– రబీంద్రనాథ్ టాగోర్
గౌరి చాలా అందమైన అమ్మాయి. వృద్ధులైన ఆమె తల్లిదండ్రులు ధనికులు కావడంతో ఆమెను ఎంతో గారాబంగా, సున్నితంగా పెంచారు. ఆమె భర్త పరేష్ స్వయంకృషితో ఎన్నో కష్టాలను ఎదురీది, జీవితంలో ఒక స్థాయికి వచ్చిన వ్యక్తి. అతను పేదరికంలో ఉన్న రోజుల్లో, గౌరి ఆ కష్టాలను అనుభవించం ఇష్టంలేక ఆమె తల్లిదండ్రులు కాపురానికి పంపించలేదు. కాబట్టి, భర్త దగ్గరకు సంసారానికి వచ్చేటప్పటికి గౌరి చిన్న వయసుదేమీ కాదు.
పరేష్‍కి మాత్రం ఎన్నడూ గౌరి తనకు చెందిన వ్యక్తి అన్న భావనే కలగలేదు. అతను తూరుపునున్న ఓ చిన్న పట్నంలో వకీలు. పైగా అతనికి పెద్దగా బంధువర్గమో నా అన్నవారో లేరు. అతని ఆలోచనలన్నీ భార్య చుట్టూనే ఉండేవి. అతను కోర్టు కెళ్ళేందుకు బయల్దేరే వరకూ ఆమెనూ, తన సంసారాన్నీ అదుపులో పెట్టుకునేందుకే శాయశక్తులా ప్రయత్నించేవాడు.
మొదట్లో గౌరికి అతను ఎందుకు ఇంటికి హఠాత్తుగా ఊడిపడేవాడో అర్థం అయ్యేదే కాదు. ఉన్నట్టుండి ఏ నౌకరునో ఉద్యోగంలోంచీ పీకేసేవాడు. ఒక్కోసారి అతనికి ఏ నౌకరన్నా పడేది కాదు. ఒక్కరూ నచ్చేవారు కారు. ముఖ్యంగా గౌరి దృష్టిలో ఏ నౌకరన్నా ‘పనిమంతుడు’ అనిపించుకోగానే, వాడిని తక్షణం మానిపించేసేవాడు. ఆత్మ గౌరవం ఉన్న గౌరికి అతని ఈ విచిత్ర ప్రవర్తన అంటే విపరీతమైన రోత, ఆశ్చర్యమూ కలిగేవి.
ఆఖరికి పరేష్ తనని తాను అదుపులో ఉంచుకోలేని స్థితికి వచ్చి, నౌకర్లతో భార్య గురించి వాకబు చేసే స్థితికి వచ్చేసరికి, గౌరికి విషయం తెలిసిపోయింది. గౌరిది వాదనలకు పోయే మనస్తత్వం కాదు. కానీ ఆమె దెబ్బతిన్న ఆడ సింహం లాగా అవమానంతో రగిలిపోయింది. ఈ అనుమాన పిశాచి వీరిద్దరినీ చీల్చి నాశనం చేసేసే పదునైన కత్తిలా తయారైంది. పరేష్‍కి తన అనుమానం సంగతి ఎప్పుడైతే గౌరికి అర్ధమైపోయిందని తెలిసిందో అతనిలో సున్నితత్వం పూర్తిగా నశించిపోయింది. గౌరి ముఖం మీదే తూలనాడే మాటలాడేవాడు. అతనిలో తన భార్య మీద ఏదో చెప్పరాని వెర్రి ద్వేషం రాజిల్లేది. గౌరి దీన్నంతటినీ మౌనంగానే ఎదుర్కొంటున్న కొద్దీ అతనిలో అసూయా ద్వేషాలు మరింత పెచ్చరిల్లిపోయేవి.
చివరికి, సంసార సుఖము, మనశ్శాంతి, మాతృత్వమూ లేని గౌరి, తనకు ఇక పిచ్చెక్కకుండా ఉండేందుకు మతాన్ని ఆశ్రయించింది. అదే ఊర్లోని ఆశ్రమంలో ఉన్న యువ సన్యాసి పరమానందస్వామికి కబురు పంపింది. ఆయనను గురువు గా స్వీకరించి, అతని దగ్గర భగవత్గీత చదువుకుంటూ శాంతిని వెతుక్కుందామన్నది ఆమె కోరిక. వృధా అయిపోతున్న, తన ప్రేమాభిమానాలని, హృదయాన్ని, భక్తి శ్రద్ధలనూ గురు పాదాలకే అంకితమిచ్చింది.
పరమానందుడి పవిత్రత మీద ఎవరికీ అనుమానం లేదు. ప్రజలంతా ఆయన్ని పూజిస్తూ ఉండేవారు. అందువల్ల పరేష్‍కు ఈ గురువుపై కలిగిన అణుమాత్రమంత అనుమానాన్నైనా బయటపెట్టే దమ్ము లేకపోయింది. అందువల్ల అనుమానము, అసూయలు లోలోపలే అతన్ని వ్రణంలా తొలిచేస్తుండేవి.
ఒకనాడు భార్యా భర్తల మధ్య వాగ్వివాదంలో ఈ విషం కాస్తా బయటకి ఎలాగో ఒలికిపోయింది. ఆరోజు పరేష్ తన భార్యకి పరమానందుడు ఒక “కపటి” అని చెప్తూ, “గొప్ప సన్యాసి వేషంలో ‘బక’ధ్యానం చేసే అతని పట్ల నీకు ప్రేమ లేదని ప్రమాణం చెయ్యగలవా? అని అడిగేసాడు.
గౌరి తోక తొక్కిన త్రాచులా సర్రున లేచింది. అంతులేని అతని అనుమానపు రోగానికి నిరసనగా, ఒక రకంగా వ్యంగ్యంగానే, “ఉంటే తప్పేంటి?” అని మాట విసిరింది. దానికి పరేష్ అదిరిపోయి, ఆమెను ఆ గదిలోనే పెట్టి, తలుపులకు బయట గడియ పెట్టి కోర్టుకు వెళ్ళిపోయాడు.
ఈ గొడవ వేడిలో గౌరి గది తలుపులు ఎలాగో తీయించి, ఆవేశంతో ఇంట్లోంచీ బయటకు వెళ్ళింది.
తను వెళ్ళేటప్పటికి, పరమానందుడు తన గదిలో ఒంటరిగా గ్రంధపఠనం చేసుకుంటున్నాడు. అతని చదువు మధ్యలో మేఘాల్లేని ఆకాశం నుండీ, ఉరుముల్లేని పిడుగులా గౌరి అక్కడికి వచ్చింది.
“నువ్వు? ఇక్కడ?” అని గురువు ఆశ్చర్యపోయాడు.
“రక్షించండి ప్రభూ, గురుదేవా…” అంటూ “నన్ను ఈ అవమానాలు, ఈ చిత్రహింసలనుండి కాపాడండి. ఇక వీటిని భరించే ఓపిక నాకు లేదు. నేను నా జీవితాన్ని ఆ భగవంతుని పాదాలకే అంకితం చేద్దామనుకుంటున్నాను” అంది గౌరి.
అప్పటికి మాత్రం గట్టిగా మందలించి, గురువు ఆమెను ఇంటికి పంపేసాడు. కానీ, తన గ్రంధ పఠనాన్ని మాత్రం కొనసాగించలేకపోయాడు.
పరేష్ తిరిగి ఇంటికి వచ్చేసరికి, తెరిచున్న గది తలుపులు చూసి, ఆవేశంతో “ఇక్కడికి ఎవరు వచ్చారు?” అని అడిగాడు.
“ఎవరూ రాలేదు!” అని గౌరి సమాధానం ఇస్తూ “నేనే నా గురువు దగ్గరకు వెళ్ళాను” అంది.
“ఎందుకు?” అని అడిగాడు పరేష్. రంగులు మారిపోతున్న వదనంతో.
“నాకు వెళ్ళాలనిపించింది. అందుకు!”
ఆరోజు నుండీ పరేష్ ఇంటి బయట ఒక కాపలాదారుణ్ణి నియమించాడు. అసూయా ద్వేషాలతో చాలా అసహ్యంగా మసులుకుంటున్నాడు. అతని నీచ ప్రవర్తన విషయం ఊరంతా పాకిపోయింది.
తన శిష్యురాలికి జరుగుతున్న అన్యాయం, రోజు రోజుకూ విపరీతమవుతున్న పరేష్ వ్యవహారం గురించి పరమానందుడికి వార్తలు ఎలానో చేరుతున్నాయి. అవి అతని ధ్యానాన్ని భంగ పరుస్తున్నాయి. అతనికి ఒకోసారి ఆ చోటునుంచీ వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ అదే సమయానికి తన శిష్యురాలిని తన కర్మకి అలా వొదిలేసి వెళ్ళలేకపోయేవాడు. ఆరోజుల్లో పాపం ఈ సన్యాసి పడిన అంతర్మథనం గురించి ఎవరు చెప్పగలరు!
ఆఖరికి ఒక రోజు తన ఇంటనే బందీ అయిన గౌరికి ఓ ఉత్తరం అందింది.
“అమ్మయీ” అంటూ ఉత్తరం మొదలయింది. “ఎందరో పవిత్ర స్త్రీలు సంసారాన్ని విడిచిపెట్టి భగవంతుని సేవకు అంకితం కావడం నిజం. ప్రాపంచిక కష్టాల మూలంగా నీ ఆలోచనలు, భగవంతుని చరణాల వైపు మళ్ళుతున్నట్టయితే, దైవేచ్ఛ అలాగే ఉంటే, అతని దాసిని అతని సేవకు అంకితం చేసేందుకు నేను సహకరిస్తాను. నీకు ఇది సమ్మతమైతే, మీ తోటలో కొలను దగ్గర రేపు మధ్యాహ్నం రెండు గంటలకు నన్ను కలుసుకో!”
గౌరి ఈ ఉత్తరాన్ని తన కొప్పున ముడిలో దాచుకుంది. మర్నాడు పొద్దున స్నానం చేసేందుకు జుత్తు ముడి విప్పినపుడు ఆ ఉత్తరం ఆమెకు కనపడలేదు. అది బహుశా మంచం మీద పడిపోయి భర్త కంటపడి ఉండాలి. ఆ ఆలోచనకు ఆమెకు అంతర్లీనంగా ఆనందమే కలిగింది. ఒకవేళ అతను అది చదివితే కోపంతో, అసూయతో రగిలిపోవడం ఖాయం. మొదట ఆ ఊహ ఆమెకు సంతృప్తి కలిగించింది. కానీ తనకు విముక్తిని ప్రసాదించే ఆ పవిత్ర లేఖ తన భర్త లాంటి దుర్మార్గుడి చేతిలో పడి కళంకితం కావడం అన్న భావనను ఆమె తట్టుకోలేకపోయింది.
వేగంగా అడుగులు వేస్తూ భర్త గదిలోకి వెళ్ళింది. అప్పటికి అతను నేలమీద పడి కళ్ళు తేలవేసి, బాధతో మూలుగుతున్నాడు. అతని నోటి వెంట నురుగు వస్తుంది. అతని బిగిసిన పిడికిట్లోంచి తన ఉత్తరాన్ని బలవంతంగా విడిపించి వెంటనే డాక్టర్ కోసం మనిషిని పంపింది.
డాక్టర్ వచ్చి పెదవి విరిచాడు. అంతర్గత రక్తస్రావం వల్ల డాక్టర్ వచ్చే ముందే రోగి మరణించాడు.
ఆ రోజు, ఈ సంఘటన జరిగేనాటికి, పరేష్ నిజానికి పని మీద వేరే ఊరికి వెళ్ళాల్సి ఉంది. అతను ఆ వేళ ఇంట ఉండడు అన్న విషయం పరమానందుడికి తెలిసే ఆ మధ్యాహ్నం గౌరిని రహస్యంగా కలుసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసాడు. అంత లోతులకు అతను దిగజారాడు.
గౌరికి, కిటికీ నుండీ తన గురువు ఆ పూట కొలను పక్కన నక్కి ఉండడం కంట పడింది. కళ్ళు మిరిమిట్లు గొలిపే మెరుపును చూసినట్టు, ఆమె కనురెప్పలు మూసుకున్నాయి. ఆ మెరుపులో తన గురువు ఎంతగా దిగజారాడో ఆమెకు స్పష్టంగానే కనిపించింది.
గురువు ఆమెను “గౌరీ!!” అని పిలిచాడు.
“వస్తున్నా” ఆమె సమాధానం ఇచ్చింది.
పరేష్ మృత్యు వార్త విని, అంత్యక్రియలకి సాయం చెయ్యడానికోసం అతని స్నేహితులు వచ్చేసరికీ, వారికి పరేష్ మృతదేహం పక్కనే గౌరి కూడా విగత జీవై కనిపించింది. ఆమె విషం తాగింది. అందరూ జరిగింది చూసి మూగబోయారు. భర్త పట్ల ఆమె విధేయతకు, తనను తాను “సతి” చేసుకుని ఈ రోజుల్లో అరుదైపోయిన ఇంతటి అపారమైన పాతివ్రత్యాన్ని ప్రదర్శించిన ఆమె నిర్మలత్వాన్ని చూసి అచ్చెరువొందారు.
***
కథ మూలం: Saved – Sir Rabindranath Tagore
Add comment