తెలంగాణ సాంస్కృతిక దీపధారి సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ తొలితరం కథా వికాసకులలో ఒకరు. నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమర యోధుడిగా, పరిశోధకుడిగా, పత్రికా సంపాదకుడిగా, వకీలుగా, రాజకీయ నాయకుడిగా, బహుభాషా కోవిదుడిగా ఎనలేని కీర్తి ప్రతిష్ఠల్ని పొందిన సురవరం ప్రతాపరెడ్డి రాసిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’కు తెలుగులోనే మొదటి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం (1955) లభించింది. ‘నిజాం రాష్ట్రంలో ఆంధ్రకవులు పూజ్యము’ అని ముడుంబై వెంకట రాఘవాచార్యులు ఒక వ్యాసంలో రాస్తే దాన్ని సవాలుగా స్వీకరించిన సురవరం 354 మంది కవుల రచనలతో 1934లో ‘గోల్కొండ కవుల సంచిక’ను ప్రచురించి తెలంగాణ సాహిత్య దీపపు వెలుగులను దశ దిశలా ప్రసరింపజేశారు. ‘గోల్కొండ కవుల సంచిక’ ముద్దుకృష్ణ సంకలనం చేసిన ‘వైతాళికులు’ (1935) కంటే ఒక సంవత్సరం ముందే వచ్చింది. అయినా ‘వైతాళికులు’ లో ఒక్క తెలంగాణ కవికి కూడా చోటు దక్కక పోవడం గమనార్హం. సురవరం ప్రతాపరెడ్డి సృజనాత్మక రచనా రంగంలో కూడా అడుగుపెట్టి సంపాదకీయ వ్యాసాలు, సమీక్షలు, లేఖలు, నాటకాలు, కథలు తదితర ప్రక్రియల్లో రాసి తెలంగాణ సాహిత్యాన్ని మరింత సంపద్వంతం చేశారు. వీరు రాసిన దాదాపు 25 కథల్లో 11 కథలు ‘మొఘలాయి కథలు’ పేర, మరో తొమ్మిది కథలు ‘సురవరం కథలు’ పేర 1940లో అణా గ్రంథమాల పక్షాన రెండు భాగాలుగా వెలువడ్డాయి. వీటినే 1987లో ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు సమగ్ర సంకలనం వేశారు. సురవరం కథలు ఎక్కువగా నిజాం కాలం నాటి సామాజిక, రాజకీయ పరిస్థితులకు దర్పణం పట్టేవే. వీటిలో తెలంగాణ ప్రజల పోరాట నేపథ్యాన్ని చిత్రించిన కథ ‘సంఘాల పంతులు’. ఈ కథ 1940లో మొదట ప్రచురింపబడింది.
అది కృష్ణా నది తీరాన్ని ఆనుకొని ఉన్న నైజాం పాలనలోని రామసాగరం అనే గ్రామం. అక్కడొక పోలీస్ స్టేషన్ ఉంది. దానికి ఒక అమీన్, ఒక జమేదారు, 12 మంది జవాన్లు ఉన్నారు. గ్రామంలోని అన్ని కులాల పేద ప్రజలు వీరికి వెట్టిచాకిరి చేయవలసిందే. అదేగాక వీళ్ళకు అవసరమైన కోళ్ళు, గుడ్లు, కట్టెలు వగైరా సామానంతా ఉచితంగా ఇవ్వాలి. ఇట్లా ప్రజలంతా ఏ మాత్రం ఐకమత్యం లేకుండా పోలీస్ అధికారులకు ఊడిగం చేయలేక నలిగిపోతుంటారు. కృష్ణా నది ఆవలి తీరంలో చూస్తే అంగ్రేజీ పాలన. అక్కడ ఏ వెట్టి లేదు. దండుగలు లేవు. తన్నులు లేవు. ప్రజలంతా సుఖంగా ఉంటారు. రామసాగరం ప్రజలంతా అక్కడికి పోయి సుఖంగా ఉందామంటే “పెద్దలు సంపాదించిన భూములు, ఇళ్లు, వాకిళ్ళు, వృత్తులు వదులుకొని పోతే జీవనమెట్లు” అని ఆలోచించి అక్కడే ఉండిపోతారు.
ఒక రోజు ఒక ముసలిదాన్ని పిల్చి వంటకు రేల కట్టెలు తెమ్మంటుంది అమీన్ భార్య బేగం సాహెబా. ముసల్ది సాయంత్రం దాకా అడివంతా తిరిగినా రేల కట్టెలు దొరకలేదు. చివరికి తంగేడు కట్టెలు మోపు కట్టుకొని తెస్తుంది. అది చూడగానే బేగం సాహెబాకు కోపం కట్టలు తెంచుకుంది. ముసలిదాన్ని డొక్కలో ఈడ్చి నాలుగు తన్నులు తంతుంది. దెబ్బకు ముసల్ది సచ్చి ఊర్కుంటుంది. ఇది ఆనాడు అమాయక ప్రజల మీద జరుగుతున్న హింసకు పరాకాష్ఠ. కిరాణం షాపు కోమటి కూడా పోలీసు వాళ్ళకు ఉచితంగా సరుకులు ఇవ్వలేక పారిపోతాడు. అతని స్థానంలో ఒక మార్వాడి వచ్చి పోరాడుతుంటాడు. ఇట్లా వ్యవహారం మహా రంజుగా ఉన్న సమయంలో ఒక నాటి చీకటి సమయంలోనే ఒక పెద్ద మనిషి ఊళ్ళోకి వస్తాడు. ఎవరో ఎదురైతే ఆ పెద్ద మనిషి “ఎంత పొద్దు (టైమ్) అయుండవచ్చురా?” అని అడిగాడు. వాడు “ఇప్పుడే కుక్కలు మొరిగినాయయ్యా! ఇంకా రెండు జాముల పొద్దుంది” అన్నాడు. “కుక్కలు మొరిగితే పొద్దెట్లు గుర్తు పడుతుందిరా? అన్నాడు పెద్దమనిషి. “అయ్యో! మా వూర్లో కోళ్ళన్నీపోలీసు వాళ్ళ ఫలారాలకే సరిపోయినవి. నెల్లాళ్ళయింది. మా వూళ్ళో కోళ్ళు కూయవు. మా రాజులు కుక్కలు తినరు. లేకపోతే అవి కూడా మొరుగుతుండేనా! సామీ” అన్నాడు వాడు. ఆ పెద్ద మనిషే ‘సంఘాల పంతులు’. అతడిని ఊళ్ళో ప్రజలంతా తమను కాపాడడానికి వచ్చిన దేవరగా అనుకుంటారు. ఆయన పేరేమో ఎవరికీ తెలియదు. అందరూ ఆయనను ‘సంఘాల పంతులు’ అనే అంటారు. అనుకున్నట్టుగానే మనలో ఐక్యత లేక పోవడం వల్లనే ఇలా ఉన్నామని గ్రామ ప్రజలతో ఒక మీటింగ్ పెట్టి పోలీసు వాళ్ళకు ఎవరూ భయపడవద్దని, ధైర్యం చెప్పి ఊళ్ళో ‘సంఘాన్ని’ స్థాపిస్తాడు సంఘాల పంతులు. కూలి ఇవ్వనిదే ఎవ్వరూ పని చేయవద్దని చెప్తాడు. ఇంతలో అమీన్ సాబ్ గుర్రం మీద వచ్చి “పంతులూ! గష్తీనిశాన్ 53 (నిజాం రాష్ట్ర వాగ్బంధన శాసనం) తెలుసునా?” నీవు చేసేదేమీ అని ప్రశ్నిస్తాడు.
“నేను గాదు నీవు చేసేది. ఫర్మానాలో వెట్టి కూడదని ఉంది. కూలి ఇచ్చి పని చేయించుకొనుమని వుంది. నీవెన్నడైనా కూలి ఇచ్చినావా? మరి బేగం సాహెబాకు ముసలివాండ్ల తన్ని చంపుటకు, పడుచువాండ్ల చెంపల వాతలు పెట్టుటకు, పాయిఖానా లూడ్పించుకొనుటకు ఏ ఫర్మానాలో హక్కిచ్చినారు? అని ఎదురు ప్రశ్నిస్తాడు. అమీను ఖంగు తిని వెళ్ళిపోతాడు. వారం దినాలైంది. “బేగం సాహెబాకు పాయిఖానాలూడ్చేవాళ్లు లేరు. వెట్టి చాకిరీ మనుషులు రారు. కోళ్ళు అసలే లేవు. బియ్యము రూపాయికి 4 పళ్లే అయినవి. గుర్రాలకు గడ్డి చిక్కదు.” ఇట్లా ప్రజలంతా సంఘాల పంతులు ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ చేస్తుండగా అమీను సంఘాల పంతులును కచ్చేరికి పిలిచి విచారణ ప్రారంభిస్తాడు. జావాన్లు ‘మారో సాలేకు” అని సంఘాల పంతులు మీద దాడికి ప్రయత్నిస్తారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ఆ వూరి యువకులు ఒక్కసారిగా కచేరిలోకి దూకి జవాన్లను చావ బాదుతారు. మంచం కింద దాక్కున్న అమీనును బయటకు లాగి దొర్లించుకుంటూ కొడతారు. తరువాత మెహతమీం వచ్చి విచారించినప్పుడు ఊరి ప్రజలంతా అమీనుకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. అక్కడి పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న మెహతమీం అమీనును డిస్మిస్ చేసి అక్కడి నుంచి నాకా (పోలీస్ స్టేషన్)ను ఎత్తి వేస్తాడు. ప్రజలంతా పండగ చేసుకుంటారు.
ప్రజలంతా కలిసి పోరాడితే ఎంతటి శక్తినైనా ఎదిరించవచ్చునని చూపించడానికి ఈ కథ ఒక అక్షర సాక్ష్యం. నైజాం పాలనలో పటేళ్ళు, పట్వారీలు, దేశ్ ముఖ్ లు, పోలీసులు, రజాకారులు గ్రామాలను మాటల్లో చెప్పలేని విధంగా హింసకు గురి చేశారు. ఎంతటి పీడననైనా తెలంగాణ అమాయక ప్రజలు మౌనంగా భరించారు. కానీ పిల్లినైనా గదిలో వేసి కొడితే పులి అవుతుందన్నట్లు పీడన తీవ్రత ఎక్కువైన సందర్భాల్లో ‘సంఘం’ అండనో, ఒక పోరాట వీరుడి మద్దతో, ఒక చైతన్యం నింపే మార్గదర్శినో ఆదర్శంగా తీసుకొని తిరుగబడేవారు. అట్లా కలిసికట్టుగా పొరాడి ప్రజలే ఎన్నో గ్రామాలను విముక్తి చేశారు. ఈ కథలో చెప్పిన రామసాగరం కూడా అలా విముక్తి చెందినదే. కథ ఆనాటి పల్లెల ధైన్య స్థితిని వర్ణిస్తూ, పోలీసుల క్రూర పాలనకు నిదర్శనంగా నిలిచే ఒకటి రెండు సంఘటనలను ఉదాహరిస్తూ మొదలవుతుంది. చివరికి వచ్చే సరికి ఒక ఉప్పెనలా, ఒక విప్లవంలా విరుచుకు పడి ప్రజా శక్తి ముందు ఏ శక్తీ నిలవలేదని ముగుస్తుంది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమ ప్రభావంతో రచయిత ఊళ్ళోని ఉత్పత్తి కులాల వారు పోలీసులకు, బేగం సాహెబాకు వెట్టి చాకిరీ పేరుతో అందిస్తూ వస్తోన్న సేవలను నిలిపివేసే సంఘటనను చిత్రించడం కనిపిస్తుందీ కథలో. మారు మూల పల్లెల్లోకి వెళ్ళి ఆనాడు ‘సంఘం’ ఎలా ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టిందో కూడా చిత్రించాడు రచయిత. సంఘాల పంతులు ధైర్యంగా చట్ట పరిధిలోనే విజయాలను సాధించి పెట్టి సమాజంలో చైతన్యాన్ని నింపుతాడు. కథలోని ముసల్ది, కిరాణా షాపు కోమటి ఆనాడు పీడనకు గురైన సాధారణ ప్రజలకు ప్రతినిధులు. అమీను, అతని భార్య బేగం సాహెబా, జవాన్లు అన్ని గ్రామాల్లోని పీడకులకు ప్రతినిధులు. సంఘాల పంతులు అండతో ప్రజలంతా మూకుమ్మడిగా అమీనుపై తిరగబడడం ద్వారా కథకుడు తెలంగాణ ప్రజల పోరాట స్వభావాన్ని, స్వరూపాన్ని కళ్ళకు కడుతాడు. కథ మైదానంలో ప్రవేశించిన నదిలాగా మెల్లగా మొదలై, ఒకింత వేగంతో కొనసాగి ఒక్కసారిగా భళ్లున బద్దలవుతుంది. ఇదొక గొప్ప శిల్పంతో సాగిన కథ. సంఘాల పంతులు పాత్ర తెలంగాణ గ్రామీణుల్లో దాగి ఉన్న పోరాట శక్తిని మేల్కొల్పి వారిని స్వేచ్చా స్వాతంత్ర్యాల వైపు నడిపిస్తుంది.
డెబ్భై యేళ్ల స్వతంత్ర భారతం ఇంకా కుంటుతూనే నడుస్తోంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఇంకా ప్రజల హక్కులను, స్వేచ్చను కాల రాస్తూనే ఉన్నాయి. పని హక్కు కోసం, నాలుగు మెతుకులు నోట్లోకి పోవడం కోసం, కాసింత గౌరవంగా బతకడం కోసం సాధారణ ప్రజలు, అసంఘటిత కార్మికులు ఇంకా ఉద్యమాలు చేస్తోన్న ప్రస్తుత సందర్భంలో ఈ కథ ప్రాసంగికత కోల్పోలేదంటే అతిశయోక్తి కాదు. కథలో సందర్భానుసారంగా వాడిన ‘నాకా’, ‘జవాను’, ‘జమేదారు’, ‘అమీను’, ‘ఛినాల్’, ‘నికాలో’, ‘హర్రామ్’, ‘సాలీనా’, ‘వకీలు’, ‘సర్కారు’, ‘సేర్లు’, ‘ఖబర్దార్’, ‘పాయిఖానా’, ‘జమ’, ‘ఫర్మానా’, ‘సియాసీ’, ‘ఖానూను’, ‘హాత్కడీ’, ‘గోలి’, ‘ఫాసీ’, ‘బేగారీ’, ‘మర్గయా’, ‘మాఫ్కరో’, ‘ఫౌజ్’, ‘షికాయత్’, మెహతమీం’, ‘భర్తరఫ్’, ‘మోతల్’ (సస్పెండ్), ‘బర్ఖాస్త్’ (ఎత్తివేయుట), ‘ఠానా’, ‘జల్సా’, ‘దావత్’ లాటి పదాలు తెలంగాణ నేటివిటీని పట్టిస్తాయి. పాలకుల భాష పాలితుల సంభాషణాల్లో ఎలా ఉంటుందో కూడా చూపెడ్తాడు కథకుడు. దీని వల్ల కథకు మరింత సహజత్వం కలిగింది. అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు కూడా కనిపిస్తాయి కథలో. తెలంగాణ అస్తిత్వం, పోరాట స్వభావం, చైతన్యం, అమాయకత్వం.. ఇలా ఎన్నో కోణాల్ని చాలా అలవోకగా చిత్రించిన ఈ కథ నైజాం పాలనా కాలం నాటి సామాజిక వాతావరణాన్ని సమగ్రంగా ఎత్తి చూపిన కథ.
*
తెలంగాణ సాహితీ జగత్తుకు చిరస్మరణీయులు సురవరం ప్రతాపరెడ్డిగారు. వారు రాసిన సంఘాల పంతులు కథ ద్వారా నైజాం కాలం నాటి సామాజిక జన జీవన చిత్రాన్ని కళ్లకు కట్టినట్లు అద్భుతంగా విశ్లేషించారు.. నమస్సులతో అభినందనలు.
Thank you Madam..
విశ్లేషణ చాలా చక్కగా ఉంది.
Thank you sir…
Dr ji, I went through your review of the short story Sanghala Panthulu …the problem the story has dealt with is still existent in our society. The liberal use of Urdu words and chaste Telangaana dialect gave a great identity to the region. But even after a gap of about nine decades the situation in Telangaana region is no different! I’m sure if Sanghal Panthulu is projected in a story now, he would be branded as Naxalite and bumped off. Anyway your anatomical analysis of the story is meaningful and comprehensive.
Thank you very much sir… for your detailed analysis…
బాగా విశ్లేషించారు శ్రీధర్ గారు . ధన్యవాదాలు .
సురవరం ప్రతాపరెడ్డి గారి ఫోటో దొరకడం కష్టం కాదనుకుంటా ..
Thank you sir…
అద్బుతమైన విశ్లేషణ. ఈ పాఠం sangala Panthulu పేరు ఇంటర్ ప్రధమ విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చారు. అభినందనలు