ఉన్న చోట నుంచే కొత్త లోకాన్ని మనకు తెలియని జీవితాన్ని పరిచయం చేయగలగాలి. కొత్త ఆలోచనలు రేకెత్తించాలి. చదువుతుంటే ఒకోసారి ఇది మన జీవితమే అని కూడా అనిపించాలి. ఇలాంటి జీవితాలు ఉంటాయా అనేంతగా ఇతివృత్తాలను పట్టుకోగలగాలి. కథకు ఇతివృత్తం ఊపిరి. వర్ణన బాహ్య అలంకరణ. రిపీటెడ్ ఇతివృత్తాలు ముందుకు వెళ్ళవు. పాఠకులు కదలరు.
రాసినది చదవాలి అంటే పాఠకుణ్ణి మించి రచయిత ఉండాలి. డామినేట్ చేయడం కాదు.. కొత్తదనాన్ని సంతరింపచేయడం. చదువుతూ పక్కన పడేయకుండా చదివించే గుణం.. ఉండాలి. చదివిన అనంతరం ఏదో ఒకమూల పాఠకుడిలో ఆ కథ తిష్ట వేసుక్కుచ్చోవాలి. మనకు ఇష్టమైన వాళ్ళు గుర్తుకు వచ్చినట్లు.. ఇష్టమైన ప్రదేశాలలో విహరించినట్లు.. అత్యంత ఇష్టమైన దాన్ని తిన్నట్లు.. పదేపదే ఆ రచన మనల్ని విడిచి వెళ్లకూడదు ఈ వేగవంతమైన జీవితాలలో కనీసం కొంత సమయం. ఊరికే వర్ణన లేదా పూర్వ రచయితల పెద్ద తరహా శైలి ని అనుకరించటం లేదా పాత్రల సంభాషణల చమత్కృతి… భాష తియ్యదనం… ఇదంతా కథ కాదు.. కథలో భాగం మాత్రమే. వీటన్నింటికి ప్రాణం పోసేది ఇతివృత్తం. ఇతివృత్తం లేని నాడు కథ జనించదు. కృత్రిమంగా ఏర్పడుతుంది.
ఆ తేడా చదువరులకు వెంటనే స్ఫురిస్తుంది. ఏది రాసినా రాసేవారి వ్యక్తీకరణ విభిన్నంగా ఉన్నప్పుడు గుర్తుంటుంది. ఇతివృత్తం కొత్తగా ఉండాలి.. గుర్తుంటుంది. శైలి స్వంతంగా ఉండాలి.. తీర్చి దిద్దే కథ ఒక కొత్త సృష్టి.. అపురూపంగా ఉండాలి. చదివిన వాళ్ళు మనస్సుకు ఎత్తుకు ముద్దాడాలి. నూతనంగా ఆవిష్కరించక పోవడం వలననే కథ ముందుకు సాగడం లేదు. సాహితీ సృజనకు వర్క్ షాప్స్ అవసరం లేదు. ఆ పని లైబ్రరీలు చేస్తాయి.కొత్త ప్రదేశాలు చేస్తాయి. కొన్ని సంవత్సరాల పాటుగా చదివిన సాహిత్య సారాంశం లోపల మేట వేసుకుని ఉండాలి.. అంటే రాసే వారికి చదివే అలవాటు ఉంటే బావుంటుంది. ఇన్స్టంట్ ఫుడ్ లా కాకుండా రచన మేలిమిగా తేలుతుంది- అనేది నా పర్సనల్ ఒపీనియన్.
కథ ను రచయిత/త్రి కాగితంపై కొంత దూరం తీసుకు వెళ్ళాక రచయితను.. కథ లాక్కొని తీసుకువెళుతుంది అప్పుడు ఒక అద్భుత ఆవిష్కరణను మనం చదువుతాం. చాలా సార్లు కథ ఎదుగుదలను రచయితే ఆపేస్తారు. ఏ రచనకైనా స్వేచ్ఛ ఉంటుంది.
ఎవరెవరి కోసమో… కథ ను ట్రిమ్ చేయటం కథ హక్కుని రచయిత లాక్కోవటమే. కథ ఎంత వరకు నడుస్తుందో. . నడిపించాలి. పిల్లల తప్పొప్పులు పేరెంట్స్ కి తెలిసినట్లు.. విద్యార్థుల తప్పొప్పులు అధ్యాపకులకు తెలిసినట్లు రచనల లోటు పాట్లు.. రచయిత కథకు చేసే అన్యాయం… మనసుకు తెలుస్తుంది..ప్రలోభాలకు లొంగి ఎడిటింగ్ పేరుతో కథ స్వేచ్ఛను హరించకూడదు.
చూసే మనుషులు.. ప్రదేశాలు.. అనుభూతులు.. గడుస్తున్న కాలం అందించే ఆలోచనల రంగరింపుల కలయికల వలన ఏ రచనైనా మనసులో పుడుతుంది. దానిని ఏ రూపంలో ప్రపంచానికి అందించాలని సృష్టికర్త లు అనుకుంటారో.. అట్లా అక్షర రూపం ఇవ్వ గలిగిన వాళ్ళు ధన్యులు.. చదివిన వారు మరింతగా ధన్యులు.
*
సరిగ్గా చెప్పారు.అభినందనలు.