పుట్టిపెరిగింది హైదరాబాద్లో.యీ నగరంలోనే యేదో మ్యాజిక్ వుంది. దాదాపు ప్రతివొక్కరికి యేదోక కళ అబ్బి తీరుతుంది. చిన్నప్పుడు వార్తా పత్రికల్లో వచ్ఛే సాహిత్య వ్యాసాలు చదువుతూ తెలుగు సాహిత్యంపై మక్కువ పెరిగింది. బి.హెచ్.ఈ.ఎల్ లోని జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకునేటప్పుడు తిలక్ అమృతం కురిసిన రాత్రి,బారిష్టర్ పార్వతీశం పుస్తకాలు ప్రభావితం చేస్తే యుక్త వయసుకొచ్ఛేసరికి చలం,ఇస్మాయిల్, అజంతా కవిత్వం వుక్కిరిబిక్కిరి చేసేవి.వివేకవర్ధిని కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు కలిగిన సాహిత్య ప్రేరణ,నా గురువులైన నాళేశ్వరం శంకరం గారు,శ్రీకాంత్ గార్ల కవిత్వానికి దాసోహమై కవిత్వం రాయడం పెరిగింది. పదిహేనేళ్ల వయసులో రాసిన మొదటి కవిత మొదలుకొని యిప్పటిదాకా రాస్తూ “తదేక” అనే పుస్తకం అచ్ఛేయడం మరిచిపోలేని అనుభూతి నాకు.దుఃఖమో,సంతోషమో యేదైనా వాక్యాల్లో కూర్చడం అలవాటైపోయింది.ప్రస్తుతం వుద్యోగరీత్యా విశాఖలో వుంటూ సముద్రాన్ని ప్రేమిస్తూ జీవితాన్ని గడిపే వో జీవిని.
It Contains…
————-
యిక ఆధారాలేం మిగల్లేదిక తను వెళ్ళిపోయాక
కొన్ని కొన వూపిరిలూ
మరికొన్ని చెదిరిన మనసులూను
యెక్కడో బయలుదేరాం
యిక్కడ ఆగాం
కాదు ఆగాల్సి వచ్చింది
అవును వొక నిశ్శబ్దంలో నుండీనూ
వొక అవిరామ దేహంలో నుండీనూ
కొన్ని వెదుర్పచ్చగా పొడుచుకున్న పచ్చబొట్లు
యెక్కడో లేవు
యీ నేలంతానూ
చెరువు నిండానూ
వొకటే పచ్చి వాసన
తెలిసీ తెలియనట్టుగాను
ఆకాశపు మడుగును పట్టుకుని వేళ్ళాడుతున్న
వింత పక్షులు రాత్రైతే చాలు నక్షత్రాలై రెక్కలూ కోల్పోతాయి
వుల్కలై రాలిపోతాయి
తనకేమని చెప్పడం
వచ్చేసరికి కొన్ని పోగేసి పెడతాననీ చెప్పాను
గదుల్లోంచీ
గది కిటికీలలోంచీ
వ్యధల్లోంచీ
పగులుతున్న కళ్ళ పీలికల్లోంచీనూ
కుట్టేసుకున్న ముక్కల శరీరంలోంచీనూ
అన్నీ తనకే
అంతా తన కోసమే
కాలపు అంచున పిగులుతున్న జ్ఞాపకాల్లోంచీనూ
యిప్పుడు తననెలా
తనకెలా
బూడిదెగరేసిన స్వాప్నిక కలల స్మశానంలోంచీ
యెక్కడో చోట యెలాగోలా
ఆత్మ స్థావరాన్ని మార్చి
నిలబెట్టాలి యెముకలరిగిన దారప్పోగు విశ్వాసాన్ని.
కవిత నేపథ్యం
____________
మనసులో మెదిలిన వొక సరియల్ ఆలోచన యీ కవిత. ప్రపంచంలో నిండుకున్న దుఃఖం నాలోనూ నిండి వుందని దాన్ని యేదోటి చేసి యిలా.ఆధారాల్లేని జ్ఞాపకాలు మనల్ని చుట్టిముట్టినపుడు కలిగే వ్యధ.గూటి నుండి ఆత్మను కోల్పోయిన జీవం. యేమని చెప్పాలి యీ కవిత గురించి.అనుభవించి తీరాలి. మారుతున్న ప్రపంచంలో మర్చిపోయిన సహవాసాలూ,సాంత్వనలూ మనిషి మనిషికి మధ్య లేని బంధాలూ యివన్నీ ఆత్మ స్థావరాల్ని కోల్పోయేలా చేస్తాయి.మొత్తంగా it contains something.
*
Add comment