యుక్రైన్ నుంచి ఒక గుండె చప్పుడు

1984 లో పుట్టిన ప్రముఖ యుక్రైన్ కవి ఇయా కివా చాలా మందిలాగే ఏకశిలాసదృశమైన యుక్రైన్ అస్తిత్వాన్ని ఇంకా మనస్ఫూర్తిగా కౌగిలించుకోలేక పోతోంది. ఆమె కవిత్వం లో ఇంకా తనను తాను నిర్వచించుకోవడానికి తాపత్రయపడే, పోరాడే యుక్రైన్ దేశం హృదయం ధ్వనిస్తుంది. ఆమె తన మిశ్రమ రష్యన్, యుక్రైన్, యూదుల వారసత్వాల అస్తిత్వాల్ని కవిత్వంలో ప్రతిబింబిస్తుంది. ఈ సంకుల సందిగ్ధ కాలంలో ఆమె కవితలు మూడు :

1.
శవపేటిక నీకోసమే
ఓ చిన్నారి పిల్లగాడా

భయపడకు, పడుకో
జీవితమనే బులెట్ ని

నీ చిన్నారి చేతిలో గట్టిగా బిగించి పట్టుకుని

మేము మృత్యువుని నమ్మలేదు
చూడూ – శిలువలన్నీ ఇనుప రేకులే
విన్నావా –  అన్నీ  గంట స్థంబాలూ తమ నాలుకలని పీలికలు చేసుకున్నాయి

నిన్నెన్నడూ మరవలేము మేము , మమ్మల్ని నమ్ము మమ్మల్ని నమ్ము మమ్మల్ని న…
నీ అంగీ చెయ్యి లోపల నమ్మకం నెత్తురోడుతోంది,
ఈ క్రూరమైన చలికాలం మధ్యలో  లో ఖాకీ యూనిఫార్మ్ వేసుకుని
జపాలు, పాటలు, కీర్తనలు, స్తోత్రాలు నీ గొంతుకడ్డం పడి గడ్డకడతాయి,
ఫిబ్రవరిలో మళ్ళీ కలాల్లో సిరా నింపుకోవడమంటే వెక్కి వెక్కి ఏడ్వడమే.
బల్ల మీద కొవ్వొత్తి కారిపోతూ ఉంటుంది మండుతూ, మండుతూ
2.
చంపబడడానికి నా వంతు వచ్చినప్పుడు
అందరూ నాతో లిథువేనియా భాషలో మాట్లాడడం మొదలు పెట్టారు
అందరూ నన్ను యానుకా అని పిలవడం మొదలు పెట్టారు
నన్ను వాళ్ళ మాతృభూమికి రమ్మనంటూ
ఎలుగెత్తి పిలిచారు, దేవుడా!
నేను లిథువేనియన్ కాదు మొర్రో అని అరిచాను
దేవుడా వాళ్ళకు యూదుల భాషలో చెప్పాను
దేవుడా వాళ్ళకు రష్యన్ లో చెప్పాను
దేవుడా  వాళ్ళకు యుక్రైన్ లోనూ చెప్పాను
నెమన్ నదిలోకి కాల్మస్ నది ప్రవహిస్తున్న చోట
ఒక పాప చర్చిలో యేడుస్తోంది గుక్క పట్టి
3.
నీ నోటిలో నిశ్శబ్దపు సూదిని ఒడిసిపట్టడం,
నీ మాటలని తెల్లని దారంతో కుట్టడం,
ఉమ్మిలో మునిగిపోతున్నప్పుడు మూలగడం ,
నెత్తురు కక్కుతూ అరవకుండా ఉండడం ,
తుప్పుపట్టిన బకెట్ లా కారిపోయే
భాష నీటిని నీ నాలుక మీద బిగపట్టడం,
ఇంకా ఉపయోగపడే వాటిని బాగుచెయ్యడం,
ఆసుపత్రుల్లో గాయపడ్డవారికి బ్యాండేజ్ వేసినట్టు
బలహీనమైన స్థానాల్లో శిలువల్ని కుట్టడం,
జీవితపు వేర్ల కోసం వెదకడం నేర్చుకోవడం,
ఇంకా

ఇంకా తమవైన పేర్లని
నేర్చుకోవాల్సే ఉన్నది.
*

 

నారాయణ స్వామి వెంకట యోగి

23 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు