నెల సరవ (పండగు నెల) పెట్టిందంటే సాలు మా వూరు సంబరంగా వులిక్కిపడతాది. వూరికి దూరంగా యిసిరేసినట్టుండే మా మాలపల్లిలో అందరి కండ్లల్లో కుశాల తొణుకులాడతాది. మాది రాళ్లనేల..! శీతాకాలం సలివణికిచ్చాది. అయినా అంత పొద్దన్నే సలిలో గడగడా వొణుకుతా, ఆడోల్లు వాకిలి ముందర కల్లేపులు సల్లి రంగురంగుల ముగ్గులు తీర్చుతారు. సలిని లెక్క చెయికుండా, చేందర బాయి కాడ కిర్రుం బుర్రుం అని నీళ్లు చేందుతా వుంటారు. మట్టి యిండ్లకి తువ్వ మట్టి అలికి, పేడసరి తీసి తెల్లంగా సున్నాలు పూస్సారు. పొద్దన్నే కప్పర కప్పర సీకట్లో లేసిన మడకలోల్లు ఎద్దల్ని కాడికట్టి – వాటి మెడల్లో మువ్వలు మదురంగా మోగుతుండగా కయ్యల్లేకి యలబారుతారు. యీదుల్లో ఆడాడా సలిమంట లేసుకోని సిన్నా, పెద్దా దాని సుట్టూ మూగుంటారు. అబ్బో! ఆ మంచు కురిశే దినాల్లో మా మాలాడనుసూడను ఎయ్యికండ్లయినా సాలవు సోమి..! అంత సక్కదనంగా వుంటాది.
తీగిలి చింతమాని కాణ్ణించీ, పరంటగా పారేదల్లాయ్యొంక పక్కనే మట్టి బాటెంబడీ వచ్చాంటే ముందుగా తగిలేది మారోల్ల మొండి సింతమాను. అదే మాలాడు గెమిటి, గెమిట్లో యించి సక్కంగాసూచ్చే దేవలంగా వుండే కొట్టం కనపడతాది, ఆ కొట్టంలోనే రాములసోమి, సీతమ్మ తల్లి కొలువుదీరిన పటం వుంటాది. దేవలంకి యిరుపక్కల యిండ్లుంటాయి. ముప్పయి గడపల మాలాడది. అన్నీ పూరిండ్లే. యిండ్ల మింద గొడుగు పట్టినట్టు చింత మాకులు. చింతల నీడల్లో మాలాడ ముడుక్కోనుంటాది. చింతచెట్ల కొమ్మల్లో కొంగులు గూల్లు పెట్టి కాపరాలుంటాయి. పొగులంతా మేత కోసరం ఎట్టపోతాయోగానీ, పొద్దుపొద్దుగూకే యాలకు గూటికి చేరుతాయి. అప్పుడు చింతచెట్లు తెల్లపూలు పూసినట్టుంటాయి. కేర్ కేర్ మంటా కొంగులు రాత్రంతా కచేరి జేచ్చాయి. ఎన్నెల కాలం కొమ్మల సందుల్లోంచి పడే ఎన్నిల, నేలమింద ఎండి తీగిల మాదిరి మెరుచ్చా వుంటాది.
నాకప్పుడు పదమూడేల్లుంటాయి. చిట్టేలి అయిస్కూల్లో సదూతాండా. ఆరోజు బోగిపండగ, మొండిగోడ మింద గాజు పూల కోడిపుంజు దానెబ్బా గంటేమో పొయినట్టు ‘కొక్కరొక్కో మని’ వొకటేమాయిన కూతేచ్చా వుండె. మాయమ్మ పాతకోక కప్పుకొని ఆయిగా ముడుక్కోని పొండుకోనుండిన నేను ఈ సద్దుకి మెలకవొచ్చి ఒక్క రవ్వ సందు జేసుకొని వోరకంటితో సూచ్చి, మాయమ్మ బయట వాకిట్లో కల్లేపు సల్లుతావుండె. పచ్చి పేడోసన ముక్కు పుటాలకి గాటుగా తగిలింది. నడింట్లో కూసోని మా చిన్నన్న టింగ్ టింగ్ మంటా తాంబుర్ర తీగలు సరింగా కడ్తావుండె. మావోల్లు ఈ సంకురాతిరి పండుగ మూడు దినాలే, వూర్ల మింద తిరిగి, తత్వాలు పాటలు పాడి దయగుల్లా మారాజులిచ్చిన నాలుగు రూకలు, నాలుగు నాళ్ళ బత్తెం సంపారిచ్చేది. నాగుండెల్లో దబీమని రాయిపడింది. ఈ పండక్కి గుడకా యింటికాడ లేకుండా.. బిచ్చానికి పోవాల్నా! నాకు బలే ఏడుపొచ్చింది. ముందురోజు రేతిరి నేనూ, నా సావాస కోపులు దేలంకాడ సలిమంటకాడ కూసోని ‘పండగా పూట చిట్టేల్లో సిరంజీవి సిల్మా సూడాలని, కొత్త గుడ్డలేసుకొని వూరంతా యిచ్చుకుంటా అలింగం తిరగాలని’ చెప్పుకున్నా మాట్లుగెవనాని కొచ్చి, ఈసారి ఏదో వొక సొడ్డు బెట్టి బిచ్చానికి పోకుండా ఎగ్గొట్టాలనుకుంటి. ‘అది కుదిరేటట్టు లేదే’ అని యసనపడ్తావుండా. యిట్ట నా దరిదప్రు ఆలోసిన్లో నేనుంటే మా చిన్నన్న నేనింకా నిద్దర లెయ్యిలేదని నా దగ్గిరికొచ్చి మెల్లంగా తడ్తా ‘లెయ్యిబ్బీ! అట్నే పొణుకోనుండావు పల్లెల మింద పోవద్దా!’ అన్నాడు నయికారంగా. నేను సివక్కన లేసి ‘పొద్దాల్క నేనే రావాల్నా మనోల్లందరూ పోతాండ్లా వోల్ల ఎనకంబడీ పోరాదా! నన్నిడిసిపెట్టి’ అన్నా నేను, కండ్ల నిండికీ నీళ్లు పెట్టుకోని. ‘ఈవొక్క పండక్కీ నా బడితా రాబ్బీ. సాలు!’ అన్నాడు చిన్నన్న. ‘నేనాన్రు నువ్వే పో..!’ అని గెట్టింగా కసిరి నిండా ముసుగేసుకొని ముడుక్కున్నా.
‘వోమ్మా! అబ్బి రాడంటమా ఎట్టజెయ్యాలమా’ అంటా బయిటుండే మా యమ్మతో బలే లోగొంతుతో చెప్పినాడు చిన్నన్న. దీంతో మా యమ్మకు తిక్క రేగిందేమో! ‘యిరుడ్డం నాబట్ట పిల్లోడితో ఎట్టయేగి సచ్చేదిరా దేముడా’ అని ఆగిత్తంగా తిట్టేదానికి మల్లుకుండె. మాయమ్మ సంగతి తెలిసిన్నేను, యింకా మొండకి బడి ఆలిసెంజేచ్చే పొరకేట్లు కొడతాదని తీరుమానం జేసుకోని గుబక్కన లేసినా. మాయమ్మ ఎట్టుంటాదంటే వొంటి మింద కండనే మాటే ల్యాకుండా ఎనికల గూడు మాదిరుంటాది. నల్లంగా వూటికట్టి మాదిరుంటాది. అసలికి మాయమ్మ వొద్దిగ్గానే వుండేది కాదు. సిక్కరా బక్కరా వుండేది. పనిమింద పడితే రక్కాసి మాదిరి చేసేది. యిప్పుడయితే మాయమ్మ సిన్నాపన్నా లేకండా తిడ్తా వుండాది గానీ, కడగొట్టుబిడ్డనని నన్ను బలే మురికం జేచ్చాది. మాయమ్మట్టాటి మంచిది మళ్ళీ ఈ బూమండలం మింద పుడ్తాదా కొడకా…!
‘అత్తా పిల్లోలింకా యలబారలేదే? మనోల్లంతా పయానం అవుతాండారు’ అంటా మాలచ్చిమి సినమ్మ వొచ్చింది. మాయమ్మ పందిటి గుంజకు ఆనుకొని నిలబడి ‘ఏంజెయ్యాలే మాలచ్చిమీ! చిన్న పిల్లోడు పోనని మొండికి తిరుక్కొనె, పండగా పూట పిల్లోల్లను పంపీయాలంటే’ అని మాట పొరపొయినట్టు గమ్మన కండ్లు తుడుసుకుంటా వున్నింది. అప్పుడు మాయమ్మ మొకం శానా దీనంగా వున్నింది. మళ్ళీ మా యమ్మే ‘వోసే! మనిది వుక్కిష్టం బతుకే! కడుపాత్తరం కోసరం పిల్లోల్లని వుదరగొట్టుకోని బతుకుతాండాం’ అని బారడు పొడుగు యాస్ట పోయింది.
పండగొచ్చిందంనే మాటేగాని మాయింట్లో బలే కటీనంగా వున్నింది. దరిద్దరం పాత మెట్తో కొడ్తా వున్నింది. మాయమ్మ వొక్క పూటే సంగటి జేసేది. పొద్దులచ్చుం పనికి పోతే, మజ్జానం సంగటి పెడ్తారు. అద్దెచ్చి నాకూ, తిక్కక్కకి, బుడ్డమ్మికి పెట్టేది పనికి పోకపోతే పచ్చే….
మా అయ్య తాగితాగి సచ్చిపొయినాంక కుటుంబరమంతా మాయమ్మ నెత్తినపడె. మాపెద్దన్న మగ్గం నేత పని నేర్చుకోడానికి తూరుపునాట మా అక్కోల్ల వూరికి పోయా..! మాసన్న పిల్లోలల్లో మా చిన్నన్నే వొక్కరవ్వ వురువుగా వుండే మొగబిడ్డ. మా సుట్టాలు ఎన్నుమింద గువ్వలయినారు. మేం నేదర బిడ్డలమని, దిక్కులేనోల్లమని దయే లేకండా మాయమ్మని వొంటిరి దాన్ని జేసినారు. మా పెదనాయినా చిన్నాయిన్లు నల్లనాగుబాంలు. మా నాయిన తాగడానికి అంతోయింతో లెక్కిచ్చి, ఆకైపు దిగక ముందే మాకు కలిగిన పదిసెంట్ల కయ్యిలో చెట్టు చేమల్లో బాగమే లేకండా మా అయ్య చేత కాగితం రాయిచ్చుకునిరి. ఇదేం నాయిమని మాయమ్మ లబలబా నోరుగొట్టుకుంటే, ‘నీమొగోడు జేసిన తప్పుల్కి వూర్లో అపరాదం కట్టినాము పోమ్మే’ అని మాయమ్మను ఉదరగొట్టిరి. సెంటు బూమి లేకండా, నిలువ నీడ లేకండా నిచ్చలికి నిలబడి పోయా, మాయమ్మ పడుబాట్లు మతికొచ్చే తలికి నా మొనుసు ఎట్నో అయిపాయ. సరేలే..! మాయమ్మను కష్టిపెట్టకుండా ఈ వొక్కతూరి పల్లెల మింద పోదాం అనుకుంటి.
కలేతుట్లు, పెడమల్లి తుట్లూ, గొంజి మండలూ వాకిట్లో వుడ్డేసి బోగి మంటేసినా చిన్నన్నా, తిక్కక్క, బుడ్డమ్మి సుట్టూ మూగినారు. మంటనాలికలు సాపుతా, ఆకాసిం సాయిల పైకి ఎగిరింది. గబగబా తలకి నీళ్ళు పోసుకొని, తాంబురా, జోలిగుడ్డలూ, రొండు గోతాం సంచులూ తీసుకోని చిన్నన్నా నేను యలబారినాము. మాలాడ కొసన, దల్లాయ్యొంక కాడ మా వోల్లని కల్సుకున్నాము. మా చిన్నన్న సాయిల సూడ్డానికే నాకు సగీలా, మూతి నల్లంగా పెట్టుకోని ఆయన ఎనకన్నే నడుచ్చాండా. వంక దాటుకోని పోతావుంటే, మాలాడు దూరం అవుతా వుండె. అసలికి ఈసారి బోగి మంట పోటీపడి యెయ్యాలనుకుంటి. అందుకే సెలవులిచ్చినాలి నుంచీ, నా సావాసగాళ్ళు దోసగాడు, నాగ్గాడికంటే జాచ్చిగా కంపతుట్లు కొడితి. యిప్పుడు వాళ్ల మంటెంత ఎత్తు పోయిందో సూణ్ణేల్యా…! నాపాటికి నేను యిట్ట పోతావుంటి.
మంచు బొరోమని కురుచ్చా వుండాది. చేతలమిందా, తలమిందా బూజర బూజరగా పడ్తా వుండాది. నేనూ, చిన్నన్న, రామింజిబావా ముందు పోతావుండాము. మా యెనక చినగుడ్డాయినా, మైరావుడు, యెంగుటదాసు సినయ్యా, గోపాల మామా ఎనక తొక్కులు తొక్కుతా వచ్చాండారు మాట్లాడుకుంటా. ముందర కోపాన పోతావుండిన రామింజి బావ వొక్క సిటక యెనక్కి తిరిగి ‘ఏం మనం పోతాండేది పెండ్లికా యెట్టా..? బిన్నా రాండి సోములాల..! పొద్దు మొలసక తలికే వూర్లేకి అడుగుపెట్టాల’ అన్నాడు తొట్టిబాయి దాటుకోని దొగ్గులపాడు దోవపట్టినాము. వూరి గెమిట్లోకి పోతానే కుక్కలు ‘గౌవ్’ మని గంగనాగోలగా తగులుకున్నేయి. ‘మీ ముండ మొయ్యా..! మంచి దొంగల్ని పట్టడానికొచ్చినారు గదానే, చేయ్.. చేయ్’ అంటా చినగడ్డాయిన వొంగి రాయి తీసుకోని వోటిలి మిందకు యిసిర్నాడు. మాదిగిండ్లు దాటుకుంటా వుండాము. వూరు దూరంగా కనపడ్తా వుండాది. వూరిపైన బోగి మంటల పొగ కమ్ముకోనుండాది. యేటి దావకాడ రేత్రులు యేటవతల మాడి తోపుకి కావిలుండే మాదిగోల్ల మూగిమామ ఎదురుపడి నాడు. ‘యేం దొరా! చిన్నబ్బే పల్లెల మింద పోతాండారా’ అని ముందుపొయ్యే చిన్నన్నని అడిగినాడు. ‘పండగ కదా మావా..! నాలుగు పూట్ల బత్తెం దొరుకుతాదని పోతాండాం సోమి’ చిన్నన్న చెప్పినాడు. ‘ఆ.. ఆ.. బద్రంగా పాండి సోమి..! మొబ్బుగా వుండాది. దావన పురుగు, బుట్టా సూసుకుంటా పాండి’ అంటా మూగి మామ మాదిగిండ్ల దావన పొయినాడు. ఆపక్కా.. ఈపక్కా ఇరువల్లా కంపచెట్లు యిరుకు బాట్లో పోతాండాము. చిన్నన్నని తొలిగేసుకొని వొక్క రవ్వ ముందు పోతాండే నన్ను ఎనక నుండి నిలేసినాడు చిన్నన్న. ముందర జూచ్చే మొబ్బులో బాటకి అడ్డంగా లావు కట్టి మాదిరి ఏందో వుండె. చినగుడ్డాయన అగ్గి పెట్టె ఎలిగిచ్చా. యెలుతుర్లో నిమ్మళంగా పొడుకోనుండాది పెద్దపెంజిరి బట్టలు బట్టలుగా. దాన్ని సూచ్చానే నాకు నిరుగుండి పడిపొయ్యింది. ‘వోర్నీయమ్మాసోని! వొక్క రవ్వలో అన్యాలంగా తొక్కుతాంటినే అని బయింపడినా. చిన్నన్న నా యీపు మింద తట్టి పక్కనే తారాడి సందిట్లావు గుండునెత్తి దానిమింద గురీగా యేసినాడు. గుండు పుట్టాచెండు ఎగిర్నట్టు ఎగిరె. ఆ దెబ్బకి వుగిత్తలగా ఎగిరి చెట్టల్లో పడి కనపడకుండా పాయ పెంజిరి. చీకిచెట్ల మింద గుడ్లగూబ కిలారిచ్చా కూశ. యాణ్ణుంచో కొంగు కూత యినబడె. మేం బిత్తరగా బిత్తరగా గబగబా నడుచ్చా మాదిగిండ్ల మడుక్కాడ యేట్లేకి దిగినాము. యేట్లో నీళ్లు మోకాళ్లోతు గుడకా లేవు. సదరంగా పార్తాండాయి. ఈ యేరు మాకు కొత్తేమీ ల్యా.. పాత సుట్టమే. ఎండాకాలం వొచ్చిందంటే సాలు మా ఆట్లన్నీ ఈ యేట్లోనే. దొరివికాడ మునగబెండ్లూ, సొరకాయ బురల్రూ నడుంకి కట్టుకోని ఈతకొట్టేది యేటిపాయలో కొడాలు, సిటారి వలలేసి చాపలు పట్టేది. మాటేలప్పుడు యేటి యిసికిలో బలిగుడ్డాడేది. వోయమ్మో..! ఎండాకాలం యేరు రామన్న దాడిగా వుంటాది. ఈ సలికాలం సద్దు లేకండా సల్లంగా ఉండాది. అంత పొద్దన్నే నీటి కోళ్లు, బుడుంగు బుడుంగుమని నీళ్లల్లో మునుగుతాండాయి. నీళ్లల్లో నడుచ్చాంటే చేప పిల్లలు కాళ్లు కొరుకుతాండాయి.
యేటి వొడ్డున తుంగావోల్ల చేనికాడ గట్టెక్కినాము. పసుపు చేలల్లో వుండే ఆందిం చెట్లు ఎత్తుగా వుండి దెయ్యాలాల వూగుతాండాయి. తువ్వ చేల గెనాల మింద నడిసి అలసందచేలూ, మిరప తోటలూ, మామిడి తోపులూ దాటుకోని తుమ్మచెట్లపల్లి గెమిట్లో పాడుబడిన చేందర బాయికాడికి పొయినాము. అందరం బాయి గుట్టున కూసున్నాం. యాణ్ణించో చిన్న అద్దం పెంకు తెచ్చినాడు రామింజి బావ. అందరూ కుంకాలు, నాంకోపు సాదుకోని నిలువునామాల తిరుమణి తీర్సినారు. నాగ్గుడక పొడుగ్గానామం పెట్నారు.
జోలిలు బుజాలకు తగిలిచ్చుకోని, తాంబుర చేతబట్టి నలగురం నాలుగు దోవలయ్యి వూర్లేకి అడుగు పెట్టినాం. నేనూ, మాచిన్నన్న వొకింటి కాడికి పొయ్యి వాకిట్లో నిలబడి తాంబుర టింగుటింగ్ మని వాంచుతూ ‘నా రాత యిటులగల్గె ఏమి చేతునో రామా ఎటుల తాళుదో’ పాటెత్తుకోంగానే ఆ యింట్లో వొక ముసిలాయన వొడిశల్లో రాయి మాదిరి బయిటికొచ్చి ‘సాల్లే… సంబడం బయిటికి పాండ్రా ముందు, దున్నపోతు కుర్రలాలుండారు. పనీబాటా జేసుకోలేరా..! ఉద్దరగా దొబ్బక పోడాన్కి వొచ్చినారే.. పండగా పూట దరిద్దరంగా’ అంటా కట్టి దీస్కోని ఎనుముల్ని అదిలిచ్చినట్టు తరిమినాడు. మా మొకాలు అంతరవ్వయిపొయినాయి. దయిగుల్లా మా చిన్నన్న ఎంతో శాంతపరుడు నాకంటే, నాలుగేండ్లే కదా పెద్ద. ‘ఏందిరా… సోమి ఇట్టయిందే’ అని యసనపడినాడు. మేం దిగులు మొకాలేస్కోని తిరుక్కోని వచ్చాంటే దోవలో వొకాయమ్మ ఎదురుపడింది. ‘వోబ్బీ..! మీరు దాసుల పిల్లోల్లు గుదా!’ అని అడిగి ‘ఆ ముసిలోడేంది తిడ్తావుండాడే మిమ్మల్నేనా..? వోడొక పీనాసోడు, ఆ వోగు నా బట్టతో మీకేం పనిగానీ రాండి మా యింటికి మీరేమన్నా దినాం వచ్చేవాళ్లా ఏమన్నానా’ అంటా వాళ్లింటికి తొడకపోయింది. ఆ మకాతల్లి మాచేత పాటలు పాడిచ్చుకోని దండిగా బియ్యం, బేళ్లూ జోల్లో బేసింది. యిల్లిల్లూ తిరుగుతా వొకంటి కాడికి పొయ్యేతలికీ శానా మంది గుంపుగా వుడ్డ జేరివుండారు. వోల్లల్లో వొకామె ‘వోబ్బీ.. మీకు బెమ్మంగారి పాట్లొచ్చాయా..!’ అని అడిగింది. ‘వో.. కొల్లగా పాడ్తాం మా’ అన్నాడు చిన్నన్న వుసారుగా. మాకు పాటలు పాడేది వొకలెక్కా జమా! మేమప్పిటికే బెమ్మంగారి డ్రామాలో యేసికాలు కట్టి వూరూరు తిరిగుంటిమి. కమ్మూసాబట్టాంటి మకాను బావుడే మమ్మల్ని మెచ్చుకోనుండాడు. ఆయమ్మ ఏరికోరి వుయ్యాలపాట పాడమనింది. బెమ్మంగారి డ్రామాలో ఆ పాట పాడేది బలే కష్టిం. ఆర్మోని పెట్టి లేకండా అసలే పాడలేం! అయినా గుక్క తిప్పుకోకుండా బలే పాడ్నాడు చిన్నన్న. ఆయమ్మ బెమ్మంగారి పాట్లంటే పడిసచ్చే తిక్కపాడుగా వుండాది. మమ్మల్ని పందిలి కింద కూసన బెట్టి కడుపు నిండికీ దోసిండ్లు పెట్టింది. తిన్నాక మాజోల్లో అరచాట బియ్యం, వొట్టి మిరక్కాయలు, బేళ్లూ ఏసిందా దయగల్లా తల్లి. ఆయిల్లు దాటుకొని వచ్చాంటే దావలో బురక్రతలు చెప్పే రామన్న ఎదురుపడినాడు. ఆయిన యిద్దరు బార్యలూ, యిరువల్లా గుమ్మిట్లు వాంచుతావుంటే, ఆయన తంబురా వాయించుతా మా మాదిరే యిల్లిల్లూ తిరుగుతాండాడు. ‘ఏం నాయినా ఎట్టుండారు..? ఏమన్నా జరుగుబాటుండాదా?’ అంటా రామన్న మంచీ, చెబ్బరా అడిగినాడు. పక్క యీదిలో జంగమాయన వూదే శంకం బూమని యినపడతా వుండాది. యింకొక యింటికాడ బుడబుక్కలాయిన బిచ్చి మెయించుకోని బుడక్కు బుడక్కుమని బుడక వాయించుతూ మమ్మల్ని జూసి పలకరింపుగా నగినాడు. సంవత్సరం పొడుగూతా కడుపు చేత పట్టుకోని చెట్టుకొకరు, పుట్టకొకరూ ఎట్టపోతారో గాని, ఈ పండగ దినాల్లో మటుకు పల్లెల మిందకి బిచ్చానికొచ్చారు.
రేపటెండలో ఆ వూరు బలే శింగారంగా వుండాది. ఆ వూర్లో యాడ జూసినా బోద కొట్టాలు, సైకలే. ఆడాడా ఎక్కిరిచ్చినట్టు వొక మిద్దిల్లుండె. గోడలకి తెల్లంగా సున్నాలు గొట్టి వోటిమింద బలే వొద్దిగ్గా ముగ్గులేసిండారు. గుమ్మడిపాదులూ, సొరపాదులూ, కొట్టాల మిందకి ఎగుబాకి బోదపైన పూలు పూసిండాయి. వాకిండ్ల ముందు రంగురంగుల ముగ్గులేసి వాటిల నడిమద్దెన పేడ ‘సల్ల’ బెట్టి గుమ్మడి పూలు గుచ్చిండారు. ఎంతో నాణెంగా యేసిన ఆ ముగ్గులు తొక్కకండా ఎణంగా ఎణంగా నడచ్చా యింటింటి కాడికి పోతాండాము.
ఆ వూర్లో నా యీడు పిల్లోల్లు రంగురంగుల కొత్త గుడ్డలేసుకోని తూనీగల మాదిరి తిరుగుతాండారు. యెడకారు పిల్లోల్లు గుంపులు గుంపులుగా యాడికో పయానమై పోతాండారు. మేం యిల్లిల్లూ తిరుగుతాంటే మా యెనకంబిడే వచ్చాండాడొక పిల్లోడు. వోడిది ఈ వూరే. నాతోపాటూ చిట్టేలి అయిస్కూల్లో సదూతాండాడు. వోడట్ట మాతోటి తిరిగేది జూసి వోల్లమ్మకి అగుమానం అనిపిచ్చిందేమో. ‘సూడమ్మే! మా పిల్లోడు బిచ్చిగాళ్ల ఎనకతోక బట్టుకోని తిరుగుతాండాడు..! వోణ్ణి ఏ మెట్టుతో కొడ్తే కర్మాలు తీర్తాయి తల్లా’ అంటా పక్కనామితో చెప్తావుండాది. ‘వోరే వోల్ల ఎనకనే పోతాండా.. అడక్క తినడానికి, నువ్వు గుడకా వొక జోలి తగిలిచ్చుకోరా..! జోగులోడా. రారా యింటికి బగిశీనం చెయ్యికుండా’ అంటా వోల్లమ్మ నెత్తీ నోరు గొట్టుకుంటా అరుచ్చా వుండినా, వోడామి మాట యినకుండా యిరుడ్డంగా మాయెనకనే వచ్చావుండె. వోల్లకి మా మాలాడు ఉత్తరంగా పోడు బూములుండాయి. మా మాలాడ్లో వొక్క రూంత మందికి గుడా చేనే లేకండా వుంటే, యింత దూరంలో వూరుండే వోల్లకి అంత బూమెట్టా వచ్చిందో..! యోసిన జేసినా….. నా తలకందక పోయా. ఆ వూర్లో నాతోపాటూ సదివే శానా మంది పిల్లోల్లు నా అవతారం జూసి నగుతాండారు. మా తరగాతి సదివే వొకమ్మి గుడకా వోల్లల్లో వున్నింది. వోల్లట్ట నగుతాంటే నాకు బలే సిగ్గుగా వున్నింది. ఈ యమ్మిగనా బళ్లో నాగురించి అందరికీ చెప్పి బగిశీనం చేచ్చాదాసోమి..! అనుకున్నా. అందుకనే వాళ్ల మొకాలు సూడకుండా తలకాయి వొక పక్కకి వొరగేసి పోతాండా, వోల్లని సూడనట్టు. నేను మొకం నల్లంగా పెట్టుకోనుంటే మా చిన్నన్న ‘ఏంబీ..! ఈల్లంతా నీతోపాటి సదివే పిల్లోల్లా’ అన్నాడు నిరామయింగా.
యీల్లందరినీ జూచ్చాంటే నా గాలి యింటి మిందికి మల్లె. ఈ టయింలో నా సావాసగోల్లు యింటి కాడ ఏం జేచ్చా వుంటారో..! బలే దిగులు పుట్టింది. వుగ దెల్సిన కాణ్ణించీ పతి పండక్కీ బిచ్చానికి పల్లిల మింద పోడమే. వొక్క పండక్కన్నా యింటి కాడుండి, అరువుగా కొత్తగుడ్డలేసుకోని కుశాలగా సావాస గాల్లతో తిరిగేదే ల్యాకపాయ. యిదేంది సినిగిపొయ్యిన గుడ్డలేసుకోని యిల్లిల్లూ తిరుగుతా బిచ్చిమెత్తు కునేది. తూ…తూ…! ఏం బతుకిదని రోత పుట్టె. యిట్ట ఆలాసిన జేచ్చాంటే నా కండ్లల్లో నీళ్లు జలజలా రాలె. మాయన్న సూడకండా కండ్లు తుడుసుకుంటి. మాయమ్మ బలే కనికిష్టపు ముండ గదా..! అనిపిచ్చే. లేకపోతే సిన్నబిడ్డల మని సూడకుండా యిట్ట బిచ్చానికి అంపిచ్చాదా…! మాయమ్మ మింద కోపమొచ్చి తిడ్తా మనుకున్నప్పుడల్లా మాలచ్చిమి సినమ్మ చెప్పింది గెవనానికికొచ్చాది. ఏమంటే..! అప్పుడు నేను వుయ్యాల్లో బిడ్డనంట. మాయమ్మ బాలింతరాలు కదా..! ఆ రోజంతా పచ్చేనంట. మాపెద్దన్న కూలికి పొయ్యి పొద్దు గూకి సీకటి ముసురు కొనే యాలకి వడ్లగింజి లెత్తుకోని వచ్చినాడంట. పెద్దన్నా, మాయమ్మ గింజలు రోట్లో పోసి దంచుకుంటా నా వుయ్యాల సాయిల జూసిరంట. బారడు పొడుగు పీతిరి నాగుబాం వుయ్యాల కింద కోళ్ళ గంపెక్కుతా వున్నిందంట. అంతే! మాయమ్మ కపుడు అంత శగితి ఎట్టొచ్చిందో, వొక్క అదాట్న దాని ముందు దూకిందంట. ఆ పాము యెలవరక పొయ్యి, మాయమ్మ కాలెక్కి నడుంకి సుట్టుకొనిందంట. వోయమ్మా.. వోనాయినా… అని మాయమ్మ బిత్తర పొయ్యి కేకలేచ్చాంటే, ఏం జెయ్యాలో తెలీక మా పెద్దన్న గడగడా పదుర్తా వుండాడంట. చినగుడ్డాయినా, పెద గుడ్డాయినా వొచ్చి ఆ పాంని సంపేసినారంట. యెట్ట బతికినాతల్లా…! పాం నడుముకి సుట్టుకున్నా గానీ.. అని అందురూ అంటా వుంటే మా యమ్మ నిశ్చలకపొయ్యి నిలబడి వున్నిందంట. ‘పాపి లంజిముండ గదరా మీయమ్మ..! ఈ శిత్తర శమంతా పడాలనుంటే అంత వుర్దాగా ఎందుకు సచ్చాది?’ అంటా మాలచ్చిమి సినమ్మ ‘తగ్గొరే..! కడగొట్టోడా..! సెడగొట్టేనా కొడుగ్గా వుండావే..!’ అంటా నయికారంగా తిడ్తా వుంటాది. యిట్ట ఆ మాట గేపకం వచ్చానే మాయమ్మ మింద కోపమంతా పొయ్యి, నా కండ్లనింటికీ నీళ్ళోచ్చాయి. పోనీలే పాపం మాయమ్మ..! ఏం పని చెప్పినా ఎదురు తిరక్కండా చేజ్జాం అనుకుంటా..!
మేం తుమ్మచెట్టపల్లంతా తిరిగే తలికీ పొద్దు పరంట పక్కకి వొంగింది. నీరెండ నిగడ కాచ్చా వుండాది. వొల్లంతా చెమటపట్టి చిమచిమలాడ్తా వుండె. తిరిగి తిరిగీ కాళ్ళు పెరుకుతా వుండాయి. యాలబడి పోతా వుండా..! ఆకిలికి తట్టుకోలేక సొట్టలు, సొట్టలుగా నడుచ్చా వుండా. పాపం చిన్నన్న వాటం గుడకా నా మాదిరే వుండాది. చిన్నన్న కడుపుగల్లోడు, ఆకిలికి అసలే తట్టుకోలేడు. ‘ఎందుకునా.. ఈ యాతనంతా మన రొండూర్లలో తిరిగితే పోలా..! యేంటికి యింత దూరం వొచ్చి ఆకిలికి సచ్చేది’ నిస్టూరంగా అన్నా చిన్నన్నతో మా యన్న చిన్నంగా నవ్వి ‘నీకు తెలీదు లేబ్బీ… వుండూర్లో బిచ్చానికి పోతే కీతాగా జూచ్చారు. యిట్ట దూరంగా వచ్చే ఏందోలే పండగ పూటా వొచ్చినారని మంచిగా ఆదరిచ్చారు’ యిలావరిగా చెప్పినాడు. వొచ్చిన బీమూ, బేళ్లూ, వొట్టి మిరక్కాయలు, గోతాం సంచిలో పోసి మల్లా ఎత్తకపోతామని చెప్పి వొకింటి పంచలో పెట్టినాం.
‘యింక పాదాం పాబ్బీ..! మిట్టపల్లె మాలాడ కాడ జయక్కోల్ల యింటికాడ బువ్వతిందాం..’ అన్నాడు చిన్నన్న. మేమెప్పుడొచ్చినా జయక్కోల్ల యింట్లోనే అన్నాలు మాకు. జయక్క మా చలమాలోల్ల ఆడబిడ్డ. ఆయక్కని మిట్టపల్లి మాలోడ్లో సుబ్బరాం మామకిచ్చినారు. వొక రవ్వ నిమ్మితిగా వుండే కుటుంబరమే వాళ్లది. మేం జయక్కోల్ల యింటికి పొయ్యేతలికి పొద్దువాటాలింది. మమ్మల్ని జూసి జయక్క ‘రాండి నాయినా..! మీ కోసరమే ఎదురు సూచ్చాండా..! అంటా జలదాట్లోకి పొయ్యి కాల్లూ, చేతులూ కడుక్కోని రాండి’ అనింది. పందిలి కింద నులక మంచంలో పొండుకోనుండిన సుబ్బరాం మామ.. పండగ్గదా.. సారాయి తాగినాడేమో… ‘ఎరప్రిల్ల…! నీమొగుడు యేసినకాడే, వో డెంత బాగుండాడు చెంచిలిగాడు’ అంటా పాడ్తా వుండాడు. మమ్మల్ని జూసి సివక్కన లేసి కూసోని ‘ఏం సాముల్లాల! ఆలీశం అయ్యిందే..! మీయక్క మీ కోసరం ఎదురు సూచ్చా అన్నం తినమన్నా తిన్లే’ అన్నాడు. జయక్క మమ్మల్ని నడింట్లో పీటేసి, కూసనబెట్టి యిస్సరాకేసి కూడూ, కూరా, అలసంద వొడలూ కొసిరి, కొసిరి పెట్టింది. కూడూ, కూరా మాయింట్లో పిరిం కదా..! నేనయితే ఆవురావురుమని పొట్ట నింటికీ తింటిని. అప్పుడు జయక్క మొకం బలే నిమ్మళంగా వుండింది.
మేము మిట్టపల్లి, కచ్చురోపల్లి తిరిగే తలికీ ‘గుడుగుప్ప నారాయినా’ అని పొద్దుగూకింది. పొద్దన ఏమకాతల్లి తొలీగా బిచ్చిమేసిందో గానీ బియ్యం, బేడలూ, అత్తిరాసాలు మొయ్యిలేనంత బొరువు. నూర్రూపాయిలు లెక్కగుడకా వొచ్చింది. మూటల్నెత్తిన బెట్టి వూరుదాటుకోని వొచ్చేతలికి, పొద్దన చిల్లాపల్లా పొయినోళ్లంతా వూరి పొలిమేరల్లో వుడ్డగా చేరిండారు. మూటలెత్తుకోని యేటి కాడ వొడ్డున బొరువు దించి రూంత సేపు కూసున్నాం. వొడ్డున చెట్ల మింద గూళ్లకి చేరే పిట్టలు కాసర బీసరగా అరుచ్చాండాయి. యేట్లో చాపలు జిలజిలమని ఎగుర్తాండాయి. మా తలలపైనుంచీ బుర్ మని గువ్వల గుంపొకటి పొయింది. బేక్ బేక్ మంటూ యేట్లో నీళ్లల్లో బొల్లికోళ్లు ఈదులాడ్తా వుండాయి. సీకటి దట్టంగా అలుంకొనే యాలకి, సలి ముసురుకుంటా సల్లంగా వుండాది. పండగ సద్దంతా సప్ప సల్లారిపోయింది.
యేరు దాటి మా యిండ్లకి పొయ్యేటపిటికి, దీపాలు పెట్టే జాము దాటిపొయింది. సీకట్లో నిలబడుకోని మాయమ్మ మాకోసరం దోవలు ఎగజూచ్చా వున్నింది. యింట్లో ఎవురికీ కొత్త గుడ్డలనే మాటే ల్యాకండా నాకూ, బుడ్డమ్మికి మటుకే తెచ్చిండారు. ఆ గుడ్డలేసుకోని యిప్పుడీ చీకట్లో నా సక్కదనమంతా ఎవురికి సూపిచ్చేది. బండమిందకీ, వొంటి మిందకీ తప్ప గుడ్డలే లేని మాయమ్మ పాత కోకనే సలవ జేసి కట్టుకోనుండింది. మమ్మల్నట్ట పంపిచ్చి, ఆరోజంతా మాయమ్మ తినిందో లేదో ఎవురికి యెరుక కొడకా..!
*
మా ఊర్లో బతుకుని చూసినట్టు ఉంది. పెంచల దాసే రాయగలిగినట్టు ఉంది.
శీర్షికనే గొప్ప కవిత్వం.
ఇంకా కథ అద్భుతం.
చాలా చాలా బాగుంది సార్. 🙏
బడుగు బతుకు యాతన, నా గుండె బరువెక్కె ఒక్క మోపున
పెంచల్దాసూ ఎంత మంచి కత రాసినా వుబ్బీ! గుండెంతా ఉగ్గబట్టుకుపొయె!కళ్ళల్లో నీళ్ళు తిరిగే!ఇట్లాంటి కతలు ఇంకా రాయాలబ్బీ!ఇంకో కథ కోసం ఎదురు చూస్చా ఉంటా!
సూపర్ గా సెప్పినావు సామీసూపర్ గా సెప్పినావు సామీ
సూపర్ గా సెప్పినావు సామీ…మాకు భలే ఏడుపొచ్చింది పోసూపర్ గా సెప్పినావు సామీ…మాకు భలే ఏడుపొచ్చింది పో
కథ చాలా బాగుంది. కళ్లకు కట్టినట్టు చూపించారు. రచయితకు అభినందనలు !
ఇదికదా జీవితం అంటే! అక్షరం పొల్లుపోకుండా నిజం చెప్పినావు సామీ!
యేరు దాటి మా యిండ్లకి పొయ్యేటపిటికి, దీపాలు పెట్టే జాము దాటిపొయింది. సీకట్లో నిలబడుకోని మాయమ్మ మాకోసరం దోవలు ఎగజూచ్చా వున్నింది. యింట్లో ఎవురికీ కొత్త గుడ్డలనే మాటే ల్యాకండా నాకూ, బుడ్డమ్మికి మటుకే తెచ్చిండారు. ఆ గుడ్డలేసుకోని యిప్పుడీ చీకట్లో నా సక్కదనమంతా ఎవురికి సూపిచ్చేది. బండమిందకీ, వొంటి మిందకీ తప్ప గుడ్డలే లేని మాయమ్మ పాత కోకనే సలవ జేసి కట్టుకోనుండింది. మమ్మల్నట్ట పంపిచ్చి, ఆరోజంతా మాయమ్మ తినిందో లేదో ఎవురికి యెరుక కొడకా..!
” నాదీ నీలాంటి జీవితమే సామీ”
అయితే బాపనోల్లు అయినందుకు చీదరించకోకుండ్రి. గవురంగా సూసుకొనేటోల్లు.
” పండగనాడు ఏదిపిస్తివి సామీ!
ఇదికదా జీవితం అంటే! అక్షరం పొల్లుపోకుండా నిజం చెప్పినావు సామీ!
” నాదీ నీలాంటి జీవితమే సామీ”
అయితే బాపనోల్లు అయినందుకు చీదరించకోకుండ్రి. గవురంగా సూసుకొనేటోల్లు.
” పండగనాడు ఏదిపిస్తివి సామీ!
కథ చాలా బాగుంది. కళ్లకు కట్టినట్లు చూపించారు. రచయితకు అభినందనలు!
30 samvathsaralla mundu Naa brathuku chitram kallakukattinattu sambranga kanipinchindi. penchaldas garu Mee saili adbutham,anirvachaneey am,ananyasamanyam
Wow – Very different naration in a unique way. The slang that was presented in the story make me to imagine the screen of a film at the home town of writer. I expect more writings from Penchala Das garu.
/ గట్లు తెగుతున్నాయి /
భోగి మంట తనని వెక్కిరించింది
భల్లున తెల్లారక మునుపే
బూర చేతబట్టి ఊరి పొలిమేర
అయిష్టంగానే తాను దాటేశాడు,
అడుగు అడుగునా ఏదో వెతన
తనను తాను తవుడుకుంటూ
ఏదో వెలితి, కడుపాత్రపు వ్యథ
దూరమెంత సాగినా ఆగనే లేదు
తన అంతరంగమందున
ఆ భోగి మంటల రవ్వలు
అలా ఎగిసి పడుతూనే ఉన్నాయి…
తన తోటి తరగతి పిల్లలను చూస్తూ
ముఖం చాటేసుకుంటూ ముందుకు..
ఏ ఇంటి ముందుకెళ్ళి గొంతెత్తాలో
సాంప్రదాయపు హరి కీర్తనలు!
కొత్త బట్టల్లో గెంతులేస్తున్న పిల్లల చెంత
తనకెందుకు కలిగిందో ఈ నగుబాటు
నలిగి పోయిన పసి బాల్యమది
కటిక దారిద్ర్యం ముందు తలొగ్గి
గానమయింది ‘నేనన్న’ ఆత్మాభిమానం
పొద్దు గూకే దాక తప్పదు ఈ యాచన
ఈసడింపులు, వెటకారాలు,
జాలి చూపులు, ఆ మూల నుండి
ఈ మూలనున్న మాల పల్లె చేరే వరకు
ఎన్నో..తన వెంటే నడుస్తాయి…
తాత మోశాడు, నాన్న, చిన్నాన్న
అందరూ మోస్తూనే ఉన్నారు
తరాల యాచన బుర్ర సాంప్రదాయం
పురాణ గాథలెన్నో పుక్కిట నిలుపుకొని
కలతలెన్నో మోసుకుంటూ
కరిగిపోతున్న దాసు జీవనమిది
కళిగినోళ్ళకి అదో విశేషం, వినోదం
కాసిన్ని గింజలతో కడుపు నిండితే
భాగ్యమది, పూట గడిస్తే చాలంతే
అమ్మ కళ్ళల్లో ఆనందం కనిపిస్తే
ఈ లోకాన్నే జయించానన్న సంతృప్తి
ఇల్లిల్లు తిరుగాడి – తిరుగాడి…
కాళ్ళల్లో సత్తువ సన్నగిల్లిపోయింది
పసిదనపు ఉల్లాసం
ఇంటి ముంగిలిలో అదిగో…
నెల పాటుగా తోటి వారితో
పోటీగా పరుగులెట్టి సేకరించిన
‘కలే’ కంప, తాను చూడకనే
కాసింతైనా కనిపించక
చీకటి దుప్పటి కప్పే సమయాన
బూడిదలా మారిపోయింది..
— పైడాల రవీంద్రనాథ్.
రాయలసీమ కడప ప్రాంతంలోని చిట్టేలి ( చిట్వేల్ ) దగ్గరి మాలపల్లి రాళ్లనేల..! సంకురాతిరి పండుగ మూడు దినాలే వూర్ల మింద తిరిగి, తత్వాలు పాటలు పాడి దయగుల్లా మారాజులిచ్చిన నాలుగు రూకలు, నాలుగు నాళ్ళ బత్తెం సంపారిచ్చేదికి ఎలబారిన పదమూడేళ్ల చిన్నబ్బి, వాడి చిన్నన్న. వుండూర్లో బిచ్చానికి పోతే కీతాగా జూచ్చారు… దూరంగా మిట్టపల్లి, కచ్చురోపల్లి, తుమ్మచెట్టపల్లెలెంట పోతే ఏందోలే పండగ పూటా వొచ్చినారని మంచిగా ఆదరిచ్చారనే ఆశతో.
మీరేమన్నా దినాం వచ్చేవాళ్లా ఏమన్నానా’ అంటా వాళ్లింటికి తొడకపోయి, పాటలు పాడిచ్చుకోని దండిగా బియ్యం, బేళ్లూ జోల్లో బేసిన ఆ మకాతల్లి.
తమ్ముళ్ల కోసరం అన్నం తినకుండా ఎదురు సూచ్చాడే మిట్టపల్లె మాలాడ ( మాలవాడ ) కాడ జయక్క.
అయ్య తాగితాగి సచ్చిపొయినాంక… సెంటు బూమి లేకండా, నిలువ నీడ లేకండా పోయినా కుటుంబరమంతా నెత్తినేసుకుని రక్కాసి మాదిరి పని చేసి నేదర బిడ్డల్ని ఎక్కదీసుకొచ్చిన ఆ యమ్మ… వొంటి మింద కండనే మాటే ల్యాకుండా ఎనికల గూడు మాదిరి, నల్లంగా వూటికట్టి మాదిరుండే ఆ యమ్మ…
” సీకట్లో నిలబడుకోని మాయమ్మ మాకోసరం దోవలు ఎగజూచ్చా వున్నింది. బండమిందకీ, వొంటి మిందకీ తప్ప గుడ్డలే లేని మాయమ్మ పాత కోకనే సలవ జేసి కట్టుకోనుండింది. మమ్మల్నట్ట పంపిచ్చి, ఆరోజంతా మాయమ్మ తినిందో లేదో ఎవురికి యెరుక కొడకా..! మాయమ్మట్టాటి మంచిది మళ్ళీ ఈ బూమండలం మింద పుడ్తాదా కొడకా…! ”
“ సిరిమల్లె చెట్టు కిందైన్నా సిన్నాబోయే కూర్చుండే లచ్చుమమ్మ “ గురించి విలపించిన గద్దరన్నకు యీ కత చూపించాలని ఉంది పెంచల్దాసూ!
నా కండ్లల్లో నీళ్లు జలజలా రాలె పెంచల్దాసూ !! ఆ యమ్మతల్లులకి, జయక్కలకి, జీవితంతో అలుపెరగని పోరుచేసే చిన్నబ్బి వాళ్ల అమ్మకి వొందనాలు.
~ త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు
శానా వేదనను తలకెత్తుకున్య కథ ఇది. దానికి తోడు మట్టి పరిమళం ను అద్దుకున్య భాష.
“ఆరోజంతా మాయమ్మ తినిందో లేదో ఎవురికి యెరుక కొడకా..!” నరాలు తెగిపోతాయి ఆ మాటలతో…
రచయిత ఈ కథ మలిచే దారిలో ఎన్నెన్ని దుఃఖ సందర్భాలను తడుముకొచ్చాడో, ఎన్నెన్ని అనుభవాలను కోసుకుని తెచ్చి ఇక్కడ అక్షరాలుగా కువ్వ బోశాడో తల్సుకుంటే ఏడుపొచ్చింది.
ఖాళీ కడుపుతో రోజులు పంచకున్య కొందరు ఆత్మీయులు, దూరమైన కొందరు ఆప్తులు గెమనంలోకి వచ్చి, అప్పుడప్పుడు కలలో అదాటుపడతా ఉంటారు. మానుభావులు వాళ్ళు. పచ్చులుండి పిల్లలకు కడుపులు నింపిన మా తల్లులు.
ఈ మధ్య కథలు చదవడం పూర్తిగా మానేసా. మునికాంతపల్లి కథలు తర్వాత ఇష్టంగా, యాతన పడుతూ చదివిన కథ.ఈ జీవితాలు నాకు దగ్గరగా తెలుసు. ఇంచుమించు అడుక్కుని తిని బ్రతకక పోయినా ఇంతకన్నా గొప్ప జీవితం అయితే నాది కాదు. ఈ కథ నన్ను మరీ మెలిపెట్టింది. ఆకలి అవమానం తెలిసిన వాడికి మాత్రమె తెలిసిన యాతన అది.ఊరంతా పండగ చేసుకుంటే ఊరంతా అడుక్కోవడం. తన పిల్లలు అయిన వాళ్ళు ఇంట్లో ఉంటె సంపన్న బ్రతుకు బ్రతికిన అన్నలు జోలె పట్టుకుని ఇల్లుల్లు తిరిగి అన్నం తెచ్చి కలిపి ముద్దలు తింటున్న త్యాగమయ జీవితాలు గుర్తుకు వచ్చాయి. ఈ కథలో చిన్న పిల్లవాడు లాంటి వాడే నాతో చదువుకుని ప్రొఫెసర్ అయ్యాడు వాడు గుర్తుకి వచ్చాడు ఈ రోజు. నేను పెద్ద బడిలో చదువు కుంటున్నా అందరం బడి ముందు ప్రేయర్ లో ఉన్నాము వందల మందిమి పిన్ డ్రాప్ సైలెంట్ మా అయ్య పొలానికి పోతూ ఉంటె మా దున్న పోతు రోడ్ మీద బస్సు హారన్ కి బెదిరి ప్రేయర్ లోకి దూసుకుని వస్తే మా అయ్య . చినిగిన పంచె వేసుకుని దాన్ని ఇదిలిస్తూ ‘ఒసే నిన్ను గొయ్య గదనే అనే’ బిగ్గరగా అరవడం అందరూ కిస్సుక్కున నవ్వడం గుర్రమోడి అయ్య ఆయన అనడం.ఈ మధ్య ఫండ్రి అనే ఒక మరాటి సినిమా చూసా ఒక పందులోల్ల పిలగాడు వాడి కుటుంబం అంతా పందిని చంపే క్రమం లో ఉరికిస్తూ ఉంటారు. అది డైరెక్ట్ గా స్కూల్ ప్రేయర్ లోకి రావడం అప్పుడే జనగణ మన రావడం వెంటనే చేతిలో బరిసె కింద పడేసి జెండాకి వందనం చేయడం బడిలో పిల్లలు అంతా పందిని చూసి ఉరకడం ఆబాసు పాలయిన బాల్యాలు ఎన్నో. ఇలాంటి కథలు సారంగ కాబట్టి వేసింది. అదే ఏ పత్రికకు పంపితే మేము మాండలిక కథలు వేయము అని సిగ్గులేకుండా చెప్పే సాహిత్య పేజీల నిర్వాహకుల ముఖాన కాండ్రించి ఉమ్మాలి అనిపిస్తది. దాసన్నా వీలుంటే ఈ జీవితాలను ఇలా వీదిపాలు చేయకుండా ఒక నవలిక లాగా రాయి. కేశవ రెడ్డి మళ్ళీ పుట్టాడా అనిపించింది ఈ కథ చదివాక. గొప్ప జీవితానికి అక్షర రూపం ఇచ్చావు అన్నా…నీ విద్వత్ కూ నీకున్న జీవితానికీ దాని మట్టి పరిమిలానికి ఇది చిన్న కథ రాయాల్సిన బ్రతుకులు యెన్నో …
సమాజం అట్టడుగున అలమటిస్తున్న నిరుపేదల విముక్తికి… సమసమాజ స్థాపనకు… దేశ సంపద పంపకం జరగాలా… దేశాభివృధిలో అందరికీ న్యాయపూర్తి, సమాన భాగస్యామ్యం ( ఇంక్లూసివ్ గ్రోత్ ), దున్నేవానికే భూమి, పని హక్కు, విద్యా వైద్య హక్కుల్లాటివి రావాలా… అవినీతి రహిత వ్యవస్థ కావాలి…
అన్నింటికన్నా ముఖ్యమైన ఆయుధం విధ్య. అది నిరుపేద హరిజన, గిరిజన వెలివాడల బిడ్డలకు అందుబాటుకి తేవాలి.
రైతన్నలు వలస కూలీలుగా మారిపోవడవేంది?
సొతంత్రం వచ్చిన ఇన్నేళ్లకీ ఇంకా పట్టణాలలోని ఆ మురికివాడలేంది? పల్లెల్లో ఆ గుడిసవాసాలేంది?
ప్రజాస్వామ్య చట్టసభల్లోకి బడుగుల, మహిళల హక్కులు కాపాడే నిస్వార్ధ నాయకులు రాగలుగుతున్నారా ?
ఇట్టా అన్నీ సందేహాలేరోరన్నా గజ్జెల మల్లన్నా !!
సామాజిక సమస్యల పట్ల పాఠకుల్లో, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పుట్టా పెంచల్దాసు లాంటి రచయితల అవసరం ఎంతైనా ఉంది. తనవంతు బాధ్యత నిర్వహిస్తున్నందుకు పెంచల్దాసుకు హృదయపూర్వక అభినందనలు.
మట్టి పూల సౌరభాలు మనసంతా నిండిపోయాయి.
యేటంబిడా ఎర్రబిల్ల ఏడుచ్చా పోయా…ఇది కథ కాదు, జీవితం. నడిపిన తీరు, వాడిన యాస…ఈ కథకాని జీవితానికి బలం. ఇందులో నాకు బాగా నచ్చిన వాక్యం…మా సుట్టాలు ఎన్నుమింద గువ్వలయినారు. పెంచల్‌దాస్ గారి కలం నుంచి ఇలాంటివి మరిన్ని రావాలి.
ఆ మాండలికం లో విషయాన్ని కళ్ళకు కట్టినట్లు, యధార్థ ఘటన అనిపించేలా, ప్రతీ మాటలోను వర్షం పడేపుడు వచ్చే మంచి వాసనల వలె అద్భుతంగా రాశారు దాసు గారు. ఇలాంటివి మీన్ని రాయాలని కోరుకొంటూ…
పోతన్ ప్రసాద్ పబ్బులేటి.
యేటంబిడా ఎర్రబిల్ల ఏడుచ్చా పోయా…
యాడికి పొయ్యిండాది సోమీ కడుపాత్తరం పొయ్యిండ్లా..
చేందరబాయికాడ కిర్రుం బుర్రుంలు యాడుండాయిబ్బా
మట్టి యిండ్లకి తువ్వమట్టి అలికి పేడసరి తీసి
తెల్లంగా సున్నాలు కొట్టిన పూరిండ్లు
తెల్లారజామున్నే మడకలు కట్టుకోని కయ్యల్లోకి పొయ్యే రైతులుండారా ..
చింతల నీడల్లో మాలాడ ముడుక్కోనుంటాది
దానెబ్బగంటుపొయినట్టు వొకటేమాయన కూసే కోడిపుంజు
సలికి పాతకోక కప్పుకోని పొణుకోనుండే పిల్లోడు
పచ్చి పేడోసన గాటుగా తగిలే అమ్మ జల్లిన కల్లేపు
ముగ్గుల నడిమద్దెన పేడగుబ్బలు పెట్టి వోటిమింద
గుచ్చిన గుమ్మడి పూలు ఎంత నాణ్యంగా వుంటాయి..
యిరుడ్డం నాబట్టా.. అంటా పొరక తీసుకునే తల్లులు
బుర్రకతలు చెప్పే రామన్న
జంగమాయన వూదే శంకం
బుడబుక్కలాయన
చిన్నన్న ……….
సమచ్చరంపొడుగూనా కడుపాత్తరంతో
ఎట్టపోతారోగాని
పండగదినాల్లో మటుకు పల్లెలమిందికొచ్చారు.
వోర్నీయమ్మాసోనీ, యసనపడినాడు , బగిశీనం ,
జల్దారి, అత్తిరాసలు ……
యిట్టాంటి మాటలు మన పల్లెల్లోనే..!
తుమ్మచెట్లపల్లి , కందరాపల్లి, మిట్టపల్లి , కచ్చురోపల్లి
అన్నీ తిరిగిన వొట్టి పాదాలు నాయి.
పెంచల్దాసూ ….
మాయమ్మని సూపిచ్చినావు
మా పల్లెల్లో తిప్పిచ్చినావు
మా సావాసగాల్లను మతికితెప్పిచ్చినావు
మా వూరి రాములగుడి
మా ఊరబాయి
మా బడికొట్టం
మా సద్దినీల్లు….
యింగా శానా కల్నీల్లూ
అన్నీ గెమనానికి వొచ్చాండాయి.
వొక్కసారి నా ఎదురుగా నిలబడు…
గెట్టింగా నిన్ను కర్సుకుంటేగానీ దిగులు తీరదు…..!!
……………. శ్రీనివాస్ దొండ్లవాగు,
చిట్వేలి.
సోమీ!ఇదెట్టనో రాయినైతే రాసినాను గానీ, మీ అందరి స్పందన చూసి పొలమారి పోతాండా అచ్చిరం, అచ్చిరం సదూతాంటే, మాయమ్మే నా ఎదురుంగా నిలబడి తల నిమిరినట్టే ఉండాది. ముందుగాలా ఇది అచ్చు బేసిన ‘సారంగా ‘వోళ్ళకి సదివిన మీ అందరికీ దండాలు సోముల్లాలా 👏
పెంచలయ్య,
ఒక్కసారిగ 45 యేండ్ల ముందు జీవితాన్ని గుర్తు తెప్పించావు.కన్నీళ్లు తెప్పించారు. అవి ఆనడముతో వచ్చినవి.
ఎంతమందికి తెలుసు ఇది కథ కాదు నీ జీవితం అని. ఎక్కడ కల్పితం అనేది కనిపించలేదు.
నీ స్నేహితుడు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా వుంది.
మన చిట్టివేలి బాసని మరొకసారి లోకానికి తెలియజేశారు.
మనము కలసి చదివిన రోజులన్నీ ,పల్లెలు గుర్తుకు తెప్పించారు.
ఆ రోజులను ఈ జనరేషన్ వాళ్ళకు తెలియచేయడం అభినందనీయం.
32 సంవత్సారాలు తరువాత ఎప్పుడు కలవాలని ఎదురుచూస్తూ
శశి….
చదివిన తర్వాత గుండెలను మెలిపెట్టి వదలకుండా వెంటాడే కథ ఇది. విషాదాన్ని నేరుగా తోవ గట్టి మా గుండెల్లోకి ప్రవహింపజేసారు. అసమానతలు నిండిన నిచ్చెన మెట్ల కుల సమాజంలో అట్టడుగున వున్న కులాలలో నాలుగు మెతుకులు సంపాదించడం కోసం తమ అభిమానాన్ని వొదులు కావాల్సి రావడం అత్యంత విషాదకరం. నిజానికి తన సావాసగాళ్ళ పండగ కోలాహలంలో ఆనందోత్సాహాల మధ్య గడుపుతుంటే జోలె చంకన తగిలించుకొని పోయి వాళ్ళ ముందు జోలె పట్టుకొని ఆడుకోవడం ఆ పసి మనసుని ఎంతగా గాయపరిచి ఉంటుందో కదా! నిజంగా ఇక్కడ సిగ్గుతో తల దించుకోవాల్సింది ఎవరో కథ చదివిన పాఠకుడికి అర్ధం అవుతుంది.
ఫ్యూడల్ సంకెళ్ళలో నలిగిపోతున్న మన సమాజంలో ఇంకా ఇటువంటి జీవితాలు కోకొల్లలు. తన దయా దాక్షిణ్యాల కోసం దేబిరించుకుంటే భూస్వామ్య విలువలు నిండిన సమాజం ఇంత విదిలిస్తుంది లేదా “ఫో!అవతలికి”అని కసిరి కొడుతుంది.” రెండూ భరించి మన గలిగితే నీకు బ్రతుకు ” అని అని హెచ్చరిస్తుంది. తల ఎత్తి బ్రతుకుడాం అనే వాళ్ళకి రోహిత్ వేముల వంటి వాళ్ళను ఉదాహరణలుగా చూపిస్తుంది.
ఇప్పటికీ గ్రామాలలోని స్కూళ్ళల్లో పెడ్డకులం పిల్లలు కింది కులాలకు చెందిన పిల్లల్ని “అరేయ్!ఒరేయ్!”అని అదిలించడం,ఆదేశించడం మనం చూస్తూ వున్నదే. పెద్ద కులస్థుల పిల్లలు కూడా అట్టడుగు వర్గాలకు చెందిన వయసు మీరిన పెద్ద వాళ్ళను “అరేయ్,ఒరేయ్ ” అని సంబోధించదానికి మూలం ఎక్కడుందో ఈ కథ చదివితే మనకు అర్థమవుతుంది.
ఈ కథలో పెంచల్డాస్ గారు మనల్ని చెయ్యి పట్టుకొని చేను చెలకల వెంట, వీధుల వెంట నడిపించడమే కాకుండా ఆ జీవితాల్లో వుండే విషాదకరమైన పార్శ్వాలను కూడా తిప్పి చూపించారు.
అసమానతలు నిండిన సమాజంలో ఒక పండగ కొన్ని జీవితాలలో మోదం మరికొన్ని జీవితాలలో ఖేదం ఎలా అవుతుందో చెప్పారు. ఈ కథలోని అమ్మ మద్దూరు నగేష్ బాబు కవితలోని అమ్మ ఒకరే! పండగ పూట కూడా చింకి పాత కట్టుకొని పిల్లల కడుపాకలి తీర్చే మార్గాల కోసం అన్వేషించే ఆ ముదనష్టపు తల్లి పట్ల ఈ సమాజానికి ఏమి పట్టింపు వుంటుంది?!ఎవరికి కావాలి!
రాయలసీమలో మరో గొప్ప కథకుడు నిజానికి నామినీ సుబ్రమణ్యం సరసన నిలబడాల్సిన కథకుడు అని నిస్సందేహంగా చెప్పవచ్చు.కానీ ఇన్నేళ్లుగా పాటను ఎత్తుకొని ఊరూరా గానం చేస్తున్న పెంచల్దాస్ గారు కథకుడిగా మౌనం వహించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా ఫ్యూడల్ చట్రపు వివక్షలను మీరి అరవడానికి ఒక వేదిక దొరకడానికి ఇన్నేళ్ళు పట్టిందేమో! అయితే నామినీ మిట్టూరోడి కధలు వలె పెంచల్డాస్ గారు ఈ ఒక్క కథతో ఆగిపోకుండా ఇంకా అనేక కథలు రాయాల్సి వుంది. ఆ దిశగా ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ
అభినందనలతో,
శివాజీ రావు
ధన్యవాదాలు సార్
Real story interesting story sir congratulations sir
దాసు గారు తన జీవిత అనుభవాలను వర్ణించిన తీరు, సంక్రాంతి పండుగ రోజులు జరిగే నాడు చెప్పిన మాటలు సహజ వర్ణనలు. ఆయన రాసిన చిట్వేలి మాండలికపు యాస, ప్రతి పదము ఆలోచించ తగదుగా ఉంది. మాండలిక భాషలో వర్ణించడం మీకే సాధ్యం అది మీకే సొంతం.
Katha chala bagundhi mayasalo rasinaru
Inka manchi kathalu rayali ani korukuntunanu ma pratham nunchi yasa basalu andariki tailidam chala santhosam ga undhi
Anna nee flash back yentha katinanga undhi annadhi kallaku kattinatlu, chakkati rachna rupamlo, appati paristhithulanu dare ga teliya chesinandulaku meeku 👑⛑👒🎩up, mee kathalnu batti, meekunna talentnu batti meeru mattiilo mani kyam. Nenu ye story complete ga chadavanu. Kaani mee story matram poorthiga chadivinanu, daaniki karanam meeru rasina vidhanam, l love ❤you and iam fan of you🙏🙏🙏
ఏంది సామీ ఇది! ఇది కత గాదు జీవితాన్నే రాసినావు.దొమ్మా,దైర్నెమూ ఉండేవోల్లే ఇట్టా రాచ్చారు
అందరికీ వల్లగాదు. ఉన్నింది ఉన్నెట్టు నిజిం చెప్పాలంటే ఎంత తెంపుండాల.ఏది బడ్తే అది ఎట్ట బడ్తే అట్ట రాయలా
‘పేదరికాన్ని పేనాలో బోసి ఆకలిని కాయితం మింద ఆరబోసినావు కడాన కన్న పేగు గుణాన్ని గుర్తు చేసినావు’
సదువుతా ఉంటే కండ్లల్లో నీల్లు తిరిగినాయి.మనబోటి పేదోల్లంతా ఈ కతను కావులించుకుంటారు. ‘పేదరికం సెడ్డదని’ సిన్నప్పుడు మా నాయిన సెప్పిన మాటలు మతికొచ్చినాయి ‘గుండెలకు హత్తుకునే ఇంత మంచి కథను అందించినందుకు అభినందనలు’
— ప్రతాప్ తాళ్ళూరి
రాయలసీమకు, తెలుగుకు, భారతీయతకు దూరంగా ఎక్కడో విదేశాల్లో ఉంటున్న మమ్మల్ని ఏ ప్రయాణపు కష్టాలు లేకుండా పండుగకు మన తుమ్మచెట్ల పల్లె యీధుల్లో, చుట్టు సేనుల్లో గెనాలంబడి, ఏట్లో మీయంబడి నడిపించుకుంటా తిప్పినందుకు కృతఙ్ఞతలు.
పొధ్దు మొల్సకముందే యల్లబారినప్పట్నుంచి, పొధ్దుగూకి ఇంట్లో దీపాలు పెట్నాక ఇంటికి మీరు చేరేవరుకు, మీతో తిరుగుతా మీగురించి చాలా విషయాలు తలుసుకుంటానే, మా గతాన్ని ఙాపకం చేసుకుంటా, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా, భూజర భూజర కండ్లను తుడుచుకుంటా భాగా గడిపినాము.
మన ఊరి యాసలో ఉండటంతో మనసుకు మరింత ఎక్కువగా హత్తుకుంది.
యల్లభారటం, నయకారంగ, ఒక్కరవ్వ, ల్యా, అదాటున పడటం, జలదాట్లో లాంటి ఎన్నో మర్చిపోయిన వాడుకభాష పదాలు ఛాలాసంవత్సరాల తర్వాత తారసపడ్డ భాల్యస్నేహితులలా అనిపంచాయి.
మంట నాలిక సాపటం, ఎన్ను మింద గువ్వలు, ఒడిశలో రాయి, కొంగలు కఛ్చేరి చేయటం లాంటి పోలికలు భాగున్నాయి.
ఈ అనుభవాన్ని అందిచ్చిన పెంచెల్దాసన్నకు అభినందనలు, కృతఙతలు.
రాయలసీమకు, తెలుగుకు, భారతీయతకు దూరంగా ఎక్కడో విదేశాల్లో ఉంటున్న మమ్మల్ని ఏ ప్రయాణపు కష్టాలు లేకుండా పండుగకు మన తుమ్మచెట్ల పల్లె యీధుల్లో, చుట్టు సేనుల్లో గెనాలంబడి, ఏట్లో మీయంబడి నడిపించుకుంటా తిప్పినందుకు కృతఙ్ఞతలు.
పొధ్దు మొల్సకముందే యల్లబారినప్పట్నుంచి, పొధ్దుగూకి ఇంట్లో దీపాలు పెట్నాక ఇంటికి మీరు చేరేవరుకు, మీతో తిరుగుతా మీగురించి చాలా విషయాలు తలుసుకుంటానే, మా గతాన్ని ఙాపకం చేసుకుంటా, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా, భూజర భూజర కండ్లను తుడుచుకుంటా భాగా గడిపినాము.
మన ఊరి యాసలో ఉండటంతో మనసుకు మరింత ఎక్కువగా హత్తుకుంది.
యల్లభారటం, నయకారంగ, ఒక్కరవ్వ, ల్యా, అదాటున పడటం, జలదాట్లో లాంటి ఎన్నో మర్చిపోయిన వాడుకభాష పదాలు ఛాలాసంవత్సరాల తర్వాత తారసపడ్డ భాల్యస్నేహితులలా అనిపంచాయి.
మంట నాలిక సాపటం, ఎన్ను మింద గువ్వలు, ఒడిశలో రాయి, కొంగలు కఛ్చేరి చేయటం లాంటి పోలికలు భాగున్నాయి.
ఈ అనుభవాన్ని అందిచ్చిన పెంచెల్దాసన్నకు అభినందనలు, కృతఙతలు.
నిజం
Excellent sir amazing story sir , after so many years I read this real emotional story,
Thank you sir
Yours D.ANWAR BASHA
SCHOOL ASSIGNMENT, PHYSICAL SCIENCE,ZPHS CHAKRAMPET
కత సదివి మీరు రాసిన మాట నాకు శానా బలం సార్. కతలూ, కాకరకాయిలూ అనేటివేమీ పట్టిచుకోకుండా, పతి నిత్తేమూ సదువూ, సదువూ అంటా పిల్లోళ్లతో కొటకలాడతా ఉండే మీరు ఇట్లా స్పందించడం సంతోషం నమస్సులు
అందమైన, అరుదైన, అంతరించిపోతున్న కాలాన్ని, ఒక ఫోటోగ్రాఫర్ చిత్రాన్ని బంధించినట్టు , అనుభవాలను అక్షరాలతో బంధించి , సజీవంగా ఆ దృశ్యాన్ని దర్శించే సౌకర్యాన్ని కడప యాస ద్వారా కల్పించారు పెంచలదాస్ గారు. బాల్యంలో ఆటలు ఆడుకునే పసివాడు అయిందిరా అందరితో పాటు తెల్లవారుజామున, ఇష్టం లేకున్నా ఆ విధంగా హరినామ సంకీర్తన కు వెళ్ళాల్సి వచ్చిందన్నప్పుడు నా మనసులో ఓ విధమైన బాధ అలుముకుంది. బహుశా అది జాలో, సహానుభూతో. అయితే తిట్టుకుంటూ కూడా తల్లి బాధను అర్థం చేసుకుని కాలిబాట పట్టడం, ఆ తల్లిని కాంతిలో వర్ణించిన తీరు అత్యంత సహజం, అద్బుతం, ఆదర్శప్రాయం.
హరిదాసు సంక్రాంతి కి వస్తాడు , మన సంస్కృతి కి వెలుగు , అని రాసిన రాతలు చూశాం కానీ , ఓ హరిదాసు, తన ధర్మాన్ని నిర్వర్తించే క్రమంలో ఉండే చీకటి వెలుగుల దోబూచులాట ను అందంగా వర్ణించిన దాసు గారి కలం లో నింపింది సిరా కాదు… శ్రమజీవుల, బడుగుల, అణగారిన జనం యొక్క వెతలు అనుభవాలు.
Super story, దాదాపు నా కథ లాంటిదే
అన్నా… ఈ కథ చదివిన తరువాత కన్నీరు రాని వారు ఎవరుంటారన్నా? దేవుడు మీకు మంచి జరిగేలా ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాను…
ఏంది సామీ! బరువెక్కిన బతుకుల్ని ఇట్టా మా మింద దించినావ్! మనసంతా పెరక్కబోయింది. గుండెకాయ సలిపుతాంది. మాటలు పెగలడంల్యా!
బతుకంతా యెంటాడుతాదే ఎట్టా జేసేది? పో
కథ కళ్లముందు కదలాడుతుంది చదువుతా పోతుంటే! అయ్యో ఇండ్లెంట అట్టా పిల్లలువస్తే నేనలా ఏ పొద్దన్నా కసురు కున్నానా? అని అంతరాత్మని అడిగాను. ఎంత కదిలించేట్టు రాసినవు పెంచల్దాస్ అన్నా! మూస ధోరణిలో రాసే మా కథలన్నీ ముక్కలైపాయనే! _పోరాల శారద
థాంక్ యూ శారదమ్మా!
పెంచల దాస్ సర్ కు ముందుగా ధన్యవాదాలు మరియు శుభాభివందనాలు. పెంచల దాస్ రాసిన ఈ కథ ను కథ అనడం కంటే మన బాల్య స్మృతులను గుర్తు చేశారు. పండగలకు, పబ్బాలకు మన ఇళ్ళకు వచ్చి పాటలు పాడేకళాకారుల కోణం లోకథ సాగుతుంటే, వాళ్ళను చూస్తూ వాళ్ల వెంటే వెళ్ళే పిల్లలం, ఆ ఆనందం గుర్తు వస్తూన్నాయి.మంచి అనుభూతి నిచ్చింది.
సంతోషం మేడం గారు
ఈ కథ చదవక ముందు నా దృష్టిలో సంక్రాంతి పండగ అంటే భోగి మంటలు, గొబ్బెమ్మలు,కొత్త అల్లుళ్ళు ,కోడి పందాలు…ఈ కథ చదివాక పండగను జరుపుకోలేని ఒక పదమూడేళ్ళ నిస్సహాయుడైన హరిదాసు పసిమొహం కళ్ళల్లో మెదులుతుంది ….ఈ హరిదాసు పండగ పూట చిరంజీవి సినిమా చూడలేకపోయాడు కాని మాకు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయే గొప్ప కథను చెప్పాడు ….ఈ కథలోని రాయలసీమ మాండలికం చదువుతుంటే టికెట్ లేకుండా ఊరికి పోయి,ఊరి మనుషులతో మాట్లాడి వచినట్టుంది
థాంక్ యూ మల్లీ sir, మీ మూవీ జైత్ర ‘లో మన మాండలికాన్ని అద్భుతం గా పలికించినారు. మనమేదో భాషా సేవ చేస్తున్నామని కాదు గానీ, ఒక ప్రాంతపు నుడికారాన్ని, యాస, బాసల్ని కాపాడు కొనే ప్రయత్నం లో కత నా పరిధి 🙏