యే మౌసం కి బారిష్, యే బారిష్ కా పాని….

“వర్షం వస్తోంది, బట్టలు లోపలికి తీసుకురా”. ఈ డైలాగ్ ఎంతమంది చెప్పి ఉంటారు? ఎంతమంది విని ఉంటారు?  ఈ మాట అంటున్నప్పుడు వర్షం పెద్దగా ఉండదు. ఒకటి చిన్నబొట్టు, మరొకటి కాస్త పెద్దదిగా, ఒక్కో బొట్టు రాలుతూ ఉంటుంది. ఆ ఒక్కో బొట్టు మనల్ని తాకిన ఙాపకం అలా అంతరాల్లో చిక్కడిపోయి, తలుచుకోగానే ఒక చిరునవ్వు వస్తుంది. ఈ ఒక్కో బొట్టు మనని తాకిన వైనం, జోరు వానలో తడిచిన జ్నాపకం, చిటపట చినుకుల్లో వచ్చే రాగం, చిరు తుంపరలు మొహాన్ని కడిగిన వైనం గుర్తు చేసుకోకుండా ఉండలేము.

ఇండియా మాన్సూన్ అనగానే సైకిల్ పైన నేను రయ్ మని తడుస్తూ వెళ్ళిందే గుర్తు వస్తుంది. కొన్ని రోజులు సైకిలు పైనా, తరువాత మోపెడ్ కొనుక్కున్నా అదే పద్దతి. నీరు చిమ్మాలని, కావాలనే నీటిగుంటల్లోంచి వెళ్ళేదాన్ని, ఎక్కడైనా ఆగొచ్చుగా అని అమ్మ అనేది. ఆగితే చుట్టూ ఉన్నవారు చూస్తా ఉంటారు అది నాకిష్టంలేదు ఇలాగే తడుస్తూ ఇంటికి వచ్చేస్తా అని చెప్పేదాన్ని. ఇప్పుడన్నీ డాబా ఇళ్ళు, పెంకుటిల్లు చూరునుంచి కారే వర్షం కింద చేతులు పెట్టి ఆడే అదృష్టం ఎవరికి ఉండటం లేదు. చుట్టూ ఆరేసిన బట్టల మధ్యన,  ఈ చొక్కా నాన్నది, ఈ పూల చీర అమ్మది, ఈ స్కర్ట్ నాది అని లెక్కేసుకుంటూ నిద్రపోవటం ఇంకా గుర్తే.  . వర్షం తగ్గేలా లేదు అని అమ్మ లాంతరులు తయారుగా పెట్టేది. లాంతరు అందం కొవ్వత్తులకి, టార్చ్ లైట్లకి ఎక్కడుంది? వాన నిజంగానే చుట్టంలా అనిపించేది. వానొచ్చి తగ్గిన తరువాత కాస్త గుబులుగా కూడా ఉండేది. వానలో ఏదో ఉంది. ఎన్నో కథలు, ప్రేమలు, బాధలు కలగలుపుకుని ఉంటాయి.

ఋతుపవనాలు (మాన్సూన్) ఆ పదంలోనే ఎన్నెన్నో కథలు దాగి ఉంటాయి. కేవలం ఆసియాలోనే మాన్సూన్ సమయం వస్తుంది. అందులోను, భారతం లో మాన్సూన్ ఒక అందమైన ప్రకృతి దృశ్యం. అందుకే మన చలన చిత్రాలలో వానపాటలు ప్రసిద్ది. బర్సోరా మేఘా అన్నా, ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వానా అన్నా, టిప్ టిప్ బర్సా పానీ అన్నా, చిటపట చినుకులు అరచేతుల్లో ముత్యాలైతే ఐతే అన్నా, గీలా గీలా పానీ అన్నా, యే మౌసం కా బారిష్ యే బారిష్కా పానీ అన్నా, లగీ ఆజ్ సావన్ ఫిర్ ఓ ఝడీ హై అన్నా, ఇలా ఎందుకు వానపాటలు ఉంటాయో, వాటి వెనక మాన్సూన్ కథలు ఎన్నో, ప్రపంచానికి పెద్దగా అర్థం కాదు. ఉత్తర అమెరికా , దక్షిణ అమెరికా ఖండాల్లో కొన్ని దేశాల్లో సంభవించినా అవి పెద్దగా చెప్పుకోదగ్గవి కావు. ఇన్నీ చెప్పి, గీతాంజలి జల్లంత కవ్వింత కావాలిలే చెప్పకపోతే అన్యాయం చేసినట్లే.

ఇందులో మాన్సూన్ అందాలు మణిరత్నం హృదయానికి హత్తుకునేలా చూపించారు. ఎంత తీరిక లేకపోయినా మాన్సూన్లో ఇలాంటీ ప్రదేశానికి ఒకసారైనా వెళ్ళి రావాలి. కొంకణ్ ప్రదేశం మొత్తం మాన్సూన్లో చాలా అందంగా ఉంటుంది. కొంకణ్ రైల్వే, మాన్సూన్ లో ఎక్కి, ట్రెయిన్ నుంచే ప్రతి ఊరూ పలకరించుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుందో.  ఇటు నైరుతి రుతుపవనాలు, అటు ఈశాన్య రుతుపవనాలు, ప్రకృతి ప్రేమికులకు, కవులకు గొప్పవరాలు. అతివృష్టి పంటలు ముంచినా, రోడ్లు ముంచినా ఆ కష్టాలు మళ్ళీ వేరుగా ఉంటాయి. ఏది ఏమైనా, వర్షం సాక్షిగా జీవితాన్ని కొంత బకెట్లో పట్టి నింపుకుందాము. ఇవి అందరికి దొరికే మాన్సూన్ కాదు. మొక్క జొన్న పొత్తు తింటూ దివి నుంచి భువికి దిగివచ్చిన వయ్యారి వానని ఆస్వాదించడమే. ఋతుపవనత్వం ఓ గొప్ప తత్వం. పిర్యాదులు చేయకుండా ఈ మాన్సూన్ తో మనసుపూర్తిగా మమేకం ఐపోండి. ముంచుకొచ్చే మేఘాలని ఒకసారైనా చూడాలి మరి.

కేరళ బుందేల్ఖండ్లో మొదటగా రుతుపవనాలు తాకుతాయి. మాన్సూన్ సీజన్లో ఇండియాలో ఉండాలి అనేకునేవారు చాలా మంది ఉంటారు. మరి అంతటి అందమైన ప్రకృతి దృష్యం ఇంక ఎక్కడా సంభవించదు. అడపా దడపా వానలు తప్ప, మాన్సూన్ కథలు అందరికి లేవు. ఉన్నవారు పట్టించుకోకుండా పరుగులు పెట్టవద్దు.

*

విజయ నాదెళ్ళ

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Good writeup. Yes, let’s enjoy the monsoon and the beautiful monsoon stories

  • బాగుంది. మాన్సూన్ వస్తోంది, వస్తోందని వూరి స్తుఃటే ఆ ఎదురుచూపులు అప్పుడు అది రాకుండా దిశమూర్చుకుంటే కలిగే నిరాశలు సాహితఱ్యంలో రాస్తే అదీ గొప్ప మెటఫర్ అవుతుంది నిజానికి. ఇప్పుడు విశాఖ కథ అదే.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు