రాగంలో బందీ మా లత అత్తయ్య!

బారెడు జుట్టు, తేనె రోజాపూవులు రంగరించినట్లున్న శరీర కాంతి, కళ్ళలో రెబెల్స్ కు ఉండే మెరుపు..చాలెంజ్ లు చేసే సౌందర్యపు గెలుపు..ఆడ పులిలా లేచి కూర్చుని, అరిచి, ” నా అభిప్రాయమే కరెక్ట్ ” అనే ఆ అందాల రాక్షసి…

“బంధమైనా మోక్షమైనా కేవలం మనసు కారణం గానే ఏర్పడతాయి ” – అమృత బిందు ఉపనిషత్

రాగద్వేషాలు మనిషిని బంధిస్తే అతడు – ‘బద్ధుడు’

అందులోంచి విడివడే టెక్నిక్ తెలిస్తే అతడు ‘బుద్ధుడు’ 

మనిషి మనసును పక్షితో పోలిస్తే దానికి రెండు రెక్కలు రాగద్వేషాలు.  ఇందులో మనకు ‘ద్వేషం’ దాని లక్షణాలతో బయటపడుతుంది.  మనకు నచ్చని వాళ్ళకు వాటిని ఆపాదించి,  ప్రతినాయకత్వాన్ని నిరూపించేందుకు ఇది చాలా ఉపయోగకరం.  ఈ ‘ద్వేషం’ శీర్షిక కింద ఈర్ష్య, అసూయ, ప్రతీకారం, కోపం, మూర్ఖత్వం, అహంకారం …అన్నీ మనకు తెలిసినవే.

 ఇవన్నీ ఎప్పుడూ మన చుట్టూ ఉన్న మనుష్యులలో కనిపిస్తున్నా కూడా, ‘మనలో కూడా ఇవి ఉన్నాయా’ అని ప్రశ్నించుకోకుండా బతికేస్తాము.

కానీ  జీవితం అనుభవజ్ఞానక్షేత్రం.  తెలియచెప్పకుండా అంత త్వరగా వదిలిపెట్టదు.  ఈ గుణాలలో ఏది మనను బాధ పెడుతుందో ఆలోచించుకో అని టెన్షన్ పెడుతుంది.

చిత్తనిరోధమనలేదు…’చిత్తవృత్తినిరోధము’ అంటారు.  యోగం, ధ్యానం వగైరాలతో ఈ చిత్తవృత్తుల్ని కొంతవరకు అదుపాజ్ఞలలోకి తీసుకు రావచ్చు.   

ఇంతవరకు కొంత అర్థమవుతుంది.  రాగద్వేషాలలో ఈ ద్వేషాన్ని రకరకాల పద్ధతులతో అదుపులో ఉంచుకోవాలి -అన్న నీతి పాఠాలు మన చుట్టూ వినిపిస్తూనే ఉంటాయి.

కానీ ఏ స్కూలు లోనూ ఏ విద్యాసంస్థ లోనూ మనకు ‘రాగం’ తెచ్చే ప్రమాదాలను ఎవరూ చెప్పరు. పైగా ఇక్కడ ఏర్పడే బంధాలకు ‘ఆర్ద్రత, కరుణ’ వగైరా మాటలతో పీటముడులు పడిపోవడాన్ని  ఎవరూ గుర్తించకపోగా దీనికి చాలా ‘ఎడిఫికేషన్ ‘ ఎక్కువ.

ఈ రాగం…అంటే ఈ శీర్షిక కింద అనురాగం, మమకారం, అభిమానం, అతిశయం, పౌరుషం..ఇవన్నీ చలామణి అయిపోతూ ఉంటాయి.  అన్నింటిలోకీ మాయ ఏమిటంటే- ఇవన్నీ చాలా అద్భుతమైన ఆదర్శవంతమైన  గుణాలుగా, మనిషికి ఒక రకమైన ప్రత్యేకతను, గౌరవాన్ని ఇచ్చే గుణాలుగా పేరు పొందాయి.

ఇవి ఒక ఎమోషనల్ బాక్ డ్రాప్ కింద చలామణి అయిపోయే కవులు, రచయితలు, కళాకారులు, ఉద్యమకారులు – ఈ ‘రాగం’ కు చాలా ముఖ్యత్వం ఇవ్వడం వలన దీనికి ప్రత్యేకమైన ‘ముద్ర’ పడింది.  విపరీతమైన ఇష్టం, ఒదులుకోలేని వ్యామోహం, అంతుపట్టని అభిజాత్యం.. ”నా ఫీలింగ్, నా కన్నీళ్ళు – ఇవి ప్రపంచానికి ఎందుకు అర్థం కావు? నా బాధ గుర్తించరేం?! ” అన్న రాగయుక్తమైన ఆక్రోశం, అక్షరాలలో బంధించిన శోకం చాలా గౌరవాన్ని సంతరించుకుంటుంది.

ఎప్పుడో ఎక్కడో నాలుగు అడుగులు కనబడి , దారిలో ఏ గురువు ద్వారానో దిశానిర్దేశం జరిగే జ్ఞాన క్షేత్రమో, పద్ధతో – ఈ పొరలు చీల్చి ‘ నీ ‘ తో సంబంధం చెబితే ఏమోగాని, మామూలు మనిషికి ఇది సుసాధ్యం అయేటంత ‘జ్ఞానావిష్కరణ మహోత్సవాని’ కి ఈ సంఘం లో మర్యాద లేదు.

ఏ అనుబంధమో చిక్కుముడిలో చిక్కుకుని మనసు మెలికలు తిరిగినప్పుడు,  కాసేపు – ”ఏ బంధం శాశ్వతం కాదు” అని కుక్క, బాటిల్, దేవదాసు – ఈ సీన్ చూస్తాము కాని అది ఒడ్డున కూర్చుని సముద్రస్నానం చేయటమే.

 

మా నాన్నగారు శ్రీ గాలి బాలసుందరరావు గారు, మా మేనత్త తెన్నేటి హేమలత [లత గారు ] అన్నా చెల్లెళ్ళు( అక్కచెల్లెళ్ళ పిల్లలు). పెళ్ళైన పదేళ్ళదాకా పిల్లలు లేకపోవడం వలన ఆవిడను అమ్మా నాన్నా బాగా ముద్దు చేసేవారట.  తనకు ఏ ఎమోషన్ అయినా బైటపెట్టెయ్యడం అలవాటు.

ఆవిడకూ  నాకూ దాదాపు పన్నెండేళ్ళు తేడా!  నాకు మూడున్నర ఏళ్ళకే అమ్మపోవడం తో నన్ను నాన్న, మా బామ్మలు, బంధువులు, మా వీనస్ క్లినిక్ నర్సులు జూలీ, ఎమిలీ – వీరంతా ముద్దుగా చూడడం తనకు నచ్చేది కాదేమో …

ఎనిమిదేళ్ళకే పెళ్ళి అయి, పద్దెనిమిదేళ్ళకే భర్తకు పక్షవాతం వచ్చిన హేమత్తయ్యకు నన్ను చూస్తే జెలసీ…ముఖ్యంగా నాన్న నన్ను ముద్దుగా చూస్తారని.  

” నీవి పిల్లి కళ్ళు, నీ గొంతు మొగ గొంతు, నీది రాగి జుట్టు, నువ్వు రాక్షసి పిల్లవి ” – ఇట్లా ఏడిపించి నా పదేళ్ళ వయసులోపల ఎంత కాంప్లెక్స్ తెప్పించిందో మహాతల్లి …

ఆవిడ చెప్పినమాట వినదు, అన్నిటినీ ప్రశ్నిస్తుంది కాబట్టి  ”అత్తయ్య చెడ్డపిల్ల , దాని దగ్గరకు పోకు ” అని భయపెట్టేవాళ్ళు సో కాల్డ్ పెద్దవాళ్ళు.  నాకూ ఆవిడంటే కోపమే కాబట్టి ‘ నిజమే ‘ అనిపించేది.  నాన్న, అత్తయ్య చెస్ ఆడుతుంటే వెళ్ళి అట్ట మూసేసి కాయిన్లు కిందపడెయ్యడం..ఆవిడకు ఇష్టమైన రోజాపూవు కోసెయ్యడం…బలహీనం గా ఉండే నేను ఇలా కచ్చ తీర్చుకునేదాన్ని.  కోపం వచ్చి మొట్టికాయ వేసేది – ఇంకా సంపూర్ణంగా ఎదగని ఆ టీనేజర్. ..కానీ ఆవిడ పెళ్ళైన ఇల్లాలు, నేను చిన్నపిల్లని – అన్న సోకాల్డ్ ‘లా’ వల్ల నేను తప్పించుకునేదాన్ని.

ఆవిడ స్వతహాగా ఏమిటో తెలిసేలోపలే , ఆవిడను ‘రెబెల్’ గా తయారు చేశారు. ఆవిడ తనకు తోచిందే చేసేది- భయమో , భక్తో, ఆరాధనో,మొదట్లో నాన్న అంటే ఉండేది.

”మీ అన్నయ్యకు ఏమిటి ఇష్టం ? ” అని అడిగితే-

” చక్కనిచుక్కలు

పూలమొక్కలు

గులాబీ రెక్కలు”

అని ఇంకా ఏవో గబ గబా చెప్పేప్పటికి శ్రీ నార్ల వెంకటేశ్వర రావు గారు (నాన్నకు మంచి స్నేహితులు వారు  ) ముచ్చటపడిపోయి ఆవిడ చేత ‘కాలమ్’ రాయించారట.

అదే కొన్ని సంవత్సరాలు ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూపిన ‘ఊహాగానం.’ 

 

ఆ తరవాత తరవాత…ఎదుగుతూ ఉండగా , నాకు అత్తయ్య అక్షరాల వెనకాల భాషాసౌందర్యం, భావన, వేదన, హెచ్చరిక ..ఇలా చాలా అర్థమవడం ప్రారంభమయ్యాయి.

నా టీనేజ్ లో అర్థరాత్రి దాకా ఈ అన్నా చెల్లెళ్ళ సంభాషణలు…నవలల మీద, పాత్ర చిత్రీకరణల మీద తర్కాలు,  ఔచిత్యాలు – ఎక్కడ రచయిత పరకాయప్రవేశం చెయ్యగలడో ఎక్కడ ఫోర్త్ డైమెన్షన్ నుంచి విశ్లేషణ చెయ్యగలడో…ఎక్కడ రచయిత ‘సెల్ఫ్’ తొంగిచూడగానే నిప్పురవ్వల పందిరి సౌందర్యం నీరు కారిపోతుందో ?!

ఇలా మాటల యుద్ధాలు, పిల్లో ఫైట్ లు, మధ్యలో ఇరానీ చాయ్, పచ్చిమిరపకాయ బజ్జీలు…

మంచం మీద నాన్న పడుకునేవారు..చాప మీద అత్తయ్య..బారెడు జుట్టు, తేనె రోజాపూవులు రంగరించినట్లున్న శరీర కాంతి, కళ్ళలో రెబెల్స్ కు ఉండే మెరుపు..చాలెంజ్ లు చేసే సౌందర్యపు గెలుపు..ఆడ పులిలా లేచి కూర్చుని, అరిచి, ” నా అభిప్రాయమే కరెక్ట్ ” అనే ఆ అందాల రాక్షసి…

నాన్నకు ఆవిడంటే ముచ్చట, ప్రేమ, అభిమానం…ఎక్కడో ‘నేను అన్నను, తెలిసినవాడిని’ అన్న అహం..చెప్పినమాట వినదన్న కోపం ఇచ్చే పెద్దరికం, ఆ పిల్ల మంచి తనకు తెలియదన్న బాధ.

ఆవిడకు జరిగిన మొదటి గుర్తింపు –

రోజా పూవుల మాల, అవార్డు నాన్నకు ఇచ్చి దణ్ణం పెడితే…

” ఏమిటీ చెక్కముక్క…అవార్డా  ?! ఓహో ..” అని ఏడిపిస్తే ” మీ నాన్నకు నేనంటే అసూయే ” అని చిలిపిగా అరిచి పారిపోయే ఆ అద్భుతమైన రచయిత్రి…” సాహితీవనం లో లత ను నాటిన అన్నయ్య గాలి బాలసుందరరావుకు అంకితం ” అని ‘ఎడారిపూలు’ అంకితమిచ్చిన నా అత్తయ్య.

ఆవిడ లాంటి అద్భుతమైన రచయితలు, కళాకారులు, హాయిగా వెన్నెలలో మల్లెపూవుల్లా ఉండవలసినవారు – ఈ ‘ రాగం ‘ అనే భావనలో తగులుకు తమను తాము కట్టేసుకుని, దాని గుబాళింపు లాంటి మత్తుకు లొంగిపోయి..అదిచ్చే ప్రత్యేకతకూ ఆ కొత్తరకపు అనుభవాలకూ చలించిపోయి -ఎక్కడ ఎక్కవలసిన రైలు మిస్ అయిపోతారు ?!

అక్షరవేదాంతం అనుభవవేదాంతం గా మారిపోతే భావుకత పారిపోతుందనో,  ‘రాగం’ అనే బంగారుసంకెళ్ళకు బందీ అయిపోయి, రాజ్ఞీత్వపు మేలిముసుగులోంచి  ఆ సంకెళ్ళ చాయలు కనబడిపోతాయని భయపడిపోతూ…చివరి క్షణం వరకూ చలించిపోయిన నా అత్తయ్య లాంటి బందీలు – అపురూపమైన కళాకారులు ఎంతమందో?!

అందుకే “Badness is iron chains and goodness is gold chains . But finally they are ‘chains.’  They bind you and restrict you.”

అని శ్రీ వివేకానందుల వారు హెచ్చరిస్తే, ఆ మాటలు ఈ రాగద్వేషాలతో సమన్వయం అయిపోతాయి అనిపిస్తుంది.

జలంధర

కేవలం ఒక వాక్యంలో వొదగని అనుభవ విస్తృతితో రాస్తారు జలంధర. తెలుగు మాటలకు "పున్నాగ పూల" తావిని అద్దిన వారు. జీవితాన్ని జీవితంతోనే వ్యాఖ్యానించాలన్న సహజ సౌందర్య జిజ్ఞాసి.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అమ్మా! మీ రచనల బాట నిత్యజీవితంలోంచి తత్వం లోకి మళ్ళించే చక్కని దగ్గరదారి.(షార్ట్కట్). కృతజ్ఞతాపూర్వక అభివాదములు…

  • జలంధ రా మాడం నా కెంతో ఇష్టమైన రచయత్రి లత గారి గురుంచి ఇంత బాగా విశ్లేషణ చేస్తూ రాసినందుకు ధన్యవాదాలు ఆమె గురుంచి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనే ఉత్సుకతో ఎదురు చూస్తూ … మీ అభిమాని మణి వడ్లమాని

  • అమ్మా జలంధర గారు, మీ ఈ సంచిక “అనుసంధానం” ఎన్ని సార్లు చదివినా తనివి తీరడంలేదు.
    లత గారి ‘రామాయణ విషవృక్షఖండన’ … రంగనాయకమ్మ, కొకు నాయన, శ్రీశ్రీ ల సంవాదనల
    ప్రస్తావన గురించి కూడా రాస్తారు కదూ.

    “లత – తెలుగు సాహిత్య చరిత్రలో ఒక ప్రభంజనం” ~ నిడదవోలు మాలతి

    https://tethulika.wordpress.com/2010/01/11/%e0%b0%b2%e0%b0%a4-%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81%e0%b0%b8%e0%b0%be%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/

  • ఎంత అద్భుతంగా చెప్పారు. మీరిద్దరూ పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటున్న మా అమ్మవలన…మీ రచనల ద్వారా మాకు సుపరిచితులే చిన్నప్పటినుంచీ.
    చిక్కటి హత్తుకునే పదాల్లో ఇష్టంగా చదువుకున్నా …సంతోషంగా అనిపించింది.

  • భలే గుర్తుచేశావు, జిజ్జీ!
    చాలా రోజులయ్యింది తనని గురించి ఈ మధ్య ఎక్కడా ఎవరూ ప్రస్తావించినట్టులేరు!

    కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నారు.

    బారెడు జుట్టు, తేనె రోజాపూవులు రంగరించినట్లున్న శరీర కాంతి, కళ్ళలో రెబెల్స్ కు ఉండే మెరుపు

    ఆ కళ్ల మధ్య నుదుట, ఇంత పొడుగున ఎర్రటి తిలకం!

    “బాబు..అనిల్…కాస్త లస్సీ తెప్పించిపెట్టు నాయనా,” అంటూ, ఈ లోపే ఆ ఆలోచన మార్చుకుని, “మజ్జిగ…మజ్జిగ కావాలయ్యా,” అంటూ అంత స్వతంత్రంగా అడిగి మరి, అమ్మా…తనూ ముఛ్హట్లలలో పడిపొయ్యేవారు.

    తరువాత ఎప్పుడో పునర్ముద్రణలో గాలి పడగలు – నీటి బుడగలు వస్తే చూసుకుని నవ్వుకున్న వైనం కూడా గుర్తొస్తోంది.

  • అమ్మా జలంధర గారు,

    మీ నాన్న శ్రీ గాలి బాలసుందరరావు గారు గురించి, మీ మేనత్త ప్రముఖ రచయిత్రి తెన్నేటి హేమలత గారి గురించి తెలిసిన పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారు మీ “అనుసంధానం” శీర్షికను గురించి తెలుసుకుని చాలా సంతోషం వ్యక్తపరిచారు.

    మీ సాహితీ మేధోసంపత్తిని, మిమ్మల్ని … ఆప్యాయంగా, అభిమానంగా కొనియాడిన వారు మీ మరో అభిమాని … ప్రసిద్ద తెలుగు కవి మరియు రచయిత కర్నూలు శ్రీ కాశీభట్ల వేణుగోపాల్‌ గారు.

    వారి ” నికషం ” కవితా సంకలనం నుండి కొన్ని వాక్యాలు :

    ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు
    నిన్నటి ప్రత్యూషం నేడు లేదు
    ఈ రోజుటి ప్రదోషసంధ్య, రేపటికి పాతది…మాసినది..

    ఓ గంట క్రితం చుట్టేసిన దు:ఖం యిప్పుడు శూన్యం
    ఈ చిటికెడు విషాదాలూ
    క్షణకాలప్పాటు మెరిసే ఆనందాలూ..సుఖాలూ…
    వీటిని మోస్తూ యిన్ని కోట్ల ప్రాణాలు?

    అన్నీ…అందరూ కల్సి ఎక్కడికి?
    ఎటువేపుకి ప్రస్థానం?

    ఒక అనుభూతి నింకో అనుభూతి కబళిస్తూ…
    అంతం లేని దారిలో
    అక్కడక్కడా ఆగిపోతూ…చివరికి?

    అంతా…అన్నీ… అందరూ…ఒకే గహ్వరంలోకి…
    కాంతిని కూడా స్వాహా చేసే మహా బిలంలోకి…
    భావాతీత…అనుభూతి రాహిత్య
    మహా శూ…..న్యం….లో….కి….

  • లత గారి గురించి ఎంత బాగా చెప్పారూ!
    చిన్నప్పుడే ‘లత సాహిత్యం’ తో పరిచయం ఉంది. ఆవిడ ను ఎరవరైనా అపార్థం చేసుకొన్నా కోపం వచ్చేది..వాళ్లకా స్థాయి లేదని సరిపుచ్చు కోవడం తప్ప ఏం అనలేని చిన్నతనం. అప్పుడు వ్యక్తం చేయలేని మాటలన్నీ మీ యీ వాక్యాలతో సరి. యాదృచ్ఛికంగా అయినా మీ ఈ వ్యాసం చదవడం సంతోషం.

  • జలంధర గారూ..నమస్కారం అండీ
    లతా గారి సాహిత్యం లో మెరుపులు చూస్తూ ఆమె మొహం లో పడి పోయాను.మీరు తప్పక మరిన్ని వివరాలు రాయాలి..మీ నాన్నగారి గురించి కూడా.గొప్ప సేవ చేసినవారు అవుతారు.ఆ క్రమం లో మీ గురించి , మీలో రచయిత్రి గురించి ఇంకా బాగా తెలుసుకుంటాం.
    పున్నాగ పూలు కి అభిమానిని నేను.

    వసంత లక్ష్మి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు