రంగూన్ పళ్లెం  

“పళ్లెం అలా బయట వొదిలేసింది ఎవులర్రా ? ” ఒక్క కేకేసింది రాజమామ్మ.
రాజమ్మామ్మ  తెల్లగా పొడవుగా ఉంటుంది. కాకపొతే ముక్కు మీద కోపం, అలక.
మామ్మకు  ” రంగూన్ పళ్లెం ” అంటే ప్రాణం.
*    *    *
బర్మా నుంచి వొస్తూ చిట్టగాంగ్ అడవులు దాటుతుండగా, ఓ పక్క  మిలిటరీ  భయం, మరోపక్క దొంగల భయం, తెలుగోళ్లు అందరూ  వరసగా భారత దేశం వైపు నడుస్తున్నారు. బొక్కా  వెంకన్న గారి కుటుంబం బర్మా వెళ్లి సంపాదించుకున్నదంతా  బంగారం రూపంలో వుంది, బంగారం పరుపులో వుంది, ఓ పక్క ముగ్గురు పిల్లలను చేత్తో పట్టుకొని, మరోపక్క బంగారం వున్న పరుపుపై ఒక కన్ను వేస్తూ మైళ్లకు మైళ్ళు నడిచి, కలకత్తా చేరి  రైల్లో బతుకు జీవుడా అని గోదావరి జిల్లా చేరారట.
రాజమ్మామ్మ అన్నం తినడానికి కంచం ముందు కూర్చుంటే,గిన్నెలో  పుర్రుగా కూర కలిపి ఒక పెద్ద ముద్ద తీసి నిముషంలో  ప్రార్ధన చేసుకొని ఆ అన్నం ముద్ద కుక్క కోసమో, కోడి కోసమో పక్కన పెట్టేది.
అన్నం తిన్నాకో, వాకిట్లో కూర్చున్నపుడో బర్మా నుంచి వొచ్చిన ప్రయాణమో  , అదయిపోతే గోదావరి జిల్లాలో స్నేహితులతో తాత కొన్న పొలాలు, చేసిన వ్యాపారాలు,మోసాలు, దివాళాలు,తీపి వ్యాధి ఆయనను తీసుకుపోవడాలు ప్రశాంతంగా ఒక కథలా చెప్పేది.
*    *    *
” రంగూన్ పళ్లెం ”  ఇనుముతో చేసిన పళ్లెం, బరువైనది, తెల్లటి పెయింటు మీద నీలం, ఎరుపు, పసుపు రంగుల మిశ్రమంతో వేసిన అందమైన పువ్వులు, లతలు దాన్నిండా.
“బంగారాలు కరిగి పోయాయి, పొలాలు హారతి కర్పూరాలు అయిపోయాయి. ఈ రంగూన్ పళ్లెం ఒక్కటే మిగిలింది జాగర్త పెద్ద కోడలా”  అని జాగర్త చెప్పీ చెప్పీ  ఒక రోజు ఇక చెప్పే పని లేకుండా తులసి తీర్ధం తీసుకొని పోయింది  రాజమ్మామ్మ.
బర్మాలో గడిపిన దర్జా జీవితానికి గుర్తుగా పళ్లెం ఒక్కటే మిగిలి పోయింది.
*      *       *
” వూరికే చింతపండు తింటే చెవిలో గులుం వొచ్చేసి చెవుడొచ్చేస్తాది ” అంది మా  అమ్మ.
బర్మా కేంపు లో మా పెంకుటింటి వసారాలో కూర్చొని, చింతపండుకు  పురుగు పట్టకుండా రంగూన్ పళ్లెంలో  కల్లుప్పు  కలిపి ఎండ బెడుతుంటే, అందులో పావొంతు బాగుంది, బాగుంది అని కారం కూడా అందులో అద్దుకొని  తినేసిన నన్ను మా అమ్మ అలా బెదరేసింది.
వేసవి కాలం వోస్తే మాగాయ ముక్కలు ఎండ బెట్టాలంటే ” రంగూన్ పళ్ళెమే “
టమోటా పచ్చడి చేయడానికి   ముక్కలు ఎండ బెట్టాలంటే ” రంగూన్ పళ్ళెమే “
ఇంక ఎండు మిరపకాయలు, చల్ల మిరపకాయలు,ఎండు కొబ్బరి  మా ఇంట్లో ఏవి ఎండ బెట్టాలన్నా  ” రంగూన్ పళ్ళెమే.
ఇంక దీపావళికి పటెప్ కాయలు, కమ్మలు  బాంబులు, కాకరపువ్వొత్తులు,మట్టి చిచ్చు బుడ్లు రోజంతా ఎండ బెట్టాలంటే అందులోనే.
బర్మా కేంప్ లో గొడవలు ఎక్కువవుతున్నాయి, పిల్లలు చదువుల కంటే చుట్టు పక్కల బూతులు ఎక్కువ వింటున్నారని భయపడి
అక్కడికి పది మైళ్ళ అవతల తూరుపు కనుమల కొండ కింద  సెంట్రల్ గ వర్నమెంట్  కాలనీకి మమ్మల్ని  తీసుకు పోయారు మా నాన్న.
*  *  *
ఈ కొత్త ఇల్లు, పోత పోసిన ప్రకృతి సౌందర్యంలో, ఎగిరే  వందల తూనీగల మధ్య, మామిడి  చెట్ల పక్కన, వాక మొక్కల మధ్య చాలా బాగుంది.
ఇక్కడ కూడా బర్మా కేంప్ లో రంగూన్ పళ్లెం లో ఎండబెట్టి నట్టే  అన్నీ ఎండలో పెడుతుంది అమ్మ,
గువ్వలు, గోరింకలు, కొండ పిచ్చుకలు పళ్లెం చుట్టూ తిరుగుతున్నాయి. వాటికి, రంగూన్ పళ్ళానికి కాపలా నేను.
ఒక రోజు ఏమి తోచక వొట్టి పళ్లెం ఇంటి కాంపౌండు లోపల పెట్టి, పళ్లెం లో పువ్వుల మీద తిరుగుతున్న బంగారి పిట్టలను నేనూ మా తమ్ముడూ చూస్తున్నాము.
” ఒరే…  ఒరే….  వేటి తో నైనా ఆటలాడండి గాని ఈ రంగూన్ పళ్లెం తో ఆటలాడొద్దు ఇది మా అత్తగారు నాకు గుర్తుగా ఇచ్చింది. “
అని తీసుకు పోయి దాన్ని  లోపల అటక మీద పెట్టేసింది అమ్మ.
*   *   *
పిల్లల చదువులై పోయాయి, పెళ్లిళ్లు అయిపోయాయి, పెంకుటింటి నుంచి విశాల మైన మేడ ఇంటికి మార్పు వొచ్చింది.
సంవత్సరంలో ఒకటో రెండు సార్లు మాత్రం రంగూన్ పళ్లెం తీసి దాంట్లో ఏమైనా ఎండ బడుతుంది తిరిగి జాగ్రత్త చేస్తోంది మా అమ్మ.
ఇంట్లో  దొంగలు పడి  బంగారం ఎత్తుకు పోయారు, మరోసారి ఇంటి పెరట్లో వున్న సీవాండి   బక్కెట్లు కూడా ఎత్తుకుపోయారు.
పెరట్లో చెట్లకు వున్న మామిడి కాయలు, ములక్కాడలు కూడా ఎత్తుకు పోయారు.
అదృష్ట వశాత్తు ” రంగూన్ పళ్లెం ” మాత్రం ఎవరూ పట్టుకెళ్ళలేదు.
అత్తగారికిచ్చిన మాట నిలబడింది.
ఇప్పుడు మాత్రం  ఏడాదికో సారి దీపావళి టపాకాయ సామాను మనవలు, మనవరాలి  కోసం ఎండలో పెట్టాలంటేనే మాత్రం  పళ్లెం బయటకు తీస్తుంది. తిరిగి అంతే పద్ధతిగా జాగ్రత్త చేస్తుంది.
*   *    *
బర్మా నుంచి వొచ్చిన ఆ పళ్లెం అరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది..
వ్యాపార వ్యహారాల  నిమిత్తం బర్మా వెళ్లి వొచ్చినా గోదావరి జిల్లా శెట్టి బలిజీలవడం వలన మాకు బౌద్ధం అంటలేదు,
విశాఖ జిల్లా బర్మా కాందిశీకుల అలవాట్లూ అంటలేదు.
ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపిన ఎర్రజెండా పార్టీ మాత్రం  బర్మా కేంప్ లోనే  మా కుటుంబానికి  ఎక్కువయింది.
మిగతా సమాజం లాగే శెట్టి బలిజీలకు ఎక్కువమందికి డబ్బు పరుగే ముఖ్యమయ్యింది.
ఈ మధ్య కురిసిన వర్షాలకు బర్మా కాందిశీకుల ఇల్లు శిధిలమయ్యాయి.
మూలవాసులు, బహుజనులు బర్మా క్యాంపులో, కంచరపాలెంలో పండగలకు స్థలం లేక రోడ్డు మీదనే అమ్మవారి అగ్ని గుండం,  శూలాల పండగలు జరుపుకుంటున్నారు.
క్యాంపులో బుద్ధిడి విగ్రహం పై మరకలు మిగిలాయి.
ఈ వూరు  లో కూడా ఏనాటికి కాందిశీకులుగా మారకుండా చూడు బుద్ధ భగవాన్ అని  ధర్మానగర్లో బుద్దుడి పటం  ముందు  కొవ్వొత్తులు  వెలిగిస్తున్నారు.
‘రంగూన్ పళ్లెం’ మాత్రం చెక్కు చెదరకుండా  అలానే వుంది.
*

హరివెంకట రమణ

కొంతకాలం హైదరాబాద్ , విశాఖ లో చిన్న పత్రి క‌లలో ప‌నిచేసాను, త‌రువాత యానిమేష‌న్ రంగంలో చాలా కాలం ఉన్నాక మున‌సోబు ఫ్లుకువోకా ( జపనీస్ రైతు ) ప్రభా వంతో ఉన్న ఉద్యో గం వ‌దిలేసి స్వతంత్రంగా బ్రతకాలనే నిశ్చ‌యంతో ఫ్యాకల్టీ ,కన్సల్టెంట్ , మార్కెటింగ్ , ఎన్‌జీవో ఇలా ర‌క‌ర‌కాల వృత్తులు చేసేను , చేస్తున్నాను. కొన్ని డాక్యూమెంటరీలు, మరికొన్ని యానిమేషన్ చిత్రాలు తీసాను. చాల తక్కువ కథలు పత్రికలలో వొచ్చాయి , తెలుగు మ‌రియు సోష‌ల్ వర్క లో పీజీలు చేసేను. భార‌త ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక యువ‌జ‌న అవార్డు 2014 లో వచ్చింది. ప్రస్తుత నివాసం విశాఖ‌ప‌ట్నం.

14 comments

Leave a Reply to P V RAMA SARMA Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • The author never seems to stop amazing readers with his writing. Thoroughly enjoyed reading and visiting the good old times that I’ve never been to.👏

  • రంగూన్ పళ్ళెంలో చాలా జ్ఞాపకాలను దాచారు,పళ్ళెంతో పాటుగా, కాందిశీకుల ఆత్మ కనిపించింది మీ ‘రంగూన్ పళ్లెం’ ద్వారా

  • రంగూన్ పళ్లెం కధ చాలా బాగుంది.పల్లెన్ని కధ అంశం గా చేసుకొని కధను మలచడం అభినందనీయం

  • చాలా బాగుంది సార్ ఈ కధ లో విశేషాలు కూడా నచ్చాయి చాలా చక్కగా చెప్పారు ఆసక్తి కరంగా ఉంది మిత్రులు శ్రీ హరి గారు కి హృదయ పూర్వక అభినందనలు మీరు రాసిన కధలు చాలా చాలా బాగున్నాయి మీ చిన్ననాటి అనుభూతిని చాలా చక్కగా వివరించారు , ఇంకా ఎన్నో మంచి కధలు మీరు రాయాలి చాలా సంతోషం సార్. 😊🤝❤

    • Thank you Ananya, Kiran palepu, korada rambabu, laksman rao sadasivuni,Srinivas manohar dwarampudi for your feed back on the story.

  • Very nice narration. My fore fathers also fro Bandar. They worked as Port cooli mesthries. Some r setteled at Barma. The story make me to remember them. Nice Hari garu.

  • రంగూన్ పల్లెము కథ బాగా సాగింది. అప్పటి రోజుల్లో వస్తువు గురించి చెప్పడం చాలా బావుంది.

  • ఎప్పటిలాగే మీ కథనం ఆసక్తికరంగా ఉంది. బ్రతుకు తెరువు కోసం బర్మా, సిలోన్ వంటి దేశాలకు వెళ్ళిపోయి, ఆతరువాత తిరిగివచ్చిన మన తాతల కధలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. బర్మా తీపి గుర్తు గా మిగిలిన రంగూన్ పళ్లెం జ్ఞాపకాలు చాలా బాగా చెప్పారు. పనిలోపనిగా “చింతపండు తింటే చెవిలో గులిమి వచ్చేస్తుందనే”చిన్ననాటి తీపైన చింతపండు భయాన్ని బాగా గుర్తుచేశారు. 🙂 ☺️

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు