ్ఞులై ఉండేవారు కాదు. పైగా ఆయన్ని దారుణంగా విమర్శించేవారు. ‘ఉపకారికి అపకారము..’ అన్నట్టుగానే మెలిగేవారు.

ఆయన ప్లానింగ్ కమిషన్ మెంబర్ అయినప్పుడు ఐసిఎస్ లో ఆయన సహోద్యోగులు అసూయతో నిండిన వ్యాఖ్యలు చేశారు. అప్పటి ప్లానింగ్ కమిషన్ సెక్రటరీ, ఆయనే కేబినెట్ సెక్రటరీ కూడా, ఆయన రాజీనామా చేశారు. తార్లోక్ సింగ్ తన జూనియర్ అని, తనకు రాకుండా అతనికెలా ఇస్తారని ఆయన అలక. ఇండియాలో కేస్ట్ సిస్టమ్ ఎలాంటిదో సివిల్ సర్వీసు కూడా అలాంటిదే. దానిలోనుంచి సుపీరియారిటీ, సీనియారిటీ విడదియ్యలేం. వాటిని ఉల్లంఘిస్తే నిరసన సెగలు తగలక తప్పవు. కాని ఆ సెగలేవీ ప్రధానమంత్రిని కదిలించలేదు, తార్లోక్ సింగ్ నిబద్ధత, అంకితభావం తెలుసుగనక ప్రధాని ఆయనను ప్లానింగ్ కమిషన్ మెంబర్ చేశారు.

తార్లోక్ సింగ్ ఆధ్వర్యంలో పెర్ఫార్మెన్స్ బడ్జెటింగ్ యూనిట్ – ఈ దేశ నేపధ్యాన్ని అధ్యయనం చేసి దానికి తగిన సూత్రాలను కనుక్కోవడం మీద దృష్టిపెట్టింది. ఇక్కడి అవసరాలు ప్రత్యేకమైనవి. దానికి తగినట్టు సిస్టమ్ లో అనేక మార్పుచేర్పులు చేశారు. అప్పటికే పాతుకుపోయిన పనికిమాలిన పద్ధతులను వదిలించుకోవాలన్న అవగాహన అనేకమందిలో పెరిగింది. అటువంటి అవగాహన వస్తుందని మేమెవ్వరం ఊహించలేదు. అందువల్ల ఈ మార్పు మాలో ఆశ్చర్యాన్ని, మరింత ఉత్సాహాన్ని నింపింది. ఆ ఉత్సాహంలో ఇంకా ఎక్కువ పని చేసి తార్లోక్ సింగ్ ఈ యూనిట్ ద్వారా ఊహించిన ఉదాత్త లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రమించేవాళ్లం.

సామాజికపరంగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు శ్రీకారం చుట్టిన కొన్ని సంస్కరణలను దగ్గర్నుంచి గమనించే అవకాశం మాకీ పనిలోనే కలిగింది.

రాజస్థాన్ రాష్ట్రంలో యంత్ర సహాయంతో నడిచే ఒక వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించడానికి సూరత్ ఘర్ అనే ఊరికి వెళ్లాం. అక్కడి ప్రభుత్వ అతిథి గృహంలో మా బస. దైనందిన కార్యకలాపాల్లో మా బాగోగులు చూసుకోవడానికి, సాయం చెయ్యడానికి ఒక యువకుణ్ని నియమించారు. అతను మమ్మల్ని నీడలా వెన్నంటి ఉండి మాకేం కావాలో తరచూ కనుక్కునేవాడు. రోజంతా వరండాలో కూర్చుని, రాత్రి మేం చెప్పాకే అక్కణ్నుంచి కదిలి ఇంటికి వెళ్లేవాడు. మా బస, పని అయిపోయే తరుణంలో ఆ క్షేత్రానికి సూపరింటెండెంట్ వచ్చి మమ్మల్ని ఆ యువకుడి పనితీరు బాగుందా అని, అతని సేవ సంతృప్తికరంగా ఉందా అని అడిగాడు. సాధారణంగా సీనియర్ అధికారులు అటువంటి ప్రశ్నలు అడగరు. మేం ఆ యువకుడి వినయశీలతను ప్రశంసిస్తూనే ‘ఎందుకలా అడుగుతున్నారు’ అని అడిగాం.

మాకు సేవలందించిన యువకుడు ఒక హత్య కేసులో నిందితుడు. జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నవాడు. శిక్షా స్మృతి కేవలం శిక్షించడానికే కాదని, పరివర్తన తీసుకురావాలని ఆశించేవారిలో అప్పటి ముఖ్యమంత్రి మోహన్ లాల్ సుఖాడియా ఒకరు. ఆయన స్వయంగా బ్రిటిష్ వారి హయాంలో రాజకీయ ఖైదీగా ఉండేవారు. అందుకే ఆయన సానుభూతితో ఖైదీలు తమ కుటుంబాలతో ఉంటూనే ఉపాధి పొందగలిగే మార్గాలను అన్వేషించేవారు. దానిలో భాగమే ఈ ప్రయోగం. అప్పట్లో ‘దో ఆంఖే బారా హాత్’ అనే హిందీ సినిమా కూడా ఇటువంటి స్ఫూర్తితోనే వచ్చింది.

కాని ఆ విషయం మాకు ముందే తెలిసుంటే ఆ యువకుడి విషయంలో మా ఆలోచన, ప్రవర్తన ఎలా ఉండేదో మరి. అలా తెలియజెయ్యకుండా మేం అతని ప్రవర్తనను నిష్పాక్షికంగా బేరీజు వేసే అవకాశం ఇచ్చారు. అటువంటి వినూత్నమైన మంచి కార్యక్రమాలకు తగినంత ప్రచారం, శ్రద్ధ లభించకపోవడం శోచనీయం.

*****

ఇండియన్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను సంస్కరించాలన్న మా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. కాని అది ఎకానమీ అల్లకల్లోలంగా ఉన్న సమయం. విదేశీ మారక ద్రవ్య కొరత కొనసాగుతోంది. విదేశీ సాయం మీద ఆధారపడటం ఎక్కువ అవుతూ వచ్చింది. ఎంతంటే దాదాపు ప్రతియేడూ ఆర్థికమంత్రి భిక్షాపాత్ర పట్టుకుని ప్రపంచబ్యాంకు నిర్వహణలో ఉండే ఎయిడ్ కన్సార్షియమ్ ముందు మోకరిల్లక తప్పని పరిస్థితి. ప్రభుత్వ దుస్థితిని వివరిస్తూ మరింత సాయం కోసం అభ్యర్థించేవారు.

1966లో విదేశీ మారక ద్రవ్య విలువ పెంచడం అనే సమస్య ప్రముఖంగా ముందుకు వచ్చింది. అప్పుడే ప్రపంచ బ్యాంకు మిషన్ (దానికి నాయకత్వం వహించిన వ్యక్తి పేరు మీద బెల్ మిషన్ అనేవారు) వచ్చింది. అది విలువను వెంటనే తగ్గించాలని వాదించింది. దానిపైన భారతీయ వర్గాల్లో భేదాభిప్రాయాలు ఉండేవి. ఎక్కువమంది అధికారులు విలువ తగ్గింపు సరైనదే అని, కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు ముఖ్యంగా ఆర్థిక మంత్రి కూడా ఆ అవసరం లేదని ఆక్షేపించేవారు. వాళ్ల ఉద్దేశం – మారకం రేటు పెంచితే ధరలన్నీ పెరిగిపోతాయని, పేదలకు కీడు జరుగుతుందని. కాని ప్రభుత్వం బెల్ మిషన్ నివేదికను బహిర్గతం చెయ్యలేదు. దాంతో అందులోని సిఫార్సులేమిటో జనతకు తెలియలేదు. దాంతో ఆ వాదనలకు తెరపడింది. చివర్లో దాతల ఒత్తిడి పెరిగింది. ఇండియన్ రుపీ విలువ తగ్గించారు. 1966 జూన్ 6న జరిగింది అదే. ఆ తేదీయే ఎందుకని ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్ బి.కె. మదన్ ను అడిగాను. అది టాక్స్ ఇయర్ కు మధ్య రోజు, గుర్తుంచుకోవడం సులభమని చెప్పారు.

ఏదేమైనా రూపాయి విలువను తగ్గించడం అనేది ఎక్కువమందికి చేదు అనుభవం, మింగుడు పడనిది. భారతీయ శాసనాల రూపకల్పనలో విదేశీ దాతల పాత్ర ఎంత ప్రముఖమైనదో, ఎలా పెరుగుతోందో అది కళ్లకు కట్టింది.

ఇదే సమయంలో నాలుగో పంచవర్ష ప్రణాళిక రూపొందుతోంది. దానిలో విదేశీ సాయం, రుణాల అవసరం అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఈలోగా దాతలు పాలనా వ్యవస్థలో సంస్కరణలు రావాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచారు. వాళ్ల ఉద్దేశం ప్రకారం అభివృద్ధికి అడ్డుగోడగా నిలబడుతున్నది నాటి పాలనా వ్యవస్థే. అది ఒకనాటి విదేశీ వ్యాపార సంస్థ లక్ష్యాలను సాధించడం కోసం రూపొందినది. మరో వందేళ్లకు రాణి పాలనకు ఉపకరణంగా మారింది. స్వాతంత్ర్యం తర్వాత కొన్ని మార్పులైతే జరిగాయి. కాని అవి దీర్ఘకాలిక పక్రియలకు, సంక్లిష్టతకు, నిబంధనల చట్రంలో బందీ అయిన ఒక ఏకకేంద్రక వ్యవస్థకు దారితీశాయి. ఆ రకంగా అవి ఆర్థిక ప్రగతికి అడ్డంకులుగా మారాయన్నది వారి అభిప్రాయం.

ధనిక వర్గం ఏర్పడకుండా ఆపాల్సిన వ్యవస్థలే, వాటిలోని లోపాల కారణంగా అది బలపడేలా చేశాయి. ఇప్పుడు వారికి ప్రభుత్వ యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా వాడుకోవడం ఎలానో తెలుసు, అభివృద్ధి నిధులను తమ సొంత అభివృద్ధి కోసం స్వాహా చెయ్యడం ఎలానో తెలుసు. పన్నుల వ్యవస్థలో అధికారులకు అపారదర్శకమైన విచక్షణాధికారాలు ఉండేవి. దాంతో వారు తమకు కావలసినవారికి సంపదను పోగుచేసుకోవడానికి మార్గం సులువు చేసేవారు.

చాలా అంశాల్లో నిర్ణయాధికారం రాష్ట్రాలకు ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు తలపోసినా, స్వాతంత్య్రం వచ్చిన రెండు దశాబ్దాలలోనే కేంద్ర – రాష్ట్ర సంబంధాలు తారుమారయ్యాయి. రాష్ట్రాలు కేంద్రానికి కేవలం అనుబంధ అంగాలుగా లేదా కొనసాగింపు (ఎక్స్ టెన్షన్)గానో అయిపోయాయి, అధికారం కేంద్రీకృతం అయిపోయింది.

ఆర్థికపరమైన ఒడుదొడుకులకు తట్టుకొనే మంచి జీతభత్యాలు, భద్రతనిచ్చే పెన్షన్లు, ఇంకా ఎన్నో ప్రయోజనాలు, చౌకగా లభించే గొప్ప బంగళాలు (గృహవసతి), వైద్య సేవలు – సివిల్ సర్వీసు అధికారులను ఒక ప్రత్యేక వర్గంగా తీర్చిదిద్దాయి. తమ అధికారం, ప్రయోజనాలను కాపాడుకోవడం మాత్రమే వారి దృష్టిగా ఉండేది. నిబంధనలు పెరుగుతున్నకొద్దీ సామాజిక ప్రయోజనాలు పెరగలేదు, ఈ సర్వీసు అధికారుల ప్రయోజనాలే పెరిగాయి. పూర్వ ఉదాహరణలు ఉన్న ప్రతిదీ ఆమోదయోగ్యం, అలాకాకుంటే దాన్ని పెండింగ్ లో ఉంచాలి, రిస్కు తీసుకోకూడదు – ఈ ధోరణి వల్ల ప్రయోజనం కన్న ప్రక్రియే ముఖ్యమై కూర్చుంది. అది అలాగే కొనసాగించడం ప్రమాదకరమని, ఎక్కడో ఒకచోట దానికి చుక్క పెట్టాలని భావించినవారు కొందరే.

సంస్కరణలు తీసుకురావాలంటే ప్రభుత్వానికి చిటికెలో పని. కాని అది అమెరికాలో ఏర్పడిన హూవర్ కమిషన్ (1949, 1955) స్ఫూర్తితో ఇక్కడ అడ్మనిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ (ఎ.ఆర్.సి.)ని నియమించింది. దానికి మొరార్జీ దేశాయ్ ఛైర్మన్. ఆయన మధ్యలో వదిలి వెళ్లిపోతే, మైసూరు రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి ఛైర్మన్ అయ్యారు. ఇంకొందరు ప్రముఖులు సభ్యులు. దీనికి విస్తృతమైన పరిధి, బడ్జెట్ లభించింది. రక్షణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, పోలీసు వ్యవస్థలు తప్ప ప్రభుత్వంలో అన్ని అంశాలను పరిశీలించడం, అవినీతి, ప్రణాళిక యంత్రాంగం, ఎకనామిక్ ఇంకా ఫైనాన్సియల్ అడ్మినిస్ట్రేషన్, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ మెంటును సమీక్షించే అధికారం ఎ.ఆర్.సి.కి కట్టబెట్టారు.

ఎ.ఆర్.సి. కొన్ని స్టడీ గ్రూప్స్, వర్కింగ్ గ్రూప్స్ ను నియమించింది. ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం, సమస్యలేమిటి, పరిష్కారాలేమిటి అన్నది కనుక్కోవడానికి అవి పనిచేస్తాయి. వాటి నివేదికలు, సూచనలను కమిషన్ పరిశీలిస్తుంది, తుది నివేదిక ప్రభుత్వానికి ఇస్తుంది. ఏదో ఒక నివేదికగాక, హూవర్ కమిషన్ లాగా కొన్ని వరుస నివేదికలను ఇవ్వాలని ఎ.ఆర్.సి. సంకల్పించింది. ఈ బృందాల్లోకి వివిధ రంగాలకు చెందిన నిపుణులైన వ్యక్తులు అవసరమయ్యారు. రిటైరైన సివిల్ సర్వెంట్లూ అందులో భాగమయ్యారు. పూర్వ అనుభవం, ఇప్పటి దూరం వల్ల వారు నిర్మాణాత్మకమైన సూచనలు అందిస్తారని ఆశ.

ప్లానింగ్ కమిషన్ లో పనిచేస్తున్న మావంటివారికి ఎ.ఆర్.సి. అనేది దేవుడిచ్చిన అవకాశంలాగా అనిపించింది. మా అభిప్రాయాలను చెప్పడానికి తగిన వేదిక దొరికిందని సంతోషం. శక్తిమంతమైన, సమర్థులైన సభ్యులున్న కమిషన్ ముందు మా ప్రతిపాదనలు పెట్టగలమని భావించాం. ఇదే ఉద్దేశంతో నేను ఎ.ఆర్.సి. మెంబర్ సెక్రటరీ వి.వి.చారిగారిని వెళ్లి కలిశాను.

చారిగారి ఇన్ కమ్ టాక్స్ ఉన్నతాధికారి. ఆ సబ్జెక్టులో ఆయన నిపుణుడు. ఎ.ఆర్.సి.లో పనిచెయ్యడమంటే ఆయన అనుభవాన్ని మించి, మొత్తం వ్యవస్థ ప్రక్షాళనకు నడుం బిగించాల్సిన పరిస్థితి. మేం ఏ పని చేస్తున్నామో, అది ఆయన పనికి ఎలా ఉపయుక్తమో నేనాయనకు వివరించాను. మొదట్లో ఆయన అంత సుముఖత చూపించలేదు. పైగా ఆ సబ్జెక్టు పట్ల అనుమానాలను వ్యక్తం చేస్తూ ‘తాజ్ మహల్ ఉందికదా, దానికి పెర్ఫార్మెన్స్ బడ్జెటింగ్ ఎలా చేస్తారు?’ అని అడిగారు. దానికి నేను చెప్పిన సమాధానం ఆయనకు రుచించలేదు. మా తొలి సమావేశం చప్పగా ముగిసింది. కాని త్వరలోనే అది మంచి మలుపు తిరిగింది, వ్యక్తులుగా మా మధ్యన, సంస్థలుగా కమిషన్ కు పెర్ఫార్మెన్స్ బడ్జెటింగ్ యూనిట్ కు మధ్య కూడా నిర్మాణాత్మకమైన చక్కని సహకార సంబంధంగా పరిణమించింది.

*****

 

నా ఆఫీసుకు తిరిగి వచ్చాక నేనొక పెద్ద మెమొరాండమ్ తయారీ మొదలుపెట్టాను. ఎ.ఆర్.సి. అజెండా ఎలా ఉండాలని అనుకున్నామో, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో ఏయే అంశాలను పరిష్కరించాలో వాటన్నిటినీ గుదిగుచ్చాను. వి.వి.చారి స్పందన చూశానుగనక ఆయన కనీసం దీన్ని చదువుతారని కూడా అనుకోలేదు. అందువల్ల ముందుజాగ్రత్త చర్యగా నేను ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీకి పంపాను. ‘టువర్డ్స్ ఎ ఫంక్షనల్ బడ్జెట్’ శీర్షికతో నా పేరు మీద అది రెండు భాగాలుగా ప్రచురించింది.

అది చదివిన వి.వి.చారి నన్ను మళ్లీ కలవమని పిలిచారు, ఎ.ఆర్.సి.లో ఉద్యోగంలో చేరమంటూ చెప్పారు. నేను ధన్యవాదాలు తెలుపుతూనే దాన్ని నిరాకరించాను. అందులో ఉద్యోగిగా చేరితే నా స్వాతంత్య్రం పోతుందని, మరోవైపు ఆర్థికంగానూ ఇబ్బందని తెలియజేశాను. దాంతో మేం పరస్పర సహకారానికి నాంది పలికాం. ఆయన ఆధ్వర్యంలో రూపొందించిన నివేదికలను నాకిస్తారు, నేను నా కామెంట్లను వారికి అందజేస్తాను. ఇదీ మా ఏర్పాటు.

ఆ తర్వాత ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ మీద పనిచెయ్యాల్సిన వర్కింగ్ కమిటీలో సభ్యుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఇక్కడా నాకు పుల్లవిరుపులు ఎదురయ్యాయి. ‘అంత జూనియర్ ఎందుకు వర్కింగ్ కమిటీలో’ అని స్టాఫ్ గుసగుసలాడుకున్నారట.

నాకది వింతగానే అనిపించింది. నా టెక్నికల్ ఇన్పుట్లను స్వీకరించడానికి కమిషన్ సిద్ధంగా ఉందిగాని ఏ హోదాలేని ఒక మామూలు వర్కింగ్ గ్రూపులో సభ్యుడిగా తీసుకోవడానికి మాత్రం అభ్యంతరాలు! ఈ వాదాలను కొనసాగించకుండా, నన్ను వర్కింగ్ గ్రూపులో సభ్యుణ్ని చేశారు చారి.

యూనిట్ లో అది మాకు ఉత్సాహకరమైన కాలం. మాలో ఉన్న ఆలోచనలు చెబితే వినే శ్రోతలు దొరికారు. కొన్నిటిని ఆమోదించారు. కొన్నిటిని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆమోదించకపోయినా, మా ప్రయత్నమంతా ఒక కొత్త పద్ధతిలో దాని పాత్రను బలపరిచేందుకేనని తర్వాత తెలుసుకున్నారు.

ఇలాంటి సహకారం ఆఫీస్ ఆఫ్ ద కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి కూడా లభించింది. ఆయన ప్రతినిధిగా వచ్చిన పెద్దమనిషి వ్యవస్థలో మార్పు తీసుకురావడం ఎంత కష్టమో మాకు వివరిస్తూ ఉండేవారు. ఉన్నదాన్ని ఉండనివ్వాలని ఆయన నూరిపోసేవారు. కాని ఒక స్టడీ గ్రూప్ ఛైర్మన్ గా ఉన్న ఎస్.రత్నం ఆ పెద్దమనిషిని మార్పు దిశగా ఒప్పించి సూచనలను పాటించేలా చూశారు.

చారి మా అభిప్రాయాలకు విలువనిచ్చేవారు, ఏకీభవించేవారు. విదేశీ సంస్థల నిధుల వినియోగం ఆలస్యమవుతుండటంపై విడిగా ఒక స్టడీ నిర్వహించమని ఎ.ఆర్.సి. నన్ను నియోగించింది.

ఈ క్రమంలో నాకు వి.వి.చారి వ్యక్తిగత జీవితం కొంత తెలిసింది. ఆయన, భార్య జిడ్డు కృష్ణమూర్తి భక్తులు. ఆయన పుస్తకాలన్నీ పూర్తిగా నమిలి మింగేశారు. ఆయన మాటలు వారికి కంఠస్తం. ఎంతగానంటే ప్రసంగాల్లో ఆయన తర్వాత ఏం చెబుతారో, వీరు ముందే చెప్పేసేవారు. అప్పట్లో జె. కె. విదేశాల్లో నివసిస్తూ, చలికాలంలో ఢిల్లీ వంటి కొన్ని నగరాలకు వచ్చి ప్రవచనాలు చెప్పి వెళ్లిపోయేవారు. ఆయన పుస్తకాలు కొన్ని అప్పటికే చదివి ఉన్నా, నాకేమీ అర్థం కాలేదు. చారి కోరిక మేరకు నేను కొన్ని ప్రసంగాలకు హాజరయ్యాను.కాని నా జ్ఞానం ఏమీ పెరగలేదు. ఆయనలో వ్యతిరేక భావనల మిశ్రమం ఉండేదని నా భావన. ఆయన అవివాహితుడు, మహిళలకు గొప్ప ఆకర్షణీయంగా ఉండేవాడు. ఎక్కువమంది ఆయనకోసం అర్రులు చాచేవారు. అయితే నా భావాలన్నీ నాలోనే ఉంచుకునేవాణ్ని తప్ప చారిగారితో ఏమీ అనేవాణ్ని కాదు. ఎందుకంటే వారు ఆయనలో ఏ లోపాన్నీ చూడలేరని నాకు తెలుసు. కొన్ని దశాబ్దాల తర్వాత పపుల్ జయకర్, మరో అమ్మాయి జె.కె.పై రాసిన పుస్తకాలు చదివాను. ఆమె తాను జె.కె. కూతుర్ననే చెప్పుకుంది. నా అనుమానాలన్నీ నిజమని అర్థమైంది. జె.కె. మనందరి వంటి మానవుడే. భయాలు, సంకోచాలు ఆయనకూ ఉన్నాయి. కాని జనాలు ఆయనకు దైవత్వాన్ని ఆపాదించారు. దైవదూతగా ఆయనేదో సందేశాన్నిస్తారని వారు ఎదురుచూశారు. చారివంటి తిరుగులేని భక్తులు ఆయనకు బోలెడుమంది. వారందరి నమ్మకాన్ని సడలించింది, వంచించింది కృష్ణమూర్తిగారే.

ఎ.ఆర్.సి పని ఎన్నో అంశాలను స్పృశించింది, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ నటిస్తున్న పెను నిద్దర వదిలించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజుగారు ధరించిన దేవతావస్త్రాల ఒట్టి కట్టుకథ అని మార్పు అవసరమని కుండబద్దలు కొట్టింది. కొన్ని సూచనలు వివాదాస్పదమయ్యాయి. అమాత్యుల అవకతవకల మీద ఆరోపణలు విచారించడానికి ఒక అంబుడ్స్ మన్ ఉండాలన్నది అంగీకారమైంది. కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో కొన్ని స్వల్ప మార్పులు వచ్చాయి. పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ లో అదివరకు 1, 2, 3, 4 గా క్లాసులను ఎ, బి, సి, డిలుగా విభజించారు. ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ లో మేం చెప్పిన మార్పులన్నీ ఆమోదయోగ్యమయ్యాయి. నాలుగు దశాబ్దాల తర్వాత చూస్తే, పెర్ఫార్మెన్స్ బడ్జెట్లు అనేవి ఒక రొటీన్ తంతుగా, ప్లాన్ యాక్టివిటీస్ మీద రూపొందించబడుతున్నాయి. వ్యవస్థలో అవి అనుకున్న పాత్ర పోషించలేదు.

ఒక సమతుల దృష్టికోణం కావాలన్న ఉద్దేశంతో నేను ఎకనామిక్ టైమ్స్ లో ‘ఎ.ఆర్.సి. ఇంక్వెస్ట్ ఇంటు ప్లానింగ్ మెషినరి’ అనే శీర్షికతో ఓ వ్యాసం రాశాను. అది కొందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అప్పటి ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ గాడ్గిల్ గారిని. ఆయన దాన్ని తాను కేబినెట్ కు రాసిన నోట్ లో అనుబంధంగా చేర్చారు.

ఇంతచేసీ చివరకు ఏమైందీ అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఒక క్యారికేచర్ లాగా అయింది. భారతీయ పాలన వ్యవస్థమీద తనదైన ముద్రను బలంగా వెయ్యలేకపోయింది. హిందూయిజమ్ లాగా ఆ వ్యవస్థకు తత్కాల బలహీనతలను, ప్రమాదాలను జయించే అపరిమితమైన సామర్థ్యం ఉందని అనుకోవాలంతే.

*****

అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ (ఎ.ఆర్.సి.)లో కొంతకాలమైనా పనిచెయ్యడం నాకు మేలే చేసింది. నా ఉద్యోగపర్వంలో మరో అంకానికి అది తెర లేపింది. ఎ.ఆర్.సి. కోసం చేసిన పని, ఎకనామిక్ టైమ్స్ పత్రికలో ఎక్కువగా ఫెడరల్ ఫైనాన్సు మీద ప్రచురితమైన నా వ్యాసాలు నాకో సమాంతర ప్రపంచాన్ని సృష్టించాయి. వాటివల్ల పారితోషికమూ ముట్టేది, నా ప్రతిభను వినియోగించుకునే అవకాశాలూ లభించేవి. ఉద్యోగంలో మాత్రం, సెక్రటేరియట్ సర్వీసులో కొత్తగా పెట్టిన సీనియారిటీ నిబంధనల వల్ల నేను ప్రగతి చెందడానికి ఉన్న అవకాశాలు చాలా తక్కువ.

షికాగో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఎడ్వర్డ్ షిల్స్ ‘ద ఇండియన్ ఇంటలెక్చువల్స్’ అనే ఒక చిన్న పుస్తకం రాశారు. అప్పట్లో అది వివాదాస్పదమైంది. ఆయన పరిశీలన మేరకు – ‘ఇండియన్ రచయితల్లో చాలామందికి తమ రచనల మీద ఆధారపడి బతికే పరిస్థితి ఉండదు. అందువల్ల వారెంత మేధావులైనా సరే, తమ పరిశోధనను, రచనలనూ పూర్తిస్థాయి వృత్తిగా స్వీకరించలేరు. వారు జీవిక కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎక్కడో చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు’ అని ఆయన రాశాడు. నాదీ అదే పరిస్థితి. ఏదో చేద్దామని ఉన్న ఉద్యోగాన్ని వదులుకోలేం కదా.

కొన్ని ఊహించని సందర్భాల్లో మంచి అవకాశాలు తలుపు తట్టాయి.

ప్లానింగ్ కమిషన్ లో మా బాస్ తార్లోక్ సింగ్ మా పనితో సంతోషంగా ఉండేవారు. ఎ.ఆర్.సి. మా పనిని ఆమోదిస్తున్నందుకు, కేంద్ర ప్రభుత్వం పర్ఫార్మెన్స్ బడ్జెట్ ను అమలుచేస్తుందని ఒప్పుకొన్నందుకు ఆయనకు ఆనందంగా ఉండేది. ఈ విషయాల్లో మేం చేస్తున్న పని ఎకడమిక్ వర్గాల ఆమోదం కూడా పొందితే బాగుండునని అనుకునేవారాయన. దానికోసం నన్ను మూడేళ్ల పాటు పి.హెచ్.డి. చెయ్యడానికి అమెరికాలోని సైరకాస్ యూనివర్సిటీ (మాక్స్ వెల్ స్కూల్) కు పంపాలని ఆలోచించారు. మూడేళ్ల చదువు ఖర్చును భరించాలని యూఎస్ ఎయిడ్ ను సంప్రదించారు.

విశేషం ఏమిటంటే ఆయన ఇలా ప్రతిపాదిస్తున్నట్టు నాతో ఒక్క మాట మాత్రమైనా చెప్పకపోవడం. యూఎస్ ఎయిడ్, సైరకాస్ యూనివర్సిటీ – రెండూ ఆమోదించిన తర్వాత నాకు చెప్పి ఆశ్చర్యపరుద్దామని అనుకున్నట్టున్నారు. కాని సంబంధిత అధికారి నా పుట్టినరోజు, విద్యార్హతలు వంటివి దరఖాస్తు పత్రంలో నమోదు చేసుకోవడానికి పిలిచినప్పుడు నాకు ఇదంతా తెలిసింది! ఆ ప్రయత్నం సఫలమవుతుందా లేదానని కుతూహలంగా ఎదురుచూడటం తప్ప, నేను చెయ్యగలిగినదేముంది?

ఈ సమయంలోనే, ఎకనామిక్స్ టైమ్ ఎడిటర్ డి.కె. రంగ్నేకర్ నన్ను వారి పత్రికలో అసిస్టెంట్ ఎడిటర్ గా తీసుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు తెలియజేశారు. ఉద్యోగం అయితే బొంబాయిలో లేదా ఢిల్లీలో. జర్నలిజంలో ఒక కెరియర్ ను నేనెప్పుడూ ఊహించలేదు. నేనే ప్రయత్నమూ చెయ్యకుండానే వచ్చిన ఆ అవకాశం నన్ను చాలా ఊరించింది, వద్దనడానికి నాకు మనస్కరించలేదు. నేను ఊ కొట్టగానే, ఆయన ఫార్మల్ ఇంటర్వ్యూ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో పడ్డారు. ఎకనామిక్ టైమ్స్ అనేది టైమ్స్ ఆఫ్ ఇండియా వారిదే. బెనెట్ కోల్మాన్ అండ్ కంపెనీ దాన్ని నిర్వహిస్తుంది. దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నన్ను ఢిల్లీలో ఇంటర్వ్యూ చేస్తారని పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూకు ఎందరో అభ్యర్థులు. అందులోనూ అకడమిక్ రంగం నుంచి వచ్చినవారే ఎక్కువ. బోర్డు ఇద్దరిని ఎంపిక చేసింది. ఒకరు అశోక్ దేశాయ్. (అనంతర కాలంలో ఆయన భారత ప్రభుత్వానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా పనిచేశారు) రెండోది నేనే. తర్వాత దశ జీతభత్యాల గురించిన చర్చ. అప్పటికి వేజ్ బోర్డు పాత్రికేయుల జీతాల మీద అధ్యయనం చేస్తోంది.

నేను బొంబాయిలో పనిచెయ్యడానికి సిద్ధంగా ఉండాలని ఎకనామిక్ టైమ్స్ వారు సూచించారు. బొంబాయికి కుటుంబాన్ని మార్చాలన్న ఆలోచన నాకు అంతగా రుచించలేదు. అప్పటికి పదేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నాం. నేనూ, నా కుటుంబం అక్కడ అన్నిటికీ అలవాటు పడ్డాం. పిల్లలిద్దరూ స్కూళ్లలో చేరారు, మా ఆవిడకు హిందీ పూర్తిగా వచ్చింది, తన పనులన్నీ చక్కబెట్టుకోగలుగుతోంది, తెలుగువారేగాకుండా, ఇతరులు కూడా బోలెడుమంది స్నేహితులున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే మాకున్నదానిలో ఏ లోటూ లేకుండా హాయిగానే బతుకుతున్నాం.

బొంబాయికి వెళితే అనేక సవాళ్లు. మంచి ఇల్లు దొరుకుతుందో లేదో! అది ఆఫీసుకు దగ్గర్లో కాకపోతే ఎక్కువ దూరం ప్రయాణం చెయ్యాలి. ప్రతిరోజూ లోకల్ ట్రైన్లలో తిరగడానికే సమయం పోతుంది. ఇవి ఆలోచిస్తే ఆ ఉద్యోగం వద్దనిపించింది. వేరే ఏమీ దొరకకపోతే అప్పుడు దీని సంగతి చూసుకోవచ్చు అనుకున్నాను. ఈ ఊగిసలాటలో ఇంకా ఉండగానే, అస్సలు ఊహించని మూడో అవకాశం నా తలుపు తట్టింది.

ఫోర్డు ఫౌండేషన్ లో పనిచెయ్యడం – ఆ అనుకోని అవకాశం. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు పెర్ఫార్మెన్స్ బడ్జెట్ సిస్టమ్స్ ను ప్రవేశపెట్టేందుకు అవసరమైన సాంకేతిక సాయం అందించడం నా విధి. ఫోర్డ్ ఫౌండేషన్ ఎ.ఆర్.సి. పనిలో పాలు పంచుకుంది, అమెరికా నుంచి నిపుణులను రప్పించడంలో అది కీలకపాత్ర పోషించింది.

అప్పటికే నా స్నేహితుడు, సహోద్యోగి అయిన సతీశ్ సేథ్ మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి మరో పి.హెచ్.డి. సంపాదించి ఉన్నవాడు, అన్ని అర్హతలు ఉండటం మూలాన ఎ.ఆర్.సి. లో ఒక అధికారికి టెక్నికల్ అసిస్టెంట్ గా నియమితుడయ్యాడు. ఆ పనిలో భాగంగా అతను ఇటు ఎ.ఆర్.సి., అటు ఫోర్డ్ ఫౌండేషన్ అధికారులందరితోనూ పరిచయాలు పెంచుకున్నాడు. సతీశ్ కూడా అప్పటికి సెక్రటేరియట్ సర్వీసు వదిలి ఇంకేదైనా దారి చూసుకోవాలన్న ఆలోచనలో ఉండేవాడు. అందువల్ల మేం తరచూ కలుస్తూ మాకున్న అవకాశాలేమిటో చర్చించుకునేవాళ్లం.

(ఇంకా ఉంది)

అనువాదం: అరుణా పప్పు

అరిగపూడి ప్రేమ్ చంద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు