యుద్ధ నౌక

పాలింకిన రొమ్ముల్లో ఎప్పుడూ
ఏడుపు బంతుల్లా ఎగిరిపడే కన్నీళ్ళుంటాయి

1

నేను

ఒక వంతే మట్టి దారిని

మూడు పాళ్ళు నీటి కుండనే !

ఉండచుట్టుకున్న గుండ్రటి దేహంతో వివాదాల పాలపుంతల మధ్య

దు:ఖ ద్వీపంలా సంచరిస్తుంటాను

నా లోపల

పిల్ల కాలువల్ని చేదుకుంటున్న నదులూ

బతుకు తీపి ఈదలేక ఉప్పుదేలిన

మహా సముద్రాలు, అంతా …. సుళ్ళు సుళ్ళుగా తిరుగుతున్న నీళ్ళుంటాయి….

ఆరుగాలపు పంటల గుడి గోపురాలూ

సేద్యగాడి స్వయంభూ మూల విగ్రహాలూ

సస్యస్యామలాభిషేక ధ్వనులుంటాయి

తలల్లాంటి రాళ్ళు పగిలిన నీళ్ళ ఒడ్డంతా

నిప్పు రాజుకున్న గుర్తులుంటాయి

 

మహబలేశ్వరంలోని ఎద్దు నోట్లోంచో

త్రయంబకేశ్వర కొండల కింది సరస్సులోంచో

మతం పసుపూ కుంకాలు మింగిన కొండచిలువల్లాంటివిక్కడ నీటి పాయలు

అవి జర జరా పాకిన దారి పొడవునా

తగవుల కుబుసం వదిలివెళ్ళిన ఆనవాళ్ళుంటాయి

బొడ్డుపేగు తెంచుకుని పుట్టిన నీళ్ళిప్పటికీ

బానిసల నెత్తుటి రంగులోనే దేశమంతా ప్రవహిస్తుంటాయి

2

నీళ్ళని తాళ్ళతో కట్టేశామనుకుని

ఇసుక మూటల కాళ్ళతో

అడ్డంగా ఆనకట్టేశామనుకుని

కొలతలేసుకుని నేన్నీకు, నువ్వు నాకు

తడిసిన తెల్లారొకటి కావాలని

ఇద్దరమూ పాదులు తీసి విత్తనాలు వేసి

జాగారం చీకటి కళ్ళకి

లాంతరు బుడ్డీలు తగిలించుకుని

యేళ్ళతరబడి వాదులాడుకుంటాము….

మన గుక్కెడు ఆరాటం నిండా

పుట్టలా పగిలిన అమాయక జీవ రాశి

రెండు చుక్కలు పడ్డ ఆకురాయి మీదెప్పుడూ పదునుదేలిన ఆకలి కత్తి….!!!

నల్లటి నగరం వంతెన కింద నీళ్ళెప్పుడూ ఒకచోట ఆగిపోవు …

చక్రవర్తో, సామంతుడో వచ్చి పంపకాలుచేయలేడు..

గాయపడ్డ గెలుపూ ఓటమిలోకి

సంఘర్షించి చరిత్రలో కలిసిన ప్రతి అస్థికల్లోకి

రాజ్యాల సరిహద్దుల్ని ఒరుసుకుని…నీళ్ళు

పొరపొచ్చాల్లేనట్టు పారుతుంటాయి..?

3

పాలింకిన రొమ్ముల్లో ఎప్పుడూ

ఏడుపు బంతుల్లా ఎగిరిపడే కన్నీళ్ళుంటాయి

దాహంతో సల సలా కాగుతున్న ఆకాశాలూ

అస్థిపంజరాల్లో గూళ్ళు కట్టిన పిట్టలూ

వలస బట్టిన నేల ఎర్రటి పాటలుంటాయి

స్వేచ్చగా ఎగిరే రెక్కలకిన్ని మేఘాల నిచ్చి

తలమీది తడి కిరీటానికి అద్దాల్ని తొడిగి

దాని కళ్ళల్లోకి తొంగి చూసినప్పుడు

నీళ్ళల్లో చేప పిల్లల్ని వీరుల్లా సాకే

అడవి తల్లులు కనిపిస్తారు….!!!!

నీళ్ళకోసం నువ్వెప్పుడూ యుద్దాలు చేయలేవు…..

నీళ్ళే యుద్ద నౌకలకి దారి చూపే చూపుడు వేళ్ళు…..!

పెయింటింగ్: సత్యా బిరుదరాజు

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

30 comments

Leave a Reply to santhi Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Amazing poetry…. Superb ఎంత గాఢత..ఎంత తీవ్రత…వాఁహ్…క్లాప్స్…

  • చాలా గొప్ప కవిత శ్రీరామ్ గారు , నీరు నిప్పులా మండుతుంటే కవి ఖాళి చెట్టులతో కూర్చోలేడు , నీటిని ఎవడూ ఆపలేడు మీ భావ ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు నిజానికి కాలం తనకి కావాల్సిన సందర్భాన్ని తానెలా కవి చేత రాయించుకుంటుంది అందుకు నిదర్శనం ఈ కవిత

    • అనిల్, బాగా మాట్లాడావ్. థ్యాంక్స్ మిత్రుడా.

  • నేను
    ఒక వంతే మట్టి దారిని
    మూడు పాళ్ళు నీటి కుండనే ! అంటూ దుఃఖద్వీపం అనడం అద్భుతంగా అనిపించింది.

    రాజ్యాల సరిహద్దుల్ని ఒరుసుకుని…నీళ్ళు
    పొరపొచ్చాల్లేనట్టు పారుతుంటాయి..? మీలోని వాస్తవిక కోణానికి అద్దంపట్టింది..

    పాలింకిన రొమ్ముల్లో ఎప్పుడూ
    ఏడుపు బంతుల్లా ఎగిరిపడే కన్నీళ్ళుంటాయి .. కొత్త ప్రతీక మాటల్లో చెప్పలేని భావన… అద్భుతం అనలేని సందర్భం.. ఆర్ద్రతతో కూడిన అద్భుత ప్రతీక అంటాను నేను..
    నీళ్ళే యుద్ద నౌకలకి దారి చూపే చూపుడు వేళ్ళు…..! బాగా నచ్చింది…
    మొత్తంగా కవిత యుద్ధనౌక సమకాలీనంగా సహేతుకంగా ఉంది పుప్పాల శ్రీరామ్ గారూ…

  • నీళ్లకీ రాజకీయాలు నేర్పించేసారు. నీళ్లనీ మార్కెట్ లో భాగం చేశారు. మీ కవిత వీటన్నింటినీ గుర్తు చేసింది. చాల బాగుంది

  • నేను ఒక వంతే మట్టి దారిని
    మూడుపాళ్ళు నీటి కుండనే
    సూపర్బ్ శ్రీరామ్ గారు.ఎంతో గాఢత కలిగిన కవిత..
    అభినందనలు

  • బొడ్డుపేగు తెంచుకుని పుట్టిన నీళ్ళిప్పటికీ

    బానిసల నెత్తుటి రంగులోనే దేశమంతా ప్రవహిస్తుంటాయి…

    Very true , పోయెమ్ బావుంది

    • యానాం ప్రేయసి దేశరాజు గారూ, ధన్యవాదాలు.

  • గురిచూసి వదిలిన వాక్య బాణాలన్నీ చాలా చోట్ల గుచ్చుకుంటాయి..
    ఒకో పదమూ పేర్చుకుంటూ మనసుల్లోకి కూర్చుకుపోయేంతలా యుద్దనౌకలో అక్షరాల పంట పండించారు.
    అబ్బురమైన మదిని కాసేపు అలా యుద్ధనౌకలో ఎక్కించి ఆ కట్టేసిన తాళ్ళన్నీ , ఆనకట్టేసిన నీళ్ళన్నీ చూపించా.. చాలా బావుంది
    (చిన్న మాటతో బావుందని అనడం తక్కువనిపించింది.)
    * నీళ్ళని తాళ్ళతో కట్టేశామనుకుని
    ఇసుక మూటల కాళ్ళతో
    అడ్డంగా ఆనకట్టేశామనుకుని
    కొలతలేసుకుని నేన్నీకు, నువ్వు నాకు (ఇక్కడ చాలా సేపు ఆగిపోయానలా ….!)
    తడిసిన తెల్లారొకటి కావాలని
    ఇద్దరమూ పాదులు తీసి విత్తనాలు వేసి
    జాగారం చీకటి కళ్ళకి
    లాంతరు బుడ్డీలు తగిలించుకుని
    యేళ్ళతరబడి వాదులాడుకుంటాము…. (2 పేరా నుండీ మరల మరలా చదివా.. మౌనం ఆవహించేసింది)

    పాలింకిన రొమ్ముల్లో ఎప్పుడూ
    ఏడుపు బంతుల్లా ఎగిరిపడే కన్నీళ్ళుంటాయి (అభినందనలు… ఈ వాక్యాలు చదవగానే మనసంతా చెప్పలేని భావన అలుముకుంది . ఈ పద ప్రయోగానికి ధన్యవాదాలు కూడా)

    తలమీది తడి కిరీటానికి అద్దాల్ని తొడిగి
    దాని కళ్ళల్లోకి తొంగి చూసినప్పుడు… (వావ్ అనడం తప్ప మరో మాటతో చెప్పలేకపోతున్నా)
    నిశ్శబ్దంమైన మనసు ఇప్పుడే మరోసారి యుద్ధనౌకలో ప్రయాణిస్తోంది..

  • ఈ మధ్య కాలం లో నేను చదివిన కవితాల్లో ఒక అద్భుత కవిత…శ్రీరామ్ గారు. ప్రతి స్టాంజా లో ఒక త అభివ్యక్తి . జీవన వైచిత్రి ని కాస్త అధివాస్తవికత surrealistic ఫ్లేవర్ తో చాలా చాలా అందంగా వంద శాతం కవిత్వం….కుడోస్…!????????????????

  • ఈ మధ్య కాలం లో నేను చదివిన కవితాల్లో ఒక అద్భుత కవిత…శ్రీరామ్ గారు. ప్రతి స్టాంజా లో ఒక త అభివ్యక్తి . జీవన వైచిత్రి ని కాస్త అధివాస్తవికత surrealistic ఫ్లేవర్ తో చాలా చాలా అందంగా వంద శాతం కవిత్వం….కుడోస్…!????????????????

  • శ్రీరామ్, చాలా ఏళ్ళ తర్వాత, అంటే ఎప్పుడో మన కాలేజీ రోజుల్లో విన్న నీ ఉగాది కవితల తర్వాత ఇన్నాళ్ళకి మళ్ళీ నీ కవిత్వం చదివే అవకాశం లభించింది. చాలా బాగా ఉంది నీ వర్ణన. కాలేజీ రోజులన్నీ గుర్తొస్తున్నాయి.

    • వెంకట్, అమెరికా లో ఉండటం మొదలయ్యాక నీకు తెలుగు మీద ప్రేమ చాలా పెరిగింది.

  • కవిత్వం ఎందుకు చదవాలన్నదానికి నాకో కొత్త కారణం దొరికింది..

    • అది సకారణమనే నమ్ముతున్నాను. థ్యాంక్యూ రాజశేఖర్ గారూ, స్ట్రైట్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేశారు.

  • తలల్లాంటి రాళ్ళు పగిలిన నీళ్ళ ఒడ్డంతా
    నిప్పు రాజుకున్న గుర్తుల్నుంచి నీళ్ళ విశ్వరూపాన్నంతా కవిత్వం చేసారు..

    నీళ్ళని తాళ్ళతో కట్టేశామనుకుని
    ఇసుక మూటల కాళ్ళతో
    అడ్డంగా ఆనకట్టేశామనుకునుకొని..
    నీళ్ళకే కాదు మీ అక్షరాలకు ఆనకట్ట వేయలేమేమో కదా…
    దుఃఖ ద్వీపం, ఆకలి కత్తి, కాగుతున్న ఆకాశాలు ప్రయోగాలు అద్భుతం. .

    పాలింకిన రొమ్ముల్లో బంతుల్లా ఎగిరిపడే కన్నీళ్ళు… పిండేసారిక్కడ..

    నీళ్ళకోసం నువ్వెప్పుడూ యుద్దాలు చేయలేవు…..
    నీళ్ళే యుద్ద నౌకలకి దారి చూపే చూపుడు వేళ్ళు…..! గొప్ప ముగింపు

    నిడివి కాస్త ఎక్కువవడం తప్పితే కవితనిండా ఎన్నో దృశ్యాలు ..అక్షరాలతో పాటు పరిగెత్తించాయి…

    అద్భుతమైన కవితనందించారు… ధన్యవాదాలు శ్రీరామ్ గారూ‌‌

    • కవిత్వం నన్ను చాలా సార్లు చాలా దూరమే నడిపిస్తుంది. నడుస్తున్నంతసేపూ ఎన్నెన్ని కబుర్లో. ఆ మాయలోంచి నిడివి తగ్గించుకోవడమూ ఒక మహత్తర సాధనే నేమో ! తప్పకుండా మేడం. మంచి సూచన.

  • కవితా ఝరి. అద్భుతః, మీ ఈ ప్రస్తుత పువ్వుల సజ్జలోనుండీ జాలువారిన సౌగంధికా పుష్పము???? తీరినప్పుడు పలకరించండి.????

  • కవిత ఆర్ద్రంగానూ ఆలోచనాత్మకంగానూ ఉంది. నది గురించి చాలా కవితలు వచ్చినా మీ అభివ్యక్తి బావుంది. ముఖ్యంగా చివరి స్టాన్జా కవితను భిన్నంగా నిలబెట్టింది

  • కవితా శీర్షికే చాలా బాగుంది శ్రీరామ్. చక్కగా రాశావు.

    • తెలుగు మీద ప్రేమ పెంచిన గురువులు మీరు. రావిశాస్త్రిని పరిచయం చేసింది మీరు. థ్యాంక్యూ సార్.

  • “బొడ్డుపేగు తెంచుకుని పుట్టిన నీళ్ళిప్పటికీ

    బానిసల నెత్తుటి రంగులోనే దేశమంతా ప్రవహిస్తుంటాయి” ఇది కదా కవిత్వం అంటే. మనవ ఇతిహాసం మొత్తం గడిచిన కొండగుర్తులను గాయాలను తడిమి, శోకించి, శుష్కించి రాల్చిన రుధిర జ్ఞాపకం లా ఉంది వాక్యం. భూమి తనది అని తన ఐశ్వర్యాన్ని వాటాలుగా పంచుకుంటున్న ఆధునిక చైతన్యాన్ని చూసి ఎగిరిపడ్డ కన్నీళ్ళ లా. ఈ మధ్యనే ఒక సినిమా చూసా అందులో ఒక అతిప్రాచీన నాగరికత తన అవసరాలకి సేద్యానికి నిర్మించిన ఆనకట్ట ప్రకృతి ప్రకోపానికి ఎలా నేల మట్టం అయ్యిందో మొత్తం వ్యవస్థ చరిత్ర నుండి మాయం అయ్యిందో తెరమీద రెండున్నర వేల ఎల్లకింద విద్వంశాన్ని దృశ్యమానం చేసాడు.
    నీళ్ళకోసం నువ్వెప్పుడూ యుద్దాలు చేయలేవు…..
    నీళ్ళే యుద్ద నౌకలకి దారి చూపే చూపుడు వేళ్ళు…..
    ఇటీవల నేను చదివిన దృశ్య కావ్యం ఇది

  • కవిత నిండా సాంద్రత. ఆద్యంతం సడలని జిగి బిగి. గొప్ప కవిత చదివిన సంతృప్తి. మనసంతా తరంగాలుగా పరివ్యాప్తమవుతూ..అభినందనలు శ్రీరామ్ గారూ

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు