యుద్ధనేలపై నీ దేహం

నిత్య వసంతాన్వేషణలో
నీ దేహం తుపాకుల గూడు
చిత్రాన్ని గీస్తున్న చంద్రకాంతి
పాడుతున్న పూరేకుల స్వరం
చిగురాకుల పచ్చదనం
మందార గుడిసెల్లో, నెత్తుటి మడుగుల్లో
త్యాగాల వనంలో
నీ దేహం, ఎర్రటి స్వప్నాల ముద్ద !
*
ఎడమ నుండి కుడి వైపుకు వీస్తున్న గాలిలో
ఊగిపోతోంది
చెట్టు కొమ్మకు వేలాడుతున్న చర్మపురంగు వర్షంలా
యుద్ధంలో నీ దేహం.
స్థూపంలో నిలబడి
పాటలను అల్లుతున్న ఫిరంగుల గొంతులా
యుద్ధనేలపై నీ దేహం.
*
తుపాకులను మోసిన భుజాలపై
నల్లటి మరక
జెండాలు ముద్దాడితే, అదొక ఎర్రటి పాట !
*
నీ అమరత్వం
యుద్ధనేలపై గజ్జెల శబ్ద సౌందర్యం
నీ అమరత్వం
వసంతాకాశంలో రెపరెపలాడుతున్న రేలపాటల జెండా !
నీ అమరత్వం
తుడుం దెబ్బల్లో ధ్వనిస్తున్న సముద్ర ఘోష
నీ అమరత్వం
పక్షి గొంతులో పూసిన ఎర్రమందారం !
నీ అమరత్వం
పోరులో దొగ్గాడుతున్న పసిపాపల నవ్వు
నీ అమరత్వం
ఆదివాసుల పాటల్లో అడవి రంగు !
***

దొంతం చరణ్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు