కోడిపందాల్లో
కాళ్ళకున్న కత్తులు
పౌరుషాన్ని కక్కుతూ
పక్షుల రెక్కల్ని నెత్తుటి లో ముంచుతయి.
ఈలలు రోషాలు
డబ్బు సంచుల కేకల మధ్య
తల్లి కోళ్ల పసుపుతాళ్లు
ఒంటి దారంపోసపై
ఊగిసలాడుతాయి.
యుద్దానికెళ్లిన తండ్రి వేషంలో
కోడి పిల్లలు
మీసాలు మెలేస్తూ
వీధి నాటకంలో బాల సైనిక వేషంతో
ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తారు.
తెగిన కాలుతోనో,
ఊసిపోయిన రెక్కతోనో
ఓటమి కిరీటాన్ని ఈడ్చు కుంటూ
ఇంటి దారి పడుతుంది.
లేదా యుద్ధభూమిలోనే గెలిచిన రక్త పిపాసికి
వాడి కీర్తి పెట్టెలో ఒక సంఖ్య పెంచి
వాణ్ని వెలిగిస్తుంది ఓడిన కోడి.
యుద్ధం ఎప్పుడైనా ఆధిపత్యం అమ్ముల పొదిలో
ఆయుధమై బయట కోస్తుంది.
యుద్ధం చివరికి
సగటు నదుల సంసారలను
కుళ్లుడు కుళ్ళుడు చేస్తుంది.
తల్లుల ఆడపడుచుల
పిల్లల అన్నం ముద్దల్ని
ఉసికలో ఇసిరి కొడుతుంది.
ఒంటి కన్ను ఒంటి చేతు
ఒంటి కాలుగుడిసెలలో
దిక్కుమాలిన కూని రాగాలు తీస్తూ
రేపటి నరకపు ఉదయాన్ని తలుచుకుంటూ వణికి పోతుంది.
గుడిసె ముందు
కులము, మతము దైవము
తలవంచి సంతాపం ప్రకటిస్తాయి.
*****
చాలా బావుంది
ధన్యవాదాలు సర్
nice poetry
Nice poetry. Congrats.
ధన్యవాదాలు… Madam
అభివ్యక్తి కొత్తగా ఉంది సార్ .మొత్తానికి కవిత చాలా బాగుంది. అభినందనలు